వైద్యమో రామచంద్రా!
- వేధిస్తున్న సిబ్బంది కొరత
- అరకొర సేవలతో సరి
- శిథిల భవనాల్లో రోగుల అవస్థలు
- అత్యవసర పరికరాలు అంతంతమాత్రమే
సీఎం సొంత జిల్లాలో సర్కారు వైద్యం రోగులకు అందని ద్రాక్షగా మారింది. అరకొర వైద్యం, సిబ్బంది కొరత రోగులను వేధిస్తోంది. ఏళ్లక్రితం నాటి ఆస్పత్రి భవనాలు శిథిలావస్థకు చేరాయి. వీటిల్లో వైద్యం సేయడం సిబ్బందికి కష్టతరమవుతోంది. ఆధునిక వైద్యసేవలు మాట దేవుడెరుగు.. కనీస వైద్యమూ అందడంలేదు. వైద్యమో రామచంద్రా.. అంటూ పలువురు ప్రయివేటు ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర వసతులు, వైద్యసేవల గురించి స్పెషల్ ఫోకస్..
చిత్తూరు (అర్బన్): జిల్లాలో పేదలకు మెరుగైన వైద్యసేవల్ని అందించే విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. సిబ్బంది ఉన్న వారితోనే... చేసిన కొద్దీ సేవలు అనే దృక్పథంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ముందుకు వెళుతున్నారు. ఏళ్లతరబడి భర్తీకి నోచుకోని పోస్టులు.. నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ఆధునిక పరికరాలు లేకపోవడం రోగుల పాలిట శాపాలుగా మారాయి.
జిల్లాలో 94 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), నాలుగు సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ) ఉన్నాయి. ఇందులో ప్రసవాల కోసం 37 పీహెచ్‌సీలు 24 గంటలు పనిచేస్తున్నాయి. వీటితో పాటు 644 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. పేరుకు మాత్రం మండలానికో పీహెచ్‌సీ పనిచేస్తోంది. వీటిలో 24 గంటల పాటు పనిచేసే పీహెచ్‌సీలు 37 ఉన్నాయి. ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన వైద్యులు, సహాయకులు, సాంకేతిక నిపుణుల పోస్టులు భర్తీకాకపోవడంతో ఆ ప్రభావం రోగులపై చూపుతోంది.
జిల్లాలోని 644 ఆరోగ్య ఉప కేంద్రాల్లో 300కిపైగా ఆస్పత్రులకు పక్కా భవనాలు లేవు. ఉన్న చోట అత్యవసర వైద్యం కోసం వెళితే అక్కడ సిబ్బంది ఉంటారో లేదో తెలియక రోగులు చాలా వరకు వెళ్లడం మానేశారు. చిన్న సమస్యకు కూడా ప్రైవేటు వైద్యాన్నే ఆశ్రయిస్తున్నారు.
జిల్లాలో ఏ ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎక్స్‌రే పరికరాలు, స్కానింగ్, వీల్‌ైచైర్లు, నెబులైజర్లు లేవు. వారానికి రెండు రోజులు ఇతర ఆస్పత్రుల నుంచి తెప్పించి ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు.
రాష్ట్ర వైద్యవిధాన్ పరిషత్ (ఏపీవీవీపీ) ఆధ్వర్యంలో జిల్లాలో కుప్పం, శ్రీకాళహస్తి, మదనపల్లె, చంద్రగిరి, పలమనేరు, నగరి ఏరియా ఆస్పత్రులు.. పుంగనూరు, వాయల్పాడు, సత్యవేడు, పీలేరు, పుత్తూరు, చిన్నగొట్టిగల్లు, సదుం, కలికిరి సామాజిక ఆరోగ్య కేంద్రాలతో పాటు చిత్తూరులో జిల్లా ప్రభుత్వాస్పత్రి ఉన్నాయి. వీటిల్లో రోగులకు ఆశించిన స్థాయిలో వైద్య సేవలు అందడంలేదు. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి నోచుకోకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
ఈ 15 వైద్య శాలల్లో 114 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు మంజూరయితే 80 మంది వైద్యులు మాత్రమే ఉన్నారు. 34 ఖాళీలున్నాయి. సివిల్ స్పెషల్ సర్జన్ పోస్టులు 40 మంజూరయితే 23 మందే పనిచేస్తున్నారు. 17 ఖాళీలున్నాయి. 36 ఫార్మాసిస్ట్ పోస్టులకు 17 మంది పనిచేస్తుంటే 19 ఖాళీలున్నాయి. ల్యాబ్ టెక్నీషియన్లదీ దాదాపు ఇదే పరిస్థితి. 36 పోస్టులకు 8 చోట్లే సిబ్బంది ఉన్నారు. 28 చోట్ల ఖాళీలున్నాయి. ఇక 17 రేడియోగ్రాఫర్ల పోస్టులకు ఆరుగురు పనిచేస్తుంటే 11 ఖాళీలున్నాయి. రోగులకు ఎక్స్‌రే తీసేటప్పుడు డార్క్‌రూమ్ అసిస్టెంట్లు కీలకం. ఈ విభాగంలో 18 పోస్టులుంటే 17 ఖాళీలున్నాయి. ఇవి కాకుండా టెక్నీషియన్లు, ఏఎన్‌ఎంలు, నర్సులు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు ఇలా చాలా వరకు ఖాళీలున్నాయి. ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో జిల్లాకు మొత్తం 913 పోస్టులు మంజూరయితే 246 ఖాళీలున్నాయి. ఐదేళ్లుగా ఈ ఖాళీలు భర్తీకి నోచుకోలేదు.