బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : బెల్లంపల్లిలోని రూ.100 కోట్ల భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన ముగ్గురు రెవెన్యూ అధికారులపై వేటు పడింది. తహశీల్దార్ బి.విశ్వంభర్ (ప్రస్తుతం కౌటాల తహశీల్దార్), డిప్యూటీ తహశీల్దార్ రమేష్‌బాబు (ప్రస్తుతం వాంకిడి తహశీల్దార్), రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రోహిత్‌దేశ్‌పాండే (ప్రస్తుతం జైనూర్ డిప్యూటీ తహశీల్దార్)లను కలెక్టర్ అహ్మద్‌బాబు సస్పెండ్ చేశారు. ఏడాదిన్నర నుంచి బెల్లంపల్లి కన్నాల శివారులోని భూ అవకతవకలపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి.
లక్షల రూపాయలు ముడుపులు పుచ్చుకుని రెవెన్యూ అధికారులు రికార్డులను తారుమారు చేసి బినామీలకు హక్కులు కల్పించారనే ఆరోపణలు వచ్చాయి. 20 ఏళ్ల క్రితం నిర్మించిన బీఎస్‌ఎన్‌ఎల్, ఏపీ ట్రాన్స్‌కో, అటవీ శాఖ భవనాలు, డీఎఫ్‌వో కార్యాలయం, బెల్లంపల్లి టూటౌన్ కార్యాలయాల స్థలాలకు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నివాసం ఉండే కొందరు వ్యక్తులదని తప్పుడు ప్రొసిడింగ్ ఇచ్చారు. ఇతర దేశంలో నివసిస్తున్న ఓ మహిళ, మరికొందరి పేరున 2011 జనవరి 13న 243.28 ఎకరాల భూములున్నట్లు తప్పుడు ప్రొసిడింగ్స్ తీశారు. వందలాది ఎకరాల భూములను రెవెన్యూ అధికారుల అండదండలతో కొందరు హస్తగతం చేసుకుంటున్న వైనాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో వాటికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్‌లను ఆధారం చేసుకుని బెల్లంపల్లికి చెందిన కొందరు కలెక్టర్ అహ్మద్‌బాబుకు ఇటీవల లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో కెమికల్ ఫ్యాక్టరీ భూముల రికార్డుల తారుమారుపై విచారణ జరిపి అవకతవకలకు పాల్పడిన ముగ్గురు రెవెన్యూ అధికారులను కలెక్టర్ సస్సెన్షన్ చేయడం సంచలనం సృష్టించింది.
ఏం జరిగిందంటే..
బెల్లంపల్లి కన్నాల శివారులోని సర్వే నం.108, 109, 110/1, 111లలో కెమికల్ ఫ్యాక్టరీకి చెందిన భూములు ఉన్నాయి. 1971లో కెమికల్ ఫ్యాక్టరీ కాయిళా పడటంతో అందులో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన డబ్బుల కోసం ప్రభుత్వం కెమికల్ ఫ్యాక్టరీ భూములను ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి విక్రయించింది. సింగరేణి, అటవీ, పోలీసు, విద్యుత్, బీఎస్‌ఎన్‌ఎల్ తదితర ప్రభుత్వ రంగ శాఖలు ఆ భూములను కొనుగోలు చేశాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ శాఖల వద్ద రికార్డులున్నా అప్పటి బెల్లంపల్లి తహశీల్దార్ విశ్వంభర్, డిప్యూటీ తహశీల్దార్ రమేష్‌బాబు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రోహిత్‌దేశ్‌పాండే ప్రైవేట్ వ్యక్తులకు ఆ భూములపై అధికారం కట్టబెట్టడానికి అక్రమ రికార్డులు సృష్టించారు.
అక్రమాలలో సిద్ధహస్తుడు..
బెల్లంపల్లి తహశీల్దార్‌గా పనిచేసిన విశ్వంభర్ భూ అక్రమాలలో సిద్ధహస్తుడిగా పేరుగాంచారు. లొసుగులను ఆసరా చేసుకొని తన అక్రమాలను యథేచ్ఛగా కొనసాగించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సింది పోయి అక్రమాలకు దిగారు. అడిగినంత ఇస్తే చాలు ఎంతటి పనైనా ఇట్టే చేసిపెట్టడం ఆయన నైజం. బెల్లంపల్లిలో ప్రభుత్వ, అటవీ భూములను తప్పుడు మార్గాన అనేక మందికి పట్టాలు చేసి ఇచ్చారని, రాజకీయ ప్రముఖులకు, ముడుపులు అందించిన వారికి లక్షలు విలువ చేసే భూములు కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. కన్నాల, బుధాకలాన్ శివారులలోని విలువైన వందల ఎకరాల ప్రభుత్వ భూములు విశ్వంభర్ హయాంలోనే అనర్హుల వశమయ్యాయి. విశ్వంభర్‌కు తోడు డిప్యూటీ తహశీల్దార్ రమేష్ బాబు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రోహిత్‌దేశ్‌పాండే ఆ భూ ఆక్రమాల్లో చేదోడువాదోడుగా మెలిగారు. బెల్లంపల్లి కేంద్రంగా కలకలం రేపిన భూ అక్రమాల్లో ప్రధాన నిందితులుగా ముగ్గురు రెవెన్యూ అధికారులు చివరకు దోషులుగా విచారణలో తేలడంతో అధికారగణం వారిని ఉద్యోగాల నుంచి సస్పెన్షన్ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. భూ అక్రమాలను ‘సాక్షి’ వరుసగా వెలువరించినకథనాలు అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి.
వేటు పడింది..
Published Sun, Oct 20 2013 2:46 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM
Advertisement
Advertisement