బెల్టు తీసి.. టోపీ పెడతాం..! | Suspicions on government liquor policy | Sakshi
Sakshi News home page

బెల్టు తీసి.. టోపీ పెడతాం..!

Published Thu, Jul 20 2017 12:48 AM | Last Updated on Fri, Aug 17 2018 7:51 PM

బెల్టు తీసి.. టోపీ పెడతాం..! - Sakshi

బెల్టు తీసి.. టోపీ పెడతాం..!

సర్కారు మద్యం పాలసీపై అనుమానాలు
- కొసరు తొలగింపు.. అసలు పెంపు!
బెల్టు షాపుల తొలగింపు నిర్ణయం ప్రచారం కోసమే!
రాష్ట్రంలో 40 వేలకు పైగానే బెల్టు షాపులు 
బాబు సీఎం అయ్యాక బెల్టు షాపులు రద్దు చేస్తూ నాలుగో సంతకం 
మూడేళ్లుగా వీటిపై ఒక్కసారి కూడా సమీక్షించిన దాఖలాలే లేవు
తాజాగా ప్రతిపక్ష నేత ప్రకటనతో మరోసారి రద్దు ఉత్తర్వులు
 
సాక్షి, అమరావతి : డోర్‌ డెలివరీ అంటూ ఇన్నాళ్లూ రాష్ట్రంలో మద్యం వరద పారించిన సర్కారు.. ఇప్పుడు బెల్టు షాపుల రద్దుకు డ్వాక్రా మహిళలు, ఎన్జీవోల సాయం కోరడంపై అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఓ వైపు అసలు షాపులను వదిలేసి కొసరు షాపుల రద్దు అంశాన్ని మాత్రమే తెరపైకి తేవడం.. మరో వైపు మద్యం దుకాణాలు, బార్‌ల సంఖ్యను పెంచేస్తుండటం ఈ అనుమానాలకు తావిస్తోంది. మహిళల నుంచి నిరసనలు వెల్లువెత్తడం.. తాము అధికారంలోకి రాగానే దశల వారీగా మద్య నిషేధం విధిస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు సర్కారు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.

ఇందులో భాగంగా బెల్టు షాపులను ఎత్తేస్తామని ప్రకటించింది. వాస్తవానికి చంద్రబాబు సీఎంగా మూడేళ్ల క్రితం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో బెల్టు షాపులు రద్దు చేస్తున్నట్లు ఫైలుపై సంతకం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బెల్టు షాపుల గురించి, వాటి పరిస్థితిపై ఎన్నడూ సమీక్ష చేసిన పాపాన పోలేదు. 2014 జూన్‌ 8న బెల్టు షాపుల రద్దుపై జీవో 263 జారీ చేసి చేతులు దులుపుకున్నారే తప్ప ఏ చర్యలూ తీసుకోలేదు. ప్రజా వ్యతిరేకత నుంచి బయట పడేందుకోసమని తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న సీఎం చంద్రబాబు బెల్టు షాపుల్ని రద్దు చేయాలని ఆదేశించారని, ఈ మేరకు 18వ తేదీన కేబినెట్‌ నిర్ణయించిందని ఎక్సైజ్‌ కమిషనర్‌ లక్ష్మీ నరసింహం మెమో జారీ చేశారు.  
 
కాగితాల్లోనే కమిటీలు
బెల్టు షాపుల సమాచారమిస్తే నజరానా అందిస్తామని, గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని మూడేళ్ల క్రితం ఆదేశించారు. బెల్టు షాపులను రద్దు చేసేందుకు రాష్ట్రంలో 13 జిల్లా కమిటీలు, 553 మండల, 5,332 గ్రామ కమిటీలు ఏర్పాటు చేసినట్లు కాగితాలపై చూపించారు. ఈ కమిటీలు ఉన్నాయా.. లేక రద్దయ్యాయో తెలియని స్థితి. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే బెల్టు షాపుల రద్దు అంశాన్ని ప్రభుత్వం ప్రచారంగా మాత్రమే వాడుకోజూస్తున్నదని పలువురు సామాజిక కార్యకర్తలు, మద్యం వ్యతిరేక పోరాట కమిటీ నేతలు వ్యాఖ్యానించడం గమనార్హం. 
 
అన్నీ తూతూ మంత్రపు కేసులే
రాష్ట్రంలో 40 వేలకు పైగా బెల్టు షాపులున్నట్లు సాక్షాత్తూ ఎక్సైజ్‌ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఎక్సైజ్‌ శాఖ ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్వేలో ఈ విషయం రూఢీ కావడం గమనార్హం. మూడేళ్లుగా బెల్టు షాపులపై 23 వేల కేసులు నమోదు చేసినట్లు అధికారిక ఎక్సైజ్‌ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇవి కూడా తూతూ మంత్రంగా నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 
 
దర్జాగా అమ్మకాలు.. వసూళ్లు
► శ్రీకాకుళం జిల్లాలో ఓ మంత్రి నియోజకవర్గంలో బెల్టు షాపులు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. మద్యం వ్యాపారులు బెల్టు షాపులు ఏర్పాటు చేసుకున్నందుకు నెలవారీ రూ.కోటిన్నర సంబంధిత మంత్రికి ముట్టజెప్పాలి. వీటి వసూలు బాధ్యత ఓ సీఐ నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై ఎక్సైజ్‌ ఉన్నతాధికారి ఒకరు ఏకంగా సమీక్ష సమావేశంలోనే బాహాటంగా వెల్లడించారు. 
► గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఓ సీనియర్‌ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే బెల్టు షాపులు నడుస్తున్నాయి. 
► విశాఖ జిల్లాలో మద్యం వ్యాపారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే సైతం బెల్టు షాపుల ద్వారా అమ్మకాలు జరిపిస్తున్నారు. 
► చిత్తూరు జిల్లాలో బెల్టు షాపులు ఏర్పాటు చేస్తున్నారంటూ మహిళలు ఇటీవల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 
► పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రికి సన్నిహితంగా ఉండే సిండికేటు నేత ఒకరు ఎమ్మార్పీ ఉల్లంఘనలు మొదలు బెల్టు షాపుల వరకు అంతా తానే పర్యవేక్షిస్తారు. సదరు మంత్రి అనుయాయుడికి ఇక్కడ ఎక్సైజ్‌ అధికారులు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి.
 
‘బెల్టు’ తీయాల్సిందే..
రాష్ట్రంలో అనధికారికంగా నడుస్తున్న బెల్టు షాపులపై దాడులు కొనసాగించాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ లక్ష్మీ నరసింహం ఆ శాఖ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్‌ ఇతర ప్రభుత్వ శాఖల సాయంతో గ్రామాల్లో బెల్టు షాపుల్ని తొలగించాలని సూచించారు. బుధవారం విజయవాడ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా బెల్టు షాపులపై ఎక్సైజ్‌ అధికారులు దాడులు నిర్వహించారు. కాగా, రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 133 బెల్ట్‌ షాపులపై కేసులు నమోదు చేసి 138 మందిని అరెస్ట్‌ చేశామని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు. 415 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement