ప్రతీకాత్మక చిత్రం
ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తే తర్వాత వచ్చే గర్భం కూడా ఎక్టోపిక్ అయ్యే ప్రమాదం ఉంటుందా? ఎందుకంటే నాకు తొలి చూలు ముత్యాల గర్భమని తేలడంతో సర్జరీ చేసి ఆ గర్భాన్ని తొలగించారు. ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెన్సీ వచ్చింది. అందుకే భయంగా ఉంది. – బి. రాధిక మూర్తి, విశాఖపట్టణం.
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భం గర్భసంచిలో కాకుండా బయట అంటే ఫాలోపియన్ ట్యూబ్స్‌లో, అండాశయాల్లో, పొత్తికడుపులో నిలవడం. దీన్ని రక్త పరీక్షలు, స్కానింగ్ ద్వారా కనిపెడ్తారు. ఈ గర్భం నిలిచిన స్థానం, పరిమాణం, బ్లడ్ వాల్యూ మీద దీని చికిత్స ఆధారపడి ఉంటుంది. ఫాలోపియన్ ట్యూబ్స్‌లో గర్భం నిలవడమనేది సాధారణంగా అంటే ఒక శాతం మందిలో చూస్తాం.
కారణాలివే
ఇంతకు ముందు ఎక్టోపిక్ వచ్చినవారిలో మళ్లీ 11 నుంచి 20 శాతం వరకు వచ్చే చాన్స్ ఉంటుంది. అందుకే కొన్ని కేసెస్‌లో కారణం తెలిసినప్పుడు దానికి సరైన చికిత్స చేస్తే.. ఎక్టోపిక్ మళ్లీ వచ్చే చాన్స్‌ని తగ్గించవచ్చు. ట్యూబ్స్ డామేజ్ అవడం, ఇన్‌ఫెక్షన్స్, పెల్విక్ ఇన్‌ఫెక్షన్స్, పెల్విక్ సర్జరీ, అతుక్కుని ఉండడం.. వంటివి కొన్ని కారణాలు.
ట్యూబ్స్‌లో, ఓవరీస్‌లో నిలిచే ప్రెగ్నెన్సీ వల్ల లైఫ్ రిస్క్ ఉంటుంది. అందుకే ఇంతకు ముందు ఎక్టోపిక్ వచ్చిన వారు.. ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొంతమందిలో కాపర్ – టీ అనే గర్భనిరోధక డివైజ్ గర్భసంచిలో ఉన్నప్పుడు.. ట్యూబ్స్‌లో ప్రెగ్నెన్సీ వచ్చే చాన్సెస్ ఎక్కువ. ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీల్లోనూ ఎక్టోపిక్ చాన్సెస్ ఎక్కువే. 6 – 7 వారాల ప్రెగ్నెన్సీలోనే ట్రాన్స్ వెజైనల్ స్కాన్ ద్వారా ఎక్టోపిక్‌ను కనిపెట్టవచ్చు.
ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే చాన్సెస్ ఎక్కువే
ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయితే దానికి మందులు, శస్త్రచికిత్స .. ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి. మందులతో చికిత్స అనేది కొన్ని సెలెక్టెడ్ కేసెస్‌లో చేస్తాం. Methotrexate అనే ఇంజెక్షన్ ఇస్తాం. ఇది తీసుకున్న తరువాత మూడు నెలల వరకు ప్రెగ్నెన్సీని అవాయిడ్ చెయ్యాలి. తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే చాన్సెస్ ఎక్కువే ఉంటాయి.
ఈ ఎక్టోపిక్ వచ్చే చాన్స్ అరుదుగా ఉండొచ్చు. మీకు ఇంతకుముందు ముత్యాల గర్భం వచ్చింది అన్నారు. అది క్రోమోజోమ్స్ ఇంబాలెన్స్ వల్ల అవుతుంది. దీన్ని సర్జరీ ద్వారా తొలగించినా ఏడాది వరకు ఫాలో అప్ కేర్ అవసరం ఉంటుంది. మీకు హెచ్‌సీజీ హార్మోన్ లెవెల్స్‌ను బ్లడ్ టెస్ట్ ద్వారా పరీక్షించి కంట్రోల్ అయిందా లేదా చూస్తారు.
అయితే వందలో ఒకరికి ఈ ముత్యాల గర్భం రిపీట్ అయ్యే చాన్స్ ఉంది. ఎక్టోపిక్ లాగే దీన్ని కూడా తక్కువ వారాల వ్యవధిలోనే స్కానింగ్‌లో గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు గర్భంతో ఉన్నాను అంటున్నారు కాబట్టి.. మీరు వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి.
-డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్, హైదరాబాద్
చదవండి: పెళ్లయిన 15 రోజులకే భర్తతో అమెరికాకు.. నిజస్వరూపం బయటపడటంతో.. ఆఖరికిలా! ముందే తెలుసుకుంటే..
Comments
Please login to add a commentAdd a comment