సాక్షి, హైదరాబాద్: ఈ నెల 30న ఎన్నికలు జరగనున్న రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలతోపాటు ఇతర వార్డు సభ్యుల ఎన్నికలకు కాంగ్రెస్ వడివడిగా సిద్ధమవుతోంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, పోలింగ్‌కు చాలా తక్కువ సమ యం ఉండటంతో ఆగమేఘాల మీద పార్టీ యంత్రాంగం ఎన్నికల్లో నిమగ్నమవ్వాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు ఎన్నికల కమిటీలను నియమించారు. ఈ కమిటీలకే పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు.
అభ్యర్థుల ఖరారుతోపాటు స్థానిక పరిస్థితులను బట్టి ఇతర పార్టీలతో పొత్తులు కుదుర్చుకొనే విషయంలో నిర్ణయం తీసుకొనే అధికారాన్ని కూడా వారికే కట్టబెట్టారు. వరంగల్‌కు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఖమ్మంకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లను కమిటీల కన్వీనర్లుగా నియమించగా మిగిలిన మున్సిపాలిటీల్లోనూ స్థానిక నాయకత్వాలకే బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ముగిసిన నేపథ్యంలో పార్టీ యంత్రాంగమంతా మున్సిపోల్స్‌పై దృష్టి పెట్టాలని, ఈ ఎన్నికలు ముగిసే వరకు అక్కడే మకాం వేయాలని పార్టీ నేతలను ఉత్తమ్ ఆదేశించారు.
రెండు కార్పొరేషన్ల కమిటీలివే...
వరంగల్ కమిటీకి ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డిని కన్వీనర్‌గా నియమించగా, కో–కన్వీనర్‌గా ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును నియమించారు. ఇక కమిటీ సభ్యులుగా డీసీసీ అధ్యక్షుడు ఎన్. రాజేందర్‌రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ ఎస్. రాజయ్య, వరంగల్ నగర మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, పరకాల ఇన్‌చార్జి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నామిండ్ల శ్రీనివాస్, కట్ల శ్రీనివాస్‌లను సభ్యులుగా నియమించారు.
వరంగల్ నగరపాలక సంస్థలో ప్రస్తుతం సిట్టింగ్ కార్పొరేటర్లుగా ఉన్న వారిని కమిటీ ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నియమించారు. ఇక ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల కమిటీ కన్వీనర్‌గా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు బాధ్యతలు అప్పగించారు. కమిటీ సభ్యులుగా డీసీసీ అధ్యక్షుడు పి. దుర్గాప్రసాద్, సభ్యులుగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రులు రేణుకా చౌదరి, బలరాం నాయక్, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు జావెద్ అహ్మద్, వర్కింగ్ ప్రెసిడెంట్ దీపక్ చౌదరి, పార్టీ నేతలు పరుచూరి మురళీకృష్ణ, పుచ్చకాయల వీరభద్రం, జాముల శరత్‌కుమార్‌రెడ్డి, పి. రాధాకృష్ణ, కొత్త సీతారాములను నియమించారు. ఇక్కడ కూడా సిట్టింగ్ కార్పొరేటర్లు కమిటీ ఎక్స్‌అఫీషియో సభ్యులుగా వ్యవహరించనున్నారు.
బీ–ఫారాలు ఎన్నికల అధికారికే
పార్టీ అభ్యర్థులుగా ఈ రెండు కార్పొరేషన్లలో పోటీ చేయనున్న అభ్యర్థులను నేడు ఖరారు చేయనున్నారు. ఆయా డీసీసీ కార్యాలయాల్లో ఎన్నికల కమిటీలు సమావేశమై అభ్యర్థులను నిర్ణయిస్తాయి. అయితే అభ్యర్థుల బీ–ఫారాలను మాత్రం వరంగల్‌లో పీసీసీ పరిశీలకుడి ద్వారా, ఖమ్మంలో నగర పార్టీ అధ్యక్షుడి ద్వారా నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన 22న నేరుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నారు.
సిద్దిపేట, నకిరేకల్, కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీల్లోనూ స్థానిక నాయకత్వాలకే అభ్యర్థుల ఖరారు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తమ్ వెల్లడించారు. స్థానిక నాయకులందరూ కలసి అభ్యర్థులను నిర్ణయిస్తారని, వారే ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభ్యర్థులను గెలిపించే బాధ్యతలు తీసుకుంటారని తెలిపారు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లలోనూ ప్రచార బాధ్యతలను ఎన్నికల కమిటీలకే అప్పగిస్తూ ఉత్తమ్ శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment