Scanning Centre
-
నిషేధం.. నట్టింట్లో అపహాస్యం!
‘మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన దంపతులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో మొదటగా లింగనిర్ధారణ పరీక్షలు చేసేవారు. ఆపై కురవిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఆ ఆస్పత్రి యజమానిపై లింగనిర్ధారణ, ఆబార్షన్లు చేస్తున్నారని కేసు నమోదైంది. అయితే ఆస్పత్రి యజమాని, ఆ దంపతులు కలిసి ల్యాప్‌టాప్ సైజులో ఉన్న స్కానింగ్ మెషిన్ కొనుగోలు చేశారు. టెక్నికల్ పరిజ్ఞానం తెలిసిన ఖమ్మం పట్టణానికి చెందిన ఆర్ఎంపీతో కలిసి గిరిజన తండాలు, పల్లెల్లో స్కానింగ్ చేయడం, ఆడపిల్ల అని తేలితే అక్కడే అబార్షన్లు చేసి ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూళ్లు చేశారు. ఈ విషయం పసిగట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. మొబైల్ స్కానింగ్, అబార్షన్ వ్యవహారాన్ని బట్టబయలు చేసి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి కురవి పోలీసులకు అప్పగించారు’ కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన ఒక ముఠా స్కానింగ్ మెషిన్‌ను ఓ గర్భిణి ఇంటికి తీసుకెళ్లి పరీక్షలు చేస్తుండగా ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. వీరు కొంత కాలంగా మొబైల్ స్కానింగ్ యూనిట్‌ను నిర్వహిస్తున్నారు. ఎన్ని పరీక్షలు, నిర్ధారణలు చేశారన్న విషయంపై విచారణ కొనసాగుతోంది. సాక్షి, మహబూబాబాద్: ఇప్పటి వరకు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి.. నిబంధనల మేరకు పరీక్షలు చేయించుకునేవారు. కానీ ఇప్పుడు కొనిచోట్ల పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన మొబైల్ స్కానింగ్ మెషిన్లు.. అదీ కూడా ల్యాప్‌టాప్ అంత సైజులో ఉన్నవి మార్కెట్లోకి రావడంతో అక్రమార్కుల పని సులువైంది. నాలుగైదు కేసులు ఉంటే.. లేదా చుట్టూ పక్కల తండాల్లోని గర్భిణులను ఒకచోటకు రమ్మని చెబుతున్నారు. చదవండి: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారంబ్యాగుల్లో మెషిన్లు పెట్టుకెళ్లి అక్కడే పరీక్షలు చేసి ఆడ, మగ శిశువు అని నిర్ధారిస్తున్నారు. పరీక్షలకు ఒక్కొక్కరి నుంచి రూ.5వేలకు పైగా తీసుకుంటున్నట్టు సమాచారం. పరీక్ష తర్వాత మగశిశువు అయితే ఆ గర్భిణిని ఇంటికి పంపించడం.. ఆడశిశువు అయితే అక్కడే అబార్షన్లు కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఇలా చేయడంతో పలువురు మహిళలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం, పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకొని బతికి బయటపడిన సంఘటనలు ఉన్నాయని గిరిజనులు చెబుతున్నారు. ఆయా జిల్లాల్లో ఇలా..మొబైల్ స్కానింగ్ పరికరాలతో లింగనిర్ధారణ చేసి ఆడశిశువును చంపేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలో మొబైల్ స్కానింగ్‌తో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుంటే పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో బీడీ ఖార్ఖానా ముసుగులో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుపడ్డారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గర్భవిచ్ఛిత్తి కేసులు బయటపడ్డాయి. అబార్షన్ సమయంలో మహిళలు చనిపోవడం, లేదా ప్రాణాపాయస్థితికి వస్తే కానీ బయటకు రావడం లేదు. మౌనంగా అధికారులుచట్టవిరుద్ధంగా లింగనిర్ధారణ చేయడం (illegal gender test) అబార్షన్లు చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నా.. పలు జిల్లాల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. స్కానింగ్ సెంటర్ల తనిఖీల సమయంలో పెద్దగా పట్టించుకోవడం లేదని, సెంటర్ల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లతో కొందరు అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి చట్టవిరుద్ధంగా నిర్వహించే లింగనిర్ధారణ పరీక్షలను అడ్డుకోకపోతే ఆడపిల్లల రేషియో మరింత పడిపోయే ప్రమాదం ఉందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
Paragamanjari: పుప్పొడి నేత..పరాగ మంజరి
పూల అందాలను చూసి మైమరచిపోవడం మనకు తెలిసిందే! వాటిలో దాగున్న పరాగ రేణువుల అందం చూస్తే... ప్రకృతి ఒడిలో మనకు తెలియని ఇన్ని అద్భుతాలు దాగున్నాయా అని ఆశ్చర్యపోవాల్సిందే! అత్యంత సంక్లిష్టంగా ఉండే ఆ పరాగ రేణువుల నిర్మాణపు అందాన్ని చూడటమే కాదు, వాటిని టెక్స్టైల్ డిజైన్స్‌లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ ఎమ్మెస్సీ విద్యార్థిని శివాని నేత చిలుకూరి. అత్యంత సూక్ష్మంగా కనిపించే ఈ అద్భుతాలను ‘పరాగ మంజరి’గా మనకు పరిచయం చేస్తున్నది. ‘దేశానికి గుర్తింపు తెచ్చే లక్షలాది యునిక్ డిజైన్స్‌ని పరిచయం చేయబోతున్న ఆనందంలో ఉన్నాను’ అంటున్న శివాని నేత తనప్రాజెక్ట్ విశేషాలను ఇలా మన ముందుంచింది..‘‘పరాగ అంటే పుప్పొడి – మంజరి అంటే డిజైన్. సంస్కృతం నుంచి తీసుకున్న ఈ పదాలను మాప్రాజెక్ట్కు పెట్టాం. బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకుని, కుదరక బోటనీ సబ్జెక్ట్ తీసుకున్నాను. ఉస్మానియా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ బోటనీ చేస్తున్నాను. నాకు డ్రాయింగ్ కూడా తెలుసు అని మా బోటనీ ప్రొఫెసర్ విజయభాస్కర్ రెడ్డి సర్ నాకు ఈ డిజైనింగ్ టాపిక్ ఇచ్చారు. దానిని ఇలా మీ ముందుకు తీసుకు రాగలిగాను.లక్షలాది మోడల్స్పరాగ రేణువులను రెండు విధాలుగా మైక్రోస్కోప్ చేశాను. లైట్ మైక్రోస్కోపీలో ఫ్లవర్ స్ట్రక్చర్, సెమ్(స్కానింగ్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్)లో పుప్పొడి రేణువులను స్కాన్ చేశాను. భూమిపైన లక్షలాది మొక్కలు, వాటి పువ్వులు వేటికవి భిన్నంగా ఉంటాయి. ఇక వాటిలోని పరాగ రేణువులు మరింత భిన్నంగా ఉంటాయి. మందార, వేప, తులసి, తిప్పతీగ, తుమ్మ, అర్జున, ఉల్లిపాయ, కాకర, ఆరెంజ్, జొన్న, మొక్కజొన్న, ఖర్జూరం, దోస పువ్వు... ఇలా దాదాపు 70 రకాల పుప్పొడి రేణువులను స్కాన్ చేసి, ఆ స్కెలిటిన్ నుంచి మోటిఫ్స్‌ను వెలుగులోకి తీసుకువచ్చాను. ఈ అందమైన పరాగ రేణువుల నుంచి మోటిఫ్స్ డిజైన్స్‌గా తీసుకు రావడానికి నాలుగు నెలల సమయం పట్టింది.పేటెంట్ హక్కుఇప్పటి వరకు సాఫ్ట్‌వేర్‌లోనే టెక్స్టైల్ ΄్యాటర్న్ని తీసుకున్నాను. క్లాత్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మాది నేత కుటుంబమే. నేను చేసిన ఈ ప్రింట్స్ క్లాత్స్ మీదకు తీసుకురావచ్చని నిర్ధారణ చేసుకున్నాం. కాటన్, పట్టు, సీకో మెటీరియల్ మీదకు మోటిఫ్స్ ప్రింట్స్ చేయచ్చు. నేతలోనూ డిజైన్స్ తీసుకోవచ్చు. ఎంబ్రాయిడరీ కూడా చేయచ్చు. మేం ముందు టీ షర్ట్ పైన ప్రింటింగ్ ప్రయత్నం చేశాం. ఇంకా మిగతా వాటి మీదకు ప్రింట్స్ చేయాలంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ మద్దతు అవసరం అవుతుంది. బ్లాక్ ప్రింట్ చేయాలన్నా .. అందుకు తగిన వనరులన్నీ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ముందుగా పేటెంట్ హక్కు ΄÷ందేవరకు వెళ్లింది. దీనిని ఒక స్టార్టప్‌గా త్వరలోప్రారంభించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.టెక్స్టైల్ రంగం మద్దతుతో...ప్రకృతిలో కళ్లకు కనిపించేవి లైట్ మైక్రోస్కోపిక్ ద్వారా నలభై వరకు పిక్చర్స్ తీసుకుంటే, స్టెమ్ ద్వారా మరికొన్ని సాధించాం. కంప్యూటర్లో వియానా దేశం నుంచి పోలెన్ గ్రెయిన్స్ స్కెలిటన్ స్ట్రక్చర్ నుంచి కొన్ని తీసుకున్నాం. మన దేశానికి వేల సంవత్సరాల నుంచి అద్భుతమైన టెక్స్టైల్ డిజైనింగ్ కల్చర్ ఉంది. కలంకారీ, ఇకత్ పోచం పల్లి, గొల్లభామ, రాజస్థాన్‌లో బాందినీ, గుజరాతీలో లెహెరియా, కాశ్మీర్ ఎంబ్రాయిడరీ ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే ‘పరాగ మంజరి’ మన దేశానికే వన్నె తెచ్చేలా తీసుకురావాలన్నది నా ప్రయత్నం. దీనిని తెలంగాణ ప్రభుత్వం టెక్స్టైల్ శాఖకు అందించి, వారి సపోర్ట్ తీసుకొని, ఈ వర్క్‌ను వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాం’’ అని శివాని నేత చిలుకూరి తెలియజేశారు. లక్ష ΄్యాటర్న్స్ఒక్కో చెట్టు పువ్వుకు ఒక్కో ప్రత్యేకమైన పరాగ రేణువులు ఉంటాయి. ఈ పరాగ రేణువుల మోడల్స్ నుంచి కొన్ని లక్షల ΄్యాటర్న్స్ టెక్స్టైల్ రంగంలోకి తీసుకురావచ్చు. వీటిని పట్టు, కాటన్, సిల్క్, బెడ్ షీట్స్.. ఇలా ప్రతి క్లాత్ మీదకు తీసుకురావచ్చు. ఈప్రాజెక్ట్ తయారు చేస్తున్నప్పుడు ప్రపంచంలో ఎవరైనా ఇలా చేశారా.. అని శోధించాను. కానీ, ఎక్కడా మాకు ఆ సమాచారం లభించలేదు. అందుకే, పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేశాం. ఈ ΄్యాటర్న్స్ వస్త్ర డిజై¯Œ పరిశ్రమల్లో గణనీయమైన ప్రభావం చూపుతాయి. – డాక్టర్ అల్లం విజయ భాస్కర్‌రెడ్డి, అసోసియేట్ప్రొఫెసర్, బోటనీ డిపార్ట్మెంట్, ఉస్మానియా యూనివర్శిటీ – నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి -
స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ వికృత చేష్టలు.. న్యూడ్ ఫొటోలు తీసి..
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్‌లోని ఓ స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ అకృత్యాలు వెలుగు చూశాయి. స్కానింగ్ వచ్చే మహిళలు న్యూడ్ ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తూ స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ బెదిరింపులకు గురి చేస్తున్నాడు. అనేక మంది ఆ కామాంధుని అకృత్యాలకు బలయ్యారు. ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు విషయం వెలుగులోకి వచ్చింది.స్కానింగ్ సెంటర్లో మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఆందోళన చేసి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు.. విచారణ ప్రారంభించారు.నిజామాబాద్ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ యజమాని డాక్టర్ చంద్రశేఖర్ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు.. ఆపరేటర్ ప్రశాంత్ స్పై కెమెరాతో ఫొటోస్ వీడియో తీసినట్లు తెలిసిందని బాధితుల ఫిర్యాదుతో ప్రశాంత్‌ను పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. ప్రశాంత్‌ను ఉద్యోగం నుంచి తొలగించామని కూడా చెప్పారు. ప్రశాంత్ అమ్మాయిలతో చాట్ చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు డాక్టర్ చంద్రశేఖర్. -
ఎన్టీ స్కాన్ అంటే ఏంటీ? దీని వల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది?
నాకిప్పుడు 3వ నెల. రొటీన్ స్కాన్‌లో బేబీ NT థికనెస్ 3.5 సెం.మీ ఉంది అని డాక్టర్ చెప్పారు. అది మంచిది కాదన్నారు. స్కాన్ మెషిన్ తప్పేమో అని నాకు అనిపిస్తోంది. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుంది? మళ్లీ ఎప్పుడు స్కాన్ చేయించుకోవాలి? – డి. అమరజ, బళ్లారి NT(న్యూకల్ ట్రాన్స్లుసెన్సీ) స్కాన్ అనేది టైమ్ బౌండ్‌తో ఉంటుంది. అంటే 11–13 వారాల ప్రెగ్నెన్సీ మధ్యలోనే చేయించుకోవాలి. సమయం తక్కువ కాబట్టి సెకండ్ ఒపీనియన్‌గా వెంటనే వేరే చోట అంటే ఫీటల్ మెడిసిన్ యూనిట్లో పనిచేసే డాక్టర్‌తో చేయించండి. పుట్టబోయే బిడ్డకు మెడ వెనుక చర్మం కింద నార్మల్‌గానే కొంచెం ఫ్లూయిడ్ ఉంటుంది. సాధారణంగా దీనిని మూడవ నెల ప్రెగ్నెన్సీలో NT స్కాన్‌లో చెక్ చేస్తారు. అది 3.5 సెం.మీలోపు ఉంటే ఏ సమస్యా ఉండదు. NT థిక్నెస్ బేబీది 3.5 సెం.మీ కంటే ఎక్కువ ఉంటే ‘Icreased NT’ అంటారు. ఈ కేసులో గర్భస్రావం అయ్యే చాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. బిడ్డ గుండెకు సంబంధించి ఏదైనా అబ్నార్మాలిటీ ఉండొచ్చు. లేదా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ అంటే డౌన్స్ సిండ్రోమ్(Down Syndrome) లాంటివి ఉండొచ్చు. కానీ ఒక్క NT థిక్నెస్ పైనే డయాగ్నసిస్ చేయరు. మీ బ్లడ్ టెస్ట్ కూడా చెక్ చేసి రెండిటినీ కలిపి చేసే టెస్ట్‌ని కంబైడ్ ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ అంటారు. ఆ టెస్ట్ చేయించుకోండి. ఇందులో ‘లో రిస్క్’ అని వస్తే ప్రమాదం తక్కువ అని అర్థం. ‘హై రిస్క్’ అని వస్తే ఫీటస్ మెడిసిన్ కన్సల్టెంట్‌ని కలిస్తే వాళ్లు కౌన్సెలింగ్ చేస్తారు. ఈ రెండు పరీక్షల ఫలితాలు సాధారణంగా వారంలో వచ్చేస్తాయి. ఈ పరీక్షల రిపోర్ట్‌ని బట్టే తర్వాత స్కాన్ ఉంటుంది. హై రిస్క్ కేసెస్‌లో నాల్గవ నెలలో ఉమ్మనీరు చెక్ చెస్తారు. దీనిని Amniocentesis అంటారు. ఈ టెస్ట్ ఫైనల్ కన్ఫర్మేషన్ ఏదైనా మేజర్‌గా క్రోమోజోమ్ ప్రాబ్లమ్‌కి సంబంధించి ఉంటుంది. ఈ రిపోర్ట్ రిజల్ట్‌ని బట్టే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలా వద్దా అనేది నిర్ధారిస్తారు. చాలాసార్లు NT ఒక్కటి 3.5 సెం.మీ కంటే ఎక్కువ ఉన్నా బయాకెమిస్ట్రీ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్‌ని కూడా కలిపి రిస్క్ అసెస్మెంట్ చేస్తారు. లో రిస్క్ వస్తే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయవచ్చు.. ఏ ప్రాబ్లం లేదని అర్థం. అప్పుడు 5, 7, 9వ నెలల్లో స్కాన్స్ ఉంటాయి. కానీ కొంతమంది గర్భిణీల్లో అంటే మేనరికం పెళ్లిళ్లు అయిన కుటుంబంలో జెనెటిక్ లేదా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా.. డయాబెటిస్.. ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉన్నా.. ఫీటస్ మెడిసిన్ కౌన్సెలర్‌ని కలిస్తే ఈ పరీక్షలన్నీ ప్రెగ్నెన్సీకి ముందు లేదా మూడవ నెల మొదట్లోనే చేసి కౌన్సెలింగ్ ఇస్తారు. (చదవండి: ఎగ్స్‌ని ప్రిజర్వ్ చేసుకుని ఐదారేళ్ల తర్వాత పిల్లల్ని కనొచ్చా?) -
జిల్లాలో పనిచేయని మిషన్లు 34.. మూలుగుతున్న అప్లికేషన్లు..
వరంగల్: వరంగల్ సన్‌షైన్ ఆస్పత్రిలోని లింగ నిర్ధారణ పరీక్షల మిషన్ పనిచేయక రెన్యూవల్‌కు దరఖాస్తు ఇచ్చారు. అలాగే, ఆ మిషన్‌ను క్రాష్ (పగులగొట్టడానికి) చేయడానికి అనుమతివ్వాలని వైద్యారోగ్యశాఖకు అర్జీపెట్టుకున్నారు. ► వరంగల్ బాలాజీ ఆస్పత్రిలో 2001 నుంచి స్కానింగ్ ఉంది. ప్రస్తుతం వారు వాడుతున్నది మూడో మిషన్. రన్నింగ్‌లో లేని రెండు మిషన్లను ధ్వంసం చేస్తామని దరఖాస్తు పెట్టుకోగా.. పెండింగ్‌లోనే ఉంది. ► వరంగల్‌లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి లింగ నిర్ధారణ చేసే మిషన్ ఉంది. ఆస్పత్రిని హనుమకొండకు మార్చిన సమయంలో పాత ఆస్పత్రిని మూసివేశామని, మిషన్ వాడలేము.. క్రాష్ చేయాలని వేడుకున్నారు. ► వరంగల్, హనుమకొండ జిల్లాల విభజనలో భాగంగా వరంగల్ జిల్లాకు రెండు కోర్టు కేసులతో ఉన్న ఆస్పత్రులు వచ్చాయి. వీటిలోని స్కానింగ్ మిషన్లు ఇప్పుడు పనిచేయని స్థితిలో ఉన్నాయి. ఇలా వివిధ కారణాలతో లింగ నిర్ధారణ పరీక్షలు చేసే మిషన్లను పగులగొట్టేందుకు అనుమతివ్వాలని కొందరు దరఖాస్తు చేసుకుంటే.. ఇంకొందరు తమ వద్దకు ఏ కేసులు వస్తలేవని ప్రతి నెలా జిల్లా వైద్యారోగ్యశాఖకు పంపే ఎఫ్ ఆడిట్ ఫాంలో విన్నవిస్తున్నారు. అయితే ఏడాదిన్నర నుంచి వినతులు ఇస్తున్నా చర్యలు తీసుకోవడంలో అడుగు ముందుకు వేయడంలేదు. పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ కింద రన్నింగ్‌లో లేని మిషన్లపై చర్య తీసుకునే విషయమై ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. స్టేట్ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఆ మిషన్ల ఫంక్షనింగ్ ఉండడంతో జిల్లాస్థాయిలో అధికారులు ఏమి చేయలేకపోతున్నారు. రాష్ట్ర వైద్య ఉన్నతాధికారులకు విన్నవించినా చట్టంలో స్పష్టత లేక ఈ మిషన్లను ఏం చేయాలన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని వైద్యవర్గాలు కోరుతున్నాయి. జిల్లాలో పనిచేయని మిషన్లు 34.. పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ కింద 2001 నుంచి అల్ట్రా సౌండ్ స్కానింగ్ క్లినిక్‌లు, ఇమేజింగ్ సెంటర్లు ఇప్పటివరకు 102 రిజిస్టర్ అయి ఉండగా.. 68 మాత్రమే నడుస్తున్నాయి. మిగిలినవి 34 రన్నింగ్‌లో లేవు. అయితే వీటిలో జిల్లా విభజనలో వరంగల్ అర్బన్ నుంచి కొత్త వరంగల్ జిల్లాలో చేరిన వరంగల్, ఖిలావరంగల్ మండలాలకు చెందినవే 22 ఉన్నాయి. ప్రతి నెలా ఐదో తేదీన జిల్లా వైద్యారోగ్య విభాగానికి వచ్చే ఎఫ్ ఆడిట్ ఫాంలో పనిచేయని మిషన్ల వివరాలు వస్తున్నాయి. వీటిపై వైద్యవిభాగాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అవి వాస్తవంగా పనిచేయడం లేదా.. ఏమైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరిగే అవకాశం ఉందా అన్న దిశగా దృష్టి సారించాలని ఇటీవల కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆరోగ్యశ్రీ కోసమే అక్కడ మిషన్లు.. ఆప్తమాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ వైద్యం అందించే ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తించాలంటే పీసీ పీఎన్డీటీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడంతో ఆ మిషన్లు తీసుకుంటున్నారు. ఇలా దాదాపు 10లోపు మిషన్లు ఉన్న ఆస్పత్రుల యాజమాన్యాలు అవి రన్నింగ్‌లో లేవని చెబుతున్నాయి. ఇలాంటివి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే వాటిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రస్థాయిలో పాలసీ తేవాలి.. నిర్వహణలో లేని స్కానింగ్ మిషన్ల సెంటర్ల లైసెన్స్ రద్దు చేయాలి. ఆ మిషన్‌ను సీజ్ చేసి పరిశ్రమకు లేదా.. ఇతరులు ఎవరైనా కొనుగోలు చేసుకుంటే ఇచ్చేలా డీఎంహెచ్ఓ ద్వారా జరిగేలా చూడాలి. దీనిపై రాష్ట్రస్థాయిలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ పాలసీ తీసుకురావాలి. తిరిగి లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. స్కానింగ్ మిషన్లు తయారు చేసే పరిశ్రమలను కూడా పీసీ పీఎన్డీటీ చట్టంలోకి తేవాలి. – మండల పరశురాములు, అభ్యుదయ సేవా సమితి అధ్యక్షుడు -
AP: ఉచితంగా అల్ట్రా, టిఫా స్కానింగ్
గుంటూరుమెడికల్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో గర్భిణులకు అ్రల్టాసౌండ్, టిఫా స్కానింగ్ సేవలు ఉచితంగా అందిస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. గర్భిణులకు ఎంతో ముఖ్యమైన అ్రల్టాసౌండ్, టిఫా స్కానింగ్‌లను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సేవలను మంత్రి రజిని శుక్రవారం గుంటూరులోని వేదాంతం హాస్పిటల్లో లాంఛనంగా ప్రారంభించారు. గర్భిణులకు సీమంతం చేసి పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏటా 64వేల మందికిపైగా టిఫా స్కానింగ్ అవసరం ఉంటుందని, అందుకు దాదాపు రూ.7 కోట్ల ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని ఇకపై ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. అల్ట్రా సౌండ్ స్కానింగ్ ప్రతి గర్భిణికి రెండుసార్లు చేయాల్సి ఉంటుందని, వీటిని కూడా పూర్తి ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా చేసేలా సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ ద్వారా 2022–23లో రూ.3,400 కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. 2022–23లో ఆరోగ్యశ్రీ కింద 2.32 లక్షల కాన్పులు ఉచితంగా చేశామని, కేవలం గర్భిణుల చికిత్సకు రూ.247 కోట్లు వెచ్చించామని వివరించారు. ఆరోగ్య ఆసరా పథకం కింద రోగి కోలుకునే సమయంలో ప్రభుత్వం ఆర్థిక భరోసాను కల్పిస్తోందని చెప్పారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 17,54,000 మందికి పైగా ఆర్థిక ఆసరా అమలు చేశామని, అందుకోసం రూ.1,075 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాళి గిరి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంధిరప్రసాద్, కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, వేదాంత హాస్పిటల్ ఎండీ డాక్టర్ చింతా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు.. 18 మంది అరెస్ట్
సాక్షి, వరంగల్: వరంగల్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి అబార్షన్లు చేస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ముఠాకు చెందిన 18 మంది అరెస్టు చేసినట్లు వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి లింగనిర్ధారణకు వినియోగించే మూడు స్కానర్లు, రూ. 73 వేల నగదు, 18 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా వరంగల్‌లో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో కొన్ని రోజులుగా స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తూ.. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి అబార్షన్లు చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ దీనిపై దృష్టి సారించారు. దీన్ని చేదించేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జిల్లా వైద్యారోగ్యశాఖ విభాగాలను రంగంలోకి దించి దర్యాప్తు చేయించారు. ‘ఆపరేషన్ దేశాయ్’ ద్వారా అక్రమంగా లింగనిర్ధారణ, అబార్షన్లు చేసే ఇద్దరు వైద్యులను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. ‘ప్రధాన నిందితుడైన వేముల ప్రవీణ్ పాత నేరస్తుడిగా గుర్తించారు. ‘గతంలో స్కానింగ్ కేంద్రంలో టెక్నీషియన్ గా పనిచేసి నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్థారణ పరీక్షలు చేసి అరెస్టయ్యాడు.గత అనుభవంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. నిందితుడు వేముల ప్రవీణ్ ఆర్ఎంపీలు, పీఆర్ఓలు, హాస్పిటల్ మెనెజ్‌మెంట్, డాక్టర్లతో కలిసి అక్రమ దందా పాల్పడుతున్నాడు. ప్రవీణ్ భార్య సంధ్యారాణితో కలిసిగోపాల్ పూర్ వెంకటేశ్వర కాలనీలో పోర్టబుల్ స్కానర్ల సహయంతో స్కానింగ్ ఏర్పాటు. ఇప్పటి వరకు వందకు పైగా అబార్షన్లు చేసిన ముఠా. స్కానింగ్ అయితే రూ. 10 వేలు తీసుకుంటున్నారు. గర్భస్రావాల కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేలు వసూలు చేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని సీపీ పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో కొందరు ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు ఉన్నారని చెప్పారు. మరికొందరు పరారీలో ఉన్నారని తెలిపారు. చదవండి: నిజామాబాద్: సినిమా రేంజ్లో పోలీసుల ఛేజింగ్.. దొంగలపై కాల్పులు -
గర్భిణులకు అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్
సాక్షి, అమరావతి: గర్భిణులు, తల్లీ బిడ్డల సంరక్షణకు ఇప్పటికే పలు రకాల కార్యక్రమాలను చేపడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు గర్భిణులకు అత్యాధునిక టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ (టిఫా) స్కానింగ్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. తల్లి గర్భంలో ఉండగానే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని, పిండం ఎదుగుదలలో లోపాలను గుర్తించడానికి ఈ పరీక్ష దోహద పడుతుంది. ఖరీదైన ఈ స్కాన్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కార్డుదారులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన గర్భిణులకు ప్రభుత్వం ఉచితంగా నిర్వహించనుంది. ఒక్కో టిఫా స్కాన్‌కు రూ.1,100, అల్ట్రాసోనోగ్రామ్ స్కాన్‌కు రూ.250 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఈ లోపాలున్న వారికి టిఫా స్కాన్ మేనరికం వివాహాలు చేసుకున్న వారికి, బ్యాడ్ అబ్స్ట్రెటిక్ హిస్టరీ (గర్భం దాల్చిన రోజు నుంచే వివిధ సమస్యలుండటం), క్రోమోజోమ్స్, మానసిక లోపాలు (మెంటల్ డిజెబిలిటీ), సింగిల్ జీన్ డిజార్డర్స్, 35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం వంటి సమస్యలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి లోపాలన్నింటినీ టిఫా స్కాన్‌తో గుర్తించే అవకాశం ఉంది. శిశువు గర్భంలో ఏ పొజిషన్లో ఉంది? జరాయువు/మావి (ప్లాసెంటా) ఏ ప్రాంతంలో ఉంది? ఉమ్మ నీరు స్థితి, శిశువులో ఇతరత్రా లోపాలను దీని ద్వారా గుర్తించి, వెంటనే సరిదిద్దడానికి వీలుంటుంది. జరాయువు, బొడ్డుతాడు ఉన్న స్థితిని బట్టి సాధారణ/సిజేరియన్ ప్రసవం అవసరం అవుతుందా అన్నది కూడా అంచనా వేయవచ్చు. 18 నుంచి 22 వారాల గర్భస్థ దశలో ఈ స్కానింగ్ చేస్తారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో లబ్ధిదారులైన గర్భిణులకు పై సమస్యలు ఉంటే వైద్యుల సూచన మేరకు ఒక టిఫా స్కాన్, రెండు అల్ట్రాసోనోగ్రామ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. సమస్యలేమీ లేని వారికి మూడు అల్ట్రాసోనోగ్రామ్ స్కాన్లు చేస్తారు. ఇప్పటికే పలు రకాలుగా అండగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే తల్లీ బిడ్డల సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఆస్పత్రి నుంచి ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లేంత వరకు అండగా ఉంటోంది. ఫ్యామిలీ డాక్టర్ ద్వారా గ్రామాల్లోనే గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య సేవలు చేయిస్తోంది. అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తోంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలను 108 అంబులెన్స్‌ల ద్వారా నిమిషాల్లో ఆస్పత్రులకు చేరుస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి. ఆరోగ్యశ్రీ కింద డెలివరీ సేవలు పొందిన మహిళలకు ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో ఆరోగ్య ఆసరా కింద రూ.5 వేలు సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్న వారిలో గర్భిణులు రెండో స్థానంలో ఉన్నారు. 2022–23లో ఆరోగ్యశ్రీ కింద 2.31 లక్షల మంది గర్భిణులు ప్రసవం సేవలు పొందారు. మరోవైపు ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవానంతరం గర్భిణులను వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ద్వారా క్షేమంగా ఇళ్లకు చేరుస్తున్నారు. గర్భిణుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి సారిస్తూ టిఫా స్కాన్‌ను ఉచితంగా చేస్తున్నాం. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న వైద్య సేవలు, వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కాల్ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేశాం. హై రిస్క్ గర్భిణులను డెలివరీ డేట్‌కు ముందే ఆస్పత్రికి తరలిస్తున్నాం. తద్వారా వారికి మెరుగైన వైద్య సంరక్షణ అందించి తల్లి, బిడ్డకు ఎటువంటి ప్రమాదం లేకుండా ప్రసవానికి అవకాశం ఉంటోంది. – జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ శిక్షణ పూర్తయింది గర్భిణులకు టిఫా, అల్ట్రాసోనోగ్రామ్ స్కాన్ చేయడానికి వీలుగా ప్రొసీజర్లను ఆన్లైన్లో పొందుపరిచాం. ఏ విధంగా ఆన్లైన్లో నమోదు చేయాలనే విషయంపై నెట్వర్క్ ఆస్పత్రుల మెడికోలు, డేటాఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చాం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులైన మహిళలు అందరూ ఈ సేవలను వినియోగించుకోవచ్చు. – ఎం.ఎన్. హరేంధిరప్రసాద్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో -
మరణించిన శిశువు బతికుందని..
సూర్యాపేట క్రైం: శిశువుకు హార్ట్ బీట్ లేకున్నా బతికుందని స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు రిపోర్టు ఇచ్చారు. డాక్టర్లు ఆపరేషన్ చేసి ప్రాణం లేని శిశువును బయటకు తీశారు. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయిందని హాస్పిటల్‌పై బంధువులు దాడి చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన మరిపెద్ది లావణ్యకు పురిటినొప్పులు రావడంతో జిల్లా కేంద్రంలోని మాధవి ఆస్పత్రికి ఆదివారం ఉదయం తీసుకొచ్చారు. డాక్టర్ సలహా మేరకు లావణ్యకు దగ్గర్లోని స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ తీయించగా శిశువుకు హార్ట్ బీట్ లేదని రిపోర్ట్ ఇచ్చారు. భర్త శ్రీకాంత్‌గౌడ్ మరోసారి ఆపిల్ స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ తీయించగా శిశువుకు హార్ట్ బీట్ ఉందని రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసిన డాక్టర్లు మృత శిశువును బయటికి తీశారు. దీంతో డాక్టర్ నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందని బంధువులు ఆగ్రహంతో హాస్పిటల్‌పై దాడి చేశారు. జన్యు సంబంధిత వ్యాధితో శిశువు మృతి చెందినట్లు డాక్టర్ మాధవి వివరణ ఇచ్చారు. -
15 నిమిషాల్లోనే స్కానింగ్ రిపోర్ట్
తిరుపతి (తుడా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన గుండె చికిత్సాలయం ఆదరణ పొందుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బర్డ్ పాత భవనంలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల కార్డియాక్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ నెల 11న ప్రారంభించిన ఈ సెంటర్ రుయాకు వరంగా మారింది. ఇందులోని చిన్నపిల్లల ఆస్పత్రికి రోజుకు 200కు పైగా ఓపీలు నమోదవుతున్నాయి. వీరిలో రోజుకు 15 మంది చిన్నపిల్లలకు ఎకో కార్డియోగ్రామ్ (గుండె స్కానింగ్) అవసరమవుతోంది. కార్డియాక్ సెంటర్లో ఐసీయూ వార్డు మూడు నెలల క్రితం వరకు గుండె స్కానింగ్ కోసం స్విమ్స్, ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లాల్సి వచ్చేది. ప్రభుత్వం కొత్తగా కార్డియాలజిస్టును నియమించడంతో ఈ సమస్య పరిష్కారమైంది. కేవలం 15 నిమిషాల్లోనే ఎకో కార్డియోగ్రామ్ (గుండె స్కానింగ్) రిపోర్టును అందజేస్తున్నారు. ఓపీ సేవలు ముగిసేలోపే రిపోర్టు వస్తుండటంతో వైద్యులు పరిశీలించి వెంటనే సూచనలు చేస్తున్నారు. గతంలో ఈ పరీక్ష చేయించుకుని నివేదిక తీసుకోవాలంటే రోజంతా నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేది. గుండె సంబంధిత సమస్యలున్న పిల్లలను బయటి ప్రాంతాలకు తీసుకెళ్లే పనిలేకుండా స్థానికంగానే అత్యున్నత వైద్యం అందుతుండటంపై బాధితుల కుటుంబీకులతోపాటు వైద్యాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
గర్భధారణ సమయంలో టిఫా స్కానింగ్ ఎందుకు చేస్తారు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏటా వేలాది మంది చిన్నారులు ఏదో ఒక లోపంతో పుడుతున్నారు. ఈ సమస్యను అధిగమించి, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. అవసరమైన వారికి ‘టిఫా’ స్కానింగ్ చేయించాలని నిర్ణయించింది. ఈ టెస్ట్ ద్వారా బిడ్డకు ఉన్న లోపాలను గర్భస్థ దశలోనే గుర్తించేందుకు, తద్వారా తగు వైద్యం అందించేందుకు వీలుంటుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ తాజాగా ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇక టిఫా స్కానింగ్‌లు చేయనున్నారు. టిఫా అంటే.. టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్. టిఫా’ స్కానింగ్ దీని ద్వారా 18 నుంచి 22 వారాల మధ్య పిండాన్ని స్కాన్ చేస్తారు. శిశువు అవయవ క్రమం ఏర్పడే దశలోనే లోపాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. ఇలా గుర్తించిన సమస్యలకు మందులు వాడొచ్చు. లేదా అవకాశముంటే అబార్షన్ చేయించుకునేందుకు వీలుంటుంది. ఒక్కో స్కానింగ్‌కు రూ.వెయ్యి ఖర్చవుతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టిఫా లేకుంటే.. ప్రైవేట్ డయాగ్నిస్టిక్ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వమే ఉచితంగా చేయిస్తుంది. 7 శాతం మందిలో లోపాలు.. ప్రతి వంద మంది గర్భిణుల్లో 7 శాతం మందిలో లోపాలుండే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీళ్లందరికీ టిఫా స్కానింగ్ చేసి ఆ లోపాలను సరిదిద్దుతారు. ఎక్కువగా మేనరికం వివాహాల వల్ల, క్రోమోజోమ్స్ లోపం వల్ల, మానసిక లోపాలు(మెంటల్ డిజబిలిటీ), సింగిల్ జీన్ డిజార్డర్స్, 35 ఏళ్ల తర్వాత గర్భిణి అవడం వల్ల, బ్యాడ్ అబ్స్ట్రెటిక్ హిస్టరీ(గర్భం దాల్చిన రోజు నుంచే వివిధ సమస్యలు తలెత్తడం), కన్సాగ్యుయస్ మ్యారేజెస్(రక్త సంబంధీకులను పెళ్లి చేసుకోవడం), సెక్స్ లింక్డ్ డిజార్డర్స్(శృంగార సంబంధిత వ్యాధులు).. ఇలా రకరకాల కారణాలతో లోపాలు తలెత్తే అవకాశముంటుంది. అలాగే రాష్ట్రంలో ఏటా 8.96 లక్షల ప్రసవాలు జరుగుతాయని కుటుంబ సంక్షేమ శాఖ చెబుతోంది. వీటిలో 7 శాతం మందికి.. అంటే 62 వేల మందికి పైగా గర్భిణులకు టిఫా స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. తల్లి ఆరోగ్య పరిస్థితులు, రక్త సంబంధీకులను వివాహం చేసుకున్నారా? గర్భం దాల్చాక పరిస్థితులు.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాకే వైద్యాధికారి, లేదా గైనకాలజిస్ట్ టిఫా స్కానింగ్‌కు రిఫర్ చేస్తారు. -
రూ .150 కే స్కానింగ్, రూ. 50 కే ఎంఆర్ఐ
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని గురుద్వారా బంగ్లా సాహిబ్ పేద రోగులకు ఊరట కల్పించనుంది. దేశంలోనే అతి చౌక డయాగ్నొస్టిక్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. తక్కువ ఖర్చుతో స్కానింగ్, ఎంఆర్ఐ లాంటి సదుపాయాలను కల్పించనుంది. అలాగే కిడ్నీ రోగులకోసం త్వరలోనే ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబరు మాసంనుంచి తక్కువ ఖర్చుకే ఎంఆర్ఐ, స్కానింగ్ లాంటి సదుపాయాలను కల్పించనున్నామని మేదాంతా చైర్మన్, గురుహరికిషన్, రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అరవిందర్ సింగ్ సోనీ వెల్లడించారు. అల్ట్రాసౌండ్ లేదా ఎక్స్‌రే కోసం 150 రూపాయలు, ఎంఆర్ఐ కేవలం 50 రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నామని తెలిపారు. తద్వారా అల్పాదాయ ఆదాయ వర్గాల ప్రజలకు సహాయపడాలని నిర్ణయించామన్నారు. అలాగే గురుద్వార ప్రాంగణంలో మూత్రపిండాల రోగుల కోసం హరికిషన్ ఆసుపత్రిలో డయాలసిస్ చేస్తున్నట్లు సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (డిఎస్జిఎంసి) మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. ఇది వచ్చే వారంనుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. డయాలసిస్ ప్రక్రియకు 600 రూపాయలు మాత్రమే చార్జ్ చేస్తామన్నారు. అవసరమైన ఇతర రోగులకు ఎంఆర్ఐ స్కాన్‌కు 800 రూపాయలు (ప్రైవేటు కేంద్రాల్లోఎంఆర్‌ఐకి ఖరీదు రూ.2,500) ధరకే అందించినున్నట్టు కూడా తెలిపారు. అయితే ఈ రాయితీ ఎవరికివ్వాలనే విషయాన్ని ఆసుపత్రి కమిటీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. ఇందుకోసం 6 కోట్ల విలువైన డయాగ్నొస్టిక్ యంత్రాలను ఆసుపత్రికి విరాళంగా ఇచ్చామన్నారు. వీటిలో నాలుగు డయాలసిస్ మెషీన్స్, ఒక్కో అల్ట్రాసౌండ్, ఎక్స్-రే,ఎంఆర్ఐ యంత్రాలు చొప్పున ఉన్నట్టు ప్రకటించారు. After a low-cost dispensary, Gurudwara Bangla Sahib is now slated to open a cheap diagnostic facility. An ultrasound will cost Rs. 150 & an MRI Scan Rs. 50! 🙏 pic.twitter.com/oZLKQblUTa — Dr. Arvinder Singh Soin (@ArvinderSoin) October 5, 2020 -
‘మెడాల్’ మాయ.. టెస్టులు పేరుతో దందా
ఒంగోలు: వైద్యో నారాయణో హరి.. అని ప్రపంచం మొత్తం కొనియాడుతున్న వేళ కొందరు అక్రమార్కుల చేష్టలు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. ప్రపంచం మొత్తాన్ని కోవిడ్ వణికిస్తున్న వేళ కనిపించని శత్రువుపై జనం సామూహిక పోరాటం సాగిస్తున్న తరుణంలో కొన్ని ఆస్పత్రులు, ల్యాబ్‌ల నిర్వాహకులు కాసుల వేట ప్రారంభించారు. నాణ్యమైన వైద్యం అందించేందుకు రోగి వ్యాధి తీవ్రతను గుర్తించేందుకు నిర్వహించే పరీక్షలకు సంబంధించి పలు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ విభాగాలు సంయుక్తంగా జిల్లా కేంద్రం ఒంగోలులోని మెడాల్ కేంద్రంపై దాడులు జరిపాయి. కేవలం ఒక్క సిటీ స్కాన్కే రూ.2,000 అదనంగా వసూలు చేస్తున్నట్లు తనిఖీల్లో స్పష్టమైంది. కోవిడ్ పరీక్షల పేరుతో అటు ఆసుపత్రులు, ఇటు ప్రైవేటు ల్యాబ్‌లు డబ్బులు దండుకుంటున్నాయన్న విమర్శలు ఇటీవల బాగా పెరిగిపోయాయి. అయిన దానికి, కాని దానికి సిటీ స్కాన్ పేరుతో అనవసర పరీక్షలు చేయిస్తున్నారు. తద్వారా వ్యాధి నిర్థారణకే ప్రజలు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సిటీ స్కాన్‌కు ప్రభుత్వం రూ.2500 మాత్రమే వసూలు చేయాలని ఉత్తర్వులు జారీచేయగా కొన్ని ల్యాబ్‌లు రూ.4వేల నుంచి రూ.4500 వరకు వసూలు చేస్తున్నాయి. కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్నవారు, ప్రైమరీ లేదా సెకండరీ కాంటాక్టులు ఉన్నవారు ప్రైవేటు ల్యాబ్‌లు, ఆసుపత్రులను ఆశ్రయిస్తుండటంతో నిర్ధారణ పరీక్షకు 1400లు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా అవసరాన్ని బట్టి అధిక దోపిడీ చేస్తున్నారు. ఇక రూ.800కు గతంలో చేసే రక్త పరీక్షలు ఇప్పుడు రూ.1500కు పెంచేశారు. ఇలా పలు విధాలుగా ప్రజానీకం దోపిడీకి గురవుతున్న వేళ మెడాల్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం సంచలనంగా మారింది. తనిఖీ ఇలా.. కోవిడ్‌తో బాధపడుతున్న ఒక పేషెంటుకు సిటీ స్కానింగ్ చేయించుకోవాల్సి వచ్చింది. అతను ప్రభుత్వం నిర్ణయించిన మొత్తం కన్నా అధిక మొత్తం వసూలు చేస్తున్నారంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ కార్యాలయంలో రాత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీంతో విజిలెన్స్ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి ఒక వైద్యుడు సంయుక్తంగా గురువారం మెడాల్ ల్యాబ్‌కు వెళ్లారు. ఫిర్యాదుదారు నుంచి సిటీ స్కాన్‌కు రూ.4500 వసూలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా గుర్తించారు. అనంతరం మెడాల్ కేంద్రంలోని పరీక్షల యంత్రాలను పరిశీలించారు. ఇన్స్ట్రుమెంటల్ సర్టిఫికేట్లు కావాలని కోరగా కొన్ని చూపించలేకపోయారు. రిసెప్షన్ కౌంటర్ వద్ద ఏయే పరీక్షకు ఎంతెంత వసూలు చేస్తున్నారో బోర్డు ప్రదర్శించాల్సి ఉన్నా అది కూడా లేనట్లు గుర్తించారు. దీంతో మెడాల్ ఒంగోలు బ్రాంచి మేనేజర్ సాయికిరణ్‌కు వారంరోజుల్లోగా అన్ని పత్రాలను సమర్పించాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. హార్డ్డిస్్కలలో లభించే సమాచారం ఆధారంగా జిలా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు విజిలెన్స్ అధికారులు మెడాల్ ఒంగోలు కేంద్రంపై చర్యలకు సిఫార్సు చేయనున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎటువంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన స్కానింగ్ సెంటర్ సీజ్
పీలేరు (చిత్తూరు): చిత్తూరు జిల్లా పీలేరులో లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన ఆస్పత్రిని పీసీపీఎన్డీటీ (గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం) కమిటీ మంగళవారం సీజ్ చేసింది. కమిటీ సభ్యురాలు డాక్టర్ రమాదేవి మీడియాకు వివరాలు వెల్లడించారు. తిరుపతికి చెందిన హైరిస్క్ మానిటరింగ్ టీమ్ నుంచి తమకు అందిన సమాచారం మేరకు అగ్రహారానికి చెందిన కవిత (వివాహిత) గర్భస్రావంతో తిరుపతి రుయాలో చేరిందన్నారు. ఈ మహిళ కుటుంబసభ్యులను విచారించగా పీలేరు నోబుల్ నర్సింగ్ హోమ్‌లో చికిత్స నిమిత్తం అడ్మిట్ అయ్యామని, అక్కడ డాక్టర్ గాలేటి బాషా తమకు గర్భవిచ్ఛిత్తి నిమిత్తం చేసిన చికిత్స ఫలితంగా ఆరోగ్యం విషమించడంతో ఇక్కడికి పంపారని తెలిపారన్నారు. పీసీపీఎన్డీటీ కమిటీ సభ్యురాలు డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పూజారి లోకవర్ధన్ ఆధ్వర్యంలో సాధారణ విచారణ నిమిత్తం పీలేరులోని నోబుల్ నర్శింగ్ హోమ్‌కు వచ్చారు. అక్కడ తమ ఎదుటే పీలేరుకు చెందిన మస్తాన్ భార్య సునీర్ (27)అనే మహిళకు స్కానింగ్ చేసి లింగనిర్ధారణ పరీక్షలు పూర్తి చేసుకుందని, గర్భంలో ఆడ శిశువు ఉన్నట్లు వారికి తెలియజేయడం తమ కళ్లెదుటే జరిగిందన్నారు. దీంతో తాము వచ్చిన విచారణకు తోడు ఇక్కడ ప్రత్యక్షంగా జరిగిన సంఘటనలపై జిల్లా కలెక్టర్‌కు నివేదిక మర్పిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పీలేరు తహసీల్దారు నేతృత్వంలో నర్శింగ్ హోమ్‌లో నిర్వహిస్తున్న స్కానింగ్ సెంటరును సీజ్ చేశామన్నారు. పూర్తి విచారణ అనంతరం అక్కడి డాక్టర్ గాలేటి బాషాపై చర్యలుంటాయని వివరించారు. నర్శింగ్ హోమ్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని తేలిందన్నారు. -
జిల్లాలో విచ్చలవిడిగా లింగ నిర్ధారణ
జిల్లాలో భ్రూణహత్యలు కొనసాగుతున్నాయి. 20 వారాలు దాటిన తర్వాత గర్భస్రావం చేయకూడదని నిబంధనలు ఉన్నా పలు ప్రైవేటు ఆసుపత్రులు పట్టించుకోవడం లేదు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లినా పెద్దగా çస్పందించడం లేదు. కర్నూలులోని కొత్త బస్టాండ్, ఎన్ఆర్ పేట, ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉండే పలు ఆసుపత్రులలో యథేచ్ఛగా భ్రూణహత్యలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రతి నెలా 60కి పైగానే చేస్తున్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, గూడూరు, డోన్, నంద్యాల, నందికొట్కూరు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. కర్నూలు(హాస్పిటల్):జిల్లాలో 260కి పైగా స్కానింగ్ కేంద్రాలకు అనుమతులు ఉన్నాయి. అయితే అనధికారికంగా మరో 400కు పైగానే నిర్వహిస్తున్నారు. పీసీపీఎన్డీటీ యాక్ట్ ప్రకారం లింగనిర్ధారణ నేరం. దీనికి భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. కర్నూలుతో పాటు కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు వంటి ప్రాంతాల్లోని స్కానింగ్ కేంద్రాల్లో పలువురు వైద్యులు యథేచ్ఛగా లింగనిర్ధారణ చేస్తున్నారు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తేలితే చాలు అధిక శాతం అబార్షన్‌కు సిద్ధమవుతున్నారు. ఇరువర్గాల సమ్మతి మేరకు జరుగుతున్న ఈ తంతులో అటు గర్భిణి కుటుంబసభ్యులు, ఇటు వైద్యవర్గాలు విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. లింగనిర్ధారణ, భ్రూణహత్యలో ఇద్దరికీ శిక్ష పడుతుందని భావించి గుట్టుగా ఉంచుతున్నారు. 930కి తగ్గిన బాలికల సంఖ్య జిల్లాలో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం రోజురోజుకూ పెరుగుతోంది. 2011 లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు గాను జిల్లాలో సగటున 930 మందిమాత్రమే మహిళలు ఉన్నారు. డోన్‌లో 889, ప్యాపిలి 894, గడివేముల 899, శ్రీశైలం 892, ఆదోని డివిజన్లో 900 మాత్రమే స్త్రీలు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ప్రస్తుతం ఈ సంఖ్య మరింత తగ్గినట్లు తెలుస్తోంది. 920లోపు స్త్రీలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ సైతం సీరియస్‌గా పరిగణించినట్లు సమాచారం. జిల్లాలో బాలికల సంఖ్య ఎందుకు తగ్గుతుందో తెలుసుకునేందుకు త్వరలో ఓ బృందం జిల్లాకు రానున్నట్లు తెలిసింది. అధికారులంటే భయం లేదు లింగనిర్ధారణ, భ్రూణహత్యలను నివారించేందుకు ఉద్దేశించిన పీసీ పీఎన్డీటీ చట్టం అభాసుపాలవుతోంది. ఈ చట్టం ఉన్నట్లు ఆయా స్కానింగ్ కేంద్రాల్లో పోస్టర్లు అతికించి, లోపల మాత్రం యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా ఉంటుంది. కానీ జిల్లాలో ఏ ఒక్కరికీ ఇప్పటి వరకు ఈ శిక్షలు అమలు కాలేదు. స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తున్నాం జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలను అధికారులు తరచూ తనిఖీ చేస్తున్నారు. పీసీపీఎన్డీటీ యాక్ట్ ప్రకారం స్కానింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నారా, లేదా అని పరిశీలిస్తున్నాం. నిబంధనల మేరకు లేని కేంద్రాలకు నోటీసులు ఇస్తున్నాం. –డాక్టర్ కె.వెంకటరమణ, ఇన్చార్జ్ డీఎంహెచ్‌వో -
టీనేజర్ కడుపులో దెయ్యం పిల్ల!
వర్జీనియా దేశంలోని రిచ్మండ్ నగరానికి చెందిన ఐయన్నా కారింగ్టన్ (17) అనే టీనేజర్ తొలిసారి తల్లి కాబోతోంది. కడుపులో ఉన్న 24 వారాల బేబీ ఎలా ఉందో తెలుసుకునేందుకు సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకుంది. స్కానింగ్‌లో కనిపించిన తన బేబీ దశ్యాన్ని చూసి ఆమెకు గుండె ఆగిపోయినంత పనయింది. జుట్టంతా విరబూసుకొని గుడ్లు తెరచి చూస్తున్నట్లు ఉన్న బేబీ స్కానింగ్ చిత్రం అచ్చం దెయ్యం పిల్లలా ఉంది. మిడ్ నర్సు నచ్చచెప్పాక తేరుకున్న ఐయన్నా తన బేబీ స్కానింగ్ చిత్రాన్ని సోషల్ మీడియా మిత్రులకు షేర్ చేసింది. కొందరు ఐయన్నా లాగా భయాందోళనలు వ్యక్తం చేయగా, మిగతా వారు మార్ఫింగ్ ఫొటో అంటూ కొట్టివేశారు. తనకు పుట్టబోతున్న బిడ్డ ఆడో, మగో కూడా తెలియదని ఐయన్నా చెప్పారు. అయితే స్కానింగ్ అప్పుడు ఆమె పక్కనే ఉన్న మిడ్ నర్సు మాత్రం ఆడ శిశువే అని తెలిపింది. సాధారణంగా కడుపులోని శిశువులు కళ్లు మూసుకొని ఉంటారని, కళ్లు తెరచి చూడరని, ఐయన్నా బిడ్డను స్కానింగ్ చేసినప్పుడు ఆపాప కళ్లు బాగా తెరచి కెమేరా వైపు చూడడం వల్ల స్కానింగ్‌లో ఆ పాప దెయ్యంలా కనిపిస్తోందని చెప్పారు. కొందరు గర్భస్త్ర శిశువులు స్కానింగ్ అప్పుడు అలా కనిపిస్తారుగానీ, అందరి పిల్లల్లానే ఉంటారని హెడ్ నర్సు చెప్పడంతో ఐయన్నా స్థిమిత పడింది. అయినా ఏదో కోశాన అనుమానం ఉన్నట్లు ఐయన్నా కాస్త భయపడుతోంది. అయినా మొదటిసారి తల్లి అవుతున్న ఆనందం వేరులే! అంటూ సరదాగానే ఉంటోంది. -
గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కొన్ని స్కానింగ్ సెంటర్లు గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. పీసీపీఎన్డీటీ జాతీయ తనిఖీ బృందం గత రెండు రోజులుగా హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో తనిఖీలు నిర్వహించగా ఈ విషయం మరోసారి బయటపడింది. మూడు జిల్లాల్లోనూ పది సెంటర్లను తనిఖీ చేయగా వీటిలో ఐదు సెంటర్లు నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు. ఆయా సెంటర్లకు నోటీసులు జారీ చేసి, చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది. వీటిలో ఒక కార్పొరేట్ ఆస్పత్రి సహా శివారులోని పలు స్కానింగ్ సెంటర్లు ఉన్నట్లు తేలింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 800పైగా స్కానింగ్ సెంటర్లు ఉండగా, రంగారెడ్డి జిల్లాల్లో 522, మేడ్చల్ జిల్లాలో 600పైగా స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. అధికారులు ఇప్పటికే వీటిల్లో తనిఖీలు నిర్వహించి, లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న వైద్యులతో పాటు రేడియాలజిస్టులు లేని, రికార్డులు సరిగా నిర్వహించని స్కానింగ్ సెంటర్లను గుర్తించి కేసులు నమోదు చేశారు. గతంలో 30పైగా సెంటర్లను సీజ్ చేసిన అధికారులు తాజాగా మరో ఐదు సెంటర్లపై చర్యలకు ఆదేశాలు జారీ చేయడం విశేషం. ఎప్పటికప్పుడు ఆయా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మొద్దు నిద్రవీడక పోవడం వల్లే జాతీయస్థాయి బృందాలు రంగంలోకి దిగాల్సి వస్తోంది. ఈ దాడుల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూపలు కేంద్రాలు అడ్డంగా దొరికిపోతున్నాయి. -
లక్ష్మీదేవిని చూపితే ‘పాప’మే
లింగ నిర్ధారణ కొత్త పుంతలు తొక్కుతోంది. గర్భస్థ శిశువు ఆడ లేక మగ అని చెప్పడానికి స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు గతంలో రాతలు, మాటల ద్వారా చెప్పేవారు. ఇప్పుడు మొబైల్‌ఫోన్ రికార్డింగ్స్ నేపథ్యంలో గర్భస్థ శిశువు పాప అయితే లక్ష్మీదేవి ఫొటో చూపిస్తున్నారు. మగ అయితే వెంకటేశ్వరస్వామి ఫొటో చూపిస్తున్నారు. అంతేకానీ లింగ నిర్ధారణ మాత్రం ఆపడం లేదు. ఇంత జరుగుతున్నా స్పందించని జిల్లా అధికారులు భ్రూణ హత్యలు ఎలా నివారిస్తారో వారికే తెలియాలి. సాక్షి, తిరుపతి తుడా: కొత్త చట్టాలు చేసే కొద్దీ స్కానింగ్ సెంటర్లకు వసూళ్లు పెరుగుతున్నాయి కానీ చట్టాలు మాత్రం సక్రమంగా అమలు కావడం లేదు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖలో నమోదు చేసుకున్న స్కానింగ్ సెంటర్లు దాదాపుగా 186 వరకు ఉన్నాయి. అను మతులు లేనివి, అనుమతులను పునరుద్ధరణ చేసుకోనివి మరో 50 వరకు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వీటిల్లో తిరుపతి, చిత్తూరు నగరాల్లోని కొన్ని స్కానింగ్ కేంద్రాల్లో లింగనిర్ధారణ జరుగుతోంది. స్కానింగ్‌కు వచ్చే వారి స్థాయిని బట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. రూ.20 వేలు నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాపరేట్ అథారిటీలో కలెక్టర్, జిల్లా న్యాయమూర్తి, ఎస్పీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఎన్జీఓ సభ్యుడు మొత్తం ఐదుగురు సభ్యులుగా ఉంటారు. జిల్లా అడ్వయిజరీ కమిటీ 15 మంది సభ్యులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పనిచేస్తుంది. ఈ రెండు కమిటీలు మూడు నెలలకోసారి సమావేశమై ప్రజల వైద్యారోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. అయితే అలాంటి సమావేశాలు సకాలంలో నిర్వహించిన దాఖలాల్లేవు. దీంతో స్కానింగ్ సెంటర్ల ఆగడాలు మితిమీరిపోయాయి. ఇదీ గుర్తు స్కానింగ్ సెంటర్లు ఆడ.. మగ బిడ్డలను సంబంధిత తల్లిదండ్రులకు ఫొటోలతో చెప్పే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. నేరుగా కానీ, మరోలా చెప్పేందుకు భయపడుతున్నారు. ఎవరైనా మొబైల్‌తో రికార్డు చేసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. స్కానింగ్ సెంటర్లలో లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి ఫొటోలను ఏర్పాటు చేసుకుని, ఆడ బిడ్డ అయితే లక్ష్మీదేవి ఫొటో చూపిస్తారు. మగ బిడ్డ అయితే వెంటేశ్వర స్వామి ఫొటోవైపు కళ్లతో సైగ చేస్తారు. ఇలా స్కానింగ్ సెంటర్ల దందా కొనసాగుతోంది. భ్రూణ హత్యలూ జరుగుతు న్నాయి. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం శోచనీయం. నిబంధనలు ఇవి ►ఈ చట్టం అనుసరించి అన్ని జన్యు సంబంధిత పరీక్షలు నిర్వహించే వ్యక్తులు, సంస్థలు (ప్రభుత్వ, ప్రయివేటు) వైద్యులు సంబంధిత జిల్లా ప్రత్యేక నిర్దేశిత అధికారి వద్ద తప్పని సరిగా నమోదు చేసుకోవాలి. ►అన్ని స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ చేసేది లేదని సందర్శకులందరికీ కనిపించేలా తప్పకుండా పెద్ద సైజు అక్షరాల్లో బోర్డు ఏర్పాటు చేయాలి. ► ఈ బోర్డులను ఆంగ్లం, తెలుగు తదితర ప్రాంతీయ భాషల్లోబాగా కనిపించేలా ఉంచాలి. ►అన్ని అల్ట్రా స్కానింగ్ యంత్రాలు, పరికరాలు, లింగ నిర్ధారణ చేసేయంత్రాలు, ప్రదేశాలు నమోదు చేయించాలి. ►సుప్రీం కోర్టు ఆదేశానుసారంగా ఉత్పత్తి దారులు, పంపిణీ దారులు, అమ్మకం దారులు ఈ యంత్రాలు, పరికరాలు నమోదు పత్రం (సంస్థ రిజిస్ట్రేషన్ పత్రం) సమర్పించనిదే వీటిని విక్రయించకూడదు, పంపిణీ చేయకూడదు. ►ఈ నమోదు పత్రం ప్రతి ఐదేళ్లకు ఒకసారి పునరుద్ధరణ చేసుకోవాలి. ►స్కానింగ్ సెంటర్లలో ఫారం ఎఫ్‌ను విధిగా వినియోగించి, ఆ వివరాలు జిల్లా వైద్యారోగ్యశాఖకు ప్రతి నెలా ఐదవ తేదీలోగా అందించాలి. ►స్కానింగ్‌కు సూచించిన వైద్యుల ధ్రువీకరణ పత్రం విధిగా ఉండాలి. ఈ పత్రాన్ని ఫారం– ఎఫ్ తో జతపరచి, భద్రపరచాలి. దాన్ని తనిఖీ సమయంలో అధికారులకు చూపించాలి. అయితే ఈ నిబంధనలు చాలావాటిల్లో అమలు చేయడంలేదు. -
గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు
సాక్షి, నల్లగొండ టౌన్: జిల్లా కేంద్రంలో లింగనిర్ధారణ పరీక్షల దందా మూడు పూలు..ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రం నడిబొడ్డులోనే అధికారుల కళ్లు గప్పి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లింగనిర్ధారణ పరీక్షలను కొనసాగిస్తూ లక్షల రూపాయలను దండుకుంటున్న తీరు విస్మయం కలిగిస్తోంది. తగ్గిపోతున్న ఆడపిల్లల సంఖ్యను పెంచుకుందామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నప్పటికీ లింగనిర్ధారణ పరీక్షలను నిర్వహించి ఆడపిల్ల అని తేలితే తల్లికడుపులోనే చిదిమేస్తున్న తీరు బాధాకరం. ఇప్పటికే ప్రతి వెయ్యిమంది బాలురకు కేవలం 922 మంది బాలికలు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖగణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొందరు వైద్యులు సిండికేట్‌గా ఏర్పడి జిల్లా కేంద్రంలో ఉన్న ఓ స్కానింగ్ సెంటర్‌ను ప్రోత్సహిస్తూ లింగనిర్ధారణ పరీక్షల కోసం కేసులను రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్కానింగ్ సెంటర్లో భాగస్వాములుగా ఉన్న వైద్యులతోపాటు మరికొంత మంది వైద్యులు స్కానింగ్‌ల పేరుతో గర్భిణులను పంపించి గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్ధారణ పరీక్షలను చేయిస్తున్నారన్నది విశ్వసనీయ సమాచారం. గర్భిణి వెంట వచ్చిన వారిని మాటల్లో కలిపి.. ప్రతి గర్భిణి నెలనెలా వైద్య పరీక్షల కోసం వైద్యుల వద్దకు వెళ్తుంటారు. బిడ్డ ఎదుగుదలకు వెళ్లిన సమయంలో డాక్టర్లు వారి అమాయకత్వాన్ని, బిడ్డ ఆడ, మగ తెలుసుకోవాలన్న ఆతృతను గమనిస్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారిని టార్గెట్‌గా చేసుకుని స్కానింగ్ తీయించుకోమని ఉచిత సలహా ఇవ్వడంతోపాటు నిత్యం రద్దీగా ఉండే జిల్లా కేంద్రం నడిబొడ్డులో గల స్కానింగ్ సెంటర్‌కు రెఫర్ చేస్తున్నారు. చెకప్‌కు వచ్చే వారి తల్లినో, అత్తనో మాటలలో కలిపి ఆడపిల్ల, మగబిడ్డ అని తెలుసుకోవాలని ఉందా అని అడిగి..వారు ఒకే అన్న వెంటనే సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చి స్కానింగ్‌లో లింగనిర్ధారణ చేసి తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నట్లు తెలుస్తోంది. స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు గర్భిణులకు విషయం తెలియజేయకుండా కేవలం రెఫర్ చేసిన వైద్యులకే లింగనిర్ధారణ రిజల్ట్‌ను వెల్లడిస్తారు. దీంతో అడపిల్ల అని తేలిందని, ఆడపిల్లకావాలా వద్దా అని వారిని అడిగి వద్దు అని సమాధానం వచ్చిన వెంటనే అబార్షన్ చేయించుకోవాలని, దానికి రూ.10 నుంచి రూ15 వేల వరకు, లింగనిర్ధారణలో ఆడ, మగ అని చెప్పినందుకు రూ. 6 నుంచి రూ.10 వేల వరకు వారి వారి స్థాయిని బట్టి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు జాతీయ రహదారిపై ఉన్న పట్టణాలలో మొబైల్ స్కానింగ్ వాహనాలను తీసుకువచ్చి లింగనిర్ధారణ పరీక్షలను నిర్వహించడం విశేషం. ప్రతి నిత్యం పదుల సంఖ్యలో లింగనిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నప్పటికి సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. అంతరించి పోతున్న ఆడపిల్లలను రక్షించుకోవాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆశయాలకు తూట్లు పొడుస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు , లింగనిర్ధారణ పరీక్షలను నివారించకపోతే ఆడపిల్లలు అంతరించిపోయే ప్రమాదం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంటోంది. ఆర్ఎంపీలు కూడా అక్కడికే.. ఇప్పటికే ఒక ఆడపిల్ల ఉండి మరోమారు గర్భం దాల్చిన మహిళలు మగపిల్లాడు కావాలని కోరుకుంటారు. అలాంటి వారిని గ్రామాల్లోని ఆర్ఎంపీలు గుర్తించి వారికున్న పరిచయంతో ఆ స్కానింగ్ సెంటర్‌కే రెఫర్ చేస్తుండడం గమనార్హం. ఇలా ప్రతి కేసుకు సదరు ఆర్ఎంపీలకు కమీషన్ వెళ్తుంది. -
ఆడపిల్ల అని తేలితే అబార్షనే
సాక్షి, మహబూబాబాద్: వైద్యసేవల నిమిత్తం కాకుండా లింగనిర్ధారణ పరీక్షలు చేయడం, అవసరం లేకున్నా అబార్షన్ చేయటం చట్టరీత్యానేరం. ఈ విషయం సామాన్యులకు తెలుసో, తెలియదో కానీ ఉన్నత చదువులు పూర్తి చేసి సమాజంలో గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న వైద్యులకు తెలియదని అనుకోవటం పొరపాటే. కానీ నిబంధనలు, చట్టాలు ఇవేమీ తమకు పట్టవంటూ కొందరు వైద్యులు అబార్షన్లు చేస్తూ నిబంధనలను కాలరాస్తున్నారు. వీరికి తోడుగా గ్రామాల్లో ప్రాథమిక చికిత్స అందించే ఆర్ఎంపీలు సైతం ఇటువంటి ఆబార్షన్లనే ప్రధాన వృత్తిగా కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఖమ్మంలో ఈ తరహా దందా రహస్యంగా సాగుతోంది. ఈ దందాలో గ్రామీణ ప్రాంతాలలోని ఆర్ఎంపీ, పీఎంపీలే కీలకంగా వ్యవహరిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. సామాజిక చైతన్యం లేకపోవటమే నిరక్షరాస్యత, సామాజిక చైతన్యం లేని వాళ్లల్లో చాలా మంది ఆడ పిల్లలు వద్దనుకుంటున్నారు. పేదరికం తదితర కారణాలతో ఇక్కడి తల్లిదండ్రులు తమకు మగపిల్లాడు కావాలని కోరుకుంటున్నారు. దీని కోసం తమకు పుట్టబోయే సంతానం ఆడ, మగ తెలుసుకోవాలని ఆర్ఎంపీ డాక్డర్లను సంప్రదిస్తున్నారు. తమ దగ్గరికి వచ్చిన వారికి అవగహన కల్పించాల్సిన ఆర్ఎంపీలు డబ్బే ధ్యేయంగా, తమకు తెలిసిన స్కానింగ్ కేంద్రాల్లో రహస్యంగా పరీక్షలు చేయిస్తూ, ఆడపిల్ల అని తేలితే సొంతగా వారే ఆబార్షన్లు చేస్తున్నారు. అలాగే జిల్లాలో కొంతమంది అవాహితలు గర్భందాల్చిన సందర్భాల్లో గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించుకోవడానికి వీరిని సంప్రదిస్తున్నారు. ఇదే ఆసరాగా వారి దగ్గర నుంచి డబ్బు దండుకోవటంతో పాటు, వారిని బెదిరించి అన్ని రకాలుగా వాడుకుంటున్నా సంఘటనలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లా వైద్యధికారులు గ్రామాల్లో ప్రజలకు అవగహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే గ్రామాల్లో అనాధికారికంగా కొనసాగుతున్నా పాలీ క్లీనిక్‌లను తరుచూ తనిఖీలు చేపట్టాలని సామాజిక కార్యకర్తలు కోరుకుంటున్నారు. భవిష్యత్... భయానకం జిల్లాలో ప్రతీ వెయ్యి మంది పురుషులకు 996 మంది మాత్రమే ఆడపిల్లలు ఉన్నారు. సకుటుం బ సమగ్ర సర్వే ప్రకారం 986 మంది మాత్రమే ఉన్నారు. ఈ గణాంకాలు భవిష్యత్‌లో ఎదుర య్యే ప్రమాద ఘంటికల్ని తెలియజేస్తున్నాయి. చట్టరీత్యా చర్యలు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పై ప్రజలకు విస్తృతంగా అవగహన కల్పిస్తున్నాం. ముందుగా ప్రజల ఆలోచనలో మార్పు రావాలి. ఆడపిల్ల మనజాతికి పునాది అని గ్రహించాలి. అలాగే ఎవరైన లింగ నిర్ధారణ పరీక్షలు చేయటం గాని, అబార్షన్లు చేస్తున్నట్లు తేలితే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరుతున్నాం. చట్టవ్యతిరేఖ పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – ధనసరి శ్రీరాం, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి -
అడ్డగోలు దోపిడీ
అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రిలోని సీటీ స్కాన్ నిర్వాహకులు అడ్డగో లు దోపిడీకి తెరలేపారు. 2017లో స్కానింగ్ యంత్రం ఏర్పాటు చేసినప్పటి నుంచి విద్యుత్ వినియోగాన్ని తెలిపే మీ టర్ను ఏర్పాటు చేయించుకోలేదు. ఇ ప్పటి వరకు ఆస్పత్రి యాజమాన్యంపై రూ 25 లక్షల నుంచి రూ 30 లక్షల భారం పడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రూ లక్షల్లో సీటీ స్కాన్ నిర్వాహకులు లబ్ధిపొం దారని చెప్పాలి. అయినా ఆస్పత్రి ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎంఓయూ బుట్టదాఖలు ఎస్ఎల్ డయాగ్నస్టిక్ సెంటర్ ఒప్పంద నియమాలను (ఎంఓయూ) బుట్ట దా ఖలు చేసిందన్న ఆరోపణలున్నాయి. ఎంఓయూలో సీటీ స్కాన్ నిర్వాహకులు ప్రత్యేకంగా కరెంటు మీటర్ వేసుకోవాలి. దీని ద్వారా ప్రతి నెలా కరెంటు బిల్లు వారే చెల్లిం చాలి. కానీ ఇంతవరకు మీటర్ బిగించలేదు. సర్వజనాస్పత్రిలో రోగులకు సంబంధించి రోజూ 25 నుంచి 30 సీటీ స్కాన్లు చేస్తారు. ప్రభుత్వం ఒక్కో స్కాన్‌కి రూ 899 చెల్లిస్తుంది. ఇలా ప్రతి నెలా సీటీ స్కాన్ నిర్వాహకులు 900 నుంచి వెయ్యి స్కానింగ్ తీస్తారు. ఇలా స్కాన్ నిర్వాహకులకు ప్రతి నెలా రూ 8 లక్షల నుంచి రూ 9 లక్షల వరకు బిజినెస్ జరుగుతుంది. రూ 30 లక్షల భారం సాధారణంగా ఏదేనీ సీటీ స్కాన్ నిర్వహణలో ప్రతి నెలా రూ లక్షకుపైగానే కరెం టు బిల్లు వస్తుంది. ఆస్పత్రిలో వినియోగించే స్కాన్‌కు రూ లక్షల్లోనే కరెంటు బిల్లు వస్తుందని పలువురు అధికారులు చెబుతున్నారు. ప్రతి నెలా రూ లక్షల్లో లబ్ధిపొందుతున్నా..ఎందుకు కరెంటు మీటర్ వేయించుకోలేదో అర్థం కావడం లేదు. ఆస్పత్రిలోని ఓ కీలక అధికారి అండదండలతోనే ఈ అడ్డగోలు వ్యవహారం సాగుతోందని సమాచారం. ప్రతి పైసా చెల్లించాల్సిందే విద్యుత్ వినియోగానికి సంబంధించి సీటీ స్కాన్ నిర్వాహకులు ప్రతిపైసా చెల్లించాల్సి ందే. స్కానింగ్ యూనిట్లో ప్రత్యేకంగా మీటర్ బిగించుకోని విషయం నిజమే. అందుకు సంబంధించి మీటర్ బిగించుకోవాలని చెప్పాం. త్వరలో వేయిస్తామన్నారు. మీటర్ అమర్చాక వచ్చే మొదటి మూడు నెలల సగటు తీసుకొని బిల్లు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ జగన్నాథ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
స్కానింగ్ కేంద్రాల ‘కనికట్టు’!
సాక్షి,మహబూబ్‌నగర్: ‘ప్రతి గర్భిణికి ఐదోనెలలో చేసే స్కానింగ్ అతి ముఖ్యమైంది.అయితే స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు దీనిని విస్మరిస్తున్నారు..శిశువు ఆరోగ్య పరిస్థితిపై విభిన్న నివేదికలు(రిపోర్టులు) ఇస్తూ ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు కనికట్టు చేస్తున్నారు.’ తప్పుడు నివేదికలపై అధికారుల దృష్టి తప్పుడు నివేదికలు ఇవ్వడంతో పాటు లింగ నిర్దారణ చేస్తున్న స్కానింగ్ కేంద్రాలపై జిల్లా వైద్యారోగ్యశాఖ దృష్టి సారించింది. గత 15రోజుల నుంచి జిల్లాలో ఉన్న పీహెచ్‌సీల వారీగా, జిల్లా కేంద్రంలో పలు స్కానింగ్ సెంటర్లలో పరీక్షలు చేసుకున్న పలువురు మహిళలను ఎంపిక చేసుకొని వారితో మాట్లాడానికి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. బాధితులు ఏం స్కానింగ్ చేయాలని అడిగితే నిర్వాహకులు ఏం చేశారు?, ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చారు, ప్రస్తుతం గర్భిణులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే అంశాలపై ప్రత్యేక టీం అధికారులు క్షేత్రస్థాయి పర్యటణ చేసి గర్భిణులు, వారి కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. గత 15రోజుల నుంచి జిల్లా కేంద్రంలో 15మంది గర్భిణుల నుంచి వివరాలు సేకరించారు. డీఎంహెచ్‌వో అధికారులు చేపట్టిన క్షేత్రస్థాయి పర్యటనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆర్ఎంలు అబార్షన్ చేసినట్లు, లింగ నిర్ధారణ పరీక్షలు, లీగల్ అబార్షన్లు చేసినట్లు, జన్యుపరమైన లోపాలు ఉన్న స్కానింగ్ నిర్వాహకులు బాధితులకు చెప్పకుండా దాచడం వంటి ఎన్నో విషయాలు వెలుగుచూశాయి. స్కానింగ్ కేంద్రం నిర్వహణకు అవసరమైన కీలక డాక్యుమెంట్ ఫాం–ఎఫ్‌లో సరైన వివరాలు నమోదు చేయకపోవడం, రికార్డులలో ఎవరికి ఎలాంటి స్కానింగ్ చేశారు అనే వివరాలను పూర్తిగా తప్పుగా రాయడం బయటపడింది. మొక్కుబడిగా పరీక్షలు.. జిల్లాలో చాలా స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు గర్భిణులకు మొక్కుబడిగా పరీక్షలు చేస్తున్నారు. నివేదికలో స్పష్టత లేకపోవడం వల్ల తల్లీ బిడ్డ ప్రాణాలకు ఆపద కల్గుతుంది. జిల్లాలో గర్భిణులకు స్కానింగ్ చేసే కేంద్రాలు 67(రేడియాలజిస్టుతో కూడినవి) వరకు ఉన్నాయి. ప్రతి గర్భిణికి సంబంధించి ఐదో నెలలో రేడియాలజిస్టు క్షుణంగా స్కానింగ్ చేయాలి. శిశువు ఎదుగుదల, అవయవాల తీరు ఇలా ప్రతీది పరిశీలించాలి. వారిచ్చే నివేదికను గైనకాలజిస్టులు చూసి వైద్యం అందించాలి. శిశువు ఎదుగుదలలో ఉన్న లోపం చికిత్స పరంగా మెరుగుకాదనుకొంటే అబార్షన్ చేయడానికి అవకాశం ఉంది. ఇదిలాఉండగా, రాష్ట్రంలో బాలికల నిష్పత్తి రోజు రోజుకు తీవ్రంగా తగ్గిపోతున్న క్రమంలో రాష్ట్ర ప్రజా ఆరోగ్య– కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రాణా ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్యశాఖలోని మాస్ మీడియా విభాగం అధికారులు జిల్లాలో ప్రత్యేకంగా క్షేత్రస్థాయి పర్యటనను చేస్తున్నారు. ప్రధానంగా పట్టణంలో ఉన్న స్కానింగ్ కేంద్రాల ద్వారా అబార్షన్లు, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వాటిపై విచారణ జరుగుతుంది. దీనికితోడు పట్టణంలో కొందరు దళారి వ్యవస్థ ద్వారా పక్క రాష్ట్రాల్లో జోరుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేపిస్తున్నారు.లింగ నిర్ధారణను ప్రభుత్వం నిషేధించింది. ఒక వేళ అలా చేస్తే వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయినా పరీక్షల పేరిట పుట్టబోయేది ఆడ, మగ అని తెలుపుతూ అందినంత దోచుకునే తంతు జిల్లాలో కొనసాగుతుంది. చట్టాలు, నిబంధనలను కాలరాస్తూ గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడే కొందరు వైద్యులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు కలిసి ఆడ శిశువులకు మరణ శాసనం రాస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత పదేళ్ల కిందట 40మాత్రమే ఉన్న స్కానింగ్ కేంద్రాల సంఖ్య ప్రస్తుతం 178కి చేరింది. అనధికారికంగా మరో 50కేంద్రాలు నడుస్తున్నాయి. దీంట్లో మహబూబ్‌నగర్‌లో 67, వనపర్తిలో 38, నాగర్‌కర్నూల్‌లో 40, గద్వాలలో 25స్కానింగ్ కేంద్రాలు పని చేస్తున్నాయి. బాలికల సంఖ్య తగ్గుముఖం ఓ వైపు భ్రూణహత్యలు.. మరోవైపు శిశు విక్రయాలు ఇంకో వైపు మూఢనమ్మకాలు వెరసి ఆడపిల్ల బతుకు దిక్కుతోచని పరిస్థితి అవుతుంది. తాజా జనాభా లెక్కలను పరిశీలిస్తే జిల్లాలోని గ్రామీణా ప్రాంతాల్లో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ పరిణామంలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉంది. 2001లో వెయ్యి మందికి 952మంది ఆడపిల్లలున్నారు. 2011లో ఆ సంఖ్య 900కి తగ్గింది. ప్రస్తుతం ప్రతి వెయ్యి మందికి 850మంది ఆడపిల్లలు ఉన్నారు. జిల్లాలోని పది మండలాల్లో మహిళల జనాభా గణనీయంగా పడిపోతున్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పది మండలాల్లో ఆడపిల్లల నిష్పత్తి 800లోపు ఉండడమే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి జిల్లాలోని తలకొండపల్లి, తిమ్మాజిపేట, ఆమనగల్లు, ఖిల్లఘనపురం, దేవరకద్ర, బాలానగర్, కొత్తూర్, దామరగిద్ద, వెల్దండ, అలంపూర్ మండలాల్లో మరింత ప్రమాదరకంగా స్త్రీ పురుష నిష్ఫతి 1000:800లోపు ఉంది. గత పదేళ్లలో జిల్లాలో గ్రామాల్లో ఆడపిల్లల సంఖ్య38శాతం తగ్గింది. జిల్లాలో 800వరకు ఆడపిల్లలు ఉన్న మండలాలు 10ఉన్నాయి. నిబంధనలకు నీళ్లు లింగ నిర్ధారణను ప్రభుత్వం నిషేధించింది. ఒక వేళ అలా చేస్తే వారిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అయినా పరీక్షల పేరిట పుట్టబోయేది ఆడ, మగ అని తెలుపుతూ అందినంత దోచుకునే తంతు జిల్లాలో కొనసాగుతుంది. చట్టాలు, నిబంధనలను కాలరాస్తూ గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడే కొందరు వైద్యులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు కలిసి ఆడ శిశువులకు మరణ శాసనం రాస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత పదేళ్ల కిందట 40మాత్రమే ఉన్న స్కానింగ్ కేంద్రాల సంఖ్య ప్రస్తుతం 178కి చేరింది. అనధికారికంగా మరో 50కేంద్రాలు నడుస్తున్నాయి. దీంట్లో మహబూబ్‌నగర్‌లో 67, వనపర్తిలో 38, నాగర్‌కర్నూల్‌లో 40, గద్వాలలో 25స్కానింగ్ కేంద్రాలు పని చేస్తున్నాయి. ఫాం ఎఫ్‌లో అన్ని వివరాలు నమోదు చేయాలి జిల్లాలో ఉన్న స్కానింగ్ కేంద్రాలు ఫాం–ఎఫ్‌లో స్కానింగ్ చేసిన వివరాలు అన్నింటిని నమోదు చేయాలి. ఫాం–ఎఫ్ అనేది కీలక డాక్యుమెంట్‌గా భావించాలి. దాంట్లో అన్ని రకాల వివరాలు ఉండాలి. కొన్ని రకాల వివరాలు దాచిపెట్టడం మానుకోవాలి. లేకపోతే చట్టప్రకారం చర్యలు ఉంటాయి. పీసీపీఎన్డీటీ యాక్టులో భాగంగా క్షేత్రస్థాయి పర్యటన జరుగుతుంది. ఇప్పటి వరకు 15మంది గర్భిణుల ద్వారా వివరాలు సేకరించి వాటిని ఇటీవలే హైదరాబాద్‌లో ఉన్నత అధికారులకు ఇవ్వడం జరిగింది. వేణుగోపాల్‌రెడ్డి, మాస్ మీడియా అధికారి -
గుట్టుగా లింగ నిర్ధారణ!
సాక్షి, అచ్చంపేట రూరల్: మహిళలు పురుషులతో సమానంగా అన్నింటా ముందుంటున్న రోజులివి.. చదువు, ఉద్యోగం, వ్యాపార రంగాల్లోనూ వారిదే అగ్రస్థానం.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలోనూ లింగనిర్ధారణ పరీక్షలు గుట్టుగా సాగిపోతున్నాయి. ఆడ శిశువు భూమి మీద పడగానే కొందరు మొగ్గ దశలోనే తుంచేస్తుండగా.. మరికొందరు కడుపులోనే చిదిమేస్తున్నారు.. ఇలాంటివే అచ్చంపేటలోనూ చోటుచేసుకుంటున్నాయి.. కానీ ఈ విషయం గురించి పట్టించుకొనే నాథుడే కరువయ్యారు.. ఈ క్రమంలో ఆడపిల్లల కోసం ఎన్ని చట్టాలు వస్తున్నా.. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా నీరుగారిపోతున్నాయి.. అనుమతి ఒకరిది.. నిర్వహణ? అచ్చంపేట ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. గతంలో కొన్నింటికి అనుమతి ఇవ్వగా రెన్యువల్ చేసుకోకుండా అవే పాత మిషన్లతో స్కానింగ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గుట్టుగా లింగ నిర్ధారణ చేస్తూ డబ్బులను దండుకుంటున్నారు. అనర్హులు సైతం స్కానింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. ఒకరి పేరు మీద అనుమతి తీసుకుని మరొకరు నిర్వహిస్తున్నారు. ఇదంతా వైద్య ఆరోగ్య శాఖాధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే స్కానింగ్ సెంటర్లను సక్రమంగా నిర్వహిస్తే ఇలా జరగడానికి వీలుండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. తనిఖీల జాడేదీ? జిల్లాస్థాయి అధికారులు మొదట్లో అక్కడక్కడ తనిఖీలు చేసి హల్చల్ చేసి పోతారు. పెద్దగా పేరులేని స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు ఆస్పత్రులను సీజ్ చేసి తమ పని అయిపోయిందన్నట్లు ఊరుకుంటున్నారు. అసలు దొంగలను మాత్రం విడిచి పెడుతున్నారు. వారు అప్పుడప్పుడు అమ్యామ్యాలు పంపిస్తారని బహిరంగంగానే చర్చ జరుగుతుంది. ఫిర్యాదులు అందితే తప్ప తనిఖీ చేయరని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నోసార్లు ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులపై రాత పూర్వకంగా ఫిర్యాదు అందించినా పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. చట్టాలు ఏం చెబుతున్నాయి.. సుప్రీంకోర్టు 2001లో పీసీ, పీఎన్డీటీ యాక్టు కింద లింగ నిర్ధారణ నేరమని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. పీసీపీఅండ్డీటీ యాక్టు 1994, రూల్స్ 1996 ప్రకారం ఆస్పత్రుల్లో జిల్లా వైద్యాధికారి అనుమతితో ఆల్ట్రాస్కానింగ్ యంత్రాలను ఉపయోగించాలి. అయినప్పటికీ ప్రైవేటు క్లీనిక్‌లు నిబంధనలు పాటించడం లేదు. ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహిస్తూ ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. అచ్చంపేటలో రోజురోజుకు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆస్పత్రులు ఇదే తీరును కనబరుస్తున్నాయి. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. స్కానింగ్ సెంటర్ సీజ్ అచ్చంపేటలోని లింగాల రోడ్డుకు సమీపంలో ఉన్న శ్రీరాం (సర్రాం) ఆస్పత్రిలో గత కొన్నేళ్లుగా స్కానింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. 2012లో స్కానింగ్ సెంటర్ నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకోగా 2017 వరకు అనుమతి ఇచ్చారు. 2017లో మళ్లీ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోగా అప్పటి అధికారులు అనుమతి ఇవ్వలేదు. గతంలో ఈ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని అధికారుల దృష్టిలో ఉండటంతో తిరస్కరించారు. నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారని గతంలో 2014 అక్టోబర్ 4న శ్రీరాం (సర్రాం) ఆస్పత్రిలోని స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేశారు. అయినప్పటికీ అప్పటి నుంచి మళ్లీ యథేచ్ఛగా స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. స్కానింగ్‌ను సోనాలజిస్టు, రేడియాలజిస్టు, గైనిక్ మాత్రమే నిర్వహించాల్సి ఉంది. కాగా ఈ ఆస్పత్రిలో ఎంబీబీఎస్ వైద్యురాలు బుచ్చమ్మ స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం జిల్లా వైద్యాధికారులు ఆకస్మికంగా దాడి చేసి స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేశారు. స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి అచ్చంపేట రూరల్: నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేకుండా నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి దశరథ్ అన్నారు. మంగళవారం అచ్చంపేట సివిల్ కోర్టులో జడ్జి ముందు నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా నిర్వహిస్తున్న అచ్చంపేటలోని శ్రీరాం (సర్రాం) ఆస్పత్రి గురించి లాయర్ ద్వారా వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపారు. సెక్షన్–18 ఆర్/23 ఆఫ్ పీసీ అండ్ పీఎన్డీటీ కేసు నమోదు చేశామన్నారు. నల్లమల ప్రాంతంలో అనుమతి లేని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని, లింగ నిర్ధారణ చేస్తే కఠినంగా శిక్షలు పడేలా చేస్తామని హెచ్చరించారు. చర్యలు తీసుకుంటాం జిల్లాలో అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నా స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. అచ్చంపేటలోని శ్రీరాం (సర్రాం) ఆస్పత్రిలో స్కానింగ్ సెంటర్‌ను అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారని తెలుసుకుని కలెక్టర్ అనుమతితో సీజ్ చేశాం. అలాగే జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటాం. - దశరథ్, జిల్లా వైద్యాధికారి, నాగర్‌కర్నూల్ -
మొగ్గలోనే.. తుంచేస్తున్నారు
నర్సంపేట మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన 5 నెలల గర్భిణినిఈనెల 12వ తేదీ రాత్రి చెకింగ్ కోసం నెక్కొండకు వెళ్లింది. కాసులకు కక్కు ర్తిపడిన సదరు స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ఆడ శిశువని అబార్షన్ చేశారు. తీవ్ర గర్భస్రావమైన తర్వాత ఆమె గర్భంలో మగ శిశువు ఉందని తేలింది. ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రి వర్గాలను నిలదీయగా బాధితులకు రూ.2 లక్షలు ముట్టజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. నెక్కొండ మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన ఓ గిరిజన వివాహిత లింగ నిర్ధారణ పరీక్ష కోసం మండల కేంద్రానికి వచ్చింది. సదరు వైద్యుడు పరీక్షలు చేసి ఆడ శిశువు ఉందని చెప్పారు. ఆమె నర్సంపేటలోని ఓ ఆస్పత్రిలో అబార్షన్ చేయించుకుంది. గర్భంలో ఉంది మగ శిశువు అని తేలడంతో ఆ గర్భిణి లబోదిబోమంది. తప్పుడు సమాచారం ఇచ్చిన సదరు వైద్యుడిని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు నిలదీశారు. ఈ నేప«థ్యంలో ఇరువర్గాల నుంచి మధ్యవర్తుల ప్రమేయంతో రూ.1.5 లక్షలు ముట్టజెప్పినట్లు తెలిసింది. చెన్నారావుపేట మండలం సూరిపల్లికి చెందిన ఓ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు సంతానం ఉన్నారు. సదరు మహిళ మళ్లీ గర్భం దాల్చింది. కాగా నర్సంపేటలోని ఓ స్కానింగ్ సెంటర్లో పరీక్షలు చేయించడంతో ఆడపిల్ల అని తేలింది. వెంటనే ఆ మహిళను మహబూబాబాద్‌కు తీసుకువెళ్లి అబార్షన్ చేయించినట్లు సమాచారం. సాక్షి, వరంగల్ రూరల్: బాలికలపై వివక్ష కొనసాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ మొగ్గలోనే తుంచేస్తున్నారు. మరికొందరు భువిపైకి చేరిన గంటల వ్యవధిలోనే ముళ్ల కంపలు, చెత్త కుండీలు, కాల్వల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడడమో, ఊపిరి ఆగిపోవడమో నిత్యం జరుగుతోంది. జిల్లాలో వెయ్యి మంది బాలురుంటే 988 మంది బాలికలు ఉంటున్నారు. ఏటేటా లింగ నిష్పత్తిలో వ్యత్యాసం.. ఏటేటా బాలబాలికల లింగ నిష్పత్తిలో వ్యత్యాసం పెరుగుతూ వస్తోంది. స్కానింగ్ సెంటర్ల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధించినా కాసుల కక్కుర్తికి స్కానింగ్ పరీక్షలు చేసి ఆడ, మగ శిశువు అని చెబుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ అనుమతి పొందిన 25 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. కానీ ప్రతి మండలం కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనుమతి లేని స్కానింగ్ సెంటర్లు కొనసాగుతున్నాయి. జిల్లాలో బాలబాలికల నిష్పత్తి బాలురు 1000 బాలికలు 988 ఇవే కాక మొబైల్ స్కానింగ్‌లు సైతం చేపడుతున్నారు. మహబూబాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు మొబైల్ స్కానింగ్ చేస్తున్నారు. ఇద్దరు నుంచి ముగ్గురు గర్భిణులు స్కానింగ్ కోసం వస్తే వారి పేర్లను నమోదు చేసుకుని సదరు డాక్టర్‌ను పిలిపించి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని తెలుస్తోంది. ఆడ పిల్ల అని తెలియగానే వెంటనే అబార్షన్ చేసి డాక్టర్ వెళ్లి పోతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. మగ శిశువు అయితే సోమవారం.. ఆడ అయితే శుక్రవారం తల్లి గర్భంలో ఉన్నంది మగ శిశువు అయితే సోమవారం అని.. ఆడ శిశువు అయితే శుక్రవారం అని కోడ్ భాషలను స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు వినియోగిస్తున్నారు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు గ్రామాల్లో ఉండే ఆర్ఎంపీలతో లింక్ పెట్టుకుంటున్నట్లు తెలసుస్తోంది. లింగ నిర్ధారణ పరీక్షలకు గర్భిణులకు తీసుకువస్తే వారికి కమీషన్ చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఆడ శిశువు అయితే తొలగించేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. దీంతో వారి వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. లింగ నిర్ధారణ పరీక్షలు నేరం.. స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరిత్యా నేరం. పరీక్షలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. స్కానింగ్ సెంటర్ల పై ప్రత్యేక నిఘూ పెట్టాం. ఇద్దరు డిప్యూటీ డీఎంహెచ్ఓలు పర్యవేక్షిస్తున్నారు. – మధుసూదన్, జిల్లా వైద్యాధికారి -
మెడికల్ ఉత్పత్తుల అడ్డా ‘ఆర్కే’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్కానింగ్, ఈసీజీ వంటి వైద్య ఉత్పత్తులను సమీకరించుకోవటం కార్పొరేట్ ఆసుపత్రులకు పెద్ద కష్టమేమీ కాదు. కానీ, గ్రామాల్లోని ఆసుపత్రులకు కాస్త ఇబ్బందే. దీన్నే వ్యాపార వేదికగా ఎంచుకుంది ఆర్కే ఎంటర్ప్రైజెస్. బహుళ జాతి కంపెనీలతో ఒప్పందం చేసుకొని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో మెడికల్ ఉత్పత్తులను విక్రయించడమే దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ రవి కిరణ్ ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది నెల్లూరు. బీ–ఫార్మసీ పూర్తయ్యాక.. విప్రో జీఈలో ఆంధ్రప్రదేశ్ బిజినెస్ మేనేజర్‌గా చేరా. తర్వాత శామ్సంగ్ మెడికల్ ఎక్విప్‌మెంట్‌లో సేల్స్ మేనేజర్‌గా పనిచేశా. అప్పుడు గమనించింది ఏంటంటే? గ్రామాల్లోని ఆసుపత్రుల్లో మెడికల్, డయాగ్నస్టిక్ ఉత్పత్తులు అందుబాటులో లేకపోవటంతో దగ్గర్లోని నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయని! దీనికి పరిష్కారం చూపించేందుకు 2017 డిసెంబర్లో నెల్లూరు కేంద్రంగా ఆర్కే ఎంటర్‌ప్రైజెస్‌ను ప్రారంభించాం. అందుబాటు ధరల్లో మెడికల్ ఉత్పత్తులు, మెడి కన్జ్యూమబుల్స్ని విక్రయించడం మా ప్రత్యేకత. 40కి పైగా వైద్య ఉత్పత్తులు.. స్కానింగ్ మిషన్స్, ఈసీజీ, ఫెటల్ మానిటర్స్, కార్డియో కేర్ వంటి 40 రకాలకు పైగా వైద్య ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. కేబుల్స్, ప్రింటర్స్, పేపర్స్ వంటి మెడి కన్జ్యూమబుల్స్ కూడా ఉంటాయి. ఉత్పత్తుల కోసం బయోనెట్, ఫెటల్, వాటెక్ ఇండియా, డాల్ఫిన్, ఫిలిప్స్, క్రౌన్డెంట్, ఆట్రియం వంటి 12 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలోనే సోనీ, సియామ్స్, సీమెన్స్తోనూ ఒప్పందం చేసుకోనున్నాం. నెలకు రూ.50 లక్షలు.. వైద్య ఉత్పత్తుల విక్రయంతో పాటూ ఇన్స్టలేషన్, సర్వీసింగ్ కూడా కంపెనీయే చూసుకుంటుంది. ప్రస్తుతం నెలకు రూ.50 లక్షల వ్యాపారం చేస్తున్నాం. ఇప్పటివరకు వందకు పైగా ఇన్స్టలేషన్ చేశాం. కర్నూల్, నెల్లూరులోని 6 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 14 మంది ఉద్యోగులున్నారు. మార్చి నాటికి ఆర్కేమెడిసాల్స్.కామ్ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తాం. ఈ ఏడాదిలో రూ.20 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యంచాం. మెడికల్ ఉత్పత్తుల నిల్వ కోసం నెల్లూరులో గిడ్డంగి ఏర్పాటు చేశాం. రూ.5 లక్షల లోపు ధర ఉంటే వైద్య ఉత్పత్తులను నిల్వ చేస్తాం’’ అని రవి కిరణ్ తెలిపారు.