బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : టీఆర్‌ఎస్ బెల్లంపల్లిశాఖలో ముసలం పుట్టింది. మున్సిపల్ ఎన్నికలతో అంతర్లీనంగా పొడచూపిన విభేదాలు సార్వత్రిక ఎన్నికలతో బహిర్గతమయ్యాయి. ఈసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బల్దియాలోని 29 వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరికి పోటీగా పలు వార్డుల్లో రెబల్స్ బరిలో నిలిచారు. వీరిని కట్టడి చేయకుండా తమను ఓడించాలనే ఉద్దేశంతోనే రెబల్స్‌ను పోటీకి దింపినట్లు రెండు వర్గాల నాయకులు ఎవరికి వారు అపోహపడ్డారు. ఆరోపణలు చేసుకున్నారు.
ఈ ఎన్నికల్లో ముఖ్య నేతలు వార్డుల్లో ప్రచారం చేయలేదు. సమష్టిగా ఎన్నికలను ఎదుర్కోవడంలో, కార్యకర్తలను సమాయత్తపర్చడంలో ముఖ్య నేతలు విఫలమయ్యారు. పెపైచ్చు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన కార్యకర్తలకు టికెట్ ఇవ్వకుండా ఓ ముఖ్య నేత అమ్ముకున్నట్లు ఓ వర్గం నాయకుడు ఆరోపిస్తుండగా.. రెబల్ అభ్యర్థులను పోటీకి నిలిపి అధికారిక అభ్యర్థులను ఓడించడానికి ప్రత్యర్థి వర్గం నాయకుడు కుట్ర పన్నాడని మరో వర్గం నాయకుడు ఆరోపణలు గుప్పిస్తున్నాడు.
అసెంబ్లీ ఎన్నికల్లో..
మున్సిపల్ ఎన్నికల నాటికి నేతల మధ్య గుట్టుగా ఉన్న వైరుధ్యాలు సార్వత్రిక ఎన్నికలతో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు ముఖ్య నాయకులు కార్యకర్తల సమక్షంలోనే గొడవ పడ్డారు. ఆ గొడవ చిలికిచిలికి గాలివానగా మారి తీవ్ర స్థాయికి చేరింది. ఎన్నికల్లో వచ్చిన నిధులు రూ.10 లక్షలు ఓ నేత స్వాహా చేసినట్లు ఆరోపిస్తుండగా.. మరో నేత ఇతర పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేయించాడని ఒకరిపై మరొకరు దుమ్మేత్తిపోసుకున్నారు. ఇలా ఇరువురు నేతలు బహిరంగంగా ఆరోపణలు చేసుకోవడం టీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతోంది.
పట్టించుకోని అధిష్టానం
టీఆర్‌ఎస్ ముఖ్య నేతల మధ్య ఏర్పడిన విభేదాలు పతాకస్థాయికి చేరుకున్నా అధిష్టానం మాత్రం పట్టించుకోవడంలేదు. నాయకుల మధ్య పొడచూపిన మనస్పర్ధలను పరిష్కరించి ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడేలా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తోంది. ఇప్పటికే ముఖ్య నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఇరువురు నేతల మధ్య ఆధిపత్య పోరు నువ్వా, నేనా అనే రీతిలో సాగుతోంది. తెలంగాణ పునఃనిర్మాణంలో చిత్తశుద్ధితో కలిసికట్టుగా పనిచేయాల్సిన టీఆర్‌ఎస్ నేతలు వ్యక్తిగత విమర్శలతో పార్టీ పరువును బజారుకు ఈడ్చడంపై గులాబీ తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధిష్టానం స్పందించాలని కోరుతున్నారు.
టీఆర్‌ఎస్‌లో అంతర్యుద్ధం
Published Tue, May 6 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM
Advertisement