సాక్షి, ఆదిలాబాద్: కోటపల్లి మండలం జనగామ గ్రామానికి చెందిన పడాల హరిప్రియ(22) తనకు పెళ్లి కాదని క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు, ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ గ్రామానికి చెందిన హరిప్రియకు మహారాష్ట్రకు చెందిన మేనబావతో వివాహం జరిపేందుకు రెండు కుటుంబాలు నిశ్చయించాయి. హరిప్రియ తండ్రి మధుకర్ తన అక్క దగ్గర గత సంవత్సరం రూ.2 లక్షల వరకు అప్పు తీసుకవచ్చాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో మధుకర్ అప్పు తీర్చలేకపోయాడు. ఈ విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అప్పు తీరిస్తేనే పెళ్లి అని మధుకర్ అక్క చెప్పడంతో హరిప్రియ తన పెళ్లి జరగదని కలత చెంది సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. ఇది గమనించిన హరిప్రియ నాన్నమ్మ విషయాన్ని కుటుంబసభ్యులకు సమాచారం అందించగా చికిత్స నిమిత్తం చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.
పిక్ల తండాలో యువకుడు..
లింగాపూర్(ఆసిఫాబాద్): మండలంలోని పిక్లతండాకు చెందిన బానోత్ గోవింద్(32) ఆదివారం రాత్రి క్రిమిసంహారక మందు తాగి మృతిచెందాడు. ఎస్సై మధుకర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవింద్ రెండేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివార రాత్రి కూడా బాగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవ పడ్డాడు. భార్య మందలించడంతో చేను వద్దకు వెళ్లి క్రిమిసంహారక మందు తాగాడు. ఇంటికి వచ్చి వాంతులు చేసుకోవడంతో గమనించిన కుటుబ సభ్యులు ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహ మేరకు మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాదు రీమ్స్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం ఉదయం మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.
ప్రియుడి ఇంటి ఎదుట యువతి నిరసన
కాసిపేట(బెల్లంపల్లి): మండలంలోని పెద్దనపల్లి గ్రామానికి చెందిన చెండె స్వరూప సోమవారం ప్రియుడి ఇంటిముందు నిరసన తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దనపల్లికి చెందిన లౌడం మహేందర్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఏడాది క్రితం తనను లోబరుచుకున్నాడని ఆరోపించింది. ఇటీవల ప్రెగ్నేన్సి టెస్ట్ కూడా చేయించాడని, ప్రెగ్నేన్సీ లేకపోవడంతో నామోబైల్‌లో కాల్స్, మేసెజ్ డాటా మొత్తం తొలగించి తనతో ఎలాంటి సంబంధం లేదని వెళ్లిపోయాడని వివరించింది.
తనకు న్యాయం చేయాలని, మహేందర్‌తో వివాహం జరిపించాలని బైఠాయించింది. గ్రామస్తులు మద్దతు తెలపడంతో గోడవ జరుగుతుందని, విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోని ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. దీంతో కాసిపేట పోలిస్‌స్టేషన్‌లో స్వరూప ఫిర్యాదు చేసింది. మహేందర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిందని, అతను కోలుకున్నాక విచారణ చేసి కేసునమోదు చేస్తామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment