సాక్షి, కర్నూలు: బదిలీల కోసం కొందరు అధికారులు జోరుగా పైరవీలు చేస్తున్నారు. సెలవు పెట్టి.. హైదరాబాద్‌లో మకాం వేస్తున్నారు. రాజకీయ సిఫారసులతో కొందరు సఫలీకృతులు కాగా.. మరి కొందరు తమ ప్రయత్నాలకు మరింత పదును పెడుతున్నారు. దీంతో కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు
గురవుతున్నారు. ఫలితంగా జిల్లాలో పాలన అస్తవ్యస్తంగా మారింది.
కలెక్టర్ అవాక్కు..
జిల్లాలో పనిచేస్తున్న ఓ అధికారి ఈ నెల ఒకటవ తేదీ నుంచి 20 రోజులపాటు సెలవు పెట్టారు. తన కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నానంటూ వారిని కలిసేందుకు వెళ్తున్నానంటూ చెప్పడంతో కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆయనకు సెలవు మంజూరు చేశారు. అయితే ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయన సెలవులో వెళ్లలేకపోయారు. కానీ ఆ అధికారి బదిలీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసిన కలెక్టర్ అవాక్కయినట్లు తెలిసింది.
రిటైరయ్యేదాకా..
కలెక్టర్ వేగాన్ని అందుపుచ్చుకోలేక ఇబ్బంది పడుతున్న జిల్లాకు చెందిన ఓ రెవెన్యూ అధికారి ఇటీవలే సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. ఈయన కూడా బదిలీ కోసమే సెలవు పెట్టినట్లు రెవెన్యూ శాఖలో ప్రచారం జరిగింది. రిటైర్మెంట్‌కు ఇంకో రెండేళ్లు ఉండడంతో ఎలాగైనా ఇక్కడే పదవీకాలం ముగిసేవరకు పనిచేయాలనుకుంటున్న ఆ అధికారి జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత వద్ద తన కోరికను బయటపెట్టారు. దీంతో ఆ ముఖ్యనేత హామీ ఇవ్వడంతో మళ్లీ తిరిగి విధుల్లోకి చేరినట్లు తెలుస్తోంది.
పనితీరుపై
అసంతృప్తి..
డీఆర్‌డీఏలో ఓ అధికారి విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. పథకాలపైన సరైన పట్టు సాధించలేకపోయారనే విమర్శలున్నాయి. ఆ అధికారికి.. దిగువ స్థాయి సిబ్బందికి మధ్యన తరచూ విభేదాలు చోటు చేసుకునేవి. ఇటీవలే ఆ విభాగంలో పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణం వెలుగుచూసింది. దీంతో అధికారి పనితీరుపైన జిల్లా కలెక్టర్ అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన మాతృ సంస్థకు వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. బదిలీ కోసం పైరవీలు మొదలుపెట్టారు.
వారు ఎన్నాళ్లుంటారో..?
డ్వామా, ఐసీడీఎస్, బీసీ సంక్షేమ శాఖల్లో పనిచేస్తున్న కొందరు ఉన్నతాధికారుల పనితీరు కూడా కలెక్టర్‌కు నచ్చలేదు. ఇటీవల పలుసార్లు వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయా శాఖల పనితీరు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు, అవినీతి తదితర అంశాలపై కలెక్టర్ మండిపడ్డారు. సమాచార పౌరసంబంధాల శాఖాధికారి పనితీరుపైనా కలెక్టర్ అసంతృప్తిగా ఉన్నారు. ఈయన ఇక్కడ డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. దీంతో ఆయా అధికారులు అక్కడ ఎన్నాళ్లు పనిచేస్తారో? అన్నది మిలియన్‌డాలర్ల ప్రశ్నగా మారింది.
డిష్యూం.. డిష్యూం..
ఆరోగ్యశాఖలో అస్తవ్యస్తమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక్కడి ఉన్నతాధికారి.. అధికారులు, ఉద్యోగులు రెండు వర్గాలుగా విడిపోయారు. ప్రజాసేవలను పక్కనపెట్టి గ్రూపు తగాదాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒకరిపై మరొకరు ఫిర్యాదుల వరకు వెళ్లారు. ఆ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి పనితీరుపైనా కలెక్టర్ పలుమార్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నాళ్లున్నా.. తనకు బదిలీ తప్పదనుకున్న ఆయన సెలవుపై వెళ్లి బదిలీ ప్రయత్నాలు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
ఆయన నచ్చలేదు..
జిల్లా వైద్య కేంద్రంలో పనిచేస్తున్న ఓ అధికారి పనితీరుపై కలెక్టర్ అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల ఆయనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పనితీరు మారకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆయన్ని బదిలీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. తనకు బదిలీ తప్పదనుకున్న ఆయన మంచి చోటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. పైరవీలను వేగవంతం చేశారు.
జోరుగా పైరవీలు..!
Published Sun, Sep 7 2014 1:07 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement