తాండూరు టౌన్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో తాండూరు పట్టణంలో 59.3 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఊహించని రీతిలో పట్టణవాసులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మార్చి 30న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లతో పోలిస్తే ఓటింగ్ శాతంత క్కువగా నమోదైంది. తాండూరు నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి 9 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 52 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 52,962. వీరిలో 26,920 పురుషులు కాగా, 26,042 మహిళా ఓటర్లు ఉన్నారు. పట్టణంలో 31,430 మంది ఓటు వేయగా, పోలింగ్ శాతం 59.3 నమోదైంది. వీరిలో 16,389 మంది పురుషులు, 15,041 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే 60.8 శాతం పురుషులు, 57.7 శాతం మంది మహిళలు ఓటు వేశారు. తాండూరు నియోజకవర్గంలో సుమారు 71 శాతం పోలింగ్ నమోదు కాగా పట్టణంలో కేవలం 59.3 శాతం మాత్రమే నమోదైంది.
మున్సిపల్ ఎన్నికల కన్నా తక్కువ పోలింగ్
మార్చి 30న జరిగిన పట్టణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకున్న వారితో పోలిస్తే ఈ ఎన్నికల్లో తక్కువ పోలింగ్ జరిగింది. నాటి ఎన్నికల సందర్భంగా 74.4 శాతం మంది పట్టణ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో కేవలం కేవలం 59.3 శాతంగానే నమోదైంది. మున్సిపల్ ఎన్నికల్లో వివిధ వార్డుల్లో నివసించే ఓటర్లు ఎంత దూరంలో ఉన్నా అక్కడ పోటీచేసిన వార్డు సభ్యులు వారిని సొంత ఖర్చులతో రప్పించుకుని ఓటు వేయించుకున్నారు. నెలరోజుల క్రితమే తాండూరుకు వచ్చి వెళ్లిన సదరు ఓటర్లు మళ్లీ వచ్చి ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి నిరాసక్తత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
నియోజకవర్గంలోని పెద్దేముల్, తాండూరు, యాలాల, బషీరాబాద్ మండలాల్లో ఏదో ఒక పార్టీ అధిక మొత్తంలో ఓట్లను చేజిక్కించుకుంటే ఆ అభ్యర్థి విజయం నల్లేరుపై నడకే అని చెప్పవచ్చు. ఒకవేళ ప్రధాన పార్టీలు కొద్దిపాటి తేడాతో ఓట్లను చేజిక్కించుకుంటే మాత్రం వారు తప్పకుండా పట్టణ ఓటర్లపై ఆధారపడాల్సి ఉంటుంది. ఏదేమెనా తుది తీర్పు మాత్రం పట్టణ వాసులదే అని చెప్పవచ్చు.
తాండూరులో తగ్గిన పోలింగ్
Published Fri, May 2 2014 11:59 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement