ముంబై డబ్బావాలా.. తెల్లటి యూనిఫాంలో లంచ్‌బాక్సులను సైకిల్స్‌పై రైల్వే స్టేషన్లకు, రైల్వే స్టేషన్ల నుంచి ఆఫీసులకు అందజేస్తూ బిజీబిజీగా గడిపేవారు. సైకిళ్ల మోత, లంచ్ బాక్సుల చప్పుళ్లతో ఆ రోజులన్నీ కళకళలాడేవి. కోవిడ్ ముంబైని తాకింది. తెల్లగా మెరిసే వారి డబ్బాలు కార్పొరేట్ కార్యాలయాల నుంచి అదృశ్యమయ్యాయి. దుమ్ము పేరుకుపోయిన డబ్బాలు, తుప్పు పట్టిన సైకిళ్లు మిగిలిపోయాయి. వారి తెల్లటి యూనిఫాంలు, గాంధీ టోపీలు అల్మారాలో ముడుచుకున్నాయి. కరోనా ప్రభావం వివిధ వర్గాలతోపాటు వాణిజ్య, వ్యాపార సంస్థల కార్యాలయాలకు లంచ్ బాక్స్‌లు చేసే డబ్బావాలాలపైనా తీవ్రంగా చూపింది.
లాక్‌డౌన్‌కు ముందు ముంబైలో సుమారు 5000కుపైగా డబ్బావాలాలుండేవారు. వివిధ కారణాలవల్ల ఈ సంఖ్య రెండు వేలకు చేరింది. ప్రస్తుతం ముంబైలో కేవలం 1,500 డబ్బావాలాలున్నారు. ఈ సంఖ్య రోజురోజుకు తగ్గిపోవడం వారిని కలవర పెడుతోంది. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్‌లో ముంబైలో డబ్బావాలాలు కనుమరుగయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్‌తో.. ఒకప్పుడు మేనేజ్‌మెంట్ గురుగా ప్రపంచంలో గుర్తింపు పొందన ముంబై డబ్బావాలాల ఉనికి ప్రమాదంలో పడింది. కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్‌డౌన్ ప్రభావం డబ్బావాలాలపై తీవ్రంగా చూపింది. లాక్‌డౌన్ సమయంలో రవాణా సదుపాయంలేక వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేసే అనేక మంది ఉద్యోగులు ఇంటి నుంచి విధులు నిర్వహించారు.
అప్పుడు డబ్బావాలాల అవసరమే లేకపోయింది. వారికి అసలు ఉపాధి లేకుండా పోయింది. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మెరుగుపడ్డాయి. ట్యాక్సీలు, బస్సులు, లోకల్ రైళ్లు తదితరా రవాణ వ్యవస్థలు యథాస్థితికి వచ్చాయి. అయినప్పటికీ అనేక మంది ఉద్యోగులు ఇప్పటికీ వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. కొన్ని కార్యాలయాలు మూతపడ్డాయి. పని చేస్తున్న మరికొన్ని కార్యాలయాల్లో క్యాంటీన్లు ప్రా రంభించారు. కొందరు ఉద్యోగులు ఇంటి నుంచి లంచ్ బాక్స్‌లు వెంట తీసుకొస్తున్నారు. కొందరు ఉ ద్యోగులు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌చేసుకుంటున్నారు. దీంతో డబ్బావాలాల అవసరం లేకుండా పోయింది.
లక్ష నుంచి 50 వేలకు..
ఒకప్పుడు ప్రతీరోజు రెండు లక్షల లంచ్‌బాక్స్‌లు చేరవేసిన ఈ డబ్బావాలాలు ఇప్పుడు 40 నుంచి 50 వేల వరకు మాత్రమే అందజేస్తున్నారు. ఫలితంగా వారి ఆదాయానికి గండిపడింది. ఒకప్పుడు ఒక్కో డబ్బావాలా నెలకు రూ.20 నుంచి 25 వేలు సంపాదించేవాడు. లంచ్ బాక్స్‌ల సంఖ్య తగ్గడంతో ఇప్పుడు రూ.12 నుంచి 15 వేలు ఆదాయం రావడం కూడా గగనమైపోయింది. అరకొర ఆదాయంతో కుటుంబాన్ని పోషించడం కష్టతరంగా మారింది. ఫలితంగా ఈ మార్గాన్ని వదులుకుని మరో ఉద్యోగ వేటలో పడ్డారు. డబ్బావాలాల సంఖ్య తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణమైంది. దివాలో నివసించే 40 ఏళ్ల సచిన్ గావ్డే డబ్బావాలాగా జీవితాంతం పేరు తెచ్చుకున్నాడు. అతని ముత్తాతలు 1952 నుండి ముంబైలో డబ్బాలను పంపిణీ చేస్తున్నారు. అదే అతని గుర్తింపు, జీవనాధారం. వర్క్ ఫ్రమ్ హోమ్ తమ జీవితాలను పూర్తిగా తలకిందులు చేసిందని చెబుతున్నాడు.
క్లౌడ్ కిచెన్.. ఆన్‌లైన్ ఆర్డర్స్ అయితే..
దీన్ని ఎదుర్కోవడానికి డబ్బావాలాల నాల్గోతరం కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇటీవలే క్లౌడ్ కిచెన్‌ను మొదలుపెట్టారు. చాలామంది ఇంటి నుంచే పనిస్తుండటంతో లంచ్ బాక్స్‌లను డెలివరీ చేసే తమ సంప్రదాయ వ్యాపారం క్షీణించింది. ఈ నేపథ్యంలో మరింత మంది కస్టమర్లను చేరుకోవడానికి వంట చేయడం, హోమ్‌స్టైల్ మీల్స్ డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నారు. మొదట సాకినాకాలో సెంట్రల్ కిచెన్‌ను స్థాపించాలని ప్లాన్ చేశారు. ఒక స్థలం నుంచి నగరవ్యాప్తంగా భోజనాన్ని పంపిణీ చేయడం సవాలుగా మారుతుందని భావించి వికేంద్రీకృత విధానాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం ముంబయిలోని వివిధ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలతో డబ్బావాలాలు భాగస్వాములు అవుతున్నారు.
కొంతమంది మహిళలు కలిసి వండిన ఆహారాన్ని ఆయా ప్రాంతాల దగ్గర్లోని ఆర్డర్లకు సప్లై చేస్తున్నారు. దీనివల్ల మహిళలు జీవనోపాధి పొందడంతోపాటు డబ్బావాలాలకు ఉపాధి ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. ఆన్‌లైన్ ఆర్డర్లు తీసుకుంటున్నారు. ఆన్‌లైన్ మెనూని బ్రౌజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు. శాఖాహార, మాంసాహార భోజనం ఉంటుంది. ధర పరిమాణాన్ని బట్టి రూ. 95 నుంచి ప్రారంభమై రూ.120 వరకు ఉంటుంది. రోజువారీ లేదా నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకోవచ్చు. ముందు రోజు సాయంత్రంలోపు ఆర్డర్ చేస్తే లంచ్ మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల మధ్య డెలివరీ చేస్తున్నారు.
(చదవండి: వెదురుతో వండే కూర గురించి విన్నారా? దాని టేస్టే వేరు..!)
Comments
Please login to add a commentAdd a comment