కేంద్రానికి రతన్ టాటా సూచన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన డీమానిటైజేషన్ పై ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూపు సారధి రతన్ టాటా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై స్పందించారు. ఇప్పటికే మోదీ ఆపరేషన్ బ్లాక్ మనీకి మద్దతు తెలిపిన టాటా ట్విట్టర్ ద్వారా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులుపడుతున్న ప్రజల కష్టాలను తగ్గించడానికి సత్వరమే చర్యలు చేపట్టాలని కో్రారు. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో అత్యవసర వైద్యసేవలు అందక బాధలు పడుతున్న పేదల కోసం ప్రభుత్వం ప్రత్యేక సహాయక చర్యలు తీసుకోవాలని సూచించారు.
దీంతోపాటు తన సలహాలతో కూడిన ఒకనోట్ ను కూడా జత చేశారు. జాతీయవిపత్తులు సంభవించినపుడు చేపట్టే అత్యవసర సహాయక చర్యల్ని ఈ సమయంలో కూడా పేదలకు అందించాలన్నారు. నగుదును అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని అభినందించిన ఆయన సామాన్య మానవుడి నిత్యావసరాల గురించి మర్చిపోకూడదని సలహా ఇచ్చారు. అలాగే డీమానిటైజేషన్ కార్యక్రమం అమలుకు మరిన్ని ఆలోచనలు చేయాలన్నారు.
కాగా నవంబరు 8న ప్రధాని ప్రకటించిన పెద్ద నోట్ల రద్దుకు మద్దతు తెలిపిన బడా పారిశ్రామిక వేత్తలో రతన్ టాటా ఒకరు. నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రధాని చేపట్టిన డీమానిటైజేషన్ చాలా మంచి నిర్ణయమనీ, ఇది నల్లధనాన్ని తుడిచిపెడు తుందంటూ ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమానికి మనందరి మద్దతు అందించాల్సిన అవసరం వుందంటూ గతంలో మోదీకి మద్దుతు పలికిన సంగతి తెలిసిందే.
Some further thoughts on implementation of demonetization program. pic.twitter.com/RZdicKvFS7
— Ratan N. Tata (@RNTata2000) November 24, 2016