
∙నేడు ప్రేమికుల దినోత్సవం
ముందు కెరియర్.. తర్వాతే ప్రేమైనా.. పెళ్లయినా అంటున్న నేటి యువత
ప్రేమించి, పెళ్లి చేసుకుని ఆదర్శంగా నిలుస్తున్న జంటలు
ప్రేమ వివాహాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న కొన్ని గ్రామాలు
ప్రేమ.. రెండక్షరాలే కాదు.. రెండు హృదయాల కలయిక.. ఇద్దరి జీవితాల్లో వెలుగుల దీపిక. మనసులు కలిశాక.. ఎన్ని కష్టాలొచ్చినా.. తోడునీడగా ఉండి, జీవితాంతం కలిసి నడిస్తేనే అసలైన ప్రేమ. అలాంటి ప్రేమకు ఎందరో అక్షరరూపంగా నిలిచారు. ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. పదేళ్ల క్రితం ప్రేమంటే అద్భుతం.. అదో ఆనందం.. ప్రేమించి, పెళ్లి చేసుకుంటే ఆశ్చర్యం. కానీ, కాలం మారుతుంటే అందులో అర్థం మారుతోంది. ప్రస్తుతం.. ప్రేమంటే అంత టైం లేదంటున్నారు యువత. చదువు, కెరియర్ ఫస్ట్ అని, ఆ తర్వాతే ప్రేమైనా.. పెళ్లయినా అని చెప్పుకొస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్ని గ్రామాలు ప్రేమ వివాహాలకు కేరాఫ్‌గా నిలుస్తుండగా.. పలువురు లవ్ మ్యారేజ్ చేసుకొని, కుటుంబాలతో ఆనందంగా గడుపుతున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా అలాంటి వారిపై ప్రత్యేక కథనాలు.
ఇదీ చదవండి: Valentine's Day పబ్లిక్ టాక్.. లవ్‌లో పడితే జాగ్రత్త..భయ్యా!
పెద్దల అంగీకారంతో
ఇల్లందకుంట: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన జవ్వాజి అనిల్– కల్యాణి దంపతులు వీరు. జమ్మికుంట ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో చదువుతున్న కాలంలో 2012లో ఇరువురు ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పంచి 2018లో వివాహం చేసుకున్నారు. అనిల్ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘మా వైవాహిక జీవితం అన్యోన్యంగా సాగుతోంది. ప్రేమపెళ్లి అందంగా ఉంటుంది. ఒకరికి ఒకరు తెలిసిన తర్వాత వివాహం చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుంది. ఏమైనా సమస్యలు తలెత్తినా అర్థంచేసుకుని సర్దుకుంటారు. ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది’. అని అనిల్ చెప్పుకొచ్చాడు.
ఇష్టపడ్డాం.. కష్టపడ్డాం
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన పర్లపల్లి శ్రీనివాస్, స్రవంతి దంపతులు వీరు. జమ్మికుంటలోని ప్రైవేటు జూనియర్ కళాశాలలో 2008లో ఇంటర్ చదివే రోజుల్లో ప్రేమలో పడ్డారు. ఐదేళ్ల తర్వాత స్నేహితుల సహకారంతో 2012లో ప్రేమపెళ్లి చేసుకొని ఒకటయ్యారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి అమ్మా యి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. ఇందుకోసం చాలా కష్టపడ్డారు. అయినా ఇద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. శ్రీనివాస్ ప్రస్తుతం కారు నడుపుకుంటూ కుటంబాన్ని పోషిస్తున్నాడు. స్రవంతి గృహిణి. వీరికి ఒక కుమార్తె ఉంది. ‘మా జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. ప్రస్తుతం మా పాపతో ప్రయాణం గర్వంగా కొనసాగుతోంది’ అని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.
ప్రేమ వివాహాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న కొన్ని గ్రామాలు
ప్రేమనగర్.. మరిమడ్ల
కోనరావుపేట(వేములవాడ)/ఇల్లంతకుంట: ప్రేమ పెళ్లిళ్లకు నిలయంగా నిలుస్తోంది కోనరావుపేట మండలం మరిమడ్ల. ఈ గ్రామంలో 30కి పైగా జంటలు కులాంతర వివాహాలు చేసుకున్నాయి. ఊరి జనాభా నాలుగు వేలు ఉండగా.. దశాబ్దకాలంగా పదుల సంఖ్యలో జంటలు ఒక్కటయ్యాయి. కట్నా లు లేకుండా ఆదర్శ పెళ్లిళ్లు సైతం చేసుకున్నారు. ప్రభుత్వం జరిపించే కల్యాణ మస్తు సామూహిక వివాహ వేదికలో నిజామాబాద్ జిల్లాకు చెందిన రవికుమార్‌తో ముంబయికి చెందిన రజిత వివా హాన్ని మరిమడ్లవాసులు దగ్గరుండి జరిపించారు. జింక నరేందర్ అనే యువకుడు ముంబయికి చెందిన మరో సామాజికవర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయిని మరిమడ్లకు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వెల్జిపూర్‌లో 1,620 జనాభా ఉంటుంది. గ్రామంలో 17 మంది యువతీ యువకులు ప్రేమపెళ్లిళ్లు చేసుకున్నారు.
మనసు పడ్డాం.. ఏకమయ్యాం
మాది కులాంతర వివాహం. తెలియకుండా ప్రేమలో పడ్డాం. మాటలు కలిసి పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి పెళ్లి చేసుకున్నాం. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం సంతోషాన్ని ఇచ్చింది. పెద్దల మనసు మార్చి ఏకమయ్యాం. ప్రస్తుత యువత జీవింతంలో స్థిరపడి పెళ్లి చేసుకోవాలి.
వేధింపులకు గురిచేస్తే చర్యలు
యువకులు మహిళలను, యువతులను వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తప్పవు. ఇబ్బందులకు గురైనవారు షీటీంనంబర్ 8712670759 లేదా డయల్ 100కు సమాచారం ఇస్తే నిమిషాల వ్యవధిలోనే మీ ముందు ఉంటాం. కరీంనగర్ షీటీంకు నెలకు 25 నుంచి 30 ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రెండు ఎఫ్‌ఐఆర్‌లు కాగా, గతేడాది 40 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. ఫిర్యాదు వచ్చిన వెంటనే నిందితుడిని పిలిపించి బాధితులు కోరుకుంటే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇస్తున్నాం.
– శ్రీలత, మహిళా స్టేషన్ సీఐ,
షీటీం ఇన్‌చార్జీ, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment