డా. నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్‌.. | The Centre has announced Padma awards for a total of 139 people for 2025 | Sakshi
Sakshi News home page

డా. నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్‌..

Published Sun, Jan 26 2025 4:34 AM | Last Updated on Sun, Jan 26 2025 4:39 AM

The Centre has announced Padma awards for a total of 139 people for 2025

వైద్య రంగానికి ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపు 

దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక

నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్‌ 

మందకృష్ణ మాదిగ, మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ 

తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ఐదుగురికి పద్మ పురస్కారాలు 

2025కుగాను మొత్తం 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం  

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏఐజీ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ దువ్వూరు నాగేశ్వరరెడ్డిని దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌ వరించింది. దేశ వైద్య రంగానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను తెలంగాణ నుంచి ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఏపీ నుంచి కళల విభాగంలో పద్మ భూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది.

అలాగే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగతోపాటు కవి, పండితుడు, ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ, కె.ఎల్‌. కృష్ణ, మిరియాల అప్పారావు (మరణానంతరం), వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖిలను పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. 

76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 2025 ఏడాదికిగాను శనివారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 139 పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం అందులో ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. పురస్కారాల్లో 23 మంది గ్రహీతలు మహిళలు, 10 మంది విదేశీయులు/ఎన్‌ఆర్‌ఐలు ఉండగా 13 మందికి మరణానంతరం అవార్డులను ప్రకటించారు. పద్మ అవార్డుల్లో తెలంగాణకు రెండు, ఆంధ్రప్రదేశ్‌కు ఐదు అవార్డులు లభించాయి.

జాబితాలో మట్టిలో మాణిక్యాలు 
దేశ సామాజిక, సాంస్కృతిక పురోగతికి తమ సేవల ద్వారా తోడ్పడుతున్నప్పటికీ పెద్దగా గుర్తింపునకు నోచుకోకుండా మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోయిన 30 మందిని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలతో గౌరవించింది. వారిలో గోవా స్వాతంత్య్ర పోరాట యోధుడైన వందేళ్ల లిబియో లోబో సర్దేశాయ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళా డోలు కళాకారిణి గోకుల్‌ చంద్ర దే (57) తదితరులు ఉన్నారు.
 
దేశం గర్విస్తోంది: మోదీ 
పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ రంగాల్లో అసమాన విజయాలు సాధించిన వ్యక్తులను గౌరవించేందుకు దేశం గర్విస్తోందన్నారు. ఆయా రంగాలకు వారు అందిస్తున్న సేవలు, పనిపట్ల చూపుతున్న నిబద్ధత స్ఫూర్తిదాయకమన్నారు.

తెలంగాణకు అవమానం: సీఎం
సాక్షి, హైదరాబాద్‌: పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అవమానం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్‌ (పద్మవిభూషణ్‌), చుక్కా రామయ్య (పద్మభూషణ్‌), అందెశ్రీ (పద్మభూషణ్‌), గోరటి వెంకన్న (పద్మశ్రీ), జయధీర్‌ తిరుమలరావు (పద్మశ్రీ) వంటి ప్రముఖులను కేంద్రం పరిగణనలోకి తీసుకోకవడం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించడమేనని విమర్శించారు. 

మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి చర్చించారు. అదే సమయంలో తెలంగాణ, ఏపీ నుంచి ఎంపికైన ప్రముఖలకు సీఎం రేవంత్‌ అభినందనలు తెలిపారు. పద్మ పురస్కారాల్లో అన్యాయంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం.

అత్యుత్తమ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ 
సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచంలోని అత్యుత్తమ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ల్లో డాక్టర్‌ డి.నాగేశ్వర్‌ రెడ్డి (68) ఒకరు. కర్నూల్‌ మెడికల్‌ కాలేజీ నుంచి ఎంబీబీఎస్‌ చదివిన ఆయన 18 మార్చి 1956న విశాఖపట్నంలో జన్మించారు. ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ పేరిట ఆయన నెలకొల్పిన వైద్య సంస్థ దేశవ్యాప్తంగా అత్యుత్తమ వైద్య సంస్థగా పేరు గడించింది. 

గ్యాస్ట్రో ఎంటరాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ప్రఖ్యాత వైద్య సంస్థ నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌)లో, ప్రొఫెసర్‌గా గుంటూరు మెడికల్‌ కాలేజీలో విద్యార్థులకు వైద్యవిజ్ఞానాన్ని బోధించారు. తన కెరీర్‌లో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు. 2002లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్‌ పురస్కారాలు వరించాయి.   

వినమ్రంగా స్వీకరిస్తున్నా: నాగేశ్వరరెడ్డి 
‘పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నాను. ఇది నాకొక్కడికే దక్కినది కాదు... ప్రతిరోజూ నాలో నూతన స్ఫూర్తిని నింపే మా పేషెంట్స్, ఏఐజీ టీమ్, మా వైద్య సిబ్బందికి దక్కిన గౌరవం. తమ వ్యథాభరితమైన, అత్యంత క్లిష్టమైన క్షణాల్లో సైతం మమ్మల్ని పూర్తిగా విశ్వసించి, మాలో పట్టుదలను, సేవానిరతిని రగిలించే మా పేషెంట్స్‌కు అత్యుత్తమ వైద్యసేవలందించడంలో మేమెప్పుడూ ముందుంటాం. 

భారతీయుడిగా, ఈ తెలుగుగడ్డ మీద పుట్టిన వాడిగా ప్రజలందరికీ ఆరోగ్య సేవలందించడానికి పునరంకితమవుతున్నాను. నా దేశాన్ని ఆరోగ్యకరంగా, మరింతగా బలోపేతం చేయడానికి అనునిత్యం శ్రమిస్తాను’ అని నాగేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సహస్రావధానానికి సిసలైన బిరుదు 
మాడుగుల నాగఫణి శర్మ.. ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, ద్వి సహస్రావధాని. 1959, జూన్‌ 8న అనంతపురం జిల్లా, తాడిపత్రి తాలూకా, పుట్లూరు మండలంలోని కడవకొల్లు గ్రామంలో జన్మించారు. మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, ఢిల్లీ ర్రాష్టీయ సంస్కృత సంస్థాన్‌ నుంచి ‘శిక్షాశాస్త్రి’ పట్టా పొందారు. 

తిరుపతి ర్రాష్టీయ విద్యా పీఠం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందిన మాడుగుల.. 1985- 90 మధ్య కాలంలో కడప రామకృష్ణ జూనియర్‌ కళాశాలలో సంస్కృతోపన్యాసకుడిగా, 1990ృ92 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్తు అదనపు కార్యదర్శిగా పనిచేశారు. హైదరాబాద్‌ బర్కత్‌పురలో చాలాకాలంగా సరస్వతీ పీఠాన్ని నిర్వహిస్తున్నారు.  

అవధాన విద్యలో ఆరితేరిన నాగఫణి శర్మ మాజీ ప్రధానులు అటల్‌ బిహారీ వాజ్‌పేయి, పీవీ నరసింహారావు, మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ వంటి వారి సమక్షంలో ఆశువుగా... అలవోకగా అవధానాలు నిర్వహించి వారి ప్రశంసలు సైతం పొందారు. 

తన విద్యతో నాగఫణిశర్మ అవధాన సహస్రఫణి, బృహత్‌ ద్వి సహస్రావధాని, శతావధాని సమ్రాట్, శతావధాన చూడామణి, కళాసాహిత్య కల్పద్రుమ వంటి అనేక బిరుదులు పొందారు. ఇటీవలే ఆయన విశ్వభారతం అనే సంస్కృత మహాకావ్యాన్ని రచించారు.  

ప్రొఫెసర్‌.. రచయిత  సయ్యద్‌ ఐనుల్‌ హసన్‌ 
రాయదుర్గం: ప్రొఫెసర్‌ సయ్యద్‌ ఐనుల్‌ హసన్‌.. విద్యాపరంగా ప్రొఫెసర్, సాహిత్యపరంగా రచయిత. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 15 ఫిబ్రవరి 1957లో జన్మించారు. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలోని పర్షియన్‌ అండ్‌ సెంట్రల్‌ ఏషియన్‌ స్టడీస్‌ స్కూల్‌ ఆఫ్‌ లాంగ్వేజ్, లిటరేచర్‌ అండ్‌ కల్చర్‌ స్టడీస్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. కాటన్‌ కాలేజ్‌ స్టేట్‌ యూనివర్సిటీలోనూ విధులను నిర్వహించారు. 

ఆయన 23 జూలై 2021లో మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మను) వైస్‌చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ఇండోృఇరాన్‌ రిలేషన్స్, లిటరేటర్, కల్చర్‌ స్టడీస్, ఇండోలోజీ గ్లోబలైజేషన్, ఎడ్యుకేషన్‌ అంశాలపై ఆయన ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఆయనకు సతీమణి అర్షియాహసన్, పిల్లలు కమ్రాన్‌బద్ర్, అర్మాన్‌ హసన్‌ ఉన్నారు.  

ఉద్యమ ప్రస్థానం నుంచి... 
సాక్షి, హైదరాబాద్‌: మందకృష్ణ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం న్యూశాయంపేట గ్రామంలో 1965, జులై 7న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు మంద చిన్న కొమురయ్య, కొమురమ్మ. మాదిగ దండోరా, మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్‌)ని స్థాపించారు. ఎస్సీ వర్గీకరణ, ఎస్సీలోని కులాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో 1994 జులై 7న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామం నుంచి ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారు. మాదిగలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే అంశాన్ని ప్రచారం చేసి మాదిగలు, ఉపకులాల ప్రజలను చైతన్యపర్చారు. ఎస్సీ, ఎస్టీల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు చేయొచ్చని, ఈమేరకు వర్గీకరణ చేపట్టాలని, ఈ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు గత ఆగస్టులో ఇచ్చిన తీర్పు ఎమ్మార్పీఎస్‌ ఉద్యమానికి భారీ ఊరట అందించినట్‌లైంది.

ఆర్థికవేత్తల రూపశిల్పి 
సాక్షి, అమరావతి: ప్రొఫెసర్‌ కొసరాజు లీలా కృష్ణ.. కేఎల్‌గా, కేఎల్‌కేగా సుప్రసిద్ధులు. ఆర్థిక శాస్త్రం ఆచార్యులైన ఆయన అనేకమంది విద్యార్థులను ఆర్థికవేత్తలుగా తీర్చిదిద్ది దేశానికి అందించారు. షికాగో యూనివర్సిటీలో చదివిన ఆయన.. ప్రస్తుతం మద్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 

ఇండియా కేఎల్‌ఈఎంఎస్‌ ప్రొడక్టివిటీ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా అప్లైడ్‌ ఎకనామిక్స్, ఇండ్రస్టియల్‌ ఎకనామిక్స్, ప్రాంతీయ అసమానతలు, ఆర్థిక ఉత్పాదకత, సైద్ధాంతిక వాణిజ్యం తదితర సబ్జెక్టులు విద్యార్థులకు బోధించడమే కాకుండా, ఆ విభాగాల్లో విస్తృత పరిశోధనలూ చేశారు. ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో సుదీర్ఘకాలం ఆర్థిక శ్రాస్తాన్ని బోధించారు. 

ఇండియన్‌ ఎకనామిక్‌ సొసైటీకి 1996ృ97లో అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1997లో ఆయన రచించిన ఎకనోమెట్రిక్‌ అప్లికేషన్స్‌ ఇన్‌ ఇండియా గ్రంథాన్ని ఆర్థిక శాస్త్రంలో ప్రధాన విభాగాల్లో అధ్యయనానికి దిక్సూచిలా ఆర్థికవేత్తలు భావిస్తారు.

బుర్రకథ టైగర్‌ మిరియాల 
తాడేపల్లిగూడెం: పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన మిరియాల అప్పారావు బుర్రకథలో ప్రఖ్యాతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన ఆయన 1949 సెప్టెంబరు 9న మిరియాల వెంకట్రామయ్య, తిరుపతమ్మల రెండో సంతానంగా జన్మించారు. 

చక్కని రాగాలాపనతో పద్యాలు, పాటలు పాడటంతో రాగాల అప్పారావుగా పేరుగాంచారు. 1969లో బుర్రకథ రంగంలో అడుగు పెట్టారు. తొలి ఏడాదిలోనే తన చాతుర్యంతో అందరినీ అబ్బురపరిచి నడకుదురులో సువర్ణ ఘంఠా కంకణం పొందారు. 1974లో రేడియోలో పలు కార్యక్రమాలు చేశారు. 1993లో దూరదర్శన్‌లో బుర్రకథలు చెప్పారు. 

బుర్రకథ చెప్పడంలో నాజర్‌ను స్ఫురణకు తెచ్చే అప్పారావు గాన కోకిల, బుర్రకథ టైగర్‌ వంటి బిరుదులు సాధించారు. చింతామణి నాటకంలో బిళ్వమంగళుడు, శ్రీకృష్ణ తులాభారంలో శ్రీకృష్ణుడు వంటి పాత్రలను పోషించారు. ఈ ఏడాది జనవరి 15న ఆయన తుది శ్వాస విడిచారు.

సంస్కృత పండితుడు
సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వాదిరాజ్‌ పంచముఖి ప్రఖ్యాత సంస్కృత పండితుడు, ఆర్థికవేత్త. 1936 సెప్టెంబర్‌ 17న కర్ణాటకలోని «బాగల్కోట్‌లో జన్మించారు. కర్ణాటక, బాంబే విశ్వవిద్యాలయాలతో పాటు, ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో విద్యనభ్యసించారు. ఆర్థిక రంగంలో విశేష కృషి చేసి అనేక పరిశోధన వ్యాసాలు రాశారు. అవి అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 

సంస్కృతంలో అనేక పుస్తకాలు, కవితలు రచించారు. తిరుపతిలోని ర్రాష్టీయ సంస్కృత విద్యా పీఠ్‌ చాన్స్‌లర్‌గా రెండు పర్యాయాలు సేవలందించారు. టీటీడీ బోర్డ్‌ మెంబర్‌గా పనిచేశారు. సంస్కృతంలో రాష్ట్రపతి ప్రసంశ పత్రంలో పాటు అనేక అవార్డులను అందుకున్నారు.   

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement