బెల్లంపల్లి : బెల్ట్‌షాపులు మళ్లీ పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వం నిషేధించినా కొందరు మద్యం వ్యాపారులు ప్రోత్సహిస్తున్నారు. మద్యం వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి జోరుగా బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు. దసరా పండుగను పురస్కరించుకొని బెల్ట్‌షాపులు ఇబ్బడిముబ్బడిగా
ఏర్పాటవుతున్నా ఆబ్కారీ, ప్రొహిబిషన్ శాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు.
బెల్ట్‌షాపులను రద్దు చేసిన ప్రభుత్వం ప్రతి మద్యం దుకాణానికి అనుబంధంగా పర్మిట్ రూంను అనుమతించింది. రూ.2 లక్షలు చొప్పున చెల్లించి వ్యాపారులు పర్మిట్ రూంను ఏర్పాటు చేసుకున్నారు. అయినా కొందరు వ్యాపారులు చాటుమాటుగా బెల్ట్‌షాపులను నిర్వహిస్తున్నారు. వీటి ద్వారానే బస్తీలు, గ్రామీణ ప్రాంతాలలో మద్యం వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. దసరా పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున వ్యాపారం సాగించేందుకు బెల్ట్‌షాపులకు భారీగా మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఎమ్మార్పీ ధర కన్న అధికంగా బెల్ట్‌షాపుల్లో వసూళ్లు చేసి అక్రమ దందా నిర్వహిస్తున్నారు.
దసరా వేదికగా..
దసరా పండుగ వేదికగా బెల్ట్‌షాపులలో పెద్ద ఎత్తున మద్యాన్ని నిల్వ ఉంచారు. ముందస్తు వ్యూహంగా వ్యాపారులు కొందరు మద్యం స్టాక్ ఉంచి కొన్ని రోజుల నుంచి అమ్మకాలు సాగిస్తున్నారు. తూర్పు ప్రాంతంలోని మంచిర్యాల, మందమర్రి, చెన్నూర్, జైపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి, బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్, రెబ్బెన, ఆసిఫాబాద్, వాంకిడి, కాగజ్‌నగర్, సిర్పూర్(టీ) తదితర ప్రధాన పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్‌షాపుల నిర్వహణ గుట్టుగా జరుగుతోంది.
మద్యం అధికంగా అమ్మకాలు జరిపే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని బెల్ట్‌షాపులను నిర్వహిస్తున్నారు. దసరా పండుగ తూర్పు ప్రాంతంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. పండుగకు ముందు మద్యం భారీ ఎత్తున కొనుగోళ్లు జరుగుతాయి. ఈ పండుగ రాక కోసమే ఏడాదిపాటున మద్యం వ్యాపారులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం ఆ సమయం ఆసన్నం కావడంతో ఏ మాత్రం ఆలస్యం లేకుండా మూసివేసిన బెల్ట్‌షాపుల తలుపులు తెరుస్తున్నారు.
రోజు బెల్ట్‌షాపులకే అత్యధికంగా మద్యం షాపుల నుంచి సరుకు సరఫరా జరుగుతోంది. రోజుకు సుమారు రూ.అర కోటి వరకు బెల్ట్‌షాపుల్లోనే మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ఓ అంచనా. ఆ ప్రకారంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కొన్నేళ్ల నుంచి మద్యం వ్యాపారంలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు బెల్ట్‌షాపులను ముందుండి నడుపుతున్నట్లు తెలుస్తోంది. మరో పక్క మద్యం కల్తీ కాకుండా బార్‌కోడ్ విధానంతో స్కానింగ్ చేసి మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం ఆదే శించిన ఎక్సైజ్ అధికారుల నిర్లిప్తతతో అమలు జరగడం లేదు. ఆ పద్ధతి అమలు కాకపోవడంతో వ్యాపారులు మద్యాన్ని కల్తీ చేసి అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
పట్టింపులేని అధికారులు
మద్యం షాపుల నుంచి బెల్ట్‌షాపులకు అక్రమంగా మద్యం సరఫరా అవుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. వ్యాపారులు సాగిస్తున్న అక్రమ దందాను నిరోధించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం బెల్ట్‌షాపులను రద్దు చేసిన క్షేత్ర స్థాయిలో మాత్రం కొనసాగడం ఎక్సైజ్ అధికారుల నిర్లిప్తతకు అద్దం పడుతోంది.
ఇప్పటికైనా బెల్ట్‌షాపులను రద్దు చేయించి అక్రమ మద్యం అమ్మకాలను ఆపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై బెల్లంపల్లి ఎక్సైజ్ సీఐ నరేందర్‌రెడ్డిని ఫోన్‌లో వివరణ కోరగా బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. ఎక్కడైనా బెల్ట్‌షాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
దసరా ధమాకా
Published Thu, Oct 2 2014 1:39 AM | Last Updated on Fri, Aug 17 2018 7:51 PM
Advertisement
Advertisement