Barcode
-
ఆర్థిక మంత్రికే కాంటాక్ట్‌లెస్ చెల్లింపు కష్టాలు.. వీడియో వైరల్
He Scan His Bank Card On A Bar Code: చాలా పెద్ద హోదాలోని వ్యక్తులు ఒక్కొసారి తికమక పడో లేక కన్ఫ్యూజ్ అవ్వడం వల్లే చాలా తెలివతక్కుగా ప్రవర్తిస్తుంటారు. అది కూడా చాలా సింపుల్ విషయాల్లో చేస్తుంటారు. అచ్చం అలానే ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఎంత విచిత్రమైన పని చేశాడో చూడండి. వివరాల్లోకెళ్తే...బ్రిటిష్ ఆర్థిక మంత్రి రిషి సునక్ కాంటాక్ట్‌లెస్ చెల్లింపులతో ఇబ్బందులు పడ్డారు. ఆయన ఒక దుకాణానికి వెళ్లి కోకాకోలా టిన్ని కొన్నారు. బిల్ పే చేసేటప్పడూ మనం కొన్న వస్తువును దుకాణదారుడు బార్కోడ్ మిషన్‌తో స్కాన్ చేయడం సహజం. అయితే ఆ మంత్రి బార్కోడ్ మిషన్ వద్ద తన ఏటీఎం కార్డుని పెడతారు. దీంతో సదరు దుకాణదారుడు సార్ కోకాకోలాని పెట్టండి అని అంటాడు. ఇంతకీ రిషి ఎవరంటే...రిచ్మండ్కు చెందిన కన్జర్వేటివ్ పార్లమెంటు సభ్యుడు మాత్రమే గాక తదుపరి ఎన్నికల్లో ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ స్థానంలో బుక్మేకర్లకు ఇష్టమైన వ్యక్తి కూడా. అంతేకాదండోయ్ ఆయన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి భర్త కూడా. chancellor of the exchequer doesn’t know how to use contactless my head’s gone pic.twitter.com/h2yBKVMu2K — lucy (@LMAsaysno) March 23, 2022 (చదవండి: పెంపుడు కుక్క ఐతే మాత్రం మరీ ఇలాంటి పేరా!... మండిపడతున్న నెటిజన్లు) -
బార్‌కోడ్‌తో చైనా వస్తువును గుర్తించొచ్చా?
న్యూఢిల్లీ: 'ఏదేమైనా సరే చైనా ఉత్పత్తులను వాడేదే లేదు.. ఎలాగో ఇప్పుడు వాడుతున్న వాటిని ఏమీ చేయలేం. కనీసం ఇక ముందైనా చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయకూడదు" ప్రస్తుతం ఎంతోమంది భారతీయులు చేస్తున్న ప్రతిజ్ఞ ఇది. ఇది నిజంగా ఆచరణసాధ్యమేనా అన్న విషయం పక్కన పెడితే దాన్ని చేసి చూపించాలనే తపన మాత్రం చెప్పనలవి కాదు. ఇప్పటికే ఎంతోమంది ఏదైనా కొనాలంటే దాని వివరాలు చూసిన తర్వాతే కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. అయితే ఆ వస్తువు చైనాకు చెందిందా? స్వదేశీ వస్తువా? అని గుర్తించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో బార్కోడ్ ద్వారా దీన్ని సులువుగా తెలుసుకోవచ్చంటూ ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. బార్కోడ్ ప్రారంభంలో 690 నుంచి 699 మధ్య అంకెలు ఉంటే అది చైనా వస్తువు, 890 ఉంటే అది ఖచ్చితంగా ఇండియాదేనని ఈ వార్త సారాంశం. (హన్ దురహంకారం!!) ఇది నిజమేనని నమ్మి ఎంతోమంది ఆ ఫొటోను సేవ్ చేసి పెట్టుకుంటున్నారు కూడా! కానీ, అది పూర్తిగా నిజం కాదు. వస్తువుకు అతికించి ఉన్నలేబుల్పై ఉండే బార్కోడ్ ఉత్పత్తి చేసిన దేశం పేరును వెల్లడించదు. కాకపోతే 690 నుంచి 699 మధ్య అంకెలను చైనాకు కేటాయించగా 890 నంబర్ భారత్‌కు కేటాయించారు. కానీ ఆ నంబర్ ఉన్న వస్తువులన్నీ సదరు దేశంలో తయారు చేసినట్లు మాత్రం కాదు. కేవలం వస్తువు తయారుచేసే కంపెనీ ఆ దేశంలో ఉన్నట్లు లెక్క. ఇక బార్కోడ్ కింద ఉండే ఈ అంకెలను గ్లోబల్ ట్రేడ్ ఐటమ్ నంబర్ అని పిలుస్తారు. ఉదాహరణకు.. భారత కంపెనీ చైనా వస్తువులను దిగుమతి చేసుకుందనుకోండి. అనంతరం వాటిలో మార్పు చేర్పులు చేసి లేదా యథాతథంగా తిరిగి ప్యాకింగ్ చేసి బంగ్లాదేశ్‌కు పంపిణీ చేస్తుంది. అప్పుడు ఆ వస్తువుపై ఇండియా బార్కోడ్ మాత్రమే ఉంటుంది. అప్పుడు బంగ్లాదేశ్వాసులు వారు అందుకున్న వస్తువు ఎక్కడ ఉత్పత్తి అయ్యిందనే విషయాన్ని కనుగొనలేరు. (చైనా సైనిక మరణాలపై అంతా గందరగోళం) -
బార్కోడ్లో రెజ్యూమ్! వీడియోలో ఇంటర్వ్యూ!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓలా, ఉబర్ వంటి రెంటల్ కార్ల బుకింగ్ ఎలా చేయాలో మనకందరికీ తెలిసిందే! అచ్చం అలాగే కంపెనీల ఉద్యోగ నియామకాలూ ఉంటే! ఖాళీగా ఉన్న జాబ్స్ వివరాలు అభ్యర్థులకు.. అలాగే విద్యార్హతలతో కూడిన అభ్యర్థుల వివరాలు కంపెనీలకూ గూగుల్ మ్యాప్స్‌లో దర్శనమిస్తుంటే? ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. బెంగళూరుకు చెందిన హలోజాబ్స్ అనే స్టార్టప్ ఈ నియామక టెక్నాలజీని రూపొందించింది. ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉందని, ఏడాదిలో విపణిలోకి విడుదల చేస్తామని ధీమా వ్యక్తం చేశారు హలోజాబ్స్ ఫౌండర్ శ్రీనివాస్ వరాహగిరి. మరిన్ని వివరాలను ఆయన ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది తూర్పు గోదావరి జిల్లా చింతలపల్లి గ్రామం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తయ్యాక... పలు ప్రైవేట్ కంపెనీల్లో హెచ్ఆర్, ఫైనాన్స్ విభాగంలో కీలక స్థాయిల్లో పనిచేశా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడిని కూడా. హెచ్ఆర్లో పని చేయటం వల్లే కావొచ్చు... ఉద్యోగ నియామక ప్రక్రియలోని సమస్యలను క్షుణ్నంగా తెలుసుకునే వీలు కలిగింది. టెక్నాలజీతో మానవ వనరుల విభాగం అవసరాలను సులభతరం చేయాలని నిర్ణయించుకొని.. రూ.25 లక్షల పెట్టుబడితో 2016 ఆగస్టులో బెంగళూరు కేంద్రంగా హలోజాబ్స్ను ప్రారంభించా. బార్కోడ్లో రెజ్యూమ్.. సాధారణంగా ఉద్యోగ నియామక ప్రక్రియ ఎలా ఉంటుందంటే.. పేజీలకు పేజీలు రెజ్యూమ్‌లు చేతపట్టుకొని కంపెనీల చుట్టూ తిరిగే అభ్యర్థులు ఒకవైపు. నియామకాల్లో ఎంపికైన అభ్యర్థుల వ్యక్తిగత సమాచారం, సర్టిఫికెట్స్ ధ్రువీకరణ కోసం కంపెనీలు మరోవైపు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా హలోజాబ్స్లో నమోదు చేసుకున్న అభ్యర్థులకు ఏటీఎం కార్డు తరహాలో ఉచితంగా క్యూఆర్ కోడ్‌తో విజువల్ రెజ్యూమ్ (వీఆర్) గుర్తింపు కార్డును అందిస్తాం. ఇందులో అభ్యర్థి విద్యా సంబంధమైన వివరాలతో పాటు, నైపుణ్యం, అనుభవం వంటి కీలక సమాచారాన్ని సులువుగా గుర్తించేలా ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. పైగా అభ్యర్థుల సర్టిఫికెట్స్, వ్యక్తిగత వివరాలు ధ్రువీకరణ ప్రక్రియ అంతా హలోజాబ్స్ చేసి బార్కోడ్లో నిక్షిప్తం చేస్తాం. కంపెనీలు తమ మొబైల్ ఫోన్‌తో ఈ బార్‌కోడ్‌ను స్కాన్ చేసినా లేదా ఫొటో తీసినా సరే వెంటనే అభ్యర్థి రెజ్యూమ్ ఫోన్ లేదా డెస్క్‌టాప్‌లోకి వచ్చేస్తుంది. అంతేకాకుండా ఎంపికైన అభ్యర్థి గురించి మళ్లీ కంపెనీ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరముండదు. వీడియోలోనే ఇంటర్వ్యూలు.. విజువల్ రెజ్యూమ్‌తో పాటూ వీడియో ఇంటర్వ్యూ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేశాం. త్వరలోనే విపణిలోకి విడుదల చేయనున్నాం. ఇదేంటంటే... అభ్యర్థులు ఎక్కడున్నా ఆన్లైన్ ద్వారా నేరుగా ఇంటర్వ్యూ కు హాజరయ్యే అవకాశముంటుంది. ప్రస్తుతం బెంగళూరు, చెన్నైల్లో సేవలందిస్తున్నాం. ఈ ఏడాది ముగింపు నాటికి హైదరాబాద్, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబై, పుణె, అహ్మదాబాద్ నగరాలకు విస్తరించనున్నాం. ప్రస్తుతం హలోజాబ్స్లో 3 లక్షల మంది అభ్యర్థులు, 140 కంపెనీలు నమోదయ్యాయి. వీటిలో ప్రణవ హెల్త్‌కేర్, కాన్కార్డ్ ఆటోమేషన్, డిజిటల్ అకాడమీ వంటివి కొన్ని. ఏపీ, తెలంగాణ నుంచి 40 వేల అభ్యర్థులుంటారు. ఇప్పటివరకు హలోజాబ్స్ వేదికగా 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలొచ్చాయి. రూ.5 కోట్ల ఆదాయం లక్ష్యం.. మా ఆదాయ మార్గం రెండు విధాలుగా ఉంటుంది. ఒక ఉద్యోగ నియామక ప్రకటనకు రూ.250 ఉంటుంది. అలా కాకుండా నమోదైన అభ్యర్థుల డేటాబేస్ పొందాలంటే లక్ష రూపాయల వరకు ఉంటుంది. డేటాబేస్‌తో కంపెనీలు వాళ్లకు కావాల్సిన అభ్యర్థిని ఎంచుకునే వీలుంటుంది. కంపెనీల తరఫున ఇంటర్వ్యూ హలోజాబ్స్ చేసి పెడుతుంది. ఎంపికైన అభ్యర్థికిచ్చే ప్యాకేజ్‌లో 5–8.3 శాతం కంపెనీ నుంచి కమీషన్ రూపంలో తీసుకుంటాం. ప్రస్తుతం నెలకు 5 వేల మంది అభ్యర్థులు నమోదవుతున్నారు. 2,500 జాబ్ పోస్టింగ్స్ అవుతున్నాయి. సుమారు 100 ఇంటర్వ్యూలు చేస్తున్నాం. రూ.25 కోట్ల నిధుల సమీకరణ.. ప్రస్తుతం నెలకు రూ.15 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. 15% వృద్ధిని నమోదు చేస్తున్నాం. ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి రూ.5 కోట్ల టర్నోవర్, 2020 నాటికి రూ.20 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలన్నది మా లక్ష్యం. వచ్చే ఏడాది కాలంలో 25 లక్షల మంది అభ్యర్థులకు, సింగపూర్, మలేషియా దేశాలకు విస్తరించాలన్నది లక్ష్యం. ప్రస్తుతం మా కంపెనీలో 36 మంది ఉద్యోగులున్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.25 కోట్ల నిధులను సమీకరిస్తామని’’ శ్రీనివాస్ వివరించారు. -
‘బార్ కోడ్’ మరిచారు!
మెట్పల్లి : జిల్లాలో మద్యం విక్రయాల్లో బార్కోడ్ విధానం అమలు ప్రకటనలకే పరిమితమైంది. కల్తీ, పన్ను చెల్లించని మద్యాన్ని అరికట్టడంతో పాటు ఎమార్పీకే మద్యం విక్రయించేలా చూడటానికి ప్రభుత్వం బార్కోడ్ విధానాన్ని అమలు చేయాలని ఎక్సైజ్ శాఖకు సూచించింది. కానీ ఆ శాఖ అధికారులు ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. బార్కోడ్ సామగ్రిని సమకూర్చడానికి వ్యాపారుల నుంచి డబ్బును వసూలు చేసిన అధికారులు.. దుకాణాలకు ఇచ్చిన లెసైన్స్ గడువులో ఐదునెలలు పూర్తయినా ఇంతవరకు సామగ్రిని వారికి అందజేయలేదు. దీనివల్ల బార్కోడ్ అమలు ప్రశ్నార్థకంగా మారింది. జూలై నుంచే అమలు చేయాల్సి ఉన్నా... ప్రస్తుతం జిల్లాలో 301 మద్యం దుకాణాలు, 44 బార్లు ఉన్నాయి. ఇందులో దుకాణాలకు జూన్‌తోనే లెసైన్స్ గడువు ముగియగా, టెండర్లు నిర్వహించి జూలై ఒకటి నుంచి తిరిగి వాటిని పునరుద్ధరించారు. వీటి కాల పరిమితి 2015 జూన్ 30తో ముగుస్తుంది. అధికారులు జూలై నుంచే దుకాణాల్లో బార్ కోడ్ విధానం అమలు చేస్తామని ప్రకటించారు. కానీ లెసైన్స్ గడువులో ఐదు నెలలు పూర్తయినా ఇంతవరకు దానిని అమలు చేయకపోవడం గమనార్హం. ముక్కుపిండి వసూలు.. బార్కోడ్ సామగ్రిని సమకూర్చడానికి ఎక్సైజ్ అధికారులు మద్యం వ్యాపారుల నుంచి రూ.92వేలు, బార్ల నిర్వాహకుల నుంచి రూ.80వేల చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. వ్యాపారుల్లో చాలా మంది సామగ్రి కొనుగోలు చేయడానికి మొదట్లో మొండికేశారు. దీంతో అధికారులు వారికి మద్యం సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో గత్యంతర ం లేక ఈ సొమ్మును చెల్లించారు. ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా సామగ్రిని సమకూరుస్తున్న ఎక్సైజ్ శాఖ మార్కెట్ ధర కంటే ఎక్కువ మొత్తాన్ని వ్యాపారుల నుంచి వసూలు చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూర్తి కాని సాఫ్ట్వేర్ అనుసంధానం.. బార్కోడ్ విధానం అమలును పర్యవేక్షించే బాధ్యతను రాష్ర్ట స్థాయిలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి అప్పజెప్పారు. ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు మద్యం డిపోతో పాటు ఎక్సైజ్ స్టేషన్లు, కొన్ని మద్యం దుకాణాలకు మాత్రమే సామగ్రి అందింది. పూర్తి స్థాయిలో అన్ని దుకాణాలకు సామగ్రి చేరితేనే సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేయడానికి అవకాశముంటుంది. వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేసిన అధికారులు సామగ్రిని సమకూర్చే విషయంలో మాత్రం నిర్లక్ష్యం చూపుతున్నారు. దీనివల్లనే బార్కోడ్ అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అమలు ఎప్పుడన్నది చెప్పలేం - సుధీర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ అన్ని దుకాణాలకు ఇంకా సామగ్రి అందలేదు. వీటిని సమకూర్చే ప్రైవేట్ సంస్థ జాప్యం చేస్తోంది. అందువల్ల బార్కోడ్ విధానాన్ని ఎప్పటినుంచి అమలు చేస్తామన్నది చెప్పలేం. -
‘బార్కోడ్' విధానంతోనే మద్యం విక్రయాలు
కర్నూలు: బార్ కోడ్ విధానం ద్వారానే మద్యం విక్రయాలు జరపాలని వ్యాపారులను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు ఆదేశించారు. మద్యం వ్యాపారంలో అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు గాను ఈ ఏడాది కొత్తగా 2డీ బార్ కోడింగ్ పద్ధతిని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం వ్యాపారులు ఈ విధానం అమలుపై అయిష్టత వ్యక్తం చేస్తూ రాష్ట్రస్థాయి యూనియన్ నాయకులు కోర్టును ఆశ్రయించారు. అయితే ఈనెల 15వ తేదిలోగా హోలోగ్రామ్ ప్రాజెక్టును ఖచ్చితంగా అమలు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ ఎస్ఎస్.రావత్ ఆదేశాల మేరకు జిల్లా ఎక్సైజ్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆరు నెలల క్రితమే అధికారులకు ఈ ప్రాజెక్టు అమలుపై మార్గదర్శకాలు అందిన సంగతి తెలిసిందే. గురువారం జిల్లా వ్యాప్తంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లను మద్యం వ్యాపారులను కార్యాలయానికి రప్పించి ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్లు సుర్జీత్‌సింగ్, హనుమంతరావు, ఏఈఎస్ హెప్సిబారాణి, కర్నూలు సీఐ పద్మావతితో పాటు జిల్లాలోని అన్ని స్టేషన్ల హౌస్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ప్రతి మద్యం దుకాణంలో 2డీ స్కానర్, ఇండస్ట్రియల్ కంప్యూటర్, 3జీ సిమ్, ప్లాట్ ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా వ్యాపారులకు ఇన్చార్జి డీసీ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 194 మద్యం దుకాణాలు, 30 బార్లు ఉన్నాయి. అన్ని దుకాణాల్లో కూడా బార్కోడ్ విధానం ద్వారానే విక్రయాలు జరపాలని ఆదేశించారు. డిసెంబర్ 1 నుంచి 2డీ బార్‌కోడింగ్ పద్దతిలోనే విక్రయాలు జరగనున్నాయి. ఈ విధానం అమలు వల్ల జిల్లాలోని మద్యం డిపోతో పాటు రీటైల్ దుకాణాల్లో విక్రయాల స్టాక్ వివరాలు, హైదరాబాద్ సెంట్రల్ సర్వర్ ద్వారా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. -
దసరా ధమాకా
బెల్లంపల్లి : బెల్ట్‌షాపులు మళ్లీ పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వం నిషేధించినా కొందరు మద్యం వ్యాపారులు ప్రోత్సహిస్తున్నారు. మద్యం వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి జోరుగా బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు. దసరా పండుగను పురస్కరించుకొని బెల్ట్‌షాపులు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటవుతున్నా ఆబ్కారీ, ప్రొహిబిషన్ శాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. బెల్ట్‌షాపులను రద్దు చేసిన ప్రభుత్వం ప్రతి మద్యం దుకాణానికి అనుబంధంగా పర్మిట్ రూంను అనుమతించింది. రూ.2 లక్షలు చొప్పున చెల్లించి వ్యాపారులు పర్మిట్ రూంను ఏర్పాటు చేసుకున్నారు. అయినా కొందరు వ్యాపారులు చాటుమాటుగా బెల్ట్‌షాపులను నిర్వహిస్తున్నారు. వీటి ద్వారానే బస్తీలు, గ్రామీణ ప్రాంతాలలో మద్యం వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. దసరా పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున వ్యాపారం సాగించేందుకు బెల్ట్‌షాపులకు భారీగా మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఎమ్మార్పీ ధర కన్న అధికంగా బెల్ట్‌షాపుల్లో వసూళ్లు చేసి అక్రమ దందా నిర్వహిస్తున్నారు. దసరా వేదికగా.. దసరా పండుగ వేదికగా బెల్ట్‌షాపులలో పెద్ద ఎత్తున మద్యాన్ని నిల్వ ఉంచారు. ముందస్తు వ్యూహంగా వ్యాపారులు కొందరు మద్యం స్టాక్ ఉంచి కొన్ని రోజుల నుంచి అమ్మకాలు సాగిస్తున్నారు. తూర్పు ప్రాంతంలోని మంచిర్యాల, మందమర్రి, చెన్నూర్, జైపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి, బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్, రెబ్బెన, ఆసిఫాబాద్, వాంకిడి, కాగజ్‌నగర్, సిర్పూర్(టీ) తదితర ప్రధాన పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్‌షాపుల నిర్వహణ గుట్టుగా జరుగుతోంది. మద్యం అధికంగా అమ్మకాలు జరిపే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని బెల్ట్‌షాపులను నిర్వహిస్తున్నారు. దసరా పండుగ తూర్పు ప్రాంతంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. పండుగకు ముందు మద్యం భారీ ఎత్తున కొనుగోళ్లు జరుగుతాయి. ఈ పండుగ రాక కోసమే ఏడాదిపాటున మద్యం వ్యాపారులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం ఆ సమయం ఆసన్నం కావడంతో ఏ మాత్రం ఆలస్యం లేకుండా మూసివేసిన బెల్ట్‌షాపుల తలుపులు తెరుస్తున్నారు. రోజు బెల్ట్‌షాపులకే అత్యధికంగా మద్యం షాపుల నుంచి సరుకు సరఫరా జరుగుతోంది. రోజుకు సుమారు రూ.అర కోటి వరకు బెల్ట్‌షాపుల్లోనే మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ఓ అంచనా. ఆ ప్రకారంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కొన్నేళ్ల నుంచి మద్యం వ్యాపారంలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు బెల్ట్‌షాపులను ముందుండి నడుపుతున్నట్లు తెలుస్తోంది. మరో పక్క మద్యం కల్తీ కాకుండా బార్కోడ్ విధానంతో స్కానింగ్ చేసి మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం ఆదే శించిన ఎక్సైజ్ అధికారుల నిర్లిప్తతతో అమలు జరగడం లేదు. ఆ పద్ధతి అమలు కాకపోవడంతో వ్యాపారులు మద్యాన్ని కల్తీ చేసి అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్నాయి. పట్టింపులేని అధికారులు మద్యం షాపుల నుంచి బెల్ట్‌షాపులకు అక్రమంగా మద్యం సరఫరా అవుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. వ్యాపారులు సాగిస్తున్న అక్రమ దందాను నిరోధించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం బెల్ట్‌షాపులను రద్దు చేసిన క్షేత్ర స్థాయిలో మాత్రం కొనసాగడం ఎక్సైజ్ అధికారుల నిర్లిప్తతకు అద్దం పడుతోంది. ఇప్పటికైనా బెల్ట్‌షాపులను రద్దు చేయించి అక్రమ మద్యం అమ్మకాలను ఆపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై బెల్లంపల్లి ఎక్సైజ్ సీఐ నరేందర్‌రెడ్డిని ఫోన్లో వివరణ కోరగా బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. ఎక్కడైనా బెల్ట్‌షాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
వైన్ స్కాన్
ఆదిలాబాద్ : నిన్నా మొన్నటి వరకు సూపర్బజార్లు.. ఏదేని పెద్ద పెద్ద షాపుల్లో వస్తువులు కొనుగోలు చేస్తే బార్కోడ్ సాయంతో ధర ప్రింట్ అయ్యేది. హోలోగ్రామ్‌పై కంప్యూటర్ స్కానర్‌తో పరిశీలించగానే ఆ వస్తువు ధర కంప్యూటర్లో ప్రత్యక్షమయ్యేది. ఇప్పుడు ఆ విధా నం ఇక వైన్షాపుల్లోనూ రానుంది. కొత్త ఎక్సైజ్ పాలసీలో ఈ విధానాన్ని అమలుపర్చారు. బాటిల్ హోలోగ్రామ్‌లో కొత్తగా 2డీ బార్‌కోడ్‌ను రూపొందిస్తున్నారు. అయితే.. దీన్ని కొత్త వైన్‌షాప్ హోల్డర్లు వ్యతిరేకిస్తున్నారు. బాటిల్ వివరాలు ప్రత్యక్షం.. పాత ఎక్సైజ్ పాలసీలో మద్యం బాటిళ్లపై ఎక్సైజ్ అడిహసీవ్ లేబుల్ బార్కోడ్ ఉండేది. ప్రస్తుతం హోలోగ్రామ్ 2డీ బార్‌కోడ్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తోంది. దీనికి సంబంధించి హెడానిక్ పాత్ ఫైన్డర్ సిస్టమ్ (హెచ్‌పీఎఫ్‌ఎస్) అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. డిస్టిలరీ నుంచి మొదలుకుని మద్యం డిపోలు వైన్‌షాపులను అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టింది. మద్యం బాటిల్‌పై స్కాన్ చేయగానే బాటిల్ తయారైన డిస్టిలరీ, డిస్టిలరీ నుంచి డిపో, డిపో నుంచి వైన్స్, ఏ రకం బ్రాండ్, దాని రేటు తదితర వివరాలు వస్తాయి. తద్వారా బాటిల్‌పై ఉన్న ఎమ్మార్పీ కంటే షాపులో ఎక్కువ ధరకు అమ్మే పరిస్థితి ఉండదు. గతంలో జిల్లాలో ఎమ్మార్పీ కంటే రూ.10 నుంచి రూ.20 అదనంగా వసూలు చేస్తుండేవారు. దీంతో మందుబాబుల జేబులకు చిల్లు పడేది. ఇక బార్కోడ్ విధానం అమలైతే అధిక వసూలుకు బ్రేక్ పడనుంది. జిల్లాలో నాన్డ్యూటీపేడ్ (ఎన్డీపీ) లిక్కర్‌తోపాటు కల్తీ లిక్కర్‌ను విస్తృతంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బార్కోడ్ అమలైన పక్షంలో నాన్డ్యూటీపేడ్ లిక్కర్‌కు కూడా చెక్పడే ఆస్కారం ఉంది. అయితే బార్కోడ్ విధానం వైన్‌షాపు యజమానులకు లాభం చేకూరుస్తుందని అధికారులు అంటున్నారు. ప్రధానంగా ఓనర్ కౌంటర్ మీద ఉన్నా లేకున్నా కంప్యూటర్ నుంచి సెల్‌కు అనుసంధానం చేస్తే సంక్షిప్త సమాచారం వస్తుంది. సరుకు కొనుగోలుకు సంబంధించి ఇదే ఆన్లైన్లో సేల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ప్రతిరోజూ అకౌంట్ వివరాలు తెలుసుకునేందుకు సులువవుతుంది. ఎన్ని బాటిళ్లు అమ్ముడుపోయాయి.. ఏ బ్రాండ్ లిక్కర్ విక్రయాలు అమ్ముడుపోతున్నాయనే వివరాలు కంప్యూటర్లో తెలుసుకోవచ్చు. అదే సమయంలో తనిఖీల కోసం వెళ్లే అధికారులకు స్కానింగ్ ఆప్లికేషన్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లను ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ఫోన్ల ద్వారా మద్యం బాటిల్‌ను స్కాన్ చేసినప్పుడు పూర్తి వివరాలు సెల్లో వస్తాయని, తద్వారా అది నాన్డ్యూటీపేడ్ లిక్కరా లేదా డ్యూటీపేడ్ లిక్కరా అని తేలిపోతుంది. ఇదిలా ఉంటే.. మంగళవారం వైన్‌షాపులను ప్రారంభించిన వైన్ షాపు యజమానులు ఈ స్కానింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. ప్రధానంగా కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ ఏర్పాటు చేసుకోవాలంటే రూ.50 వేల పైన ఖర్చవుతుందని, దాన్ని ఆపరేట్ చేసేందుకు జీతం ఇచ్చే వ్యక్తిని నియమించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికే పర్మిట్ రూమ్ పేరిట రూ.2 లక్షలు, ప్రివిలేజ్ పేరిట ఏడు రెట్లు మద్యం అమ్మిన తర్వాత 13 శాతం ట్యాక్స్ విధిస్తున్నారని, ఈ విధానం అమలుచేస్తే నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో 2డీ బార్కోడ్ విధానం అమలవుతుందా లేదా అనేదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శివరాజ్‌ను వివరణ కోరగా ప్రతి వైన్‌షాప్‌లో విధిగా కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ ఏర్పాటు చేసుకోవాలని, వినియోగదారుడికి బిల్లు జారీ చేయాలని చెప్పారు. సోమవారమే కొత్త పాలసీ ప్రారంభమైనందున వైన్‌షాప్ యజమానులు తొందరగా ఈ విషయంపై దృష్టి సారించాలని, తప్పనిసరిగా బార్కోడ్ విధానం అమలుచేసి తీరుతామని పేర్కొన్నారు.