bellampalli
-
దుర్గం చిన్నయ్యకు షాక్!.. డీజీపీకి మహిళా కమిషన్ లేఖ
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్ అనే యువతి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా శేజల్ ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ క్రమంలో కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా, అంతకుముందు బాధితురాలు శేజల్ వేధింపుల అంశంపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో, జాతీయ మహిళా కమిషన్ స్పందిస్తూ తెలంగాణ డీజీపీకి లేఖ రాసింది. ఈ క్రమంలో శేజల్ ఫిర్యాదుపై విచారణ జరపాలని ఆదేశించింది. లైంగిక ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో ఆదేశించింది. ఇక, 15 రోజుల్లో దీనిపై అప్డేట్ ఇవ్వాలని కమిషన్ లేఖలో పేర్కొంది. ఇది కూడా చదవండి: దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు.. వీడియో, ఫొటో రిలీజ్ చేసిన శేజల్ -
ఢిల్లీకి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదం.. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
-
ఢిల్లీకి చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదం..NWCకి ఫిర్యాదు
సాక్షి, మంచిర్యాల: బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అరిజిన్డెయిరీ నిర్వాహకుల మధ్య తలెత్తిన వివాదం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు అరిజిన్ డెయిరీ భాగస్వామి తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే వల్ల ప్రాణ హానీ ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్నయ్యపై చట్టరీత్యా చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ డెయిరీ సీఈవో ఆదినారాయణ, సీఏవో శేజల్ ఆదివారం ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనం వద్ద ఆందోళన చేశారు. దుర్గం చిన్నయ్య వల్ల తమ కంపెనీలో ఉన్న వాళ్లంతా రోడ్డున పడ్డారని బాధితురాలు శేజల్ ఆరోపించారు. ఎమ్మెల్యే తమను లైంగికంగా వేధిస్తున్నారని.. న్యాయం జరిగేంత వరకు పోరాడతామని పేర్కొన్నారు. ఇప్పటికే తమపై తప్పుడు కేసులు పెట్టారని.. బెయిల్‌పై బయటకు వచ్చినా.. బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ అడిగానని.. ఎందుకో ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. కాగా, ఎమ్మెల్యేకు, అరిజిన్ డెయిరీ పాల సంస్థ ప్రతినిధులకు మధ్య గతంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపులతో పాటు ఎమ్మెల్యే తమపై అక్రమ కేసులు బనాయించారని సదరు యువతి ఆరోపించారు. చదవండి: జూబ్లీహిల్స్ పబ్‌లో పాములు, తొండలు.. కస్టమర్లను ఆకర్షించేందుకు -
ఆ వాట్సాప్ నంబర్ నాది కాదు.. మహిళ ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే
సాక్షి, మంచిర్యాల: తనపై ఓ మహిళ చేసిన ఆరోపణలపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పందించారు. వీడియో సందేశం ద్వారా వివరణ ఇచ్చారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ప్రతిపక్ష నాయకులతో కలిసి కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో ప్రచారం అవుతున్న ఫోన్ నంబర్ తనది కాదే కాదని పేర్కొన్నారు. దీనిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. 'రైతులకు ఉచిత ఫాంలు, లోన్లు ఇస్తామని కొంతమంది నా దగ్గరకు వచ్చారు. రైతులకు లాభం చేకూరుస్తారని నమ్మి వారిని ప్రోత్సహించా. కానీ వారు నాకు తెలియకుండా లోన్లు ఇప్పిస్తామని చెప్పి 20-25 మంది రైతుల నుంచి సుమారు రూ.60-70 లక్షలు వసూలు చేశారు. డబ్బులు కట్టించుకొని మోసం చేయడానికి ప్రయత్నించారు. ఈ విషయం రైతులు నా దృష్టికి తీసుకువస్తే.. నేను వెంటనే పోలీసులకు చెప్పాను. వాళ్లు పిలిచి విచారిస్తే లోన్లు ఇప్పిస్తామని చెప్పినవారు భారీ మోసానికి పాల్పడినట్లు తెలిసింది. చాలా ప్రాంతాలు, కొన్ని జిల్లాల్లో వారు ఇలాగే మోసానికి పాల్పడినట్లు తేలింది. వారిపై ఎక్కడెక్కడ కేసులు నమోదు అయ్యాయో తెలుసుకుని రైతులు ఇచ్చిన పిటిషన్ ప్రకారం చీటింగ్ కేసు పెట్టి నిందితులను జైలుకు పంపాం. అది దృష్టిలో పెట్టుకుని నన్ను ఏదో విధంగా బ్లాక్ మెయిల్ చేయాలనే ఉద్దేశంతో వారు బెదిరిస్తున్నారు. సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో కన్పిస్తున్న నంబర్లు నావి కావు. కావాలనే నన్ను ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టడానికి కొంతమంది ప్రతిపక్ష నాయకులను కూడా కలుపుకొని ఇలా చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా. తప్పకుండా న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నా.' అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాగా.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధించారని ఓ మహిళ వీడియో విడుదల చేయడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే తనతో వాట్సాప్ చాట్ చేశాడని ఆమె పేర్కొంది. ఆయన మోసాలను బట్టబయలు చేస్తానంది. బ్లాక్ మెయిల్ చేయడం లేదని చెప్పింది. ఎమ్మెల్యే ఇంటి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే అసలు వాస్తవాలేంటో తెలుస్తాయంది. చదవండి: ఎమ్మెల్యే మోసం చేశారు.. మరో వీడియో విడుదల చేసిన యువతి -
సింగరేణిపై ప్రధాని మాట తప్పారు
బెల్లంపల్లి/కాగజ్‌నగర్ టౌన్: సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్లమెంటు సాక్షిగా నాలుగు బొగ్గు బ్లాక్‌లను వేలం వేస్తామని ప్రకటించడం.. నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రధాన మంత్రి సింగరేణిపై మాట తప్పారని, బొగ్గు గనులు, విశాఖ ఉక్కుతోపాటు ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వేల వంటి ముఖ్యమైన సంస్థలను ప్రైవేటు, కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీకొడుతోందని విమర్శించారు. కాగా, కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో ప్రారంభించనున్న వైద్య కళాశాలల్లో సింగరేణి కార్మికుల పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని హరీశ్‌రావు తెలిపారు. రిజర్వేషన్ ప్రక్రియ వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు కానుందని చెప్పారు. గురువారం ఆయన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆస్పత్రి, డయాలసిస్ కేంద్రం, కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో రూ.5 కోట్లతో నిర్మించిన 30 పడకల సామాజిక ఆస్పత్రిని మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. మళ్లీ కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయని, అయితే ప్రజలు ఏమాత్రం భయపడకుండా ఉండాలని, ప్రభుత్వపరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తి స్థాయి వైద్యులను నియమిస్తామని, వారంరోజుల్లోగా కాగజ్‌నగర్‌లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఆసిఫాబాద్‌లో 340 పడకల ఆస్పత్రి నిర్మాణంతోపాటు వైద్య కళాశాల ప్రారంభానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించి సిర్పూర్ (టీ), ఆసిఫాబాద్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, త్వరలోనే ఆ ప్రాజెక్టు కోసం టెండర్లు పిలవనున్నామని తెలిపారు. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, ఎన్.దివాకర్‌రావు, కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
పిల్లలను లాలిస్తూ పాడిన పాటే.. బాధను మరిపిస్తోంది!
బెల్లంపల్లి: ఆ ఖాకీ చొక్క హృదయంలో అంతులేని వేదన ఉంది. ఇద్దరు పిల్లలు దివ్యాంగులుగా జన్మించడం వేదనకు గురి చేసింది. ఆ వేదనను దిగమింగి పిల్లల సంతోషం కోసం పాడడం మొదలైంది. పాటలు వింటూ పిల్లలు వైకల్యాన్ని మరిచి ఆనందంతో కేరింతలు కొట్టేవారు. కొన్నేళ్లలోనే ఇద్దరు పిల్లలు దూరం కావడం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఆ బాధను మరిచిపోవడానికి పాటలు పాడుతూనే ఉన్నాడు. ఆ గాయకుడైన పోలీసు అధికారి రామగుండం పోలీసు కమిషనరేట్‌లోని బెల్లంపల్లి ఆర్మ్డ్ రిజర్వుడ్ ఏసీపీ చెరుకు మల్లికార్జున్. దివ్యాంగులుగా పిల్లలు.. మల్లికార్జున్, శ్యామల దంపతులకు 1996లో తొలి సంతానంగా సాహితీ దివ్యాంగురాలిగా జన్మించింది. ఎన్నో ఆస్పత్రుల్లో చూపించినా పరిస్థితిలో మార్పు రాలేదు. మంచం, కుర్చీకి పరిమితమై ఉండేది. కొద్దిగా మాట్లాడడం తప్పా భూమిపై అడుగు కదిపేది కాదు. తల్లిదండ్రులు ఆమెకు సపర్యలు చేస్తూ అల్లారు ముద్దుగా చూసుకున్నారు. 2001లో రెండో సంతానంగా మగ బిడ్డ జన్మించాడు. విధి ఆ దంపతులకు పరీక్ష పెట్టింది. హర్షిత్ కూడా మానసిక, శారీరక వైకల్యంతో జన్మించడంతో మల్లికార్జున్ దంపతుల దుఃఖానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లల ఆనందం కోసం.. పిల్లలను లాలిస్తూ మల్లికార్జున్ ఓ పాట పాడారు. అంతే ఆ ఇద్దరు పిల్లల మోములో ఆనందం తొణికిసలాడింది. అప్పటి నుంచి మల్లికార్జున్ పదే పదే పాటలు పాడుతుండడంతో ఆ చిన్నారులు వైకల్యాన్ని మరిచి కేరింతలు కొట్టేవారు. వారి సంతోషం కోసం సినిమా పాటలు నేర్చుకుని ఆలపించేవాడు. ఆ తీరుగా ఏళ్లపాటు కొనసాగగా ఆ చిన్నారుల సంతోషాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో.. 18 ఏళ్ల వయస్సులో హర్షిత్ 2019లో, కూతురు సాహితీ ఇరవై నాలుగేళ్ల వయస్సు వచ్చాక 2020లో దూరమయ్యారు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. పిల్లల మరణంతో కుంగిపోయిన మల్లికార్జున్‌ను చూసిన తోటి సహోద్యోగులు ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ వేదనను మర్చిపోవడానికి అతడిలో అంతర్లీనంగా దాగి ఉన్న గాయకుడిని తట్టి లేపారు. గతాన్ని మర్చిపోవడానికి పాటలు పాడడం ప్రారంభించాడు. ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఫ్లేస్టోర్ నుంచి స్టార్ మేకర్ యాప్‌లో పాటలు పాడి అప్లోడ్ చేశారు. శ్రోతల నుంచి స్పందన రావడంతో డ్యూయెట్ పాటలను మేల్‌వర్షన్‌లో పాడి అప్లోడ్ చేయడం ప్రారంభించారు. నచ్చిన ఫిమేల్ సింగర్ అతడి గొంతుతో జత కలపడం, నచ్చిన ఫిమేల్ వాయిస్‌కు మెయిల్ వర్షన్లో మల్లికార్జున్ శృతి కలిపి డ్యూయెట్ పాటలు పాడటం మొదలు పెట్టారు. అలా ఏకంగా 3,387 పాటలు పాడి ప్రత్యేకతను ఏర్పర్చుకున్నారు. చిన్నప్పటినుంచే పాటలపై ఆసక్తి కరీంనగర్‌కు చెందిన చెరుకు మల్లికార్జున్ 1996లో పోలీసు శాఖలో ఆర్ముడ్ రిజర్వుడ్ సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేశారు. అంతకుముందు 1994–95లో మెడికల్ రిప్రజెంటిటివ్‌గా పని చేశారు. 1995లో శ్యామలతో వివాహం జరిగింది. మల్లికార్జున్ 2009లో ఇన్స్పెక్టర్గా, 2019లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ఏడాదిన్నర కాలంగా బెల్లంపల్లి ఆర్ముడ్ రిజర్వుడు ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్నప్పటి నుంచే పాటలపై ఆసక్తి ఉండగా చదువుకునే రోజుల్లో కళాశాలలో, పోలీసు కార్యక్రమాల్లో పాటలు పాడేవారు. (క్లిక్ చేయండి: అన్నదాతల్లో చైతన్యం తీసుకొస్తున్న ప్రవాసీయులు) బాలు గాత్రం అంటే ఎంతో ఇష్టం పిల్లల జ్ఞాపకాలను మర్చిపోవడానికి ప్రస్తుతం స్టార్ మేకర్ వేదిగా పాటలు పాడుతున్నాను. పిల్లల కోసం నేర్చుకున్న పాటలు ఆ ఇద్దరు మానుండి వెళ్లిపోయాక మర్చిపోవడానికి మళ్లీ పాడడాన్ని ఎంచుకున్నాను. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాత్రం అంటే ఎంతో ఇష్టం. తుది ఊపిరి ఆగిపోయే వరకు పాటలు పాడుతూనే ఉంటాను. – మల్లికార్జున్, సీఆర్ ఏసీపీ, బెల్లంపల్లి -
'తెలంగాణ పర్యటనలో అక్కా, చెల్లెమ్మ పదాలు నేర్చుకున్నా'
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ పర్యటనలో భాగంగా అక్కా, చెల్లెమ్మ పదాలు నేర్చుకున్నా. తెలంగాణ ప్రజల ప్రేమ జీవితంలో మర్చిపోలేను’అని జమ్మూకశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కవీందర్ గుప్తా అన్నారు. ‘బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా నాలుగు రోజుల కిందట బెల్లంపల్లి గ్రామానికి వెళ్లాను. ఏడు సార్లు భోజనం చేస్తే అందులో ఆరుసార్లు వైశ్య సంఘాలే పెట్టాయి. వ్యాపారాల్లో ఉంటూనే దేశ ప్రగతిలో వైశ్యులు పాలుపంచుకుంటున్నారు’అని తెలిపారు. శనివారం రాత్రి అఖిల భారత వైశ్య సంఘం (ఏఐవైఎఫ్) మహా సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి గోపాల్ మోర్ మాట్లాడుతూ దేశంలో కోటిన్నర కంటే తక్కువ టర్నోవర్ ఉన్న వైశ్య వ్యాపారులకు నెలకు రూ.3 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో 3.50 కోట్ల మంది వైశ్యులున్నారని, కరోనా టైంలో కూడా ఈ కమ్యూనిటీ పేదల కడుపు నింపిందని పేర్కొన్నారు. దేశంలోని వైశ్య సంఘానికి కూడా అన్ని రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు గిరీశ్ సంఘీ, ఇతర ప్రతినిధులు జైస్వాల్, రాజేశ్‌అగర్వాల్, జితేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: (బీజేపీలో చేరిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి) -
గర్భిణి ప్రసవ వేదన
వేమనపల్లి (బెల్లంపల్లి): సుఖ ప్రసవం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రావాలని ప్రభుత్వం చెబుతుండగా, ప్రసవ వేదనతో ఆస్పత్రికి వెళ్లిన గిరిజన మహిళ వైద్య సిబ్బంది లేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. కనీసం పట్టణానికి వెళ్లి ప్రాణాలు కాపాడుకుందామనుకుంటే వాగు దాటలేని పరిస్థితి గర్భిణీని వేదనకు గురి చేసింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో చోటు చేసుకుంది. రాజారాం గ్రామానికి చెందిన బోరం భీమయ్య, శాంతక్కల కూతురు బుర్స శిరీషకు బుధవారం ఇంటి వద్ద నొప్పులు మొదలయ్యాయి. ఇరుగుపొరుగు వారి సాయంతో అవ్వాల్ కమిటీ అంబులెన్స్‌లో వేమనపల్లి పీహెచ్‌సీకి తరలించారు. 24 గంటల వైద్య సదుపాయం అందించాల్సిన ఆస్పత్రిలో సిబ్బంది లేరు. కాంట్రాక్ట్ వర్కర్ బాపు ఒక్కడే ఉన్నాడు. శిరీష ఆరోగ్య పరిస్థితిని చూసి వైద్యాధికారి కృష్ణకు ఫోన్లో సమాచారం అందించగా, ఆయన చెన్నూర్ సివిల్ ఆస్పత్రికి తరలించమని సలహా ఇచ్చారు. అదే అంబులెన్స్‌లో ఐదు కిలోమీటర్ల దూరంలోని నీల్వాయి వాగు వంతెన వద్దకు తీసుకెళ్లారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు అప్రోచ్ రోడ్డు బురదమయంగా ఉండడంతో అంబులెన్స్ బురదలో కూరుకుపోయింది. రాత్రి 10 గంటలకు వాగు వద్దకు వెళ్లిన అంబులెన్స్ రాత్రి 12.30 గంటల వరకు కూడా బురదలో నుంచి బయటకు రాలేదు. దీంతో అంబులెన్స్‌లో ఉన్న గర్భిణిని డ్రైవర్ నరేష్, మరో డ్రైవర్ బుర్స భాస్కర్, కుటుంబ సభ్యులు చేతులపై ఎత్తుకెళ్లి వంతెన మీదుగా మామిడితోట అవతలి వైపు మోసుకొచ్చారు. అక్కడ వేచి ఉన్న 108 అంబులెన్స్ సహాయంతో చెన్నూర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. గురువారం తెల్లవారుజామున శిరీష ఆడశిశువుకు జన్మనివ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, సిబ్బంది లేకపోవడంతోనే ఆమె పరిస్థితిని చూసి అంబులెన్స్ ఏర్పాటు చేసి పంపించామని వైద్యాధికారి కృష్ణ తెలిపారు. -
రూ. 2లక్షలు డిమాండ్.. ఏసీబీకి చిక్కిన బెల్లంపల్లి టూటౌన్ ఎస్సై
సాక్షి, బెల్లంపల్లి: స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లంచం తీసుకున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూటౌన్ ఎస్సై కే.భాస్కర్‌రావును కరీంనగర్ అవినీతి నిరోధక శాఖ అధికారులు(ఏసీబీ) బుధవారం వలపన్ని పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ కే.భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ శివారు బాహుపేటకు చెందిన తండ్రీకొడుకులు అల్లె సత్యనారాయణ, అల్లె వేణు బెల్లంపల్లి కాల్టెక్స్ ఏరియాకు చెందిన ఓ వ్యక్తికి లారీని లీజుకు ఇచ్చి ఆ లారీ ఇంజిన్, చాసిస్ నంబరు మార్చి వేరే వ్యక్తుల పేర్లపై మార్పిడి చేసి తప్పుడు పద్ధతిలో రుణం పొంది మోసం చేశారని ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ ఫిర్యాదు చేయడంతో వారిద్దరిపై 2019 నవంబర్ 12న బెల్లంపల్లి టూటౌ న్లో కేసు నమోదైంది. వారికి బెయిల్ మంజూరు కోసం అల్లె నవీన్ కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్సై భాస్కర్‌రావు రూ.2లక్షలు డిమాండ్ చేశాడు. నవీన్ ప్రాధేయపడడంతో చివరికి రూ.1.20లక్షలకు ఒప్పందం కుదిరింది. బుధవారం డబ్బు తీసుకుని బెల్లంపల్లికి వచ్చినట్లు నవీన్ ఎస్సైకి సమాచారం ఇచ్చాడు. తన ప్రైవేటు కారు డ్రైవర్ రాజ్‌కుమార్ టూటౌన్ ముందున్న రహదారిపై ఉంటాడని, అతనికి ఇవ్వాలని ఎస్సై భాస్కర్‌రావు సూచించాడు. నవీన్ రాజ్‌కుమార్‌కు డబ్బు ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు టూటౌన్‌కు చేరుకుని నగదు స్వాధీనం చేసుకున్నా రు. ఎస్సై భాస్కర్‌రావు, రాజ్‌కుమార్ చేతులకు ర సాయనిక పరీక్ష చేయగా పాజిటివ్‌గా వచ్చిందని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. ఎస్సై భాస్కర్‌రావు, రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేశామని, గురువారం కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజ రు పరుస్తామని తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు ఎస్పీ.రవీందర్, సంజీవ్, ఎస్సైలు పాల్గొన్నారు. ఖాకీల్లో కలకలం ఎస్సై ఏసీబీకి చిక్కడంతో జిల్లాలో సంచలనం, పోలీ సుశాఖలో కలకలం సృష్టించింది. ఏడేళ్ల తర్వాత ఓ పోలీసు అధికారి చిక్కడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. భీమిని మండలానికి చెందిన ఓ ఎంఈవో మెట్పల్లి(ఏసయ్యపల్లె) గ్రామానికి చెందిన సాక్షర భారత్ కోఆర్డినేటర్ నుంచి లంచం తీసుకుంటుండగా బెల్లంపల్లి లో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. బెల్లంపల్లి ఆబ్కారీ సీఐ గురవయ్య గౌడ కులస్తుల నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఆ ఘట నల తర్వాత ఎస్సై స్థాయి అధికారి పట్టుబడడం పోలీసు శాఖను ఉలిక్కిపాటుకు గురి చేసింది. సీఐ ప్రమోషన్లో ఉండి.. బెల్లంపల్లి టూటౌన్ ఎస్సైగా భాస్కర్‌రావు 2019 న వంబర్ 7న విధుల్లో చేరారు. అంతకుముందు కాసిపేట పోలీసుస్టేషన్లో పనిచేశారు. సాధారణ బదిలీల్లో భాగంగా బెల్లంపల్లి టూటౌన్‌కు వచ్చిన తర్వాత ప్రత్యేక శైలీ అలవర్చుకున్నారనే ఆరోపణలున్నాయి. మరికొన్ని కేసుల్లోనూ స్టేషన్ బెయిల్‌కు నిందితులను ఇబ్బందులకు గురి చేశారనే విమర్శలు వచ్చాయి. ఒకట్రెండు నెలల్లో బదిలీ కానున్నారనే ప్రచారం జరిగింది. మరోవైపు పోలీసుశాఖలో పదోన్నతుల కల్పనకు కసరత్తు చేస్తుండగా ఆయన పేరు ఐదో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. సీఐగా బదిలీపై వెళ్లాలనే తలంపులో ఉన్న ఆయనకు ఏసీబీతో ఎదురుదెబ్బ తగిలింది. -
ఇక నా పెళ్లి జరగదు.. యువతి ఆత్మహత్య
సాక్షి, ఆదిలాబాద్: కోటపల్లి మండలం జనగామ గ్రామానికి చెందిన పడాల హరిప్రియ(22) తనకు పెళ్లి కాదని క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు, ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ గ్రామానికి చెందిన హరిప్రియకు మహారాష్ట్రకు చెందిన మేనబావతో వివాహం జరిపేందుకు రెండు కుటుంబాలు నిశ్చయించాయి. హరిప్రియ తండ్రి మధుకర్ తన అక్క దగ్గర గత సంవత్సరం రూ.2 లక్షల వరకు అప్పు తీసుకవచ్చాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో మధుకర్ అప్పు తీర్చలేకపోయాడు. ఈ విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అప్పు తీరిస్తేనే పెళ్లి అని మధుకర్ అక్క చెప్పడంతో హరిప్రియ తన పెళ్లి జరగదని కలత చెంది సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. ఇది గమనించిన హరిప్రియ నాన్నమ్మ విషయాన్ని కుటుంబసభ్యులకు సమాచారం అందించగా చికిత్స నిమిత్తం చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. పిక్ల తండాలో యువకుడు.. లింగాపూర్(ఆసిఫాబాద్): మండలంలోని పిక్లతండాకు చెందిన బానోత్ గోవింద్(32) ఆదివారం రాత్రి క్రిమిసంహారక మందు తాగి మృతిచెందాడు. ఎస్సై మధుకర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవింద్ రెండేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివార రాత్రి కూడా బాగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవ పడ్డాడు. భార్య మందలించడంతో చేను వద్దకు వెళ్లి క్రిమిసంహారక మందు తాగాడు. ఇంటికి వచ్చి వాంతులు చేసుకోవడంతో గమనించిన కుటుబ సభ్యులు ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహ మేరకు మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాదు రీమ్స్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం ఉదయం మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. ప్రియుడి ఇంటి ఎదుట యువతి నిరసన కాసిపేట(బెల్లంపల్లి): మండలంలోని పెద్దనపల్లి గ్రామానికి చెందిన చెండె స్వరూప సోమవారం ప్రియుడి ఇంటిముందు నిరసన తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దనపల్లికి చెందిన లౌడం మహేందర్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఏడాది క్రితం తనను లోబరుచుకున్నాడని ఆరోపించింది. ఇటీవల ప్రెగ్నేన్సి టెస్ట్ కూడా చేయించాడని, ప్రెగ్నేన్సీ లేకపోవడంతో నామోబైల్లో కాల్స్, మేసెజ్ డాటా మొత్తం తొలగించి తనతో ఎలాంటి సంబంధం లేదని వెళ్లిపోయాడని వివరించింది. తనకు న్యాయం చేయాలని, మహేందర్‌తో వివాహం జరిపించాలని బైఠాయించింది. గ్రామస్తులు మద్దతు తెలపడంతో గోడవ జరుగుతుందని, విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోని ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. దీంతో కాసిపేట పోలిస్స్టేషన్లో స్వరూప ఫిర్యాదు చేసింది. మహేందర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని, అతను కోలుకున్నాక విచారణ చేసి కేసునమోదు చేస్తామని ఎస్సై తెలిపారు. చదవండి: వివాహిత సజీవ దహనం: హత్యా..ప్రమాదమా? -
Bellampalli: ఐసోలేషన్ కేంద్రంలో 12 మంది మృతి
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో రెండ్రోజుల వ్యవధిలో 12 మంది మృత్యువాతపడ్డారు. కొద్ది గంటల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు కోల్పోవడం కలకలం సృష్టించింది. బెల్లంపల్లి కేంద్రంగా సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఐసోలేషన్ కేంద్రం నిర్వహిస్తున్నారు. సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చడంతో జిల్లాలో రోజూ దాదాపు 500 కేసులు నమోదవుతున్నాయి. కాగా అనేక మంది రెండు మూడు రోజుల వ్యవధిలోనే తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితి లో ఐసోలేషన్ కేంద్రంలో చేరుతున్నారు. ఆక్సిజన్ స్థాయి 50 శాతానికి పడిపోయిన రోగులు ఆస్పత్రిలో చేరిన కొద్ది గంటల వ్యవధిలోనే చనిపోతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 8 మంది, ఆ తర్వా త సాయంత్రం 7 గంటల వరకు మరో నలుగురు వ్యక్తులు కరోనాతో కన్నుమూశారు. -
మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం
సాక్షి, బెల్లంపల్లి: సీపీఐలో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారం క్రితం శ్వా సకోస సమస్యలు ఏర్పడగా అతడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించారు. అప్పటినుంచి ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నారు. మధుమేహ వ్యాధితో బాధపడుతున్న మల్లేష్‌కు తాజాగా కిడ్నీ సంబంధమైన సమస్యలు తోడైనట్లు పార్టీ శ్రేణులు అంటున్నారు. శుక్రవారం సాయంత్రం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నిమ్స్‌కు వెళ్లి మల్లేష్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో చర్చించారు. మల్లేష్ ఆరోగ్య సమాచారాన్ని బెల్లంపల్లిలోని పార్టీ శ్రేణులకు చాడ ఫోన్‌చేసి చెప్పినట్లు సమాచారం. మల్లేష్ ఆరోగ్యంపై సీపీఐ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతుండగా.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. -
ప్రేమ, ఉద్యోగాల పేరుతో.. రూ.లక్షల్లో వసూలు
సాక్షి, బెల్లపల్లి: నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని, ఉద్యోగాల ఆశ చూపి, ఓ ముఠా రూ.లక్షల్లో వసూలు చేసింది. అనంతరం బాధితులను మోసగించిన ఘటనలో ఓ మహిళతోపాటు మరో ముగ్గురు వ్యక్తులను కరీంనగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ మహిళ ఉద్యోగం లేక ఖాళీగా ఉండేది. ఈ క్రమంలో కుటుంబసభ్యులతో విడిపోయి, కరీంనగర్‌లోని ఆదర్శ నగర్లో ఒంటరిగా జీవిస్తోంది. జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్ధేశ్యంతో అమాయక యువకులను లక్ష్యంగా చేసుకొని, ప్రేమ, ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెబుతూ వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసింది. ఆమె తన ముఠా సభ్యులైన కంబాల రాజేశ్(41), కుసుమ భాస్కర్(48), భీమాశంకర్(28)లతో కలిసి కరీంనగర్‌లోని సిక్‌వాడీకి చెందిన ఓ యువకుడిని వరంగల్‌లోని ప్రభుత్వ ఆస్పుత్రిలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించింది. క్యాంటీన్ నిర్వహణ కాంట్రాక్టు పేరుతో రూ.13.5 లక్షలు, కరీంనగర్‌లోని తిరుమల నగర్లో నివాసం ఉంటున్న మరో వ్యక్తి నుంచి ప్రభుత్వ ఊద్యోగం పేరుతో రూ.7 లక్షలు, గోదావరిఖనికి చెందిన ఓ యువకుడి వద్ద రూ.3లక్షలు వసూలు చేశారు. నిందితురాలు వరంగల్‌కు చెందిన యువకుడితో తనను నికితారెడ్డిగా పరిచయం చేసుకొని, అతనితో చేసిన ఫోన్ చాటింగ్ చేసింది. దాన్ని అడ్డుగా పెట్టుకొని బాధితుడిని బ్లాక్ మెయిల్ చేస్తూ రూ.8లక్షల వరకు తీసుకుంది. సదరు మహిళ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని, అధికారుల వద్ద పలుకుబడి ఉందని నిరుద్యోగులతో నమ్మబలికింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని, రిజిస్ట్రేషన్ నిమిత్తం, అధికారులకు ఇవ్వడానికి డబ్బులు ఖర్చవుతాయని నమ్మించింది. తన మూఠా సభ్యులను అధికారులుగా చూపించి, వసూళ్లకు తెరలేపింది. బాధితులు తాము మోసపోయామని గ్రహించి, డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే రాజేష్, భాస్కర్, భీమాశంకర్‌లను పెద్ద మనుషులుగా చూపించింది. తన మొబైల్లో చాటింగ్‌ను చూపిస్తూ వారిపైనే కేసులు పెడుతూ బెదిరింపులకు గురిచేసింది. ఈ ఘటనలతో నిఘా పెట్టిన పోలీసులు నిందితులందరినీ పట్టుకొని, వారి వద్ద నుంచి రూ.20 వేలు, నకిలీ నియామక పత్రాలు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కరీంనగర్, గోదావరిఖని, వరంగల్, హైద్రాబాద్ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరీంనగర్ సీపీ వీబీ.కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగాలు ఇప్పిస్తామని వచ్చేవారి మాయమాటలు నమ్మి, డబ్బు, సమయం కోల్పోవద్దన్నారు. ఈ ముఠా వల్ల మోసపోయిన వారు ఎవరైనా ఉంటే నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అధికారులను సంప్రదించాలని సూచించారు. సీఐ విజయ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు ప్రకాష్, శశిధర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మావోయిస్టు సుదర్శన్ లొంగిపోతారా..?
సాక్షి, బెల్లంపల్లి: మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ ప్రభుత్వానికి లొంగి పోతారనే ప్రచారం సాగుతోంది. రెండురోజుల నుంచి పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుదర్శన్ డిగ్రీ చదువుతున్న క్రమంలో విప్లవోద్యమానికి ఆకర్షితుడయ్యాడు. చదువు పూర్తయ్యాక ఆర్నెళ్లపాటు సింగరేణిలో కార్మికుడిగా పనిచేశాడు. 1978లో విప్లవోద్యమానికి అంకితమై అజ్ఞాతంలోకి వెళ్లాడు. 42 ఏళ్లపాటు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఆయన అంచలంచెలుగా ఉన్నత శ్రేణికి ఎదిగారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ స్థాయికి ఎదిగి కీలకమైన పొలిట్ బ్యూరోలో సభ్యుడిగా ఉన్నాడు. మావోయిస్టు పార్టీలో మిలటరీ శిక్షణ ఇవ్వడం.. వ్యూహాలను రచించి సమర్థవంతంగా అమలు చేయడంలో సుదర్శన్‌కు మంచి పట్టున్నట్లు చెబుతుంటారు. నాలుగు దశాబ్దాల పైబడి అజ్ఞాతవాసం గడుపుతున్న సుదర్శన్ ఒక్కసారి కూడా పోలీసులకు చిక్కకపోవడం విశేషం. (గణపతి లొంగిపోతాడన్న వార్తల్లో వాస్తవమెంత?) తల్లిదండ్రులు చనిపోయినా.. 64 ఏళ్లున్న సుదర్శన్ ఎన్నోసార్లు ఎదురుకాల్పుల నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం దండకారణ్యం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. విప్లవోద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన ఆయన.. అతడి తండ్రి మల్లయ్య 2017లో, తల్లి వెంకటమ్మ 2018లో మృతిచెందినప్పటికీ ఇంటిముఖం చూడలేదు. పోలీసుల సూచనతో జనజీవన స్రవంతిలో కలవాలని తల్లిదండ్రులు కోరినప్పటికీ సుదర్శన్ మాత్రం ముందుకు రాలేదు. సహచరులు కొంతమంది లొంగిపోయినా.. ఎంతోమంది ఎన్కౌంటర్లో మృతిచెందినా.. ఆయన అజ్ఞాతం వదిలి రాలేదు. సుదర్శన్ లొంగిపోతున్నట్లు సాగుతున్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. లొంగిపోతారనే ప్రచారంలో వాస్తవమెంత? నిజంగానే సుదర్శన్ పోరుబాట వదులుతాడా..? అందుకు గల కారణాలు ఏమై ఉంటాయి..? ప్రచారంలో వాస్తవం ఎంత..? అనే కోణాల్లో పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి ఆరోగ్యం క్షీణించి జనజీవన స్రవంతిలో కలవబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న క్రమంలోనే సుదర్శన్ కూడా లొంగిపోతున్నాడనే వార్తలు వస్తుండటంతో స్థానికంగా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన డీజీపీ మహేందర్ రెడ్డి హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించడం.. పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశమైంది. -
ఆడతోడు కోసమేనా..?
సాక్షి, జన్నారం(మంచిర్యాల) : కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో అడవిప్రాంతంలోని వన్యప్రాణులకు స్వేచ్ఛాయుత వాతావరం నెలకొంది. ప్రజలు లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమయ్యా రు. రోడ్లపై రాకపోకలు నిలిచిపోగా అడవి ప్రాంతం ప్రశాంత వాతావరణం నెలకొంది. కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవి డివిజన్లోని తాళ్లపేట్, జన్నారం, ఇందన్పల్లి అటవి రేంజ్లలోని అడవి ప్రాంతాల్లో అలజడి తగ్గడంతో వన్యప్రాణులు స్వచ్ఛాయుత వాతావరణంలో విహరిస్తున్నాయి. గతంలో దట్టమైన అడవిలో బిక్కుబిక్కుమంటూ ఉండే వన్యప్రాణులు కాస్త ఊరటగా బయటకు వస్తున్నాయి. అడవి వదులకపోయిన స్వచ్ఛగా తిరుగుతున్నా యి. ఈక్రమంలో‘సాక్షి’ గురువారం జన్నా రం అటవిడివిజన్లో అధికారులతో డుగా పర్యటించగా పలుచిత్రాలు కనిపించాయి. పక్షుల సందడి... అడవిలో వన్యప్రాణులే కాకుండా రకరకాల పక్షలు సందడి చేస్తున్నాయి. ఉదయం అడవిలో అడుగుపెడితే పక్షుల కిలకిల రావాలు చెవులకు వింపుగా వినిపిస్తాయి. సుదూర ప్రాంతాల నుంచి రకరకాల పక్షులు కవ్వాల్‌లోని కుంటల వద్ద పర్యటిస్తున్నట్లు అటవిశాఖ అధికారులు చెబుతున్నారు. ఇండియన్ స్పాట్ బిల్డ్ డక్, యూరేషియన్ వైజన్ పక్షి, గార్గానీడక్, కామన్‌టీల్ డక్, ఆసియన్ ఓపెన్‌బిల్, రెడ్ నాపెడ్ ఐపిస్ పక్షి, గ్రేహెరన్ పక్షి, బ్లాక్ వింజ్డ్ స్టిల్ట్ పక్షి, కామన్ స్టాండ్ పైపర్ పక్షి, పీఏడ్ కింగ్ ఫిషర్, క్రేస్టెడ్ ట్రీస్వీఫ్ట్, బ్లాక్ నెక్డ్, వుల్లి నెక్డ్ పక్షులు ఈ కవ్వాల్‌లో విహారిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రోడ్డును వదిలి అడవుల్లోకి... ప్రతి రోజు అడవి సమీపంలో ప్రధాన రహదారిపై రోడ్డుకు ఇరువైపులా ఉంటూ వాహనదారులు వేసే పండ్లు, వేరుశనగా, మొక్కజొన్న కంకులు తదితర వాటిని కోతులు తింటూ ఉండేవి. అదే విధంగా ఇందన్పల్లి, చింతగూడ, పొనకల్ తదితర గ్రామాల్లో కోతులు అనేకంగా ఇబ్బందులు పెట్టేవి. లాక్డౌన్ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో కోతులకు ఆహారం కరువైంది. దీంతో కోతులు ఊర్లను వదిలి అడవిబాట పట్టాయి. కోతులు ఒకసారి అడవి రుచి మరిగితే ఇక జనావాసాల్లోకి రావని, ఇది కొంత ఊరట నిచ్చే విషయమని అటవి అధికారులు చెబుతున్నారు. బెల్లంపల్లి: బెల్లంపల్లి చుట్టుపక్కల మండలాల్లో తిరుగుతున్న పులి గ్రామీణులతోపాటు అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సాధారణంగా పులి ఒక్కచోట ఉండదు. అలాంటిది ఐదురోజులుగా ఒకే ప్రాంతంలో ఉంటూ.. ప్రజల అలికిడి ఉన్నప్పటికీ అదరకుండా తిరుగుతుండడంతో ఇదే ప్రాంతంలో ఆవాసం ఏర్పాటు చేసుకుంటుందా..? లేదా మరో ప్రాంతానికి వెళ్లిపోతుందా అనేది అంతుచిక్కడం లేదు. చెర్లపల్లి శివారులో అడుగుపెట్టగానే ఓ గేదెను హతమార్చిన పులి రోజువారీ కదలికలు అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సూర్యస్తమయం కాకముందే.. దర్జాగా తన స్థావరాన్ని వదిలి బయటకు వస్తోంది. దీంతో పులిని కాపాడుకునేందుకు అటవీ అధికారులు నానాయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పది సీసీ కెమెరాలు, నాలుగు బేస్‌క్యాంపులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా గస్తీ కాస్తున్నారు. వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చకుండా, అటువైపు జనసంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైతులు పొలాల వద్దకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. యవ్వన దశలో పులి.. మహారాష్ట్రలోని తడోబా ప్రాంతం నుంచి వచ్చిన ఈ మగపులి యవ్వన దశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని వయసు నాలుగేళ్ల వరకు ఉంటుందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కండపుష్టి కలిగి.. బలిష్టంగా ఉన్న పులి కదలికలను సీసీ కెమెరాల్లో బంధిస్తున్న అధికారులు.. ఆడతోడు కోసం ఆరాటపడుతున్నట్లు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో నాలుగు పులులు సంచరిస్తున్నాయి. బెల్లంపల్లి పులితో ఆ సంఖ్య ఐదుకు చేరిందని చెబుతున్నారు. వీటన్నింటిలోనూ ఈ పులి వయస్సే తక్కువని పేర్కొంటున్నారు. జోడుకోసం వెంపర్లాడుతున్న ఈ పులి కొద్దిరోజులపాటు ఇదే ప్రాంతంలో ఉంటుందా..? లేక తోడు వెదుక్కుంటూ మరో ప్రాంతానికి వెళ్తుందా.. తేలాల్సి ఉంది. బెంబేలెత్తిస్తున్న బెబ్బులి తాండూర్: మండలంలో పులి హడలెత్తిస్తోంది. బుధవారం రాత్రి గోలేటి వన్ ఇంక్లైన్ గని హోటల్ వెనకాలలోని అటవీ ప్రాంతంలో, రెబ్బెన మండలం కైరిగూడ గ్రామానికి చెందిన కోటేష్‌కు చెందిన ఎద్దును హతమార్చింది. ఆ ప్రాంత ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. గోలేటి వన్ ఇంక్లైన్ గని నుంచి బీపీఏ ఓసీ –2 మధ్యలో పులి సంచారం చేస్తున్నట్లు చూపరులు చెబుతుండగా, అర్ధరాత్రి అచ్చులాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో పులి గాండ్రింపులు వినిపించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. రెండు పులులు తిరుగుతున్నాయా.? ఒకే పులినా అనేది అటవీ అధికారులు ఇంకా ఓ అభిప్రాయానికి రాలేకపోతున్నారు. -
గొల్లపల్లి అడవిలో పులి సంచారం
నెన్నెల(బెల్లంపల్లి): మండలంలోని గొల్లపల్లి అడవిలో పులి సంచరిస్తోంది. ఆదివారం గొర్లకాపరులు పులి అడుగులను గుర్తించారు. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. సర్పంచ్ ఇందూరి శశికళ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. నెల రోజుల క్రితం గొల్లపల్లి, ఖమ్మంపల్లి శివారులో పోచమ్మగుండాల వద్ద పులి సంచరించింది. గ్రామస్తులు అడుగులను గుర్తించి ఫొటోలు సైతం తీశారు. నెలలో మూడుసార్లు పులి జాడలను గొల్లపల్లి శివారు ప్రాంతాలలో గుర్తించడంతో పులి ఇదే ప్రాంతంలో ఆవాసం ఏర్పచుకుందేమోనని గ్రామస్తులు భయంతో వణుకుతున్నారు. వ్యవసాయ క్షేత్రంలో చిరుత పులి నర్సాపూర్(జి): మండల కేంద్రం సమీపన గాడి ప్రభాకర్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో శనివారం రాత్రి చిరుత పులి అడుగులను రైతు ప్రభాకర్ గుర్తించారు. సమాచారాన్ని వెంటనే అటవీ శాఖ అధికారులకు అందజేశారు. సంఘటన స్థలాన్ని డిప్యూటీ ఎఫ్ఆర్వో గౌత్ పరిశీలించి చిరుత పులి అడుగులుగా నిర్ధారించారు. మండలంలోని కుస్లి, గోల్లమాడ, అంజనితండా గ్రామాల్లో చిరుత పులి ఆవులను, మేకలను హతమార్చింది. సమీప గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు ప్రజలకు సూచించారు. -
లక్కీ డ్రా పేరుతో మోసం..!
సాక్షి, బెల్లంపల్లి(అదిలాబాద్): లక్కీ డ్రా పేరుతో అమాయక ప్రజలను మోసగిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం బెల్లంపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ కె.జగదీష్ వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం విట్టునాయక్ తండాకు చెందిన కొంతమంది యువకులు లక్కీ డ్రా పేరుతో బెల్లంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలను మోసం చేస్తూ వసూళ్లకు పాల్పడ్డారు. ఇంటింటికి వెళ్లి జుపిటర్ మార్కెటింగ్, పాలీగోల్డ్ మార్కెటింగ్, రెడ్ ఫాక్స్ హోమ్ అప్లయన్సెస్, స్కాలర్ హోమ్ అప్లయన్సెస్, శ్రీసాయి ఓంకార్ ఎంటర్ ప్రైజేస్ కంపెనీ పేర్లతో స్క్రాచ్ కార్డులను చూపించి గ్రామీణులను లక్కీ డ్రా పేరుతో మోసం చేశారు. «గత నెల 20వ తేదీన ధర్మపురిలో ఎనిమిది మంది బృందం సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు. స్క్రాచ్‌కార్డులు కొనుగోలు చేసిన తరువాత లక్కీ డ్రాలో బహుమతులు వస్తాయని నమ్మించి రూ.2వేల నుంచి రూ.7,500 వరకు దొరికినంత వసూళ్లు చేశారు. చెన్నూర్, రామగుండం, ధర్మారం తదితర ప్రాంతాల్లోనూ ఇలాగే వసూళ్లకు పాల్పడ్డారు. గత నెల 29న బెల్లంపల్లి మండలం కాశిరెడ్డిపల్లి గ్రామంలో కొంతమంది మహిళలను లక్కీ డ్రా ఆశచూపి రూ.14వేలు వసూళ్లు చేశారు. ఆ సమాచారంతో తాళ్లగురిజాల పోలీసులు ఈ నెల 1న నిందితులపై రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్క్రాచ్ కార్డులపై ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించి బుధవారం సాయంత్రం ఎంపీడీవో కార్యాలయం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో మూడు సంజీవ్, కేతవాత్ గోపాల్, కేతవాత్ అరవింద్ , జాదవ్ అకాశ్, కేతవాత్ అలియాస్ రాథోడ్ రాజు, పవర్‌కేషు, కేతవాత్ గోపాల్, చవాన్‌కుమార్ ఉన్నట్లు వివరించారు. అనంతరం నిందితుల వద్దనుంచి రూ.29,090 నగదు, 2కార్లు, గృహోపకరణ వస్తువులైన కుక్కర్లు, మొబైల్ ఫోన్లు 8, వివిధ కంపెనీలకు చెందిన స్క్రాచ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో తాళ్లగురిజాల ఎస్సై బి.సమ్మయ్య, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మనకూ ఉంది ఓ ఫ్లైఓవర్..
సాక్షి, కాగజ్‌నగర్(ఆదిలాబాద్) : ఫైఓవర్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. సరైన డిజైన్ లోపం, రక్షణ చర్యలు లేక ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కాగజ్‌నగర్‌లో ఉన్న జిల్లాలోనే ఏకైక రైల్వే ఫైఓవర్ బ్రిడ్జి సైతం ప్రమాదాలకు ఏమాత్రం అతీతంగా లేదు. ఈ బ్రిడ్జిపై సరైన రక్షణ చర్యలు లేక తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గచ్చిబౌలిలోని డయో డైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం అలర్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి దుస్థితిపై ప్రత్యేక కథనం కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జితో పాటు వేంపల్లి– సిర్పూర్(టి) మధ్య మరో ఫ్లైఓవర్ నిర్మిణంలో ఉంది. కాగజ్‌నగర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రమాదాలకు అడ్డాగా మారింది. తరచూ ఈ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదా లు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి, జూన్ మాసాల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. సిర్పూర్ నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్‌గా ఉన్న కాగజ్‌నగర్ ప్రాంతా నికి చుట్టు పక్కల మండలాల ప్రజలు, వాహనదారులు ఎక్కువగా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి గుండానే రాకపోకలు సాగిస్తుంటారు. కాగజ్‌నగర్ నుంచి దహెగాం, కౌటాల, బెజ్జూర్, చింతలమానేపల్లి, పెంచికల్‌పేట, భీమిని మండలాలకు వెళ్లాలం టే ఈ బ్రిడ్జి మీదుగానే వెళ్లాల్సిన ఉంటుంది. ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు, లారీలు, ట్రాక్టర్లు, వ్యాన్లు, ఆటోలు ఇలా అన్నిరకాల వాహనాలు ఈ వంతెన గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. కానరాని రక్షణ చర్యలు.. దాదాపు కిలోమీటర్ దూరం ఉన్న ఈ బ్రిడ్జిపై రక్షణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎక్కడా కూడా ప్రమాద సూచికలు ఏర్పాటు చేయలేదు. కనీసం రేడియం కటింగ్లతో హెచ్చరికలు కూడా ఏర్పాటు చేయకపోవడం విశేషం. ఈ నేపథ్యంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బ్రిడ్జి మొదలు ప్రాంతంలో రోడ్డుకు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. చివరి భాగంలో కూడా రోడ్డు శిథిలావస్థకు చేరడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక బ్రిడ్జిపై మలుపులు ఉన్న చోట్ల అతివేగంతో వెళ్లే వాహనాలు అదుపు తప్పితే పెను ప్రమాదం సంభవించే అవకాశాలున్నా యి. ఫ్లైఓవర్ బ్రిడ్జి మొదలు, ముగింపు ప్రాంత ంలో అధికారులు కనీసం స్పీడ్ బ్రేకర్లు సైతం ఏర్పాటు చేయలేదు. రాత్రిపూట ఇబ్బందే.. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ప్రధానంగా రాత్రిపూట ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాత్రిపూట మూల మలుపుల వద్ద అధికారులు రేడియం కటింగ్‌లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులకు చీకటిలో సరిగ్గా కనబడకపోవటం, ప్లైఓవర్‌పై ఉన్న విద్యుత్ స్తంభాల్లో ఎక్కువ శాతం వెలగకపోవడం కూడా ప్రమాదాలకు దారి తీయవచ్చని నిపుణులు పేర్కొటున్నారు. మరోవైపు రాత్రిపూట మద్యం మత్తులో వాహనాలను అతి వేగంతో నడుపుతూ వెళుతున్నారని ఆర్వోబీ సమీపంలో ఉన్న ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇరువైపులా సైడ్ వాల్ ఇంకా ఎత్తుగా నిర్మించాలని వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్అండ్బీ, రైల్వే అధికారులు స్పందించి ఇక్కడ కూడా హైదరాబాద్ వంటి ప్రమాదం జరగకముందే మేల్కోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని ఆకాంక్షిస్తున్నారు. రేడియం ఏర్పాటు చేయాలి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై రాత్రిపూట ఇండికేషన్ లభించే విధంగా అధికారులు రేడియం కటింగ్లతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. అలాగే బ్రిడ్జి మొదలు, ముగింపు పాయింట్లలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలను నివారించవచ్చు. ఆర్వోబీ ముగింపు వద్ద ఉన్న గుంతలను సత్వరమే పూడ్చివేయాలి. – సుభాష్ పాల్, స్థానికుడు చర్యలు తీసుకుంటాం కాగజ్‌నగర్ రైల్వే ఫైఓవర్ బ్రిడ్జిపై ప్రమాదాలు చోటు చేసుకోకుండా రేడియం కటింగ్లతో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. అవసరాన్ని బట్టి బ్రిడ్జిపై స్పీడ్ బ్రేకర్ కూడా నిర్మిస్తాం. ప్రమాదాల నివారణకు శాఖపరంగా చర్యలు తీసుకుంటాం. అలాగే గుంతలు ఏర్పడిన చోట మరమ్మతులు చేయించి ప్రజలకు సౌకర్యం కల్పిస్తాం. – రాము, ఆర్అండ్బీ, ఈఈ -
ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట మృతి
సాక్షి, తాండూర్(బెల్లంపల్లి): ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమజంట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. బెజ్జూరు మండలం లంబాడితండా పరిధిలోని బొగుడ గూడ గ్రామానికి చెందిన గోమాస జీవన్ (35), తాండూర్ మండలం కాసిపేట గ్రామానికి చెందిన ఏల్పుల గౌరు(29) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సామాజిక వర్గాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు అంగీకరించకపోవచ్చని బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్నేహితులు మంచిర్యాల ఆస్పత్రిలో చేర్పించగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలిం చారు. వేర్వేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందిన సీఐ సామల ఉపేందర్ తెలిపారు. -
సింగరేణిలో అత్యధిక ఇన్సెంటివ్ అతడిదే
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ ఇటీవల ప్రకటించిన 28 శాతం లాభాల వాటాలో శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన టింబర్‌యార్డు వర్క్‌మెన్ మందాల ఓదేలు అత్యధికంగా రూ.1.80 లక్షల ఇన్సెంటివ్ సాధించాడు. ఏరియాల వారీగా అత్యధిక ఇన్సెంటివ్‌లు సాధించిన వారి వివరాలను యాజమాన్యం సోమవారం విడుదల చేసింది. ఓదేలు అత్యధిక ఇన్సెంటివ్ సాధించి మొదటి స్థానంలో నిలువగా, రూ.1.76 లక్షలతో మందమర్రి ఏరియాకు చెందిన జనరల్ మజ్దూర్ కుమ్మరి జెస్సీరాజ్ ద్వితీయ, రూ.1.67 లక్షలతో కొత్తగూడెం ఏరియా ఎల్‌హెచ్‌డీ ఆపరేటర్ రాంజీవన్ పాసి తృతీయ స్థానంలో నిలిచారు. బెల్లంపల్లి ఏరియాకు చెందిన జూనియర్ అసిస్టెంట్ రూ.1.38 లక్షలు, కార్పొరేట్ ఏరియాకు చెందిన జూనియర్ అసిస్టెంట్ బొజ్జ రవీందర్ రూ.1.34 లక్షలు, ఇల్లెందు ఏరియాకు చెందిన జూనియర్ కెమిస్ట్ మనోజ్ కుమార్ రూ.1.51లక్షలు, భూపాలపల్లి ఏరియాకు చెందిన ఎల్‌హెచ్‌డీ ఆపరేటర్ చిలుకల రాయలింగు రూ.1.42 లక్షలు, రామగుండం–1 ఏరియాకు చెందిన ఫోర్‌మెన్ కె.ముత్తయ్య రూ.1.55 లక్షలు, రామగుండం–2 ఏరియాకు చెందిన ఓవర్‌మెన్ గోపు రమేష్‌కుమార్ రూ.1.58 లక్షలు, రామగుండం–3 ఏరియాకు చెందిన జనరల్ మజ్దూర్ నల్లని రాంబాబు రూ.1.52 లక్షలు, మణుగూరు ఏరియాకు చెందిన ఫిట్టర్ ముప్పారపు శ్రీనివాసరావు రూ.1.38 లక్షలు స్పెషల్ ఇన్సెంటివ్ సాధించారు. -
నీలగిరితోటల్లో పులి సంచారం
సాక్షి, బెల్లంపల్లి: బెల్లంపల్లి అటవీ డివిజన్ పరిధి కుశ్నపల్లి రేంజ్లో పులి సంచారిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల నుంచి పులి విస్తారంగా అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఆనవాళ్లు (పాద ముద్రలను) అటవీశాఖకు చెందిన ఫారెస్టు డెవలాప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) అధికారులు గుర్తించారు. ఈ పాదముద్రలతో పులి సంచారం జరుగుతున్నట్లు ప్రస్పుటమైంది. బెల్లంపల్లి నుంచి నెన్నెల మండల కేంద్రానికి వెళ్లే మార్గంలో బొప్పారం గ్రామం ఉంది. ఆ గ్రామ శివారు ప్రాంతంలో అటవీ శాఖకు చెందిన నీలగిరి ఫ్లాంటేషన్‌ను పెంచుతున్నారు. ఆ ఫ్లాంటేషన్ పక్కన కడమడుగుల వాగు ఉంది. ఆ వాగు, నీలగిరి ఫ్లాంటేషన్ మధ్యలో నుంచి అటవీ ప్రాంతం లోనికి వెళ్లడానికి ఓ రహదారి ఉంది. అక్కడి నుంచి దట్టమైన అటవీ ప్రాంతం నెలకొంది. దాదాపు పది కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఆనుకుని కొన్ని రోజుల నుంచి ఎఫ్డీసీ ఆధ్వర్యంలో అటవీశాఖ పనులు జరుగుతున్నాయి. కూలీలు రోజువారీగా అటవీ ప్రాంతం మధ్యలో నుంచి పనులు జరుగుతున్న స్థలి వరకు రాకపోకలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆకస్మికంగా పులి అడుగులు దర్శనమిచ్చాయి. ఆ అడుగులను చూసి ఒక్కసారిగా భయపడిన కూలీలు పులి సంచారం జరుగుతున్నట్లు గ్రహించారు. విషయాన్ని వెంటనే ఎఫ్డీసీ బెల్లంపల్లి రేంజ్ ఫ్లాంటేషన్ మేనేజర్ జీ.సురేష్ కుమార్‌కు సమాచారం అందించారు. స్పందించిన సురేష్‌కుమార్ శనివారం ఆ ప్రాంతానికి వెళ్లి పులి పాదముద్రలను పరిశీలించి నిర్ధారించారు. సంచారం చేస్తున్న ఆ పులి కే–4 అయి ఉంటుందని అటవీ శాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఎంచుకుని.. కుశ్నపల్లి అటవీ రేంజ్ పరిధిలో విస్తారంగా అటవీ సంపద కేంద్రీకృతమైంది. నలువైపుల నాలుగు గ్రామాలు ఉండటంతో ఆ అటవీ ప్రాంతం ఇప్పుడిప్పుడే దట్టంగా విస్తరిస్తోంది. తూర్పున ఘన్పూర్ గ్రామం, పడమర ప్రాంతంలో దుగినేపల్లి, ఉత్తరం వైపు బొప్పారం, దక్షిణం దిశలో జోగాపూర్ గ్రామాలు ఉన్నాయి. ఆ నాలుగు గ్రామాల మధ్యన ఎటుచూసిన వందలాది మైళ్ల దూరం వరకు అటవీ సంపద పెనవేసుకుని ఉంది. ప్రస్తుతం విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అటవీ ప్రాంతంలో వృక్షాలు మరింత ఏపుగా ఎదిగి కుమ్ముకుని ఉన్నాయి. ఆ ప్రాంతం సంచారానికి అన్ని విధాలా అనుకూలంగా ఉండటంతో పులి ఆవాసం చేసుకోవడానికి యత్నిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు అభిప్రాయ పడుతున్నారు. గ్రామాల్లో భయం భయం... పులి సంచిరిస్తున్న విషయం వెలుగులోకి రావడంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్రంగా భయపడుతున్నారు. అటవీ ప్రాంతానికి వెళ్లడానికి జంకుతున్నారు. ముఖ్యంగా దుగినేపల్లి , పెర్కపల్లి, గుండ్ల సోమారం, బొప్పారం, ఘన్పూర్, జోగాపూర్ తదితర ప్రాంతాల ప్రజలు పులి కంట కనబడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అడవి నుంచి పులి ఏవైపునకు వస్తుందోనని అభద్రతాభావానికి గురవుతున్నారు. పులి అడుగులు కనిపించడంతో అప్రమత్తమైన అటవీ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వన్యప్రాణుల వధ కోసం సంచరిస్తున్న వేటగాళ్లు ఎక్కడా అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలతో ఉచ్చులు బిగించకుండా నివారణ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కారిడార్ కోసమేనా..? అటవీ ప్రాంతాన్నీ కారిడార్‌గా మల్చుకోవడానికి పులి తీవ్రంగా తాపత్రయ పడుతున్నట్లు తెలుస్తోంది. వేమనపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో కొన్నాళ్లుగా సంచరించిన పులి ఆ తర్వాత కోటపల్లి మండలంలోనూ కాలు కదిపింది. ఆ పిమ్మట క్రమంగా నెన్నెల మండలంలో అడుగుపెట్టింది. ఆయా ప్రాంతాలన్నీ కూడా కల గలిసి ఉండటం, అటవీ ప్రాంతం దట్టంగా విస్తరించడంతో కారిడార్ ఏర్పాటుకు పులి పాకులాడుతున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం బెల్లంపల్లి మండలం గుండ్ల సోమారం గ్రామ పొలిమేరల్లో నుంచి పులి సంచారం చేసినట్లు వదంతులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తదుపరి మూడు నెలల క్రితం నెన్నెల అటవీ ప్రాంతంలో సంచరించిన పులి తాజాగా మరోమారు అడుగులతో ఉనికిని చాటుకుంది. ఆవాసం కోసం అనువైన ప్రాంతాన్నీ ఎంచుకోవడానికి పులి వేట సాగిస్తున్నట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. -
బెల్లంపల్లి గురుకులంలో ఫుడ్ పాయిజన్
సాక్షి, బెల్లంపల్లి : బెల్లంపల్లి తెలంగాణ రాష్ట్ర బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాల వసతిగృహంలో ఉంటున్న దాదాపు పది మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు కోలుకుంటున్నారు. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుకుల పాఠశాల వసతిగృహంలో బుధవారం రాత్రి విద్యార్థులకు బెండకాయ కూర, పప్పుతో భోజనం అందించారు. వసతిగృహంలో ఉన్న ఆర్వో ప్లాంట్ పనిచేయకపోవడంతో బయట నుంచి నీళ్లు తెప్పిం చారు. భోజనం చేసిన విద్యార్థులు ఆ నీళ్లు తాగారు. కొద్ది సేపటికే కొందరు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతో వసతిగృహ వైద్య సిబ్బంది విద్యార్థులకు మాత్రలు వేశారు. ఆ మాత్రలు వేసుకున్నా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. రక్తపు విరేచనాలు.. మాత్రలు వేసుకున్నా విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడకపోగా ఒకరిద్దరు రక్తపు విరోచనాలు చేసుకున్నారు. దీంతో ఆందోళన చెందిన ఉపాధ్యాయులు గురువారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో విద్యార్థులను బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసున్న ఎంఈవో మహేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో ముజాఫర్ ఖాద్రి, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, ఈవోపీఆర్డీ ఎన్.వివేక్‌రాం ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. ఇందుకు గల కారణాలను ప్రిన్సిపాల్ వేణుగోపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం విద్యార్థులకు ఎలాంటి అపాయం లేదని, వారు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. కలుషిత నీరు తాగడం వల్లే.. కలుషిత నీటిని తాగడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురై ఉండవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. కాగా పాఠశాలలో ఆర్వో ప్లాంట్ పనిచేయకపోవడంతో వసతిగృహ అధికారులు పట్టణంలోని ఓ ప్లాంట్ నుంచి మినరల్ వాటర్ తెప్పించారు. మినరల్ వాటర్ తాగినా విద్యార్థులకు ఇలా జరగడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వసతిగృహ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ సంఘటన జరిగిందని, విద్యార్థులు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థి సంఘాల కోరుతున్నారు. -
మంత్రాలు చేస్తుందని ఆరోపించడంతో..
సాక్షి, బెల్లంపల్లి(ఆదిలాబాద్) : మంత్రాల నెపంతో వేధిస్తున్నారని మండలంలోని పెద్దలంబాడి తండా గ్రామానికి చెందిన దరావత్ కళావతి అనే యువతి మంగళవారం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామానికి చెందిన దరా వత్ చత్రునాయక్, వెంకుబాయి దంపతులు, వారి కుమారుడు కిరణ్‌కు మంత్రాలు చేస్తున్నారంటూ అదే గ్రామానికి చెందిన దరావత్ రాజ్‌కుమార్, అతడి తల్లి తులసీ, చెల్లి కళావతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాధితులు మూడురోజుల క్రితం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమపైనే ఫిర్యాదు చేస్తారా..? అంటూ చత్రునాయక్, వెంకుబాయి, కిరణ్, వారి బంధువులు కలిసి కళావతి కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. విషయాన్ని రాజ్‌కుమార్ ఎస్సై మొగిళికి ఫోన్లో సమాచారం అందించారు. ఎస్సై పోలీస్‌స్టేషన్‌కు రావాలని చెప్పడంతో అంద రూ కలిసి వెళ్లారు. చత్రునాయక్ కుటుంబసభ్యులు కూడా వచ్చారు. పెద్దల సమక్షంలో మాట్లాడుదామని, అంతవరకు గొడవలు పడొద్దని ఎస్సై ఇరువర్గాలకు చెప్పి ఇంటికి పంపించాడు. ఇంటికెళ్లాక చత్రునాయక్ కుటుంబం రాజ్‌కుమార్ కు టుంబంపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కళావతికి గాయాలయ్యాయి. తీవ్ర మనస్తాపానికి గురైన కళావతి పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు 108లో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మం చిర్యాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. న్యాయం చేయకపోవడంతో ఆత్మహత్యకు యత్నించిందని ఆమె కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. -
అమెరికాలో బెల్లంపల్లి యువకుడి మృతి
బెల్లంపల్లి: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు ప్రమాదవశాత్తూ నీటమునిగి మరణించాడు. టెక్సాస్ రాష్ట్రంలోని రిచ్మండ్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బెల్లంపల్లికి చెందిన రెడ్డి శ్రావణ్ (27) ఆదివారం తన స్నేహితులతో కలసి సరదాగా ఫ్లోరిడా రాష్ట్రంలోని డెస్టిన్‌లో సముద్రస్నానానికి వెళ్లాడు. లోనికి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా పెద్ద అల ముంచెత్తడంతో శ్రావణ్ కొట్టుకుపోయాడు. దీంతో భీతిల్లిన స్నేహితులు బయటకు పరుగులు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శ్రావణ్ కోసం గాలింపు చేపట్టినా ఆచూకీ లభించకపోవడంతో గల్లంతైనట్లు సోమవారం అతని తండ్రి రెడ్డి రాజంకు ఫోన్లో సమాచారం అందించారు. చివరకు మృతదేహం లభ్యం కావడంతో మంగళవారం ఉదయం శ్రావణ్ నీటమునిగి మృతి చెందినట్లు అమెరికా పోలీసులు ధ్రువీకరించి వర్తమానం పంపారు. కొడుకు మరణ వార్త విని శ్రావణ్ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన శ్రావణ్ అకాల మరణం ఆ కుటుంబంలో విషాదఛాయలు నింపింది. హైదరాబాద్‌లో బీ ఫార్మసీ పూర్తి చేసిన శ్రావణ్... 2014లో ఎంఎస్ కోసం అమెరికా వెళ్లాడు. 2016లో ఎంఎస్ పూర్తి చేసిన శ్రావణ్ మరో విభాగంలోనూ ఎంఎస్ చేస్తున్నాడు. పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూనే చదువు కొనసాగిస్తున్నాడు. సింగరేణిలో మైనింగ్ సర్దార్‌గా పని చేసి రిటైరైన రెడ్డి రాజం, మాలతి దంపతుల నలుగురు సంతానంలో శ్రావణ్ చిన్నవాడు. శ్రావణ్ మృతదేహం బెల్లంపల్లికి రావడానికి మరో మూడు రోజులు పట్టొచ్చని అతని కుటుంబీకులు తెలిపారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
సాక్షి, మంచిర్యాల : అమెరికాలో తెలుగు విదార్థి శ్రావణ్‌కుమార్‌రెడ్డి మృత్యువాతపడ్డాడు. ఈస్టర్ సందర్భంగా స్నేహితులతో కలిసి బోస్టన్ బీచ్‌కు వెళ్ళిన శ్రావణ్ ప్రమాదవశాత్తూ నీటమునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే స్థానిక ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అలల ఉధృతికి సముద్రంలో గల్లంతయిన అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు సోమవారం శ్రావణ్ మృతదేహాన్ని బయటకు తీశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన శ్రావణ్‌కుమార్ రెడ్డి స్వస్థలం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి. విషయం తెలుసుకున్న శ్రావణ్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.