![Indian team has now clean swept ODI series](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/winnner%20s.jpg.webp?itok=Ah5ZkqOv)
చివరి వన్డేలోనూ భారత్ విజయం
142 పరుగులతో ఇంగ్లండ్ చిత్తు
3–0తో సిరీస్ టీమిండియా సొంతం
శుబ్‌మన్ గిల్ సెంచరీ
రాణించిన అయ్యర్, కోహ్లి
వన్డేల్లో భారత జట్టు మరోసారి తమ బలాన్ని ప్రదర్శించింది. సొంతగడ్డపై తమ స్థాయిని చూపిస్తూ ఇంగ్లండ్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. గత రెండు మ్యాచ్‌ల తరహాలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన టీమిండియా చివరి పోరులోనూ ఘన విజయాన్ని అందుకుంది. కెరీర్‌లో 50వ వన్డే ఆడిన శుబ్‌మన్ గిల్ శతకానికి తోడు శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి రాణించడంతో భారీ స్కోరు సాధించిన టీమిండియా ఆ తర్వాత బలమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టి పడేసింది.
‘బజ్‌బాల్‘ మాయలో ‘బ్యాడ్‌బాల్’గా మారిపోయిన ఆటతో ఇంగ్లండ్ మరో భారీ ఓటమిని మూటగట్టుకుంది. మరోవైపు కోహ్లి సహా ప్రధాన బ్యాటర్లంతా ఫామ్‌లోకి వచ్చిన సానుకూలతతో ఇక చాంపియన్స్ ట్రోఫీ సమరానికి రోహిత్ బృందం సన్నద్ధమైంది.
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌పై టి20 సిరీస్‌ను 4–1తో గెలుచుకున్న భారత్ జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో భారత్ 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (102 బంతుల్లో 112; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... శ్రేయస్ అయ్యర్ (64 బంతుల్లో 78; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), కోహ్లి (55 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. కోహ్లితో 116 పరుగులు జోడించిన గిల్, అయ్యర్‌తో 104 పరుగులు జత చేశాడు.
అనంతరం ఇంగ్లండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది. అట్కిన్సన్ (19 బంతుల్లో 38; 6 ఫోర్లు, 1 సిక్స్), బాంటన్ (41 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సిరీస్‌లో 259 పరుగులు చేసిన గిల్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది.
శతక భాగస్వామ్యాలు...
గత మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ (1) ఈసారి రెండో బంతికే వెనుదిరిగాడు. అయితే గిల్, కోహ్లి భాగస్వామ్యంలో భారత్ ఇన్నింగ్స్ సరైన దిశలో సాగింది. 7 పరుగుల వద్ద సమన్వయ లోపంతో కోహ్లి రనౌట్ ప్రమాదంలో పడినా వుడ్ త్రో నేరుగా వికెట్లను తగలకపోవడంతో బతికిపోయాడు. తొలి 10 ఓవర్లలో భారత్ 52 పరుగులు చేసింది.
ఆ తర్వాత వీరిద్దరు కొన్ని చక్కటి షాట్లతో అలరించారు. ఐదు బంతుల వ్యవధిలో గిల్ (51 బంతుల్లో), కోహ్లి (50 బంతుల్లో) అర్ధ సెంచరీలు పూర్తయ్యాయి. అయితే తర్వాతి ఓవర్లో రషీద్ వేసిన చక్కటి బంతిని ఆడలేక కోహ్లి వెనుదిరిగాడు. అనంతరం ఫామ్‌లో ఉన్న అయ్యర్...గిల్‌తో జత కలిశాడు. ఈ జోడీ కూడా పదునైన బ్యాటింగ్‌తో అలవోకగా పరుగులు సాధించింది.
వుడ్ ఓవర్లో డీప్ మిడ్‌వికెట్ మీదుగా ఫోర్ కొట్టి 95 బంతుల్లోనే గిల్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఆ వెంటనే 43 బంతుల్లో అయ్యర్ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే తక్కువ వ్యవధిలో వీరిద్దరిని ఆదిల్ రషీద్ వెనక్కి పంపించాడు. గత రెండు వన్డేల్లో విఫలమైన కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్) ఈసారి మెరుగ్గా ఆడగా... రషీద్ ఓవర్లో వరుసగా 6, 6 బాది తర్వాతి బంతికి హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 17) అవుటయ్యాడు.
తర్వాత వచ్చిన బ్యాటర్లందరూ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయినా... భారత్ 350 పరుగుల స్కోరును దాటగలిగింది. ఆఖరి 7 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. భారత తుది జట్టులో వరుణ్ చక్రవర్తి, షమీ, రవీంద్ర జడేజా స్థానాల్లో కుల్దీప్, వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్ తుది జట్టులోకి వచ్చారు.
సమష్టి వైఫల్యం...
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (21 బంతుల్లో 23; 4 ఫోర్లు), బెన్ డకెట్ (22 బంతుల్లో 34; 8 ఫోర్లు) సరైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 6.2 ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. రాణా తన తొలి 2 ఓవర్లలో 5 ఫోర్లతో 22 పరుగులు ఇవ్వగా... అర్ష్ దీప్ ఓవర్లో డకెట్ వరుసగా 4 బంతుల్లో 4 ఫోర్లు కొట్టాడు.
అయితే ఈ భాగస్వామ్యం విడిపోయిన తర్వాత ఇంగ్లండ్ తడబడింది. బాంటన్, రూట్ (29 బంతుల్లో 24; 2 ఫోర్లు) కొద్దిసేపు నిలబడినా వీరిద్దరు ఎనిమిది పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. ఆ తర్వాత జట్టు కోలుకోలేకపోయింది. టపటపా వికెట్లను కోల్పోయి ఓటమి దిశగా పయనించింది.
రాణా వరుసగా రెండు ఓవర్లలో బట్లర్ (6), బ్రూక్ (26 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్)లను బౌల్డ్ చేయడంతో జట్టు ఆశలు కోల్పోయింది. మిగతా లాంఛనం ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. మరో 15.4 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టు కుప్పకూలింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) సాల్ట్ (బి) వుడ్ 1; గిల్ (బి) రషీద్ 112; కోహ్లి (సి) సాల్ట్ (బి) రషీద్ 52; అయ్యర్ (సి) సాల్ట్ (బి) రషీద్ 78; రాహుల్ (ఎల్బీ) (బి) మహమూద్ 40; పాండ్యా (బి) రషీద్ 17; అక్షర్ (సి) బాంటన్ (బి) రూట్ 13; సుందర్ (సి) బ్రూక్ (బి) వుడ్ 14; రాణా (సి) బట్లర్ (బి) అట్కిన్సన్ 13; అర్ష్ దీప్ (రనౌట్) 2; కుల్దీప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 356. వికెట్ల పతనం: 1–6, 2–122, 3–226, 4–259, 5–289, 6–307, 7–333, 8–353, 9–353, 10–356. బౌలింగ్: సాఖిబ్ మహమూద్ 10–0–68–1, మార్క్ వుడ్ 9–1–45–2, అట్కిన్సన్ 8–0–74–1, రూట్ 5–0–47–1, ఆదిల్ రషీద్ 10–0–64–4, లివింగ్‌స్టోన్ 8–0–57–0.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 23; డకెట్ (సి) రోహిత్ (బి) అర్ష్ దీప్ 34; బాంటన్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 38; రూట్ (బి) అక్షర్ 24; బ్రూక్ (బి) రాణా 19; బట్లర్ (బి) రాణా 6; లివింగ్‌స్టోన్ (స్టంప్డ్) రాహుల్ (బి) సుందర్ 9; అట్కిన్సన్ (బి) అక్షర్ 38; రషీద్ (బి) పాండ్యా 0; వుడ్ (సి) అయ్యర్ (బి) పాండ్యా 9; మహమూద్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (34.2 ఓవర్లలో ఆలౌట్) 214. వికెట్ల పతనం: 1–60, 2–80, 3–126, 4–134, 5–154, 6–161, 7–174, 8–175, 9–193, 10–214. బౌలింగ్: అర్ష్ దీప్ 5–0–33–2, హర్షిత్ రాణా 5–1–31–2, వాషింగ్టన్ సుందర్ 5–0–43–1, అక్షర్ పటేల్ 6.2–1–22–2, పాండ్యా 5–0–38–2, కుల్దీప్ యాదవ్ 8–0–38–1.
ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకుండానే..
చాంపియన్స్ ట్రోఫీ బరిలో టీమిండియా
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీకి ముందు సన్నాహకంగా భారత జట్టు ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడటం లేదు. బుధవారం వరకు స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడిన టీమిండియా... తమకు ప్రాక్టీస్ మ్యాచ్‌ల అవసరం లేదని తేల్చేసింది.
టోర్నీలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 14–17 మధ్య జరుగుతాయి. 19న టోర్నీ ప్రారంభం కానుండగా, భారత జట్టు 15న దుబాయ్ చేరుకుంటుంది. మరోవైపు అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ టీమ్‌లు మాత్రం పాక్ గడ్డపైనే ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడబోతున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లలో తలపడేందుకు ప్రత్యర్థులుగా పాకిస్తాన్ మూడు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. మరో ప్రాక్టీస్ పోరులో న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ తలపడతాయి.
1
ఒకే మైదానంలో మూడు ఫార్మాట్‌లలోనూ (టెస్టు, వన్డే, టి20) సెంచరీలు చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా శుబ్‌మన్ గిల్ గుర్తింపు పొందాడు. నరేంద్ర మోదీ స్టేడియంలో గిల్ టి20ల్లో (న్యూజిలాండ్‌పై 126 నాటౌట్; 2023లో), టెస్టుల్లో (ఆ్రస్టేలియాపై 128; 2023లో), వన్డేల్లో (ఇంగ్లండ్‌పై 112; 2025లో) ఒక్కో సెంచరీ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment