ప్రతీకాత్మక చిత్రం
డెలివరీ అయ్యి వారమవుతోంది. సిజేరియన్ అయింది. ఇంటికి వెళ్లాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – జి. సంధ్యారాణి, కొత్తపేట
ఈరోజుల్లో సిజేరియన్‌ను చాలా అడ్వాన్స్‌డ్ మెథడ్స్‌లో చేయడం వలన రికవరీ చాలా వేగంగా ఉంటోంది. కొన్ని జాగ్రత్తలను ఆసుపత్రిలో ఉన్నప్పుడు, ఇంటికి వెళ్లాకా తీసుకుంటే దాదాపుగా సాధారణ ప్రసవంలో ఎంత త్వరగా కోలుకుంటారో.. సిజేరియన్‌లోనూ అంతే త్వరగా కోలుకుంటారు. ఆసుపత్రిలో డాక్టర్ సలహా ప్రకారం యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ తీసుకోవాలి. పోషక ఆహారం తీసుకోవాలి.
కుట్లకు సపోర్ట్ చాలా అవసరం
మొదటి మూడురోజుల వరకు ఆపరేషన్ కుట్లు వంటివన్నీ ఆసుపత్రిలో చూస్తారు. వాళ్లు సూచించిన ఆయింట్‌మెంట్, పౌడర్ ఇంటికి వచ్చాక కూడా అప్లయ్ చేసుకోవాలి. మీరు బెడ్ మీద ఎలాగంటే అలా కదలకూడదు. మంచం దిగేప్పుడు ఒక పక్కకి తిరిగి కూర్చుని, కాసేపు ఆగి ఆ తర్వాత నెమ్మదిగా దిగాలి. కుట్లకు సపోర్ట్ చాలా అవసరం. దగ్గు, తమ్ములు వచ్చినప్పుడు కుట్ల మీద దిండు కానీ, చేయి కానీ పెట్టి మెల్లగా ప్రెస్ చేస్తే నొప్పి ఉండదు.
ఆరు వారాల తర్వాత
మీరు చేసే రోజూవారీ పనులు ఒక వారం తరువాత మొదలుపెట్టవచ్చు. ప్రతి పనికి మధ్య విశ్రాంతి తీసుకోవాలి. బిడ్డను ఎత్తుకోవచ్చు. బరువులు ఎత్తే పనులు ఆరు వారాల తరువాతనే చేయాలి. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజులు చేయాలి. కార్ డ్రైవింగ్‌ను మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడు మొదలుపెట్టవచ్చు. సాధారణంగా సిజేరియన్ అయిన ఆరు వారాల తరువాత చేయవచ్చు.
వాకింగ్ చేయవచ్చు
అవుతూ.. ఆగిపోతూ అలా ఓ నెల వరకూ బ్లీడింగ్ ఉంటుంది. డెలివరీ అయిన మొదటి ఆరువారాలు మంచి పోషకాహారం తీసుకోవాలి. రోజుకు రెండు మూడు లీటర్ల నీళ్లు తప్పకుండా తాగాలి. 20 నిమిషాలపాటు వాకింగ్ చేయవచ్చు. స్విమ్మింగ్ లాంటివి ఆరు వారాల తరువాత చేయాలి. కూర్చునేటప్పుడు వెనుక నడుముకి సపోర్ట్ అందేలా పోశ్చర్ కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కుట్లు మానిన రెండు వారాలకు నడుము బెల్ట్ పెట్టుకోవాలి.
డెలివరీ అయిన ఆరు, ఎనిమిది వారాల తరువాత కూడా పొట్టలో నొప్పి, జ్వరం ఉన్నా.. కుట్ల దగ్గర నొప్పి లేదా చీము వస్తున్నా, తీవ్రమైన బ్యాక్ పెయిన్ ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. డెలివరీ తర్వాత చేసే వ్యాయామాలను ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే నేర్పిస్తున్నారు. మీ డాక్టర్ సూచించిన వ్యాయామాలను ఇలా మీరూ ఆన్‌లైన్ ద్వారా నేర్చుకుంటూ చేయొచ్చు.
- డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్.
చదవండి: Solution For Vaginal Boil: ఏడాదిగా అక్కడ సెగ గడ్డలు.. ఏ ట్రీట్‌మెంట్ తీసుకోవాలి?
Comments
Please login to add a commentAdd a comment