Percent of the voting
-
Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
సార్వత్రిక సమరంలో ఎన్నికల ‘వేడి’ పరాకాష్టకు చేరుతోంది. ఇప్పటికే 3 విడతల్లో పోలింగ్ పూర్తికాగా, మరో నాలుగు విడతలు మిగిలి ఉన్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే, ఈసారి తొలి మూడు విడతల్లో పోలింగ్ తగ్గడం అటు పారీ్టలతో పాటు ఎన్నికల సంఘాన్ని కూడా కలవరపెడుతోంది. మండుటెండలు, పట్టణ ఓటర్ల నిరాసక్తత వంటివి ఇందుకు కారణమని రాజకీయ వర్గాలు విశ్లేíÙస్తున్నాయి. అయితే ఓట్ల శాతం తగ్గినా, పోలైన మొత్తం ఓట్ల సంఖ్య మాత్రం 2019తో పోలిస్తే ఎక్కువగానే ఉందని ఎస్బీఐ రీసెర్చ్ విశ్లేషకులు వెల్లడించారు. అంతేగాక రానున్న విడతల్లో పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని వారంటున్నారు. 2019లో తొలి దశలో 69.4 శాతం, రెండో దశలో 69.3 శాతం, మూడో దశలో 67.3 శాతం చొప్పన ఓటింగ్ నమోదైంది. ఈసారి మొదటి విడతలో 66.1 శాతం, రెండో దశలో 66.7 శాతం, మూడో విడత 65.7 శాతం ఓటింగ్ జరిగింది. శాతాల్లో చూస్తే 2019 కంటే తగ్గినట్టు కన్పిస్తున్నా వాస్తావానికి తొలి రెండు దశల్లో పోలైన ఓట్ల సంఖ్యలో 8.7 లక్షలు పెరుగుదల నమోదైంది. 2019లో తొలి రెండు విడతల్లో 20.61 కోట్ల మంది ఓటేయగా, 2024లో 20.7 కోట్లకు పెరిగింది. పెరిగిన ఓట్లలో మహిళ సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో ఓట్లు పెరగడం మరో కీలకాంశం. రాష్ట్రాల్లో ఇలా... రాష్ట్రాల విషయానికొస్తే ఈసారి తొలి రెండు దశల్లో కర్నాటకలో 12.9 లక్షల ఓట్లు అధికంగా పడ్డాయి. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ పోలింగ్ ఏడు విడతల్లో జరిగింది. తొలి మూడు విడతల్లో ఓటింగ్ అధికంగా నమోదై ఆ తర్వాత విడతల్లో తగ్గింది. ఈసారి అందుకు భిన్నంగా తొలి మూడు విడతల్లో పోలింగ్ తగ్గింది. కనుక మిగతా నాలుగు విడతల్లో పోలింగ్ భారీగా పుంజుకుంటేనే కనీసం గత ఎన్నికల స్థాయిని అందుకోగలుగుతుంది. అయితే 2019లో మొత్తం ఓటర్ల సంఖ్య 91.2 కోట్లు కాగా 2024లో 96.9 కోట్లకు పెరిగింది. అందుకే ఈసారి ఓటింగ్ తొలి మూడు విడతల్లో శాతాల్లో తగ్గినా సంఖ్యపరంగా పెరిగిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘గుర్తింపు’ కార్డేనా!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఈసారి సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో జిల్లా గతంలో ఎన్నడూ లేనంతగా అధమ రికార్డును సొంతం చేసుకుంది. విద్యావంతులు, మేధావులు, ఉన్నతవర్గాలు ఓటుహక్కు వినియోగంలో నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అధికారులు, ఎన్నికల సంఘం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటుహక్కుపై జిల్లావాసుల్లో స్పందన ఆశించినంతగా కనిపించ లేదు. జిల్లాలో పోలింగ్ శాతాన్ని పెంచాలని అధికారులు చేసిన కృషి నిష్ఫలమైంది. ఎవరెంత చెప్పినా తామింతే అని జిల్లా ఓటర్లు మరోసారి రుజువు చేశారు. ఓటరు కార్డును కేవలం గుర్తింపు పత్రంగానే భావిస్తున్నారు తప్ప దాని ప్రయోజనాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. గతం కంటే భారీ సంఖ్యలో కొత్త ఓటర్లు జాబితాలో పేరు నమోదు చేసుకుని ఫొటో గుర్తింపు కార్డు కూడా పొందారు. కానీ వారిలో అధిక శాతం మంది ఓటింగ్‌లో పాల్గొనకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు. అటు పురుషులది, ఇటు మహిళలదీ ఇదే పరిస్థితి. దేశవ్యాప్తంగా ఓటు చైతన్యం వెల్లివిరిసినా జిల్లాలో ఓటింగ్ శాతం మాత్రం తీవ్ర నిరాశే మిగిల్చింది. ఇద్దరూ సమానం జిల్లాలో మొత్తం 53,48,927 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 28,65,211 మంది. ఇందులో 16,03,257 మంది ఓటేశారు. 24,83,110 మంది మహిళా ఓటర్లలో 13,89,340 మంది ఓటేశారు. మొత్తం కలిపి 29,92,597 మంది మాత్రమే ఈసారి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇక 606 మంది ఇతరుల్లో ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోలేదు. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, పరిగి నియోజకవర్గాల్లో ఈసారి మహిళలు స్వల్ప సంఖ్యలో పురుషుల కంటే అధికంగా ఓటు హక్కు వినియోగించుకోవడం గమనార్హం. ఈసారి ఎన్నికల్లో కుత్బుల్లాపూర్‌లో 48.24 శాతం మంది పురుషులు ఓటేయగా, మహిళలు 49.11 శాతం మహిళలు పోలింగ్‌లో పాల్గొన్నారు. కూకట్‌పల్లిలో 50.10 శాతం పురుషులు, 50.70 శాతం మహిళలు ఓటేశారు. ఎల్బీనగర్లో 46.93 మంది పురుషులు, 47.59 శాతం మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పరిగిలో 69.59 పురుషులు 72.16 శాతం మహిళలు ఓటును సద్వినియోగపరుచుకున్నారు. మిగిలిన అన్ని స్థానాల్లో మహిళల కంటే పురుషులే అత్యధికంగా ఓటేసినా జిల్లా వ్యాప్తంగా వచ్చేసరికి ఇరువురూ సమానంగా 55.95 శాతం ఓటేశారు. కాగా 2009 ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 40,18,140 మందిలో 23,37,163 మంది ఓటేశారు. మల్కాజిగిరి అధమం ఇక లోక్‌సభ స్థానాల పోలింగ్ విషయంలో మల్కాజిగిరి పరిధిలో రాష్ట్రంలోనే కనిష్ట ఓటింగ్ శాతం నమోదైంది. ఇక్కడ 51.19శాతం మందే మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. జనాభా పరం గా దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ స్థానమైన మల్కాజి గిరిలో పోలింగ్ శాతం ఇంత అధమంగా ఉండటం నిరాశ కలిగించేదే. మరో లోక్‌సభ స్థానం చేవెళ్లలో కాస్త మెరుగ్గా 60 శాతంపైగా పోలింగ్ నమోదైంది. -
తాండూరులో తగ్గిన పోలింగ్
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో తాండూరు పట్టణంలో 59.3 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఊహించని రీతిలో పట్టణవాసులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మార్చి 30న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లతో పోలిస్తే ఓటింగ్ శాతంత క్కువగా నమోదైంది. తాండూరు నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి 9 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 52 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 52,962. వీరిలో 26,920 పురుషులు కాగా, 26,042 మహిళా ఓటర్లు ఉన్నారు. పట్టణంలో 31,430 మంది ఓటు వేయగా, పోలింగ్ శాతం 59.3 నమోదైంది. వీరిలో 16,389 మంది పురుషులు, 15,041 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే 60.8 శాతం పురుషులు, 57.7 శాతం మంది మహిళలు ఓటు వేశారు. తాండూరు నియోజకవర్గంలో సుమారు 71 శాతం పోలింగ్ నమోదు కాగా పట్టణంలో కేవలం 59.3 శాతం మాత్రమే నమోదైంది. మున్సిపల్ ఎన్నికల కన్నా తక్కువ పోలింగ్ మార్చి 30న జరిగిన పట్టణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకున్న వారితో పోలిస్తే ఈ ఎన్నికల్లో తక్కువ పోలింగ్ జరిగింది. నాటి ఎన్నికల సందర్భంగా 74.4 శాతం మంది పట్టణ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో కేవలం కేవలం 59.3 శాతంగానే నమోదైంది. మున్సిపల్ ఎన్నికల్లో వివిధ వార్డుల్లో నివసించే ఓటర్లు ఎంత దూరంలో ఉన్నా అక్కడ పోటీచేసిన వార్డు సభ్యులు వారిని సొంత ఖర్చులతో రప్పించుకుని ఓటు వేయించుకున్నారు. నెలరోజుల క్రితమే తాండూరుకు వచ్చి వెళ్లిన సదరు ఓటర్లు మళ్లీ వచ్చి ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి నిరాసక్తత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గంలోని పెద్దేముల్, తాండూరు, యాలాల, బషీరాబాద్ మండలాల్లో ఏదో ఒక పార్టీ అధిక మొత్తంలో ఓట్లను చేజిక్కించుకుంటే ఆ అభ్యర్థి విజయం నల్లేరుపై నడకే అని చెప్పవచ్చు. ఒకవేళ ప్రధాన పార్టీలు కొద్దిపాటి తేడాతో ఓట్లను చేజిక్కించుకుంటే మాత్రం వారు తప్పకుండా పట్టణ ఓటర్లపై ఆధారపడాల్సి ఉంటుంది. ఏదేమెనా తుది తీర్పు మాత్రం పట్టణ వాసులదే అని చెప్పవచ్చు. -
భారీగా పెరిగిన పోలింగ్
12 శాతం అధికం పోటీ ముక్కోణమే బీజేపీ, ఆప్ మధ్య భారీ పోటీ ఓటుహక్కు వినియోగించుకున్న వీఐపీలు గుర్గావ్లో రిగ్గింగ్ జరిగిందని ఆప్ ఆరోపణ సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నెముక వంటి ఎన్నికల ప్రక్రియకు ఢిల్లీ ఓటర్లు గురువారం ఎంతో ఉత్సాహంగా స్పందించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుందన్న అభిప్రాయం కూడా ఈ ఎన్నికలతో తుడిచిపెట్టుకుపోయింది. ఉదయం ఏటింటి మొదలైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. రాష్ట్రంలోని 1.27 కోట్ల మందిలో 64 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన 52.3 శాతం కంటే ఇది 12 శాతం అధికం. 1971 లోక్‌సభ ఎన్నికల (71.3 శాతం) తరువాత అత్యధిక పోలింగ్ ఈసారే నమోదయింది. వికలాంగులు, వయోధికులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై ఓట్లేశారు. అన్ని పార్టీల అగ్ర నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు యథావిధిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎల్జీ సతీసమేతంగా ఓటింగ్‌కు హాజరయ్యారు. నగరవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఢిల్లీ ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. సాయంత్రం ఆరింటి వరకు 64 శాతం పోలింగ్ నమోదయినట్టు వెల్లడించారు. ఆ తరువాత కూడా కొన్ని ప్రాంతాల్లో ఓటింగ్ కొనసాగింది. గురువారం మధ్యాహ్నం మూడు గంటలకే పోలింగ్ శాతం 2009 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ శాతం 52.3ను అధిగమించింది. ఫలితంగా ఈ ఎన్నికలు రికార్డులను నమోదు చేశాయి. ఉదయం పోలింగ్ మొదలైన తరువాత నార్త్ ఈస్ట్ ఢిల్లీలో అత్యధికంగా ఓట్లు పడ్డాయి. ఏడింటికి మొదలైన పోలింగ్ ఉదయం సరిగ్గా ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమయింది. తొలుత రెండు మూడు గంటల వరకు పోలింగ్ మందకొడిగా సాగడంతో ఆందోళన వ్యక్తమయింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లలో కనిపించిన ఉత్సాహం ఈసారి మాయమైందా అన్న అనుమానం కూడా కలిగింది. తదనంతరం భారీగా ఓటింగ్ నమోదు కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మొదటి రెండు గంటల్లో 10.2 శాతం, మొదటి నాలుగు గంటల్లో 25 శాతం ఓటింగ్ నమోదయింది. మధ్యాహ్నం ఒంటి గంట కు 40 శాతం పోలింగ్ జరిగింది. మూడు గంటలకు 52 శాతానికి చేరింది. మధ్యాహ్నం వరకే ఓటింగ్ గత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌శాతాన్ని మించిపోయింది. సాయంత్రం ఐదు గంటలకు ఇది 60.1 శాతానికి చేరుకుంది. సాయంత్రం ఐదు గంటలకు చాందినీచౌక్‌లో 60 శాతం, ఈస్ట్ ఢిల్లీలో 61.2 శాతం, న్యూఢిల్లీలో 59.2 శాతం. నార్త్ వెస్ట్ ఢిల్లీలో 59.3 శాతం, నార్త్ ఈస్ట్ ఢిల్లీలో 63 శాతం, సౌత్ ఢిల్లీలో 57.2 శాతం, వెస్ట్ ఢిల్లీలో 61.1 శాతం ఓట్లు పడ్డాయి. ఆరు గంటలకు ఇది 64 శాతానికి ఎగబాకింది. పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు ప్రాధాన్యాల గురించి చర్చించుకోవడం కనిపించింది. పెచ్చరిల్లిన అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేశామని యువఓటర్లు చెప్పారు. మహిళా భద్రత తమకు అన్నింటి కన్నా ముఖ్యమని యువతులు అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల ఓటర్లు ముఖ్యంగా మహిళలు ధరలపెరుగుదల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ సిటిజన్లు మంచి ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. పార్టీలు.. బలాబలాలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ ఈసారి అత్యధిక స్థానాలు సాధిస్తామని ఘంటాపథంగా చెబుతోంది. నరేంద్ర మోడీ హవా, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలసి వస్తాయని విశ్వసిస్తోంది. ఆప్ కూడా విజయంపై ధీమాగా ఉంది. అవినీతిపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, యువ ఓటర్లు, మైనారిటీలు తమను గెలిపిస్తారని భావిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా గెలుపు కోసం విపరీతంగా శ్రమించారు. ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థుల్లో ముగ్గురు కేంద్రమంత్రులనే విషయం తెలిసిందే. ఘజియాబాద్‌లోనూ రికార్డు స్థాయిలో... ఘజియాబాద్‌లోనూ గురువారం రికార్డుస్థాయిలో పోలింగ్ నమోదైంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలిరావడంతో సాయంత్రం 6 గంటలవరకు 60 శాతం పోలింగ్ నమోదైందని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా వి.కె. సింగ్, కాంగ్రెస్ నుంచి రాజ్‌బబ్బర్, ఆప్ నుంచి షాజియా ఇల్మీ బరిలోకి దిగారు. గుర్గావ్లో 55 శాతం ఆప్ నేత యోగేంద్ర యాదవ్, బీజేపీ అభ్యర్థి ఇంద్రజీత్ సింగ్‌ల మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్నికల సమరంలో ఎవరు విజేతలో తేల్చేందుకు ఓటర్లు కూడా భారీగానే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఈ నియోజకవర్గంలో 55 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు.