ఊరిలో బార్... దారిలో బెల్ట్!
⇔ రేపటి నుంచి నూతన మద్యం పాలసీ అమలు
⇔ జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలోనే దుకాణాలు
⇔ కొత్త షాపులు, బార్ల ఏర్పాటులో వ్యాపారులు బిజీ
⇔ హైవే పక్కన ఇక బెల్టు షాపులు !
⇔ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న వ్యాపారులు
⇔ ఇళ్ల మధ్య మద్యం షాపులు పెట్టవద్దని ఫిర్యాదుల వెల్లువ
మచిలీపట్నం : ఇప్పటి వరకు బెల్ట్ షాపులు గ్రామాల్లో ఇళ్ల మధ్య ఉండేవి. గుట్టుగా మద్యం విక్రయించేవారు. బార్ అండ్ రెస్టారెంట్లు ఊరికి దూరంగా... రహదారులకు దగ్గరగా ఉండేవి. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారనుంది. గుడి, బడి, నివాసాల సమీపానికి మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు రానున్నాయి. యథేచ్ఛగా మద్యం విక్రయించనున్నారు. బెల్ట్ షాపులు మాత్రం ఇళ్లకు దూరంగా.. రహదారులకు దగ్గరగా చేరనున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జూలై ఒకటో తేదీ నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులకు 500మీటర్ల దూరంలో మద్యం, బార్ అండ్ రెస్టారెంట్లను ఏర్పాటు చేయాల్సి ఉండటమే ఇందుకు కారణం. రహదారులకు దూరంగా బార్లు, మద్యం షాపులు పెడితే వ్యాపారం తగ్గిపోతుందని భావించిన వ్యాపారులు... కొత్త పాలసీ ప్రకారం షాపులు, బార్లు ఏర్పాటు చేస్తూనే, పాత వాటిని బెల్ట్ షాపులుగా కొనసాగించాలని పథకం రచించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఒక్కరోజే గడువు ...
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మద్యం, బార్ అండ్ రెస్టారెంట్లను రహదారులకు దూరంగా మార్చేందుకు ఒక్క రోజే సమయం ఉంది. ఈ క్రమంలో మూడు నెలలు గడువు ఇవ్వాలని మద్యం వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో నూతన ఎక్సైజ్ పాలసీ–2017 ప్రకారం రెన్యూవల్ కోసం దరఖాస్తు కూడా చేయలేదు. అయితే, వ్యాపారుల అప్పీలును హైకోర్టు గురువారం ఉదయం తిరస్కరించింది.
మరోవైపు నూతన ఎక్సైజ్ పాలసీ–2017 ప్రకారం రెన్యూవల్, కొత్త వాటికి లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా గురువారం సాయంత్రం 5 గంటలకు వరకు మాత్రమే గడువు ఉంది. దీంతో బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు హడావుడిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 25, విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 126 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటన్నింటికి రెన్యూవల్, లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు రావడంతో వాటి పరిశీలనను మచిలీపట్నం, విజయవాడ ఎక్సైజ్ ఈఎస్‌లు పూర్తి చేశారు.
వ్యూహాత్మకంగా...
జాతీయ, రాష్ట్ర రహదారులకు ఇరువైపులా 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను ఏర్పాటు చేయాల్సి రావడంతో ఆ పనిలో వ్యాపారులు బిజీగా ఉన్నారు. విజయవాడలో అత్యధికంగా బార్ అండ్ రెస్టారెంట్లు ఉండటంతో వీటిని ఎక్కడకు తరలించాలి, ఎక్కడ మద్యం విక్రయాలు చేయాలి.. అనే అంశాలపై మల్లగుల్లాలు పడుతున్నారు. బార్ అండ్ రెస్టారెంట్లకు పెద్ద భవనం కావాల్సి ఉండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి.
గృహాల మధ్యలో మద్యం దుకాణాలా...
నూతన నిబంధనల ప్రకారం జిల్లాలోని 343 మద్యం దుకాణాల్లో అధిక శాతం ఇళ్ల మధ్యనే ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. విజయవాడ ఈఎస్ పరిధిలో 168, మచిలీపట్నం ఈఎస్ పరిధిలో 175 షాపులు ఉన్నాయి. వీటిని గృహాల మధ్య ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుండటంతో ఎక్సైజ్ అధికారులకు స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదు వస్తున్నాయి. మొవ్వ మండలం పెదపూడి గ్రామంలో ఇళ్లు, అంగన్‌వాడీ, రామాలయం దగ్గరలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్నారని మచిలీపట్నం ఎక్సైజ్ ఈఎస్‌కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ప్రజలు ఫిర్యా దు చేస్తే ఇళ్ల మధ్య మద్యం దుకా ణాలను తొలగిస్తామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.