deliveries
-
సహజ ప్రసవాలకు ‘సీ–సేఫ్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాలను తగ్గించి.. సహజ ప్రసవాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే పలు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇదే క్రమంలో ‘సీ–సేఫ్’ అనే మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10 నుంచి 15 శాతానికి మించకూడదు. అయితే, రాష్ట్రంలో మొత్తం ప్రసవాల్లో 45 శాతం సిజేరియన్లు ఉంటున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతానికిపైగా, ప్రభుత్వాస్పత్రుల్లో 32 శాతం మేర ఈ తరహా కాన్పులు ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో కోత కాన్పుల నియంత్రణకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. కాగా, సీ–సేఫ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. నర్సులకు మిడ్వైఫరీ శిక్షణ పూర్తి సహజ ప్రసవాలను పెంపొందించే చర్యల్లో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లోని నర్సులకు ‘నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్వైఫరీ (ఎన్‌పీఎం)’ కోర్సును గత ఏడాది ప్రారంభించారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున రెండు బ్యాచ్‌లుగా గుంటూరు, తిరుపతిలలో 18 నెలల శిక్షణ ఇచ్చారు. గర్భధారణ జరిగినప్పటి నుంచి మహిళకు అవసరమైన వైద్య సహాయం, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నవజాత శిశువుకు అందించాల్సిన సేవలు, హైరిస్క్ లో ఉన్న గర్భిణులను ఏ విధంగా గుర్తించాలి వంటి పలు రకాల అంశాలపై నర్సులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం వీరికి నర్సింగ్ బోర్డ్‌లో పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి సరి్టఫికెట్లు జారీ చేస్తున్నారు. త్వరలో వీరిని రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా ప్రసవాలు జరిగే 10 ఆస్పత్రుల్లో నియమించనున్నారు. అనవసర కోతల నియంత్రణ యూకేకు చెందిన బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం, యునిసెఫ్, ఫెర్నాండెజ్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర వైద్య శాఖ సీ–సేఫ్‌ను నిర్వహించనుంది. ప్రభుత్వాస్పత్రుల్లో అనవసర కోత కాన్పులను సాధ్యమైనంత వరకూ నియంత్రించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో సిజేరియన్లను ఎలాంటి పరిస్థితుల్లో నిర్వహించాలి అనే దానిపై ప్రోటోకాల్స్‌ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మన ఆస్పత్రుల్లో అసిస్టెడ్ డెలివరీ ప్రక్రియలను అంతగా వినియోగించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో ఎంపిక చేసిన ఆరు ఆస్పత్రుల్లో గైనిక్ వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వ్యాక్యూమ్, ఇతర పరికరాలను ఉపయోగించి సాధారణ ప్రసవాల్ని చేసేలా అసిస్టెడ్ డెలివరీ ప్రక్రియలో నైపుణ్యాలు పెంచనున్నారు. సిజేరియన్ తప్పనిసరి అయిన పరిస్థితుల్లో సురక్షితంగా సర్జరీల నిర్వహణపై మరింత అవగాహన పెంచనున్నారు. రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, తెనాలి, అనకాపల్లి, ఆదోని ఆస్పత్రులను సీ–సేఫ్ కోసం ఎంపిక చేసినట్టు యునిసెఫ్ ప్రతినిధి డాక్టర్ నాగేంద్ర తెలిపారు. ప్రోటోకాల్స్ రూపకల్పన త్వరలో పూర్తి అవుతుందన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మాతృ మరణాల కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఫలితంగా గతంతో పోలిస్తే మరణాలు తగ్గాయి. అదే విధంగా అనవసర సిజేరియన్ కాన్పుల నియంత్రణపై దృష్టి సారించాం. ఈ క్రమంలోనే సీ–సేఫ్‌కు ప్రణాళిక రచించాం. మరొక వైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నాం. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
ప్రసవాల్లో సరికొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు నెలలో నమోదైన ప్రసవాల్లో 76.3 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరిగాయని, ఇది ప్రభుత్వ ఆస్పత్రుల చరిత్రలో సరికొత్త రికార్డు అని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 2014లో 30 శాతంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలు, ఇప్పుడు రెట్టింపు కంటే ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో పెరిగిన విశ్వాసానికి ఇది నిదర్శనమన్నారు. ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన వైద్య,ఆరోగ్య శాఖ సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆశాలు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మంత్రి నెలవారీ సమీక్షను నిర్వహించారు. అత్యధికంగా నారాయణపేట ఆస్పత్రిలో 89% అత్యధికంగా నారాయణపేట ఆస్పత్రి 89 శాతం, ములుగు 87, మెదక్ 86, భద్రాద్రి కొత్తగూడెం 84, వికారాబాద్ 83, గద్వాల ఆస్పత్రి 85 శాతం ప్రసవాలతో మంచి పనితీరు కనబర్చాయని హరీశ్‌రావు అభినందించారు. అతి తక్కువగా డెలివరీలు అవుతున్న మంచిర్యాల (63), నిర్మల్ (66), మేడ్చల్, కరీంనగర్ (67) జిల్లాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనితీరు మెరుగుపడాలన్నారు. మొత్తంగా మంచి సామర్థ్యపు స్కోర్ విషయంలో తొలి వరుసలో నిలిచిన మెదక్ (84.4), జోగుళాంబ గద్వాల (83.9), వికారాబాద్ (81), ములుగు (79), నాగర్‌కర్నూల్ (77) జిల్లాల వైద్య సిబ్బందిని మంత్రి అభినందించారు. చివరి స్థానాల్లో ఉన్న జగిత్యాల, కొమురంభీం, నారాయణపేట, నిర్మల్, మంచిర్యాల జిల్లాలు పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖలోని అన్ని స్థాయిల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలకు ఎక్కడా అంతరాయం కలగకుండా చూసుకోవాలన్నారు. 102, 108 వాహన సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్యాలపై దృష్టి సారించాలని, కేసీఆర్ కిట్ డేటా ఆధారంగా డెలివరీ డేట్ తెలుసుకొని ముందస్తుగా ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. -
బాన్సువాడ దవాఖాన సరికొత్త రికార్డు.. ఒకే నెలలో 504 ప్రసవాలు
కామారెడ్డి: బాన్సువాడ మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిలో అగస్టులో 504 ప్రసవాలు జరిగాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్‌ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం ఆస్పత్రిలో కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆస్పత్రి ప్రారంభించి రెండేళ్లవుతోందన్నారు. గత నెలలో రికార్డు స్థాయిలో 504 ప్రసవాలు జరిగాయన్నారు. వైద్యులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. వైద్యులు సుధ, సిబ్బంది ఉన్నారు. -
ఓలా ఎస్1 ఎయిర్: కస్టమర్లకు గుడ్ న్యూస్
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1 ఎయిర్ డెలివరీలను షురూ చేసింది. ఓలా ఎస్1,ఎస్1 ప్రోకి తరువాత గత నెలలో లాంచ్ అయిన ఇ-స్కూటర్ ఎస్ 1 ఎయిర్.ఇప్పటి వరకు 50వేల బుకింగ్‌లో ప్రజాదరణ పొందిన S1 Air డెలివరీలు 100 కంటే ఎక్కువ నగరాల్లో ప్రారంభమయ్యాయని, ఇతర మార్కెట్లలో త్వరలో మొదలవనున్నాయని కంపెనీ ఒకప్రకటనలో తెలిపింది. ఆసక్తిగల కస్టమర్లు దేశవ్యాప్తంగా 1,000కు పైగా ఎక్స్పీరియన్స్ నెట్‌వర్క్‌లో ఏదైనా ఒకదానిలో,లేదా యాప్‌ద్వారా S1 ఎయిర్, సులభమైన ఫైనాన్సింగ్ఎంపికలు తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చు అనిప్రకటించింది. S1Air 3 kWh బ్యాటరీ సామర్థ్యం, 6kW గరిష్ట మోటారు శక్తి, 151 కిమీల సర్టిఫైడ్ రేంజ్ మరియు 90 km/hr గరిష్ట వేగాన్నిఅందిస్తుంది.ట్విన్ ఫ్రంట్ ఫోర్క్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, భారీ 34-లీటర్ బూట్ స్పేస్ , డ్యూయల్-టోన్బాడీ కలిగి ఉంది. ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 125 కిలోమీటర్ల వరకు ప్రయాణించ వచ్చు. స్టెల్లార్ బ్లూ, నియాన్, పింగాణీ వైట్, కోరల్ గ్లామ్, లిక్విడ్ సిల్వర్ , మిడ్నైట్ బ్లూ ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది. -
కొత్త మార్గంగా డబ్బావాలా క్లౌడ్ కిచెన్!
ముంబై డబ్బావాలా.. తెల్లటి యూనిఫాంలో లంచ్‌బాక్సులను సైకిల్స్‌పై రైల్వే స్టేషన్లకు, రైల్వే స్టేషన్ల నుంచి ఆఫీసులకు అందజేస్తూ బిజీబిజీగా గడిపేవారు. సైకిళ్ల మోత, లంచ్ బాక్సుల చప్పుళ్లతో ఆ రోజులన్నీ కళకళలాడేవి. కోవిడ్ ముంబైని తాకింది. తెల్లగా మెరిసే వారి డబ్బాలు కార్పొరేట్ కార్యాలయాల నుంచి అదృశ్యమయ్యాయి. దుమ్ము పేరుకుపోయిన డబ్బాలు, తుప్పు పట్టిన సైకిళ్లు మిగిలిపోయాయి. వారి తెల్లటి యూనిఫాంలు, గాంధీ టోపీలు అల్మారాలో ముడుచుకున్నాయి. కరోనా ప్రభావం వివిధ వర్గాలతోపాటు వాణిజ్య, వ్యాపార సంస్థల కార్యాలయాలకు లంచ్ బాక్స్‌లు చేసే డబ్బావాలాలపైనా తీవ్రంగా చూపింది. లాక్‌డౌన్‌కు ముందు ముంబైలో సుమారు 5000కుపైగా డబ్బావాలాలుండేవారు. వివిధ కారణాలవల్ల ఈ సంఖ్య రెండు వేలకు చేరింది. ప్రస్తుతం ముంబైలో కేవలం 1,500 డబ్బావాలాలున్నారు. ఈ సంఖ్య రోజురోజుకు తగ్గిపోవడం వారిని కలవర పెడుతోంది. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్‌లో ముంబైలో డబ్బావాలాలు కనుమరుగయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్‌తో.. ఒకప్పుడు మేనేజ్మెంట్ గురుగా ప్రపంచంలో గుర్తింపు పొందన ముంబై డబ్బావాలాల ఉనికి ప్రమాదంలో పడింది. కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్డౌన్ ప్రభావం డబ్బావాలాలపై తీవ్రంగా చూపింది. లాక్డౌన్ సమయంలో రవాణా సదుపాయంలేక వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేసే అనేక మంది ఉద్యోగులు ఇంటి నుంచి విధులు నిర్వహించారు. అప్పుడు డబ్బావాలాల అవసరమే లేకపోయింది. వారికి అసలు ఉపాధి లేకుండా పోయింది. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మెరుగుపడ్డాయి. ట్యాక్సీలు, బస్సులు, లోకల్ రైళ్లు తదితరా రవాణ వ్యవస్థలు యథాస్థితికి వచ్చాయి. అయినప్పటికీ అనేక మంది ఉద్యోగులు ఇప్పటికీ వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. కొన్ని కార్యాలయాలు మూతపడ్డాయి. పని చేస్తున్న మరికొన్ని కార్యాలయాల్లో క్యాంటీన్లు ప్రా రంభించారు. కొందరు ఉద్యోగులు ఇంటి నుంచి లంచ్ బాక్స్‌లు వెంట తీసుకొస్తున్నారు. కొందరు ఉ ద్యోగులు ఆన్లైన్లో ఆర్డర్చేసుకుంటున్నారు. దీంతో డబ్బావాలాల అవసరం లేకుండా పోయింది. లక్ష నుంచి 50 వేలకు.. ఒకప్పుడు ప్రతీరోజు రెండు లక్షల లంచ్‌బాక్స్‌లు చేరవేసిన ఈ డబ్బావాలాలు ఇప్పుడు 40 నుంచి 50 వేల వరకు మాత్రమే అందజేస్తున్నారు. ఫలితంగా వారి ఆదాయానికి గండిపడింది. ఒకప్పుడు ఒక్కో డబ్బావాలా నెలకు రూ.20 నుంచి 25 వేలు సంపాదించేవాడు. లంచ్ బాక్స్‌ల సంఖ్య తగ్గడంతో ఇప్పుడు రూ.12 నుంచి 15 వేలు ఆదాయం రావడం కూడా గగనమైపోయింది. అరకొర ఆదాయంతో కుటుంబాన్ని పోషించడం కష్టతరంగా మారింది. ఫలితంగా ఈ మార్గాన్ని వదులుకుని మరో ఉద్యోగ వేటలో పడ్డారు. డబ్బావాలాల సంఖ్య తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణమైంది. దివాలో నివసించే 40 ఏళ్ల సచిన్ గావ్డే డబ్బావాలాగా జీవితాంతం పేరు తెచ్చుకున్నాడు. అతని ముత్తాతలు 1952 నుండి ముంబైలో డబ్బాలను పంపిణీ చేస్తున్నారు. అదే అతని గుర్తింపు, జీవనాధారం. వర్క్ ఫ్రమ్ హోమ్ తమ జీవితాలను పూర్తిగా తలకిందులు చేసిందని చెబుతున్నాడు. క్లౌడ్ కిచెన్.. ఆన్లైన్ ఆర్డర్స్ అయితే.. దీన్ని ఎదుర్కోవడానికి డబ్బావాలాల నాల్గోతరం కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇటీవలే క్లౌడ్ కిచెన్‌ను మొదలుపెట్టారు. చాలామంది ఇంటి నుంచే పనిస్తుండటంతో లంచ్ బాక్స్‌లను డెలివరీ చేసే తమ సంప్రదాయ వ్యాపారం క్షీణించింది. ఈ నేపథ్యంలో మరింత మంది కస్టమర్లను చేరుకోవడానికి వంట చేయడం, హోమ్‌స్టైల్ మీల్స్ డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నారు. మొదట సాకినాకాలో సెంట్రల్ కిచెన్‌ను స్థాపించాలని ప్లాన్ చేశారు. ఒక స్థలం నుంచి నగరవ్యాప్తంగా భోజనాన్ని పంపిణీ చేయడం సవాలుగా మారుతుందని భావించి వికేంద్రీకృత విధానాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం ముంబయిలోని వివిధ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలతో డబ్బావాలాలు భాగస్వాములు అవుతున్నారు. కొంతమంది మహిళలు కలిసి వండిన ఆహారాన్ని ఆయా ప్రాంతాల దగ్గర్లోని ఆర్డర్లకు సప్లై చేస్తున్నారు. దీనివల్ల మహిళలు జీవనోపాధి పొందడంతోపాటు డబ్బావాలాలకు ఉపాధి ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. ఆన్లైన్ ఆర్డర్లు తీసుకుంటున్నారు. ఆన్లైన్ మెనూని బ్రౌజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు. శాఖాహార, మాంసాహార భోజనం ఉంటుంది. ధర పరిమాణాన్ని బట్టి రూ. 95 నుంచి ప్రారంభమై రూ.120 వరకు ఉంటుంది. రోజువారీ లేదా నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకోవచ్చు. ముందు రోజు సాయంత్రంలోపు ఆర్డర్ చేస్తే లంచ్ మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల మధ్య డెలివరీ చేస్తున్నారు. (చదవండి: వెదురుతో వండే కూర గురించి విన్నారా? దాని టేస్టే వేరు..!) -
అమృత హస్తాలు
33 ఏళ్ల సర్వీసు. 10 వేల డెలివరీలు. విలుప్పురం ప్రభుత్వాస్పత్రి నుంచి గత నెలలో రిటైర్ అయిన నర్సు ఖతీజాబీని తమిళనాడు ప్రభుత్వం సత్కరించి మరీ వీడ్కోలు పలికింది.కారణం ఆమె మొత్తం సర్వీసులో ఒక్క శిశువు కూడా కాన్పు సమయంలో మృతి చెందలేదు. ప్రాణం పోసే పని ఎంతటి బాధ్యతాయుతమైనదో ఖతీజాను చూసి తెలుసుకోవాలంటారు సాటి నర్సులు. ఇలాంటి నర్సులే ప్రతిచోటా కావాలి. ‘ఆ రోజుల్లో ప్రయివేటు ఆస్పత్రులు చాలా తక్కువ. ఎంతటి వాళ్లయినా ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి రావాల్సిందే. క్షణం తీరిక ఉండేది కాదు’ అని గుర్తు చేసుకుంది 60 ఏళ్ల ఖతీజాబీ. ఆమె గత నెలలోనే విల్లుపురం ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి పదవీ విరమణ పొందింది. తమిళనాడు ఆరోగ్య శాఖామంత్రి సుబ్రమణియన్ ప్రత్యేక పురస్కారం అందించి మరీ ఆమెను సత్కరించాడు. ‘అందుకు కారణం నా మొత్తం సర్వీసులో ఒక్క పసికందు కూడా కాన్పు సమయంలో ప్రాణం పోగొట్టుకోకపోవడమే’ అంటుందామె సంతృప్తిగా. ► తల్లి కూడా నర్సే ఖతీజాబీ ఏదో వేరే పని దొరక్క నర్సు కాలేదు. ఆ వృత్తి పట్ల ప్రేమతోనే అయ్యింది. ‘మా అమ్మ జులేఖా కూడా నర్సుగా పని చేసేది. కాని ఆమె కాలంలో కాన్పు సమయాలు చాలా ఘోరంగా ఉండేవి. తల్లి, బిడ్డ క్షేమంగా బయటపడతారనేది చెప్పలేము. నేను ఆమెను చూస్తూ పెరిగాను. చిన్నప్పుడు సిరంజీలతో ఆడుకున్నాను. అమ్మ వెంట హాస్పిటల్‌కు వెళుతూ హాస్పిటల్ వాసనకు అలవాటు పడ్డాను. 1990లో నేను కూడా నర్సుగా ఉద్యోగం ప్రారంభించాను. అయితే అప్పటికే నాకు పెళ్లయ్యి ఏడు నెలల గర్భిణిగా ఉన్నాను. అలా ఉంటూనే కాన్పులు చేయడం ప్రారంభించాను. నా కాన్పు అయ్యాక కేవలం రెండు నెలలు బ్రేక్ తీసుకుని మళ్లీ డ్యూటీకి హాజరయ్యాను’ అంది ఖతీజా. ► స్త్రీల వేదన 1990లలో మన దేశంలో ప్రతి లక్ష కాన్పుల్లో 556 మంది శిశువులు మరణించేవారు. నవజాత శిశువుల్లో ప్రతి 1000 మందికి 88 మంది మరణించేవారు. ‘సిజేరియన్ ఆపరేషన్లు చాలామటుకు స్త్రీలను, శిశువులను కాపాడాయి. నేను పని చేసే ఆస్పత్రిలో కేవలం ఒక డాక్టరు, ఇద్దరు నర్సులు ఉండేవాళ్లం. సిజేరియన్ చేసే సామాగ్రి మా దగ్గర ఉండేది కాదు. అందుకే కాన్పు కాంప్లికేట్ అవుతుందని డౌట్ రాగానే జిల్లా (కడలూర్) ఆస్పత్రికి పంపేసేదాన్ని. ఆ తర్వాత కూడా సిజేరియన్‌కు స్త్రీలు భయపడితే ధైర్యం చెప్పేదాన్ని. కానీ ఇవాళ మామూలు నొప్పులు వద్దని స్త్రీలు సిజేరియనే కోరుకుంటున్నారు’ అని తెలిపింది ఖతీజా. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వసతులు పెంచడం, స్త్రీల అక్షరాస్యత కోసం శ్రద్ధ పెట్టడం తదితర కారణాల వల్ల ప్రసూతి మరణాలు తగ్గుముఖం పట్టాయని ఖతీజా అంటోంది. ‘ఇవాళ మన దేశంలో ప్రతి లక్ష కాన్పుల్లో కేవలం 88 మంది పిల్లలే మరణిస్తున్నారు. నవజాత శిశువుల్లో వెయ్యికి 27 మంది మరణిస్తున్నారు’ అందామె. ► ఎంతో సంతృప్తి ‘2008 మార్చి 8 నా జీవితంలో మర్చిపోలేను. ఆ రోజు డ్యూటీకి రావడంతోటే ఇద్దరు స్త్రీలు నొప్పులతో ఉన్నారు. వారి కాన్పుకు సాయం చేశాను. రోజులో ఇద్దరు సాధారణమే. కాని ఆ తర్వాత ఆరు మంది వచ్చారు. వారంతా కూడా ఆ రోజే కాన్పు జరిగి పిల్లల్ని కన్నారు. బాగా అలసటగా అనిపించింది. కాని సాయంత్రం డ్యూటీ దిగి వెళుతుంటే ఎనిమిది మంది చంటి పిల్లలు తల్లుల పక్కన పడుకుని కేరుకేరు మంటుంటే ఏడుస్తుంటే చాలా సంతోషం కలిగింది. కాన్పు సమయంలో స్త్రీలు ఎంతో ఆందోళనగా ఉంటారు. వారికి ముందుగా ధైర్యం చెప్పడంపై నేను దృష్టి పెట్టేదాన్ని. బిడ్డను కనే సమయంలో వారు ఎంత బాధ అనుభవించినా బిడ్డ పుట్టి కేర్మన్నాక తప్పనిసరిగా నవ్వు ముఖంతో బిడ్డవైపు చూసేవారు. వారి ఆ నవ్వు నాకు ఎంతో సంతృప్తినిచ్చేది. రిటైరయ్యానన్న మాటేగాని నా మనసు మాత్రం అలాంటి తల్లుల సేవలోనే ఉండమని చెబుతోంది’ అని ముగించింది ఖతీజా. మారిన దృష్టి ‘నేను కాన్పులు చేసిన కొత్తల్లో రెండో సంతానంగా, మూడో సంతానంగా కూడా ఆడపిల్లే పుడితే ఆ తల్లులు అంతులేనంతగా ఏడ్చేవారు. అసలు తండ్రులు చూడ్డానికి కూడా వచ్చేవారు కాదు. ఇవాళ ఆ ధోరణిలో మార్పు వచ్చింది. అమ్మాయిలు పుట్టినా అబ్బాయిలు పుట్టినా కేవలం ఇద్దరు చాలని ఎక్కువమంది అనుకుంటున్నారు. నా మొత్తం సర్వీసులో 50 మంది కవలలకు పురుడు పోశాను. ఒక కాన్పులో ట్రిప్లెట్ పుట్టారు’ అందామె. -
భారత్‌లో లెక్సస్ ఇండియా లగ్జరీ కార్ డెలవరీ ప్రారంభం
జపాన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్ తాజాగా భారత్‌లో కొత్త ఐదవ తరం ఐదు సీట్ల ఆర్ఎక్స్ 350 హెచ్ (RX 350H) లగ్జరీ ఎస్యూవీ డెలివరీలను అధికారికంగా ప్రారంభించింది. ఈ కొత్త మోడల్‌ను జపాన్ సంస్థ లెక్సస్ ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్పో - 2023 ఈవెంట్లో ప్రదర్శనకు పెట్టింది. తాజాగా ఈ లగ్జరీ కార్లను కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్లు లెక్సస్ ఇండియా తెలిపింది. ఇక, చూపరులను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయడంలో లెక్సస్ ప్రసిద్ధి చెందింది. ఆ అంచనాలతో ఎక్స్ 350 కారును సైతం డిజైన్ చేసింది. ముఖ్యంగా స్కల్ప్టెడ్ లైన్, ఎల్ఈడీ ఇల్యూమినేషన్, బోల్డ్, ఐకానిక్ యాక్సెంట్లతో మోడల్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఇందులో అత్యాధునికమైన ఎలక్ట్రిఫైడ్ టెక్నాలజీని దాని అసాధారణమైన ఫీచర్లతో భారత ఆటోమొబైల్ రంగంలో ఉన్న విదేశీ ఆటోమొబైల్ కంపెనీల జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. లెక్సస్ ఆర్ఎక్స్ డ్రైవర్ కాక్‌పిట్ డిజైన్‌తో హీటెడ్, వెంటిలేటెడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, మల్టీమీడియా డిస్ప్లే సౌలభ్యాన్ని కలిగి ఉంది.ఈ కార్ ధర రూ.95.80లక్షలు. లెక్సస్ ఇండియా మొత్తం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఆర్ఎక్స్ డిమాండ్‌ని సాధించింది. -
మొదటి 5 మందికి 100 శాతం క్యాష్ బ్యాక్.. డెలివరీలు షురూ!
Keeway SR250 Delivery: 2023 ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో హంగేరియన్ టూ వీలర్ తయారీ సంస్థ 'కీవే' (Keeway) దేశీయ మార్కెట్లో తన SR250 నియో రెట్రో మోటార్‌సైకిల్ విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ. 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). డెలివరీలు జూన్ 17 నుంచి మొదలయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కంపెనీ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఎస్ఆర్250 మొదటి 500 మంది కస్టమర్లకు లక్కీ డ్రాతో పాటు అనేక కార్యక్రమాలను నిర్వహించనుంది. అంతే కాకుండా మొదటి 5 మంది కస్టమర్లకు 100 శాతం పూర్తి క్యాష్ బ్యాక్ అందించే అవకాశం కూడా ఉంది. కంపెనీ ఇప్పుడు 'My SR My Way' అనే ఒక కొత్త కస్టమైజేషన్ ప్లాట్‌ఫామ్‌ని పరిచయం చేసింది. దీని ద్వారా కీవే బైకులను కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమర్లకు మరింత సౌకర్యాన్ని అందించడానికి కీవే త్వరలో యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ (AMC) కూడా ప్రవేశపెట్టడానికి యోచిస్తోంది. దీని కింద లేబర్ ఛార్జ్, ఇంజిన్ ఆయిల్, విడిభాగాలు, యాక్ససరీలపైన తగ్గింపు అందించే అవకాశం ఉంటుంది. ఈ బైకులు భారతదేశంలోని బెనెల్లీ అవుట్లెట్ల ద్వారా అమ్ముడవుతాయి. కావున దేశవ్యాప్తంగా ఉన్న బెనెల్లీ డీలర్‌షిప్‌లలో కీవే బైకులు కొనుగోలు చేయవచ్చు. (ఇది చదవండి: 12 ఏళ్ల నిర్మాణం.. 700 ఎకరాల విస్తీర్ణం.. ప్రపంచంలోనే ఇలాంటి ప్యాలెస్ మరొకటి లేదు!) డిజైన్, ఫీచర్స్ విషయానికి వస్తే.. రౌండ్ హెడ్‌ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు, క్రోమ్ సరౌండ్‌లతో కూడిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, సిలిండర్ బ్రేక్ ఫ్లూయిడ్ రిజర్వాయర్, నాబ్డ్ టైర్లు, స్పోక్డ్ వీల్స్ వంటి వాటిని పొందుతుంది. ఇందులో సింగిల్ పీస్ సీటు లభిస్తుంది. ఫీచర్స్ పరంగా కలర్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, LED DRL లు, హజార్డ్ స్విచ్, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ ఉన్నాయి. (ఇది చదవండి: మహీంద్రా థార్ Vs మారుతి జిమ్నీ - ఏది బెస్ట్ అంటే?) కీవే ఎస్ఆర్250 బైకులో 223 సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 7,500 rpm వద్ద 16 bhp పవర్ 6,500 rpm వద్ద 16 Nm గరిష్ట టార్క్ అందిస్తుంది. ఈ బైక్ బరువు 120 కేజీల వరకు ఉంటుంది, కావున రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. -
ఓలా యూజర్లకు గుడ్ న్యూస్: సీఈవో ట్వీట్ వైరల్
సాక్షి, ముంబై: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో దూసుకుపోతున్న ఓలా తన యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. తమ కంపెనీకి చెందిన లేటెస్ట్ ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీలను త్వరలోనే ప్రారంభించనుంది. ఈ మేరకు ఒక సమాచారాన్ని కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ ట్విటర్లో పోస్ట్ చేశారు. తమ తొలి ఎస్1 ఎయిర్ వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసింది!! భలే ఉన్నాయ్..ఓలా ఎస్1 ఎయిర్ డెలివరీలు ఈ ఏడాది జూలైలో ప్రారంభమవుతాయంటా సీఈవో ట్వీట్ చేశారు. మరోవైపు ఓలా ఎలక్ట్రిక్ మరోసారి భారీ నిధులను సేకరించింది. తాజాగా ప్రముఖ సావరిన్ ఫండ్ నేతృత్వంలో 300 మిలియన్ డాలర్లను (సుమారు రూ. 2,500 కోట్లు) దక్కించుకుంది. దీంతో కంపెపీ విలువ 6 బిలియన్ల డాలర్లకు చేరింది. (రిలయన్స్ షాక్: ఉద్యోగాలు ఫట్; రానున్న కాలంలో వేలాది కోతలు!) కాగా ఓలా ఎస్1 ఎయిర్‌ను గత ఏడాది లాంచ్ చేసింది. అత్యంత సరసమైన ధరలో మూడు వేరియంట్లలో లభ్యం. దీని ధర బేస్ మోడల్ ధర రూ. 84,999గా ఉంది. మిడ్ వేరియంట్ ధర రూ. 99,999గాను, టాప్ వేరియంట్ ధర రూ.1,09,000 (ఎక్స్-షోరూమ్)గాను నిర్ణయించినసంగతి తెలిసిందే. (Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్‌ఫ్రెండ్‌తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్) Test drove the first S1 Air vehicles!! Loving them 🙂 Coming to you in July 😎💪🏼🛵 pic.twitter.com/wWnIAFYs62 — Bhavish Aggarwal (@bhash) May 23, 2023 -
స్విగ్గీలో కొత్త చార్జీలు.. ప్రతి ఆర్డర్‌పైనా అదనంగా..
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కస్టమర్ల నుంచి కొత్త చార్జీలు వసూలు చేస్తోంది. విలువతో సంబంధం లేకుండా ప్రతి ఆర్డర్‌కు అదనంగా రూ. 2 'ప్లాట్‌ఫామ్ ఫీజు' పేరుతో వసూలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతానికి బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. అయితే ఫుడ్ ఆర్డర్లపై మాత్రమే ఈ చార్జీలను స్విగ్గీ వసూలు చేస్తోంది. క్విక్-కామర్స్, ఇన్‌స్టామార్ట్ ఆర్డర్లపై ఈ చార్జీలను ఇంకా విధించడం లేదు. ఇదీ చదవండి: ఐఫోన్14 ప్లస్‌పై అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు! మరోవైపు ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబైలలో స్విగ్గీ ఈ ఛార్జీలను ఇంకా ప్రవేశపెట్టకపోవడం గమనార్హం. గత వారంలో దశలవారీగా అమలులోకి వచ్చిన ఈ చార్జీలు ఇతర ప్రాంతాలకూ విస్తరించే అవకాశం ఉంది. రూ. 2 తక్కువగానే అనిపించినా స్విగ్గీ ప్రతిరోజు 1.5 మిలియన్లకు పైగా ఆర్డర్లను డెలివరీ చేస్తుంది. అంటే భారీ మొత్తంలోనే ఆదాయం వస్తుంది. ఈ మొత్తం వ్యాపారంలో తిరిగి పెట్టుబడి పెట్టడానికి తగినంత భారీ కార్పస్‌ను సృష్టిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె! డెలివరీ వ్యాపారం మందగించడమే ఈ కొత్త చార్జీలు వసూలుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆర్థిక అనిశ్ఛిత పరిస్థితులకు కంపెనీ మినహాయింపు కాదు అని 380 ఉద్యోగాల తొలగింపు సందర్భంగా స్విగ్గీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, సహ వ్యవస్థాపకుడు శ్రీహర్ష మెజెటీ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. కాగా మరో ప్రధాన ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మాత్రం ఇంకా ఎలాంటి ప్లాట్‌ఫామ్ ఫీజులను ప్రవేశపెట్టలేదు. ఆదాయాల పరంగా చూస్తే జొమాటో ఆదాయం రూ. 4,100 కోట్లతో పోలిస్తే స్విగ్గీ ఆదాయం దాదాపు రూ. 5,700 కోట్లుగా ఉంది. -
హ్యుందాయ్ ఐయోనిక్ 5 బుక్ చేసుకున్నారా.. ఇది మీకోసమే!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్' భారతీయ మార్కెట్లో 2023 ఆటో ఎక్స్పో వేదికపై తన లేటెస్ట్ 'ఐయోనిక్ 5' ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్ డెలివరీలను ఎట్టకేలకు ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 44.95 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద విడుదలైన హ్యుందాయ్ ఐయోనిక్ 5 డెలివరీలను కంపెనీ ప్రారంభించింది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి కంపెనీ మొదట బుక్ చేసుకున్న 500 మందికి మాత్రమే ప్రారంభ ధరతో విక్రయిస్తుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు కోసం ఇప్పటికే రూ. 1 లక్షతో బుకింగ్స్ స్వీకరించడం కూడా మొదలెట్టేసింది. కావున ఇప్పుడు మొదటి బ్యాచ్ డెలివరీలను ప్రారంభించింది. ఈ లేటెస్ట్ కారు గ్రావిటీ గోల్డ్ మ్యాట్, ఆప్టిక్ వైట్, మిడ్నైట్ బ్లాక్ పెర్ల్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. (ఇదీ చదవండి: ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన మారుతి ఫ్రాంక్స్ - ధర ఎంతో తెలుసా?) 'హ్యుందాయ్ ఐయోనిక్ 5' గత 2022 లోనే వరల్డ్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ & వరల్డ్ ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను సొంతం చేసుకుంది. ఇది ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (E-GMP) పై ఆధారపడి ఉంటుంది. కావున అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఈ లేటెస్ట్ వెహికల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఇంటిగ్రేటెడ్ స్కిడ్ ప్లేట్లతో ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, రేక్డ్ రియర్ విండ్‌షీల్డ్ వంటివి కూడా ఇందులో చూడవచ్చు. ఇంటీరియర్ విషయానికి వస్తే, లోపల డార్క్ పెబుల్ గ్రే ఇంటీరియర్ థీమ్, స్లైడింగ్ సెంటర్ కన్సోల్, స్లైడింగ్ గ్లోవ్-బాక్స్, లెవెల్ 2 ADAS వంటి వాటితో పాటు రెండు 12.3 ఇంచెస్ స్క్రీన్లు (ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ & ఇన్స్ట్రుమెంట్) ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పవర్డ్ టెయిల్‌గేట్, హీటెడ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: సచిన్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపించాల్సిందే! లగ్జరీ బంగ్లా, కార్లు.. మరెన్నో!) హ్యుందాయ్ కంపెనీ తన ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు 72.6kWh బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో 631 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించారు. అయితే ఇది వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇది 350kw DC ఛార్జర్ ద్వారా 18 నిముషాల్లో 10-80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. ఆధునిక డైజిన్, ఫీచర్స్ కలిగిన హ్యుందాయ్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360 డిగ్రీ కెమెరా, డిస్క్ బ్రేక్‌లు, లేన్ ఫాలో అసిస్ట్, లేన్-కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వంటి ADAS ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. -
ఆగ‘మేఘాల’ ఘుమ ఘుమల.. ఓ వంటిల్లు.. వందలాది కస్టమర్లు
సాక్షి, హైదరాబాద్: ఆకర్షణీయమైన పరిసరాలు.. అద్భుతమైన ఆహా్వనం.. అభిరుచికి తగిన ఆహారం.. అతిథి దేవోభవ అనిపించే సేవలు.. భోజన ప్రియుల్ని ఆకర్షించేందుకు రెస్టారెంట్లు పడే తాపత్రయం అంతాఇంతా కాదు. గతంలో హోటల్‌కు వెళ్లి తినడాన్ని జనం అంతగా ఇష్టపడేవారు కాదు. కొందరు అదేదో లగ్జరీగా భావించేవారు. ఇప్పుడు వీకెండ్లో కుటుంబంతో సహా రెస్టారెంట్‌కు వెళ్లడం సాధారణంగా మారిపోయింది. ఆన్లైన్ డెలివరీలు పెరిగిన నేపథ్యంలో.. వారంలో రెండు మూడుసార్లన్నా బయట ఆర్డర్ చేసి తెప్పించుకోవడమూ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఫుడ్ బిజినెస్ లాభదాయకమనే భావన ఉన్నప్పటికీ..ఆశించిన ఆదరణ లభించకపోతే భారీ నష్టాన్ని మూటగట్టుకోవడం మాత్రం ఖాయం. ఈ నేపథ్యంలోనే ఫుడ్ బిజినెస్‌కు సంబంధించి ఓ సరికొత్త ట్రెండ్ మొదలైంది. అదే క్లౌడ్ కిచెన్. దేశ, విదేశాల్లో ఎప్పట్నుంచో ఉన్న ఈ క్లౌడ్ కిచెన్లు ఇప్పుడు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ ప్రారంభమవుతూ ఆదరణ పొందుతున్నాయి. ఒక వంటిల్లు.. వందలాది కస్టమర్లు అన్నట్టుగా క్లౌడ్ కిచెన్ల హవా సాగుతోంది. కరోనా సమయంలో ఇవి ఎక్కువగా పుంజుకున్నాయి.మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో పాతిక మించి లేని క్లౌడ్ కిచెన్లు ఇప్పుడు వందల సంఖ్యకు చేరాయి. విలాసవంతమైన రెస్టారెంట్లు..లేదు లేదు అసలు రెస్టారెంట్ అన్న భావనకు ఇది పూర్తిగా భిన్నం. హంగూ ఆర్భాటాలు ఏమీ ఉండవు. రెస్టారెంట్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడిలో 1/3 వంతు సరిపోతుంది. తక్కువ పెట్టుబడి, తక్కువ సిబ్బంది, తక్కువ వ్యయ ప్రయాసలు..స్పష్టంగా చెప్పాలంటే ఒక్క వంటిల్లు మాత్రమే ఉంటుంది. నో డైన్ ఇన్..ఓన్లీ డెలివరీ. కూర్చుని తినడానికి వీలుండదు. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే సప్లై చేస్తారు..అంతే. క్లిక్ అయితే ఎక్కువ లాభాలు. ఆదరణ లభించకపోయినా అంతంత మాత్రంగానే నష్టం..ఇదే క్లౌడ్ కిచెన్ మూల సూత్రం. షార్ట్ టైమ్.. ఫుల్ పికప్.. జొమాటో, స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ యాప్స్ సృష్టించిన ఈ ట్రెండ్ కరోనా విజృంభణ సమయంలో పట్టును దక్కించుకుంది. ఇంటర్నెట్ విస్తృత వ్యాప్తి, వ్యాపారంలో సాంకేతికత, ప్రత్యేక యాప్‌ల పెరుగుదల ఇందుకు దోహదపడింది. పెరుగుతున్న యువ జనాభా ఆదాయం, మారుతున్న జీవనశైలి, సులభమైన.. సురక్షితమైన చెల్లింపు మార్గాలు, వంటింట్లో బిజీబిజీ పరిస్థితి నుంచి కాస్త ఉపశమనం ఇత్యాదివన్నీ కూడా వీటికి ఆదరణ పెరగడానికి కారణాలుగా పేర్కొనవచ్చు. ఇంట్లో వండినట్టుండే ఆహారం నుంచి స్పెషాలిటీ లగ్జరీ డిన్నర్ల వరకు ప్రతిదానిని అందించడం ద్వారా క్లౌడ్ కిచెన్లు ఈ రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తక్కువ రేటుతో, నాణ్యమైన భోజనం, నిమిషాల్లో ఇంటి ముందు ప్రత్యక్షమవుతుండటంతో నానాటికీ వీటికి ఆదరణ పెరుగుతోంది. 2019లో దేశంలో 400 మిలియన్ల డాలర్లుగా ఉన్న క్లౌడ్ కిచెన్ల వ్యాపారం 2024 నాటికి 2 బిలియన్ల డాలర్లకు చేరుతుందని ఎఫ్ అండ్ బీ (ఫుడ్ అండ్ బివరేజెస్) పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తుండటం గమనార్హం. ఒకేచోట 100కు పైగా.. శాకాహార, ఆరోగ్యకరమైన వంటకాలు, ప్రాంతీయ రుచికరమైన వంటకాలు వంటివి అందించే ఆఫ్‌లైన్ రెస్టారెంట్ల సంఖ్య పెరగడాన్ని.. అలాగే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ క్లౌడ్ కిచెన్ల ఏర్పాటును ఈ ఏడాది చూడవచ్చునని నిపుణులు అంటున్నారు. స్విగ్గీ, జొమాటో వంటివి..క్లౌడ్ కిచెన్లకు ఆధారంగా ఉన్నప్పటికీ, భారీ కమీషన్ల ఫలితంగా, కొన్ని క్లౌడ్ కిచెన్లు తమ సొంత యాప్‌లు, సెల్ఫ్ డెలివరీ ప్రయోగాలు కూడా చేస్తున్నాయి. నాగచైతన్య వంటి సినిమా తారలను సైతం ఈ క్లౌడ్ కిచెన్స్ ఆకర్షిస్తున్నాయి. నగరంలోని డీఎల్ఎఫ్ ఏరియా లాంటి ఒకేచోట 100కు పైగా క్లౌడ్ కిచెన్లు ఉన్నాయంటే వీటికి లభిస్తున్న ఆదరణను అర్ధం చేసుకోవచ్చు. సినీహీరో నాగచైతన్య ఏర్పాటు చేసిన ‘షోయు’ ఇప్పటికే బాగా ట్రెండింగ్‌లో ఉంది. ట్రెండ్‌ను మేం ముందే ఊహించాం.. పాతికేళ్లుగా మేం మిఠాయిల తయారీలో ఉన్నాం. ఈ ట్రెండ్‌ని ముందే ఊహించి సహదేవ్‌రెడ్డి టిఫిన్స్ పేరుతో క్లౌడ్ కిచెన్ అందరికీ తెలిసే సమయానికే మేం ప్రారంభించాం. సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్, చాట్ వంటివన్నీ డెలివరీ చేస్తాం. మా కిచెన్ దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంది. తెల్లవారుజాము 4 గంటలకే స్టార్ట్ చేసి అర్ధరాత్రి ఒంటిగంట వరకూ నిర్వహిస్తాం. సిటీలోని అన్ని ప్రాంతాల నుంచీ ఆర్డర్స్ వస్తున్నాయి. వ్యయ ప్రయాసల పరంగా చూస్తే ఇది చాలా మంచి వ్యాపారం. గృహిణులు, యువత దీన్ని బాగా అందిపుచ్చుకుంటున్నారు. –పి.అభి షేక్‌రెడ్డి, సహదేవ్‌రెడ్డి టిఫిన్స్ దూకుడు పెరగడం ఖాయం మొదట్లో కొన్ని ఐటమ్స్‌కే పరిమితమైనా ఇప్పుడు రెస్టారెంట్లో దొరికే వెరైటీలన్నీ అందిస్తున్నాయి. బిర్యానీల కోసం ఒకటి, పరోటాల కోసం ఒకటి, బర్గర్స్, పిజ్జాల కోసం, స్వీట్స్, పేస్ట్రీల కోసం.. ఇలా దేనికదే ప్రత్యేక కిచెన్స్ వచ్చేశాయి. అపరిమితమైన కస్టమర్స్ బేస్ అవకాశాల వల్ల వీటి దూకుడు ఇంకా పెరగడం తథ్యం. –సంకల్ప్, హైదరాబాద్ ఫుడీస్ క్లబ్ హైదరాబాద్ టాప్... గత కొంత కాలంగా రెస్టారెంట్ వ్యాపారంలో ఉన్న మేం లగ్జరీ డైనింగ్‌ను కెఫెల ద్వారా అందిస్తున్నాం. మా బ్రాండ్‌కు ముంబయి, బెంగళూరు, చెన్నై సహా ప్రతిచోటా క్లౌడ్ కిచెన్స్ కూడా ఉన్నాయి. అయితే హైదరాబాద్‌లో మాకు ఆదరణ చాలా స్పీడ్‌గా పెరిగింది. బంజారాహిల్స్, గచ్చిబౌలి , ఎల్బీనగర్... ఇలా 4 చోట్ల మా కిచెన్స్ నిర్వహిస్తున్నాం. –భాను, లూయిస్ బర్గర్స్ -
కుర్రకారుని ఉర్రూతలూగించే అల్ట్రావయోలెట్ ఎఫ్77.. డెలివరీస్ షురూ
ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదలై కుర్రకారుని ఉర్రూతలూగించిన అల్ట్రావయోలెట్ ఎఫ్77 డెలివరీలు ప్రారంభమయ్యాయి. కంపెనీ దేశ వ్యాప్తంగా డీలర్‌షిప్‌లను ప్రారంభించడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేసుకుంటోంది. అయితే ప్రస్తుతం మొదటి డెలివరీలు బెంగళూరులో ప్రారంభమయ్యాయి. దేశీయ మార్కెట్లో అల్ట్రావయోలెట్ ఎఫ్77 ధరలు రూ. 3.80 లక్షల నుంచి రూ. 4.55 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఇది మొత్తం మూడు వేరియంట్స్‌లో లభిస్తుంది. కొనుగోలుదారులు కంపెనీ అధికారిక వెబ్సైట్లో రూ. 10,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కంపెనీ తన అల్ట్రావయోలెట్ F77 ఎలక్ట్రిక్ బైకుని గ్లోబల్ మార్కెట్లో కూడా విక్రయించే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ బైక్ భారతీయ రోడ్ల మీద మాత్రమే కాకుండా యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, జపాన్, ఇతర ఆగ్నేయాసియా దేశాల రోడ్ల మీద కూడా తిరగనున్నాయి. అల్ట్రావయోలెట్ ఎఫ్77 వేరియంట్ 7.1kWh బ్యాటరీ ప్యాక్ కలిగి, ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 207 కిలోమీటర్ల రేంజ్, రీకాన్ వేరియంట్ 10.3kWh బ్యాటరీ ప్యాక్ కలిగి 307 కిమీ రేంజ్, లిమిటెడ్ ఎడిషన్ కూడా 307 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే ఇది 77 యూనిట్లకు మాత్రమే పరిమితం. అల్ట్రావయోలెట్ ఎఫ్77 వేరియంట్ బరువు 197 కేజీలు కాగా, రీకాన్ వేరియంట్ బరువు 187 కేజీల వరకు ఉంటుంది. ఈ రెండు వేరియంట్స్ అవుట్‌పుట్ గణాంకాలు వేరుగా ఉంటాయి. ఎఫ్77 వేరియంట్ గరిష్టంగా 36.2 బిహెచ్పి పవర్, 85 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రీకాన్ వేరియంట్ 38.88 బిహెచ్పి పవర్, 95 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. -
హీరో జూమ్ బుక్ చేసుకున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్!
హీరో మోటోకార్ప్ ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త 'జూమ్' (Xoom) స్కూటర్ తన తొలి డెలివరీలను ముంబైలో ప్రారంభించింది. కంపెనీ ఈ స్కూటర్ని ఎల్ఎక్స్ (LX), విఎక్స్ (VX), జెడ్ఎక్స్ (ZX) వేరియంట్స్‌లో అందిస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 72,349 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). హీరో లేటెస్ట్ జూమ్ స్కూటర్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న హోండా డియోకి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది. ఇది 110 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 8.05 బిహెచ్పి పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ i3S ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ కలిగి ఉండటం వల్ల స్కూటర్ కెపాసిటీ మరింత మెరుగ్గా ఉంటుంది. జూమ్ స్కూటర్ రైడర్, పిలియన్‌కి సౌకర్యవంతంగా ఉన్న విశాలమైన సీటు కలిగి ఉంటుంది. ముందువైపు మంచి లైటింగ్ సెటప్, వెనుక హెచ్ షేప్ టైల్లైట్ కలిగి 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇందులో పొందుపర్చింది. ఫీచర్స్ పరంగా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జర్, గ్లోవ్ బాక్స్ లాంటివి ఉన్నాయి. ఈ స్కూటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ సెటప్ వంటి సస్పెషన్ సెటప్ & ఫ్రంట్ డిస్క్ బ్రేక్, డ్రమ్ బ్రేక్ తో మంచి బ్రేకింగ్ సిస్టం కలిగి ఉంటుంది. కస్టమర్ల అభిరుచికి తగిన విధంగా కంపెనీ తన కొత్త స్కూటర్ని పోలెస్టార్ బ్లూ, స్పోర్ట్స్ రెడ్, మాట్ అబ్రాక్స్ ఆరెంజ్, పెర్ల్ సిల్వర్ వైట్, బ్లాక్ అనే కలర్ ఆప్సన్స్ అందిస్తోంది. -
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచడంలో కేసీఆర్ కిట్, అమ్మ ఒడి సహా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు కేవలం 30 శాతం ఉంటే ఇప్పుడు 66 శాతానికి పెరిగాయి. డిసెంబర్ నెలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన ప్రసవాల్లో సంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఆ జిల్లాలో అత్యధికంగా 86 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగాయి. సబ్ సెంటర్ల వారీగా చూస్తే జగిత్యాల, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లో అత్యధికంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిపై డీఎంహెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, డిప్యూటీ డీంహెచ్‌వోలు క్షేత్ర స్థాయి పర్యటన చేసి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువగా సి– సెక్షన్లు జరుగుతున్నాయి. అనవసర సి సెక్షన్లు తగ్గించేందుకు అధికారులు కృషి చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మూడు నెలల ఓపీ పరిశీలిస్తే, రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఓపీ నమోదు చేస్తున్న నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, కొమురంభీం, జనగాం జిల్లాల్లో పరిస్థితులు మారాలన్నారు. కేసీఆర్ కిట్ లో భాగంగా ప్రతి గర్భిణికి నాలుగు ఏఎన్సీ చెకప్స్ క్రమం తప్పకుండా చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో టిఫా స్కానింగ్ సౌకర్యం తీసుకు వచ్చామని, సేవలు గర్బిణులకు అందేలా చూడాలన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ డీఎంహెచ్‌వో, డీఎంహెచ్వోలతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. 18 నుంచి కంటి వెలుగు... ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్న కంటి వెలుగు రెండో దఫా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆశ, ఏఎన్ఎంలను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు జరిగేలా చూసి, మందులు, కళ్లద్దాలు అందించడంలో క్షేత్రస్థాయిలో ఉండే ఆశాలు, ఏఎన్ఎంల పాత్ర కీలకమన్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమీక్షలో కుటుంబ, ఆరోగ్య సంక్షేమ కమిషనర్ శ్వేతా మహంతి, డీఎంఈ రమేష్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ పాల్గొన్నారు. -
సిజేరియన్లు 62 శాతం
♦కరీంనగర్ జిల్లాలో ఓ పోలీసు అధికారి. తన పుట్టిన రోజునాడే తన బాబు/పాప పుట్టాలని అనుకున్నాడు. డెలివరీకి మూడు వారాల ముందే భార్యకు సిజేరియన్ చేయించాడు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాలు పెరుగుతున్నాయి. మన పక్క రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్రల్లో 30 శాతంలోపే జరుగుతుండగా మన దగ్గర మాత్రం 62 శాతంగా ఉన్నాయి. ప్రజలకు అవగాహన లేకపోవడం, ఆస్పత్రుల ధనదాహంతో రోజురోజుకూ ఈ లెక్కలు మరింత ఎక్కువవుతున్నాయి. నిపుణులేమో సాధారణ పద్ధతిలో జన్మించిన బిడ్డల్లో రోగనిరోధకత ఎక్కువుంటుందని, తల్లుల ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు. ప్రసవాలకు సంబంధించి ప్రతి జిల్లాకో కమిటీ వేస్తే సిజేరియన్లను తగ్గించవచ్చన్నారు. రకరకాల కారణాలు ఒకప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు ప్రసవ సమయంలో సంక్లిష్టత ఏర్పడినప్పుడే సిజేరియన్ చేసేవారు. కానీ నేడు సాధారణ ప్రసవం అరుదైన విషయంగా మారింది. ఫలానా తేదీనే కనాలని.. ముహూర్తాలు, ప్రత్యేక పర్వదినాలని ప్రజలు అనుకోవడం ఇందుకు తొలి కారణం కాగా పురిటినొప్పులను భరించడానికి కొందరు భయపడటం రెండో కారణమని వైద్యులు చెబుతున్నారు. కొందరికి అనారోగ్య కారణాల వల్ల సిజేరియన్ చేయాల్సి వస్తోందని అంటున్నారు. వీటన్నిటికన్నా ప్రైవేటు ఆస్పత్రుల ధనదాహం సిజేరియన్లు పెరగడానికి ప్రధాన కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మారిన జీవనశైలి, అనారోగ్యంతో.. ప్రజల ఆహారపు అలవాట్లు మారి హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఊబకాయం సమస్యలు సాధారణమైపోయాయి. ఇలాంటి సమస్యలున్న మహిళలకు సాధారణ కాన్పు కోసం ప్రయత్నించినా ప్రాణాంతకమని.. అందుకే సిజేరియన్లు తప్పనిసరిగా చేయాల్సి వస్తోందని గైనకాలజిస్టులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో శారీరక శ్రమ లేకపోవడమూ సిజేరియన్‌కు దారితీస్తోందని అంటున్నారు. సాధారణ ప్రసవం సమయంలో ఆరోగ్యం క్షీణించి జరగరానిది జరిగితే ఇబ్బందులు వస్తాయ ని కొందరు ప్రైవేటు డాక్టర్లు సిజేరియన్లే చేస్తున్నార న్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్న వాళ్లలో చాలా మంది 37 వారాలు నిండీ నిండగానే చేరుతున్నారు. అవగాహన లేమితో పాటు కొందరు వైద్యు లు, ఆర్ఎంపీలు కమీషన్ల కోసం సిజేరియన్లకు సిఫార్సు చేస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. కరీంనగర్లో 28 నిమిషాలకో సిజేరియన్ రాష్ట్రంలో అత్యధికంగా సిజేరియన్లు జరుగుతున్న జిల్లాగా కరీంనగర్‌కు రికార్డులకెక్కింది. 2021–22లో జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కలిపి 22,302 సిజేరియన్లు (సుమారు 87 శాతం) జరిగాయి. అంటే దాదాపు ప్రతి 28 నిమిషాలకు ఒక సిజేరియన్ జరుగుతోంది. పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాలలోనూ 80 నుంచి 90 శాతం వరకు ప్రసవాలు సిజేరియన్ పద్ధతిలోనే జరుగుతున్నాయి. సాధారణ ప్రసవానికి రూ.15 వేలు, సిజేరియన్‌కు రూ.35 వేలు ప్యాకేజీ అంటున్నా కొన్ని ఆస్పత్రులు సిజేరియన్ కోసం కనీసం రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో సాధారణమే టాప్ పట్టణీకరణ, ప్రైవేటు ఆస్పత్రుల సదుపాయాలు బాగున్న ప్రాంతాల్లో సిజేరియన్లు ఎక్కువగా జరు గుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కానీ సరైన సదుపాయాల్లేని మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు సాధారణ కాన్పుల వైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో సాధారణ డెలివరీల్లో ఆదిలాబాద్ జిల్లా (66.8 శాతం) అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ములుగులో దాదాపు 50 శాతం, భద్రాద్రి కొత్తగూడెంలో 47 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లా కమిటీలు ఉండాలి సిజేరియన్ల విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని పలువురు వైద్యులు అంటున్నారు. సీనియర్ వైద్యులతో జిల్లాకో కమిటీ ఏర్పాటు చేయాలని, ప్రతి కాన్పుకు ముందే వీరు పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి సిజేరియన్ చే యాలా.. సాధారణ కాన్పుకు వెళ్లాలా నిర్ణయించా లని చెబుతున్నారు. నార్మల్ డెలివరీలో పుట్టిన బిడ్డలకు రోగనిరోధకత ఎక్కువుంటుందని చెబుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కరీంనగర్ సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలి మంచి రోజులు, ముహూర్తాల భ్రమ నుంచి బయటపడాలి. నెలలు నిండకుండా ప్రసవాలు చేస్తే పిల్లల ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. సిజేరియన్లు తగ్గించాలంటే సాధారణ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి గర్భిణులకు అవగాహన కల్పించాలి. తప్పనిసరైతే తప్ప సిజేరియన్లు చేయకూడదనే నిబంధన అమలు చేయాలి. – డాక్టర్ ప్రతిష్టారావు, గైనకాలజిస్టు సాధారణ కాన్పు చేశారు ప్రైవేట్ ఆస్పత్రిలో సాధారణ కాన్పులు జరగడం లేదని తెలిసి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాం. సాధారణ కాన్పు అయ్యే అవకాశముందని, భయపడొద్దని సిబ్బంది, వైద్యులు చెప్పారు. రెండ్రోజుల తర్వాత సాధారణ కాన్పు జరిగింది. ఆడ పిల్ల పుట్టింది. ఆస్పత్రిలో వసతులు బాగున్నాయి. – శిరీష, గద్వాల -
అధిక ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరగాలి: హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రం రాకముందు 30 శాతం ప్రసవాలు మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగేవని.. ప్రస్తుతం ఇది 60 శాతానికి చేరుకుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. త్వరలోనే ఈ సంఖ్యను 75 శాతానికి పెంచాలని ఆయన వైద్యులకు సూచించారు. అలాగే సహజ ప్రసవాలు జరిగేందుకు ఆశ కార్యకర్తలు, క్షేత్ర స్థాయిలోని సిబ్బంది కృషి చేయాలన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలో ఆశ కార్యకర్తలకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 5,500 హెల్త్ సబ్ సెంటర్లు ఉండగా వాటిలో 202 సెంటర్ల పనితీరు బాగా లేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సూది, మందుల కోసం నిధులను రూ.250 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచామని, ఆస్పత్రిలో మందులు లేవని తెలిస్తే సంబం ధిత డాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టంచేశారు. బీపీ, షుగర్ ఉన్న వారికి ప్రభుత్వం ఉచితంగా మందులను అందజేస్తుందన్నారు. మూడు రంగుల బ్యాగుల్లో ఈ మందులు అందజేస్తామని అందులో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేసుకునే మందులు నెలకు సరిపడేవి ఉంటాయన్నారు. తనకు కూడా షుగర్, బీపీ ఉందని రోజూ మందులు వేసుకుని తిరుగుతున్నా అని తెలిపారు. రాష్ట్రంలోనే ఆశ కార్యకర్తల వేతనాలు అధికం బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఆశ కార్యకర్తలకు ఎక్కువ వేతనాలు ఇస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు. ప్రతి నెలా 3వ తేదీన ఆశ కార్యకర్తలు మొదలు జిల్లా వైద్య అధికారి వరకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తానని తెలిపారు. త్వరలో అన్ని జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీలు చేయనున్నట్లు హరీశ్‌రావు స్పష్టం చేశారు. సమయపాలన పాటించని, విధిని ర్వహణలో అలసత్వం వహించే వైద్యులు, ఉద్యోగులపట్ల చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. దించిన తల ఎత్తొద్దు సిద్దిపేట టీఆర్ఎస్ కార్యాలయంలో టెట్‌కు సంబంధించి కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులందరూ ఈ రెండు నెలలు దించిన తల ఎత్తొద్దన్నారు. అప్పుడే జీవితమంతా తల ఎత్తుకునేలా బతుకుతారన్నారు. హైదరాబాద్ కంటే ఇక్కడ అద్భుతంగా కోచింగ్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించామన్నారు. -
కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వాస్పత్రుల్లో పెరిగిన ప్రసవాలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ మహిళల సంక్షేమం కోసం చేపట్టిన కేసీఆర్ కిట్ పథకంపై ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. 2014లో 30 శాతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరగ్గా 2021 నాటికి 22 శాతం పెరుగుదలతో 52 శాతానికి చేరాయని, ఇది దేశంలోనే అత్యధికమని తెలిపారు. కేసీఆర్ కిట్లను ఇప్పటివరకు 13.30 లక్షల మందికి అందజేశామని, కిట్‌లో 16 రకాల వస్తువులు ఇస్తున్నామని చెప్పారు. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు ఇస్తున్నామన్నారు. ప్రసవం అయిన తల్లీ బిడ్డల ను అమ్మ ఒడి వాహనాల ద్వారా ఇళ్లకు పంపిస్తున్నామని, అందుకోసం 300కు పైగా వాహనాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. ఇక మాతృత్వ మరణాల రేటు దేశవ్యాప్త సరాసరి ఎంఎంఆర్ 113 ఉండగా, రాష్ట్రంలో 92 నుంచి 63కు తగ్గిందన్నారు. దేశవ్యాప్త శిశు మరణాల రేటు(ఐఎంఆర్) సరాసరి 42 ఉండగా, తెలంగాణలో 39 నుంచి 23కు తగ్గిందన్నారు. -
సెకండ్ వేవ్ ఎఫెక్ట్: వెయిటింగ్లో ఆన్లైన్ ఆర్డర్స్
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ ద్వారా నిత్యావసరాలకు ఆర్డర్ చేశారా? గతంలో మీరు ఆర్డర్ ఇచ్చిన రోజే డెలివరీ చేసిన సంస్థలు ఇప్పుడు చేతులెత్తేశాయి. సెకండ్ వేవ్ ఉధృతి ఒకవైపు, లాక్డౌన్లు మరోవైపు.. వెరశి ఆన్లైన్ ఆర్డర్లు ఊహించనంత పెరగడంతో కస్టమర్లు తమ వంతు కోసం వేచి చూడక తప్పడం లేదు. ఈ–కామర్స్ కంపెనీలు కొన్ని చెన్నైలో డెలివరీకి వారం రోజుల సమయం కూడా తీసుకుంటున్నాయని సమాచారం. ఈ నగరంతో పోలిస్తే ఢిల్లీ, ముంబైలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. కోవిడ్–19 కారణంగా స్థానికంగా నియంత్రణలు ఉండడంతో డెలివరీ ఆలస్యం అవుతుంది అంటూ బిగ్‌బాస్కెట్ తన కస్టమర్లకు చెబుతోంది. డిమాండ్ విపరీతంగా ఉంది. ఆర్డర్ చేసేందుకు వీలుగా టోకెన్లను అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. అలాగే హైజీన్‌ను దృష్టిలో పెట్టుకుని ప్యాకింగ్ చేయడమూ డెలివరీల ఆలస్యానికి మరొక కారణం. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉత్పత్తులను 2 గంటల్లో చేరవేస్తున్నట్టు గ్రోఫర్స్ తెలిపింది. ఇతర ఆర్డర్లను ఒకట్రెండు రోజుల్లో పూర్తి చేస్తున్నట్టు వెల్లడించింది. డెలివరీ బాయ్స్ కావలెను.. పరిశ్రమకు డెలివరీ బాయ్స్ కొరత కూడా సమస్యగా పరిణమించింది. ఉద్యోగులు లేదా వారి కుటుంబీకులు వైరస్ బారిన పడుతున్నారని ఓ కంపెనీ ప్రతినిధి తెలిపారు. కొత్తగా డెలివరీ బా య్స్ని నియమించుకున్నప్పటికీ, కరోనా నెగెటివ్ వచ్చిన తర్వాతే కంపెనీలు విధుల్లోకి తీసుకుంటున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఈ నియామకాలు మూడు రెట్లు పెరిగాయని తెలుస్తోంది. అంతరాయాలను తగ్గిం చడానికి డెలివరీ భాగస్వాములకు రెండింతల వేతనాలు, ప్రోత్సాహకాలతో పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటికే 2,000 పైచిలుకు నియామకాలను చేపట్టినట్టు వెల్లడించింది. మరో 7,000 మందిని చేర్చుకుంటామని వివరించింది. 2 గంటల్లో డెలివరీ సేవలు అందించిన అమెజాన్ ఫ్రెష్ సర్వీస్ ఢిల్లీలో ఒకరోజు సమయం తీసుకుంటోంది. అన్ని రకాల ఉత్పత్తులనూ హోమ్ డెలివరీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని అమెజాన్ కోరుతోంది. -
ప్రసవాలకు ఏటా రూ.వెయ్యి కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏటా ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పులకు రూ.వెయ్యి కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. అనేక కుటుంబాలు భారమైనా ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పులకే మొగ్గు చూపుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని ఎక్కువ ప్రైవేటు ఆస్పత్రులు భారీగా సొమ్ము వసూలు చేస్తున్నాయి. ఎక్కువమందికి సిజేరియన్ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏడాదికి ఏడులక్షలకుపైగా ప్రసవాలు జరుగుతుండగా.. అందులో 40.68 శాతం ప్రసవాలు మాత్రమే ప్రభుత్వాస్పత్రుల్లో జరుగుతున్నాయి. మిగతావన్నీ ప్రైవేటు ఆస్పత్రుల్లోనే. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాల్లో సగటున ఒక్కోదానికి రూ.23,200 ఖర్చవుతున్నట్టు అంచనా. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న ప్రసవాల్లో 66 శాతం వరకు కోతల కాన్పులే. ప్రభుత్వాస్పత్రుల్లో జరిగే ప్రసవాల్లో సిజేరియన్ల శాతం చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలని సర్కారు కసరత్తు చేస్తోంది. మూడేళ్ల కిందట 30 శాతం మాత్రమే ఉండగా ఇప్పుడు 40.68 శాతానికి పెరిగింది. ప్రభుత్వాస్పత్రులకు ఎందుకు రావడం లేదు? ► ప్రభుత్వాస్పత్రుల్లో సకాలంలో డాక్టర్లు అందుబాటులో ఉండరు అనే భావన ఇంకా ఉంది. ► సరిగా చూడటం లేదని పేషెంట్లలో అనుమానాలున్నాయి. ► రాత్రిపూట ప్రైవేటుకు వెళ్లగానే ఫోన్‌చేస్తే డాక్టరు వచ్చి ప్రసవం చేస్తారని భావన ఉంది. ► పారిశుధ్యం నిర్వహణ సరిగా ఉండదనేది మెజారిటీ పేషెంట్ల అభిప్రాయం. ► గైనకాలజీ, మత్తు వైద్యులు, పిల్లల వైద్యులు అన్ని చోట్లా లేరు. ► నర్సులు, ఇతర సిబ్బంది పేషెంట్లను సరిగా పట్టించుకోవడం లేదనే భావన ఉంది. ప్రభుత్వాస్పత్రులకు వెళితే లాభాలేమిటి ? ► ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కువగా సాధారణ ప్రసవానికే పెద్దపీట వేస్తారు. ► ప్రసవం అయిన వెంటనే బిడ్డకు బర్త్ రిజి్రస్టేషన్ చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఆర్థికసాయం అందుతుంది. ► రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. డిశ్చార్జి అయ్యేవరకు మందులతో సహా ఉచితమే. ► రవాణా భారం ఉండదు. ఫోన్ చేయగానే 108 వాహనం ఆస్పత్రికి చేరుస్తుంది. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ఇంటిదగ్గర దించుతుంది. ► పుట్టగానే బిడ్డకు వ్యాధినిరోధక టీకాలన్నీ ఉచితంగానే వేస్తారు. ప్రతి ప్రసవం విషయంలోనూ అధికారుల బాధ్యత ఉంటుంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ► వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండేలా చేయడం. ► సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ముగ్గురు వైద్యనిపుణుల బృందం ఉండేలా చూడటం. ► ప్రసవానికి వచ్చేవారిని గౌరవంగా చూసేలా సిబ్బందికి ఆదేశాలు. ► ఆస్పత్రుల్లో ప్రసూతి గదులను ఉన్నతీకరించడం. ► కొన్ని ఆస్పత్రుల్లో హెచ్‌డీయూ (హై డిపెండెన్సీ యూనిట్)ల ఏర్పాటు. ► ప్రసూతితో పాటు నవజాత శిశువులకు ప్రత్యేక గదుల ఏర్పాటు -
కాన్పుల్లో ఎమ్మిగనూరు టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రసవాలు సగటున ఎక్కువగా జరుగుతున్న సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మొదటి స్థానంలో ఉన్నట్లు వైద్య విధాన పరిషత్ గణాంకాల్లో తేలింది. 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో కాన్పుల గణాంకాలు సేకరించారు. ఇక ఏరియా ఆస్పత్రుల్లో కాన్పుల్లో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం, జిల్లా ఆస్పత్రుల్లో విజయనగరం అగ్రస్థానంలో నిలిచాయి. జిల్లా ఆస్పత్రుల్లో ఎక్కువగా సిజేరియన్లు... 34 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు సగటున 50కి మించి ప్రసవాలు జరుగుతున్నాయి. సగటున వందకు మించి ప్రసవాలు జరుగుతున్నవి 8 ఆస్పత్రులున్నాయి. ఏరియా ఆస్పత్రుల్లో సగటున నెలకు వంద ప్రసవాలు జరిగే ఆస్పత్రులు 19 ఉన్నాయి. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో మొత్తం 1,67,128 ప్రసవాలు జరగ్గా 58,960 సిజేరియన్లు ఉన్నాయి. 35.27 శాతం సిజేరియన్ ప్రసవాలు జరిగాయి. జిల్లా ఆస్పత్రుల్లో ఎక్కువగా 47 శాతం సిజేరియన్ ప్రసవాలు నమోదయ్యాయి. సాధారణ కాన్పులకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సగటుకు మించి ప్రసవాలు జరుగుతున్న ఆస్పత్రులను హైలోడ్ డెలివరీ ఆస్పత్రులుగా గుర్తించి వసతులు మరింత మెరుగు పరచనున్నారు. ప్రసూతి వార్డులను యుద్ధప్రాతిపదికన ఉన్నతీకరిస్తున్నారు. గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా వైద్యుల బృందం ఉండేలా చర్యలు చేపట్టారు. అత్యాధునిక ప్రసూతి వార్డులు ‘నాడు – నేడు’ పనుల ద్వారా ప్రధానంగా సీహెచ్‌సీల్లో అత్యాధునిక ప్రసూతి వార్డులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఆస్పత్రిలో ముగ్గురు వైద్యుల బృందం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. మౌలిక వసతులు భారీగా పెరగనున్నాయి. –డాక్టర్ యు.రామకృష్ణారావు, కమిషనర్, వైద్యవిధానపరిషత్ -
వీధి వ్యాపారులకు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్
భోపాల్: వీధుల్లో తోపుడు బండ్లపై, ఇతర మార్గాల్లో చిరుతిళ్లు, ఇతర ఆహార పదార్థాలను అమ్మే చిన్న, మధ్య తరహా వ్యాపారుల కోసం పెద్ద రెస్టారెంట్ల తరహాలో ఒక ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించే యత్నాలు కొనసాగుతున్నాయని ప్రధాని మోదీ చెప్పారు. ఇందుకు సంబంధించిన పథకం ఒకటి రూపకల్పన దశలో ఉందన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రధానమంత్రి స్ట్రీట్ వెండార్స్ ఆత్మ నిర్భర్ నిధి(పీఎంస్వనిధి) లబ్ధిదారులను ఉద్దేశించి ఆన్లైన్లో మోదీ మాట్లాడారు. వినియోగదారుల నుంచి నగదు తీసుకోకుండా, డిజిటల్ పేమెంట్ విధానాన్ని ప్రోత్సహించాలని వారికి సూచించారు. పీఎం స్వనిధి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు. కోవిడ్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి, ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్ 1న పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. పీఎం స్వనిధి లబ్ధిదారులైన ఇండోర్ జిల్లాకు చెందిన చగన్‌లాల్, గ్వాలియర్‌కు చెందిన అర్చన, రాయిసెన్ జిల్లాకు చెందిన దాల్ చంద్ తదితరులతో ప్రధాని మాట్లాడారు. చీపురు కట్టల వ్యాపారంలో మరింత లాభం ఆర్జించేందుకు చగన్‌లాల్‌కు ప్రధాని ఒక సూచన చేశారు. చీపురు కట్టలోని ప్లాస్టిక్ పైప్‌ను తిరిగివ్వాల్సిందిగా వినియోగదారులను కోరాలని, ఆ పైప్‌లను మళ్లీ వాడడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చని సూచించారు. పీఎం మత్స్యసంపద యోజన మత్స్యకారులకు ఉపయోగపడే ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన(పీఎంఎంఎస్వై)’ పథకాన్ని నేడు మోదీ ప్రారంభించనున్నారు. ‘ఈ–గోపాల’ అనే యాప్‌ను కూడా ఆయన ఆవిష్కరించనున్నారు. బిహార్‌లో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. -
వినపడలేదా...ప్రసవ వేదన?
విజయనగరం ఫోర్ట్: రౌండ్‌ది క్లాక్ పనిచేసే పీహెచ్‌సీల్లో ప్రసవాలు అరకొరగానే సాగుతున్నాయి. నిర్దేశించిన లక్ష్యంలో కనీసం సగం కూడా చేయలేకపోతున్నారు. జిల్లాలో నాలుగైదు పీహెచ్‌సీలు మినహా మిగతా చోట్ల ప్రసవాల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. జిల్లాలో 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీలు 44 ఉన్నాయి. వీటిలో ఒక పీహెచ్సీ మాత్రం లక్ష్యానికి చేరుకోగా... రెండు పీహెచ్‌సీలు లక్ష్యానికి చేరువగా ఉన్నాయి. నెలకు ఒక్కో పీహెచ్‌సీల్లో 25 ప్రసవాలు జరిగాలి. ఏప్రిల్ నుంచి ఆక్టోబర్ నెలాఖరు నాటికి ఒక్కో పీహెచ్సీలో 175 ప్రసవాలు జరగాలి. కానీ చాలా చోట్ల రెండంకెలకు చేరుకోవడమే గగనంగా కనిపిస్తోంది. ఏ పీహెచ్‌సీల్లో ఎన్నెన్ని? ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నెలాఖరునాటికి ఏడు నెలల్లో ప్రతి పీహెచ్సీలో 175 ప్రసవాలు జరగాల్సి ఉన్నా మొండెంఖల్లులో 248, బాగువలసలో 126, గురునాయుడు పేటలో 166 ప్రసవాలు, రామభద్రపురంలో 104 మాత్రమే జరిగాయి. ఇక నెలకు 10 ప్రసవాలు కూడ చేయని పీహెచ్‌సీలు ఉన్నాయి. తెర్లాంలో 64, తాడికొండలో 47, గోవిందపురంలో 47, మోపాడలో 62, పిరిడిలో 35, సీతానగరంలో 28, గర్భాంలో 42, గరివిడిలో 20, కర్లాంలో 10, గరుగుబిల్లిలో 36 , జియ్యమ్మవలసలో 58, రావాడ రామభద్రపురంలో 26, బొండపల్లిలో 11, చల్లపేటలో 21, దత్తిరాజేరులో 34, మెంటాడలో 52, మాదలింగిలో 20, గుర్లలో 17, బందలుప్పిలో 6, డోకశిలలో 52, కొమరాడలో 26, పి.బొండపల్లిలో 7, అలమండలో 31, జామిలో 37, కొత్తవలసలో 45, ఎల్.కోటలో 22, పెదమజ్జిపాలేంలో 26, వేపాడలో 18, వియ్యంపేటలో 35 ప్రసవాలు నిర్వహించారు. రిఫరల్స్కే అధిక ప్రాధాన్యం పీహెచ్‌సీలకు ప్రసవాలకోసం వచ్చే గర్భిణులను జిల్లా ఆస్పత్రికిగాని కేజీహెచ్‌కు గాని ప్రసవాలకోసం రిఫర్ చేసేస్తున్నారు. దీనివల్ల ఆశించిన స్థాయిలో పీహెచ్‌సీల్లో ప్రసవాలు జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాదు... నిరుపేదలు సైతం సుదూరంలోని ఆస్పత్రికి వెళ్లలేక సతమతం అవుతున్నారు. వైద్యాధికారులను హెచ్చరిస్తున్నాం.. కొన్ని పీహెచ్‌సీల్లో నిర్దే«శించిన లక్ష్యం కంటే ఎక్కువగానే ప్రసవాలు జరుగుతుండగా మరి కొన్ని చోట్ల లక్ష్యానికి దగ్గరగా అవుతున్నాయి. తక్కువ ప్రసవాలు జరుగుతున్న వాటిల్లో లక్ష్యానికి అనుగుణంగా ప్రసవాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. వీటిపై పదే, పదే వైద్యాధికారులను హెచ్చరిస్తున్నాం. – డాక్టర్ ఎస్.వి.రమణకుమారి, డీఎంహెచ్ఓ -
మాతా శిశు మరణాల రేటు తగ్గించాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో నమోదవుతున్న మాతా శిశు మరణాలపై అపోలో క్రెడిల్స్ జాతీయ సదస్సు–2018 ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ..ఇప్పటికీ మాతా శిశు మరణాలు వెలుగు చూస్తుండటంపై విస్మయం వ్యక్తం చేసింది. ఈ మరణాల రేటును మరింత తగ్గించాల్సిన ఆవశ్యకత నేటితరం వైద్యులపై ఉందని పేర్కొంది. అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు పార్క్ హయత్ హోటల్లో జరిగే ఈ సదస్సును అపోలో గ్రూప్ సంస్థల చైర్మన్ డాక్టర్ ప్రతాప్.సి.రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాతా శిశు సంరక్షణ కోసం మరింత కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జాతీయ కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక ప్రకారం దేశంలో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ (ఎంఎంఆర్) పెద్ద సమస్యగా ఉందన్నారు. 2005–06లో ప్రతీ వెయ్యిమంది తల్లుల్లో 335 మంది ప్రసవ సమయంలో మరణించారని, ఈ మరణాల రేటు 2014–15 నాటికి 135కు తగ్గిందని ఆయన వెల్లడించారు. ఆస్పత్రి ప్రసవాల సంఖ్య పెరగడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. గతంలో 26%గా ఉన్న ఆస్పత్రి ప్రసవాలు ప్రస్తుతం 81 శాతానికి పెరిగినా మరణాల రేటు ఇంకా కొనసాగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. మరణాల రేటు 70కు తగ్గించాలి 2030 నాటికి ప్రసవ సమయంలో తల్లుల మరణాల సంఖ్యను 70కు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రతాప్.సి.రెడ్డి తెలిపారు. ప్రపంచ సగటు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు (ఐఎంఆర్)12 ఉండగా, దేశంలో 2017 నాటికి పుట్టిన ప్రతీ వెయ్యి మంది శిశువులకు 32 శిశువులు చనిపోతున్నారని తెలిపారు. ఇందులో నెలలోపు శిశువుల్లో 24 మంది మృతి చెందుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. 2030 నాటికి 70% మాతా శిశు మరణాలకు దీర్ఘకాలిక రోగాలు కారణమవుతాయని, రాబోయే రోజుల్లో వీటి నుంచి భారీ ప్రమాదాన్ని పొంచి ఉందని హెచ్చరించారు. ఈ సదస్సుకు అపోలో గ్రూప్ వైస్‌చైర్ పర్సన్ శోభన కామినేని, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, మెడికల్ డైరెక్టర్ అనుపమ్ సిబల్, ఓబీఎస్‌హెచ్ వైస్ చైర్మన్ డాక్టర్ మహితారెడ్డి, పీఏటీఎస్ అధ్యక్షురాలు డాక్టర్ హిమబిందు, ఎన్ఎన్ఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ బల్దేవ్ భాటియా, డాక్టర్ సియంగ్ లిన్‌టాన్, డాక్టర్ వైఎస్ యంగ్, డాక్టర్ శైలేశ్ కుమార్, సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 600 మంది గైనకాలజీ, పీడియాట్రిక్ వైద్యనిపుణులు హాజరయ్యారు. -
తెలంగాణ ప్రసవ కేంద్రాలు భేష్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. ప్రోత్సాహకాలు ఇవ్వడం, ఆసుపత్రుల్లో ప్రత్యేక వసతులు కల్పించడం వంటి చర్యల కారణంగా గర్భిణులు ప్రభుత్వాసుపత్రులను ఆశ్రయిస్తున్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల అస్సాంలో జరిగిన జాతీయ వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రశంస లభించింది. లేబర్ రూంల ఏర్పాటు వల్ల ప్రసవాలు ముఖ్యంగా సాధారణ ప్రసవాలు పెరిగినట్లు గుర్తించారు. అస్సాంలో జరిగిన సమావేశంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ప్రత్యేక ప్రజంటేషన్ ఇచ్చారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పడకలపై గర్భిణులను పక్కపక్కనే పడుకోబెట్టేవారు. ప్రత్యేక గదులు లేకుండానే ప్రసవాలు చేస్తుండేవారు. దీనివల్ల గర్భిణులు అసౌకర్యానికి గురయ్యేవారు. దీంతో సాధారణ ప్రసవాలు జరిగేవి కావు. ఇప్పుడు ఆ పద్ధతి మార్చి ప్రత్యేకంగా లేబర్ రూంలను ఏర్పాటు చేసినట్లు శ్రీనివాసరావు ఆ నివేదికలో వెల్లడించారు. లేబర్ రూంలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. గర్భిణీ సహాయకులకు ప్రత్యేక వసతి, అప్పుడే పుట్టిన పిల్లల కోసం వసతి, టాయిలెట్లు తదితర సౌకర్యాలు కల్పించారు. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు చేయించుకునేందుకు మహిళలు ముందుకు వచ్చారని ఆయన వివరించారు. తెలంగాణలో అమలు చేస్తున్నట్లుగానే లేబర్ రూంలను దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలిసింది. 31% నుంచి 54 శాతానికి చేరిన ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 31 శాతమే ఉండేవి. గతేడాది జూన్‌లో 40.87 ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 54.10 శాతానికి చేరుకోవడం గమనార్హం. గతేడాది జూన్‌లో ప్రభుత్వాసుపత్రుల్లో 21,797 ప్రసవాలు జరగ్గా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 28,847 ప్రసవాలు జరిగినట్లు నివేదిక తెలిపింది. ఈ కాలంలో మొత్తం 4.13 లక్షల ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని ఆసుపత్రులు కలిపి 492 ప్రసవ కేంద్రాలున్నాయి. వైద్య, విద్య సంచాలకుల పరిధిలోని బోధనాసుపత్రుల్లో 8, ఆరోగ్య కుటుంబ సంక్షేమ పరిధిలో 7, వైద్య విధాన పరిషత్ పరిధిలో 48, సామాజిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 48, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 347, ఏహెచ్ పరిధిలో 31 ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వీటిల్లో ప్రత్యేకంగా లేబర్ రూంలను ఏర్పాటు చేశారు. -
400 ఏళ్లుగా ఆ ఊరిలో..
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని రాజ్ఘడ్ జిల్లాలోని గ్రామంలో వింత ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. శంకా శ్యామ్‌జీ అనే గ్రామంలో 400 ఏళ్లుగా స్ర్తీలు ఎవరూ పిల్లల్ని ప్రసవించలేదు. గ్రామ సరిహద్దుల్లో నవజాత శిశువులను ప్రసవించరాదనే వింత ఆచారం ఏళ్ల తరబడి అమల్లో ఉంది. పిల్లల్ని కంటే దేవతలు ఆగ్రహిస్తారనే నమ్మకంతో గ్రామస్తులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. గ్రామంలో బిడ్డలకు జన్మనిస్తే బిడ్డతో పాటు తల్లికూడా మరణిస్తుందనే భయం వారిని వెంటాడుతోంది. 16వ శతాబ్దంలో దేవతలు గ్రామానికి ఈ రకంగా నిర్ధేశించారని గ్రామ పెద్దలు చెబుతున్నారు. అప్పటినుంచి గ్రామంలో నిండు గర్భిణులను గ్రామ సరిహద్దు వెలుపలికి తీసుకువెళ్లి ప్రసవించేలా చేస్తున్నారు. దీనికోసం గ్రామ సరిహద్దుల అవతల ప్రత్యేకంగా ఓ గదిని నిర్మించారు. గ్రామంలో దేవాలయాన్ని నిర్మించేందుకు దేవతలు ప్రయత్నించగా ఓ మహిళ అడ్డుకుందని అప్పటినుంచి గ్రామానికి ఇది శాపంగా పరిణమించిందని గ్రామ సర్పంచ్ నరేంద్ర గుర్జార్ చెప్పుకొచ్చారు. గ్రామంలో 90 శాతం డెలివరీలు ఆస్పత్రుల్లోనే జరుగుతాయని, అత్యవసర పరిస్థితుల్లో గ్రామ సరిహద్దుల వెలుపల ప్రసవించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఆయన చెబుతున్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు చేయించాలి
మోర్తాడ్(బాల్కొండ) : ప్రభుత్వ ఆస్పత్రిలోనే నూటికి 95 శాతం ప్రసవాలు చేయించుకునేలా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకట్ సూచించారు. మోర్తాడ్‌లోని కమ్యూనిటీ ఆస్పత్రిలో మంగళవారం భీమ్‌గల్, కమ్మర్పల్లి, చౌట్పల్లి, వేల్పూర్ పీహెచ్‌సీల పరిధిలోని వైద్యు లు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గర్భిణులకు పౌష్టికాహారం అందించడంతో పాటు ప్రసవం అనంతరం కేసీఆర్ కిట్టును ఉచితంగా అందిస్తుందని తెలిపారు. గర్భిణులకు ఎన్నో విధాలుగా ప్రయోజనాలను కల్పిస్తున్నందున ప్రసవాలు ఎక్కువగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగేలా చొరవ తీసుకోవాలని సూచించారు. సాధారణ ప్రసవాలతో పాటు సిజేరియన్ ప్రసవా లు కూడా జరుగుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా బాలింతలు ఆరుగురికి కేసీఆర్ కిట్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమ్యూనిటీ వైద్యాధికారి శివశంకర్, వైద్యులు శ్రీకాంత్, లక్ష్మి, జ్యోతి, డీపీఎంవో వనాకర్ రెడ్డి, పీహెచ్ఎన్ మీరాబాయి, ఎస్వోవో శ్రీనివాస్, యూడీసీ సురేందర్, సీహెచ్‌వో దేవన్న, ఇతర సిబ్బంది ఆడెపు ప్రభా కర్, హరిత, సత్యనారాయణ, గోవర్ధన్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆశ చూపినా లేని స్పందన
తల్లాడ పీహెచ్సీలో ప్రతి నెలా నలుగురికి తగ్గకుండా ప్రసవాలు జరగాల్సి ఉంది. బర్త్ ప్లానింగ్ ద్వారా మోటివేషన్ చేయాల్సి ఉండగా అలా జరగటం లేదు. ఎనిమిది నెలల్లో ఏడు ప్రసవాలు మాత్రమే జరిగాయి. అందులో ఒకటి డెత్ కావటంతో వివాదాస్పదం అయ్యింది. ఎనిమిది నెలల్లో మొత్తం 32 మంది ప్రసవాలు జరగాల్సి ఉండగా ఏడుగురు మాత్రమే ఆస్పత్రికి వచ్చారు. ఒక్కో నెలలో అసలు ఆస్పత్రిలో ప్రసవాలు లేకుండా పోయాయి. వైద్య సిబ్బంది ప్రచార లోపం కారణంగా ప్రసవాలు చేయడంలో తల్లాడ పీహెచ్సీ లక్ష్యాన్ని చేరుకోలేక పోతోందనే విమర్శలు విన్పిస్తుయింన్నాయి. దీంతో గర్భిణులు ప్రతి నెలా ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ సలహాల మేరకు పరీక్షలు చేయించుకున్నారు. నెలలు నిండి నొప్పులు వచ్చినప్పటికీ.. వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికే వెళ్తున్నారు తప్పా ప్రభుత్వ ఆస్పత్రులకు రావడం లేదు. అప్పులు చేసి మరీ అక్కడే వైద్యం చేయిస్తున్నారు. ఏఎన్ఎంల కొరత.. మండలంలో పది సబ్ సెంటర్లుండగా.. ఏడు సబ్‌సెంటర్లకు మాత్రమే ఏఎన్ఎంలు ఉన్నారు. కుర్నవల్లి, మిట్టపల్లి, మల్లవరం సబ్ సెంటర్లకు అసిస్టెంట్ ఏఎన్ఎంలే ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఏఎన్ఎంలు ఉన్నా మండల కేంద్రం, జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు. ప్రభావం చూపని కేసీఆర్ కిట్.. తల్లీ బిడ్డల క్షేమం కోసం ప్రభుత్వం 2017 జూన్ 2న ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం అంతగా ప్రభావం చూపలేదు. గ్రామాల్లో ఈ పథకం గురించి ప్రచారం చేయాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపైనే ఉంది. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ శిశువు జన్మిస్తే రూ.12 వేలు తల్లి అకౌంట్లో నాలుగు విడతులుగా జమ చేస్తారు. డెలీవరీ సమయంలో రూ.2 వేలు విలువైన కేసీఆర్ కిట్ అందజేస్తారు. అయినప్పటికీ పేదలు కూడా ఆస్పత్రి రావడం లేదు. ఇప్పటి వరకు తల్లాడ సీహెచ్‌సీలో ఆరుగురు మాత్రమే కేసీఆర్ కిట్ అందుకున్నారు. తల్లాడ : ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాల్సి ఉంది. తల్లీ బిడ్డల క్షేమం కోసం ప్రభుత్వం.. సంక్షేమ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ప్రభుత్వం నుంచి వారికి కిట్‌ను కూడా అందజేస్తున్నారు. అయినప్పటికీ ప్రయోజనం కన్పించడం లేదు. పథకం ఉద్ధేశం మంచిదే అయినా.. దానిని అమలు చేయడానికి ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు అంతగా లేవు. దీంతో వైద్య సిబ్బంది తమ విధులను నిర్వర్తించడంలో విఫలం చెందుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరగాల్సిన ప్రసవాలు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్నాయి. పేద కుటుంబాలకు చెందిన వారు అప్పులు చేసి వేలాది రూపాయలను ప్రైవేట్ ఆస్పత్రుల పరం చేస్తున్నారు. ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో అధికారులు, పాలకులే ఒక్కసారి ఆలోచించాలి. తల్లాడ పీహెచ్సీలో ప్రసవానికి ఎవరూ ముందుకు రావడం లేదు. గర్భిణులు ప్రతి నెలా ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ సలహాల మేరకు పరీక్షలు చేయించుకుంటున్నారు. నెలలు నిండినా.. నొప్పులు వచ్చినా.. వెంటనే అదే డాక్టర్ వద్దకు వెళ్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల అవసరం ఉన్నా, లేకున్నా సిజేరియన్ చేయించుకొని డబ్బులు ముట్టజేబుతున్నారు సంఖ్యను పెంచుతాం.. సీహెచ్‌సీలోనే ప్రసవాలు జరిగేందుకు ప్రచారం నిర్వహిస్తున్నాం. కేసీఆర్ కిట్టుపై అవగాహన కల్పిస్తున్నాం. అవసరమైన బెడ్లు, థియేటర్ ఇక్కడున్నాయి. ఇక నుంచి ఖచ్చితంగా అన్ని కాన్పులు ఇక్కడే జరుగుతాయి. సిజేరియన్ చేసే పరిస్థితి ఇక్కడలేక పోవంటంతో.. కొంత వెనుకాడుతున్నాం. గర్భిణుల అవసరాన్ని బట్టి ఖమ్మం ఆస్పత్రికి, కల్లూరు ఆస్పత్రికి తరలిస్తున్నాం. – ఐ.సృజన, మండల వైద్యాధికారి -
ఉల్టా.. పల్టా
నల్లగొండ టౌన్ : కేసీఆర్ కిట్ దెబ్బకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య ఉల్టా, పల్టా అయ్యింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్‌ను అమలు చేయడంతోపాటు ఆడపిల్లపుడితే రూ.13 వేలు, మగపిల్లాడు పుడితే రూ.12 వేలు అమ్మఒడి పథకం కింద తల్లులకు అందజేస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రులలో మౌలిక సదుపాయాల కల్పన పెంచడం, ప్రభుత్వ వైద్యులు, సిబ్బందిలో సేవాదృక్పథం పెరిగి బాధ్యతాయుతంగా సేవలను అందిస్తుండడంతో సర్కారు దవాఖానాల్లో కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలతో పాటు ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్ర ఆస్పత్రిలో కాన్పుల కోసం చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. మే నెల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏరియా ఆస్పత్రులలో ఇప్పటివరకు మొత్తం 7,103 కాన్పులు జరగగా, ఒక్క జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోనే సగానికి ఎక్కువ 4,139 కాన్పులు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదల నుంచి ఉద్యోగులు, ఆర్థికంగా బలంగా ఉన్నవారు సైతం కాన్పుల కోసం ప్రభుత్వ ఆస్పత్రులవైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో జిల్లాలోన్ని ప్రైవేటు ఆస్పత్రులలో చేరుతున్న వారి సంఖ్య పడిపోతోంది. గర్భం దాల్చిన దగ్గర నుంచి అన్ని రకాల పరీక్షలు, నెలనెలా వైద్యచికిత్సను ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా చేస్తున్నారు. కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టడానికి ముందు మే నెలలో ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పుల సంఖ్య 44శాతం ఉండగా, ప్రైవేటు ఆస్పత్రులలో 56శాతంగా ఉంది. అదే విధంగా కేసీఆర్ కిట్ అమలు తరువాత డిసెంబర్ నాటికి ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పుల సంఖ్య 56 శాతంకాగా, ప్రైవేటు ఆస్పత్రులలో 44శాతానికి పడిపోవడం గమనార్హం. కిటకిటలాడుతున్న ఎంసీహెచ్ జిల్లా కేంద్రంలో రూ.20 కోట్ల వ్యయంతో జాతీయ ఆరోగ్యమిషన్ ని ర్మించిన 150 పడకల మాతాశిశు ఆ రోగ్య కేంద్రం (ఎంసీహెచ్) గర్భిణులు, బాలింతలు, చిన్నారులతో కిటకిట లాడుతోంది. ఇన్‌పేషంట్లు నిత్యం 200 నుంచి 300 మంది నమోదవుతోంది. గర్భిణులు వైద్యపరీక్షలకు, కాన్పుల కో సం రోజూ 50 నుంచి 70 వరకు చేరుతున్నారు. ఎంసీహెచ్‌లో ఇన్‌పేషంట్లు రోజూ 200 వరకు ఉంటున్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రులలో కాన్పులు జరిగితే కేసీఆర్ కిట్‌తోపాటు అమ్మ ఒడి ద్వారా ఆడపిల్లపుడితే రూ.13 వేలు, మగపిల్లాడు పుడితే రూ.12 వేలు తల్లి ఖాతాలో వేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజలకు నమ్మకం పెరిగింది. ఆస్పత్రులలో కాన్పుల సంఖ్య నెలనెల పెరగడం శుభసూచకం, ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది ఎంతో బాధ్యతాయుతంగా సేవలు అందిస్తున్నారు. –డాక్టర్ కె.భానుప్రసాద్‌నాయక్, డీఎంహెచ్ఓ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగిన కాన్పులు ఇలా.. నెల ప్రభుత్వ శాతం ప్రైవేటులో శాతం మే 781 44 975 56 జూన్ 720 40 1100 60 జూలై 842 49 883 51 ఆగస్టు 925 49 960 51 సెప్టెంబర్ 929 48 1004 52 అక్టోబర్ 997 49 1048 51 నవంబర్ 942 49 980 51 డిసెంబర్ 967 56 770 44 -
డెలి‘వర్రీ’
►‘బర్త్‌ప్లాన్’ లేక తప్పని ప్రసవ వేదన ►క్షేత్రస్థాయి నుంచి పర్యవేక్షణ శూన్యం ►పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ ►సర్వజనాస్పత్రిలోనూ ఆగని గర్భిణుల ఘోష ►తాజాగా ఆస్పత్రి ఆవరణలోనే ప్రసవం ►మూడ్రోజుల క్రితం బాలింత మృత్యువాత ⇒26,284 : 2016–17లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన ప్రసవాలు ⇒4,440 : ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన సిజేరియన్లు ⇒63 : గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవమైన 42 రోజుల్లోపు మృతి చెందిన వారి సంఖ్య ⇒830 : ప్రసవం తర్వాత ఏడాదిలోపు మృత్యువాత పడిన శిశువులు ⇒1159 : కడుపులోనే మృతి చెందిన శిశువులు పెద్దవడుగూరుకు చెందిన ఈమె పేరు అమీన్. ఈనెల 17వ తేదీన ప్రసవం కోసం అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వచ్చింది. కనీసం బెడ్ కూడా ఇవ్వలేదు. దీంతో రెండ్రోజుల నుంచి ఆరు బయటే ఉంటోంది. శనివారం అర్ధరాత్రి దాటాక నొప్పులొచ్చాయి. లేబర్ రూంకు తీసుకెళ్దామనుకునేలోపే ఆదివారం తెల్లవారుజామున ఆరుబయటే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత వార్డులోకి తీసుకెళ్లి తల్లీబిడ్డకు వైద్యం అందించారు. పెద్దాస్పత్రిలో గర్భిణులకు ఎలాంటి వైద్యం అందుతోందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. విడపనకల్లు మండలం గడేకల్లుకు చెందిన రాజేశ్వరి ఈనెల 12న రెండో కాన్పుకోసం సర్వజనాస్పత్రికి వచ్చింది. అదే రోజు సిజేరియన్ చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. మరుసటి రోజు నుంచి కడుపు ఉబ్బరంగా ఉండడంతో పాటు రక్తస్రావం ఆగకపోవడంతో మళ్లీ ఆపరేషన్ చేశారు. చివరకు మూడ్రోజుల క్రితం ఆమె మృత్యువాతపడింది. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందన్న వాదనలున్నా వాస్తవానికి ఈమె గర్భం దాల్చినప్పటి నుంచి ‘బర్త్‌ప్లాన్’ సరిగా లేదు. వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం గాల్లో కలిసింది. అనంతపురం మెడికల్ : మాతాశిశు సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తీసుకొస్తున్నా వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంతో మృత్యుఘంటికలు మోగుతూనే ఉన్నాయి. గర్భం దాల్చినప్పటి నుంచి ‘బర్త్‌ప్లాన్’ సరిగా లేకపోవడం, ఎప్పటికప్పుడు సిబ్బంది పర్యవేక్షించకపోవడంతో ఈ దుస్థితి నెలకొంటోంది. మరోవైపు జిల్లాకే పెద్దదిక్కుగా ఉన్న సర్వజనాస్పత్రిలో గర్భిణులు ప్రసవ వేదన అనుభవిస్తున్నారు. సరిపడా పడకలు లేవన్న కారణంతో అక్కడి సిబ్బంది నిండు గర్భిణులను కూడా నిర్ధాక్షిణ్యంగా బయటకు గెంటేస్తున్నారు. ఫలితంగా ప్రసవాలు ప్రమాదభరితంగా మారుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువు నిబంధనల ప్రకారం ఓ మహిళ గర్భం దాల్చిన ఏడవ నెల నుంచి తప్పనిసరిగా ఏఎన్ఎంలు గర్భిణి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు ఆరా తీసి వాటిని ఎంసీపీ (మదర్ చైల్డ్ ప్రొటెక్షన్) కార్డులో నమోదు చేయాలి. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. హై రిస్క్ (రక్తహీనత) ఉన్నట్లు తేలితే క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. 108 వాహనానికి ముందే సమాచారం ఇచ్చి ఉండాలి. ప్రసవానికి వారం ముందు ఈడీడీ (ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ) తెలుసుకుని ఐదు రోజుల ముందు ఆస్పత్రిలో అడ్మిషన్ చేసేలా చూడాలి. సాధారణంగా ప్రసవ సమయానికి 10 ఎంజీ కన్నా ఎక్కువగా హిమోగ్లోబిన్ ఉండాలి. 6 ఎంజీ లోపల ఉంటే తప్పనిసరిగా రక్తం ఎక్కించాలి. 8 నుంచి 10 ఎంజీ మధ్యలో ఉంటే ఐరన్ సిప్రోజ్ ఇంజెక్షన్లు (మూడు నుంచి నాలుగు) వేయించేలా చూడడంతో పాటు ఐరన్ ఫోలిక్ మాత్రలు ఉదయం, రాత్రి వేసుకునేలా చేయాలి. కానీ ఇవేవీ వైద్య ఆరోగ్యశాఖకు పట్టడం లేదు. జిల్లాలో ఒక బోధనాస్పత్రి, ఒక జిల్లా కేంద్ర ఆస్పత్రి, 80 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 15 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా ఆస్పత్రులు ఉండగా వీటిలో గర్భిణులకు సంతృప్తికర సేవలు అందడం లేదు. సబ్ సెంటర్లలో కూడా గర్భిణులపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఉన్నా నామమాత్రంగా సేవలు అందుతున్నాయి. అసలు ఏఎన్ఎంలు గ్రామాల్లో అందుబాటులో ఉండడం లేదు. పట్టణాలు, నగరాల్లో అయితే పరిస్థితి మరీ ఘోరం. నెలవారీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన సూచనలు అందించాల్సి ఉన్నా... క్షేత్రస్థాయిలో సక్రమంగా ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ క్రమంలో ప్రసవ సమయంలో గర్భిణులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఏటా మరణాలు పెరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలు చేయడం మినహా క్షేత్రస్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోతోంది. సర్వజనాస్పత్రిలో మరీ ఘోరం క్షేత్రస్థాయిలో పరిస్థితి ఒకలా ఉంటే ప్రసవం కోసం సర్వజనాస్పత్రికి వచ్చే వారు అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. సిజేరియన్లు చేయాల్సి వస్తే ప్రాణం మీద ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక్కడి ఈఓటీ (ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్)లో నిత్యం 10కి పైగా సిజేరియన్లు జరుగుతుంటాయి. వీటికి తోడు అపెండిక్స్, సర్జికల్ కేసులు, ఈఎన్టీ కేసులు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ రెండు ‘టేబుల్స్’ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇతర కేసులు ఎలా ఉన్నా గర్భిణులు మాత్రం నరకయాతన పడాల్సి వస్తోంది. నొప్పులతో ఆర్తనాదాలు చేయాల్సి వస్తోంది. మూడ్రోజుల క్రితం గుత్తికి చెందిన లావణ్యకు సిజేరియన్ అవసరం కావడంతో ఈఓటీ వద్దకు తెచ్చారు. ఆపరేషన్ టేబుల్స్ ఖాళీగా లేకపోవడంతో బయట ఓ గదిలో కూర్చోబెట్టి సెలైన్ బాటిల్ ఎక్కించి అలాగే వదిలేశారు. ఈ క్రమంలో నొప్పులు భరించలేక ఆమె నరకయాతన అనుభవించింది. ప్రధానంగా ఇక్కడి ఆంటినేటల్ వార్డులో గర్భిణులు అవస్థలు పడుతున్నా జిల్లా యంత్రాంగానికి పట్టడం లేదు. వైద్యుల తీరూ తీసికట్టుగా ఉంటోంది. -
ప్రభుత్వాసుపత్రుల్లోనే 50% ప్రసవాలు జరగాలి
► అధికారులకు వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశం ► 3న సీఎం చేతుల మీదుగా కేసీఆర్ కిట్ల పథకం ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో ప్రస్తుతం 30–40 శాతంగా ఉన్న ప్రసవాలను 50 శాతానికి పెంచాలని అధికారులను వైద్యారోగ్య మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. మేడ్చల్ జిల్లా కేంద్రంలో వెంటనే మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. వైద్యారోగ్య శాఖ చేపడుతున్న కార్యక్రమాలు, కేసీఆర్ కిట్ల పథకం సన్నాహాలపై శుక్రవారం సచివాల యంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ కిట్ల పథకాన్ని వచ్చే నెల 3న హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ఆస్పత్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ప్రసవాలు జరిపే అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. కేసీఆర్ కిట్ల పథకం కింద గర్భిణుల నమోదు మొదలైందని, ఇప్పటివరకు 2 లక్షల మందికిపైగా పేర్లు నమోదు చేసుకున్నారని, ఈ ప్రక్రియ నిరంతరం జరగాలని చెప్పారు. గర్భిణులకు మూడు విడతల్లో రూ.12 వేల ప్రోత్సా హకం అందిస్తామని, ప్రసవం తర్వాత రూ.2 వేల విలువైన 16 రకాల వస్తువులు గల కేసీఆర్ కిట్లను పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఏడాదికి 6.28 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయని, అన్ని ప్రసూతి కేంద్రాల్లో వైద్య బృందాలను పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించామన్నారు. వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నమాట నిజమేనని, నియామకాలు పూర్తయ్యేలోగా అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బందిని క్రమబద్ధీకరించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు రఘునందన్‌రావు, ఎంవీ రెడ్డి, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ వేణుగోపాల్, ఆరోగ్య పథకం సీఈఓ పద్మ పాల్గొన్నారు. -
సిరిసిల్ల ఆస్పత్రిలో రికార్డు ప్రసవాలు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో ఒక్క నెలలోనే 190 ప్రసవాలు జరిగాయి. ఇప్పటి వరకు 160 ప్రసవాలు అత్యధిక రికార్డుగా ఉండగా.. గత ఏప్రిల్‌లో అత్యధికంగా 190 ప్రసవాలు చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ తిరుపతి తెలిపారు. ఇందులో 48 సాధారణ ప్రసవాలు కాగా, 142 శస్త్ర చికిత్సలు చేసినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రికార్డుస్థాయిలో ప్రసవాలు చేసిన డాక్టర్ల బృందాన్ని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ సోమవారం అభినందించారు. స్త్రీవైద్య నిపుణురాలు రమ్య, డాక్టర్ పి.తిరుపతి, హెడ్నర్స్ తేజ, నర్స్ ఝాన్సీలను కలెక్టరేట్‌కు పిలిచి శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జేసీ షేక్ యాస్మిన్‌బాషా, డీఆర్వో శ్యామ్‌ప్రసాద్‌లాల్, డీఎంఅండ్ హెచ్‌వో రమేశ్ పాల్గొన్నారు. -
కాన్పులు లేవు!
ప్రభుత్వ ఆస్పత్రుల్లో దారుణం బాగా తగ్గిన ప్రసవాల సంఖ్య పర్యవేక్షణ లేక ప్రజల దూరం ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు జిల్లాల పునర్విభజన అనంతరం వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోకి వచ్చిన 11 పీహెచ్‌సీల్లో గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 153 ప్రసవాలు జరిగాయి. జిల్లాలు ఏర్పాటయ్యాక అదే పీహెచ్‌సీల్లో గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు అంటే మూడు నెలల కాలంలో కేవలం 62 ప్రసవాలే జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వరంగల్ : పేదలు, గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యల పెంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడమే కాకుండా అవసరమైన నిధులు విడుదల చేస్తోంది. ప్రభుత్వ వైద్య సేవలను మెరుగుపరిచేందుకు అవసరమైన వసతులను కల్పిస్తోంది. అంతేకాకుండా జిల్లాల పునర్విభజన తర్వాత క్షేత్రస్థాయిలో వైద్య సేవలపై పర్యవేక్షణ పెరగాలని జిల్లాల అధికారులను ఆదేశిస్తోంది. ఇంత చేస్తున్నా వరంగల్ అర్బన్ జిల్లాలో మాత్రం ప్రభుత్వ ఆకాంక్షలు, ఆదేశాలకు విరుద్ధంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్య బాగా తగ్గడమే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. చర్యలు లేవు.. ప్రభుత్వ ఆస్పత్రులపై పర్యవేక్షణ పెంచి వైద్యసేవల పరంగా భరోసా కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. దీంతో ప్రసవాల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవల పరంగా భరోసా కల్పించే పరిస్థితి లేకపోవడంతో పేదలు సైతం ప్రైవేట్ ఆస్పత్రులకే వెళ్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య రంగంపై వేల కోట్లు ఖర్చుపెడుతున్నా పేదలకు ఆసరాగా నిలిచే పరిస్థితి లేకుండా పోతోంది. అప్పట్లో 69,.. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 69 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండేవి. వైశాల్యం పరంగా పెద్దగా ఉండడంతో వైద్యసేవల పర్యవేక్షణ కొంత ఇబ్బంది కలిగించేది. జిల్లాల పునర్విభజన ప్రక్రియలో వరంగల్ జిల్లాను ఐదు జిల్లాలుగా విభజించగా ఉమ్మడి జిల్లాకు వైద్యాధికారిగా వ్యవహరించిన అధికారి వరంగల్ అర్బన్ జిల్లా బాధ్యతలు చేపట్టారు. వరంగల్ నగరంలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు ఉండడంతో.. అర్బన్ జిల్లాలోని 12 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(యూహెచ్‌సీ)ల్లో ప్రసవాలు జరగవు. ఇక జిల్లాలో ఏడు గ్రామీణ మండలాలు ఉండగా వీటిలో 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు) ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఈ పీహెచ్‌సీలు వైద్య సేవలు అందించాలి. ముఖ్యంగా ఈ కేంద్రాల్లో ప్రసవాలు జరిగేలా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటోంది. జిల్లాలోని గ్రామీణ పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. వరంగల్ అర్బన్ జిల్లా ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు (2016 నవంబర్ – 2017 జనవరి) జిల్లావ్యాప్తంగా పీహెచ్‌సీల్లో కేవలం 62 ప్రసవాలే జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాలో పీహెచ్‌సీల ప్రసవాల సంఖ్యతో పోలిస్తే బాగా తగ్గడం ప్రభుత్వ వైద్య సేవల పరిస్థితిని స్పష్టం చేస్తోంది. కొత్త జిల్లాల ఆవిర్భావంతో జిల్లా పరిధి, విస్తీర్ణం తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో పీహెచ్‌సీలపై పర్యవేక్షణ పెరగాల్సి ఉండగా అది మాత్రమే జరగడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆపరేషన్లే మార్గమా?
పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల పెంపునకు సౌకర్యాలు అధికారుల తీరుతోనే బిల్లుల ఆలస్యం కేజీబీవీల్లో అవాంఛనీయ ఘటనలకుపోలీసు, రెవెన్యూ ఉద్యోగులదే బాధ్యత సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం శ్రీహరి హన్మకొండ : సాధారణ ప్రసవాలు చేసేందుకు అత్యధిక అవకాశాలు ఉన్నప్పటికీ వైద్యులు ఇష్టం వచ్చినట్లు సిజేరియన్లు చేస్తుండడం దారుణమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశా రు. గర్భిణులు ప్రసవం కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే సిజేరియన్ చేసి రూ.20వేల నుంచి రూ.30వేల బిల్లులు తీసుకోవడమే కాకుండా గర్భసంచి తొలగిస్తుండడం ఆందోళనకు గురిచేస్తోందన్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లోనే సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రభుత్వ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని శ్రీహరి సూచించారు. వరంగల్ రూరల్ జిల్లా సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన హన్మకొండలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయా విభాగాల అధికారులతో కడియం సుదీర్ఘంగా సమీక్షించారు. పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుతుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ మేరకు పాఠశాలల్లో ఫర్నీచర్, నీరు, మరుగుదొడ్లు తదితర మౌళిక సౌకర్యాల కల్పనకు అవసరమైనన్ని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఇక కేజీబీవీలు, ఇతర బాలికల పాఠశాలల్లో అవాంఛనీయ ఘటనలు జరిగితే స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులదే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన బిల్లులు, వలంటీర్ల వేతనాలకు సంబంధించి ట్రెజరీ నియంత్రణ లేనందున ఎప్పటికప్పుడు చెల్లింపులు పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా పెండింగ్‌లో ఉంటే అధికారుల లోపమేనని శ్రీహరి స్పష్టంంంం చేశారు. కాపీ లేకుండా ఉత్తీర్ణత పెంచాలి పదో తరగతి పరీక్షల సందర్భంగా చూచి రాతలు జరగకుండా చూస్తూనే గతంలో ఉన్న ఉత్తీర్ణత శాతం రికార్డులను నిలబెట్టాలని విద్యాశాఖ అధికారులకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సూచించారు. పాఠశాలల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలకు సంబంధించి వివరాలు సమర్పిస్తే కొత్తవి మంజూరు చేస్తామన్నారు. పాఠశాలల గోడలపై విద్యార్థులకు స్ఫూర్తి కలిగించే సూక్తులు రాయాలే తప్ప ఇతర ఎలాంటి రాతలున్నా సహించేది లేదన్నారు. కేజీ టూ పీజీలో భాగంగా ఆంగ్ల మాధ్యమం పాఠశాలల పెంపు, అంగన్వాడీలను పాఠశాలల్లోనే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు సూచించగా, ఇది విధాన నిర్ణయం కనక ప్రభుత్వంతో మాట్లాడతానని కడియం తెలిపారు. కాగా, ఆసరా పింఛన్లు మొదటివారంలోనే ఇచ్చేలా చూడాలని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద ఇచ్చే చెక్కులను పెళ్లికి రెండురోజుల ముందే ఇవ్వాలని సూచించిన కడియం.. చలివాగు ప్రాజెక్టు వద్ద మిషన్ భగీరథ పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసి మార్చి 31లోగా ట్రయల్ రన్ చేయాలని ఆదేశించారు. ఇంకా యాసంగికి సంబంధించి ఇరిగేషన్ శాఖ తైబందీ ఖరారు చేయాలని కడియం సూచించారు. బయోమెట్రిక్ తప్పనిసరి.. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని తెలుస్తున్నందున బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా అమలుచేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ అధికారులను ఆదేశించారు. తద్వారా పాఠశాలల్లో బోధన మెరుగుపడుతుందన్నారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ కేజీబీవీలు, బాలికల వసతిగృహాల విద్యార్థులను తల్లిదండ్రులు వస్తేనే పంపించాలని సూచించారు. బయోమెట్రిక్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, అరూరి రమేష్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జాయింట్ కలెక్టర్ హరిత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సౌకర్యాల మాటేమిటో...
పీహెచ్‌సీల్లో ప్రసవాలు జరుగుతున్నా వేధిస్తున్న అసౌకర్యాలు కొన్ని కేంద్రాల్లో లక్ష్యం దిశగా సాగుతున్న ఉద్యోగులు మరికొన్ని చోట్ల ఇంకా ప్రారంభమే కాని ప్రసవాలు వసతులు కల్పిస్తే బాగుంటుందంటున్న ఉద్యోగులు హన్మకొండ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో 95 శాతం ప్రసవాలు జరుగుతుండగా.. ప్రజలకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. దీనిని అరికట్టేందుకు పీహెచ్‌సీల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు వరంగల్ రూరల్ జిల్లాలో అడుగులు పడుతున్నాయి. కొన్ని పీహెచ్‌సీల్లో ఎన్నో ఏళ్ల తర్వాత ప్రసవాలు ప్రారంభమైనా.. మరికొన్నింట్లో అసౌకర్యాలు, పరికరాల కొరత వేధిస్తోంది. అంతేకాకుండా ఉద్యోగులు, సిబ్బంది చొరవ చూపకపోవడం కూడా ప్రసవాలు జరగకపోవడానికి కారణంగా తెలుస్తోంది. 17 పీహెచ్‌సీలు.. వరంగల్ రూరల్ జిల్లాలో 17 పీహెచ్‌సీలు ఉండగా.. ఆరు పీహెచ్‌సీలు 24గంటలు సేవలందిస్తున్నాయి. వీటన్నింటిల్లో ప్రస్తుతం కనీసం నెలకు 50 ప్రసవాలు చేయాలని కలెక్టర్ లక్ష్యంగా నిర్దేశించారు. అయితే 17పీహెచ్‌సీలు, 146 సబ్ సెంటర్లకు సంబంధించి మండలాల పరిధిలోని సిబ్బంది మాత్రమే ప్రజల్లో అవగాహన కల్పిస్తుండడంతో ఆయా మండలాల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. పదహారేళ్లకు.. దుగ్గొండి మండలం కేశవాపురం పీహెచ్సీ ప్రారంభించాక పదహారేళ్లకు ఇటీవల ప్రసవం జరిగింది. ఇక తాజాగా శనివారం సంగెం పీహెచ్సీలో ఒకేరోజు మూడు ప్రసవాలు చేశారు. మరోవైపు కొన్ని పీహెచ్‌సీల్లో ఇప్పటివరకు ఒక్క ప్రసవం కూడా చేయలేదు. ఇందుకు కారణం సౌకర్యాల కొరత కారణం కాగా కొన్ని పీహెచ్‌సీల పరిధిలో సిబ్బంది ఆయా ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గత అక్టోబరు నుంచి డిసెంబరు వరకు 46 ప్రసవాలు.. ఈ నెలలో ఇప్పటివరకు ఏడు ప్రసవాలు జరిగాయి. సౌకర్యాల కొరత.. దుగ్గొండిలోని పీహెచ్సీలో 24గంటలు సేవలందిస్తుండగా భవనం మాత్రం శిథిలావస్థకు చేరింది. ఇక నెక్కొండలో మరో వైద్యుడి పోస్టు భర్తీ చేయాల్సి ఉంది. ఖానాపురం పీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు ఖాళీగా ఉంది. నల్లబెల్లి మండలం మేడపల్లి పీహెచ్సీ నుంచి రిఫరల్ కేసులు ఇతర పట్టణాలకు పంపాలంటే అంబులెన్స్ వచ్చేందుకు రవాణా సౌకర్యం సరిగా లేక సమస్యలు ఎదురవుతున్నాయి. బాంజీపేట పీహెచ్సీలో ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ నీటి సౌకర్యం లేదు. స్వీపర్, అటెండర్, వాచ్మెన్ లేరు. పర్వతగిరి పీహెచ్సీలో ఉన్న గైనకాలజిస్ట్‌ను డిప్యూటేషన్‌పై రాయపర్తి పంపించారు. దీంతో ఇక్కడ ప్రసవాలు చేయడం సమస్యగా మారింది. అలాగే, ల్యాబ్ మూతపడడంతో పరీక్షలు చేయడం ఎలాగో అర్థం సిబ్బంది అయోమయం చెందుతున్నారు. అయితే, పర్వతగిరి పీహెచ్సీలో ప్రసవం పర్వతగిరి : పర్వతగిరి పీహెచ్సీలో ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రసవం జరిగింది. మండల కేంద్రానికి చెందిన పసుల స్వప్నకు ఆదివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రాగా.. పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. దీంతో ఉదయం 5.45 గంటలకు ఆమె ప్రసవించగా ఆడ శిశువు జన్మించింది. ఈ సందర్భంగా డాక్టర్ ప్రశాంతి, సిబ్బంది హేమలత, రజిత పాల్గొనగా.. స్వప్న భర్త సుమన్‌కు రూ.700 చెక్కు అందజేశారు. -
ఒకే రోజు మూడు ప్రసవాలు
రూరల్ జిల్లాలో రికార్డు సృష్టించిన సంగెం పీహెచ్సీ జన్మించిన వారిలో ముగ్గురూ మగ శిశువులే! సంగెం : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో శనివారం ఒకే రోజు ముగ్గురు గర్భిణులకు వైద్యులు ప్రసవాలు చేశారు. గతంలో ఎన్నడూ లేని వి ధంగా ఒకేరోజు మూడు ప్రసవాలు జరగడం జిల్లాలో రికార్డు కాగా, వైద్యాధికారులు, సిబ్బందిని పలువురు అభినందించారు. గర్భిణులైన గాంధీనగర్ గ్రామానికి చెందిన చిర్రబోయిన రాధిక, గవిచర్ల గ్రామానికి చెందిన కెనసాలపు మమత శుక్రవారం సాయంత్రం పీహెచ్సీలో చేరారు. వీరిలో మమత రాత్రి 12.05కు, రాత్రి 2.15 గంటలకు రాధిక మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇక తెల్లవారుజామున తీగరాజుపల్లికి చెందిన అజ్మీరా కవిత మొదటి కాన్పు కోసం రాగా ఉదయం 8.05కు మగ బిడ్డకు జన్మనిచ్చింది. వైద్యాధికారి డాక్టర్ శంకేసి శిరీష్‌కుమార్, స్టాఫ్ నర్సులు సునిత, అనిల్ చికిత్స చేయగా.. వైద్యాధికారి డాక్టర్ సుధీర్‌బాబు అభినందించారు. ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సంగెం పీహెచ్సీలో 37 ప్రసవాలు జరిగాయని వైద్యాధికారులు తెలిపారు. -
నెలకు వంద కాన్పులు చేయాలి
ప్రభుత్వాస్పత్రి సిబ్బందికి డీఎంహెచ్ఓ కొండల్రావు ఆదేశం ఏజెన్సీలో గతేడాది కంటే గణనీయంగా తగ్గిన డెంగీ కేసులు ఆగస్టు 7 నుంచి 17వ తేదీ వరకు ఏజెన్సీలో వైద్య శిబిరాలు కల్లూరు ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన జిల్లా వైద్యాధికారి కల్లూరు : ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచేలా సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్ఓ ఎ.కొండల్రావు ఆదేశించారు. కల్లూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో బుధవారం మొక్కలు నాటారు. ప్రభుత్వాస్పుత్రుల్లో నెలకు కనీసం వంద కాన్పులైనా జరగాలన్నారు. ఈ విషయంలో ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు విష జ్వరాల కేసులు 415 నమోదయ్యాయన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది తగ్గాయని తెలిపారు. గతేడాది 439 డెంగీ కేసులు నమోదవగా ఈ ఏడాది 15 మాత్రమే నమోదైనట్లు తెలిపారు. వచ్చేనెల 7 నుంచి 17వ తేదీ వరకు గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఏజెన్సీలోని 1,932 హ్యాబిటేషన్లు ఉండగా 638 హ్యాబిటేషన్లలో వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటిలో ఐఆర్ఎస్ మందును స్ప్రే చేశామన్నారు. త్వరలో రెండో విడత కూడా పిచికారీ చేస్తామన్నారు. ఒక్కో విడతకు రూ.45 లక్షల వరకు ఖర్చు వస్తుందన్నారు. దోమలు, క్రిమికీటకాలు, కలుషిత నీటి వల్ల మలేరియా, టైఫాయిడ్, డెండీ, చికున్‌గున్యా, కామెర్లు, డయేరియా వంటì వ్యాధులు వ్యాప్తి చెందుతాయన్నారు. దోమలు పుట్టకుండా, కుట్టకుండా అన్ని శాఖలు సమన్వయంగా నివారణ చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓ కోరారు. మందులు, సిబ్బంది కొరత లేదు ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, సిబ్బంది కొరత లేదన్నారు. 32 వైద్యలు పోస్టులు మాత్రం ఖాళీగా ఉన్నాయని, వాటిని త్వరలో భర్తీ చేస్తామన్నారు. కల్లూరు ప్రభుత్వాస్పత్రిని సీమాన్ సెంటర్‌గా మారుస్తామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో 104 వాహనాలు 23 రోడ్డెక్కాయన్నారు. విధి నిర్వహణలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఆపరేషన్ థియేటర్‌ను ప్రారంభించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. – హరితహారంలో భాగంగా కల్లూరు ప్రభుత్వాస్పత్రిలో డీఎంహెచ్ఓ మొక్కలు నాటారు. జిల్లాలో 60 పీహెచ్‌సీలు, 15 క్లస్టర్లు, 509 సబ్సెంటర్లలో మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో డీఎంఓ రాంబాబు, ఎస్పీహెచ్ఓ ఎల్. భాస్కర్, ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారిణి పద్మజ, డాక్టర్లు మాధవి, శరత్‌బాబు పాల్గొన్నారు. -
మళ్లీ నిరాశపర్చిన ఫ్రీడమ్ 251
న్యూఢిల్లీ: 251కే స్మార్ట్‌ఫోన్ అంటూ.. ఫోన్ లవర్స్ ను ఊరించిన ఫ్రీడం ఫోన్ల పంపిణీ మరోసారి వాయిదా పడింది. అనేక వివాదాల నేపథ్యంలో ఈ స్మార్ట ఫోన్ ఇప్పటివరకు వినియోగదారుల చేతికి రాలేదు. జూన్ 30నుంచి పంపిణీకి సర్వం సిద్ధమని చెప్పుకొంటూ వచ్చిన రింగింగ్ బెల్స్ మరోసారి నిరాశ పర్చింది. ఫోన్ల డెలివరీ ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడింది. తాజాగా మరోసారి వాయిదా వేసి జులై 7నుంచి ఫోన్లు డెలివరీ చేయనున్నట్లు రింగింగ్‌బెల్స్ ప్రకటించింది. బ్యాటరీ సమస్యల వల్ల డెలివరీ ఆలస్యమైందని రింగింగ్‌బెల్స్ సీఈవో, వ్యవస్థాపకుడు మోహిత్ గోయల్ వివరణ ఇచ్చారు. జులై 7 నుంచి డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. జులై 7న ఢిల్లీలో ఒక కార్యక్రమం ఏర్పాటుచేసి.. డెలివరీని ప్రారంభిస్తామని గోయల్ తెలిపారు. అంతేగాక.. అమ్మకాలు ప్రారంభించే ముందుగా ప్రధాని నరేంద్రమోదీని కలిసి తమ ఫోన్లకు మద్దతివ్వాల్సిందిగా కోరనున్నట్లు మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగా తమకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరనున్నామని... ప్రధానితో సమావేశం విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖను పంపామని గోయల్ తెలిపారు. రిజిస్ట్రేషన్లు ఎక్కువగా రావడంతో లక్కీ డ్రా పద్ధతి ద్వారా కొనుగోలు దారులను ఎంపికచేయనున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో జూన్ 30 నుంచి జులై 5 వరకు లక్కీ డ్రా నిర్వహించి.. ఫ్రీడం ఫోన్లను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచే.. అత్యధికంగా 2కోట్ల రిజిస్ట్రేషన్లు రాగా.. ఆ రాష్ట్రానికి 10వేల ఫోన్లను కేటాయించినట్లు తెలిపారు. కాగా ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్ అందిస్తామని నోయిడాకు చెందిన రింగింగ్‌బెల్స్ సంస్థ ప్రకటించింది. విషయం తెలిసిందే. ఫ్రీడమ్ 251 పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్లపై అప్పట్లో పెద్ద దుమారాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. -
కాన్పు చేయరు.. కోయడమే!
♦ ఏటా 4.5 లక్షల మందికి సిజేరియన్ల ద్వారానే ప్రసవాలు ♦ ప్రవేటులో 90%, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 60% సిజేరియన్లే ♦ ఈ తరహా కాన్పులతో తల్లీ బిడ్డల ఆరోగ్యంపై ప్రభావం ♦ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటికి చెక్ పెట్టేందుకు సర్కారు యోచన సాక్షి, హైదరాబాద్: ఈరోజుల్లో సాధారణ ప్రసవాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. గర్భిణుల కడుపుపై కత్తి పెట్టనిదే బిడ్డను బయటకు తీయడానికి ఎక్కువ మంది వైద్యులు సిద్ధపడటంలేదు. సాధారణ ప్రసవానికి అవకాశమున్నా సిజేరియన్ వైపే మొగ్గుచూపుతున్నారు. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులైతే ప్రసవాలను భారీ వ్యాపారంగా మలుచుకుంటున్నాయి. మరోవైపు ప్రసవం సులువుగా కాకుండా ప్రమాదమైతే ఎలా అన్న భయాందోళనలతో కొన్ని కుటుంబాలు సిజేరియన్‌కు మొగ్గుచూపుతున్నాయి. వారి బలహీనతలను కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. మరీ విచిత్రమేంటంటే ప్రసవాలకూ ముహూర్తాలు పెట్టి ఆ ప్రకారం సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీస్తున్న పరిస్థితి కూడా ఇటీవల కనిపిస్తోంది. ఏటా ఆరు లక్షలపైనే ప్రసవాలు వైద్య ఆరోగ్యశాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో ఏటా ఆరు లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. అందులో ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమాన సంఖ్యలో జరుగుతున్నాయి. మూడు దశాబ్దాలుగా సాధారణ ప్రసవాలు తగ్గి సిజేరియన్ సంస్కృతి పెరిగింది. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో 90 శాతం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 60 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారానే జరుగుతున్నాయి. మొత్తమ్మీద ఏటా 4.5 లక్షల ప్రసవాలు సిజేరియన్ ద్వారానే సంభవిస్తున్నాయి. సాధారణ ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్‌కు రూ. 25 వేల నుంచి 40 వేలు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనైతే రూ. లక్ష నుంచి 2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ ప్రసవాలు చేయాలంటే అనువైన వాతావరణం ఉండాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో అటువంటి వాతావరణం, వసతులున్నా కూడా చాలా కేసుల్లో సిజేరియన్ వైపు వెళ్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం అటువంటి వాతావరణం ఉండట్లేదు. ఒకే వార్డులో పది మంది గర్భిణీలను పడుకోబెట్టి ప్రసవం చేస్తున్నారు. దీనివల్ల సాధారణ ప్రసవం ఏమాత్రం సాధ్యంకాదని వైద్యులు చెబుతున్నారు. ఒక గదిలో అత్యంత ప్రశాంత వాతావరణంలో తల్లిని, వైద్యుడిని, నర్సును అవసరాన్ని బట్టి భర్తను గర్భిణీ పక్కన ఉంచి కాన్పు చేయాలి. అలా చేస్తే చాలావరకు సాధారణ ప్రసవాలు జరుగుతాయని నిమ్స్ వైద్యుడు తాడూరి గంగాధర్ చెప్పారు. గర్భిణీ పరిస్థితి సాధారణ ప్రసవానికి సహకరించే పరిస్థితి లేనప్పుడు మాత్రమే సిజేరియన్‌కు వెళ్లాలన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రులూ అందుకోసం సమాయత్తం కావాలని కోరతామని తెలిపారు. సిజేరియన్తో దుష్ఫలితాలు సిజేరియన్తో తల్లీ బిడ్డల ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. సాధ్యమైనంత వరకు సిజేరియన్‌కు వెళ్లకుండా సాధారణ ప్రసవం జరిగేలా చూడాలని అమెరికా ప్రసూతి సంఘం స్పష్టంచేసింది. సిజేరియన్ వల్ల అనేక ప్రమాదాలున్నాయని చెప్పింది. సిజేరియన్ అవసరమా? లేదా? అన్న విషయాన్ని వైద్యులు కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలంది. దీని ప్రకారం సిజేరియన్ వల్ల కలిగే దుష్ఫలితాలు ఇవీ... ►తల్లి కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ►రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంది. ► కడుపులో కొన్నిచోట్ల గాయాలు సంభవిస్తాయి. అవి భవిష్యత్తులో ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపుతాయి. ► తల్లి సాధారణ స్థితికి రావడానికి వారాలు, నెలలు కూడా పడుతుంది. ఆరు నెలల వరకు అంతర్గతంగా నొప్పులూ ఉంటాయి. ► ప్రసూతి మరణాల్లో సిజేరియన్ ద్వారా జరిగే కాన్పుల్లోనే ఎక్కువ. ► సిజేరియన్ చేశాక మందుల వాడకం పెరుగుతుంది. ఇదీ శరీరంపై ప్రభావం చూపుతుంది. ► అలాగే బిడ్డ బరువు తక్కువగా ఉంటుంది. శ్వాస సమస్యలూ ఉత్పన్నమవుతాయి. -
కడుపు పండితే వేదన.. కన్ను తెరిస్తే యాతన
కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చతికిలపడింది. మాతా, శిశు మరణాల శాతం తగ్గించడంలో పూర్తిగా విఫలమైంది. ఎమ్మిగనూరు మండలంలో 11 నెలల్లో కాన్పు సమయంలో వంద మంది శిశువులు మృతి చెందగా.. 2013-14 సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 25వేల కాన్పులు ఇళ్ల వద్ద జరగ్గా, కర్నూలు జిల్లాలోనే 11,599 నమోదవడం ఆ శాఖ పనితీరుకు అద్దం పడుతోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మధ్య సమన్వయం లోపించడం కూడా మాతా శిశు మరణాల సంఖ్య రాష్ట్రంలోనే జిల్లాను రికార్డు స్థానంలో నిలుపుతోంది. కర్నూలు డివిజన్లో 31, నంద్యాల డివిజన్లో 27, ఆదోని డివిజన్లో 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా.. తగినంత సిబ్బంది పని చేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ప్రచార, ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయినప్పటికీ మాతా శిశు మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం విమర్శలకు తావిస్తోంది. ఏమి జరుగుతోంది.. జిల్లాలో పని చేస్తున్న వైద్య సిబ్బంది ఆసుపత్రిలోనే కాన్పు జరిగేలా విస్తృత ప్రచారం కల్పించాల్సి ఉంది. ఇంటి వద్ద కాన్పుల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రభుత్వాసుపత్రిలో కాన్పు చేయించుకుంటే కలిగే లాభాలు, పారితోషికం వివరాలను తెలియజెప్పాలి. ఆయా పీహెచ్‌సీల పరిధిలో గర్భిణిలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. అయితే గ్రామీణ స్థాయిలో వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు, సిబ్బంది జిల్లా కేంద్రానికే పరిమితం అవుతున్నారు. కౌతాళం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, హొళగుంద హెల్త్ సూపర్వైజర్, పెద్దతుంబళం హెల్త్ ఆఫీసర్, అర్దగేరి హెల్త్ అసిస్టెంట్.. ఇలా అనేక మంది జిల్లా కేంద్రంలో పని చేస్తున్నారు. అదేవిధంగా డిప్యూటేషన్లకు అర్హత లేని కాంట్రాక్టు వైద్య సిబ్బంది జిల్లా పరిసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బదిలీ చేయించుకున్నారు. ప్రశ్నించే వారు లేకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా గాడితప్పింది. జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించాల్సిన ‘డెమో’ విభాగం ఉన్నా లేనట్లుగా మారింది. ఆదోని డివిజన్‌లోనే అధికం జిల్లాలోని ఆదోని డివిజన్లో మాతా శిశు మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఆదోని డివిజన్ పరిధిలో(రూరల్) నెలలోపు శిశువులు 112 మంది, ఐదు సంవత్సరాల్లోపు పిల్లలు 24 మంది, గర్భిణిలు ముగ్గురు చొప్పున చనిపోయారు. జిల్లాలోని అన్ని మండలాలతో పోలిస్తే శిశు మరణాల శాతం 26.88, సంవత్సరంలోపు పిల్లలు 1.03, మాతృ మరణాలు 72.01 శాతం చొప్పున ఇక్కడే నమోదయ్యాయి. ఆదోని అర్బన్ ప్రాంతంలో నెలలోపు శిశువులు 105 మంది, ఐదేళ్లలోపు పిల్లలు 6 మంది, ఒక గర్భిణి మరణించారు. ఇక్కడ శిశు మరణాల శాతం అత్యధికంగా 42.97 శాతం, మాతృ మరణాల శాతం 40.93గా ఉంది. మండలం మృతి చెందిన మరణించిన నెలలోపు గర్భిణిలు శిశువులు ఆత్మకూరు 36 04 ఆళ్లగడ్డ 26 01 కోడుమూరు 53 03 ఎమ్మిగనూరు 100 04 ఆలూరు 25 02 కర్నూలు రూరల్ 60 02 కర్నూలు అర్బన్ 42 05 కోయిలకుంట్ల 37 04 -
ఇంటి వద్ద ప్రసవం చేస్తే రూ.8వేలు
వేమనపల్లి : ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, మాతాశిశు మరణాలు అరికట్టాలని ఉన్నతాధికారులు వైద్యాధికారులకు లక్ష్యం విధిస్తున్నారు. కానీ కొందరు ఏఎన్ఎంలు ఆ లక్ష్యానికి గండికొడుతూ ఇంటి వద్ద ప్రసవాలను ప్రోత్సహిస్తున్నారు. ఇంటి వద్ద ప్రసవం చేస్తూ రూ.8వేలు వసూలు చేస్తున్నారు. ఈ విషయం సాక్షాత్తు వేమనపల్లి పబ్లిక్ హెల్త్ అధికారి సత్యనారాయణ పరిశీలనలో వెల్లడైంది. మండలంలో ఐదు హెల్త్సబ్సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో పనిచేస్తున్న కొందరు ఏఎన్ఎంలు రెండేళ్లుగా ఇంటివద్ద ప్రసవాలు చేస్తున్నారు. ఆస్పత్రిలో కాన్పు చేయించుకుంటే ప్రభుత్వమే రూ.వెయ్యి జననీ సురక్ష యోజన కింద బాలింతకు ప్రోత్సాహకం అందజేస్తుంది. ఆస్పత్రికి రావడానికి రూ.500 రవాణా చార్జీలూ చెల్లిస్తుంది. ప్రసవం తర్వాత బాలింతకు రొట్టె, పాలు ఇతర ఖర్చులకు గాను మూడు రోజులపాటు రోజుకు రూ.54చొప్పున అందజేస్తుంది. ఇవన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో చేస్తోంది. కానీ ఇవేవీ తెలియని పల్లె ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఇంటి వద్ద కాన్పులను ప్రోత్సహిస్తున్నారు. సబ్‌సెంటర్ పరిధిలోని ఏఎన్ఎంలు గర్భిణులు, బాలింతల వివరాలు ప్రతీ నెలా ఏఎంసీ రిజిష్టర్‌లో నమోదు చేస్తుంటారు. దీంతో ఏ గ్రామంలోనైనా గర్భిణి ప్రసవ సమయం పొందుపరుస్తుంటారు. ఆయా గ్రామాల్లో ఎవరైనా పురిటినొప్పులతో బాధపడుతుంటే ఏఎన్ఎంలకు ఫోన్ చేస్తుంటారు. దీంతో ఏఎన్ఎంలు ఇంటికి వెళ్లి ప్రసవాలు చేస్తున్నారు. ఒక్కో ప్రసవానికి రూ.8వేల నుంచి రూ.12వేల వరకు వసూలు చేస్తున్నారు. ఎవరికైనా చెబితే ఆస్పత్రి నుంచి ఎలాంటి సహాయం అందదు అంటూ బెదిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో బాలింతలు జననీ సురక్ష యోజన ఆర్థిక సహాయానికి నోచుకోవడం లేదు. ఇంటి వద్ద ప్రసవంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. మరోవైపు ప్రభు త్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య తగ్గుతోంది. వేమనపల్లి పీహెచ్సీ పరిధిలో డిసెంబర్లో 33 కాన్పులు జరిగాయి. ఇందులో మూడు కాన్పులు మాత్రమే పీహెచ్సీలో జరగా.. 9 ప్రైవేట్ ఆస్పత్రుల్లో, మిగితావి ఇంటి వద్దే అయినట్లు తెలిసిన వైద్యాధికారులు ఆరా తీశారు. ఏఎన్ఎంలే స్వయంగా కాన్పులు చేసి డబ్బులు తీసుకున్నట్లు పరిశీలనలో తేలింది. -
ఇక్కడ ఆపరేషన్లు చేయలేం..
ములుగు ప్రభుత్వాస్పత్రి వైద్యుల నిస్సహాయత సౌకర్యాలున్నా జీఎంహెచ్, ఎంజీఎం ఆస్పత్రులకు రెఫర్ డీజీఓ స్థాయి వైద్యురాలు ఉన్నా అందని వైద్యం 108లో జరుగుతున్న ప్రసవాలు ములుగు : గర్భిణీలకు మెరుగైన సేవలందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం జరిగేలా చూడాలని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఇస్తున్న ఆదేశాలు బుట్టదాఖలవుతున్నారుు. ప్రసవంలో చిన్నపాటి ఇబ్బంది ఉన్నా మనకు రిస్క్ ఎందుకులే.. అనే భావనతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ప్రసవాల కేసులను ఎంజీఎం, జీఎంహెచ్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. డీజీఓ స్థాయి వైద్యాధికారిణి అందుబాటులో ఉన్నా గర్భిణీలకు సరైన వైద్యం, భరోసా అందడం లేదు. నవంబర్, డిసెంబర్లో ఆస్పత్రి పరిధిలోని ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల నుంచి సుమారు 50 మంది గర్భిణీలను 108లో జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ కేసులు కేవలం 108 రికార్డుల్లో నమోదైనవి మాత్రమే. సొంత వాహనాల్లో తరలించినవారి సంఖ్య మరో 20 నుంచి 30 వరకు ఉండొచ్చు. డాక్టర్లున్నా.. ఆపరేషన్లు సున్నా.. నాలుగు నెలల క్రితం సామాజిక ఆస్పత్రిలో గైనకాలజిస్టు లేకపోవడంతో గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంత్రి చొరవతో ప్రస్తుతం డీజీఓను నియమించారు. అంతేగాక ఆస్పత్రిలో గర్భిణీలకు తప్ప ని పరిస్థితుల్లో ఆపరేషన్ నిర్వహించేందుకు ఆనస్థిషియూ డాక్టర్ కూడా అందుబాటులో ఉన్నారు. అరుునా ప్రసవం చేయడానికి డాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. గర్భిణీలను ప్రసవం కోసం వెయిటింగ్లో ఉంచుతున్న వైద్యులు ఏ చిన్న ఇబ్బంది అనిపించినా జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. ఇక్కడ సీరియస్.. అక్కడ సిజేరియన్ లేకుండానే ప్రసవం.. అరుుతే ఇక్కడి వైద్యులు రిస్క్ కేసులుగా పరిగణించి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులకు రెఫర్ చేస్తుంటే తీరా అక్కడికి వెళ్లాక అక్కడ సాధారణ ప్రసవాలు జరుగుతుండడం విశేషం. ప్రసవంలో చిన్నపాటి ఇబ్బందులను హైరిస్క్‌గా పరిగణించి బాధిత కుటుంబ సభ్యులను భయాందోళనలకు గురిచేస్తున్నారనే ఆరోపణలున్నారుు. గత మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు గర్భిణీలు 108లోనే ప్రసవించారు. గురువారం ఉదయం మండంలోని జంగాలపల్లికి చెందిన ములకలపల్లి రమ్య(23) పురిటి నొప్పులతో ములుగు ఆస్పతికి వచ్చింది. ఆమెను పరిశీలించిన వైద్యులు రిస్క్ కేసని చెప్పారు. దీంతో ఆమెను మధ్యాహ్నం 108లో వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ఆత్మకూరు శివారులో ప్రసవించింది. అలాగే జంగాలపల్లికి చెందిన ఎండీ షాజహాన్సుల్తానా(27) శుక్రవారం సాయంత్రం నొప్పులతో ఆస్పత్రికి చేరుకుంది. ఆమెను పరీక్షించిన వైద్యులు హన్మకొండలో ని జీఎంహెచ్‌కు రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు 108లో హన్మకొండకు తరలిస్తుండగా పందికుంట స్టేజీ సమీపంలో అంబులెన్స్‌లోనే అర్ధరాత్రి ప్రసవించింది. దీంతో ఆమెను తిరిగి ములుగు ఆస్పత్రికి తరలించారు. ఈ రెండు కేసుల్లో పైలట్ రాజేష్, సిబ్బంది బాలాజీ అందించిన వైద్యాన్ని కూడా వైద్యులు అందించలేకపోవడం గమనార్హం. సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ వైద్యులు.. ములుగు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల తీరుతో ప్రజలు వైద్యం కోసం మండల కేంద్రంలో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఖర్చరుునా ఫరవా లేదని, ఇబ్బందులు లేకుండా ప్రసవం జరిగితే అంతేచాలని గర్భిణీల కుటుంబ సభ్యులు అంటున్నారు. ఎండీ బదరోద్దీన్, షాజామాన్ సుల్తానా సోదరుడు, ములుగు మా అక్కకు పురిటి నొప్పులు రావడంతో గురువారం సాయంత్రం 7 గంటలకు ఆస్పత్రికి తీసుకెళ్లాం. వైద్యులు చెకప్ చేసి వెయిటింగ్లో ఉంచారు. రాత్రి 12 గంటల సమయంలో బిడ్డ గర్భంలో ల్యాట్రిన్ పోయిందని చెప్పారు. దీంతో హుటాహుటిన 108లో జీఎంహెచ్‌కు తరలించాం. పందికుంట దగ్గర నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది బాలాజీ, రాజేష్ సుఖప్రసవం జరిగేలా చేశారు. ప్రసవం ఇబ్బందని చెప్పడంతో కుటుంబ సభ్యులమంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాం. ఆస్పత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా ఉన్నారు. -
ప్రసవ వేదన
సాక్షి, ఒంగోలు: ప్రజారోగ్యం కోసం కోట్లు ఖర్చు చేస్తున్నా..పేదవాడికి వైద్యం అందని ద్రాక్షగానే ఉంటోంది. జనాభా ప్రాతిపదికన ప్రతీ 10 వేల మందికి ఒక వైద్యుడు అందుబాటులో ఉండాలి. కానీ జిల్లాలో ప్రతీ 15 వేల మందికి ఒకరు లేకపోవడం గమనార్హం. వైద్యారోగ్యశాఖకు కేంద్రప్రభుత్వం జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ ద్వారా నిధులు విడుదల చేస్తోంది. జిల్లాకు ఏటా రూ.20 కోట్లు అందుతున్నాయి. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం కోసం పంచాయతీకి రూ.10 వేలు చొప్పున 880 గ్రామాలకు రూ.88 లక్షలు ఖర్చుచేస్తున్నారు. ఎలాంటి ఫలితాలు ఉండటం లేదు. గ్రామాల్లో అపరిశుభ్రత, అంటువ్యాధులు, అనారోగ్య సమస్యలు, సీజనల్ వ్యాధులు ఏటా ప్రబలుతూనే ఉన్నాయి. జననీ సురక్ష యోజన (జేఎస్వై), జననీ శిశుసంరక్ష కార్యక్రమం (జేఎస్ఎస్కే) కింద గర్భిణులకు కాన్పుల కోసం ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపిస్తున్నా.. ఇవి రికార్డులకే పరిమితమవుతున్నాయి. ఇక జిల్లాలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఆస్పత్రులు 37 ఉన్నాయి. వీటిపై ఏటా రూ.కోటి వరకు ఖర్చుచేస్తున్నా.. వీటిల్లో కాన్పులు చేసుకునే వారి సంఖ్య ఏటా తగ్గిపోతూనే ఉంది. గణాంకాలు చెబుతున్నదేమిటంటే.. జిల్లా జనాభా 33,92,764 మంది. ఇందులో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికంటే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం మంది ప్రజలుంటున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 85 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 550 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. 85 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 280 మంది వైద్యులకు గాను ప్రస్తుతం 200 మందే ఉన్నారు. 804 గ్రామాల్లో వైద్యసేవలు అందుబాటులో లేవు. ఇక్కడ ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలే దిక్కు. ఉత్సవ విగ్రహాలే.. జిల్లాలో 37 కేంద్రాల్లో గర్భిణులకు ఆపరేషన్లు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవి 24 గంటలు సేవలందించాలి. ఇక్కడి కేంద్రాల్లో ఆపరేషన్లు జరగకపోయినా ఏటా కోట్లల్లో ఖర్చులు చూపిస్తున్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) కింద ఈ ఏడాది రూ.30 కోట్లు రాగా, అధికారులు ఖర్చుచేసింది రూ.25 కోట్లు. వీటి ఖర్చుకు సంబంధించి పీహెచ్‌సీల నుంచి నివేదికలు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ మత్తువైద్యులు అందుబాటులో లేకపోవడం, సిబ్బంది కొరతతో ఆపరేషన్లు జరగడం లేదు. పరికరాలూ అందుబాటులో లేవు. తగ్గని మాతాశిశు మరణాలు మాతాశిశు మరణాలను పూర్తిస్థాయిలో తగ్గిం చేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వైద్యఆరోగ్యశాఖ నుంచి ప్రయత్నిస్తున్నాయి. 24 గంటల సీమాంక్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే, ప్రతీ గ్రామపరిధిలో అంగన్వాడీ ఆశవర్కర్తో పాటు ఏఎన్ఎంను నియమించారు. వీరు గ్రామీ ణ ప్రాంతాల్లో తిరిగి గర్భిణుల వివరాలను నమోదుచేసి.. వారికి కాన్పుచేసి ఇంటికి వెళ్లేంత వరకు బాధ్యత తీసుకోవాలి. దీనికోసం ఎన్ఆర్హెచ్ఎం కింద జేఎస్ఎస్కే (జననీ శిశుసంక్షణ కార్యక్రమం), జేఎస్వై (జననీ సురక్షయోజన) పథకాల రూపంలో రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా రు. జిల్లాలో మాతాశిశు మరణాల రేటు మాత్రం తగ్గడం లేదు. 2013-14 సంవత్సరంలో మాతృమరణాలు 127, శిశుమరణాలు 39 సంభవించాయి. గడచిన తొమ్మిది నెలల కాలంలో రెండూ కలిపి సుమారు 200 పైగానే ఉంటాయని వైద్యవర్గాలు పేర్కొనడం గమనార్హం. ప్రైవేటు వైపు ఎందుకు...? ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకు రూ.7 వేల నుంచి రూ.10 వేలు తీసుకుంటుండగా, సిజేరియన్లకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు గుంజుతున్నారు. అయినా ఎక్కువగా ప్రసవాలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. దీనికితోడు ఆర్ఎంపీలు ఒక్క కేసును గ్రామం నుంచి పంపితే రోగి ఇచ్చే ఫీజులో 40 శాతం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లమని సూచిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇందుకు ఒక్కో కేసుకు కొంతమొత్తంలో ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో అనుమతుల్లేని ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేస్తున్నా.. వైద్యారోగ్యశాఖ పట్టీపట్టనట్లు వ్యవహరించడం దురదృష్టకరం. -
ప్రజా రోగ్యానికి ‘చేతి’మాత్ర
ఈ మరణాలు అంతర్జాతీయ సమాజం ముందు మన పరువు తీస్తాయి కాబట్టి వీటి రేటు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే దరిద్రరేఖ దిగువన ఉన్న మహిళలకు ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయించడం ద్వారా మరణాల రేటు తగ్గించాలని నిర్ణయించుకుంది. యువరాజావారు కొండను తవ్వి ఎలుకను పట్టగలిగారు! ఆరోగ్య - ఆవాస అవసరాలు తీరక జనం నానా యాతన పడుతున్నారని తెలుసుకోగలిగారు. ఆయన జరిపిన మహాధ్యయనం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపొందించింది. దాన్ని పవిత్ర పత్రంగా అభివర్ణించింది. జనజీవన భద్రతపై మాట్లాడే ప్రణాళికను పవిత్రమైనదంటే తప్పేమీ లేదు గానీ, కాంగ్రెస్ అధినేతలు ఇన్నేళ్లుగా ఈ రంగాల్లో చేసిందేమిటన్నది ఒక ముఖ్య ప్రశ్న. గ్రామాల్లో మెరుగైన వైద్యసేవలూ, మౌలిక సౌకర్యాలూ కల్పించేందుకు ఉద్దేశించిన జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ (ఎన్ఆర్హెచ్ఎం-2005) అమలులో ఆశించిన ఫలితాలు సాధించలేదన్నారు ప్రధాని మన్మోహన్. వైద్యఖర్చులు భరిం చలేక ఏటా 4 కోట్లమంది పేదరికం పాలపడుతున్నారని చెప్పారు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ. ఈ పరిస్థితిని చక్కదిద్దని కాంగ్రెస్ - ఇప్పుడు ప్రజారోగ్యానికి భరోసా ఇస్తానం టోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య రంగంలో యూపీఏ పనితీరును రేఖామాత్రంగా అవలోకిద్దాం. 2013 -14 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయించింది రూ. 37,330 కోట్లు. ఇందులో ఎన్హెచ్ఎం వాటా 21,239 కోట్లు. ఎన్ఆర్హెచ్ఎం - జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (ఎన్యూహెచ్ఎం)లను కలిపి జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఏర్పాటు చేశారు. అంతకు ముందు సంవ త్సరం బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.30,000 కోట్లు కేటా యించగా, అందులో ఎన్ఆర్హెచ్ఎం వాటా రూ. 20,822 కోట్లన్నారు. ఈ పథకంలో ఎన్‌యూహెచ్‌ఎంను విలీనం చేశాక అదనంగా కేటాయించింది 417 కోట్లే! ఇంత స్వల్ప కేటాయింపులతో పౌరులందరికీ ఆరోగ్యభద్రత కల్పించడం అసంభవం. 12వ ప్రణాళికలో రూ.3,00,000 కోట్లతో ఆరో గ్యసేవల్ని సార్వత్రీకరిస్తామన్న ప్రభుత్వం.. ఆ దిశగా కేటా యింపులు జరపలేదని పై లెక్కలు చెబుతున్నాయి. దీన్ని బట్టి మన విధాననిర్ణేతలు ప్రజారోగ్యాన్ని ప్రైవేటు రంగానికి అప్పగించబూనుకున్నారని భావించాల్సి వస్తోంది. ప్రైవేటు రంగం గ్రామీణ ప్రాంతాల్లో, ప్రత్యేకించి వెనుకబడిన - మారుమూల గ్రామాల్లో ప్రవేశించేందుకు సిద్ధపడదు. ప్రభు త్వరంగంలో తగిన పెట్టుబడులు పెట్టడం - ఆరోగ్య పథ కాల్ని నిజాయితీగా అమలు చేయడం ద్వారా మాత్రమే ప్రజ లు మెరుగైన ఆరోగ్యసేవలు పొందేందుకూ ఆర్థిక భారాల నుంచి బయటపడేందుకూ వీలవుతుంది. కానీ ఈ విష యంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రజారోగ్యానికి సంబంధించిన పలు లక్ష్యాలతో ప్రారం భమైన ఎన్ఆర్హెచ్ఎం మాతా శిశు మరణాలపైనే రవ్వంత దృష్టి సారించింది. 2005 నాటికి ప్రపంచవ్యాప్తంగా నమోద వుతున్న మాతృ మరణాల్లో 20శాతం పైగా భారతదేశంలో చోటు చేసుకున్నవే. ప్రసవానంతర నాలుగు వారాల్లో నమో దయ్యే మరణాల్లో 31 శాతం మన దేశానివే. ఈ మరణాలు అంతర్జాతీయ సమాజం ముందు మన పరువు తీస్తాయి కాబట్టి వీటి రేటు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. పైగా మాతా శిశు మరణాలు తగ్గించాలన్న సహస్రాబ్ధి అభివృద్ధి లక్ష్యాలకూ కట్టుబడింది. ఈ నేపథ్యంలో - దరిద్రరేఖ దిగు వన ఉన్న మహిళలకు ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయించడం ద్వారా మరణాల రేటు తగ్గించాలని నిర్ణయించుకుంది. ఇం దుకోసం 2005లో ‘జననీ సురక్షా యోజన’ పథకం ప్రారం భించింది. గర్భిణులకు రూ.1400 ఇవ్వడం ద్వారా వారిని ఆసుపత్రి ప్రసవాల వైపు మళ్లించబూనుకుంది. నగదు బది లీతో ముడివడిన అంశం కాబట్టి - ఈ అంశంలో కొద్ది ఫలి తాలు కనిపిస్తున్నాయి. 2005లో 50శాతంగా ఉన్న ఆసుపత్రి ప్రసవాలు 2012 నాటికి 70శాతానికి పెరిగాయి. అయితే, పేదరికం - పోషకాహారలోపం కారణంగా మాతా శిశు మర ణాలు నిర్దేశించుకున్న స్థాయిలో తగ్గడం లేదు. ప్రసవానం తర నాలుగు వారాల్లో సంభవించే శిశు మరణాలు పేద కుటుంబాల్లో అధికంగా ఉంటున్నాయి (వెయ్యికి 56). 2004-06 మధ్య 254 (ప్రతి లక్ష మందికి)గా ఉన్న మాతృ మరణాల రేటు 2012 నాటికి 178కి తగ్గింది. శిశు మరణాల రేటు 2011 నాటికి 44కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా పుట్టిన రోజునే చనిపోతున్న శిశువుల్లో 29 శాతం మంది మన దేశ శిశువులే. మెరుగైన ఆరోగ్య సేవలు లభిస్తే తొలిరోజు మర ణాల్లో సగానికి సగం తగ్గించవచ్చు. కానీ అనవసర ఆర్భా టం చేయడం తప్ప వీటిపై శ్రద్ధ పెట్టని మన పాలకులు - ఇప్పుడు సమ్మిళిత అభివృద్ధి తమ అజెండా అంటున్నారు. ఈ అజెండాకు కట్టుబడే ప్రభుత్వాలు ఏవైనా ముందు సామాజిక రంగాల్లో పెట్టుబడులు పెంచాలి. పరిశుభ్రమైన నీరూ, పోషకాహారమూ, పారిశుధ్యమూ, ఆరోగ్య - ఆవాస - విద్యా సౌకర్యాలతోనే ఆరోగ్యకర సమాజం నిర్మితమవుతుందని గుర్తించాలి. వి.ఉదయలక్ష్మి -
ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పులు జరగాలి
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు నూరు శాతం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సూచించారు. శుక్రవారం ప్రగతిభవన్ సమావేశ మందిరంలో స్త్రీ,శిశు సంక్షేమ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రుల్లోనే పురుడుపోసుకునేందుకు సంబంధిత కుటుంబ సభ్యుల ద్వారా పేషెంట్ పరిస్థితిని తెలుసుకొని, కాన్పు కోసం వారిని 108 వాహనాల్లో తరలించాలన్నారు. రెండో కాన్పునకు పేరు నమెదు చేసుకున్న మహిళల్లో మొదటి సారి సాధారణ కాన్పు జరిగిన వారి వివరాలను సేకరించాలన్నారు. తద్వారా రెండో కాన్పును కూడా సాధారణ కాన్పుగా జరగడానికి అవకాశం ఉన్నందున ఆ విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి వారికి అవసరమైన పౌష్టికాహారం, రోగ నిరోధక శక్తికి అవసరమైన చర్యలు తీసుకోవడం ద్వారా సాధారణ కాన్పుకు దోహదపడుతుందన్నారు. ఎప్పటికప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల బరువును సరిచూసి బలహీనంగా ఉన్న పిల్లలకు పౌష్టికాహారం సరైన పద్ధతిలో అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కవలపిల్లలు ఉన్నట్లుగా పరీక్షల్లో తెలిసిన పక్షంలో ఆ పిల్లలు ఆరోగ్యంగా జన్మించడానికి తీసుకోవలసిన చర్యలపై, పౌష్టికాహారంపై తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. న్యూమోనియా లాంటి వ్యాధుల ద్వారా పిల్లలు చనిపోకుండా వారిని గుర్తించి వెంటనే ఆస్పత్రుల్లో చికిత్సలు అందించాలని ఆయన ఆదేశించారు. న్యూట్రిషన్ రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, తద్వారా మరణాల రేటును తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు, కార్యకర్తలు తప్పనిసరిగా సాయంత్రం 4.30 గంటల వరకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కొత్తగా మంజూరైన 500 అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించి టెండర్లు పిలవాలని, అంగన్వాడీ కేంద్రాలలో విద్యుత్తు సరఫరాతో పాటు ఫ్యాన్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 210 అంగన్వాడీ కార్యకర్తలు ఇతర గ్రామాల నుంచి ప్రతిరోజు వచ్చి వెళ్తుతున్నారని, వారందరు ఈనెల 25వ తేదీ వరకు స్థానికంగా ఉండాలన్నారు. లేనిపక్షంలో వారిపై చర్యలు తీసుకోవడానికి వివరాలు అందించాలని ఆదేశించారు. సమావేశంలో పీడీ రాములు, సీడీపీఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.