మినీ మున్సిపోల్స్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపు గుర్రాల వేట | Hunting For Trs Winning Candidates In Mini Municipal Elections | Sakshi
Sakshi News home page

మినీ మున్సిపోల్స్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపు గుర్రాల వేట

Published Sun, Apr 18 2021 2:27 AM | Last Updated on Sun, Apr 18 2021 2:28 AM

Hunting For Trs Winning Candidates In Mini Municipal Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లతోపాటు మరో ఐదు మున్సిపాలిటీల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ముగియనుండటంతో అభ్యర్థుల ఎంపిక కసరత్తును టీఆర్‌ఎస్‌ ముమ్మరం చేసింది. వరంగల్‌లో 66, ఖమ్మంలో 60 డివిజన్లకు ఎన్నికలు జరుగుతుండగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గెలుపు గుర్రాలనే ఎంపిక చేయాలని పార్టీ ఆదేశించింది. దీంతో కార్పొరేషన్ల డివిజన్లు, మున్సిపల్‌ వార్డులవారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా పార్టీ తరఫున బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే చాలా చోట్ల ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో అభ్యర్థుల ఎంపిక మంత్రులు, ఎమ్మెల్యేలకు తలకు మించిన భారంగా తయారైంది.

ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండగా ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటల వరకు బీ ఫారాలు సమర్పించేందుకు అవకాశం ఉంది. దీంతో ఏకాభిప్రాయం కుదిరిన డివిజన్లు, వార్డుల్లో పార్టీ అభ్యర్థుల జాబితాను ఆదివారం సాయంత్రంలోగా విడుదల చేసి ఏకాభిప్రాయం కుదరని ఒకటీ అరా స్థానాల్లో 22లోగా బలమైన అభ్యర్థులను గుర్తించి బీ ఫారాలు ఇవ్వాలని పార్టీ ఆదేశించింది. జీహెచ్‌ంఎసీ ఎన్నికల్లో వ్యతిరేకత ఉన్న చోట కూడా సిట్టింగ్‌ కార్పొరేటర్ల ఒత్తిళ్లకు తలొగ్గి మళ్లీ టికెట్లు ఇవ్వడం నష్టం చేసిందని పార్టీ గుర్తించింది. దీంతో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఒత్తిళ్లకు లొంగకుండా అభ్యర్థులను ఎంపిక చేయాలని స్పష్టం చేసింది.

మున్సిపల్‌ కార్పొరేషన్లకు పార్టీ ఇన్‌చార్జీలు..
ఎన్నికలు జరుగుతున్న రెండు మున్సిపల్‌ కార్పొరేషన్లలోనూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను సమన్వయం చేసేందుకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇన్‌చార్జీలను నియమించారు. వరంగల్‌ కార్పొరేషన్‌లో టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్, ఖమ్మం కార్పొరేషన్‌కు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇన్‌చార్జీలుగా వ్యవహరించనుననారు. వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, పరకాల, స్టేషన్‌ ఘన్‌పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో వరంగల్‌ కార్పొరేషన్‌ విస్తరించి ఉండగా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ విస్తరించి ఉంది.

దీంతో సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలను సమన్వయం చేయడంలో పార్టీ ఇన్‌చార్జీలు కీలకంగా వ్యవహరించనున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు స్థానికంగా ఉండి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితిపై ఇన్‌చార్జీలు నివేదికలు సమర్పించనున్నారు. వరంగల్‌లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఖమ్మంలో పువ్వాడ అజయ్‌ అభ్యర్థుల ఎంపికతోపాటు ప్రచారం తదితరాలను సమన్వయం చేయనున్నారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు ఒంటి చేత్తో అభ్యర్థుల ఎంపిక, ప్రచారం నిర్వహిస్తుండగా కొత్తూరులో వి.శ్రీనివాస్‌గౌడ్, అచ్చంపేటలో నిరంజన్‌రెడ్డి, నకిరేకల్‌లో జగదీశ్‌రెడ్డి, జడ్చర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పార్టీ ఎన్నికల బాధ్యతలు చేపట్టారు.

టికెట్ల కోసం పోటెత్తుతున్న అభ్యర్థులు...
మున్సిపల్‌ డివిజన్లు, వార్డుల్లో టికెట్ల కోసం ఆశావహులు పోటెత్తుతుండటంతో అభ్యర్థుల ఎంపిక క్లిష్టంగా మారింది. ఒక్కో డివిజన్, వార్డులో సగటున నలుగురు చొప్పున పోటీ పడుతుండటంతో ఏకాభిప్రాయం కుదరడం లేదు. శనివారం సాయంత్రం వరకు 43 వార్డులున్న సిద్దిపేట మున్సిపాలిటీలో రెండు విడతల్లో 12 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు.

మిగతా మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో ఒక్క అభ్యర్థి పేరునూ ప్రకటించకపోవడం ఆశావహుల నడుమ టికెట్ల కోసం నెలకొన్న పోటీకి అద్దం పడుతోంది. ఆదివారం మధ్యాహ్నంలోగా 80 శాతానికిపైగా అభ్యర్థులు ఖరారయ్యే అవకాశముందని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. వరంగల్‌ కార్పొరేషన్‌ మినహా మిగతా చోట్ల బీజేపీతో పెద్దగా పోటీ ఉండక పోవచ్చనే అంచనాకు వచ్చిన టీఆర్‌ఎస్‌... ఉమ్మడి వరంగల్‌ జిల్లాతోపాటు పొరుగునే ఉన్న కరీంనగర్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ముఖ్య ప్రజాప్రతినిధులకు డివిజన్లవారీగా ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. 

చదవండి: అందని ఆక్సిజన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement