చెకప్ ఎప్పుడెప్పుడంటే..?
ఆరోగ్యం
స్త్రీ తొలిసారి గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ వరకు డాక్టర్‌ను ఎప్పుడెప్పుడు సంప్రదించాలో, ఏమేమి పరీక్షలు చేయించుకోవాలో అవగాహనకోసం... గర్భవతి అని నిర్ధారణ అయిన 10- 15 రోజులలో డాక్టర్‌ను సంప్రదించాలి. వారు రాసిన మందులను వాడుతూ, చెప్పిన జాగ్రత్తలను పాటిస్తుండాలి. ఆ తర్వాత మూడవ నెలలోపు ఒకసారి డాక్టర్ దగ్గరకెళ్లి, వారి సూచ న మేరకు స్కానింగ్ తీయించుకోవాలి. వైద్యులు వారికి సరిపడా రక్తం ఉందో లేదో తెలుసుకుని, తగిన జాగ్రత్తలు చెబుతారు.
తర్వాత ఏడవ నెలవరకూ ప్రతినెలా, 8, 9 నెలలో ప్రతి పదిహేనురోజులకూ ఒకసారి, తొమ్మిదవ నెల వచ్చినప్పటినుంచి, కాన్పు అయ్యే వరకు వారానికోసారి డాక్టర్ వద్దకెళ్లి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ప్రతిసారీ డాక్టర్లు బీపీ సరిగా ఉందో లేదో పరీక్షిస్తారు. హెచ్చు తగ్గులుంటే తగిన మందులిస్తారు. అలాగే 3, 7, 9 నెలల్లో షుగర్ వ్యాధి ఉందో లేదో పరీక్షించి, లేదని నిర్ధారించుకున్నాక అది నియంత్రణలోకి వచ్చేందుకు తగిన మందులు ఇస్తారు. ఆహార విహారాల్లో మార్పులు ఏమైనా అవసరమైతే జాగ్రత్తలు తీసుకోవలసిందిగా చెబుతారు.