Revenue Officer
-
రెవెన్యూ అధికారిపై టీడీపీ నేతల దౌర్జన్యం
చంద్రగిరి (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యకాండ ఇది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు రెవెన్యూ అధికారులపైనే టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. జిల్లాలోని చంద్రగిరి సమీపంలోని స్వర్ణముఖి నది వద్ద జేసీబీ సాయంతో ఇసుకను తవ్వేస్తున్నారని రైతులు బుధవారం తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఆదేశాలతో చంద్రగిరి–1 వీఆర్వో భాస్కరయ్య వెంటనే ఇసుక తవ్వుతున్న ప్రాంతానికి వెళ్లారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. వాటిని సీజ్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఇసుక తవ్వుతున్న వారు వాహనాలను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గౌస్‌బాషా, చంద్రగిరి మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యం నాయుడు, జేసీబీ యజమాని యుగంధర్, మరికొందరు ఆ పార్టీ కార్యకర్తలు గురువారం తహసీల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించారు. పెద్దగా కేకలు పెడుతూ ఎన్నికల విధుల్లో ఉన్న భాస్కరయ్యపై దూషణలకు దిగారు. రాయలేని భాషలో దూషిస్తూ ‘నీ అంతు చూస్తాం’ అంటూ బెదిరించారు. టీడీపీ నాయకుల ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుంటావా? నీకు ఎవడు ఆ అధికారం ఇచ్చాడు? మా సంగతి నీకు తెలియదు. నీ అంతు చూస్తాం అంటూ దౌర్జన్యానికి దిగినట్లు బాధిత వీఆర్వో తెలిపారు. ఒక దశలో ఆయనపై దాడికి యత్నించడంతో అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు. వీఆర్వోల సంఘం ఆగ్రహం టీడీపీ నాయకులు రెవెన్యూ ఉద్యోగిపై.. అదీ ఒక దళిత వీఆర్వోపై దౌర్జన్యం చేయడం పట్ల వీఆర్వోల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగిపై టీడీపీ నాయకులు దాడికి యత్నించడం అమానుషమని వ్యాఖ్యానించింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తహసీల్దార్ శిరీషను సంఘం రాతపూర్వకంగా కోరింది. పోలీసులకు ఫిర్యాదు దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నేతలపై బాధిత వీఆర్వో భాస్కరయ్య, తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భాస్కరయ్య, వీఆర్వోల సంఘం నాయకులు గురువారం స్థానిక పోలీసు స్టేషన్‌కు వచ్చి తహసీల్దార్ అందజేసిన ఫిర్యాదును ఇచ్చారు. తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వీఆర్వోకు ఎటువంటి హాని జరిగినా టీడీపీ నాయకులదే పూర్తి బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోల సంఘం రాష్ట్ర నాయకుడు నాగరాజు, జిల్లా నాయకులు వెంకన్న నాయుడు, సుబ్రమణ్యం నాయుడు, మునస్వామి, అశోక్, వాసయ్య, సుబ్రమణ్యం, విజయ్, గిరి, యజ్ఞశ్రీ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
Viral: కట్నంగా రూపాయి చాలు.. 11 లక్షలు, బంగారు ఆభరణాలు వెనక్కి
ముజఫర్‌నగర్: కట్నంగా ముట్టజెప్పిన రూ.11 లక్షలు, బంగారు ఆభరణాలను వద్దంటూ వెనక్కిచ్చి ఆదర్శంగా నిలిచాడో యువకుడు. కేవలం రూ.1 కట్నం తీసుకుని శెభాష్ అనిపించుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో రెవెన్యూ అధికారిగా పనిచేసే సౌరభ్ చౌహాన్‌కు లఖాన్ గ్రామం ఓ మాజీ జవాను కూతురుతో శుక్రవారం పెళ్లయింది. వరకట్నం కింద వధువు తల్లిదండ్రులు రూ.11 లక్షల కట్నం, ఆభరణాలు ఇవ్వగా కట్నం అక్కర్లేదంటూ తిరిగిచ్చేశాడు. ‘‘మీ దీవెనగా జ్ఞాపకం పెట్టుకుంటా’నంటూ వారినుంచి కేవలం ఒక్క రూపాయి తీసుకున్నాడు. దాంతో ఆహూ తులు సౌరభ్‌పై అక్షింతలతోపాటు ప్రశంస జల్లులు కూడా కురిపించారు. సమాజంలో మంచి మార్పు కోసం ముందడుగు వేశాడంటూ మెచ్చుకున్నారు. -
వాన దేవునిపై ఫిర్యాదు.. వైరలవుతోన్న లేఖ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో చాలా ప్రాంతాలు వర్షాభావంతో అల్లాడుతున్నాయి. దాంతో సకాలంలో వానలు కురిపించని వరుణుడిపై, అతనికి ఆ మేరకు ఆదేశాలివ్వని ఇంద్రుడిపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎన్ వర్మ అనే ఓ రెవెన్యూ అధికారి తీర్మానించాడు! ఈ మేరకు ఏకంగా జిల్లా కలెక్టర్‌కే సిఫార్సు చేశాడు!! జరిగిందేమిటంటే...వర్షాభావానికి ఇంద్రుడు, వరుణుడే బాధ్యులని ఆరోపిస్తూ ఫిర్యాదుల స్వీకరణ దినం (సమాధాన్ దివస్) సందర్భంగా గోండా జిల్లాకు చెందిన సుమిత్‌కుమార్ యాదవ్ అనే రైతు వర్మకు లేఖ ఇచ్చాడు. జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల జనజీవనంపై ప్రతికూల ప్రభావం పడిందని యాదవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులపై ఇద్రుడిని నిందిస్తూ ఇలా లేఖ రాశారు. చాలా నెలలుగా వర్షాలు పడలేదని గౌరవనీయమైన అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. కరువు కాటకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి జంతువులు, వ్యవసాయంపై కూడా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. దీంతో ఆయా కుటుంబాల్లోని మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున, ఈ విషయంలో వరుణుడిపై తగు చర్యలు తీసుకుని బాధ్యత వహించవలసిందిగా కోరుతున్నాము.’ అని పేర్కొన్నాడు. ఇంతో ఎన్ఎన్ వర్మ .. లేఖను పూర్తిగా చదవకుండానే ‘బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవా’లని సిఫార్సు చేస్తూ ఆ లేఖను ఏకంగా కలెక్టర్ కార్యాలయానికి పంపాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది. దాంతో నాలుక్కరుచున్న వర్మ, తానసలు ఆ లేఖ పంపనే లేదు పొమ్మని బుకాయిస్తున్నాడు. సమాధాన్ దివస్‌లో వందలాది ఫిర్యాదులు వస్తుంటాయి గనుక బహుశా చదవకుండానే లేఖను ఫార్వర్డ్ చేసి చిక్కుల్లో పడ్డాడని అధికారులు అంటున్నారు. ఇంతకూ ఇంద్ర వరుణులపై కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలంటూ నెటిజన్లు హాస్యం పండిస్తున్నారు. -
మొన్న నాగరాజు.. నేడు వెంకటేశ్వర్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి/మేడ్చల్ : కోటి 10 లక్షల లంచం తీసుకొని దొరికిపోయిన కీసర తహసీల్దార్ నాగరాజు ఘటన మరువకముందే మరో రెవెన్యూ అవినీతి అధికారి పట్టుబడ్డాడు. అయితే ఈసారి నాగరాజు తరహాలో కోటి రూపాయలు కాకుండా 5వేల రూపాయలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి దొరికిపోయాడు. ఈ ఘటనతో తెలంగాణలో రెవెన్యూ అధికారుల తీరు ఏ మాత్రం మారలేదన్న విషయం బయటపడింది.(బయటపడుతున్న కీసర ఎమ్మార్వో అక్రమాలు) వివరాలు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెంకటేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి సర్వేయర్ సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శంషాబాద్ తొండుపల్లిలోని 20 ఎకరాల స్థల వివాదంపై ఒక వ్యక్తిని 15వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. కాగా బుధవారమే 10వేల రూపాయల లంచం అందుకున్న వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం మరో 5వేల రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. వెంకటేశ్వర్‌రెడ్డి పనిచేస్తున్న కార్యాలయంతో పాటు అతని నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఐటీశాఖకు లేఖ రాసిన ఏసీబీ మరోవైపు తహసీల్దార్ నాగరాజు లంచం తీసుకున్న కోటి 10 లక్షల రూపాయల పై ఏసీబీ విచారణను వేగవంతం చేసింది. ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. వీరి వెనుక ఉన్న అసలు సూత్ర దారులు ఎవరు అన్న కోణంలో ఏసీబీ కేసును విచారిస్తుంది. ఈ ఘటనపై గురువారం ఏసీబీ ఐటి శాఖకు లేఖ రాసింది. మనీ ట్రాన్స్ సెక్షన్ ఎక్కడి నుంచి జరిగిందో తెలపాలంటూ ఐటిశాఖను లేఖలో కోరింది. నాగరాజుకు సంబంధించిన ఆస్తుల వివరాలపై కూపీ లాగుతున్న ఏసీబీ .. విదేశాల్లో సైతం పెట్టుబడులు పెట్టినట్టు తెలిపింది. (కీసర భూదందాలో రాజకీయ హస్తం!) ఇదే విషయమై ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ లో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకు మరిగారు. అధికారులు లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీ కి ఫిర్యాదు చేయాలి. గతంలో నాగరాజు పనిచేసిన చోట రికార్డులను ఏసీబీ పరిశీలిస్తోంది. నాగరాజు కు మధ్యవర్తిత్వం వహించిన ఆంజిరెడ్డి ,శ్రీనాథ్ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లను పరీశీలిస్తున్నాం. నిందితులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నాం. అంటూ తెలిపారు. -
కొజ్జేపల్లి పేరు మార్చుకోవచ్చు
గుత్తి రూరల్ పరిధిలోని కొజ్జేపల్లి గ్రామం పేరు మార్చుకునేందుకు వీలు ఉందని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. రఘునాథ్ చెప్పారు. ఊరిపేరుతో కొజ్జేపల్లి వాసులు ఇబ్బంది పడుతున్న వైనాన్ని ‘సాక్షి’ మంగళవారం ‘గ్రామం తలెత్తుకొని..పేరు దాచుకొని’ శీర్షికతో కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన డీఆర్ఓ ఆ గ్రామం పేరును అధికారికంగా మార్చుకునే వీలుందని స్పష్టం చేశారు. అనంతపురం అర్బన్: గుత్తి రూరల్ పరిధిలోని కొజ్జేపల్లి గ్రామం పేరు మార్చుకునేందుకు వీలు ఉందని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. రఘునాథ్ చెప్పారు. ఊరిపేరు ఇబ్బందిగా మారడంతో కొజ్జేపల్లి దీనావస్థను ‘సాక్షి’ మంగళవారం ‘గ్రామం తలెత్తుకొని..పేరు దాచుకొని’’ శీర్షికతో కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన డీఆర్ఓ ఆ గ్రామ పేరును అధికారికంగా మార్చుకునే వీలుందన్నారు. తమ గ్రామ పేరును ఫలానా పేరుగా మార్చాలని పంచాయతీ తీర్మానం చేయాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత గెజిట్ కోసం జిల్లా కలెక్టర్‌కు అర్జీ పెట్టుకుంటే.. దీనిపై విచారణ చేయాలని అర్జీని ఆర్డీఓకు పంపుతారని తెలిపారు. అనంతరం ఆ అర్జీ ఆర్డీఓ నుంచి తహసీల్దార్‌కి వెళ్తుందనీ, తహసీల్దారు గ్రామానికి వెళ్లి ప్రజాభిప్రాయం సేకరిస్తారన్నారు. గ్రామస్తులు సూచించిన పేరు జిల్లాలో ఏ గ్రామానికి లేకపోతే వారు కోరుకున్న పేరును సిఫార్సు చేస్తారన్నారు. సదరు పేరు ఇప్పటికే మరో గ్రామానికి ఉంటే గ్రామస్తులు కోరిన పేరుకు నంబరింగ్ ఇస్తారని డీఆర్ఓ తెలిపారు. ఈ పూర్తి నివేదికను ఆర్డీఓ ద్వారా కలెక్టర్‌కు పంపుతారనీ, దాన్ని కలెక్టర్ ప్రభుత్వానికి పంపిస్తారన్నారు. ప్రభుత్వం నివేదికను పరిశీలించి గెజిట్ జారీ చేస్తుందని.. అప్పుడు ఆ గ్రామం పేరు అధికారికంగా రికార్డులో మార్పు జరుగుతుందని వెల్లడించారు. -
ఆశకు పోయి.. అడ్డంగా దొరికాడు..!
నల్లగొండ టూటౌన్ : ఆయన విభాగమే రెవెన్యూ.. తన పనులను పక్కన బెట్టి ఇతర విభాగాల్లో వేలు పెట్టి చూశాడు. తన విభాగంలో తీసుకుంటున్న కమీషన్లు సరిపోవని అత్యాశకు పోయాడు.. ఆ అత్యాశే ఇప్పుడు కొంప ముంచింది. కమీషన్ల కోసం కక్కుర్తిపడి చనిపోని వ్యకిక్తి మరణ ధ్రువీకరణ పత్రం ఇప్పించి పోలీసులకు అడ్డంగా దొరికాడు. ఈ ఘటన నీలగిరి మున్సిపాలిటీలో వెలుగుచూసింది. ఏ ఆధారం లేకుండా హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికి నీలగిరిలో మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు అయ్యిందంటే మన మున్సిపాలిటీ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డిప్యుటేషన్‌పై నీలగిరి మున్సిపాలిటీలో పనిచేస్తున్న రెవెన్యూ అధికారి (ఆర్వో) ఆరీపోద్దీన్పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రవిశంకర వర్మ అలియాస్ కృష్ణమోహన్ శర్మ 2016లో మృతిచెందినట్లు నీలగిరి మున్సిపాలిటీ నుంచి మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. జిల్లా కేంద్రానికి చెందిన మాజీ కౌన్సిలర్ సోదరుడు కృష్ణమోహన్ శర్మ గుంటూరులో ఆత్మహత్య చేసుకున్నాడని.. అక్కడ మరణ ధ్రువీకరణ తీసుకుంటే ఆయనకు వచ్చే బీమా డబ్బులు రావని, సాధారణ మరణంతో చనిపోయినట్లు ధ్రువపత్రం ఇప్పించాలని మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్వోను సంప్రదించాడు. ఆయన కుటుంబానికి బీమా (ఇన్సూరెన్స్) కార్యాలయం నుంచి డబ్బులు రావాలంటే సర్టిఫికెట్ తప్పని సరి అని చెప్పాడు. ద్రువపత్రం జారీ చేసినందుకు కొంత నగదు ముట్టజెప్పుతానని ఆర్వోతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. సుమారుగా రూ. 50 వేలకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. తర్వాత జనన, మరణ ద్రువపత్రాల విభాగం ఉద్యోగులపై ఒత్తిడితెచ్చి మరణ ధ్రువీకరణ పత్రం ఇప్పిం చాడు. నల్లగొండ పట్టణానికి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తికి మరణ ద్రువీకరణ పత్రం జారీ చేసిన విషయం బహిర్గతం కావడంతో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. బీమా కంపెనీకి టోకరా.. మున్సిపల్ ఉద్యోగులు జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రంతోనే కృష్ణమోహన్ శర్మ హైదరాబాద్‌లోని బీమా కార్యాలయంలో రూ.19 లక్షలు క్లయిమ్ చేశారు. ఇలా కృష్ణమోహన్ శర్మ బీమా కంపెనీకి టోకరా పెట్టాడు. ఆయనకు తెలిసిన నల్లగొండలోని మాజీ కౌన్సిలర్ సోదరుడి ద్వారా ఇక్కడి ధ్రువపత్రం సంపాదించారు. రూ.19 లక్షల క్లయిమ్పై అనుమానం వచ్చిన బీమా కంపెనీ కార్యాలయం బాధ్యులు హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయట పడింది. అక్కడి పోలీసులు వచ్చి మున్సిపల్ కార్యాలయంలోని ఆర్వోతో పాటు మరో ఇద్దరు ఉద్యోగులను హైదరాబాద్‌కు తీసుకెళ్లి విచారించి వారి నుంచి పూర్తి వివరాలు రాబట్టారు. పోలీసుల విచారణలో కృష్ణ మోహన్‌శర్మ చనిపోకుండానే బీమా డబ్బులు క్లయిమ్ చేసినట్లు తేలింది. అసలు మరణ ద్రువీకరణ పత్రం ఇవ్వడంతోనే ఇది సాధ్యమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. కృష్ణమోహన్ శర్మ, మాజీ కౌన్సిలర్ సోదరుడు, మున్సిపల్ ఆర్వోలపై కేసులు నమోదు చేసి పోలీసులు రిమాండ్‌కు పంపారు. దాంతో ఇక్కడి కార్యాలయంలో అవినీతి, అక్రమాలకు అలవాటు పడిన కొంతమంది ఉద్యోగుల వల్ల మరో మారు నీలగిరి మున్సిపాలిటీ పేరు రాష్ట్ర రాజధానిలో చర్చనీయాశమయ్యింది. పోలీసులు సమాచారం ఇచ్చారు మరణ ధ్రువపత్రం జారీ చేసిన విషయంలో హైదరాబాద్ పోలీసులు ఆర్వో అరీపోద్దీన్ అరెస్ట్ విషయంపై ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటాం. – కె. వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ -
ఉద్యోగ విరమణ పొందినా.. అవినీతి హవా
సాక్షి, అమరావతి బ్యూరో: రెవెన్యూ శాఖలో ఆయనో విశ్రాంత అధికారి. రాజధాని పరిధిలోని ఓ మండలంలో చాలాకాలం పనిచేశారు. ఆ మండలం ఆయనకు కొట్టినపిండి. ఆయనకు తెలియకుండా గజం స్థలం కూడా ఎవరూ కొనుగోలు చేయలేని పరిస్థితి. భూముల క్రయవిక్రయాల్లో ఆయన సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అయితే అవేమీ ఉచితం కాదు. నీ పనిచేస్తే నా కేంటి? అని మొహమాటపడకుండా.. చేసే పనిని బట్టి కమీషన్ ఎంతో నిర్ణయించి, ముక్కుపిండి మరీ వసూలు చేయడం ఆయన నైజం. రాజధాని ప్రకటనతో.. నూతన రాజధాని ప్రకటనతో ఆ మండలంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ అవకాశాన్ని ఆ విశ్రాంత అధికారి రెండుచేతులా అందిపుచ్చుకున్నారు. భూముల విక్రయాలు, కొనుగోళ్లలో కీలకంగా వ్యవహరించి రూ.కోట్లు వెనకేశారు. అధికారి పార్టీలో ఓ ‘ముఖ్య’నేత అండ పుష్కలంగా లభించడంతో చెలరేగిపోతున్నారు. రెవెన్యూ శాఖలో ఆయన మాటే శిలాశాసనం అన్న చందంగా పనులు జరిగిపోతున్నాయి. మొత్తం మీద నెల కిందట ఉద్యోగ విరమణ చేసినప్పటికీ మోనార్క్‌లా వ్యవహరిస్తూ పనులన్నీ చక్కదిద్దుతున్నారు. ఉద్యోగ విరమణ పొందినా.. విశ్రాంతి లేకుండా..! ఈ ఏడాది ఆగస్టులో ఆ అధికారి ఉద్యోగ విరమణ పొందాడు. అయితే ఆయన స్థానంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. ఇదే ఆయనకు కలిసొచ్చింది. భూముల లావదేవీల వ్యవహారంలో వ్యాపారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చి వారికి లబ్ధిచేకూర్చే పనులతో నిత్యం బిజీబిజీగా ఉంటున్నారు. చేసే పనిని బట్టి కమీషన్ వసూలు చేయడం ఆయన ప్రత్యేకత. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పటి నుంచి ఆ అధికారి అందరి తలలో నాలుకగా మారిపోయారు. ఎవరికి ఏ పని కావాలన్నా.. రెవెన్యూ రికార్డులు సరిచేయాలన్నా ఆయనే పెద్ద దిక్కు. అధికారపార్టీకి చెందిన ఓ ‘ముఖ్య’నేత అండతో ఆ మండలంలో చక్రం తిప్పారు. స్వామి కార్యం.. స్వకార్యం అన్న చందంగా.. అధికార పార్టీ నేతలతోపాటు తాను కూడా ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని.. వాటిని విక్రయించి రూ.కోట్లు సంపాదించారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. -
చెట్టాపట్టాలు నిజమే
♦ ఓ రెవెన్యూ అధికారితో టీడీపీ నాయకుల మిలాఖత్ ♦ సమాచారహక్కు చట్టంతో వెలుగులోకి.. అనంతపురం రూరల్: టీడీపీ నాయకులతో రెవెన్యూ అధికారుల మిలాఖత్ నిజమే. నగర నడిబొడ్డున గల రాజహంస టవర్స్ ఎదురుగా ఉన్న అనంతపురం పొలం సర్వే నంబర్ 94, 161– 1లోని 2.54ఎకరాలు, 1ఎకరా స్థలం వంక పోరంబోకు స్థలాలకు ఇంటి పట్టాల మంజూరులో ఓ ప్రజాప్రతినిధి అనుచరులుగా చలామణి అవుతున్న చోటా నేతలతో కలిసి ఒక రెవెన్యూ అధికారి కీలక పాత్ర పోషించి పేదల మాటున పెద్దలకు ధారాదత్తం చేశారు. ఈ విషయం సమాచారహక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలతో రూడీ అయ్యింది. ఆ సర్వే నంబర్లలోని çస్థలాలు వంకపోరంబోకు స్థలాలు. వీటికి ఇంటి పట్టాలను ఇచ్చే అధికారం రెవెన్యూ అధికారులకు ఏమాత్రమూ లేదు. ఆ ఇంటి పట్టాలపై అధికారులే నిగ్గు తేల్చాలి సమాచార హక్కు చట్టం కింద రెవెన్యూ అధికారులు అందించిన వివరాలను తీసుకొని క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే.. అసలు విషయం బయట పడింది. అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిని విచారిస్తే వారు ఇంటి పట్టాలను చూపిస్తున్నారు. వారు అందించిన ఇంటి పట్టాలను పరిశీలిస్తే 2012 సెప్టెంబర్ 26న అప్పటి తహసీల్దారు బలరామిరెడ్డి సంతకం చేసినట్లు స్పష్టం చేస్తున్నాయి. అయితే వారి దగ్గర ఉన్నవి నకిలీ ఇంటిపట్టాలా? లేక తహసీల్దారే రిటైర్ అయిన తర్వాత పాత తేదీలతో సంతకాలు చేసి జారీ చేసినవా?తహసీల్దారు సంతకం ఫోర్జరీ చేశారా? అన్న విషయం ఉన్నతాధికారులు విచారణ జరిపితే అసలు నిజాలు బయట పడే అవకాశం ఉంది. మోసపోతున్న ప్రజలు సొంతింటి కల నిజం చేసుకోవాలనే ఆశతో నిరుపేదలు ఇలాంటి మోసగాళ్ల వలలో పడి నిలువునా మోసపోతున్నారు. ఈ ఇంటి పట్టాలు అసలైనవో.. నకిలీవో తెలుసుకోలేక స్థలాల ను కొనుగోలు చేసి నష్టపోతున్నారు. ఆక్రమణలతో కుంచించుకుపోయిన మురుగు కాలువ ఆక్రమణల కారణంగా మురుగుకాలు వ కుంచించుకుపోయింది. వంద అడుగులకు పైగా ఉన్న మురుగుకాలువ ప్రస్తుతం 20 అడుగులు మాత్రమే మిగిలింది. ఆక్రమణలను తొలగించడంలో నగరపాలక సంస్థ అధికారులు, టౌన్‌ప్లానింగ్ విభాగం సిబ్బంది విఫలమయ్యారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనేఆరోపణలు ఉన్నాయి. -
రెవెన్యూ భూ మాయాజాలం
మాజీ సైనికుల ముసుగులో 160 ఎకరాల భూమి కైంకర్యం సర్వీసులో ఉంటూ రిటైరయినట్టు తప్పుడు డాక్యుమెంట్లు దళారులతో రెవెన్యూ అధికారుల కుమ్మక్కు పట్టాలు రద్దు చేసినట్టు ప్రకటించినా వెబ్‌ల్యాండ్‌లో ప్రత్యక్షం ఆనందపురం పరిసర వాసుల అడ్డదారులు అనంతగిరి మండలంలో అక్రమాలు సాక్షి, విశాఖపట్నం: మాజీ సైనికోద్యోగులకు ప్రభుత్వం ఉచితంగా బంజరు భూమిని ఇస్తుంది. పల్లపు భూమి అయితే రెండున్నర, మెట్టు అయితే ఐదెకరాలు కేటాయిస్తుంది. వీటి కోసం పదవీ విరమణ చేసిన ఏడాదిలోగా మాజీ సైనికుడు జిల్లా సైనిక సంక్షేమ అధికారి ద్వారా కలెక్టర్‌కు దరఖాస్తు చేసు కోవాలి. ఆయన సిఫార్సు చేయాలి. కలెక్టర్ సంబంధిత తహసీల్దారుకు పంపితే పరిశీలించి ఖాళీ బంజరు భూమి ఉంటే మంజూరు చేస్తారు. కానీ సర్వీసులో ఉన్న వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ భూమి కేటాయించ డానికి వీల్లేదు. దీంతో నగరానికి ఆనుకుని ఉన్న ఆనందపురం, భీమిలి, తగరపువలస, పెందుర్తి తదితర ప్రాంతాలకు చెందిన కొంతమంది సర్వీసులో ఉన్న సైనికులతో దళారులు మిలాఖత్ అయ్యారు. తాము పదవీ విరమణ చేశామని, జిల్లాలోని అనంత గిరి మండలం రొంపిల్లి పంచాయతీ కరకవలసలో నాన్ షెడ్యూలు ఏరియాలో ఉన్న ప్రభుత్వ బంజరు భూమిని తమకు మంజూరు చేసి పట్టాలిప్పించాలని 2004 ఆరంభంలో 32 మందితో దరఖాస్తు చేయిం చారు. అప్పటి ఇన్చార్జి ఎమ్మార్వో కోటేశ్వరరావు, ఆ తర్వాత వచ్చిన ఎమ్మార్వో సూర్యనారాయణలు ఏకమై ఒక్కొక్కరికీ ఐదు ఎకరాల చొప్పున 160 ఎకరాలకు పట్టాలిచ్చేశారు. ఈ వ్యవహారంలో ఒక్కో సైనికుడి నుంచి రూ.50 వేల నుంచి లక్ష వరకూ వసూలు చేసినట్టు తెలిసింది. ఆ సొమ్మును దళారీలు, రెవెన్యూ అధికారులు పంచేసు కుని పట్టాలు జారీ చేశారు. కొన్నాళ్ల తర్వాత గుట్టు చప్పుడు కాకుండా 2007-08లో ఈ 32 మంది మాజీ సైనికుల అవతారమెత్తిన నకిలీ లబ్ధిదారులు మల్లేశ్వరరావు అనే వ్యక్తికి అమ్మకానికి అగ్రిమెంట్లు చేసేశారు. పన్నెండేళ్ల క్రితం సైనికులుగా విధుల్లో ఉన్న వారిలో చాలామంది క్రమేపీ పదవీ విరమణ చేశారు. ఇప్పుడు వారు మాజీ సైనికులయ్యారు. ఇంకొందరు ఇంకా సైనికులుగా విధు ల్లో కొనసాగుతున్నట్టు తెలిసింది. కానీ అప్పట్లో వారు సైనికులుగా ఉన్నందున ప్రభుత్వ భూమికి వారు అనర్హులని సైనిక సంక్షేమ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పట్టాలు రద్దు చేసిన ఎమ్మార్వో.. 2011లో అప్పటి ఎమ్మార్వో అప్పల నాయుడు. ఆర్డీవో గణపతిరావులకు ఈ వ్యవహారంపై అనుమానం వచ్చి దర్యాప్తు జరిపారు. ఈ పట్టాలు పొందిన వారు తమ డిశ్చార్జి సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డులు సమర్పించలేదని, వారు మాజీ సైనికులుగా సైనిక వెల్ఫేర్ బోర్డు నుంచి ధ్రువపత్రాలు ఇవ్వలేదని, వారు సాగులో లేరని తేల్చారు. దీంతో వారు సర్వీసులో ఉంటూ, పదవీ విర మణ చేయకుండానే అక్రమంగా భూములు పొందారని నిర్ధారించి 32 మంది పట్టాలను రద్దు చేశారు. ఆ విషయాన్ని కలెక్టర్‌కు కూడా నివేదించారు. కానీ ఇటీవల మల్లేశ్వరరావుకు చెందిన వ్యక్తులమంటూ కొందరు ఆ భూమిలో చదును చేస్తుండగా అటవీశాఖ అధికారులు ఆ భూమి తమదని అడ్డుపడ్డారు. చదును చేస్తున్న జేసీబీని కూడా సీజ్ చేశారు. రికార్డులు మాయం.. మరోవైపు మాజీ సైనికుల పేరిట కేటాయించిన 160 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను తహసీల్దారు కార్యాలయంలో మాయం చేశారు. అయితే సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్ కాపీలో మాత్రం రొంపల్లి పంచాయతీ సర్వే నంబరు 1లో 32 మంది పేరిట ఒక్కొక్కరికి ఐదెకరాలు చొప్పున పట్టాలు ఇచ్చినట్టు స్పష్టంగా ఉంది. అధికార పార్టీ నేతల అండతో.. కొన్నాళ్ల క్రితం వైఎస్సార్సీపీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలోకి ప్లేటు ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే, విజయనగరం జిల్లా ఎస్కోటకు చెందిన అధికార పార్టీ మహిళానేత, ఆమె సోదరుడు, ఓ మండలాధ్యక్షుడు, ఎంపీటీసీలు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తోంది. వీరి అండతో గతంలో రద్దయిన పట్టాలను మళ్లీ బతికించారు. ఇప్పుడు వెబ్‌ల్యాండ్‌లో అర్హతలేని 32 మంది మాజీ సైనికుల పేరునే ఈ 160 ఎకరాలకు పట్టాలుండడం కలకలం రేగుతోంది. మా వద్ద రికార్డుల్లేవ్.. కరకవలసలో మాజీ సైనికుల పేరిట మంజూరు చేసిన భూమికి మా కార్యా లయంలో రికార్డుల్లేవు. కానీ వెబ్‌ల్యాండ్‌లో మాత్రం 32 మంది పేర్లు కనిపిస్తున్నాయి. వీరిలో కొంతమంది అప్పుడప్పుడు మా దగ్గరకొస్తున్నారు. కానీ వారెవరూ సాగులో లేరు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాను. - రాణి అమ్మాజి, తహసీల్దారు, అనంతగిరి. -
'కరెంటు స్తంభం ఎక్కి దూకి చావు.. నాకేంటి?'
చెన్నై: పేదరికం అనుభవించే వాడికి శాపం అనుకుంటే చూసేవాళ్లకు.. చిరాకు.. అసహ్యంగా అనిపిస్తుంటుంది. తమిళనాడులో జరిగిన ఓ ఘటన అది నిజమేనేమో అనే భావనను కలిగిస్తుంది కూడా. రవీంద్రన్ (48) అనే వ్యక్తి ఓ శరణార్థి. శ్రీలంక నుంచి వచ్చి మధురైలో శరణార్థుల నివాసంలో ఉంటున్నాడు. అతడి కుమారుడు ఆరోగ్యం బాలేక ఆస్పత్రి పాలయ్యాడు. అదే సమయంలో వారికి ఆహారం ఏర్పాట్లు చూసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారిని తన కుమారుడికి గైర్హాజరు వేయొద్దని, అలా చేస్తే భోజనం దొరకదని బ్రతిమిలాడుకున్నాడు. తన కొడుకు నిజంగానే ఆస్పత్రిలో ఉన్నాడని రశీదు కూడా చూపించాడు. అయినా కనికరించని ఆ అధికారి గైర్హాజరైనట్లుగానే మార్క్ చేశాడు. దీంతో ఆయనను మరోసారి బ్రతిమిలాడుకునే క్రమంలో వెళ్లి ఆ కరెంటు స్తంభం ఎక్కి దూకి చావు అన్నాడు. ఆ మాట అనగానే నిజంగానే వెళ్లి హై టెన్షన్ విద్యుత్ వైర్ల స్థంభాన్ని ఎక్కి ఆ వైర్లు పట్టుకొని సెకన్లలో చనిపోయాడు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ అధికారిని చుట్టుపక్కల వారు చుట్టుముట్టారు. దీంతో పోలీసులు వచ్చి అతడికి రక్షణ కల్పించగా చర్యలు తీసుకోవాల్సిందేనని వారు నిలదీశారు. -
ఎట్టకేలకు డీఆర్వో పోస్టు భర్తీ
చంద్రశేఖరరెడ్డికి లైన్ క్లియర్ రేపు బాధ్యతల స్వీకరణ విశాఖపట్నం : ఆదినుంచి వివాదాస్పదమైన జిల్లా రెవెన్యూ అధికారి నియామకం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. గతంలో ప్రభుత్వం నియమించిన చంద్రశేఖర్‌రెడ్డికి లైన్‌క్లియర్ అయింది. ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌కు సమాచారం అందింది. డీఆర్వోగా పనిచేస్తున్న కె.నాగేశ్వరరావును అన్నవరం దేవస్థానం ఈవోగా ఈ ఏడాది జూలైలో ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఈ పోస్టును భర్తీ చేసేందుకు సర్కారు చేసిన ప్రయత్నాలు మంత్రుల మధ్య బేధాభిప్రాయాలతో బెడిసికొట్టాయి. గతంలో డీఆర్వోగా పనిచేసిన నరిసింహారావు మళ్లీ ఇదే పోస్టుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేయగా జిల్లా ఉన్నతాధికారి విముఖత వ్యక్తంచేయడం, మంత్రులు ఆసక్తి చూపకపోవడంతో చివరకు ఆయన ఎస్ఈజెడ్ ఆర్అండ్ ఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా విధుల్లో చేరారు. ఆగస్టులో చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా కడప జేసీ -2గా పనిచేస్తున్న చంద్రశేఖర్‌రెడ్డిని విశాఖ డీఆర్వోగా ప్రభుత్వం నియమించింది. కానీ మంత్రుల మధ్య ఏర్పడిన బేధాభిప్రాయాల కారణంగా ఆయన విధుల్లో చేరలేకపోయారు. తరువాత తెలంగాణ నుంచి రాష్ట్రానికి కేటాయించగా విశాఖ ఆర్డీవోగా తొలి పోస్టింగ్ పొందిన వెంకటేశ్వర్లను డీఆర్వోగా నియమిస్తూ ప్రభుత్వం సెప్టెంబర్ 19న ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ జీవో వచ్చిన 24 గంటలు తిరగకుండానే జీవోను పెండింగ్‌లో పెడుతున్నట్లు మరో జీవో ఇచ్చి వెంకటేశ్వర్ల నియామకానికి బ్రేక్‌లు వేశారు. వెంకటేశ్వర్ల నియామకం విషయంలో కూడా జిల్లాకు చెందిన ఓ మంత్రి అభ్యంతరం వ్యక్తంచేయడంతో డీఆర్వో పోస్టు భర్తీ కాకుండా ఆగిపోయింది. కడప జేసీ -2గా పనిచేస్తూ అక్టోబర్‌లో రిలీవైన చంద్రశేఖర్‌రెడ్డి పరిపాలనా కమిషనర్‌కు రిపోర్టు చేసినప్పటికీ విశాఖ డీఆర్వోగా మాత్రం పోస్టింగ్ పొందలేకపోయారు. అప్పటి నుంచి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఆయన విషయంలో మంత్రులు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. చివరుకు సీఎం పేషీ జోక్యం చేసుకోవడంతో పాటు రాష్ట్ర రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం మంత్రులతో మాట్లాడంతో చంద్రశేఖర్‌రెడ్డి నియామకానికి లైన్ క్లియర్ ఇచ్చినట్లు సమాచారం. -
మంత్రుల మధ్య ఆధిపత్య పోరు
డీఆర్ఓ పోస్టు కోసం జోరుగా పైరవీలు తాజాగా తెరపైకి కిషోర్‌కుమార్ నాలుగు నెలలుగా ఖాళీగా ఉన్న జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) నియామకం కోసం ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకటో కృష్ణుడు.. రెండో కృష్ణుడు అంటూ నెలకో పేరు తెరపైకి వస్తున్నా... భర్తీ మాత్రం జరగడం లేదు. మంత్రుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు తోడు ఉన్నతాధికారుల వైఖరి కూడా కొత్త డీఆర్ఓ రాకకు బ్రేకులేస్తున్నాయి. విశాఖపట్నం : డీఆర్ఓ పోస్టు కోసం జిల్లాలో గతంలో పనిచేసిన పలువురు అధికారులు తమదైన రీతిలో పైరవీలు సాగించారు. ఏజేసీగా పనిచేసిన జేఎల్ నరసింహారావు, జెడ్పీ సీఈఓగా పని చేసిన మహేశ్వరరెడ్డి కూడా ఈ పోస్ట్ కోసం ప్రయత్నం చేశారు. మంత్రులతో పాటు జిల్లా ఉన్నతాధికార్లు సైతం మోకాలడ్డడంతో నరసింహారావు చివరకు ఆర్ అండ్ ఆర్ ఎస్డీసీ పోస్టుతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. డీఆర్ఓగా వచ్చేందుకు మహేశ్వరరెడ్డి ఆశించినప్పటికీ ఇటీవలే బదిలీపై వెళ్లడంతో ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక కడప జేసీ-2గా పనిచేస్తున్న సి.చంద్రశేఖరరెడ్డిని విశాఖ డీఆర్ఓగా నియమిస్తూ ఆగస్టు 14న ఉత్తర్వులు వెలువడ్డాయి. మంత్రి అయ్యన్న సిఫార్సుతో జరిగిన చంద్రశేఖరరెడ్డి నియామకానికి మంత్రి గంటా శ్రీనివాసరావు మౌఖిక ఆదేశాలతో బ్రేకు పడింది. ఇంతలో విశాఖ ఆర్డీఓ వెంకటేశ్వర్లును డీఆర్ఓగా గత నెల 15న ప్రభుత్వం నియమించింది. మంత్రి అయ్యన్న చేసిన ఈ ప్రయత్నానికి గంటా మరోసారి అడ్డుపుల్ల వేయడంతో 24 గంటలు తిరక్కుండానే ఈ ఉత్తర్వులను అబియన్స్‌లో పెడుతూ ప్రభుత్వం మరో ఉత్తర్వు విడుదల చేసింది. చివరకు చంద్రశేఖరరెడ్డి రాక పట్ల గంట సుముఖంగానే ఉన్నారని అనుకున్నంతలోనే.. ఆయనను హైదరాబాద్ భూపరిపాలనా విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు వచ్చాయి. కిషోర్ కోసం గంటా యత్నాలు : తాజాగా వుడా కార్యదర్శిగా పనిచేసి ఇటీవలే బదిలీపై వెళ్లిన జి.కిషోర్‌కుమార్ పేరు తెరపైకి వచ్చింది. ఈయ న్ని డీఆర్ఓగా తీసుకొచ్చేందుకు మంత్రి గంటా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే సిటీపై ఆధిపత్యం చలాయిస్తున్న మంత్రి గంటా డీఆర్ఓగా కిషోర్ వస్తే ఆయన్ని అడ్డం పెట్టుకుని రూరల్‌లో కూడా తన హవా సాగిస్తారన్న ఆందోళన అయ్యన్న వర్గంలో వ్యక్తమవుతోంది.తరచూ విశాఖలో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు జరుగుతుండడంతో ప్రధాని మొదలు కేంద్ర, రాష్ర్ట మంత్రులు, నెలకు రెండు మూడుసార్లు ముఖ్యమంత్రి పర్యటనలతో ప్రొటోకాల్ చూసే బాధ్యత డీఆర్ఓపై ఉంది. అలాంటి కీలకమైన పోస్ట్ ద్వారా జిల్లాపై పట్టు సాధించేందుకు ఇరువురు మంత్రులు వేస్తున్న ఎత్తులు పై ఎత్తుల వల్ల ఈ పోస్టు నాలుగు నెలలుగా ఖాళీగానే ఉండిపోయింది. -
రేషన్ కోసం గ్రామస్తుల ధర్నా
మూడు నెలలుగా రేషన్ సరుకులు ఇవ్వడం లేదంటూ.. దర్శి మండలం ఎర్రబోనపల్లె గ్రామస్తులు మంగళవారం ఆందోళనకు దిగారు. గ్రామస్తుల ఆందోళనతో ఆర్ఐ సత్యమూర్తి గ్రామానికి చేరుకుని రేషన్ దుకాణాన్ని సీజ్ చేశారు. డీలర్ చింతా వెంకటరమణారెడ్డి పరారయ్యాడు. ఇంతకు ముందున్న డీలర్ అక్రమాలకు పాల్పడుతున్నాడని టీడీపీ నేతలు అక్రమ కేసులు పెట్టి తొలగించారు. అతని స్థానంలో వచ్చిన టీడీపీ కార్యకర్త రమణారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నాడని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. -
ఏసీబీ వలలో అవినీతి చేప
⇒ రూ. 3 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోరుున వీఆర్వో ⇒ ఆన్లైన్ పట్టాకోసం రైతును వేధించిన అధికారి ⇒ ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు ⇒ పక్కా ప్లాన్‌తో పట్టుకున్న ఏసీబీ అధికారులు మాచారెడ్డి : ఏసీబీ అధికారులు పన్నిల వలలో ఓ రెవెన్యూ అధికారి శుక్రవారం పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ నరేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. మాచారెడ్డి మండలం ఘన్‌పుర్(ఎం), అక్కాపూర్ గ్రామాలలో ముత్తన్న వీ ఆర్వోగా పనిచేస్తున్నాడు. అక్కాపూర్ గ్రామానికి చెం దిన రైతు బేతి ఎల్లయ్య తన పట్టాపాస్‌బుక్‌లను ఆన్లైన్ చేయూలని ఏడాది కాలంగా వీఆర్వో చుట్టూ తిరుగుతున్నాడు. అయితే రూ. 5 వేలు లంచం ఇస్తేనే ఆన్లైన్ చేస్తానని వీఆర్వో చెప్పాడు. రైతు ఎంత బతిమిలాడినా వీఆర్వో ససేమిరా అనడంతో చివరకు రూ.3 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతేకాక ఖర్చుల పేరుతో రూ.వేయ్యి, రెండువేలు అడిగాడు. దీంతో చేసేది లేక ఎల్లయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు పధకం ప్రకారం ఎల్లయ్యకు రూ.3 వేలు ఇచ్చి మండల కేంద్రంలోని వీఆర్వో ఇం టికి పంపించారు. ఎల్లయ్య వీఆర్వోకు ఆ డబ్బు ఇ స్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని అదుపులోకి తీ సుకున్నారు. వీఆర్వోపై కేసు నమోదు చేసినట్లు డీఎ స్పీ తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు డబ్బు లు ఇవ్వాలని వేధిస్తే 9440446155 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్స్పెక్ట ర్లు రఘునాథ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. అధికారుల గుండెల్లో దడ.. వీఆర్వో ముత్తన్నపై ఏసీబీ అధికారులు దాడి చేయడంతో ఆయా శాఖలకు చెందిన పలువురు అధికారు ల గుండెల్లో దడ మొదలయినట్లు తెలుస్తోంది. గతం లో మాచారెడ్డిలో ఓ తహశీల్దార్, ఇద్దరు వీఆర్వోలు, ఒక బీఎస్ఎన్ఎల్ అధికారి ఏసీబీ వలలో చిక్కి కటకటాలపాలైన విషయం తెలిసిందే. తాజాగా ఘన్పూర్ వీఆర్వో ఏసీబీకి చిక్కడం చర్చనీయూంశమైంది. -
ఏసీబీకి చిక్కిన రెవెన్యూ అధికారిణి
కల్లూరు : ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందిన రెవెన్యూ అధికారిణి వసంతబాయి లంచం తీసుకుంటూ మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కప్పలబందం గ్రామానికి చెందిన రైతు జాస్తి వెంకటేశ్వరరావు అడంగల్ పహాణీ కాపీ కోసం దరఖాస్తు చేయగా... రెవెన్యూ అధికారిణి వసంతబాయి లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వలపన్నిన ఏసీబీ అధికారులు మంగళవారం రైతు నుంచి రూ.5వేలు లంచం తీసుకుంటుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. -
రేపు జిల్లాకు సీఎం రాక
కడప రూరల్: ఈనెల 27న (శుక్రవారం) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు రానున్నారు. పర్యటన వివరాలను జిల్లా రెవెన్యూ అధికారి సులోచన బుధవారం వెల్లడించారు. ఆరోజు మధ్యాహ్నం 1.10 గంటలకు కర్నూలు నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి ఏరియల్ సర్వే ద్వారా గండికోట ప్రాజెక్టుకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటారన్నారు. 2.05 నుంచి 3.00 గంటల వరకు గండికోట ప్రాజెక్టు దగ్గర రైతులతో ముఖాముఖి చర్చ, సమావేశంలో పాల్గొంటారన్నారు. 3.15 గంటలకు గండికోట ప్రాజెక్టు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి తిరుపతికి వెళతారన్నారు. నేడు మంత్రి ఉమామహేశ్వరరావు రాక రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం జిల్లా పర్యటనకు వస్తున్నారని ఆమె తెలిపారు. ఉదయం 9 నుంచి 9.30 గంటల వరకు కడపలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని 10 గంటలకు గుర్రపు ట్యాంకు, సర్వరాయసాగర్, వామికొండ, గండికోట, జమ్మలమడుగును సందర్శిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మైలవరం డ్యాం టర్నల్ ఎగ్జిట్,ఆదినిమ్మాయపల్లె ఆయకట్టును పరిశీలించి ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గండికోట రిజర్వాయర్, పైడిపాలెం, సింహాద్రిపురం, ఎర్రబల్లె సందర్శించి పులివెందులకు చేరుకుంటారన్నారు. రాత్రి 8 గంటలకు పులివెందుల నుంచి ముద్దనూరుకు చేరుకుని రాత్రి 10 గంటలకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ వెళతారన్నారు. సీఎం పర్యటన విజయవంతం చేయండి ఎర్రగుంట్ల: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం గండికోట ప్రాజెక్ట్‌కు రానున్నారని సీఎం పర్యటను విజయవంతం చేయాలని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు వామికొండ, గండికోట ప్రాజెక్ట్‌లు సందర్శిస్తారని కార్యకర్తలంతా పాల్గొనాలని కోరారు. తరువాత టీడీపీ జిల్లా నాయకుడు సురేష్‌నాయుడు మాట్లాడుతూ సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వెంకటశివారెడ్డి, తుపాకుల పవన్‌కుమార్‌రెడ్డి, ఎకెఎం శ్రీనివాసరెడ్డి, లాడ్జి అంకిరెడ్డి, సుంకరం నాగే శ్వరరావుతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
వరద బాధితులకు కోపం వచ్చింది!
సంతకవిటి : తుపాను బాధితుల కోపం కట్టలు తెంచుకుంది. తమ గ్రామాన్ని ముంపు ప్రాంతాల జాబితాలో చేర్చకపోవడంపై ఆందోళనకు దిగారు. ఏకంగా రెవెన్యూ అధికారిపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకున్నా వెనక్కి తగ్గలేదు. ఈ సంఘటనకు దారితీసిన వివరాల్లోకి వెళితే.. సంతకవిటి మండలం వాసుదేవపట్నం గ్రామం ఇటీవల సంభవించిన హుదూద్ తుపాను సమయంలో కురిసిన భారీ వర్షం కారణంగా ముంపునకు గురైంది. నాగావళి నది గండి ద్వారా వచ్చిన నీటితో పాటు సాయన్న చానల్, నారాయణపురం కుడి కాలువుల నుంచి వచ్చిన నీరు గ్రామం చుట్టూ చేరి ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. ఆ సమయంలో గ్రామం వరకూ రహదారి బాగుండడంతో ముంపు గ్రామాలను అధికారులు పరిశీలించారు. వాసుదేవపట్నం గ్రామం నుంచి సహాయ చర్యలు ప్రారంభించారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అరుుతే ముంపు గ్రామాలను గుర్తించే సమయంలో ఈ ఊరును పక్కన పెట్టి మండలంలో 12 నదీతీర గ్రామాలను ముంపు గ్రామాలుగా పరిగణలోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వాసుదేవపట్నం గ్రామానికి చెందిన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ, టీడీపీలకు చెందిన నేతలు బుధవారం సాయంత్రం తహశీల్దార్ బి.రామారావుతో మంతనాలు జరిపారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో గురువారం గ్రామానికి చెందిన సుమారు వంద మంది రైతులు సంతకవిటి తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న వీఆర్వో ఇందుధరుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక నివేదిక మీరే ఇస్తారని, తమ గ్రామాన్ని ఎందుకు ముంపు గ్రామంగా గుర్తించలేదని ప్రశ్నించారు. దీంతో కంగుతిన్న వీఆర్వో తాను వాసుదేవపట్నాన్ని ముంపు గ్రామంగా గుర్తించి నివేదిక అందించానని తెలిపారు. ఇంతలో కార్యాలయూనికి చేరుకున్న తహశీల్దార్ బి.రామారావును రైతులు ముట్టడించారు. తమ ఊరును ముంపు గ్రామంగా ఎందుకు గుర్తించలేదని నిలదీశారు. తుపాన్ల సమయంలోనే కాకుండా మడ్డువలస కాలువలు నీరు విడిచిపెట్టిన సమయంలో కూడా ఏటా తమ గ్రామానికి చెందిన పంటపొలాలు ముంపునకు గురౌతున్నాయని వివరించారు. హుదూద్ తుపాను కారణంగా కురిసిన వర్షాలతో ప్రస్తుతం తమ గ్రామం పూర్తిగా ముంపునకు గురైనా ఎందుకు ముంపు గ్రామాల జాబితాలో చేర్చలేదని ప్రశ్నించారు. ఒకగానొక సందర్భంలో ఆయనపై దాడికి ప్రయత్నించారు. కార్యాలయం మెట్లు ఎక్కుతున్న తహశీల్దార్‌ను కిందకులాగే ప్రయత్నం చేశారు. వీఆర్వో, వీఆర్ఏ, సర్వేయర్ తదితరులతో పాటు గ్రామపెద్దలు కలుగుజేసుకోవడంతో రైతులు వెనక్కుతగ్గారు. అరుుతే తహశీల్దార్ తన చాంబర్లోకి వెళ్లగా అక్కడకు కూడా వెళ్లి బైఠాయించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కానిస్టేబుళ్లు వచ్చి పరిస్థితి అదుపుతప్పకుండా అదుపు చేశారు. రైతులకు నచ్చజెప్పి మంతనాలు ప్రారంభించారు. వాసుదేవపటాన్ని ముంపు గ్రామం పరిధిలోకి తీసుకువచ్చేందుకు తన చేతిలో ఏమీలేదని, పాలకొండ ఆర్డీఓ కూడా వచ్చి పరిశీలనజరిపారని, ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తానని తహశీల్దార్ రైతులకు హామీఇచ్చారు. అయినప్పటికీ రైతులు అక్కడే బైఠాయించి ముంపు గ్రామాలకు ఇస్తున్న తక్షణసాయం తమకూ అందించాలని పట్టుబట్టారు. ఎస్ఐ పి.సురేష్‌బాబు కలుగుజేసుకుని ఉన్నతాధికారులకు సమస్యను ఫోన్ ద్వారా వివరించారు. అరుుతే తమకు న్యాయం జరిగేవరకూ వెనక్కి తగ్గేదిలేదని రైతులు స్పష్టం చేస్తూ సాయంత్రం వరకూ తహశీల్దార్ కార్యాలయం వద్దే బైఠారుుంచారు. దీంతో తహశీల్దార్ రామారాావు ఆందోళనకారులతో మాట్లాడారు. అధికారులతో చర్చించి గ్రామాన్ని వరద ముంపు జాబితాలో చేర్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి అక్కడ నుంచి వెళ్లిపోయూరు. -
జోరుగా పైరవీలు..!
సాక్షి, కర్నూలు: బదిలీల కోసం కొందరు అధికారులు జోరుగా పైరవీలు చేస్తున్నారు. సెలవు పెట్టి.. హైదరాబాద్‌లో మకాం వేస్తున్నారు. రాజకీయ సిఫారసులతో కొందరు సఫలీకృతులు కాగా.. మరి కొందరు తమ ప్రయత్నాలకు మరింత పదును పెడుతున్నారు. దీంతో కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫలితంగా జిల్లాలో పాలన అస్తవ్యస్తంగా మారింది. కలెక్టర్ అవాక్కు.. జిల్లాలో పనిచేస్తున్న ఓ అధికారి ఈ నెల ఒకటవ తేదీ నుంచి 20 రోజులపాటు సెలవు పెట్టారు. తన కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నానంటూ వారిని కలిసేందుకు వెళ్తున్నానంటూ చెప్పడంతో కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆయనకు సెలవు మంజూరు చేశారు. అయితే ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయన సెలవులో వెళ్లలేకపోయారు. కానీ ఆ అధికారి బదిలీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసిన కలెక్టర్ అవాక్కయినట్లు తెలిసింది. రిటైరయ్యేదాకా.. కలెక్టర్ వేగాన్ని అందుపుచ్చుకోలేక ఇబ్బంది పడుతున్న జిల్లాకు చెందిన ఓ రెవెన్యూ అధికారి ఇటీవలే సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. ఈయన కూడా బదిలీ కోసమే సెలవు పెట్టినట్లు రెవెన్యూ శాఖలో ప్రచారం జరిగింది. రిటైర్మెంట్కు ఇంకో రెండేళ్లు ఉండడంతో ఎలాగైనా ఇక్కడే పదవీకాలం ముగిసేవరకు పనిచేయాలనుకుంటున్న ఆ అధికారి జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత వద్ద తన కోరికను బయటపెట్టారు. దీంతో ఆ ముఖ్యనేత హామీ ఇవ్వడంతో మళ్లీ తిరిగి విధుల్లోకి చేరినట్లు తెలుస్తోంది. పనితీరుపై అసంతృప్తి.. డీఆర్డీఏలో ఓ అధికారి విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. పథకాలపైన సరైన పట్టు సాధించలేకపోయారనే విమర్శలున్నాయి. ఆ అధికారికి.. దిగువ స్థాయి సిబ్బందికి మధ్యన తరచూ విభేదాలు చోటు చేసుకునేవి. ఇటీవలే ఆ విభాగంలో పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణం వెలుగుచూసింది. దీంతో అధికారి పనితీరుపైన జిల్లా కలెక్టర్ అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన మాతృ సంస్థకు వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. బదిలీ కోసం పైరవీలు మొదలుపెట్టారు. వారు ఎన్నాళ్లుంటారో..? డ్వామా, ఐసీడీఎస్, బీసీ సంక్షేమ శాఖల్లో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారుల పనితీరు కూడా కలెక్టర్‌కు నచ్చలేదు. ఇటీవల పలుసార్లు వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయా శాఖల పనితీరు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు, అవినీతి తదితర అంశాలపై కలెక్టర్ మండిపడ్డారు. సమాచార పౌరసంబంధాల శాఖాధికారి పనితీరుపైనా కలెక్టర్ అసంతృప్తిగా ఉన్నారు. ఈయన ఇక్కడ డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. దీంతో ఆయా అధికారులు అక్కడ ఎన్నాళ్లు పనిచేస్తారో? అన్నది మిలియన్‌డాలర్ల ప్రశ్నగా మారింది. డిష్యూం.. డిష్యూం.. ఆరోగ్యశాఖలో అస్తవ్యస్తమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక్కడి ఉన్నతాధికారి.. అధికారులు, ఉద్యోగులు రెండు వర్గాలుగా విడిపోయారు. ప్రజాసేవలను పక్కనపెట్టి గ్రూపు తగాదాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒకరిపై మరొకరు ఫిర్యాదుల వరకు వెళ్లారు. ఆ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి పనితీరుపైనా కలెక్టర్ పలుమార్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నాళ్లున్నా.. తనకు బదిలీ తప్పదనుకున్న ఆయన సెలవుపై వెళ్లి బదిలీ ప్రయత్నాలు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆయన నచ్చలేదు.. జిల్లా వైద్య కేంద్రంలో పనిచేస్తున్న ఓ అధికారి పనితీరుపై కలెక్టర్ అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల ఆయనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పనితీరు మారకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆయన్ని బదిలీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. తనకు బదిలీ తప్పదనుకున్న ఆయన మంచి చోటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. పైరవీలను వేగవంతం చేశారు. -
ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు
గుంటూరుసిటీ: జిల్లాలో నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగబాబు సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. డీఆర్సీ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ధరల నియంత్రణ సంఘం సమావేశం జరిగింది. సమావేశంలో సంయుక్త కలెక్టరు తరఫున పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి నాగబాబు మాట్లాడుతూ, బహిరంగ మార్కెట్లో ఉన్న సరుకుల ధరల కన్నా తక్కువ ధరకే వినియోగదారులకు సరుకులను అందించాలన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని రైతు బజార్లలో, గుంటూరు అరండల్‌పేటలోని ప్రభుత్వ ఎన్జీవో సంఘం స్టోర్సులో కిలో రూ.30 కే మంచి రకం బియ్యాన్ని విక్రయిస్తున్నట్టు చెప్పారు. అదే రీతిలో ఉల్లిపాయలు కూడా కిలో రూ.26కు రైతు బజార్లలో అందిస్తున్నట్టు తెలిపారు. నిత్యావసర వస్తువుల అక్రమ రవాణాను అరికట్టాలని, బ్లాక్ మార్కెంటింగ్‌కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. జనరిక్ మందుల షాపులలో, ఇతర మందుల షాపుల్లో మందుల ధరల్లో ఉన్న వ్యత్యాసాలపై ఔషధ నియంత్రణ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ సంయుక్తంగా తనఖీ చేసి వ్యత్యాసాలకు గల కారణాలపై తగిన నివేదికలను జిల్లా పౌర సరఫరాల అధికారికి అందజేయాలని ఆదేశించారు. సభ్యులు జోగారావు, పరంధామయ్యలు మాట్లాడుతూ నగరంలో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా పౌర సరఫరాల అధికారి రవితేజా నాయక్ మాట్లాడుతూ నిత్యావసర సరుకులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. సమావేశంలో నిఘా విభాగపు డీఎస్పీ అనిల్ బాబు, డ్రగ్ ఇన్స్పెక్టర్ పి.మల్లికార్జునరావు, ఉద్యాన, పశుసంవర్థక, వ్యవసాయ, తూనికలు, కొలతలు,పురపాలక తదితర శాఖల అధికారులు,రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు వి.భాస్కరరావు, వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆర్ఐపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి
పాల్వంచ, న్యూస్‌లైన్: ఎన్నికల విధుల్లో ఉన్న రెవెన్యూ అధికారిపై పాల్వంచలో టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు దాడి చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావ్ ప్రచార కార్యక్రమం ఆదివార ం మధ్యాహ్నం పాల్వంచలోని ఇందిరా కాలనీలో ఏర్పాటైంది. దీనికి ముందస్తుగా ఆ పార్టీ కార్యకర్తలను స్థానిక నాయకుడు, న్యాయవాది గంగాధర్ సమాయత్తపరుస్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికల నియామవళిని అతిక్రమించి, ఇందిరా కాలనీలో పార్టీ జెండాలు కడుతున్నారని తహశీల్దార్ సమ్మిరెడ్డికి సమాచారమందింది. ఆయన ఆదేశాలతో వీడియో సర్వేలైన్ టీం అధికారి, ఆర్ఐ ప్రసాద్ బాబ్జి, వీఆర్వో రాములు అక్కడి చేరుకుని, టీఆర్ఎస్ ప్రచార సరళిని వీడియోలో చిత్రీకరిస్తున్నారు. అదే సమయంలో అటుగా గంగాధ ర్ కారు వచ్చింది. అందులో పార్టీ జెండాలు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీ చేసేందుకు దానిని ఆర్ఐ ఆపబోయారు. కారు ఆగకుండా వెళ్లడంతో ఆయన వెంబడించి నిలిపేశారు. కారులోంచి గంగాధర్, కొందరు కార్యకర్తలు దిగి ఆర్ఐపై దాడి చేసి దుర్భాషలాడారు. ‘ఓ పార్టీకి కోవర్టులుగా పనిచేస్తున్నారు’ అని ఆరోపించారు. దీనిపై ఆర్డీవో సత్యనారాయణకు, తహశీల్దార్ సమ్మిరెడ్డికి, పోలీసులకు ఆర్ఐ ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఆనంద్ వెంటనే అక్కడికి చేరుకుని గంగాధర్‌ను జీప్‌లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జీపుకు అడ్డుపడిన టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు పక్కకు లాగేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రావ్‌కు కార్యకర్తలు విషయం తెలిపారు. అధికారులతో మాట్లాడతానని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. పోలీసులకు ఆర్ఐ ఫిర్యాదు ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేసి దుర్భాషలాడారని, విధులను అడ్డుకున్నారని పాల్వంచ పోలీసులకు ఆర్ఐ ప్రసాద్ బాబ్జి ఆదివారం ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కొత్తగూడెం ఆర్డీవో అమయ్‌కుమార్‌కు, డీఎస్పీకి కూడా ఫిర్యాదు చేయనున్నట్టు ఆర్ఐ బాబ్జి చెప్పారు. నాన్ బెయిలబుల్ కేసు నమోదు.. ఆర్ఐ బాబ్జీ ఫిర్యాదు మేరకు గంగాధర్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ షణ్ముఖాచారి తెలిపారు. మరో 20 మందిపై కూడా కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
ఎల్పీసీ జారీకి రూ.12 వేలు డిమాండ్ రూ.10,500లు తీసుకుంటూ దొరికిపోయిన రెవెన్యూ అధికారి చోడవరం, న్యూస్‌లైన్ : రెవెన్యూ అధికారి ఒకరు బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. పక్కా ఇళ్లు నిర్మాణానికి ఎల్పీసీ కోసం రూ. వేలల్లో డిమాండ్ చేసిన వీఆర్వోను ఓ పేద ఆటోడ్రైవర్ పట్టించాడు. వివరాల్లోకి వెళితే... చోడవరం మండలం జన్నవరానికి చెందిన నానోజీ చిరంజీవి ఆటో నడుపుకుంటూ కుటుం బాన్ని పోషించుకుంటున్నాడు. 2013లో రచ్చబండలో దరఖాస్తు మేరకు అతని తల్లి రమణమ్మ, చెల్లి కొట్యాడ నాగమణి పేరున రెండు ఇళ్లు అధికారులు మంజూరు చేశారు. వాటి నిర్మాణానికి గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో) ఎల్పీసీలు ఇవ్వాల్సి ఉంది. ఇందు కోసం దరఖాస్తు చేసుకున్నారు. నెలలు తరబడి కాళ్లు అరిగేలా తిరిగినా వీఆర్వో కొండలరావు పట్టించుకోలేదు. ఒక్కో ఎల్‌పీసీకి రూ. ఆరువేలు చొప్పున డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేనని చిరంజీవి చెప్పినా వీఆర్వో కనికరించలేదు. చివరికి రెండిళ్లకు కలిపి రూ.10,500ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈమేరకు పదిరోజుల కిందట ఏసీబీ అధికారులను చిరంజీవి ఆశ్రయించాడు. వారి సూచన మేరకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని వీఆర్వోకి సమాచారం ఇచ్చారు. చోడవరం తహాశీల్దార్ కార్యాలయం ప్రాంగణంలోని విశ్రాంతి గదికి రమ్మని వీఆర్వో చెప్పారు. డబ్బులు పట్టుకొని చిరంజీవి బుధవారం మధ్యాహ్నం వచ్చాడు. అప్పటికే కార్యాలయం ప్రాంగణంలో మాటువేసి ఉన్న డీఎస్పీ ఎం.నర్సింహరావు ఆధ్వర్యంలోని ఏసీబీ అధికారుల బృందం ఒక్కసారిగా చుట్టుముట్టింది. వీఆర్వో చేతిలో ఉన్న డబ్బులను పరిశీలించి పట్టుకుంది. చిరంజీవి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశామని డీఎస్పీ నర్సింహరావు విలేకరులకు తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు గణేష్, రామకృష్ణ, రమణమూర్తి పాల్గొన్నారు. -
సీజ్ చేసే హక్కు మీకెక్కడిది?
చింతూరు, న్యూస్‌లైన్: అటవీశాఖ, ఐటీడీఏల మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. పీఓ ఆదేశాల మేరకు బుధవారం వెదురు డిపోలను సీజ్ చేసేందుకు రెవెన్యూ అధికారులు యత్నించగా లిఖితపూర్వక పత్రాలు చూపాలని అటవీశాఖ లాగింగ్ అధికారులు డిమాండ్ చేసిన విష యం విదితమే. దీంతో పీఓ నుంచి వచ్చిన లిఖితపూర్వక ఆదేశాలతో గురువారం చింతూ రు తహశీల్దార్ తాతారావు, డిప్యూటీ తహశీ ల్దార్ మాధవరావులు సిబ్బందితో కలిసి వెదురు డిపో చేసేందుకు యత్నించారు. అదే సమయానికి అక్కడికి చేరుకున్న లాగింగ్ రేంజర్ ఆనందబాబు రెవెన్యూ అధికారులను ఎందుకు లోపలికి రానిచ్చావంటూ డిపో వాచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తహశీల్దార్ కలుగజేసుకుని తమ వద్ద పీఓ జారీ చేసిన లిఖిత పూర్వక ఆధారం ఉందని, దీని ఆధారంగా డిపోని సీజ్ చేస్తామని చెప్పారు. అందుకు రేంజర్ అసహనం వ్యక్తం చేస్తూ డిపోను సీజ్ చేసే హక్కు మీకెక్కడిది, పత్రంలో ఉన్నట్లు తామేమీ గ్రామాల్లో వెదురు నరికి డిపోకు తరలించడం లేదని, రిజర్వ్ ఫారెస్ట్‌లో వెదురును నరుకుతున్నామని, మీరు తెచ్చిన పత్రంలో రిజర్వ్ ఫారెస్ట్‌లో నరికిన వెదురును సీజ్ చేయాలని ఎక్కడా లేదని అన్నారు. రెండు రోజులుగా తమ కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారని ఇది మంచి పధ్ధతి కాదంటూ రేంజర్ వారిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అనంతరం లాగింగ్ రేంజర్ చింతూరు అటవీ రేంజ్ అధికారి మాధవరావు, సిబ్బంది ని డిపో వద్దకు పిలిపించారు. ఇద్దరు రేంజర్లు కలిసి తహశీల్దార్‌తో చర్చించారు. రిజర్వ్ ఫారెస్టుకు, పీసా చట్టానికి సంబంధం లేదని, తాము గ్రామాల్లో గానీ, వీఎస్ఎస్లో గానీ వెదురు నరకలేదని, అటవీ శాఖ చట్టాలకు అనుగుణంగా రిజర్వ్ ఫారెస్ట్‌లోని కూపుల్లో మాత్రమే వెదురు నరికామని అన్నారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో నరికిన వెదురుకు సంబంధించి గ్రామ సభల అనుమతి అవసరం లేదని, పీసా చట్టం వర్తించదని, ఒకవేళ ప్రస్తుతం డిపోలో వున్న వెదురుపై అనుమానాలుంటే పూర్తిస్థాయిలో విచారణ జరుపుకోవచ్చని అప్పటివరకు డిపోను సీజ్ చేయడానికి వీలులేదని వారు తేల్చిచెప్పారు. దీంతో డిపోలో ఉన్న వెదురు ఎక్కడెక్కడ సేకరించారో ఆ వివరాలు తమకు ఇవ్వాలంటూ తహశీల్దార్ లిఖితపూర్వకంగా కోరడంతో అందుకు అటవీశాఖ అధికారులు అంగీకరించారు. ఆ వివరాలను పీఓకు అందజేసి తదుపరి చర్యలకు కార్యాచరణ ఉంటుందని చెప్పి తహశీల్దార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. పీఓ లేఖలో ఏముందంటే...: పీసా చట్టం ప్రకారం గ్రామాల సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో ఉన్న వెదురు, తునికాకును వ్యక్తిగతంగా కానీ, అటవీశాఖ కానీ సేకరించాలంటే సంబంధిత గ్రామానికి చెందిన గ్రామసభ తీర్మానం అవసరముంది. అనంతరం పీసా కమిటీ చైర్మన్ అయిన ఐటీడీఏ పీఓ అనుమతి తప్పనిసరి. వీటిని పాటించకుండా అటవీ ఉత్పత్తులను సేకరించిన ట్లయితే వాటిని నేరుగా సీజ్ చేసే అధికారం చింతూరు తహశీల్దార్‌కు ఇస్తున్నామని, సీజ్ చేసిన సరుకును తదుపరి ఆదేశాల వరకు తహశీల్దార్ కార్యాలయంలో భద్రపరచాలని ఐటీడీఏ కార్యాలయం నుంచి వచ్చిన లేఖలో ఉంది. కానీ రిజర్వ్ ఫారెస్ట్‌లో అటవీ ఉత్పత్తుల సేకరణ అనే అంశం ఎక్కడా లేకపోవడంతో అటవీ అధికారులకు ఇదొక ఆయుధంగా మారింది. ఐటీడీఏ వర్సెస్ అటవీశాఖ: వెదురు డిపోల సీజ్ వ్యవహారంలో ఐటీడీఏ, అటవీశాఖల మధ్య వివాదం జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా ఏజెన్సీ ప్రాంతంలో వెదురును సేకరిస్తున్నా ఇనాళ్లకు గుర్తురాని చట్టాలు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా..? అంటూ అటవీ శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కొండరెడ్లను వెదురు సేకరించకుండా అడ్డుకుంటుండడంతో ఐటీడీఏ అధికారులు తమపై కక్షసాధింపుచర్యలకు పాల్పడుతున్నారని అటవీ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీలో అభివృద్ధి పనులకు చట్టాల పేరుతో అటవీశాఖ అధికారులు అడ్డుపుల్ల వేస్తున్నందున ఐటీడీఏ అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని రెవెన్యూ అధికారులు అంటున్నారు. రెండు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడి వివాదాలు చోటు చేసుకోవడం శోచనీయం. -
వేటు పడింది..
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : బెల్లంపల్లిలోని రూ.100 కోట్ల భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన ముగ్గురు రెవెన్యూ అధికారులపై వేటు పడింది. తహశీల్దార్ బి.విశ్వంభర్ (ప్రస్తుతం కౌటాల తహశీల్దార్), డిప్యూటీ తహశీల్దార్ రమేష్‌బాబు (ప్రస్తుతం వాంకిడి తహశీల్దార్), రెవెన్యూ ఇన్స్పెక్టర్ రోహిత్‌దేశ్‌పాండే (ప్రస్తుతం జైనూర్ డిప్యూటీ తహశీల్దార్)లను కలెక్టర్ అహ్మద్‌బాబు సస్పెండ్ చేశారు. ఏడాదిన్నర నుంచి బెల్లంపల్లి కన్నాల శివారులోని భూ అవకతవకలపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. లక్షల రూపాయలు ముడుపులు పుచ్చుకుని రెవెన్యూ అధికారులు రికార్డులను తారుమారు చేసి బినామీలకు హక్కులు కల్పించారనే ఆరోపణలు వచ్చాయి. 20 ఏళ్ల క్రితం నిర్మించిన బీఎస్ఎన్ఎల్, ఏపీ ట్రాన్స్‌కో, అటవీ శాఖ భవనాలు, డీఎఫ్‌వో కార్యాలయం, బెల్లంపల్లి టూటౌన్ కార్యాలయాల స్థలాలకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నివాసం ఉండే కొందరు వ్యక్తులదని తప్పుడు ప్రొసిడింగ్ ఇచ్చారు. ఇతర దేశంలో నివసిస్తున్న ఓ మహిళ, మరికొందరి పేరున 2011 జనవరి 13న 243.28 ఎకరాల భూములున్నట్లు తప్పుడు ప్రొసిడింగ్స్ తీశారు. వందలాది ఎకరాల భూములను రెవెన్యూ అధికారుల అండదండలతో కొందరు హస్తగతం చేసుకుంటున్న వైనాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో వాటికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్‌లను ఆధారం చేసుకుని బెల్లంపల్లికి చెందిన కొందరు కలెక్టర్ అహ్మద్‌బాబుకు ఇటీవల లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో కెమికల్ ఫ్యాక్టరీ భూముల రికార్డుల తారుమారుపై విచారణ జరిపి అవకతవకలకు పాల్పడిన ముగ్గురు రెవెన్యూ అధికారులను కలెక్టర్ సస్సెన్షన్ చేయడం సంచలనం సృష్టించింది. ఏం జరిగిందంటే.. బెల్లంపల్లి కన్నాల శివారులోని సర్వే నం.108, 109, 110/1, 111లలో కెమికల్ ఫ్యాక్టరీకి చెందిన భూములు ఉన్నాయి. 1971లో కెమికల్ ఫ్యాక్టరీ కాయిళా పడటంతో అందులో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన డబ్బుల కోసం ప్రభుత్వం కెమికల్ ఫ్యాక్టరీ భూములను ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి విక్రయించింది. సింగరేణి, అటవీ, పోలీసు, విద్యుత్, బీఎస్ఎన్ఎల్ తదితర ప్రభుత్వ రంగ శాఖలు ఆ భూములను కొనుగోలు చేశాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ శాఖల వద్ద రికార్డులున్నా అప్పటి బెల్లంపల్లి తహశీల్దార్ విశ్వంభర్, డిప్యూటీ తహశీల్దార్ రమేష్‌బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రోహిత్‌దేశ్‌పాండే ప్రైవేట్ వ్యక్తులకు ఆ భూములపై అధికారం కట్టబెట్టడానికి అక్రమ రికార్డులు సృష్టించారు. అక్రమాలలో సిద్ధహస్తుడు.. బెల్లంపల్లి తహశీల్దార్‌గా పనిచేసిన విశ్వంభర్ భూ అక్రమాలలో సిద్ధహస్తుడిగా పేరుగాంచారు. లొసుగులను ఆసరా చేసుకొని తన అక్రమాలను యథేచ్ఛగా కొనసాగించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సింది పోయి అక్రమాలకు దిగారు. అడిగినంత ఇస్తే చాలు ఎంతటి పనైనా ఇట్టే చేసిపెట్టడం ఆయన నైజం. బెల్లంపల్లిలో ప్రభుత్వ, అటవీ భూములను తప్పుడు మార్గాన అనేక మందికి పట్టాలు చేసి ఇచ్చారని, రాజకీయ ప్రముఖులకు, ముడుపులు అందించిన వారికి లక్షలు విలువ చేసే భూములు కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. కన్నాల, బుధాకలాన్ శివారులలోని విలువైన వందల ఎకరాల ప్రభుత్వ భూములు విశ్వంభర్ హయాంలోనే అనర్హుల వశమయ్యాయి. విశ్వంభర్కు తోడు డిప్యూటీ తహశీల్దార్ రమేష్ బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రోహిత్‌దేశ్‌పాండే ఆ భూ ఆక్రమాల్లో చేదోడువాదోడుగా మెలిగారు. బెల్లంపల్లి కేంద్రంగా కలకలం రేపిన భూ అక్రమాల్లో ప్రధాన నిందితులుగా ముగ్గురు రెవెన్యూ అధికారులు చివరకు దోషులుగా విచారణలో తేలడంతో అధికారగణం వారిని ఉద్యోగాల నుంచి సస్పెన్షన్ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. భూ అక్రమాలను ‘సాక్షి’ వరుసగా వెలువరించినకథనాలు అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి.