♦కరీంనగర్ జిల్లాలో ఓ పోలీసు అధికారి. తన పుట్టిన రోజునాడే తన బాబు/పాప పుట్టాలని అనుకున్నాడు. డెలివరీకి మూడు వారాల ముందే భార్యకు సిజేరియన్ చేయించాడు.
ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాలు పెరుగుతున్నాయి. మన పక్క రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్రల్లో 30 శాతంలోపే జరుగుతుండగా మన దగ్గర మాత్రం 62 శాతంగా ఉన్నాయి. ప్రజలకు అవగాహన లేకపోవడం, ఆస్పత్రుల ధనదాహంతో రోజురోజుకూ ఈ లెక్కలు మరింత ఎక్కువవుతున్నాయి. నిపుణులేమో సాధారణ పద్ధతిలో జన్మించిన బిడ్డల్లో రోగనిరోధకత ఎక్కువుంటుందని, తల్లుల ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు. ప్రసవాలకు సంబంధించి ప్రతి జిల్లాకో కమిటీ వేస్తే సిజేరియన్లను తగ్గించవచ్చన్నారు.
రకరకాల కారణాలు
ఒకప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు ప్రసవ సమయంలో సంక్లిష్టత ఏర్పడినప్పుడే సిజేరియన్ చేసేవారు. కానీ నేడు సాధారణ ప్రసవం అరుదైన విషయంగా మారింది. ఫలానా తేదీనే కనాలని.. ముహూర్తాలు, ప్రత్యేక పర్వదినాలని ప్రజలు అనుకోవడం ఇందుకు తొలి కారణం కాగా పురిటినొప్పులను భరించడానికి కొందరు భయపడటం రెండో కారణమని వైద్యులు చెబుతున్నారు. కొందరికి అనారోగ్య కారణాల వల్ల సిజేరియన్ చేయాల్సి వస్తోందని అంటున్నారు. వీటన్నిటికన్నా ప్రైవేటు ఆస్పత్రుల ధనదాహం సిజేరియన్లు పెరగడానికి ప్రధాన కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మారిన జీవనశైలి, అనారోగ్యంతో..
ప్రజల ఆహారపు అలవాట్లు మారి హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఊబకాయం సమస్యలు సాధారణమైపోయాయి. ఇలాంటి సమస్యలున్న మహిళలకు సాధారణ కాన్పు కోసం ప్రయత్నించినా ప్రాణాంతకమని.. అందుకే సిజేరియన్లు తప్పనిసరిగా చేయాల్సి వస్తోందని గైనకాలజిస్టులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో శారీరక శ్రమ లేకపోవడమూ సిజేరియన్‌కు దారితీస్తోందని అంటున్నారు.
సాధారణ ప్రసవం సమయంలో ఆరోగ్యం క్షీణించి జరగరానిది జరిగితే ఇబ్బందులు వస్తాయ ని కొందరు ప్రైవేటు డాక్టర్లు సిజేరియన్లే చేస్తున్నార న్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్న వాళ్లలో చాలా మంది 37 వారాలు నిండీ నిండగానే చేరుతున్నారు. అవగాహన లేమితో పాటు కొందరు వైద్యు లు, ఆర్‌ఎంపీలు కమీషన్ల కోసం సిజేరియన్లకు సిఫార్సు చేస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.
కరీంనగర్‌లో 28 నిమిషాలకో సిజేరియన్
రాష్ట్రంలో అత్యధికంగా సిజేరియన్లు జరుగుతున్న జిల్లాగా కరీంనగర్‌కు రికార్డులకెక్కింది. 2021–22లో జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కలిపి 22,302 సిజేరియన్లు (సుమారు 87 శాతం) జరిగాయి. అంటే దాదాపు ప్రతి 28 నిమిషాలకు ఒక సిజేరియన్ జరుగుతోంది. పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాలలోనూ 80 నుంచి 90 శాతం వరకు ప్రసవాలు సిజేరియన్ పద్ధతిలోనే జరుగుతున్నాయి. సాధారణ ప్రసవానికి రూ.15 వేలు, సిజేరియన్‌కు రూ.35 వేలు ప్యాకేజీ అంటున్నా కొన్ని ఆస్పత్రులు సిజేరియన్ కోసం కనీసం రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నాయి.
మారుమూల ప్రాంతాల్లో సాధారణమే టాప్
పట్టణీకరణ, ప్రైవేటు ఆస్పత్రుల సదుపాయాలు బాగున్న ప్రాంతాల్లో సిజేరియన్లు ఎక్కువగా జరు గుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కానీ సరైన సదుపాయాల్లేని మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు సాధారణ కాన్పుల వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో సాధారణ డెలివరీల్లో ఆదిలాబాద్ జిల్లా (66.8 శాతం) అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ములుగులో దాదాపు 50 శాతం, భద్రాద్రి కొత్తగూడెంలో 47 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి.
జిల్లా కమిటీలు ఉండాలి
సిజేరియన్ల విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని పలువురు వైద్యులు అంటున్నారు. సీనియర్ వైద్యులతో జిల్లాకో కమిటీ ఏర్పాటు చేయాలని, ప్రతి కాన్పుకు ముందే వీరు పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి సిజేరియన్ చే యాలా.. సాధారణ కాన్పుకు వెళ్లాలా నిర్ణయించా లని చెబుతున్నారు. నార్మల్ డెలివరీలో పుట్టిన బిడ్డలకు రోగనిరోధకత ఎక్కువుంటుందని చెబుతున్నారు.
– సాక్షి ప్రతినిధి, కరీంనగర్
సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలి
మంచి రోజులు, ముహూర్తాల భ్రమ నుంచి బయటపడాలి. నెలలు నిండకుండా ప్రసవాలు చేస్తే పిల్లల ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. సిజేరియన్లు తగ్గించాలంటే సాధారణ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి గర్భిణులకు అవగాహన కల్పించాలి. తప్పనిసరైతే తప్ప సిజేరియన్లు చేయకూడదనే నిబంధన అమలు చేయాలి.
– డాక్టర్ ప్రతిష్టారావు, గైనకాలజిస్టు సాధారణ కాన్పు చేశారు
ప్రైవేట్ ఆస్పత్రిలో సాధారణ కాన్పులు జరగడం లేదని తెలిసి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాం. సాధారణ కాన్పు అయ్యే అవకాశముందని, భయపడొద్దని సిబ్బంది, వైద్యులు చెప్పారు. రెండ్రోజుల తర్వాత సాధారణ కాన్పు జరిగింది. ఆడ పిల్ల పుట్టింది. ఆస్పత్రిలో వసతులు బాగున్నాయి.
– శిరీష, గద్వాల
Comments
Please login to add a commentAdd a comment