మహిళలకు మాతృత్వం వరం. గర్భిణి అని నిర్ధారణ అవగానే ఆ యువతి కళ్లలో ఆనందం తొంగి చూస్తుంది. నెలలు నిండే కొద్దీ ఆ ఆనందం స్థానంలో క్రమంగా ఆందోళన చోటు చేసుకుంటుంది. తనకు సుఖప్రసవం అవుతుందా..?, సిజేరియన్ చేయాల్సి వస్తుందా..? అన్న ఆవేదనకు గురవుతుంది. ఇకపై ఆ చింత తొలగనుంది. షీ సేఫ్ విధానంతో కత్తెర కాన్పులకు చెక్ పడనుంది. ప్రైవేటు ఆస్పత్రులపైనా నిఘా పెరగనుంది. సుఖప్రసవానికి అత్యధిక ప్రాధాన్యత నిస్తూ అమ్మకు ఆలంబన చేకూర్చనుంది రాష్ట్రప్రభుత్వం.
చిత్తూరు రూరల్: అమ్మ కడుపుకోతకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. షీ సేఫ్ పేరుతో సహజ ప్రసవాలకు రూపకల్పన చేసింది. గర్భిణులకు అవగాహన కలి్పంచి సిజేరియన్లు కట్టడి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్యాధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం పూర్తి అయ్యింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న సిజేరియన్లపై నిఘా పెట్టేలా ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో ఒక జిల్లా ప్రభుత్వాస్పత్రి, 4 ఏరియా ఆస్పత్రులు, 7 సీహెచ్‌సీలు, 50 పీహెచ్‌సీలు వైద్యసేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రసవాలు చేస్తున్నారు. గత నెల నుంచి పీహెచ్‌సీలు కూడా 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకున్నారు.
ముఖ్యంగా మాతాశిశు మరణాలు తగ్గించాలని, సహజ ప్రసవాల సంఖ్య పెంచడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వాస్పత్రుల్లో సహజ ప్రసవాలు 70 నుంచి 80 శాతం నమోదవుతున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా ప్రసూతి సేవలు అందించే ప్రైవేటు ఆస్పత్రులు సుమారు 500 పైగా ఉన్నాయి. వీటిలో 60 నుంచి 70 శాతం శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం శస్త్రచికిత్సలు 10–15 శాతం లోపే ఉండాలి. అవసరం లేకపోయినా డబ్బులు దండుకునేందుకు సిజేరియన్లు చేస్తుండడంతో మహిళలకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని అరికట్టాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.
షీ–సేఫ్‌తో...
బిడ్డకు జన్మనివ్వడం పునర్జన్మతో సమానం. అది సహజపద్ధతిలో జరిగితే తల్లీబిడ్డ అత్యంత సురక్షితం. పుట్టే బిడ్డకూ ఎలాంటి ఆపద ఉండదు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాల ధనదాహంతో అమ్మ కడుపును కోసేస్తున్నాయి. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా.. దోపిడీయే పరమావధిగా సిజేరియన్ ఆపరేషన్లు చేసేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేస్తే తప్పు కాదు, కానీ ఇది సాకుగా చూపి పైసలే పరమావధిగా ప్రైవేటు వైద్యులు శస్త్ర చికిత్సలను ప్రోత్సహిసున్నారు. సిజేరియన్‌కు రూ.50 వేల నుంచి రూ.80 వరకు వసూలు చేస్తున్నారు.
జిప్ పద్ధతి (కోత కనబడని శస్త్రచికిత్స) పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. కాన్పుల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే వారిలో 80 శాతం మందికి శస్త్రచికిత్సలు చేస్తుండడం ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి దయనీయ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు వైద్యశాఖ సన్నద్ధం అవుతోంది. అవసరం లేని సిజేరియన్లతో కలిగే అనర్థాలు, సహజ ప్రసవాలతో జరిగే మేలును గర్భిణులకు వివరించేందుకు ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తోంది. సహజ ప్రసవాలు ప్రోత్సాహించేందుకు షీ–సేఫ్ విధానాన్ని రూపకల్పన చేసి, అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
షీ సేఫ్ అంటే..
అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే సిజేరియన్లు చేయాలన్నదే షీ–సేఫ్ ఉద్దేశం. దీనిపై వైద్యులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తారు. సిజేరియన్ విధానాలతో మాత శిశుమరణాలు జరగకుండా చర్యలు తీసుకుంటారు. ఆఫరేషన్ చేసే సమయంలో అత్యంత సురక్షిత పద్ధతులు పాటించాలని సూచిస్తారు. ఈ విధానానికి యునిసెఫ్ సైతం సహకారం అందిస్తోంది.
సాధారణ కాన్పు..సిజేరియన్‌కు తేడాలివీ..
సాధారణ కాన్పు జరిగిన మహిళలు ఆరోగ్యంగా ఉంటారు.
కాన్పు జరిగిన రెండో రోజు నుంచే పనులు చేసుకుంటారు.
పుట్టిన బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
శస్త్ర చికిత్స ద్వారా బిడ్డకు జన్మనిస్తే మహిళ శారీరక పరిస్థితి ఆధారంగా రెండు వారాల వరకు విశ్రాంతి అవసరం.
ప్రసవ సమయంలో 9 మాసాలు పూర్తయినా కొందరు మహిళలకు నొప్పులు రావు. ఇలాంటి సందర్భంలోనూ శస్త్రచికిత్స చేస్తుంటారు. ఇదే అదునుగా భావిస్తున్న వైద్యులు సిజేరియన్ ఆపరేషన్లను ప్రోత్సహిస్తున్నారు.
ఆపరేషన్ల కుదింపుపై ప్రత్యేక దృష్టి
జిల్లావ్యాప్తంగా మే నుంచి ఆగస్టు వరకు అధికారిక గణాంకాలు పరిశీలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 5,945 ప్రసవాలు జరిగాయి. ఇందులో ప్రభుత్వాస్పత్రుల్లో మొత్తం 3,092 ప్రసవాలు జరగ్గా, 2,173 సుఖ ప్రసవాలు, 919 మాత్రమే సిజేరియన్ ఆపరేషన్‌లు చేశారు. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో 2,853 జరగ్గా.. 1,187 శస్త్ర చికిత్సలు, సాధారణ ప్రసవాలు 1,666 జరిగాయని అధికారులు వెల్లడిస్తున్నారు. సిజేరియన్ల సంఖ్యను మరింత కుదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
అత్యవసర పరిస్థితుల్లోనే సిజేరియన్
ప్రభుత్వాస్పత్రుల్లో వీలైనంత వరకు సుఖ ప్రసవం అయ్యేలా చూస్తున్నాం. ఆస్పత్రికి వచ్చే 50 శాతం కేసులు బీపీ, రక్తహీనత లోపంతో వచ్చేవారే. అలాంటి వారికి కూడా ఆస్పత్రుల్లో సుఖ ప్రసవం జరిగేలా చూస్తున్నాం. కానీ పక్షంలో సిజేరియన్ చేస్తున్నాం. దీంతో పాటు క్షేత్రస్థాయిలో సిజేరియన్‌తో కలిగే నష్టాలపై అవగాహన కలి్పంచాలి. – ఉషశ్రీ, గైన కాలజిస్ట్, జిల్లా ప్రభుత్వాస్పత్రి, చిత్తూరు
వైద్యుల సలహాలు తీసుకోవాలి
గర్భిణులు వైద్యుల సూచనలు పాటించాలి. అలాగే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. రక్తహీనత లోపమే మాతా శిశుమరణాలు, ఆపరేషన్లకు కారణమవుతుంది. అనవసర సిజేరియన్లు నియంత్రించడంపై దృష్టి సారిస్తున్నాం. ఇందుకోసం గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ క్రమంలో సీ–సీఫ్ ప్రణాళిక రచించాం. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే సిజేరియన్లు నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– ప్రభావతిదేవి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment