సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాలను తగ్గించి.. సహజ ప్రసవాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే పలు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇదే క్రమంలో ‘సీ–సేఫ్’ అనే మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్‌లు 10 నుంచి 15 శాతానికి మించకూడదు. అయితే, రాష్ట్రంలో మొత్తం ప్రసవాల్లో 45 శాతం సిజేరియన్‌లు ఉంటున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతానికిపైగా, ప్రభుత్వాస్పత్రుల్లో 32 శాతం మేర ఈ తరహా కాన్పులు ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో కోత కాన్పుల నియంత్రణకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. కాగా, సీ–సేఫ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు.
నర్సులకు మిడ్‌వైఫరీ శిక్షణ పూర్తి
సహజ ప్రసవాలను పెంపొందించే చర్యల్లో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లోని నర్సులకు ‘నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్‌వైఫరీ (ఎన్‌పీఎం)’ కోర్సును గత ఏడాది ప్రారంభించారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున రెండు బ్యాచ్‌లుగా గుంటూరు, తిరుపతిలలో 18 నెలల శిక్షణ ఇచ్చారు.
గర్భధారణ జరిగినప్పటి నుంచి మహిళకు అవసరమైన వైద్య సహాయం, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నవజాత శిశువుకు అందించాల్సిన సేవలు, హైరిస్క్ లో ఉన్న గర్భిణులను ఏ విధంగా గుర్తించాలి వంటి పలు రకాల అంశాలపై నర్సులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం వీరికి నర్సింగ్ బోర్డ్‌లో పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి సరి్టఫికెట్లు జారీ చేస్తున్నారు. త్వరలో వీరిని రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా ప్రసవాలు జరిగే 10 ఆస్పత్రుల్లో నియమించనున్నారు.
అనవసర కోతల నియంత్రణ
యూకేకు చెందిన బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం, యునిసెఫ్, ఫెర్నాండెజ్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర వైద్య శాఖ సీ–సేఫ్‌ను నిర్వహించనుంది. ప్రభుత్వాస్పత్రుల్లో అనవసర కోత కాన్పులను సాధ్యమైనంత వరకూ నియంత్రించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో సిజేరియన్‌లను ఎలాంటి పరిస్థితుల్లో నిర్వహించాలి అనే దానిపై ప్రోటోకాల్స్‌ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మన ఆస్పత్రుల్లో అసిస్టెడ్ డెలివరీ ప్రక్రియలను అంతగా వినియోగించడం లేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో త్వరలో ఎంపిక చేసిన ఆరు ఆస్పత్రుల్లో గైనిక్ వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వ్యాక్యూమ్, ఇతర పరికరాలను ఉపయోగించి సాధారణ ప్రసవాల్ని చేసేలా అసిస్టెడ్ డెలివరీ ప్రక్రియలో నైపుణ్యాలు పెంచనున్నారు. సిజేరియన్ తప్పనిసరి అయిన పరిస్థితుల్లో సురక్షితంగా సర్జరీల నిర్వహణపై మరింత అవగాహన పెంచనున్నారు. రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, తెనాలి, అనకాపల్లి, ఆదోని ఆస్పత్రులను సీ–సేఫ్ కోసం ఎంపిక చేసినట్టు యునిసెఫ్ ప్రతినిధి డాక్టర్ నాగేంద్ర తెలిపారు. ప్రోటోకాల్స్ రూపకల్పన త్వరలో పూర్తి అవుతుందన్నారు.
మహిళల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట
మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మాతృ మరణాల కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఫలితంగా గతంతో పోలిస్తే మరణాలు తగ్గాయి. అదే విధంగా అనవసర సిజేరియన్ కాన్పుల నియంత్రణపై దృష్టి సారించాం. ఈ క్రమంలోనే సీ–సేఫ్‌కు ప్రణాళిక రచించాం. మరొక వైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్‌లను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నాం. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
Comments
Please login to add a commentAdd a comment