girls and boys
-
చిన్న వయసులో చితికిపోతున్నయువత
పిల్లలు ఉదయాన్నే చక్కగా తయారై... భుజాన బ్యాగ్ వేసుకుని... మక్కువతో కొనిచ్చిన స్కూటీపై రయ్...రయ్... మంటూ కాలేజ్‌కు దూసుకుపోతున్న పిల్లల్ని చూస్తే ఏ తల్లిదండ్రికైనా సంబరమే. కానీ వారి ప్రవర్తనలో వస్తున్న మార్పులు గమనించకపోతే... ఆ ఆనందం ఎంతో కాలం నిలవదు. వారు నిజంగా కళాశాలకే వెళ్తున్నారా... అక్కడ వీరు ఎలాంటి పిల్లలతో స్నేహం చేస్తున్నారు... ఎన్నిగంటలకు ఇంటికి చేరుతున్నారు... ఎక్కడెక్కడకు తిరుగుతున్నారు... చదువులో ఏమేరకు రాణిస్తున్నారు... ఇలాంటివి తెలుసుకోలేకపోతే ఇక గర్భశోకం తప్పదు. యుక్తవయసులో పిల్లలు సాధారణంగా చెడు సహవాసాలతో తప్పటడుగులు వేసే ప్రమాదం ఉంది. వాటిజోలికి పోకుండా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. సాక్షి, విజయనగరం ఫోర్ట్: అభం శుభం తెలియని వయసులో ఒకరి చేతిలో మోసపోయి తల్లులవుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. చక్కగా చదువుకో వాల్సిన వయస్సులో ప్రేమ మోజులో పడి మోసపోతున్నారు. కొంతమంది ఆకర్షణకు లోనవుతుండగా...మరికొందరు చెడు సహ వాసాలతో మోసపోతున్నారు. యుక్తవయసు లో సాధారణంగా తలెత్తే సమస్యలు... ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... ప్రేమ, ఆకర్షణ వంటివాటివల్ల కలిగే స మస్యలేమిటో తెలియజేస్తున్నారు. అయినా అ మ్మాయిలు నిత్యం మోసపోతూనే ఉన్నారు. 15, 16 ఏళ్ల అమ్మాయిలే అధికం పదోతరగతి... ఇంటర్మీడియేట్... చదువుతున్నవారు అంటే 15, 16 సంవత్సరాల వయ సు కలిగినవారే ఎక్కువగా ప్రేమ, ఆకర్షణకు గురవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్ వంటి వాటి ప్రభావం వల్ల ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. స్మార్ట్ ప్రభావం కూడ అమ్మాయిలు, అబ్బాయిలపై ప్రభావం చూపుతుంది. పాఠశాలలకు, కళాశాలలకు స్మార్ట్ ఫోన్లు పట్టుకుని వెళ్తున్నారు. గంటల తరబడి చాటింగ్‌లు చేసుకుంటున్నారు. పెళ్లికాకుండానే తల్లులై... 16, 17 ఏళ్లకే ప్రేమ, ఆకర్షణ పేరుతో చిన్న వయస్సులో శారీరకంగా కలిసిపోతున్నారు. దీనివల్ల పెళ్లికాకుండానే గర్భం దాల్చుతున్నారు. పిల్లలకు జన్మనిస్తున్నారు. కొందరు ముందు జాగ్రత్తగా పిల్లల్ని కనవలసి వస్తోందని భ్రూణహత్యలకు పాల్పడుతుండగా... ఇంకొందరు పుట్టిన బిడ్డను చెత్తకుప్పల్లో పడేస్తున్నారు. తల్లిదండ్రులను ధిక్కరించి... కొందరు అమ్మాయిలు ఆకర్షణకులోనై తల్లిదండ్రులను ధిక్కరిస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. ప్రేమించిన వాడితో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయి సహజీవనం చేస్తున్నారు. ఇలాంటి కేసులు ఇటీవల ఎక్కువ సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. చదువుకున్న అమ్మాయిలే ఎక్కువగా చేయడం గమనార్హం. వంచన... ఇంటినుంచి వెళ్లిపోవడం వంటివి గడచిన 11 నెలల్లో వందవరకూ నమోదయినట్టు పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వీరంతా మైనర్లే కావడం విశేషం. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చి తల్లిదండ్రులు నిఘా పెంచితే క్షణికావేశంలో ప్రాణాలు తీసేసుకుంటున్నారు. దీనికి భయపడి తల్లిదండ్రులు మిన్నకుండి పోతున్నారు. ⇔ గజపతినగరం మండలానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ ఆమెను ప్రేమ పేరుతో లోబరచుకున్నాడు. ఫలితంగా బాలిక గర్భవతి అయింది. మూడు రోజుల క్రితం మగ బిడ్డకు జన్మనిచ్చింది. ⇔ విజయనగరం పట్టణంలోని ఓ బాలిక 9వ తరగతి వరకు చదివి మానేసింది. అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలుడు ఆమెను గర్భవతిని చేశాడు. వీరికి రెండు రోజుల క్రితం పాప పుట్టి చనిపోయింది. పిల్లల ప్రవర్తనను గమనిస్తుండాలి పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వారు ఇంట్లో, బయట ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకుం టూండాలి. మంచివారితో స్నేహం చేసేలా చూడాలి. స్మార్ట్ ఫోన్లకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడం మంచింది, చెడు అలవాట్లకు బానిస కాకుండా చూడాలి. – పి.సాయి విజయలక్ష్మి, ఆడ్మినిస్ట్రేటర్, వన్‌స్టాప్ సెంటర్(సఖి) అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఆకర్షణ, ప్రేమ వంటి వాటిపై కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది 181 అవగాహన సదస్సులు నిర్వహించాం. సోషల్ మీడియా ప్రభావం వల్ల ఎక్కువ మంది ప్రేమ, ఆకర్షణకు లోనవుతున్నారు. మంచి, చెడుల గురించి తల్లిదండ్రులు వారి పిల్లలకు తెలియజేయాలి. – కె.రమాదేవి, కౌన్సిలర్, వన్‌స్టాప్ సెంటర్ -
పబ్ ముందు యువతీ యువకుల హల్చల్
బంజారాహిల్స్: ఒక్కరు.. ఇద్దరు కాదు.. దాదాపు 160 మంది యువతీ యువకులు.. పీకలదాకా మద్యం తాగారు.. నడిరోడ్డుపై చిందులేశారు.. పోలీసులనూ లెక్కచేయలేదు.. ఆ... ఏం చేస్తారులే అన్నట్లు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు.. పబ్‌లో అర్ధరాత్రి వరకుతప్ప తాగి నడిరోడ్డుపై నానా హంగామా చేశారు..జూబ్లీహిల్స్‌పోలీసులు తెలిపిన మేరకు.. రోడ్ నెం. 45లో ప్యాట్ పిజియన్ పబ్ వద్దకు శుక్రవారం రాత్రి పోలీసులు 11.45 గంటలకు వచ్చారు. 12 గంటలకు పబ్ మూసి వేయాలని యత్నిస్తుండగా పీకలదాకా మద్యం తాగిన యువతీ, యువకులు పోలీసులను అడ్డుకున్నారు. పబ్‌లోపలి నుంచి బయటకు రావడానికి నిరాకరించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వెంటనే పబ్‌ను మూసివేయాలని పోలీసులు ఎంత చెప్పినా వినకుండా పబ్ లోపలే ఉండిపోయారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటినా పబ్ తెరిచి ఉండటం పట్ల పోలీసులు క్లాస్ తీసుకున్నారు. బయటకు వచ్చిన యువతీ, యువకులు తాగిన మత్తులో డ్యాన్స్‌లు చేస్తూ న్యూసెన్స్‌కు పాల్పడ్డారు. దీంతో రోడ్డంతా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎవరూ కదలకుండా అక్కడే డ్యాన్స్‌లు చేస్తూ నానా హంగామా సృష్టించారు. క్యాబ్‌ల కోసం రోడ్డుపైన వేచి చూస్తున్నామంటూ యువతీ, యువకులు చెబుతున్నారని సీఐ తెలిపారు. 160 మంది యువతీ, యువకులు అర్ధరాత్రి రోడ్డుపై చిందులేస్తుండటంతో సీన్ చూసేందుకు వాహనదారులందరూ ఎక్కడికక్కడే నిలిచిపోయారు. నీ సంగతి చూస్తా...:ఎస్ఐని బెదిరించిన పబ్ యజమానిపై కేసు బంజారాహిల్స్: నా సంగతి నీకు తెలియదు.. నా పబ్‌కు వచ్చి నన్నే మూసేయమని చెబుతావా..? మూడు నెలలు కాకముందే మీ మాజీ సీఐని ఎలా పంపిం చామో నిన్ను కూడా అలాగే పంపిస్తాం ఖబ డ్దార్ అంటూ ఓ పబ్ యజమాని నిర్ధేశించిన సమ యం ముగిసినా బంద్ చేయకపోవడంతో పోలీసులు రాగా వారితో అన్న హెచ్చరికలు ఇవి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 12.10 గంటల సమయంలో పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 1లోని స్టోన్ వాటర్‌పబ్ ఇంకా తెరిచి ఉండటంతో పోలీసులు వెళ్లారు. పబ్‌ను మూసివేయాలని కానిస్టేబుల్ రాజు చెప్పినా వినకపోవడంతో నైట్‌డ్యూటీలో ఉన్న ఎస్ఐ సైదా అక్కడికి వెళ్లారు. సరిగ్గా అర్ధరాత్రి 12.16 గంటల సమయంలో ఎస్ఐ అక్కడికి వెళ్లి ఇంకా తెరిచి ఉన్న పబ్‌ను వీడియో తీస్తుండటంతో యజమాని సంతోష్ అక్కడికి వచ్చి దుర్భాషలాడాడు. విధులను అడ్డుకున్నాడు. ఎస్ఐతో పాటు కానిస్టేబుల్‌ను నెట్టేసేందుకు ప్రయత్నించాడు. నా సంగతి నీకు తెలియదంటూ వేలు చూపిస్తూ హెచ్చరించాడు. మూడు నెలలు కాకముందే మీ మాజీ సీఐని ఎలా పంపించామో అలాగే నిన్నూ పంపిస్తామంటూ రంకలేశాడు. దీంతో ఎస్ఐ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పబ్ యజమాని సంతోష్‌పై ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు. -
మద్యం చిత్తులో అబ్బాయిలు-అమ్మాయిలు
ఈ నగరానికి ఏమైంది? యువత ఎటువైపు వెళ్తోంది?.. అంటే భయంకరమైన ఉదాహరణలు కళ్లముందు కనిపిస్తున్నాయి. మారిన పాశ్చాత్య సంస్కృతికి అనుగుణంగా యువత అలవాట్లు మార్చుకుని సంప్రదాయాలను మంటగలుపుతోంది. కొత్తగా రెస్టారెంట్లు. పబ్‌లు ఏర్పడటంతో కొంతమంది అబ్బాయిలతో అమ్మాయిలూ మద్యం మత్తులో చిత్తమవుతున్న కేసులు ఇటీవల ఎక్కువగా పోలీసుల దృష్టికి రావడం విజయవాడలో విష సంస్కృతి వేళ్లూనుకుంటోందనడానికి ఉదాహరణలు. విజయవాడ మొగల్రాజపురంలోని రెండు మహిళా వర్కింగ్ హాస్టళ్లు, ఆ ప్రాంతం నిత్యం అర్థరాత్రి వరకూ అబ్బాయిలతో హడావుడి ఉంటుంది. బైకులపై వచ్చే కొందరు యువకులు రోడ్డుపైనే గంటల తరబడి అమ్మాయిలతో మాట్లాడుతూ స్థానికులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అదే వీధి చివర చీకటిగా ఉండే ప్రాంతంలో కారు నిలిపి ఆడవాళ్లతో మద్యం సేవిస్తున్నారు. స్థానికులు పలుమార్లు అభ్యంతరాలు చెప్పినా తీరు మారలేదు. దీంతో వారంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి.. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఉన్న ఫుడ్‌కోర్టు వద్ద ఓ మహిళ స్కూటీపై కూర్చుని మద్యం సేవించింది. పబ్లిక్‌గా మందు తాగుతుండటంతో పలువురు యువకులు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇటీవల ఓ యువతికి కొందరు యువకులు పూటుగా మద్యం తాగించి రోడ్డుపైనే వదిలి వెళ్లిపోయారు. సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ, గుంటూరు నగరాలు కార్పొరేట్ విద్యకు పెట్టింది పేరు. రాజధాని కావడంతో విద్యాసంస్థలు కొత్తవి అనేకం పుట్టుకొస్తున్నాయి. దీంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులూ పెరిగారు. చాలావరకు మహిళలు, విద్యార్థులు వర్కింగ్ హాస్టల్లోనే ఉంటున్నారు. రెండు నగరాల్లో దాదాపు 520 హాస్టళ్లు ఉన్నాయి. గుంటూరులో 264 ఇంటర్ కళాశాలల్లో 94వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. కృష్ణాజిల్లాలో 310 కళాశాలల్లో 1.35 లక్షల మంది చదువుతున్నారు. అందులో 30 శాతం మంది వర్కింగ్ హాస్టళ్లలోనే ఉంటున్నారు. అలాగే, రెండు జిల్లాల్లో ఉన్నత విద్య అందించే కళాశాలలు దాదాపు 561 ఉన్నాయి. వారిలో 40 శాతం వర్కింగ్ హాస్టళ్లలోనే ఉండి చదువుతున్నారు. ఇక ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 5వేల మంది వసతీగృహాల్లో ఉంటున్నారు. వర్కింగ్ హాస్టళ్లలో భద్రతా చర్యలు నామమాత్రమే. హాస్టల్ నిర్వహకులు పర్యవేక్షణ శూన్యం. అర్ధరాత్రుల వరకూ హాస్టళ్ల తలుపులు తెరిచే ఉంటాయి. కఠిన నిబంధనలు పెడుతుంటే ఎవరూ హాస్టళ్లలో చేరకపోవడంతో నిర్వాహకులూ పెద్దగా పట్టించుకోవట్లేదు. చీటింగ్.. చాటింగ్ వర్కింగ్ హాస్టళ్లలోని కొంతమంది అమ్మాయిలు తలుపులు తెరిచి ఆరుబయట ఫోన్ చాటింగ్‌లు, సంభాషణలతో కాలక్షేపం చేస్తున్నారు. హాస్టళ్ల వద్దకు అబ్బాయిలు వచ్చి నడిరోడ్లపైనే సంభాషించుకుంటున్నారు. ఇటీవల విజయవాడ సిద్ధార్థ నగర్ ఏరియాలో కారులో మహిళతో కలిసి యువకులు మద్యం సేవిస్తుండటంతో స్థానికులు అభ్యంతరం చెప్పారు. అయినా వారు లెక్కచేయకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, విజయవాడలోని ఓ పబ్‌లో యువతి మద్యం సేవించి బయటకు వస్తుండగా, తోటి స్నేహితులతో గొడవపడింది. ఆమెను తీసుకెళ్లేందుకు ఫ్రెండ్స్ కారులో ఎక్కిస్తుండగా, మద్యం మత్తులో అది కిడ్నాప్‌గా భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కొందరు ఓ యువతికి మద్యం తాగించి నడిరోడ్డుపై వదిలివెళ్లిన సంఘటన కూడా జరిగింది. స్పెషల్ క్లాసుల పేరుతో.. కొందరు విద్యార్థులు స్పెషల్ క్లాసుల పేరుతో రాత్రులు మల్టీప్లెక్స్, రెస్టారెంట్లు, పార్కుల్లో స్నేహితులతో కలిసి తిరుగుతున్నారు. వృత్తి పరంగా బిజీగా ఉంటున్న తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోవట్లేదు. దీంతో వారిపై పర్యవేక్షణ లేక పెడదోవ పడుతున్నారు. వారాంతపు పార్టీల పేరుతో భవానీ ఐలాండ్, నదీ తీరంలో ఎంజాయ్ చేస్తూ మద్యం సేవిస్తున్నారు. అలాగే, రాజధాని కోసం సమీకరించిన భూముల్లో కూడా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతుంటే ఇటీవల స్థానికులు కొందరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామీణ ప్రాంతాల అమ్మాయిలను కొందరు వల వేసి, ఖరీదైన వస్తువులు చూపించి విషసంస్కృతిలోకి నెడుతున్నారు. అలాగే, ఇటీవల పలు తనిఖీల్లో దొరికిన యువత ఫోన్లు ఓపెన్ చేస్తే, 70 శాతం అశ్లీల చిత్రాలే పోలీసులకు కనిపించాయి. అలాగే, ఇటీవల ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రభుత్వ వైద్యబృందం విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తే డ్రగ్స్, ధూమపాన వినియోగానికి సంబంధించిన అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. రాజధానిలో 20 శాతం యువతులు డ్రగ్స్, మద్యం, ధూమపానం వినియోగిస్తున్నట్లు తెలిసింది. తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు కార్పొరేట్ చదువుల పేరుతో తమ పిల్లలను హాస్టళ్లలో ఉంచి తల్లిదండ్రులు చదివిస్తున్నారు. వారిపై ఎంతో నమ్మకంతో దూరంగా పెట్టి చదివిస్తున్నారు. కానీ, వారి నమ్మకాన్ని కొందరు విద్యార్థులు వమ్ము చేస్తున్నారు. స్నేహితుల వలలో చిక్కుకుని విలువలు, సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చి చెడుమార్గాన్ని ఎంచుకుంటున్నారు. -
60 మంది అమ్మాయిలు.. 31 మంది అబ్బాయిల అపహరణ
నైజీరియాలోని ఈశాన్య ప్రాంత గ్రామాల నుంచి 60 మంది అమ్మాయిలు, 31 మంది అబ్బాయిలను ఇస్లామిక్ ఉగ్రవాదులు అపహరించారు. ఈ విషయాన్ని స్థానికులు నిర్ధారిస్తున్నా, భద్రతాదళాలు మాత్రం ఖండిస్తున్నాయి. ఏప్రిల్ 15వ తేదీన ఆ దేశంలో దాదాపు 200 మంది పాఠశాల విద్యార్థినులను ఉగ్రవాదులు అపహరించుకుని వెళ్లినా, ప్రభుత్వం సరిగా స్పందించకపోవడంతో అక్కడి సర్కారుతో పాటు సైన్యం మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. శనివారం నాడు నలుగురు గ్రామస్థులను చంపి మరీ అమ్మాయిలు, అబ్బాయిలను ఉగ్రవాదులు అపహరించుకు వెళ్లారని ఆ గ్రామ వాసి అజీ ఖలీల్ తెలిపారు. గ్రామాల్లోకి ఉగ్రవాదులు చొరబడి అఘాయిత్యాలు చేయకుండా అడ్డుకోడానికి ఏర్పాటుచేసిన గ్రామ కమిటీలో ఖలీల్ కూడా సభ్యుడు. ఈ కమిటీ సభ్యులు సాధారణ ఆయుధాలతో కొంతమేరకు గ్రామాలకు రక్షణ కల్పించగలుగుతున్నారు. గ్రామంలో చాలామంది ఉగ్రవాదుల భయంతో దాదాపు 25 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.