మిస్టరీగానే తల్లి, కుమార్తె మరణం | Mother And Daughter Suspicious Death in Nalgonda District | Sakshi
Sakshi News home page

మిస్టరీగానే తల్లి, కుమార్తె మరణం

Apr 14 2025 11:51 AM | Updated on Apr 14 2025 11:51 AM

Mother And Daughter Suspicious Death in Nalgonda District

మూడు బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు 

మిర్యాలగూడ అర్బన్‌: మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో శనివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన తల్లి, కుమార్తె మరణం మిస్టరీగానే మారింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి తన అక్క కుమార్తె రాజేశ్వరీ(34)ని 2008లో వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఓ ప్రైవేట్‌ ఆగ్రో కెమికల్‌ సంస్థలో పనిచేస్తున్న సీతారాంరెడ్డి నల్లగొండ జిల్లా సేల్స్‌ మేనేజర్‌గా బదిలీపై 15ఏళ్ల క్రితమే మిర్యాలగూడకు వచ్చి హౌసింగ్‌బోర్డులో అద్దెకు ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు వేదశ్రీ, వేద సాయిశ్రీ(13) సంతానం. ఈ నెల 10న కంపెనీ బడ్జెట్‌ ఆడిట్‌ సమావేశం ఉండటంతో సీతారాంరెడ్డి హైదరాబాద్‌కు వెళ్లాడు. రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన సీతారాంరెడ్డికి గొంతుపై గాయాలతో చిన్న కుమార్తె వేద సాయిశ్రీ, బెడ్‌రూంలో ఉరేసుకుని భార్య రాజేశ్వరీ మృతిచెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. 

నోరు విప్పని పెద్ద కుమార్తె..
సీతారాంరెడ్డి పెద్ద కుమార్తె వేదశ్రీ నోరు విప్పితేనే రాజేశ్వరీ, వేద సాయిశ్రీ మృతికి గల కారణాలు తెలుస్తాయి. కానీ ఆమె మాత్రం తాను శుక్రవారం రాత్రి నిద్రపోగా శనివారం మధ్యాహ్నం మేలుకువ వచ్చిందని చెబుతోంది. దీంతో వారిపై మత్తు పదార్ధాల ప్రయోగం జరిగిందా..? అనే అనుమానాలకు తావిస్తోంది. అయితే సీతారాంరెడ్డి హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడకు వస్తున్న సమయంలో ‘ఎక్కడ ఉన్నావు డాడీ’ అంటూ మెసేజ్‌ చేయడం, తల్లి ఫోన్‌కు వరుసగా వస్తున్న ఫోన్‌ కాల్స్‌ను కట్‌ చేయడం వంటివి చూస్తే పెద్ద కుమార్తె వేదశ్రీ స్పృహాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇద్దరి మృతదేహాలపై కత్తి గాట్లు..
రాజేశ్వరీ ఎడమ చేయి మణికట్టు, పాదాల వద్ద కత్తిగాయాలు ఉండగా, వేద సాయిశ్రీ గొంతును పదునైన కత్తితో కోసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యగానే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు నేతృత్వంలో మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే మృతుల ఇంట్లో ఓ లేఖ లభ్యమైనట్లు ప్రచారం జరుగుతుండగా పోలీసులు మాత్రం దానిని ధ్రువీకరించడం లేదు. మిర్యాలగూడ వన్‌ టౌన్‌ సీఐ మోతీరాం పర్యవేక్షణలో తల్లి, కుమార్తె మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం పూర్తిచేసి బంధువులకు అప్పగించారు. 

అనుమానాస్పద స్థితిలో తల్లి, కుమార్తె మృతి

అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం: డీఎస్పీ 
తల్లి, కుమార్తె మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. మూడు బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మృతుల శరీరాలపై కత్తిగాట్లు ఉన్నందున పోస్టుమార్టం నివేదిక తర్వాత క్లూస్‌టీం సమాచారం మేరకు లోతైన విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement