
సార్వత్రిక సమరంలో ఎన్నికల ‘వేడి’ పరాకాష్టకు చేరుతోంది. ఇప్పటికే 3 విడతల్లో పోలింగ్ పూర్తికాగా, మరో నాలుగు విడతలు మిగిలి ఉన్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే, ఈసారి తొలి మూడు విడతల్లో పోలింగ్ తగ్గడం అటు పారీ్టలతో పాటు ఎన్నికల సంఘాన్ని కూడా కలవరపెడుతోంది. మండుటెండలు, పట్టణ ఓటర్ల నిరాసక్తత వంటివి ఇందుకు కారణమని రాజకీయ వర్గాలు విశ్లేíÙస్తున్నాయి.
అయితే ఓట్ల శాతం తగ్గినా, పోలైన మొత్తం ఓట్ల సంఖ్య మాత్రం 2019తో పోలిస్తే ఎక్కువగానే ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ విశ్లేషకులు వెల్లడించారు. అంతేగాక రానున్న విడతల్లో పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని వారంటున్నారు. 2019లో తొలి దశలో 69.4 శాతం, రెండో దశలో 69.3 శాతం, మూడో దశలో 67.3 శాతం చొప్పన ఓటింగ్ నమోదైంది.
ఈసారి మొదటి విడతలో 66.1 శాతం, రెండో దశలో 66.7 శాతం, మూడో విడత 65.7 శాతం ఓటింగ్ జరిగింది. శాతాల్లో చూస్తే 2019 కంటే తగ్గినట్టు కన్పిస్తున్నా వాస్తావానికి తొలి రెండు దశల్లో పోలైన ఓట్ల సంఖ్యలో 8.7 లక్షలు పెరుగుదల నమోదైంది. 2019లో తొలి రెండు విడతల్లో 20.61 కోట్ల మంది ఓటేయగా, 2024లో 20.7 కోట్లకు పెరిగింది. పెరిగిన ఓట్లలో మహిళ సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో ఓట్లు పెరగడం మరో కీలకాంశం.
రాష్ట్రాల్లో ఇలా...
రాష్ట్రాల విషయానికొస్తే ఈసారి తొలి రెండు దశల్లో కర్నాటకలో 12.9 లక్షల ఓట్లు అధికంగా పడ్డాయి. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ పోలింగ్ ఏడు విడతల్లో జరిగింది. తొలి మూడు విడతల్లో ఓటింగ్ అధికంగా నమోదై ఆ తర్వాత విడతల్లో తగ్గింది. ఈసారి అందుకు భిన్నంగా తొలి మూడు విడతల్లో పోలింగ్ తగ్గింది. కనుక మిగతా నాలుగు విడతల్లో పోలింగ్ భారీగా పుంజుకుంటేనే కనీసం గత ఎన్నికల స్థాయిని అందుకోగలుగుతుంది. అయితే 2019లో మొత్తం ఓటర్ల సంఖ్య 91.2 కోట్లు కాగా 2024లో 96.9 కోట్లకు పెరిగింది. అందుకే ఈసారి ఓటింగ్ తొలి మూడు విడతల్లో శాతాల్లో తగ్గినా సంఖ్యపరంగా పెరిగిందని పరిశీలకులు పేర్కొంటున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment