నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం
కాన్పు కోసం వచ్చిన మహిళను పట్టించుకోని వైద్యులు
దాంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేందుకు యత్నించిన గర్భిణి
అడ్డుకున్న వైద్యులు, సిబ్బంది.. బలవంతపు సిజేరియన్
నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రెండు రోజుల క్రితం కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణి కుర్చిలోనే ప్రసవించిన ఘటన మరువక ముందే శనివారం రాత్రి వైద్యుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శంగా మరో ఘటన చోటుచేసుకుంది.
ఆసుపత్రి వర్గాలు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గ్యారకుంట్లపాలెం గ్రా మానికి చెందిన చెరుకుపల్లి నాగరాజు భార్య శ్రీలత మూడో కాన్పు కోసం ఈ నెల 21న ప్రభుత్వ జన రల్ ఆసుపత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేరింది. పరీక్షించిన వైద్యులు ప్రసవానికి సమయం పడుతుందని వేచిచూడాలని సలహా ఇచ్చారు.
ఇటీవల ఆసుపత్రిలో కుర్చిలోనే ప్రసవించిన ఘటనపై స్పందించిన కలెక్టర్ బాధ్యులైన డాక్టర్‌తోపాటు అయిదుగురు నర్సింగ్ ఆఫీసర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీన్ని నిరసిస్తూ శనివారం గైనిక్ వార్డులోని వైద్యులంతా మూకుమ్మడిగా సెలవులు పెడుతున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రమణమూర్తికి నోటీసులు అందజేసి విధులు బహిష్కరించారు. దీంతో గైనిక్ వార్డులో వైద్యసేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
ముందు బాబు బాగున్నాడని చెప్పి..
శనివారం సాయంత్రం వరకు నర్సులు మినహా డాక్టర్లు లేకపోవడంతో విసిగి వేసారిన గర్భిణులు ప్రైవేట్ ఆసుపత్రులకు బయల్దేరారు. ఈక్రమంలోనే శ్రీలతను భర్త నాగరాజు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆటోలో ఎక్కిస్తుండగా ఆసుపత్రి సెక్యూరిటీ, సిబ్బంది అడ్డుకుని బలవంతంగా కా న్పుల వార్డుకు తరలించారు. మీరు బయటకు వెళ్లిపోతే మా ఉద్యోగాలు పోతాయంటూ బతిమిలాడి లోపలకు తీసుకు పోయి సేవలందిస్తామని సూచించారు.
రాత్రి 9.30 సమయంలో శ్రీలతకు వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు. అయితే అప్పటికే పుట్టిన బాబు మృతి చెందినట్లు తెలిసింది. అయితే ముందుగా బాబు బాగున్నాడని వైద్యులు చెప్పారని, ఆ తరువాత చనిపోయినట్లు చెప్పారని బంధువులు పేర్కొన్నారు. డాక్టర్ల నిర్వాకంపై బంధువులు అర్ధరాత్రి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు.
బాబు శరీరంపై గాయాలు ఉన్నాయని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాబు మరణించాడని ఆరోపించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమించి కేసు పెట్టాలని సూచించడంతో నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణమూర్తిని వివరణ కోరగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని, జిల్లా కలెక్టర్‌కు జరిగిన ఘటనపై వివరించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment