సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఈసారి సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో జిల్లా గతంలో ఎన్నడూ లేనంతగా అధమ రికార్డును సొంతం చేసుకుంది. విద్యావంతులు, మేధావులు, ఉన్నతవర్గాలు ఓటుహక్కు వినియోగంలో నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అధికారులు, ఎన్నికల సంఘం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటుహక్కుపై జిల్లావాసుల్లో స్పందన ఆశించినంతగా కనిపించ లేదు. జిల్లాలో పోలింగ్ శాతాన్ని పెంచాలని అధికారులు చేసిన కృషి నిష్ఫలమైంది. ఎవరెంత చెప్పినా తామింతే అని జిల్లా ఓటర్లు మరోసారి రుజువు చేశారు.
ఓటరు కార్డును కేవలం గుర్తింపు పత్రంగానే భావిస్తున్నారు తప్ప దాని ప్రయోజనాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. గతం కంటే భారీ సంఖ్యలో కొత్త ఓటర్లు జాబితాలో పేరు నమోదు చేసుకుని ఫొటో గుర్తింపు కార్డు కూడా పొందారు. కానీ వారిలో అధిక శాతం మంది ఓటింగ్‌లో పాల్గొనకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారు. అటు పురుషులది, ఇటు మహిళలదీ ఇదే పరిస్థితి. దేశవ్యాప్తంగా ఓటు చైతన్యం వెల్లివిరిసినా జిల్లాలో ఓటింగ్ శాతం మాత్రం తీవ్ర నిరాశే మిగిల్చింది.
ఇద్దరూ సమానం
జిల్లాలో మొత్తం 53,48,927 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 28,65,211 మంది. ఇందులో 16,03,257 మంది ఓటేశారు. 24,83,110 మంది మహిళా ఓటర్లలో 13,89,340 మంది ఓటేశారు. మొత్తం కలిపి 29,92,597 మంది మాత్రమే ఈసారి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇక 606 మంది ఇతరుల్లో ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోలేదు. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, ఎల్బీనగర్, పరిగి నియోజకవర్గాల్లో ఈసారి మహిళలు స్వల్ప సంఖ్యలో పురుషుల కంటే అధికంగా ఓటు హక్కు వినియోగించుకోవడం గమనార్హం. ఈసారి ఎన్నికల్లో కుత్బుల్లాపూర్‌లో 48.24 శాతం మంది పురుషులు ఓటేయగా, మహిళలు 49.11 శాతం మహిళలు పోలింగ్‌లో పాల్గొన్నారు. కూకట్‌పల్లిలో 50.10 శాతం పురుషులు, 50.70 శాతం మహిళలు ఓటేశారు.
ఎల్బీనగర్‌లో 46.93 మంది పురుషులు, 47.59 శాతం మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పరిగిలో 69.59 పురుషులు 72.16 శాతం మహిళలు ఓటును సద్వినియోగపరుచుకున్నారు. మిగిలిన అన్ని స్థానాల్లో మహిళల కంటే పురుషులే అత్యధికంగా ఓటేసినా జిల్లా వ్యాప్తంగా వచ్చేసరికి ఇరువురూ సమానంగా 55.95 శాతం ఓటేశారు. కాగా 2009 ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 40,18,140 మందిలో 23,37,163 మంది ఓటేశారు.
మల్కాజిగిరి అధమం
ఇక లోక్‌సభ స్థానాల పోలింగ్ విషయంలో మల్కాజిగిరి పరిధిలో రాష్ట్రంలోనే కనిష్ట ఓటింగ్ శాతం నమోదైంది. ఇక్కడ 51.19శాతం మందే మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. జనాభా పరం గా దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ స్థానమైన మల్కాజి గిరిలో పోలింగ్ శాతం ఇంత అధమంగా ఉండటం నిరాశ కలిగించేదే. మరో లోక్‌సభ స్థానం చేవెళ్లలో కాస్త మెరుగ్గా 60 శాతంపైగా పోలింగ్ నమోదైంది.
‘గుర్తింపు’ కార్డేనా!
Published Sun, May 4 2014 12:09 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement