ఏసీబీకి చిక్కిన వీఆర్వో
- ఎల్‌పీసీ జారీకి రూ.12 వేలు డిమాండ్
- రూ.10,500లు తీసుకుంటూ దొరికిపోయిన రెవెన్యూ అధికారి
చోడవరం, న్యూస్‌లైన్ : రెవెన్యూ అధికారి ఒకరు బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. పక్కా ఇళ్లు నిర్మాణానికి ఎల్‌పీసీ కోసం రూ. వేలల్లో డిమాండ్ చేసిన వీఆర్వోను ఓ పేద ఆటోడ్రైవర్ పట్టించాడు. వివరాల్లోకి వెళితే... చోడవరం మండలం జన్నవరానికి చెందిన నానోజీ చిరంజీవి ఆటో నడుపుకుంటూ కుటుం బాన్ని పోషించుకుంటున్నాడు. 2013లో రచ్చబండలో దరఖాస్తు మేరకు అతని తల్లి రమణమ్మ, చెల్లి కొట్యాడ నాగమణి పేరున రెండు ఇళ్లు అధికారులు మంజూరు చేశారు. వాటి నిర్మాణానికి గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్వో) ఎల్‌పీసీలు ఇవ్వాల్సి ఉంది. ఇందు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
నెలలు తరబడి కాళ్లు అరిగేలా తిరిగినా వీఆర్వో కొండలరావు పట్టించుకోలేదు. ఒక్కో ఎల్‌పీసీకి రూ. ఆరువేలు చొప్పున డిమాండ్ చేశాడు. అంత ఇవ్వలేనని చిరంజీవి చెప్పినా వీఆర్వో కనికరించలేదు. చివరికి రెండిళ్లకు కలిపి రూ.10,500ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈమేరకు పదిరోజుల కిందట ఏసీబీ అధికారులను చిరంజీవి ఆశ్రయించాడు. వారి సూచన మేరకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని వీఆర్వోకి సమాచారం ఇచ్చారు. చోడవరం తహాశీల్దార్ కార్యాలయం ప్రాంగణంలోని విశ్రాంతి గదికి రమ్మని వీఆర్వో చెప్పారు.
డబ్బులు పట్టుకొని చిరంజీవి బుధవారం మధ్యాహ్నం వచ్చాడు. అప్పటికే కార్యాలయం ప్రాంగణంలో మాటువేసి ఉన్న డీఎస్పీ ఎం.నర్సింహరావు ఆధ్వర్యంలోని ఏసీబీ అధికారుల బృందం ఒక్కసారిగా చుట్టుముట్టింది. వీఆర్వో చేతిలో ఉన్న డబ్బులను పరిశీలించి పట్టుకుంది. చిరంజీవి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశామని డీఎస్పీ నర్సింహరావు విలేకరులకు తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు గణేష్, రామకృష్ణ, రమణమూర్తి పాల్గొన్నారు.