అన్యాయాన్ని నిలదీస్తే అరెస్టు చేస్తారా..?
అన్యాయాన్ని నిలదీస్తే అరెస్టు చేస్తారా..?
Published Sun, Oct 2 2016 8:57 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
* పీడీ యాక్టు కింద కేసులు పెడతారా!
* సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు
* వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ధ్వజం
పట్నంబజారు: సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తే ... ప్రజా సమస్యలపై ఇదేమని ప్రశ్నిస్తే ... పీడీయాక్టులు పెడతాం... అరెస్టులు చేయిస్తాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అరండల్‌పేటలోని పార్టీ నగర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు పాలనను చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. రాజధాని ప్రాంతంలో రైతులు అన్యాయమని మొరపెట్టుకుంటుంటే వారిపై, హోదా కోసం పోరాడుతున్న యువతపై పీడీయాక్ట్ పెట్టాలని చెప్పడం దారుణమన్నారు. వారేమైనా అసాంఘిక శక్తులా? రౌడీలా? గుండాలా? అని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం నోరెత్తిన ప్రతి ఒక్కరినీ అణచి వేసే ధోరణ సరికాదన్నారు. విద్యార్థులు, రైతులు, యువతను సభలకు వెళ్లకుండా అడ్డుకోవాలని కలెక్టర్, ఎస్పీ స్థాయి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసులు పెట్టినంత మాత్రాన బెదిరేది లేదని, హోదా, రైతన్నల కోసం యువత, విద్యార్థులను కలుపుకుని ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే ప్రజలు ఇచ్చిన తీర్పుతో భూస్థాపితం అయిన పార్టీలు ఎన్నో చరిత్రలో ఉన్నాయన్నారు. ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన ప్రజలు టీడీపీని మట్టికరిపించేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు రాతంశెట్టి సీతారామాంజనేయులు, లక్కాకుల థామస్ నాయుడు, ఎం.డి.నసీర్ అహ్మద్ మాట్లాడారు.
Advertisement
Advertisement