అహ్మదాబాద్‌లో అదరగొట్టిన భారత బ్యాటర్లు.. ఇదే తొలిసారి | Ind vs Eng 3rd ODI: Gill Kohli Iyer Rahul Shines Ind To Huge Score 356 | Sakshi
Sakshi News home page

అహ్మదాబాద్‌లో దుమ్ములేపిన భారత బ్యాటర్లు.. భారీ స్కోరు.. ఇదే తొలిసారి

Published Wed, Feb 12 2025 5:46 PM | Last Updated on Wed, Feb 12 2025 6:17 PM

Ind vs Eng 3rd ODI: Gill Kohli Iyer Rahul Shines Ind To Huge Score 356

ఇంగ్లండ్‌తో మూడో వన్డే(India vs England)లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. ఫలితంగా అహ్మదాబాద్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. తద్వారా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌ ఖాతాలో అతిపెద్ద స్కోరు(Highest ODI total) నమోదైంది. కాగా రోహిత్‌ సేన ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా నాగ్‌పూర్‌, కటక్‌ వన్డేల్లో ఇంగ్లండ్‌ను నాలుగేసి వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం మూడో వన్డేలోనూ గెలిచి వైట్‌వాష్‌ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది.

అయితే, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆరంభంలోనే కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) వికెట్‌ రూపంలో టీమిండియాకు గట్టి షాక్‌ తగిలింది. గత వన్డేలో సెంచరీ(119)తో చెలరేగిన హిట్‌మ్యాన్‌ మూడో వన్డేలో మాత్రం ఒక్క పరుగే చేసి మార్క్‌వుడ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

ఎట్టకేలకు ఫామ్‌లోకి
ఈ నేపథ్యంలో మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌కు జతైన వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. మూడుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ 55 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 52 పరుగులు చేశాడు. అప్పటికే, హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్‌.. దానిని శతకంగా మార్చుకున్నాడు.

గిల్‌ శతకం
మొత్తంగా 102 బంతులు ఎదుర్కొన్న శుబ్‌మన్‌ గిల్‌ 14 ఫోర్లు, 3 సిక్స్‌లు బాది.. 112 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా నాలుగో నంబర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్(64 బంతుల్లో 78 రన్స్‌) అద్భుత అర్ధ శతకంతో మెరిశాడు. మరోవైపు.. తన రెగ్యులర్‌ స్థానమైన ఐదో నంబర్‌లో వచ్చిన కేఎల్‌ రాహుల్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

కేవలం 29 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌ కొట్టి 40 పరుగులు సాధించాడు ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌. మిగతా వాళ్లలో ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్యా(17), అక్షర్‌ పటేల్‌(13), వాషింగ్టన్‌ సుందర్‌(14).. పేసర్లు హర్షిత్‌ రాణా(13), అర్ష్‌దీప్‌ సింగ్‌(2), కుల్దీప్‌ యాదవ్‌(1*) నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు.

అవయవ దానం గురించి
ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 356 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో రైటార్మ్‌ లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ అత్యధికంగా నాలుగు వికెట్లు తీయగా.. పేసర్లు మార్క్‌ వుడ్‌ రెండు, గస్‌ అట్కిన్సన్‌ ఒకటి, పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ జో రూట్‌ ఒక వికెట్‌ తీశారు. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా- ఇంగ్లండ్‌ క్రికెటర్లు అవయవ దానం గురించి అవగాహన కల్పించే చేసే క్రమంలో గ్రీన్‌ ఆర్మ్‌ బ్యాండ్‌తో బరిలోకి దిగడం విశేషం.

అహ్మదాబాద్‌లో వన్డేల్లో అత్యధిక స్కోర్లు
సౌతాఫ్రికా వర్సెస్‌ ఇండియా- 2010లో 365/2
ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌- 2025లో 356
ఇండియా వర్సెస్‌ వెస్టిండీస్‌- 2002లో 325/5
వెస్టిండీస్‌ వర్సెస్‌ ఇండియా- 2002లో 324/4 
పాకిస్తాన్‌ వర్సెస్‌ ఇండియా- 2007లో 319/7.

చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు
వారెవ్వా!.. శుబ్‌మన్‌ గిల్‌ ప్రపంచ రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement