సంతకవిటి : తుపాను బాధితుల కోపం కట్టలు తెంచుకుంది. తమ గ్రామాన్ని ముంపు ప్రాంతాల జాబితాలో చేర్చకపోవడంపై ఆందోళనకు దిగారు. ఏకంగా రెవెన్యూ అధికారిపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు జోక్యం చేసుకున్నా వెనక్కి తగ్గలేదు. ఈ సంఘటనకు దారితీసిన వివరాల్లోకి వెళితే.. సంతకవిటి మండలం వాసుదేవపట్నం గ్రామం ఇటీవల సంభవించిన హుదూద్ తుపాను సమయంలో కురిసిన భారీ వర్షం కారణంగా ముంపునకు గురైంది. నాగావళి నది గండి ద్వారా వచ్చిన నీటితో పాటు సాయన్న చానల్, నారాయణపురం కుడి కాలువుల నుంచి వచ్చిన నీరు గ్రామం చుట్టూ చేరి ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. ఆ సమయంలో గ్రామం వరకూ రహదారి బాగుండడంతో ముంపు గ్రామాలను అధికారులు పరిశీలించారు. వాసుదేవపట్నం గ్రామం నుంచి సహాయ చర్యలు ప్రారంభించారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అరుుతే ముంపు గ్రామాలను గుర్తించే సమయంలో ఈ ఊరును పక్కన పెట్టి మండలంలో 12 నదీతీర గ్రామాలను ముంపు గ్రామాలుగా పరిగణలోకి తీసుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న వాసుదేవపట్నం గ్రామానికి చెందిన వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ, టీడీపీలకు చెందిన నేతలు బుధవారం సాయంత్రం తహశీల్దార్ బి.రామారావుతో మంతనాలు జరిపారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో గురువారం గ్రామానికి చెందిన సుమారు వంద మంది రైతులు సంతకవిటి తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న వీఆర్వో ఇందుధరుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక నివేదిక మీరే ఇస్తారని, తమ గ్రామాన్ని ఎందుకు ముంపు గ్రామంగా గుర్తించలేదని ప్రశ్నించారు. దీంతో కంగుతిన్న వీఆర్వో తాను వాసుదేవపట్నాన్ని ముంపు గ్రామంగా గుర్తించి నివేదిక అందించానని తెలిపారు. ఇంతలో కార్యాలయూనికి చేరుకున్న తహశీల్దార్ బి.రామారావును రైతులు ముట్టడించారు. తమ ఊరును ముంపు గ్రామంగా ఎందుకు గుర్తించలేదని నిలదీశారు. తుపాన్ల సమయంలోనే కాకుండా మడ్డువలస కాలువలు నీరు విడిచిపెట్టిన సమయంలో కూడా ఏటా తమ గ్రామానికి చెందిన పంటపొలాలు ముంపునకు గురౌతున్నాయని వివరించారు.
హుదూద్ తుపాను కారణంగా కురిసిన వర్షాలతో ప్రస్తుతం తమ గ్రామం పూర్తిగా ముంపునకు గురైనా ఎందుకు ముంపు గ్రామాల జాబితాలో చేర్చలేదని ప్రశ్నించారు. ఒకగానొక సందర్భంలో ఆయనపై దాడికి ప్రయత్నించారు. కార్యాలయం మెట్లు ఎక్కుతున్న తహశీల్దార్‌ను కిందకులాగే ప్రయత్నం చేశారు. వీఆర్వో, వీఆర్‌ఏ, సర్వేయర్ తదితరులతో పాటు గ్రామపెద్దలు కలుగుజేసుకోవడంతో రైతులు వెనక్కుతగ్గారు. అరుుతే తహశీల్దార్ తన చాంబర్‌లోకి వెళ్లగా అక్కడకు కూడా వెళ్లి బైఠాయించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కానిస్టేబుళ్లు వచ్చి పరిస్థితి అదుపుతప్పకుండా అదుపు చేశారు. రైతులకు నచ్చజెప్పి మంతనాలు ప్రారంభించారు.
వాసుదేవపటాన్ని ముంపు గ్రామం పరిధిలోకి తీసుకువచ్చేందుకు తన చేతిలో ఏమీలేదని, పాలకొండ ఆర్డీఓ కూడా వచ్చి పరిశీలనజరిపారని, ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తానని తహశీల్దార్ రైతులకు హామీఇచ్చారు. అయినప్పటికీ రైతులు అక్కడే బైఠాయించి ముంపు గ్రామాలకు ఇస్తున్న తక్షణసాయం తమకూ అందించాలని పట్టుబట్టారు. ఎస్‌ఐ పి.సురేష్‌బాబు కలుగుజేసుకుని ఉన్నతాధికారులకు సమస్యను ఫోన్ ద్వారా వివరించారు. అరుుతే తమకు న్యాయం జరిగేవరకూ వెనక్కి తగ్గేదిలేదని రైతులు స్పష్టం చేస్తూ సాయంత్రం వరకూ తహశీల్దార్ కార్యాలయం వద్దే బైఠారుుంచారు. దీంతో తహశీల్దార్ రామారాావు ఆందోళనకారులతో మాట్లాడారు. అధికారులతో చర్చించి గ్రామాన్ని వరద ముంపు జాబితాలో చేర్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి అక్కడ నుంచి వెళ్లిపోయూరు.
వరద బాధితులకు కోపం వచ్చింది!
Published Fri, Oct 17 2014 3:22 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM
Advertisement