Special measures
-
మీ భద్రతకు మాది భరోసా
రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతోపాటు అతివలకు అన్ని వేళలా అండగా ఉంటామని మహిళా భద్రత విభాగం డీజీ శిఖాగోయల్ భరోసా ఇచ్చారు. సమస్య ఏదైనా డయల్ 100కు కాల్ చేస్తే నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వస్తారని హామీ ఇచ్చారు. రకరకాల వేధింపులు ఎదుర్కొంటున్న వారిలో కొందరు నేటికీ ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్న నేపథ్యంలో వారి సమస్యలను నేరుగా శిఖాగోయల్ దృష్టికి తీసుకెళ్లేందుకు ‘మీతో సాక్షి’ శీర్షికన ఆగస్టు 27 నుంచి 3 రోజులపాటు సాక్షి నిర్వహించిన ప్రత్యేక క్యాంపెయిన్‌కు అనూహ్య స్పందన వచ్చింది. మహిళలు పలు సమస్యలను ‘సాక్షి’ దృష్టికి తీసుకురాగా వాటికి శిఖాగోయల్ సమాధానాలిచ్చారు. పలువురు మహిళలు అడిగిన ప్రశ్నలు, వాటికి శిఖాగోయల్ ఇచ్చిన సమాధానాలు..ప్రశ్న: కోల్‌కతాలో ఓ జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం నేపథ్యంలో రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో మహిళా డాక్టర్ల భద్రతతోపాటు మహిళా రోగులు, వారి సహాయకుల భద్రతకు మీరు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? – (అనురాధరావు, బాలలహక్కుల సంఘం) జవాబు: ఆస్పత్రుల్లో భద్రతాపరమైన మౌలికవసతుల కల్ప నపై దృష్టి పెట్టాం. అన్ని ఆస్పత్రుల వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ పాయి ంట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా లేదా తెలుసుకొనేందుకు స్థానిక పోలీసుల ద్వారా సెక్యూరిటీ ఆడిట్లు నిర్వహిస్తున్నాం. ఆస్పత్రుల్లో ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రుల్లో భద్రత ప్రమాణాలు మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ నుంచి మాకు సమాచారం అందింది. ఆ నిబంధనలు రాగానే ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి వాటి అమలుకు చర్యలు తీసుకుంటాం.ఆస్పత్రుల వద్ద సెక్యూరిటీ సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చే లా యాజమాన్యాలతో సమన్వయం చేసుకుంటున్నాం. విమెన్ సేఫ్టీ వింగ్‌లో అత్యంత క్రియాశీలకంగా పనిచేసే సాహస్ మాడ్యూల్ ద్వారా పోష్ యాక్ట్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెస్సల్)పై ప్రచారం కలి్పస్తున్నాం. ఆస్పత్రుల్లో లైంగిక వేధింపులను కట్టడిచేసేందుకు ‘సాహస్’ మాడ్యూల్ ద్వారా చర్యలు తీసుకుంటాం.ప్రశ్న: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరి«ధిలో గతంలో ఆటోలు, క్యాబ్‌లకు ప్రత్యేక నంబర్ ఇచ్చి అది ఆ వాహనం వెనుక డిస్ప్లే అయ్యేలా చేశారు. ఈమధ్య అది కనిపించట్లేదు. ఆటోలు, క్యాబ్‌ల డ్రైవర్ల వివరాలు పోలీసుల దృష్టిలో ఉండేలా మహిళా భద్రత విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు? – (హిమజ, ఓ కార్పొరేట్ కంపెనీ ఎండీ హైదరాబాద్) జవాబు: రాష్ట్రంలోని అనేక జిల్లాలు, నగర యూనిట్లలో ‘మై ఆటో ఈజ్ సేఫ్’ ప్రచారం ఉంది. ఆటో డ్రైవర్ల వివరాలు పోలీసులు తనిఖీ చేసి ధ్రువీకరిస్తారు. ఆటోలలో పోలీసుల ఫోన్ నంబర్లు ఉండేలా చూస్తున్నాం. మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమం అంతటా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. మీరు మీ ప్రయాణ సమయంలో సురక్షితంగా ఉండేలా డయల్ 100కు కాల్ చేసి అందులో 8 నొక్కడం ద్వారా ‘టీ–సేఫ్’ను ఎంచుకుంటే మీ ప్రయాణం పూర్తయ్యే వరకు పోలీసు పర్యవేక్షణ ఉంటుంది. https://womensafetywing. telang ana. gov. in/ women& safety& apps/ tsafe/ వెబ్సైట్లో లేదా టీ–సేఫ్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకొని అందులో మీ ప్రయాణ వివరాలు నమోదు చేసినా కూడా పోలీసులు మీ ప్రయాణం సురక్షితంగా పూర్తయ్యే వరకు పర్యవేక్షిస్తారు. ఏ సమస్య ఉన్నా వెంటనే రంగంలోకి దిగుతారు. టీ–సేఫ్ యాప్‌లో ఎస్ఓఎస్ బటన్ నొక్కినా వెంటనే పోలీసులు అప్రమత్తమవుతారు.ప్రశ్న: ఆఫీసుల్లో మహిళా ఉద్యోగుల హక్కులు, వారి భద్రత వంటి అంశాలపై చర్చించేందుకు తరచూ సమావేశాలు నిర్వహించాలన్న నిబంధన ఉన్నా మా కార్యాలయంలో అలాంటి సమావేశాలు నిర్వహించట్లేదు. వర్క్ ప్లేస్‌లో వేధింపులు, టీజింగ్‌పై ఫిర్యాదు చేసేందుకు మహిళలు వెనకాడుతున్నారు. ఈ విషయంలో ఎవరిని సంప్రదించాలి? – (నీలిమ, ఓ ఐటీ సంస్థ ప్రాజెక్టు మేనేజర్, గచ్చి»ౌలి) జవాబు: పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు తెచి్చన పోష్ యాక్ట్–2013 ప్రకారం ప్రతి కంపెనీలో ఇంటర్నల్ కమిటీ (ఐసీ) ఉండాలి. అందులో ప్రిసైడింగ్ అధికారి, ఆ కార్యాలయ సభ్యులు సహా బయటి నుంచి ఒక నిపుణుడితో కలిసి కమిటీ పనిచేయాలి. మీ కార్యాలయంలో ఆ కమిటీ పనిచేయకపోతే మీరు మమ్మల్ని సంప్రదించొచ్చు. రాష్ట్రంలోని ఏ కార్యాలయంలోని సిబ్బంది అయినా ఫిర్యాదులు చేసేందుకు, శిక్షణ, అవగాహన కార్యక్రమాల నిర్వహణ కోసం మీరు మహిళా భద్రత విభాగంలోని సాహస్ మాడ్యూల్ సిబ్బందిని సంప్రదించొచ్చు. మీ అభ్యర్థన మేరకు నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రశ్న: ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో మాకు తెలిసిన వాళ్లు లోన్ తీసుకొని నా పేరు ష్యూరిటీగా పెట్టారు. ఆ డబ్బులు ఇప్పుడు మీరే కట్టాలని మూడు నంబర్ల నుంచి ఫోన్ చేసి విపరీతంగా వేధిస్తున్నారు. బూతులు మాట్లాడుతున్నారు. నాతోపాటు నా మరదలికి కూడా 928xxx2832, 630xxx3981, 630xxx9649 నంబర్ల నుంచి ప్రతిరోజూ కాల్స్ వస్తున్నాయి. మమ్మల్ని వేధిస్తున్న వ్యక్తులను కనిపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని మనవి. – (ప్రియాంక) జవాబు: మీరు వెంటనే మీ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా వాళ్లు మీకు తగిన సాయం చేస్తారు. ప్రశ్న: హైదరాబాద్‌లో స్వాగ్ అనే ఒక ఆఫీస్ (అది ఫేక్ కంపెనీ)లో జాబ్ ఉందని మా సిస్టర్ కాల్ చేస్తే ఉద్యోగం కోసం వెళ్లా. అక్కడ శ్యామ్ అనే వ్యక్తి నన్ను గదిలోకి తీసుకెళ్లి రేప్ చేశాడు. ఇప్పుడు నేను ఐదు నెలల గర్భవతిని. ఈ విషయం మా ఇంట్లో చెప్పాను. మా అమ్మ అతడితో మాట్లాడితే డబ్బిస్తా.. ప్రెగ్నెన్సీ తీయించాలని చెబుతున్నాడు. నన్ను మోసం చేసినట్లే శ్యామ్ ఎందరో ఆడపిలల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. నాకు ఇప్పుడు చావు తప్ప వేరే దారి లేదు. నాకు న్యాయం చేయండి..? – (శ్రీజ) జవాబు: మీరు వెంటనే మీ దగ్గరిలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. మీకు మా నుంచి సహాయం కావాలంటే లక్డీకాపూల్‌లోని మహిళా భద్రత విభాగం కేంద్ర కార్యాలయంలో సంప్రదించండి. మీకు తగిన సూచనలతోపాటు న్యాయపరమైన అంశాల్లో సాయం అందిస్తాం. ప్రశ్న: నాకు పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమధ్య ఎవరో ఒక వ్యక్తి నా భర్త మొబైల్‌కు నా గురించి చెడుగా మెసేజ్‌లు పంపుతున్నాడు. వాటిని నమ్మి నా భర్త వారం నుంచి నాతో గొడవపడుతున్నాడు. అవతలి వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. రోజూ గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి నా భర్తకు ఫోన్లు చేసి నా గురించి చెడుగా చెబుతున్నాడు. దయచేసి చర్యలు తీసుకోగలరు..? – (చందన, హనుమకొండ జిల్లా)జవాబు: మీ సమస్యను మా అధికారులు పరిశీలిస్తున్నారు. తగిన చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: గుర్తుతెలియని ఈ–మెయిల్ ఐడీ ద్వారా నన్ను వేధిస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా సోషల్ మీడియాలో నా ఫ్రెండ్స్‌కు కూడా పోస్టులు పెడుతున్నారు. తగిన చర్యలు తీసుకోగలరు. - (నిహారిక) జవాబు: మహిళా భద్రత విభాగం మీ ఫిర్యాదును తీసుకుంది. వివరాల కోసం మా షీ–టీమ్స్ అధికారి సంప్రదిస్తారు. ప్రశ్న: నాకు వివాహేతర సంబంధం అంటగట్టి వేధిస్తుంటే నా భర్తపై జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా. పోలీసులు నా భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపినా ఏదో రకంగా వేధిస్తున్నాడు. మా ఇంట్లో హిడెన్ కెమెరాలు పెట్టినట్టు నా అనుమానం. ఈ సమస్యల నుంచి బయటపడేలా నాకు పరిష్కారం చూపగలరు. -(హరిణి)జవాబు..: మా టీం మిమ్మల్ని సంప్రదించినా హిడెన్ కెమెరాలకు సంబంధించి తగిన వివరాలు ఇవ్వలేకపోయారు. -
సహజ ప్రసవాలకు ‘సీ–సేఫ్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాలను తగ్గించి.. సహజ ప్రసవాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే పలు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇదే క్రమంలో ‘సీ–సేఫ్’ అనే మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10 నుంచి 15 శాతానికి మించకూడదు. అయితే, రాష్ట్రంలో మొత్తం ప్రసవాల్లో 45 శాతం సిజేరియన్లు ఉంటున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 50 శాతానికిపైగా, ప్రభుత్వాస్పత్రుల్లో 32 శాతం మేర ఈ తరహా కాన్పులు ఉంటున్నాయి. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో కోత కాన్పుల నియంత్రణకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. కాగా, సీ–సేఫ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. నర్సులకు మిడ్వైఫరీ శిక్షణ పూర్తి సహజ ప్రసవాలను పెంపొందించే చర్యల్లో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లోని నర్సులకు ‘నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్వైఫరీ (ఎన్‌పీఎం)’ కోర్సును గత ఏడాది ప్రారంభించారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున రెండు బ్యాచ్‌లుగా గుంటూరు, తిరుపతిలలో 18 నెలల శిక్షణ ఇచ్చారు. గర్భధారణ జరిగినప్పటి నుంచి మహిళకు అవసరమైన వైద్య సహాయం, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నవజాత శిశువుకు అందించాల్సిన సేవలు, హైరిస్క్ లో ఉన్న గర్భిణులను ఏ విధంగా గుర్తించాలి వంటి పలు రకాల అంశాలపై నర్సులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం వీరికి నర్సింగ్ బోర్డ్‌లో పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి సరి్టఫికెట్లు జారీ చేస్తున్నారు. త్వరలో వీరిని రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా ప్రసవాలు జరిగే 10 ఆస్పత్రుల్లో నియమించనున్నారు. అనవసర కోతల నియంత్రణ యూకేకు చెందిన బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం, యునిసెఫ్, ఫెర్నాండెజ్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్ర వైద్య శాఖ సీ–సేఫ్‌ను నిర్వహించనుంది. ప్రభుత్వాస్పత్రుల్లో అనవసర కోత కాన్పులను సాధ్యమైనంత వరకూ నియంత్రించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో సిజేరియన్లను ఎలాంటి పరిస్థితుల్లో నిర్వహించాలి అనే దానిపై ప్రోటోకాల్స్‌ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మన ఆస్పత్రుల్లో అసిస్టెడ్ డెలివరీ ప్రక్రియలను అంతగా వినియోగించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో ఎంపిక చేసిన ఆరు ఆస్పత్రుల్లో గైనిక్ వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వ్యాక్యూమ్, ఇతర పరికరాలను ఉపయోగించి సాధారణ ప్రసవాల్ని చేసేలా అసిస్టెడ్ డెలివరీ ప్రక్రియలో నైపుణ్యాలు పెంచనున్నారు. సిజేరియన్ తప్పనిసరి అయిన పరిస్థితుల్లో సురక్షితంగా సర్జరీల నిర్వహణపై మరింత అవగాహన పెంచనున్నారు. రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, తెనాలి, అనకాపల్లి, ఆదోని ఆస్పత్రులను సీ–సేఫ్ కోసం ఎంపిక చేసినట్టు యునిసెఫ్ ప్రతినిధి డాక్టర్ నాగేంద్ర తెలిపారు. ప్రోటోకాల్స్ రూపకల్పన త్వరలో పూర్తి అవుతుందన్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మాతృ మరణాల కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఫలితంగా గతంతో పోలిస్తే మరణాలు తగ్గాయి. అదే విధంగా అనవసర సిజేరియన్ కాన్పుల నియంత్రణపై దృష్టి సారించాం. ఈ క్రమంలోనే సీ–సేఫ్‌కు ప్రణాళిక రచించాం. మరొక వైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్లను నియంత్రించడానికి చర్యలు తీసుకుంటున్నాం. – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
చిరు వ్యాపార సముదాయాలకు.. సేఫ్టీ మస్ట్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అగ్ని ప్రమాదాల నివారణకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. చిరు వ్యాపారస్తులు సుమారు 100 చదరపు గజాల విస్తీర్ణం గల భవనాలకు తప్పనిసరిగా ఫైర్ మిటిగేషన్, సేఫ్టీ సర్టిఫికెట్ తప్పని సరిచేసి సోమవారం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించింది. చిన్న చిన్న షాపులు, వ్యాపారం చేసుకునే ఇంటి యజమానులు గానీ.. అద్దెకు తీసుకొని వ్యాపారం చేసుకునే వారు అగ్ని ప్రమాదాల నివారణకు ఎవరికి వారే స్వయంగా ఫైర్ మిటిగేషన్, సేఫ్టీ సర్టిఫికెట్ తీసుకునేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జీహెచ్ఎంసీ సూచించింది. దరఖాస్తు విధానం ఇలా... ♦ వెబ్సైట్ www.ghmc.gov.in ను క్లిక్ చేసి ఫైర్ మిటిగేషన్/సేఫ్టీ సర్టిఫికెట్‌ను సెలెక్ట్ చేయాలి లేదా https://firesafety. ghmc.gov.in లో లాగిన్ కావాలి. ♦ లింక్ ఓపెన్ చేసిన తర్వాత తమ మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే వచ్చిన ఓటీపీని తప్పనిసరిగా నమోదు చేయాలి. ♦ అగ్ని ఆర్పే పరికరాల ఏజెన్సీ జాబితా నుంచి తమకు నచ్చిన ఎంపానెల్ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి. ♦ అర్జీదారుడు ఇంటి ట్యాక్స్ ఇండెక్స్ నంబర్ (టిన్) కలిగి ఉన్న పక్షంలో టిన్ నంబర్‌తో పాటు ఎంపానెల్ ఏజెన్సీ ఎంపికను కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ టిన్ నంబర్‌లేని పక్షంలో షాప్ ఎస్టాబ్లిష్మెంట్, అడ్రస్, సర్కిల్ లేదా జోన్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత ఎంపానల్ ఏజేన్సీని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. ♦ ఎంపానెల్డ్ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏజెన్సీ తమ షాపు వద్దకు వచ్చి అగ్ని ఆర్పే పరికరాన్ని ఫిట్టింగ్ చేసిన తర్వాత ఆ ఏజెన్సీ ఫిట్టింగ్ చేసినట్టు వెబ్సైట్లో నమోదు చేస్తారు. ♦ తదుపరి ఫైర్ మిటిగేషన్/సేఫ్టీ సర్టిఫికెట్ ఆన్లైన్లో జనరేట్ అవుతుంది. ఆ తర్వాత తమ అప్లికేషన్ స్టేటస్ రిపోర్ట్‌లో చూసుకోవచ్చు. ♦ జనరేట్ అయిన సేఫ్టీ సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకొని షాప్‌లో డిస్ ప్లే చేసుకోవాలి. -
నాటుసారాకు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
-
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడిని అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు
-
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
నల్లగొండ : జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షింపజేసే విధంగా రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. శనివారం నల్లగొండ పట్టణం పానగల్‌లోని పచ్చల సోమేశ్వర ఆలయం, ఛాయా సోమేశ్వర స్వామి ఆలయాలతో పాటు ఉదయ సముద్రం ప్రాంతాలను సందర్శించారు. శిథిలావస్థలో ఉన్న ఆలయాలను ఆధునీకరించి, ఆ ప్రాంతాలను అభివృద్ధి పర్చాలన్నారు. దేవరకొండ, నాగార్జునసాగర్‌లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌తో కలిసి కలెక్టరేట్ కార్యాలయంలో కార్యదర్శి బుర్రా వెంకటేశం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో విదేశాల నుంచి పర్యాటకులు అతి తక్కువ సంఖ్యలో వస్తున్నారని పేర్కొన్నారు. దేశంతో పాటు రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయన్నారు. నల్లగొండ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే విధంగా విస్తృత ప్రచారం, హోర్డింగ్‌లను ప్రధాన కూడళ్లలో, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో అమర్చాలని సూచించారు. ఛాయసోమేశ్వర ఆలయ విశిష్టత గురించి ఆలయంలో పడే ఛాయలపై పరిశోధనలకు యూనివర్సిటీ, ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు ప్రత్యేక పర్యటన ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ..జిల్లాకు టేబుల్ టెన్నిస్ హాల్ ఏర్పాటుకు రూ.21 లక్షల నిధులు అంచనా ప్రతిపాదనలు సమర్పించారని, ఆ నిధులు మంజూరు చేస్తామని కార్యదర్శి తెలిపారు. ఈ సమావేశంలో పర్యాటక అధికారి ఎం.శివాజీ, దేవాదాయ శాఖ అధికారి ఎ.సులోచన, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బెల్టు మాటేంటి?!
గుడుంబా నిర్మూలనకు రంగంలోకి దిగిన అధికారులు అది జరిగినా బెల్టు దుకాణాలు ఉంటే ఫలితం సున్నా.. జిల్లాలో విచ్చలవిడిగా మద్యం బెల్టు దుకాణాలు వెయ్యికి పైగానే ఉన్నట్లు అంచనా హన్మకొండ : గ్రామాల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపించే మద్యం బెల్టు దుకాణాలు వరంగల్ రూరల్ జిల్లాలో విచ్చలవిడిగా నడుస్తుంటే అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. తాజాగా జిల్లాలను గుడుంబా రహితంగా తీర్చిదిద్దేందుకు రంగంలోకి దిగిన అధికారులు బెల్టు షాపుల మాటెత్తకపోవడాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఒకవేళ నిజంగానే గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దినా బెల్టు షాపులు కొనసాగితే అధికారుల కృషికి ఫలితం ఉండకపోవచ్చు. అధికారికంగా 57 వైన్స్.. మూడు బార్లు వరంగల్ రూరల్ జిల్లాలోని 15మండలాల్లో 57 వైన్స్, మూడు బార్లు ఉన్నాయి. అయితే, వీటికి అనుబంధంగా జిల్లావ్యాప్తంగా సుమారు వెయ్యి వరకు మద్యం అమ్మే బెల్టు దుకాణాలు ఉన్నట్లు అంచనా. ప్రధాన దుకాణాలకు సమానంగా ‘బెల్టు’ వ్యాపారం కొనసాగుతుందనేది బహిరంగ రహస్యం. కొన్ని గ్రామాల్లోనైతే బెల్టు దుకాణం నడపడం కొందరికి ఉపాధిగా మారిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామీణాభివృద్ధిపై ప్రభావం పడుతోంది. ఇప్పటికే జిల్లాలోని అనేక గ్రామాల్లో మద్యం మత్తు కారణంగా, గుడుంబా ప్రభావంతో వందలాది కుటుంబాలు ఛిద్రమయ్యాయి. వివిధ గ్రామాల్లో మత్తుకు చిత్తై అనేక మంది మృతి చెందగా 80శాతం మంది వితంతువులే కనిపించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. గుడుంబా నిర్మూలనకు కమిటీలు మత్తు అనేక కుటుంబాలను చిత్తు చేస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో గుడుంబా, నల్లబెల్లాన్ని సమూలంగా నిర్మూలించి గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 24న జిల్లా యంత్రాంగంతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కమిటీలు ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ సమావేశంలో వరంగల్ పోలీసు కమిషనర్‌తో పాటు ఎక్సైజ్, రెవెన్యూ, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిల్లాలో 70 గ్రామాల్లో తీవ్రంగా ప్రభావం చూపిస్తున్న గుగుంబా మహమ్మారిని తరిమివేయడంలో భాగంగా తయారీ, రవాణా, అమ్మకందారులపై నిఘా పెట్టాలని ఈ సమావేశంలో కలెక్టర్ ఆదేశించారు. అలాగే, నల్లబెల్లం రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్, పోలీసు, రెవెన్యూ, మహిళాసంఘాలు, సాక్షరభారత్ కోఆర్డినేటర్లతో గ్రామాల్లో కమిటీల ఏర్పాటుకు నిర్ణయించారు. గుడుంబా, నల్లబెల్లం దొరికితే పీడీ చట్టం కింద కేసులు పెట్టడంతో పాటు, రూ.లక్ష వరకు జరిమానా విధించాలని పోలీసులకు సూచించారు. అదేవిధంగా గుడుంబాపై ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబరుతో పాటు ప్రత్యేక వాట్సాప్ నంబరును నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సమావేశంలో తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నా... మద్యం షాపులకు సమాంతంగా నడుస్తున్న బెల్టు షాపుల నిరోధానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మద్యం దుకాణాల తరలింపు జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్న మద్యం దుకాణాలు, బార్లను వచ్చే మార్చి 30లోగా 500మీటర్ల లోపలకు తరలించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించారు. దీంతో రహదారుల వెంట ఉన్న షాపుల యజమానులకు ఆబ్కారీ అధికారులు తాజాగా జిల్లాలోని 21దుకాణాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. రహదారుల పక్కన ఉన్న ఈ దుకాణాలను తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఎక్సైజ్ ఆబ్కారీ సూపరింటెండెంట్ తెలిపారు. అలాగే, ఎనిమిది కల్లు దుకాణాలను సైతం హైవేల పక్క నుంచి తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇంకా గుడుంబా రహిత జిల్లాగా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న అధికార యంత్రాంగం బెల్టు షాపుల నిర్మూలన విషయమై కూడా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. అయితే, దీనికి కూడా న్యాయస్థానాలే ఆదేశాలు జారీ చేయాలా అని వారు ప్రశ్నిస్తున్నారు. -
కేంద్రానికి రతన్ టాటా సూచన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన డీమానిటైజేషన్ పై ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూపు సారధి రతన్ టాటా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై స్పందించారు. ఇప్పటికే మోదీ ఆపరేషన్ బ్లాక్ మనీకి మద్దతు తెలిపిన టాటా ట్విట్టర్ ద్వారా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులుపడుతున్న ప్రజల కష్టాలను తగ్గించడానికి సత్వరమే చర్యలు చేపట్టాలని కో్రారు. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో అత్యవసర వైద్యసేవలు అందక బాధలు పడుతున్న పేదల కోసం ప్రభుత్వం ప్రత్యేక సహాయక చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతోపాటు తన సలహాలతో కూడిన ఒకనోట్ ను కూడా జత చేశారు. జాతీయవిపత్తులు సంభవించినపుడు చేపట్టే అత్యవసర సహాయక చర్యల్ని ఈ సమయంలో కూడా పేదలకు అందించాలన్నారు. నగుదును అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని అభినందించిన ఆయన సామాన్య మానవుడి నిత్యావసరాల గురించి మర్చిపోకూడదని సలహా ఇచ్చారు. అలాగే డీమానిటైజేషన్ కార్యక్రమం అమలుకు మరిన్ని ఆలోచనలు చేయాలన్నారు. కాగా నవంబరు 8న ప్రధాని ప్రకటించిన పెద్ద నోట్ల రద్దుకు మద్దతు తెలిపిన బడా పారిశ్రామిక వేత్తలో రతన్ టాటా ఒకరు. నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రధాని చేపట్టిన డీమానిటైజేషన్ చాలా మంచి నిర్ణయమనీ, ఇది నల్లధనాన్ని తుడిచిపెడు తుందంటూ ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి మనందరి మద్దతు అందించాల్సిన అవసరం వుందంటూ గతంలో మోదీకి మద్దుతు పలికిన సంగతి తెలిసిందే. Some further thoughts on implementation of demonetization program. pic.twitter.com/RZdicKvFS7 — Ratan N. Tata (@RNTata2000) November 24, 2016 -
నోట్ల రద్దును టాటా ఎలా అభివర్ణించారో తెలుసా?
-
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
* బాధ్యతలు స్వీకరించిన చేవెళ్ల డీఎస్పీ శృతకీర్తి * వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేవెళ్లరూరల్: చేవెళ్ల డీఎస్పీగా సీహెచ్ శృతకీర్తి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. చేవెళ్ల మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర ఆలయంలో మొదట ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె నేరుగా తన కుటుంబసభ్యులతో కలిసి మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విధులు స్వీకరించిన డీఎస్పీకి చేవెళ్ల, పరిగి సర్కిల్ సీఐలు ఉపేందర్, ప్రసాద్, ఎస్ఐలు స్వాగతం పలికారు. ఆమెకు బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్‌శాఖలో రెండురోజుల కిత్రం జరిగిన డీఎస్పీల బదిలీల్లో భాగంగా నల్లగొండ జిల్లా ఎస్బీలో డీఎస్పీగా పనిచేస్తున్న శృతకీర్తి బదిలీపై చేవెళ్లకు వచ్చారు. సీఐలతో మాట్లాడి చేవెళ్ల, పరిగి సర్కిల్ పరిధిలోని విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శృతకీర్తి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. డివిజన్ పరిధిలోని సమస్యలపై అవగాహన కల్పించుకొని ముందుకు సాగుతానని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. -
పుష్కర స్టేషన్లపై ప్రత్యేక దృష్టి
రాజమండ్రి స్టేషన్లో సీనియర్ రైల్వే అధికారులు మకాం తొక్కిసలాట జరగకుండా ప్రత్యేక చర్యలు విజయవాడ స్టేషన్లోనూ ఏర్పాట్లు విజయవాడ : పుష్కరాలు తొలిరోజున రాజమండ్రి పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 27 మంది ప్రాణాలు కోల్పోవడంతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా విజయవాడ డివిజన్ పరిధిలోని రాజమండ్రి, గోదావరి, నర్సాపురం స్టేషన్ల నుంచి భక్తులు రాకపోకలు సాగిస్తూ ఉండటంతో ఆయా స్టేషన్లపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు రైల్వే డీఆర్ఎం అశోక్‌కుమార్ తెలిపారు. ప్రతి గంటకు 40 వేల మంది..... విజయవాడ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లలో రోజుకు 50 వేల మంది ప్రయాణికులు రాజమండ్రి వెళ్లుతున్నారని అంచనా. ఇదిలా ఉండగా రాజమండ్రి స్టేషన్లో ప్రతి గంటకు 40 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రాజమండ్రిలోని నాలుగు ఫ్లాట్‌పారాలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీ మరింత పెరిగితే తొక్కిసలాట జరుగుతుందని భావిస్తున్న అధికారులు పుష్కర స్టేషన్లపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నట్లు తెలిసింది. బుధవారం రద్దీ ఎక్కువగా వుండటంతో గుడివాడ నుంచి నడిచే పాసింజర్ రైలును రద్దు చేసి రాజమండ్రికి తరలించారు. తరలి వెళ్లిన సీనియర్ అధికారులు.... విజయవాడలోని హెడ్ క్వార్టర్స్‌లో ఉండి డివిజన్లోని అన్ని ఏర్పాట్లును పరిశీలించే డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) అశోక్‌కుమార్, ఏడీఆర్ఎం ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్, సీనియర్ కమర్షియల్ మేనేజర్ ఎన్.వి. సత్యనారాయణ, సీనియర్ పీఆర్వో ఎఫ్.ఆర్. మైఖేల్ తదితర కీలక అధికారులు మూడు రోజులుగా రాజమండ్రిలోనే మకాం వేసి, ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు పుష్కర స్టేషన్ల నుంచి వారి వారి గమ్యస్థానాలకు పంపేందుకు ప్రయత్నిస్తారని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఆయా స్టేషన్లలో సిబ్బంది తక్కువగా వుండటంతో 1,500 మందిని ప్రత్యేకంగా డివిజన్లోని అన్ని ప్రాంతాల నుంచి తరలించారు. అంతేకాకుండా చోరీలు జరగకుండా ఉండేం దుకు, రద్దీ సమయాల్లో అవాంఛనీయ ఘటన లు జరగకుండా డివిజన్లోని అన్ని స్టేషన్ల నుంచి 1,600 మంది జీఆర్పీ, 400 మంది ఆర్పీఎఫ్ సిబ్బందిని పుష్కర స్టేషన్లకు తరలించా రు. పుష్కరయాత్ర పూర్తి చేసుకుని వచ్చే ప్రయాణికులు గమస్థానాలకు వెళ్లేం దుకు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక విచారణా కేంద్రాలను, టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. విజయవాడ స్టేషన్‌పై పెరుగుతున్న రద్దీ... విజయవాడ రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా శని(రంజాన్), ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ప్రయాణికుల సంఖ్య మరింత ఎక్కువగా వుంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో విజయవాడ నుంచి రాజమండ్రి, నర్సాపురం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు రైళ్ల సమాచారాన్ని ప్రత్యేక బోర్డుల ద్వారా ప్రదర్శిస్తున్నారు. అలా గే తూర్పు, పశ్చిమ ముఖద్వారం వద్ద ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియచేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా స్పెషల్ రైళ్ల రాకపోకల వివరాలను ఎప్పటి కప్పుడు మైక్‌ల ద్వారా ప్రసారాలు చేస్తూ ప్రయాణికులకు తెలియచేస్తున్నారు. -
అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాల్సిందే
నెల్లూరు(పొగతోట): జిల్లాలో పరిశీలన పేరుతో 16,563 పింఛన్లు తొలగించారని, వారిలో అర్హులందరికీ పింఛన్లు పునరుద్ధరించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన ‘స్థాయీ సంఘాల’ సమావేశం ని ర్వహించారు. పింఛన్ల తొలగింపుపై సభ్యులు ధ్వజమెత్తారు. ప్రతి గ్రామం లో అర్హుల పింఛన్లు తొలగించారని అ ధికారుల దృష్టికి తెచ్చారు. అర్హుల పింఛన్లు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో తీర్మానించారు. గ్రామ కార్యదర్శుల ద్వారా పింఛన్లు పంపిణీ ప్రక్రియ చేపట్టాలని జెడ్పీ తీర్మానించింది. ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలను మండల కార్యాలయాల్లో ప్రచురించాలన్నారు. పథకాల అమలు లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పీహెచ్‌సీల్లో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండడం లే దన్నారు. అలాంటి వారిపై కఠిన చర్య లు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతా ల్లో రోడ్లు అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి బోర్లకు మరమ్మతులు పూర్తి చేయాలని సూచిం చారు. గొర్రెలకు సంబంధించి బీమా పథకం కింద 5 వేల మంది అర్హులు స ద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. మత్స్య శాఖకు సంబంధించి రూ.1.10 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నిధుల వినియోగానికి ప్రణాళికలు సిద్ధం చేస్తే నిధులు విడుదల చేస్తామన్నారు. వాగులు, కుంటల నుంచి గృహాలు, మరుగుదొడ్ల నిర్మాణాలకు ఇసుక ఉచితంగా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాల న్నారు. పథకాల అమలులో జాప్యం చేయకుండా అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి పూర్తిస్థాయిలో రికవరీ చేయాలన్నారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సన్న, చిన్న కారు రైతులకు ఉపాధి హామీ పథకం ద్వారా పొలాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పనులన్నీ ఆయనకేనా? జిల్లా జరుగుతున్న పనులు ఒకే ఒక్కరికి కేటాయిస్తున్నారని, దీంతో పనుల్లో నాణ్యత లోపించిందని జెడ్పీలో చర్చిం చారు. ఆ పనులపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని సభ్యులు డి మాండ్ చేశారు. ఐదేళ్ల నుంచి ప్రతి పనిని ఆయనకే కేటాయిస్తున్నారని సభ్యులు ధ్వజమెత్తారు. సమావేశంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీ వయ్య, జెడ్పీ సీఈఓ ఎం.జితేంద్ర, డీఆర్డీఏ పీడీ చంద్రమౌళి, డ్వామా పీడీ గౌతమి, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు పురుషోత్తమ్, రామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
చారిత్రక కట్టడాల పరిరక్షణకు రూ.100 కోట్లు
మరమ్మతులు చేపట్టాలని ఆదేశించిన నగర మేయర్ ‘ఖుర్షీద్ జా దేవుడి’ కట్టడాన్ని సందర్శించిన మాజిద్ శాలిబండ : గ్రేటర్ పరిధిలోని చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని నగర మేయర్ మాజీద్ హుస్సేన్ తెలిపారు. కట్టడాల మరమ్మతులు, పరిరక్షణ కోసం జీహెచ్ఎంసీ తరఫున రూ.100 కోట్లు మంజూరు చేశామన్నారు. శనివారం ఆయన చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, జీహెచ్ఎంసీ దక్షిణ మండలం జోనల్ కమిషనర్ ఎం.బాలసుబ్రహ్మణ్యంరెడ్డితో కలిసి చారిత్రక కట్టడమైన ‘ఖుర్షీద్ జా దేవుడి’ని సందర్శించారు. ఈ కట్టడం పెచ్చులూడుతుండడాన్ని గమనించిన మాజిద్ హుస్సేన్ వెంట నే మరమ్మతులు చేపట్టాలని పురావస్తు శాఖ అధికారులకు సూచిం చారు. చారిత్రక కట్టడాలను పరిరక్షించి భవి ష్యత్తు తరానికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ తరఫున గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని అన్ని చారిత్రక కట్టడాలకు మరమ్మతులు చేపట్టి వీటికి మరింత వన్నె తెస్తామన్నారు. ఈ పనుల ను కుడా ఆధ్వర్యంలో చేపడతామని తెలిపారు. దారుషిఫాలోని పాత పాస్‌పోర్టు కార్యాలయాన్ని కూడా ఆయ న సందర్శించారు. కార్యక్రమంలో హుస్సేనీ ఆలం కార్పొరేటర్ మీర్ జుల్ఫీకర్ అలీ, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, పురావస్తు శాఖ అధికారులు, ఎంఐఎం నాయకులు అసద్ ఖాద్రీ పాల్గొన్నారు. -
జాప్యమైతే.. పనులు నిలిపేయండి
నెల్లూరు(పొగతోట) : ‘మంజూరైన పనులను ప్రారంభించడంలో నెలల కొద్దీ జాప్యమైతే ఎలా?.. అటువంటి పనులను నిలిపివేయండి’ అంటూ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. తన చాంబర్లో జిల్లా పరిషత్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు, డీఈలతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇలా అయితే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందన్నారు. చిన్న పనులను కూడా ఏళ్ల తరబడి చేపడితే ఫలితం ఏముంటుందని ప్రశ్నించారు. మంజూరై చేపట్టని పనుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. సదరు కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి వాటిని నిలుపుదల చేయాలని సూచించారు. పూర్తయిన పనులకు సంబంధించి రూ.2.50 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. ఇందు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. పనులు పూర్తి చేయడంలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కొత్త జిల్లా పరిషత్ కార్యాలయ పనులు పూర్తి చేయడానికి రూ.1.50 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. జెడ్పీ భవనాన్ని అధునాతన సదుపాయాలతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంచినీటి ఎద్దడి ఉన్న గ్రామాలను గుర్తించి, నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా గ్రామాల్లో మంచినీటి సరఫరా మెరుగుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. నిరుపయోగంగా ఉన్న బోర్లు, మోటార్లకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ జితేంద్ర, పంచాయతీరాజ్ ఎస్ఈ పురుషోత్తం, కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు బి.అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. -
గో టూ..కుప్పం!
4 మండలాలకు నలుగురు ఆర్డీవోస్థాయిఅధికారుల నియామకం కుప్పం అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని మార్గనిర్దేశం 28 లోపు సమగ్ర నివేదికకు ఆదేశం ఖాళీ పోస్టుల భర్తీకి ప్రత్యేక చర్యలు ఒక్క నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టి సారించడంపై విమర్శలు ‘ఊరందరిదీ ఒక దారైతే.. ఉలిపిరికట్టెది మరో దారి’ అంటే ఇదే. రాష్ట్రంలోని 174 నియోజకవర్గాల పరిస్థితి ఒక విధంగా ఉంటే కుప్పం మాత్రం ప్రత్యేకం. 66 మండలాలున్న జిల్లాలో ముగ్గురు ఆర్డీవోలు ఉంటే కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు ప్రత్యేకాధికారులుగా నలుగురు ఆర్డీవో స్థాయి అధికారులను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ తీరుపై ఇటు ఉద్యోగుల్లో, అటు ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, చిత్తూరు: కుప్పం నియోజవర్గంలోని రామకుప్పం, గుడుపల్లె, కుప్పం, శాంతిపురం మండలాలకు ప్రత్యేకాధికారులుగా మైనారిటీ వెల్ఫేర్ డీడీ ప్రభాకర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామారావు, సివిల్ సప్లయిస్ విజిలెన్స్ డెప్యూటీ కలెక్టర్లు సత్తిబాబు, విశ్వనాథలను శుక్రవారం ప్రభుత్వం నియమించింది. శనివారం ఉదయమే ఆయా మండలాలకు వెళ్లి అధికారులతో సమావేశం నిర్వహించి, అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ఆదేశించినట్లు తెలిసింది. నలుగురు అధికారులు తమ సొంత శాఖల పనులను పక్కనబెట్టి హుటాహుటిన శనివారం ఉదయం కుప్పం నియోజకవర్గానికి వెళ్లి సమావేశం నిర్వహించారు. సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా.. మండలాల్లోని ఉద్యోగులను సమన్వయపరచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేసే బాధ్యతను ప్రభుత్వం వీరికి అప్పగించింది. ముఖ్యంగా రెస్కో(రూరల్ ఎలక్ట్రికల్ కో-ఆపరేటివ్ సొసైటీ), పంచాయతీరాజ్, హౌసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్, ఇళ్లు కేటాయించాలని, విద్యుత్ కనెక్షన్ ప్రతి ఇంటికీ ఉండేలా చూడాలని సూచించారు. ఈ పథకాలన్నిటికీ ‘ఆధార్’తో అనుసంధానం తప్పనిసరి అని కూడా అధికారులు చెప్పారు. వేర్వేరుగా ఓ ప్రణాళికను రూపొందించి ఈనెల 28వ తేదీలోపు అందించాలని కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. వెనుకబడిన నియోజకవర్గాల పరిస్థితేంటి బాబు.. కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే చంద్రబాబునాయుడు 9 ఏళ్లపాటు రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మొత్తం మీద పాతికేళ్లుగా నిరాటంకంగా కుప్పం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే నియోజకవర్గ అభివృద్ధి మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. జిల్లా మొత్తం మీదనిరక్షరాస్యత అధికంగా ఉండేది కుప్పం ప్రాంతంలో అంటే అతిశయోక్తి కాదు. చదువు, ఉపాధి లేక అక్కడి వారు పనికోసం వలస వెళుతుంటారు. కుప్పం నుంచి రోజుకు పదివేల మంది కూలీలు కర్ణాటక, తమిళనాడు ప్రాంతానికి ఉదయం రైల్లో వెళ్లి రాత్రికి తిరిగి వస్తుంటారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు కుప్పం నియోజకవర్గం ఎంత నిర్లక్ష్యానికి గురైందో. ఈ క్రమంలో సీఎం కుర్చీ అధిరోహించిన బాబు తన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఉపక్రమించారు. అయితే కుప్పంలాగే సత్యవేడు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, నగరి నియోజకవర్గాలు కూడా అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. పైగా ఇందులో మొదటి మూడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. వీటి అభివృద్ధిని విస్మరించి కుప్పం ప్రాంతానికి మాత్రమే నలుగురు ప్రత్యేకాధికారులను నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుప్పానికి మాత్రమే సీఎం అన్నట్లు చంద్రబాబు వ్యవహరించ డం తగదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. కుప్పంలో ఖాళీలనూ పూరించాల్సిందే కుప్పం నియోజకవర్గంలో ఉపాధ్యాయ, ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. అవసరమైతే జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి బలవంతంగానైనా అధికారులను కుప్పానికి బదిలీ చేయాలని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగం అధికారుల ఇష్టాలతో పనిలేకుండా ‘గో..టు కుప్పం’ అని ఆర్డర్ కాపీ చేతిలో పెట్టేందుకు సిద్ధమైంది. అభివృద్ధి కోసమే ప్రత్యేకాధికారుల నియామకం కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించాం. అధికారులను సమన్వయపరచి అభివృద్ధిని వేగవంతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది మా నిర్ణయమే. ప్రభుత్వ నిర్ణయం. -శ్రీధర్, జాయింట్ కలెక్టర్, చిత్తూరు.