చంద్రగిరి (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యకాండ ఇది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు రెవెన్యూ అధికారులపైనే టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. జిల్లాలోని చంద్రగిరి సమీపంలోని స్వర్ణముఖి నది వద్ద జేసీబీ సాయంతో ఇసుకను తవ్వేస్తున్నారని రైతులు బుధవారం తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఆదేశాలతో చంద్రగిరి–1 వీఆర్‌వో భాస్కరయ్య వెంటనే ఇసుక తవ్వుతున్న ప్రాంతానికి వెళ్లారు.
ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. వాటిని సీజ్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఇసుక తవ్వుతున్న వారు వాహనాలను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గౌస్‌బాషా, చంద్రగిరి మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యం నాయుడు, జేసీబీ యజమాని యుగంధర్, మరికొందరు ఆ పార్టీ కార్యకర్తలు గురువారం తహసీల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించారు.
పెద్దగా కేకలు పెడుతూ ఎన్నికల విధుల్లో ఉన్న భాస్కరయ్యపై దూషణలకు దిగారు. రాయలేని భాషలో దూషిస్తూ ‘నీ అంతు చూస్తాం’ అంటూ బెదిరించారు. టీడీపీ నాయకుల ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుంటావా? నీకు ఎవడు ఆ అధికారం ఇచ్చాడు? మా సంగతి నీకు తెలియదు. నీ అంతు చూస్తాం అంటూ దౌర్జన్యానికి దిగినట్లు బాధిత వీఆర్‌వో తెలిపారు. ఒక దశలో ఆయనపై దాడికి యత్నించడంతో అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు.
వీఆర్‌వోల సంఘం ఆగ్రహం
టీడీపీ నాయకులు రెవెన్యూ ఉద్యోగిపై.. అదీ ఒక దళిత వీఆర్‌వోపై దౌర్జన్యం చేయడం పట్ల వీఆర్‌వోల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగిపై టీడీపీ నాయకులు దాడికి యత్నించడం అమానుషమని వ్యాఖ్యానించింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తహసీల్దార్ శిరీషను సంఘం రాతపూర్వకంగా కోరింది.
పోలీసులకు ఫిర్యాదు
దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నేతలపై బాధిత వీఆర్‌వో భాస్కరయ్య, తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భాస్కరయ్య, వీఆర్‌వోల సంఘం నాయకులు గురువారం స్థానిక పోలీసు స్టేషన్‌కు వచ్చి తహసీల్దార్ అందజేసిన ఫిర్యాదును ఇచ్చారు. తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
వీఆర్‌వోకు ఎటువంటి హాని జరిగినా టీడీపీ నాయకులదే పూర్తి బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌వోల సంఘం రాష్ట్ర నాయకుడు నాగరాజు, జిల్లా నాయకులు వెంకన్న నాయుడు, సుబ్రమణ్యం నాయుడు, మునస్వామి, అశోక్, వాసయ్య, సుబ్రమణ్యం, విజయ్, గిరి, యజ్ఞశ్రీ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment