వారెవ్వా!.. శుబ్‌మన్‌ గిల్‌ ప్రపంచ రికార్డు | Shubman Gill Breaks Hashim Amla Record Becomes 1st Batter In World To | Sakshi
Sakshi News home page

వారెవ్వా!.. శుబ్‌మన్‌ గిల్‌ ప్రపంచ రికార్డు

Published Wed, Feb 12 2025 4:34 PM | Last Updated on Wed, Feb 12 2025 5:03 PM

Shubman Gill Breaks Hashim Amla Record Becomes 1st Batter In World To

టీమిండియా యువ ఓపెనర్‌, వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌(Shubman Gill) సూపర్‌ సరికొత్త చరిత్ర లిఖించాడు. వన్డేల్లో సౌతాఫ్రికా బ్యాటర్‌ హషీం ఆమ్లా(Hashim Amla) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌తో మూడో వన్డే(India vs England) సందర్భంగా శతకం బాదిన ‘ప్రిన్స్‌’ ఈ ఘనత సాధించాడు.

కాగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి ముందు టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత నాగ్‌పూర్‌లో నాలుగు వికెట్ల తేడాతో పర్యాటక జట్టును ఓడించిన రోహిత్‌ సేన.. కటక్‌లో జరిగిన రెండో వన్డేలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. తద్వారా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

గిల్‌ సూపర్‌ సెంచరీ
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య అహ్మదాబాద్‌ వేదికగా నామామాత్రపు మూడో వన్డేలోనూ గెలిచి క్లీన్‌స్వీప్‌ చేయాలనే లక్ష్యంతో ఉంది. నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే, గత మ్యాచ్‌లో శతకం(119) బాదిన కెప్టెన్‌, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(1) ఈసారి విఫలం కాగా.. మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ మాత్రం సెంచరీతో మెరిశాడు.

తొలి యాభై ఇన్నింగ్స్‌లో
మొత్తంగా 102 బంతులు ఎదుర్కొని 112 పరుగులు సాధించాడు. గిల్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా పద్నాలుగు ఫోర్లతో పాటు మూడు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే గిల్‌ హషీం ఆమ్లాను అధిగమించాడు. వన్డేల్లో ఆడిన తొలి యాభై ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు.

అంతేకాదు.. ఒకే వేదికపై మూడు ఫార్మాట్లలో శతకం బాదిన ఐదో బ్యాటర్‌గానూ శుబ్‌మన్‌ గిల్‌ చరిత్రకెక్కాడు. ఇక ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడంతో మూడో వన్డేలో గిల్‌ సెంచరీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

కోహ్లి కూడా ఫామ్‌లోకి
ఇక ఈ మ్యాచ్‌తో మరో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి కూడా ఫామ్‌లోకి వచ్చాడు. అహ్మదాబాద్‌లో 55 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 52 పరుగులు సాధించాడు. మరోవైపు.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కూడా అద్భుత హాఫ్‌ సెంచరీ(64 బంతుల్లో 78)తో మెరిశాడు.

ఇదిలా ఉంటే.. 2019లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన శుబ్‌మన్‌ గిల్‌ ఇప్పటి వరకు 50 వన్డేలు, 32 టెస్టులు, 21 టీ20లు ఆడాడు. వరుసగా ఆయా ఫార్మాట్లలో  2587, 1893, 578 పరుగులు చేశాడు.

అంతర్జాతీయ స్థాయిలో వన్డేల్లో తొలి యాభై ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు
👉శుబ్‌మన్‌ గిల్‌(ఇండియా)- 2587 పరుగులు
👉హషీం ఆమ్లా(సౌతాఫ్రికా)- 2486 పరుగులు
👉ఇమామ్‌ ఉల్‌ హక్‌(పాకిస్తాన్‌)- 2386 పరుగులు
👉ఫఖర్‌ జమాన్‌(పాకిస్తాన్‌)- 2262 పరుగులు
👉షాయీ హోప్‌(వెస్టిండీస్‌)- 2247 పరుగులు

ఒకే వేదికపై వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో శతకం బాదిన క్రికెటర్లు
👉ఫాఫ్‌ డుప్లెసిస్‌(సౌతాఫ్రికా)- వాండరర్స్‌ స్టేడియం, జొహన్నస్‌బర్గ్‌
👉డేవిడ్‌ వార్నర్‌(ఆస్ట్రేలియా)- అడిలైడ్‌ ఓవల్‌, అడిలైడ్‌
👉బాబర్‌ ఆజం(పాకిస్తాన్‌)- నేషనల్‌ స్టేడియం, కరాచి
👉క్వింటన్‌ డికాక్‌(సౌతాఫ్రికా)- సూపర్‌స్పోర్ట్‌ పార్క్‌, సెంచూరియన్‌
👉శుబ్‌మన్‌ గిల్‌(ఇండియా)- నరేంద్ర మోదీ స్టేడియం(మొతేరా), అహ్మదాబాద్‌.

చదవండి: చరిత్ర సృష్టించిన కోహ్లి.. భారత తొలి బ్యాటర్‌గా అరుదైన రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement