ఆదిలాబాద్ : నిన్నా మొన్నటి వరకు సూపర్‌బజార్లు.. ఏదేని పెద్ద పెద్ద షాపుల్లో వస్తువులు కొనుగోలు చేస్తే బార్‌కోడ్ సాయంతో ధర ప్రింట్ అయ్యేది. హోలోగ్రామ్‌పై కంప్యూటర్ స్కానర్‌తో పరిశీలించగానే ఆ వస్తువు ధర కంప్యూటర్‌లో ప్రత్యక్షమయ్యేది. ఇప్పుడు ఆ విధా నం ఇక వైన్‌షాపుల్లోనూ రానుంది. కొత్త ఎక్సైజ్ పాలసీలో ఈ విధానాన్ని అమలుపర్చారు. బాటిల్ హోలోగ్రామ్‌లో కొత్తగా 2డీ బార్‌కోడ్‌ను రూపొందిస్తున్నారు. అయితే.. దీన్ని కొత్త వైన్‌షాప్ హోల్డర్లు వ్యతిరేకిస్తున్నారు.
బాటిల్ వివరాలు ప్రత్యక్షం..
పాత ఎక్సైజ్ పాలసీలో మద్యం బాటిళ్లపై ఎక్సైజ్ అడిహసీవ్ లేబుల్ బార్‌కోడ్ ఉండేది. ప్రస్తుతం హోలోగ్రామ్ 2డీ బార్‌కోడ్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తోంది. దీనికి సంబంధించి హెడానిక్ పాత్ ఫైన్డర్ సిస్టమ్ (హెచ్‌పీఎఫ్‌ఎస్) అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. డిస్టిలరీ నుంచి మొదలుకుని మద్యం డిపోలు వైన్‌షాపులను అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టింది.
మద్యం బాటిల్‌పై స్కాన్ చేయగానే బాటిల్ తయారైన డిస్టిలరీ, డిస్టిలరీ నుంచి డిపో, డిపో నుంచి వైన్స్, ఏ రకం బ్రాండ్, దాని రేటు తదితర వివరాలు వస్తాయి. తద్వారా బాటిల్‌పై ఉన్న ఎమ్మార్పీ కంటే షాపులో ఎక్కువ ధరకు అమ్మే పరిస్థితి ఉండదు. గతంలో జిల్లాలో ఎమ్మార్పీ కంటే రూ.10 నుంచి రూ.20 అదనంగా వసూలు చేస్తుండేవారు. దీంతో మందుబాబుల జేబులకు చిల్లు పడేది. ఇక బార్‌కోడ్ విధానం అమలైతే అధిక వసూలుకు బ్రేక్ పడనుంది. జిల్లాలో నాన్‌డ్యూటీపేడ్ (ఎన్‌డీపీ) లిక్కర్‌తోపాటు కల్తీ లిక్కర్‌ను విస్తృతంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
బార్‌కోడ్ అమలైన పక్షంలో నాన్‌డ్యూటీపేడ్ లిక్కర్‌కు కూడా చెక్‌పడే ఆస్కారం ఉంది. అయితే బార్‌కోడ్ విధానం వైన్‌షాపు యజమానులకు లాభం చేకూరుస్తుందని అధికారులు అంటున్నారు. ప్రధానంగా ఓనర్ కౌంటర్ మీద ఉన్నా లేకున్నా కంప్యూటర్ నుంచి సెల్‌కు అనుసంధానం చేస్తే సంక్షిప్త సమాచారం వస్తుంది. సరుకు కొనుగోలుకు సంబంధించి ఇదే ఆన్‌లైన్‌లో సేల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ప్రతిరోజూ అకౌంట్ వివరాలు తెలుసుకునేందుకు సులువవుతుంది. ఎన్ని బాటిళ్లు అమ్ముడుపోయాయి.. ఏ బ్రాండ్ లిక్కర్ విక్రయాలు అమ్ముడుపోతున్నాయనే వివరాలు కంప్యూటర్‌లో తెలుసుకోవచ్చు.
అదే సమయంలో తనిఖీల కోసం వెళ్లే అధికారులకు స్కానింగ్ ఆప్లికేషన్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ ఫోన్‌ల ద్వారా మద్యం బాటిల్‌ను స్కాన్ చేసినప్పుడు పూర్తి వివరాలు సెల్‌లో వస్తాయని, తద్వారా అది నాన్‌డ్యూటీపేడ్ లిక్కరా లేదా డ్యూటీపేడ్ లిక్కరా అని తేలిపోతుంది. ఇదిలా ఉంటే.. మంగళవారం వైన్‌షాపులను ప్రారంభించిన వైన్ షాపు యజమానులు ఈ స్కానింగ్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు.
ప్రధానంగా కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ ఏర్పాటు చేసుకోవాలంటే రూ.50 వేల పైన ఖర్చవుతుందని, దాన్ని ఆపరేట్ చేసేందుకు జీతం ఇచ్చే వ్యక్తిని నియమించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికే పర్మిట్ రూమ్ పేరిట రూ.2 లక్షలు, ప్రివిలేజ్ పేరిట ఏడు రెట్లు మద్యం అమ్మిన తర్వాత 13 శాతం ట్యాక్స్ విధిస్తున్నారని, ఈ విధానం అమలుచేస్తే నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో 2డీ బార్‌కోడ్ విధానం అమలవుతుందా లేదా అనేదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ విషయంపై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శివరాజ్‌ను వివరణ కోరగా ప్రతి వైన్‌షాప్‌లో విధిగా కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ ఏర్పాటు చేసుకోవాలని, వినియోగదారుడికి బిల్లు జారీ చేయాలని చెప్పారు. సోమవారమే కొత్త పాలసీ ప్రారంభమైనందున వైన్‌షాప్ యజమానులు తొందరగా ఈ విషయంపై దృష్టి సారించాలని, తప్పనిసరిగా బార్‌కోడ్ విధానం అమలుచేసి తీరుతామని పేర్కొన్నారు.
వైన్ స్కాన్
Published Tue, Jul 8 2014 12:14 AM | Last Updated on Sat, Sep 15 2018 3:43 PM
Advertisement
Advertisement