మాజీ సైనికుల ముసుగులో 160 ఎకరాల భూమి కైంకర్యం
సర్వీసులో ఉంటూ రిటైరయినట్టు తప్పుడు డాక్యుమెంట్లు
దళారులతో రెవెన్యూ అధికారుల కుమ్మక్కు
పట్టాలు రద్దు చేసినట్టు ప్రకటించినా వెబ్‌ల్యాండ్‌లో ప్రత్యక్షం
ఆనందపురం పరిసర వాసుల అడ్డదారులు
అనంతగిరి మండలంలో అక్రమాలు
సాక్షి, విశాఖపట్నం: మాజీ సైనికోద్యోగులకు ప్రభుత్వం ఉచితంగా బంజరు భూమిని ఇస్తుంది. పల్లపు భూమి అయితే రెండున్నర, మెట్టు అయితే ఐదెకరాలు కేటాయిస్తుంది. వీటి కోసం పదవీ విరమణ చేసిన ఏడాదిలోగా మాజీ సైనికుడు జిల్లా సైనిక సంక్షేమ అధికారి ద్వారా కలెక్టర్‌కు దరఖాస్తు చేసు కోవాలి. ఆయన సిఫార్సు చేయాలి. కలెక్టర్ సంబంధిత తహసీల్దారుకు పంపితే పరిశీలించి ఖాళీ బంజరు భూమి ఉంటే మంజూరు చేస్తారు. కానీ సర్వీసులో ఉన్న వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ భూమి కేటాయించ డానికి వీల్లేదు.
దీంతో నగరానికి ఆనుకుని ఉన్న ఆనందపురం, భీమిలి, తగరపువలస, పెందుర్తి తదితర ప్రాంతాలకు చెందిన కొంతమంది సర్వీసులో ఉన్న సైనికులతో దళారులు మిలాఖత్ అయ్యారు. తాము పదవీ విరమణ చేశామని, జిల్లాలోని అనంత గిరి మండలం రొంపిల్లి పంచాయతీ కరకవలసలో నాన్ షెడ్యూలు ఏరియాలో ఉన్న ప్రభుత్వ బంజరు భూమిని తమకు మంజూరు చేసి పట్టాలిప్పించాలని 2004 ఆరంభంలో 32 మందితో దరఖాస్తు చేయిం చారు. అప్పటి ఇన్‌చార్జి ఎమ్మార్వో కోటేశ్వరరావు, ఆ తర్వాత వచ్చిన ఎమ్మార్వో సూర్యనారాయణలు ఏకమై ఒక్కొక్కరికీ ఐదు ఎకరాల చొప్పున 160 ఎకరాలకు పట్టాలిచ్చేశారు.
ఈ వ్యవహారంలో ఒక్కో సైనికుడి నుంచి రూ.50 వేల నుంచి లక్ష వరకూ వసూలు చేసినట్టు తెలిసింది. ఆ సొమ్మును దళారీలు, రెవెన్యూ అధికారులు పంచేసు కుని పట్టాలు జారీ చేశారు. కొన్నాళ్ల తర్వాత గుట్టు చప్పుడు కాకుండా 2007-08లో ఈ 32 మంది మాజీ సైనికుల అవతారమెత్తిన నకిలీ లబ్ధిదారులు మల్లేశ్వరరావు అనే వ్యక్తికి అమ్మకానికి అగ్రిమెంట్లు చేసేశారు. పన్నెండేళ్ల క్రితం సైనికులుగా విధుల్లో ఉన్న వారిలో చాలామంది క్రమేపీ పదవీ విరమణ చేశారు. ఇప్పుడు వారు మాజీ సైనికులయ్యారు. ఇంకొందరు ఇంకా సైనికులుగా విధు ల్లో కొనసాగుతున్నట్టు తెలిసింది. కానీ అప్పట్లో వారు సైనికులుగా ఉన్నందున ప్రభుత్వ భూమికి వారు అనర్హులని సైనిక సంక్షేమ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
పట్టాలు రద్దు చేసిన ఎమ్మార్వో..
2011లో అప్పటి ఎమ్మార్వో అప్పల నాయుడు. ఆర్డీవో గణపతిరావులకు ఈ వ్యవహారంపై అనుమానం వచ్చి దర్యాప్తు జరిపారు. ఈ పట్టాలు పొందిన వారు తమ డిశ్చార్జి సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డులు సమర్పించలేదని, వారు మాజీ సైనికులుగా సైనిక వెల్ఫేర్ బోర్డు నుంచి ధ్రువపత్రాలు ఇవ్వలేదని, వారు సాగులో లేరని తేల్చారు. దీంతో వారు సర్వీసులో ఉంటూ, పదవీ విర మణ చేయకుండానే అక్రమంగా భూములు పొందారని నిర్ధారించి 32 మంది పట్టాలను రద్దు చేశారు. ఆ విషయాన్ని కలెక్టర్‌కు కూడా నివేదించారు. కానీ ఇటీవల మల్లేశ్వరరావుకు చెందిన వ్యక్తులమంటూ కొందరు ఆ భూమిలో చదును చేస్తుండగా అటవీశాఖ అధికారులు ఆ భూమి తమదని అడ్డుపడ్డారు. చదును చేస్తున్న జేసీబీని కూడా సీజ్ చేశారు.
రికార్డులు మాయం..
మరోవైపు మాజీ సైనికుల పేరిట కేటాయించిన 160 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను తహసీల్దారు కార్యాలయంలో మాయం చేశారు. అయితే సెటిల్‌మెంట్ ఫెయిర్ అడంగల్ కాపీలో మాత్రం రొంపల్లి పంచాయతీ సర్వే నంబరు 1లో 32 మంది పేరిట ఒక్కొక్కరికి ఐదెకరాలు చొప్పున పట్టాలు ఇచ్చినట్టు స్పష్టంగా ఉంది.
అధికార పార్టీ నేతల అండతో..
కొన్నాళ్ల క్రితం వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలోకి ప్లేటు ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే, విజయనగరం జిల్లా ఎస్‌కోటకు చెందిన అధికార పార్టీ మహిళానేత, ఆమె సోదరుడు, ఓ మండలాధ్యక్షుడు, ఎంపీటీసీలు ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తోంది. వీరి అండతో గతంలో రద్దయిన పట్టాలను మళ్లీ బతికించారు. ఇప్పుడు వెబ్‌ల్యాండ్‌లో అర్హతలేని 32 మంది మాజీ సైనికుల పేరునే ఈ 160 ఎకరాలకు పట్టాలుండడం కలకలం రేగుతోంది.
మా వద్ద రికార్డుల్లేవ్..
కరకవలసలో మాజీ సైనికుల పేరిట మంజూరు చేసిన భూమికి మా కార్యా లయంలో రికార్డుల్లేవు. కానీ వెబ్‌ల్యాండ్‌లో మాత్రం 32 మంది పేర్లు కనిపిస్తున్నాయి. వీరిలో కొంతమంది అప్పుడప్పుడు మా దగ్గరకొస్తున్నారు. కానీ వారెవరూ సాగులో లేరు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాను.
- రాణి అమ్మాజి, తహసీల్దారు, అనంతగిరి.