కాన్పు చేయరు.. కోయడమే!
♦ ఏటా 4.5 లక్షల మందికి సిజేరియన్ల ద్వారానే ప్రసవాలు
♦ ప్రవేటులో 90%, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 60% సిజేరియన్లే
♦ ఈ తరహా కాన్పులతో తల్లీ బిడ్డల ఆరోగ్యంపై ప్రభావం
♦ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటికి చెక్ పెట్టేందుకు సర్కారు యోచన
సాక్షి, హైదరాబాద్: ఈరోజుల్లో సాధారణ ప్రసవాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. గర్భిణుల కడుపుపై కత్తి పెట్టనిదే బిడ్డను బయటకు తీయడానికి ఎక్కువ మంది వైద్యులు సిద్ధపడటంలేదు. సాధారణ ప్రసవానికి అవకాశమున్నా సిజేరియన్ వైపే మొగ్గుచూపుతున్నారు. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులైతే ప్రసవాలను భారీ వ్యాపారంగా మలుచుకుంటున్నాయి. మరోవైపు ప్రసవం సులువుగా కాకుండా ప్రమాదమైతే ఎలా అన్న భయాందోళనలతో కొన్ని కుటుంబాలు సిజేరియన్‌కు మొగ్గుచూపుతున్నాయి. వారి బలహీనతలను కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. మరీ విచిత్రమేంటంటే ప్రసవాలకూ ముహూర్తాలు పెట్టి ఆ ప్రకారం సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీస్తున్న పరిస్థితి కూడా ఇటీవల కనిపిస్తోంది.
ఏటా ఆరు లక్షలపైనే ప్రసవాలు
వైద్య ఆరోగ్యశాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో ఏటా ఆరు లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. అందులో ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమాన సంఖ్యలో జరుగుతున్నాయి. మూడు దశాబ్దాలుగా సాధారణ ప్రసవాలు తగ్గి సిజేరియన్ సంస్కృతి పెరిగింది. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో 90 శాతం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 60 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారానే జరుగుతున్నాయి. మొత్తమ్మీద ఏటా 4.5 లక్షల ప్రసవాలు సిజేరియన్ ద్వారానే సంభవిస్తున్నాయి. సాధారణ ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్‌కు రూ. 25 వేల నుంచి 40 వేలు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనైతే రూ. లక్ష నుంచి 2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.
సాధారణ ప్రసవాలు చేయాలంటే అనువైన వాతావరణం ఉండాలి. ప్రైవేటు ఆసుపత్రుల్లో అటువంటి వాతావరణం, వసతులున్నా కూడా చాలా కేసుల్లో సిజేరియన్ వైపు వెళ్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం అటువంటి వాతావరణం ఉండట్లేదు. ఒకే వార్డులో పది మంది గర్భిణీలను పడుకోబెట్టి ప్రసవం చేస్తున్నారు. దీనివల్ల సాధారణ ప్రసవం ఏమాత్రం సాధ్యంకాదని వైద్యులు చెబుతున్నారు. ఒక గదిలో అత్యంత ప్రశాంత వాతావరణంలో తల్లిని, వైద్యుడిని, నర్సును అవసరాన్ని బట్టి భర్తను గర్భిణీ
పక్కన ఉంచి కాన్పు చేయాలి. అలా చేస్తే చాలావరకు సాధారణ ప్రసవాలు జరుగుతాయని నిమ్స్ వైద్యుడు తాడూరి గంగాధర్ చెప్పారు. గర్భిణీ పరిస్థితి సాధారణ ప్రసవానికి సహకరించే పరిస్థితి లేనప్పుడు మాత్రమే సిజేరియన్‌కు వెళ్లాలన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రులూ అందుకోసం సమాయత్తం కావాలని కోరతామని తెలిపారు.
సిజేరియన్‌తో దుష్ఫలితాలు
సిజేరియన్‌తో తల్లీ బిడ్డల ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. సాధ్యమైనంత వరకు సిజేరియన్‌కు వెళ్లకుండా సాధారణ ప్రసవం జరిగేలా చూడాలని అమెరికా ప్రసూతి సంఘం స్పష్టంచేసింది. సిజేరియన్ వల్ల అనేక ప్రమాదాలున్నాయని చెప్పింది. సిజేరియన్ అవసరమా? లేదా? అన్న విషయాన్ని వైద్యులు కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలంది. దీని ప్రకారం సిజేరియన్ వల్ల కలిగే దుష్ఫలితాలు ఇవీ...
►తల్లి కడుపులో ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం
►రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంది.
► కడుపులో కొన్నిచోట్ల గాయాలు సంభవిస్తాయి. అవి భవిష్యత్తులో ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపుతాయి.
► తల్లి సాధారణ స్థితికి రావడానికి వారాలు, నెలలు కూడా పడుతుంది. ఆరు నెలల వరకు అంతర్గతంగా నొప్పులూ ఉంటాయి.
► ప్రసూతి మరణాల్లో సిజేరియన్ ద్వారా జరిగే కాన్పుల్లోనే ఎక్కువ.
► సిజేరియన్ చేశాక మందుల వాడకం పెరుగుతుంది. ఇదీ శరీరంపై ప్రభావం చూపుతుంది.
► అలాగే బిడ్డ బరువు తక్కువగా ఉంటుంది. శ్వాస సమస్యలూ ఉత్పన్నమవుతాయి.