బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన నోటా ఓటుకు ఓటర్ల నుంచి విశేష స్పందన లభించింది. ఓటర్లు పెద్ద సంఖ్యలో నోటా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థుల పట్ల ఓటర్లు విముఖత చూపారు. బెల్లంపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో 21 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పోలింగ్‌కు మూడు రోజుల ముందు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పోటీ నుంచి అర్ధంతరంగా వైదొలిగి కాంగ్రెస్-సీపీఐ ఉమ్మడి అభ్యర్థికి మద్దతు తెలిపారు. దీంతో 20 మంది అభ్యర్థుల మధ్యనే పోటీ జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నచ్చకపోతే నోటా ఓటును వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం సాగించింది. ఎన్నికల సంఘం చేసిన ప్రచారానికి తొలి ప్రయత్నంలోనే అనూ హ్య స్పందన లభించింది. నియోజకవర్గ వ్యాప్తంగా 1,60,960 మంది ఓటర్లు ఉండగా 1,19,442 మంది ఓటర్లు ఓటు వేశారు. ఇందులో టీఆర్‌ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య 73,779 ఓట్లతో విజయం సాధించగా సమీప ప్రత్యర్థి సీపీఐ-కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి గుండా మల్లేశ్‌కు 21,251 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పాటి సుభద్రకు 9,167 ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచారు. మిగతా స్వతంత్ర అభ్యర్థులు కేవలం 3 వేల లోపు ఓట్లు పొంది చతికిల పడ్డారు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోవడంతో 769 మంది ఓటర్లు నోటా ఓటు వేశారు. తొలి ప్రయత్నంలోనే ఓటర్లు నోటా ఓటును సద్వినియోగం చేసుకున్నారు.
ఓటర్ల విలక్షణ తీర్పు
నియోజకవర్గంలో ఈ దఫా ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. తొలి పర్యాయం మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలో ఓటర్లు హంగుకు అవకాశం కల్పించారు. కాంగ్రెస్ అభ్యర్థులను 14 వార్డుల్లో గెలిపించగా, టీఆర్‌ఎస్ అభ్యర్థులు 10 వార్డుల్లో, 5 వార్డుల్లో టీడీపీ, 2 వార్డుల్లో సీపీఐ అభ్యర్థులు, 03 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులను గెలిపించారు. సంపూర్ణ మెజార్టీ ఏ రాాజకీయ పార్టీకి కట్టబెట్టలేదు. దీంతో హంగ్ ఏర్పడింది. స్వతంత్ర, సీపీఐ అభ్యర్థుల మద్దతుతో మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ యత్నాలు చేస్తోంది. రెండో దఫా జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటర్లు మార్పును కోరుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయానికి దోహదపడ్డారు.
నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 47 ఎంపీటీసీ స్థానాలకు గాను 26 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా 20 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థిని ఓటర్లు గెలిపించారు. 6 జెడ్పీటీసీ స్థానాలకు గాను బెల్లంపల్లి, వేమనపల్లి మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పట్టం కట్టిన ఓటర్లు, తాండూర్, నెన్నెల, భీమిని, కాసిపేట మండలాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు విజయం చేకూర్చిపెట్టారు. ఈ రకంగా ఓటర్లు ఎన్నికల్లో అనూహ్యమైన తీర్పు ఇచ్చి పరిశీలకుల అంచనాను తారుమారు చేశారు. తమదైన శైలిలో తీర్పు ఇచ్చి రాజకీయ విశ్లేషకులను అయోమయానికి గురి చేశారు.
‘నోటా’కు ఓటర్ల స్పందన
Published Mon, May 19 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 7:31 AM
Advertisement
Advertisement