Caesarean section
-
బలవంతంగా సిజేరియన్.. శిశువు మృతి
నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రెండు రోజుల క్రితం కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణి కుర్చిలోనే ప్రసవించిన ఘటన మరువక ముందే శనివారం రాత్రి వైద్యుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శంగా మరో ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రి వర్గాలు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గ్యారకుంట్లపాలెం గ్రా మానికి చెందిన చెరుకుపల్లి నాగరాజు భార్య శ్రీలత మూడో కాన్పు కోసం ఈ నెల 21న ప్రభుత్వ జన రల్ ఆసుపత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేరింది. పరీక్షించిన వైద్యులు ప్రసవానికి సమయం పడుతుందని వేచిచూడాలని సలహా ఇచ్చారు. ఇటీవల ఆసుపత్రిలో కుర్చిలోనే ప్రసవించిన ఘటనపై స్పందించిన కలెక్టర్ బాధ్యులైన డాక్టర్‌తోపాటు అయిదుగురు నర్సింగ్ ఆఫీసర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీన్ని నిరసిస్తూ శనివారం గైనిక్ వార్డులోని వైద్యులంతా మూకుమ్మడిగా సెలవులు పెడుతున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రమణమూర్తికి నోటీసులు అందజేసి విధులు బహిష్కరించారు. దీంతో గైనిక్ వార్డులో వైద్యసేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ముందు బాబు బాగున్నాడని చెప్పి.. శనివారం సాయంత్రం వరకు నర్సులు మినహా డాక్టర్లు లేకపోవడంతో విసిగి వేసారిన గర్భిణులు ప్రైవేట్ ఆసుపత్రులకు బయల్దేరారు. ఈక్రమంలోనే శ్రీలతను భర్త నాగరాజు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆటోలో ఎక్కిస్తుండగా ఆసుపత్రి సెక్యూరిటీ, సిబ్బంది అడ్డుకుని బలవంతంగా కా న్పుల వార్డుకు తరలించారు. మీరు బయటకు వెళ్లిపోతే మా ఉద్యోగాలు పోతాయంటూ బతిమిలాడి లోపలకు తీసుకు పోయి సేవలందిస్తామని సూచించారు. రాత్రి 9.30 సమయంలో శ్రీలతకు వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు. అయితే అప్పటికే పుట్టిన బాబు మృతి చెందినట్లు తెలిసింది. అయితే ముందుగా బాబు బాగున్నాడని వైద్యులు చెప్పారని, ఆ తరువాత చనిపోయినట్లు చెప్పారని బంధువులు పేర్కొన్నారు. డాక్టర్ల నిర్వాకంపై బంధువులు అర్ధరాత్రి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. బాబు శరీరంపై గాయాలు ఉన్నాయని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాబు మరణించాడని ఆరోపించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమించి కేసు పెట్టాలని సూచించడంతో నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణమూర్తిని వివరణ కోరగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని, జిల్లా కలెక్టర్‌కు జరిగిన ఘటనపై వివరించామని తెలిపారు. -
కత్తెర కాన్పులు ఇక కట్.. సాధారణ ప్రసవాలపై గర్భిణులకు అవగాహన
మహిళలకు మాతృత్వం వరం. గర్భిణి అని నిర్ధారణ అవగానే ఆ యువతి కళ్లలో ఆనందం తొంగి చూస్తుంది. నెలలు నిండే కొద్దీ ఆ ఆనందం స్థానంలో క్రమంగా ఆందోళన చోటు చేసుకుంటుంది. తనకు సుఖప్రసవం అవుతుందా..?, సిజేరియన్ చేయాల్సి వస్తుందా..? అన్న ఆవేదనకు గురవుతుంది. ఇకపై ఆ చింత తొలగనుంది. షీ సేఫ్ విధానంతో కత్తెర కాన్పులకు చెక్ పడనుంది. ప్రైవేటు ఆస్పత్రులపైనా నిఘా పెరగనుంది. సుఖప్రసవానికి అత్యధిక ప్రాధాన్యత నిస్తూ అమ్మకు ఆలంబన చేకూర్చనుంది రాష్ట్రప్రభుత్వం. చిత్తూరు రూరల్: అమ్మ కడుపుకోతకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. షీ సేఫ్ పేరుతో సహజ ప్రసవాలకు రూపకల్పన చేసింది. గర్భిణులకు అవగాహన కలి్పంచి సిజేరియన్లు కట్టడి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్యాధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం పూర్తి అయ్యింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న సిజేరియన్లపై నిఘా పెట్టేలా ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో ఒక జిల్లా ప్రభుత్వాస్పత్రి, 4 ఏరియా ఆస్పత్రులు, 7 సీహెచ్‌సీలు, 50 పీహెచ్‌సీలు వైద్యసేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రసవాలు చేస్తున్నారు. గత నెల నుంచి పీహెచ్‌సీలు కూడా 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా మాతాశిశు మరణాలు తగ్గించాలని, సహజ ప్రసవాల సంఖ్య పెంచడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వాస్పత్రుల్లో సహజ ప్రసవాలు 70 నుంచి 80 శాతం నమోదవుతున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా ప్రసూతి సేవలు అందించే ప్రైవేటు ఆస్పత్రులు సుమారు 500 పైగా ఉన్నాయి. వీటిలో 60 నుంచి 70 శాతం శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం శస్త్రచికిత్సలు 10–15 శాతం లోపే ఉండాలి. అవసరం లేకపోయినా డబ్బులు దండుకునేందుకు సిజేరియన్లు చేస్తుండడంతో మహిళలకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని అరికట్టాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. షీ–సేఫ్‌తో... బిడ్డకు జన్మనివ్వడం పునర్జన్మతో సమానం. అది సహజపద్ధతిలో జరిగితే తల్లీబిడ్డ అత్యంత సురక్షితం. పుట్టే బిడ్డకూ ఎలాంటి ఆపద ఉండదు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాల ధనదాహంతో అమ్మ కడుపును కోసేస్తున్నాయి. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా.. దోపిడీయే పరమావధిగా సిజేరియన్ ఆపరేషన్లు చేసేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేస్తే తప్పు కాదు, కానీ ఇది సాకుగా చూపి పైసలే పరమావధిగా ప్రైవేటు వైద్యులు శస్త్ర చికిత్సలను ప్రోత్సహిసున్నారు. సిజేరియన్‌కు రూ.50 వేల నుంచి రూ.80 వరకు వసూలు చేస్తున్నారు. జిప్ పద్ధతి (కోత కనబడని శస్త్రచికిత్స) పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. కాన్పుల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే వారిలో 80 శాతం మందికి శస్త్రచికిత్సలు చేస్తుండడం ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి దయనీయ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు వైద్యశాఖ సన్నద్ధం అవుతోంది. అవసరం లేని సిజేరియన్లతో కలిగే అనర్థాలు, సహజ ప్రసవాలతో జరిగే మేలును గర్భిణులకు వివరించేందుకు ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తోంది. సహజ ప్రసవాలు ప్రోత్సాహించేందుకు షీ–సేఫ్ విధానాన్ని రూపకల్పన చేసి, అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. షీ సేఫ్ అంటే.. అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే సిజేరియన్లు చేయాలన్నదే షీ–సేఫ్ ఉద్దేశం. దీనిపై వైద్యులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తారు. సిజేరియన్ విధానాలతో మాత శిశుమరణాలు జరగకుండా చర్యలు తీసుకుంటారు. ఆఫరేషన్ చేసే సమయంలో అత్యంత సురక్షిత పద్ధతులు పాటించాలని సూచిస్తారు. ఈ విధానానికి యునిసెఫ్ సైతం సహకారం అందిస్తోంది. సాధారణ కాన్పు..సిజేరియన్‌కు తేడాలివీ.. సాధారణ కాన్పు జరిగిన మహిళలు ఆరోగ్యంగా ఉంటారు. కాన్పు జరిగిన రెండో రోజు నుంచే పనులు చేసుకుంటారు. పుట్టిన బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శస్త్ర చికిత్స ద్వారా బిడ్డకు జన్మనిస్తే మహిళ శారీరక పరిస్థితి ఆధారంగా రెండు వారాల వరకు విశ్రాంతి అవసరం. ప్రసవ సమయంలో 9 మాసాలు పూర్తయినా కొందరు మహిళలకు నొప్పులు రావు. ఇలాంటి సందర్భంలోనూ శస్త్రచికిత్స చేస్తుంటారు. ఇదే అదునుగా భావిస్తున్న వైద్యులు సిజేరియన్ ఆపరేషన్లను ప్రోత్సహిస్తున్నారు. ఆపరేషన్ల కుదింపుపై ప్రత్యేక దృష్టి జిల్లావ్యాప్తంగా మే నుంచి ఆగస్టు వరకు అధికారిక గణాంకాలు పరిశీలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 5,945 ప్రసవాలు జరిగాయి. ఇందులో ప్రభుత్వాస్పత్రుల్లో మొత్తం 3,092 ప్రసవాలు జరగ్గా, 2,173 సుఖ ప్రసవాలు, 919 మాత్రమే సిజేరియన్ ఆపరేషన్లు చేశారు. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో 2,853 జరగ్గా.. 1,187 శస్త్ర చికిత్సలు, సాధారణ ప్రసవాలు 1,666 జరిగాయని అధికారులు వెల్లడిస్తున్నారు. సిజేరియన్ల సంఖ్యను మరింత కుదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లోనే సిజేరియన్ ప్రభుత్వాస్పత్రుల్లో వీలైనంత వరకు సుఖ ప్రసవం అయ్యేలా చూస్తున్నాం. ఆస్పత్రికి వచ్చే 50 శాతం కేసులు బీపీ, రక్తహీనత లోపంతో వచ్చేవారే. అలాంటి వారికి కూడా ఆస్పత్రుల్లో సుఖ ప్రసవం జరిగేలా చూస్తున్నాం. కానీ పక్షంలో సిజేరియన్ చేస్తున్నాం. దీంతో పాటు క్షేత్రస్థాయిలో సిజేరియన్తో కలిగే నష్టాలపై అవగాహన కలి్పంచాలి. – ఉషశ్రీ, గైన కాలజిస్ట్, జిల్లా ప్రభుత్వాస్పత్రి, చిత్తూరు వైద్యుల సలహాలు తీసుకోవాలి గర్భిణులు వైద్యుల సూచనలు పాటించాలి. అలాగే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. రక్తహీనత లోపమే మాతా శిశుమరణాలు, ఆపరేషన్లకు కారణమవుతుంది. అనవసర సిజేరియన్లు నియంత్రించడంపై దృష్టి సారిస్తున్నాం. ఇందుకోసం గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ క్రమంలో సీ–సీఫ్ ప్రణాళిక రచించాం. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే సిజేరియన్లు నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – ప్రభావతిదేవి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, చిత్తూరు -
Health Tips: సిజేరియన్ అయింది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
డెలివరీ అయ్యి వారమవుతోంది. సిజేరియన్ అయింది. ఇంటికి వెళ్లాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – జి. సంధ్యారాణి, కొత్తపేట ఈరోజుల్లో సిజేరియన్‌ను చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్‌లో చేయడం వలన రికవరీ చాలా వేగంగా ఉంటోంది. కొన్ని జాగ్రత్తలను ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ఇంటికి వెళ్లాకా తీసుకుంటే దాదాపుగా సాధారణ ప్రసవంలో ఎంత త్వరగా కోలుకుంటారో.. సిజేరియన్లోనూ అంతే త్వరగా కోలుకుంటారు. ఆసుపత్రిలో డాక్టర్ సలహా ప్రకారం యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ తీసుకోవాలి. పోషక ఆహారం తీసుకోవాలి. కుట్లకు సపోర్ట్ చాలా అవసరం మొదటి మూడురోజుల వరకు ఆపరేషన్ కుట్లు వంటివన్నీ ఆసుపత్రిలో చూస్తారు. వాళ్లు సూచించిన ఆయింట్మెంట్, పౌడర్ ఇంటికి వచ్చాక కూడా అప్లయ్ చేసుకోవాలి. మీరు బెడ్ మీద ఎలాగంటే అలా కదలకూడదు. మంచం దిగేప్పుడు ఒక పక్కకి తిరిగి కూర్చుని, కాసేపు ఆగి ఆ తర్వాత నెమ్మదిగా దిగాలి. కుట్లకు సపోర్ట్ చాలా అవసరం. దగ్గు, తమ్ములు వచ్చినప్పుడు కుట్ల మీద దిండు కానీ, చేయి కానీ పెట్టి మెల్లగా ప్రెస్ చేస్తే నొప్పి ఉండదు. ఆరు వారాల తర్వాత మీరు చేసే రోజూవారీ పనులు ఒక వారం తరువాత మొదలుపెట్టవచ్చు. ప్రతి పనికి మధ్య విశ్రాంతి తీసుకోవాలి. బిడ్డను ఎత్తుకోవచ్చు. బరువులు ఎత్తే పనులు ఆరు వారాల తరువాతనే చేయాలి. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజులు చేయాలి. కార్ డ్రైవింగ్‌ను మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడు మొదలుపెట్టవచ్చు. సాధారణంగా సిజేరియన్ అయిన ఆరు వారాల తరువాత చేయవచ్చు. వాకింగ్ చేయవచ్చు అవుతూ.. ఆగిపోతూ అలా ఓ నెల వరకూ బ్లీడింగ్ ఉంటుంది. డెలివరీ అయిన మొదటి ఆరువారాలు మంచి పోషకాహారం తీసుకోవాలి. రోజుకు రెండు మూడు లీటర్ల నీళ్లు తప్పకుండా తాగాలి. 20 నిమిషాలపాటు వాకింగ్ చేయవచ్చు. స్విమ్మింగ్ లాంటివి ఆరు వారాల తరువాత చేయాలి. కూర్చునేటప్పుడు వెనుక నడుముకి సపోర్ట్ అందేలా పోశ్చర్ కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కుట్లు మానిన రెండు వారాలకు నడుము బెల్ట్ పెట్టుకోవాలి. డెలివరీ అయిన ఆరు, ఎనిమిది వారాల తరువాత కూడా పొట్టలో నొప్పి, జ్వరం ఉన్నా.. కుట్ల దగ్గర నొప్పి లేదా చీము వస్తున్నా, తీవ్రమైన బ్యాక్ పెయిన్ ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. డెలివరీ తర్వాత చేసే వ్యాయామాలను ఇప్పుడు ఆన్లైన్లోనే నేర్పిస్తున్నారు. మీ డాక్టర్ సూచించిన వ్యాయామాలను ఇలా మీరూ ఆన్లైన్ ద్వారా నేర్చుకుంటూ చేయొచ్చు. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Solution For Vaginal Boil: ఏడాదిగా అక్కడ సెగ గడ్డలు.. ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి? -
సిజేరియన్లు 62 శాతం
♦కరీంనగర్ జిల్లాలో ఓ పోలీసు అధికారి. తన పుట్టిన రోజునాడే తన బాబు/పాప పుట్టాలని అనుకున్నాడు. డెలివరీకి మూడు వారాల ముందే భార్యకు సిజేరియన్ చేయించాడు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాలు పెరుగుతున్నాయి. మన పక్క రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్రల్లో 30 శాతంలోపే జరుగుతుండగా మన దగ్గర మాత్రం 62 శాతంగా ఉన్నాయి. ప్రజలకు అవగాహన లేకపోవడం, ఆస్పత్రుల ధనదాహంతో రోజురోజుకూ ఈ లెక్కలు మరింత ఎక్కువవుతున్నాయి. నిపుణులేమో సాధారణ పద్ధతిలో జన్మించిన బిడ్డల్లో రోగనిరోధకత ఎక్కువుంటుందని, తల్లుల ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు. ప్రసవాలకు సంబంధించి ప్రతి జిల్లాకో కమిటీ వేస్తే సిజేరియన్లను తగ్గించవచ్చన్నారు. రకరకాల కారణాలు ఒకప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు ప్రసవ సమయంలో సంక్లిష్టత ఏర్పడినప్పుడే సిజేరియన్ చేసేవారు. కానీ నేడు సాధారణ ప్రసవం అరుదైన విషయంగా మారింది. ఫలానా తేదీనే కనాలని.. ముహూర్తాలు, ప్రత్యేక పర్వదినాలని ప్రజలు అనుకోవడం ఇందుకు తొలి కారణం కాగా పురిటినొప్పులను భరించడానికి కొందరు భయపడటం రెండో కారణమని వైద్యులు చెబుతున్నారు. కొందరికి అనారోగ్య కారణాల వల్ల సిజేరియన్ చేయాల్సి వస్తోందని అంటున్నారు. వీటన్నిటికన్నా ప్రైవేటు ఆస్పత్రుల ధనదాహం సిజేరియన్లు పెరగడానికి ప్రధాన కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మారిన జీవనశైలి, అనారోగ్యంతో.. ప్రజల ఆహారపు అలవాట్లు మారి హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఊబకాయం సమస్యలు సాధారణమైపోయాయి. ఇలాంటి సమస్యలున్న మహిళలకు సాధారణ కాన్పు కోసం ప్రయత్నించినా ప్రాణాంతకమని.. అందుకే సిజేరియన్లు తప్పనిసరిగా చేయాల్సి వస్తోందని గైనకాలజిస్టులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో శారీరక శ్రమ లేకపోవడమూ సిజేరియన్‌కు దారితీస్తోందని అంటున్నారు. సాధారణ ప్రసవం సమయంలో ఆరోగ్యం క్షీణించి జరగరానిది జరిగితే ఇబ్బందులు వస్తాయ ని కొందరు ప్రైవేటు డాక్టర్లు సిజేరియన్లే చేస్తున్నార న్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్న వాళ్లలో చాలా మంది 37 వారాలు నిండీ నిండగానే చేరుతున్నారు. అవగాహన లేమితో పాటు కొందరు వైద్యు లు, ఆర్ఎంపీలు కమీషన్ల కోసం సిజేరియన్లకు సిఫార్సు చేస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. కరీంనగర్లో 28 నిమిషాలకో సిజేరియన్ రాష్ట్రంలో అత్యధికంగా సిజేరియన్లు జరుగుతున్న జిల్లాగా కరీంనగర్‌కు రికార్డులకెక్కింది. 2021–22లో జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కలిపి 22,302 సిజేరియన్లు (సుమారు 87 శాతం) జరిగాయి. అంటే దాదాపు ప్రతి 28 నిమిషాలకు ఒక సిజేరియన్ జరుగుతోంది. పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాలలోనూ 80 నుంచి 90 శాతం వరకు ప్రసవాలు సిజేరియన్ పద్ధతిలోనే జరుగుతున్నాయి. సాధారణ ప్రసవానికి రూ.15 వేలు, సిజేరియన్‌కు రూ.35 వేలు ప్యాకేజీ అంటున్నా కొన్ని ఆస్పత్రులు సిజేరియన్ కోసం కనీసం రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో సాధారణమే టాప్ పట్టణీకరణ, ప్రైవేటు ఆస్పత్రుల సదుపాయాలు బాగున్న ప్రాంతాల్లో సిజేరియన్లు ఎక్కువగా జరు గుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కానీ సరైన సదుపాయాల్లేని మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు సాధారణ కాన్పుల వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో సాధారణ డెలివరీల్లో ఆదిలాబాద్ జిల్లా (66.8 శాతం) అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ములుగులో దాదాపు 50 శాతం, భద్రాద్రి కొత్తగూడెంలో 47 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లా కమిటీలు ఉండాలి సిజేరియన్ల విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని పలువురు వైద్యులు అంటున్నారు. సీనియర్ వైద్యులతో జిల్లాకో కమిటీ ఏర్పాటు చేయాలని, ప్రతి కాన్పుకు ముందే వీరు పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి సిజేరియన్ చే యాలా.. సాధారణ కాన్పుకు వెళ్లాలా నిర్ణయించా లని చెబుతున్నారు. నార్మల్ డెలివరీలో పుట్టిన బిడ్డలకు రోగనిరోధకత ఎక్కువుంటుందని చెబుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కరీంనగర్ సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలి మంచి రోజులు, ముహూర్తాల భ్రమ నుంచి బయటపడాలి. నెలలు నిండకుండా ప్రసవాలు చేస్తే పిల్లల ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. సిజేరియన్లు తగ్గించాలంటే సాధారణ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి గర్భిణులకు అవగాహన కల్పించాలి. తప్పనిసరైతే తప్ప సిజేరియన్లు చేయకూడదనే నిబంధన అమలు చేయాలి. – డాక్టర్ ప్రతిష్టారావు, గైనకాలజిస్టు సాధారణ కాన్పు చేశారు ప్రైవేట్ ఆస్పత్రిలో సాధారణ కాన్పులు జరగడం లేదని తెలిసి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాం. సాధారణ కాన్పు అయ్యే అవకాశముందని, భయపడొద్దని సిబ్బంది, వైద్యులు చెప్పారు. రెండ్రోజుల తర్వాత సాధారణ కాన్పు జరిగింది. ఆడ పిల్ల పుట్టింది. ఆస్పత్రిలో వసతులు బాగున్నాయి. – శిరీష, గద్వాల -
ఆందోళన: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సిజేరియన్ ప్రసవాలు
సాక్షి, అమరావతి: సిజేరియన్ ప్రసవాలు పెరుగుతుండటం దుష్పరిణామాలు కలిగించే అంశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన దానికంటే 6.2 మిలియన్లు అంటే 62 లక్షల సిజేరియన్ ప్రసవాలు అధికంగా జరుగుతున్నాయనేది డబ్ల్యూహెచ్‌వో అంచనా. తాజాగా సిజేరియన్ ప్రసవాలపై డబ్ల్యూహెచ్‌వో అన్ని దేశాలకు ఓ నివేదిక ఇచ్చింది. కోత ద్వారా ప్రసవం చేయడానికి ఎలాంటి కారణమూ చూపలేని పరిస్థితులు ఉన్నాయని, ఒత్తిడి వల్లనో, వాణిజ్యపరంగా లాభాలను ఆశించో, మరే ఇతర కారణాల వల్లనో గర్భిణి చేరిన గంటల వ్యవధిలోనే కోతల ద్వారా బిడ్డను బయటకు తీస్తున్నారని, ఇది భవిష్యత్‌లో తీవ్ర దుష్ఫలితాలను ఇస్తుందని పేర్కొంది. వైద్యపరంగా తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ ప్రసవం చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే 90 శాతం మంది డాక్టర్లు ఎందుకు సిజేరియన్ ప్రసవం చేయాల్సి వచ్చింది అనేందుకు సరైన కారణాలు చెప్పలేకపోతున్నారని పేర్కొంది. సిజేరియన్ ప్రసవానికి సాక్ష్యాలతో కూడిన క్లినికల్ ఆధారాలను చూపించేలా చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌వో సూచించింది. చదవండి: గర్భిణులకు కోవిడ్ సోకితే, నెలలు నిండకముందే ప్రసవం క్రాస్ ఆడిట్‌కు ప్రభుత్వం నిర్ణయం రాష్ట్రంలోనూ కోతల ప్రసవాల సంఖ్య పెరుగుతున్నట్టు గణాంకాలను బట్టి తెలుస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యంగా సిజేరియన్ ప్రసవాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, గడిచిన నాలుగైదు మాసాల్లో ప్రభుత్వ పరిధిలోని పెద్దాసుపత్రుల్లోనూ సిజేరియన్ ప్రసవాలు ఎక్కువగానే ఉన్నాయి. రాత్రి 8 గంటల సమయం నుంచి ఉదయం 8 గంటల ముందు ఆస్పత్రిలో చేరిన వారికి ఎక్కువగా సిజేరియన్ ప్రసవాలు చేస్తున్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో సిజేరియన్ల వల్ల కలిగే నష్టాలపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కార్యాచరణ చేపట్టింది. కోతల ప్రసవాలపై కలిగే నష్టాలపై ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది. ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులో క్రాస్ ఆడిట్ నిర్వహిస్తారు. ఒక జిల్లాలో జరిగిన ప్రసవాలపై మరో జిల్లా అధికారులతో క్రాస్ ఆడిట్ నిర్వహించి, అకారణంగా కోతలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోనున్నారు. చదవండి: గర్భధారణ సమయంలో టిఫా స్కానింగ్ ఎందుకు చేస్తారు? 25 శాతానికి మించకూడదు మొత్తం ప్రసవాల్లో 25 శాతానికి మించి కోతల ప్రసవాలు జరగకూడదు. అలాంటిది ప్రైవేటు ఆస్పత్రుల్లో 65 శాతం పైగా జరుగుతున్నాయి. ప్రభుత్వ పరిధిలోనూ 35 నుంచి 40 శాతం జరుగుతున్నాయి. అవగాహన లేక కొంతమంది గర్భిణుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ‘మా బిడ్డ నొప్పులు భరించలేదు.. ఆపరేషన్ చేయండి డాక్టర్..’ అంటున్నారు. లేదంటే ‘ఈ రోజు మంచి రోజు.. ప్రసవం ఈ రోజు జరిగితే బావుంటుందని పంతులు చెప్పారు..’ అంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఇలాంటి నిర్ణయాల వల్ల తల్లికీ బిడ్డకూ నష్టం చేసిన వారవుతారు. – డా.గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు సిజేరియన్తో ఆరోగ్య సమస్యలు ►సాధారణ ప్రసవం ద్వారా పుట్టిన వారికంటే సిజేరియన్ ప్రసవం ద్వారా పుట్టిన పిల్లలకు ఐక్యూ తక్కువగా ఉంటుంది. ►చిన్న వయసులోనే తల్లులకు నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. సిజేరియన్ వల్ల చాలామంది తల్లులు స్థూలకాయం బారిన పడుతున్నారు. ►పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటోంది. 2021 మార్చి నుంచి జూన్ వరకు ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ప్రసవాలు ఇలా.. ఆస్పత్రి మొత్తం ప్రసవాలు సిజేరియన్ ప్రసవాలు జీజీహెచ్, అనంతపురం 2,150 945 జీజీహెచ్, విజయవాడ 2,351 1,173 జీజీహెచ్, కాకినాడ 1,900 645 జీజీహెచ్, కర్నూలు 2,119 921 కింగ్‌జార్జి, విశాఖపట్నం 2,484 1087 జీజీహెచ్, శ్రీకాకుళం 583 308 జీజీహెచ్, గుంటూరు 1,986 971 జీజీహెచ్, నెల్లూరు 1,074 596 జీజీహెచ్, కడప 1,536 826 జీజీహెచ్, ఒంగోలు 260 143 -
కలవరపెడుతున్న కడుపు ‘కోత’లు
నగరంలో కడుపు‘కోత’లు కలవరపెడుతున్నాయి. సహజ ప్రసవానికి అవకాశం ఉన్నా.. ధన సంపాదనే లక్ష్యంగా పలు ప్రైవేటు గైనకాలజిస్టులు అడ్డగోలుగా సిజేరియన్లు చేస్తున్నారు. మహిళల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కేవలం ప్రైవేటు ఆస్పత్రుల్లోనే ఎక్కువ శాతం సిజేరియన్లు జరుగుతుండటంపై జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గర్భం దాల్చిన తర్వాత చెకప్‌లకు వస్తున్న వారి శాతం తొలుత ఆశించిన స్థాయిలోనే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడయ్యింది. సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పలు కార్పొరేట్, ప్రవేటు నర్సింగ్ హోంలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. సంపాదనే లక్ష్యంగా తల్లుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. సహజ ప్రసవానికి అవకాశం ఉన్నప్పటికీ.. ఉమ్మనీరు తక్కువగా ఉందని, బిడ్డ అడ్డం తిరిగిందని, గుండె వేగంగా కొట్టుకుంటోందని, పురిటి నొప్పుల బాధ భరించలేరని పేర్కొంటూ బాధిత బంధువులను భయపెట్టి అవసరం లేకపోయినా సిజేరియన్లు చేస్తున్నారు. సాధారణ ప్రసవంతో పోలిస్తే.. సిజేరియన్ ప్రసవాలకు పట్టే సమయం కూడా చాలా తక్కువ. సర్జరీ చేయడం వల్ల ఆస్పత్రికి ఆదాయం సమకూరుతుంది. ఈ రెండు అంశాలు గైనకాలజిస్టులకు కలిసి వచ్చే అంశాలు. సిజేరియన్ ప్రసవాలు ఆ తర్వాత తరచూ కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్, అధిక బరువు, నెలసరి వంటి సమస్యలకు కారణమవుతున్నట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్లో 98.3 శాతం ప్రసవాలు ప్రభుత్వ, ప్రవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నప్పటికీ మొత్తం ప్రసవాల్లో 59.7 శాతం సిజేరియన్లు ఉండగా.. వీటిలో ఎక్కువ శాతం సిజేరియన్ డెలివరీలు ప్రైవేటులోనే జరుగుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడైంది. గర్భం దాల్చిన తర్వాత చెకప్‌లకు వస్తున్న వారి శాతం తొలుత ఆశించిన స్థాయిలోనే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. చదవండి: 8,289 ఎకరాలు.. 789 కేసులు సోమ, శుక్రవారాల్లోనే అధికం.. కాన్పు కోతలు ప్రైవేటు ఆసుపత్రుల్లోనే అత్యధికంగా జరుగుతున్నాయి. ఆదాయం పెంచుకోవడానికి ప్రైవేటు ఆస్పత్రులు వీటికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆరోగ్యబీమా ఉన్న వారు ఎక్కువగా ఈ ఆపరేషన్లకే మొగ్గుచూపుతున్నారు. కాన్పుకోతలు సోమ, శుక్రవారాల్లోనే అత్యధికంగా జరుగుతుండటం విశేషం. చాలా మంది ఈ రెండు రోజులను శుభసూచకంగా భావిస్తుంటారు. అంతేకాదు ప్రసవానికి ముందే వార, తిథి, నక్షత్ర బలాలను బట్టి ముహూర్తాలు ఖరారు చేస్తుండటం కూడా ఇందుకు కారణం. ఆదివారం ప్రసవాల సంఖ్య మాత్రమే కాదు సిజేరియన్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. వైద్యులకు ఆ రోజు సెలవు కావడమే. కారణాలనేకం.. ♦ ప్రసవ సమయం దగ్గర పడే కొద్దీ గర్భిణుల్లో ఆందోళన మొదలవుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వెలుగు చూస్తున్నాయి. తొలి ప్రసవం సిజేరియన్ అయితే ఆ తర్వాతి ప్రసవానికీ సర్జరీకే ప్రాధాన్యమిస్తున్నారు. ♦ సంతాన సాఫల్య శాతం తగ్గిపోవడం కూడా మరో కారణంగా కనిపిస్తోంది. మరికొన్ని కేసుల్లో మహిళలు ఆలస్యంగా పెళ్లి చేసుకొని 35 ఏళ్ల వయసులో తొలి సంతానానికి జన్మనిస్తున్నారు. ఇలాంటి కేసులను అరుదుగా పరిగణిస్తున్న వైద్యులు తప్పనిసరిగా చికిత్సలకు వెళుతున్నారు. ♦ కొందరు మహిళలు తొలి కాన్పు సమయంలో ఎదురైన నొప్పులు, ఇతర అనుభవాలకు భయపడి రెండో కాన్పు సిజేరియన్‌కు వెళుతున్నారు. చాలా మంది మహిళలు ఆ నిర్ణయాన్ని వైద్యులకే వదిలేస్తున్నారు. సహజ కాన్పుల సమయంలో పారామెడికల్ సిబ్బంది చేసే వెకిలి వ్యాఖ్యలు, ఇతరత్రా భావోద్వేగ పరిస్థితులను ఎదుర్కొన్న మహిళలు.. సిజేరియన్‌కే వెళ్లడం మంచిదని తోటి మహిళలకు చెబుతుండటం కూడా సిజేరియన్లు పెరగడానికి కారణమవుతోంది. గర్భం దాల్చిన తర్వాత పరీక్షలకు వస్తున్న వారు ఇలా.. శాతాల్లో తొలి యాంటినెంటల్ చెకప్‌కు హాజరువుతున్న వారు 87.9 కనీసం నాలుగు వారాల పాటు చెకప్‌కు వస్తున్నవారు 69.9 మొదటి, రెండో కాన్పుకు మధ్య కనీస వ్యతాసం పాటిస్తున్న వారు 89.6 వంద రోజుల పాటు ఐరెన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడుతున్నవారు 72.2 180 రోజుల పాటు వాడుతున్నవారు 38.4 ఎంసీపీ కార్డు పొందుతున్న వారు 94.4 సిజేరియన్లతో ఆరోగ్య సమస్యలు సిజేరియన్తో పురిటినొప్పుల బాధ నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందినప్పటికీ.. దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సిజేరియన్తో అధిక రక్తస్రావంతో పాటు నొప్పి ఎక్కువగా ఉంటుంది. కత్తిగాటు గాయం మానడానికి కనీసం నెల రోజులు పడుతుంది. ఆ తర్వాత నెలసరి సమస్యలు తలెత్తి అధిక బరువు సమస్య ఉత్పన్నమవుతుంది. కోత, కుట్ల వద్ద ఇన్ఫెక్షన్ సమస్య తలెత్తుతుంది. సాధ్యమైనంత వరకు సహజ ప్రసవానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం. – డాక్టర్ సంగీత, గైనకాలజిస్ట్ -
పొట్టలో గుడ్డముక్క.. ప్రాణాలు విడిచిన మహిళ
సాక్షి, చెన్నై : డాక్టర్ల నిర్లక్ష్యం ఓ బాలింత ప్రాణాలను బలిగొంది. గర్భిణికి సిజేరియన్ చేసిన వైద్యులు గుడ్డముక్కను ఆమె పొట్టలోనే ఉంచి కుట్లు వేశారు. దీంతో తీవ్ర అనారోగ్యం పాలైన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. మృతురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. ‘కడలూర్ జిల్లా విరుదాచలం ప్రభుత్వాస్పత్రిలో ప్రియా(24)కు సిజేరియన్ చేసిన వైద్యులు ఆడ శిశువుకు పురుడు పోశారు. అయితే, మూడు రోజుల అనంతరం ప్రియా అనారోగ్యం పాలైంది. కడుపులో తీవ్రమైన నొప్పిగా ఉందని చెప్పింది. నా భార్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులకు చెప్పినా స్పందించలేదు’అని రాజ్‌కుమార్ ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తన భార్యను పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మెర్)కు తరలించామని రాజ్‌కుమార్ వెల్లడించాడు. అక్కడ చికిత్స పొందుతూ ప్రియా ప్రాణాలు విడిచిందని అతను కన్నీరుమున్నీరయ్యాడు. ప్రియా పొట్టలో గుడ్డముక్క ఉండటం వల్లే చనిపోయిందని జిప్మెర్ డాక్టర్లు చెప్పారని ఆయన తెలిపాడు. కాగా, విరుదాచలం ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిర్వాకంపై రాజ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. తమిళనాడు ఆరోగ్యశాఖ ఈ ఘటనపై స్పందించింది. నివేదిక సమర్పించాలని విరుదాచలం ప్రభుత్వ ఆస్పత్రికి ఆదేశాలు జారీ చేసింది. -
‘30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి అద్భుతం చూడలేదు’
ఢాకా : బంగ్లాదేశ్‌కు చెందిన ఓ 20 ఏళ్ల వివాహితకు ప్రసవం చేసిన డాక్టర్లు షాక్‌కు గురయ్యారు. తమ సర్వీసులో ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే... బంగ్లాదేశ్‌లోని నైరుతి ప్రాంతంలోని జస్సోర్ జిల్లాకు చెందిన వివాహిత కొన్ని రోజుల క్రితం బిడ్డకు జన్మనిచ్చింది. అయితే 26 రోజుల తర్వాత మళ్లీ నొప్పులు రావడంతో ఆస్పత్రికి రాగా వైద్యులు ఆమెను పరీక్షించారు. ఇందులో భాగంగా ఆమె గర్భంలో మరో ఇద్దరు శిశువులు ఉండటాన్ని గమనించి షాక్‌కు గురయ్యారు. వెంటనే సిజేరియన్ నిర్వహించి కవలల(అమ్మాయి, అబ్బాయి)ను బయటికి తీశారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని, మంగళవారమే వాళ్లను డిశ్చార్జ్ చేశామని పేర్కొన్నారు. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గురించి జెస్సోర్ ప్రభుత్వాసుపత్రి చీఫ్ దిలీప్ రాయ్ మాట్లాడుతూ.. ‘ 30 ఏళ్ల మెడికల్ సర్వీసులో ఇలాంటి అద్భుత ఘటన చూడలేదు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటం సంతోషకరం. అయితే మొదటిసారి డెలివరీ చేసినపుడు ఈ విషయాన్ని గమనించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఖుల్నా ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. కాగా ముగ్గురు పిల్లలు కలగడం సంతోషంగా ఉన్నా వారినెలా సాకాలో అర్థం కావడం లేదంటూ సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త రోజూవారీ కూలీ అని.. నెలకు కేవలం 1200 రూపాయలు మాత్రమే సంపాదిస్తాడని పేర్కొంది. అయితే ఆమె భర్త మాట్లాడుతూ.. ‘అల్లా దయ వల్ల నా పిల్లలు క్షేమంగా ఉన్నారు. వారిని సంతోషంగా ఉంచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా’ అని తండ్రి ప్రేమను చాటుకున్నాడు. -
కోత కాన్పుల బాధ్యత అందరిదీ
సాక్షి, హైదరాబాద్: కోత కాన్పులు (సిజేరియన్) పెరగడానికి వైద్యులతో పాటు సమాజంలోని అన్ని వర్గాల వారు బాధ్యులే అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్సె స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ (ఐకాగ్) అధ్యక్షురాలు డాక్టర్ ఎస్.శాంతకుమారి స్పష్టం చేశారు. గర్భిణులు ప్రసవ నొప్పులు పడేందుకు ఇష్టపడక పోవడం, లేటు వయసులో గర్భం దాల్చడం, మధుమేహం, ఒత్తిడి, ఫలానా ముహూర్తంలోనే బిడ్డను కనాలన్న కోరికలు వంటి అనేక కారణాలు ఇందుకు కారణమని చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ ఆబ్సెస్ట్రిక్స్ అండ్ గైనకలాజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా (ఫాగ్సీ) వార్షిక సమావేశాల సందర్భంగా శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. బ్రెజిల్ తదితర దేశాల్లో 60–70 శాతం కాన్పులు ఈ రకంగా జరుగుతుంటే..భారత్‌లో అది 20 శాతం మాత్రమే అని తెలిపారు. ఫాగ్సీ సదస్సు గురించి వివరిస్తూ ప్రసవ సమయంలో వచ్చే ఇబ్బందులను అధిగమించడం ఎలా అన్న అంశంతోపాటు వంధ్యత్వం, అత్యవసర సేవలు వంటి మూడు అంశాలపై గైనకాలజిస్టులకు వర్క్‌షాపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఐకాగ్ ఉపాధ్యక్షుడు పరాగ్ బిన్నీ వాలా పాల్గొన్నారు. -
ఒక అర్ధరాత్రి పిలుపు
సైనికుడికి యుద్ధ సమయం కీలకం. కానీ సైన్యంలోని వైద్యుడికి శాంతిసమయం కూడా కీలకమే. యుద్ధం లేనప్పుడు సైనికులు వార్ ఎక్సర్సైజ్ చేస్తారు. అందులో గాయపడిన వారికి వైద్యం చేయాలి, ఎప్పుడు పిలుపు వచ్చినా హాజరు కావడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి పిలుపు ఒక పేదగ్రామీణుడి నుంచి వస్తే! దానికి స్పందించిన లెఫ్ట్‌నెంట్ కల్నల్ డాక్టర్ అశోక్ అనుభవం ఈవారం... మొదట్లో నన్ను విసుక్కున్న సర్జన్ కూడా ‘ఇక నుంచి మీరిచ్చిన ధైర్యంతో సిజేరియన్ ఆపరేషన్లు కూడా చేస్తాను’ అన్నారు. మాది కృష్ణాజిల్లా రేమల్లె. నేను ఆర్మీలో చేరిన నాటికి కశ్మీర్ ప్రశాంతమైన ప్రదేశం. 1990 తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. నేను పూంచ్ సెక్టార్లో పని చేసిన రోజుల్లో ప్రతిరోజూ ఒక ఉగ్రదాడి జరిగేది. మేమున్న ప్రదేశం జమ్మూ నగరానికి దాదాపు 250 కిలోమీటర్లుంటుంది. సెలవు రోజుల్లో జమ్మూ నగరానికి వెళ్లాలంటే సరైన రోడ్డు ఉండేది కాదు. ఘాట్‌రోడ్డులో ఏ నిమిషమైనా, ఎక్కడైనా మందుపాతర పేలవచ్చు. వాటికి వెరవకుండా ఉద్యోగం చేయడమే ప్రధానం. సైనికులకు వైద్యం చేయడం నా విధి. స్థానికులకు వైద్యం చేయడం విధి కాదుగానీ ఆసక్తి ఉంటే చేయొచ్చు. నేను వృత్తిరీత్యా ఎనెస్థిటిస్టునే అయినా ఎంతోమంది బిడ్డల్ని డెలివర్ చేశాను, ప్రాణాపాయంలో ఉన్న వారికి అత్యవసర చికిత్స అందించాను. కార్గిల్ సమయంలో... నా ఆర్మీ జీవితంలో కార్గిల్ వార్ మరిచిపోలేనిది. పాకిస్తాన్ వాళ్లు మనదేశంలో బంకర్లు కట్టేసి దాడులు చేశారు. కాల్పులు బయటి నుంచి కాదు, మన ప్రదేశం నుంచే జరుగుతున్నాయి. బంకర్లలో ఉండే శత్రుసైనికులకు ఆహారం వెళ్లే దారులన్నీ మూసేయడంతో పదిహేడు రోజుల్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే నాకు సంతోషాన్నిచ్చిన సంఘటన అక్కడి ఓ కుగ్రామంలో జరిగింది. అది 2000 డిసెంబర్. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో స్థానికులు ఒక మహిళను మంచం మీద తెచ్చారు. ఆమె ప్రసవ నొప్పులు పడుతోంది. బిడ్డ అడ్డం తిరిగింది. వెంటనే సిజేరియన్ చేస్తే తప్ప తల్లీబిడ్డా బతకరు. నేను తక్షణమే సర్జన్‌కు ఫోన్ చేశాను. ఆయన కేసు తీసుకోవడానికి సుముఖంగా లేరు. ఆర్మీ డాక్టర్ చేతిలో ప్రాణం పోతే విచారణ జరుగుతుంది. పైగా ఆమె ముస్లిం మహిళ. ఈ ఆపరేషన్ ఫెయిలయితే తీవ్రవాదులు ఆ డాక్టర్ని టార్గెట్ చేయొచ్చు. ఆ భయంతో ‘నేను గైనకాలజిస్టును కాదు’ అని తప్పించుకోజూశారు. కళ్లల్లో కృతజ్ఞతలు ఏం చేయాలి? నాపై అధికారికి ఫోన్ చేశాను. ‘అధికారిగా ఏమీ చెప్పలేను. మీ రిస్కు మీద చేస్తానంటే నాకే అభ్యంతరం లేదు’ అన్నారు. నేను మళ్లీ సర్జన్‌కు ఫోన్ చేసి ‘మీ పై అధికారిగా ఆదేశిస్తున్నాను, వెంటనే రావాలి’ అన్నాను. ‘నాకు సిజేరియన్ ప్రొసీజర్ తెలియదంటే అర్థం చేసుకోరేం’ అన్నారు. ‘ఎన్నో సిజేరియన్ కేసులు దగ్గరగా చూశాను. ప్రతి స్టెప్ నేను చెప్తాను, మీరు చేయండి’ అన్నాను. అలా ఆపరేషన్ మొదలెట్టి, బిడ్డను క్షేమంగా బయటికి తీశాం. గర్భిణి తల్లితోనే నర్సు పనులు చేయించాం. బిడ్డకు వేయడానికి వ్యాక్సిన్ కూడా లేదు. అర్ధరాత్రి కదా, ఉదయాన్నే 90 కిలోమీటర్ల దూరంనుంచి టీకా తెప్పించి వేశాం. ఆ గ్రామస్థుల్లో వ్యక్తమైన కృతజ్ఞత అంతా ఇంతా కాదు. ఆగ్రామ ముఖియా పళ్లెం నిండా ఆక్రోటులు, బాదంకాయలతో వచ్చి ‘మీ సహాయానికి కృతజ్ఞతలు. మీకెంతో ఇవ్వాలని ఉంది. కానీ మా దగ్గరున్నవి ఇవి మాత్రమే’ అన్నారు. అప్పటి నుంచి ఆ గ్రామస్థులు మమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టారు. వాళ్లెవరూ భారత సైన్యాన్ని సొంతవారిగా భావించేవారు కాదు. నేను డాక్టర్‌గా చేసింది తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడ్డమే. కానీ ఆర్మీ వ్యక్తిగా అది దేశమాత రక్షణను పటిష్టం చేయడం! రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి