ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో మొదటిది బొబ్బిలి సామాజిక ఆరోగ్య కేంద్రం పాత భవనం. పక్క ఫొటోలో కనిపిస్తున్నది అదే ఆవరణలో రూ.3.50 కోట్లతో అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మించిన సీహెచ్‌సీ నూతన భవనం. ఇది కార్పొరేట్ ఆస్పత్రిని తలదన్నేలా నిర్మించింది. ఈ ఆస్పత్రే కాదు... వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులను ఎనిమిదింటిని పూర్తి స్థాయి వసతులతో ఇలానే నిర్మిస్తున్నారు.
రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నాడు – నేడు ద్వారా ఆస్పత్రులను అధునాతనంగా మార్చింది. ఆహ్లాదకర వాతావరణం నెలకొనేలా తీర్చిదిద్దింది. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపట్టింది. రోగులకు కావాల్సినన్ని సదుపాయాలు కల్పించింది. దీంతో రోగులు కార్పొరేట్‌ను కాదని ప్రభుత్వ ఆస్పత్రుల వైపు అడుగులు వేస్తున్నారు.
విజయనగరం ఫోర్ట్: రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా గాలికొదేలిసింది. ఆస్పత్రుల్లో తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించక, కనీస వసతులు కల్పించక.. కావాలనే కార్పొరేట్‌ను ప్రొత్సహించేలా ఇలా వ్యహరించిందన్న విమర్శలు అప్పట్లో లేకపోలేదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజారోగ్యమే పరమావధిగా ఆస్పత్రుల రూపురేఖలనే సమూలంగా మార్చివేసింది. కార్పొరేట్‌ను తలదన్నేలా తీర్చిదిద్దింది. అవసరమైనంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించి... ఆరోగ్యశ్రీ వంటి సేవలతో కార్పొరేట్‌కు దీటుగా మార్చేసింది. రూ.కోట్లు ఖర్చు పెట్టి వైద్య విధాన్ పరిషత్ ఆస్పత్రులను నిర్మిస్తోంది. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల నిర్మాణం పూర్తి కాగా.. మరికొన్ని నిర్మాణ దశలో దూసుకుపోతున్నాయి.
రూ.58.58 కోట్లతో 8 ఆస్పత్రుల నిర్మాణం
జిల్లాలో వైద్య విధాన్ పరిషత్‌కు చెందిన 8 ఆస్పత్రులను రూ.58.58 కోట్లతో నిర్మాణం చేపట్టారు. పాత ఆస్పత్రి ఆవరణలో కొత్తగా నిర్మాణం చేపట్టారు. వీటిలో బొబ్బిలి, చీపురుపల్లి ఆస్పత్రుల నిర్మాణం పూర్తయి ఇప్పటికే ప్రారంభించారు. భోగాపురం ఆస్పత్రి నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నారు. ఎస్.కోట, బాడంగి, నెల్లిమర్ల, రాజాం, గజపతినగరం ఆస్పత్రులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి నిర్మాణాలు కూడా వేగవంతం అయ్యే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఆస్పత్రులు ఇలా...
ప్రతి ఆస్పత్రిలోని క్యాజువాలటీ, ఓపీ విభాగం, మేల్, ఫీమేల్ వార్డులు, చేంజింగ్ రూమ్, ల్యాబొరేటరీ, అత్యా«ధునిక సౌకర్యాలతో కూడిన ఆపరేషన్ థియేటర్, ఎక్స్‌రే విభాగం, కార్యాలయ నిర్మాణాలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ఆస్పత్రులను నిర్మిస్తున్నారు. నాణ్యతలో రాజీ పడకుండా రోగులకు సేవలే లక్ష్యంగా దూసుకుపోతున్నారు.
అన్ని వసతులతో...
వైద్య విధాన్ పరిషత్ పరిధిలో 8 ఆస్పత్రులను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్ని వసతులతో రూ.58.58 కోట్లతో నిర్మిస్తున్నాం. రెండు ఆస్పత్రులు నిర్మాణం పూర్తవ్వడంతో వాటిని ప్రారంభించి వినియోగంలోకి తీసుకొచ్చాం. మరో ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. మిగిలిన ఆస్పత్రుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కలెక్టర్ ప్రతి నెల ఆస్పత్రుల నిర్మాణం పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు.
– డాక్టర్ బి.గౌరీశంకర్, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయధికారి (డీసీహెచ్‌ఎస్)
Comments
Please login to add a commentAdd a comment