Padma Vibhushan award
-
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి: ప్రఖ్యాత వైద్యులు డా.నాగేశ్వర్‌రెడ్డికి కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించటంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం(జనవరి26) వైఎస్జగన్ ఎక్స్(ట్విటర్)లో ఒక ట్వీట్ చేశారు.‘విఖ్యాత వైద్యులు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డిగారికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించిన సందర్భంగా ఆయనకు నా శుభాకాంక్షలు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో ఆయన చేసిన పరిశోధనలు వైద్యరంగంలో గొప్పగా నిలిచిపోతాయి. మంచి హస్తవాసి ఉన్న వైద్యుడు నాగేశ్వరరెడ్డి. రోగులకు ఆత్మీయత పంచడమేకాదు, వారు తిరిగి కోలుకునేందుకు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే గొప్ప మనసు ఆయనది. కొత్త కొత్త వ్యాధులకు చికిత్స అందించడంలో నాగేశ్వర్‌రెడ్డి సేవలు విశేషమైనవి. అత్యాధునిక వైద్య పద్ధతులు,చికిత్సా విధానాలను తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా విస్తరించడంలో ఆయనది కీలక పాత్ర. డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డిని దేశం గొప్పగా గౌరవించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం’ వైఎస్ జగన్ పేర్కొన్నారు.విఖ్యాత వైద్యులు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డిగారికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో చేసిన పరిశోధనలు వైద్యరంగంలో గొప్పగా నిలిచిపోతాయి. మంచి హస్తవాసి ఉన్న వైద్యుడు ఆయన. రోగులకు ఆత్మీయత పంచడమేకాదు, వారు తిరిగి…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 26, 2025కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు వారైన గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్ దక్కడంపై ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. -
Padma awards 2025: పారిశ్రామిక పద్మాలు
ముంబై: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు (Padma awards 2025) ప్రకటించింది. వీరిలో వాణిజ్యం, పరిశ్రమల విభాగం నుంచి 10 మంది ఉన్నారు. జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ సుజుకీ మోటార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, దివంగత ఒసాము సుజుకీని (మరణానంతరం) పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. తమిళనాడుకు చెందిన టెక్స్టైల్ పారిశ్రామికవేత్త నల్లి కుప్పుస్వామి చెట్టి, జైడస్ లైఫ్‌సైన్సెస్ చైర్మన్ పంకజ్ పటేల్ పద్మ భూషణ్ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఇక ఎస్బీఐ మాజీ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్యతోపాటు ఓంకార్ సింగ్ పాహ్వా (అవాన్ సైకిల్స్), పవన్ గోయెంకా (మహీంద్రా), ప్రశాంత్ ప్రకాశ్ (యాక్సెల్ పార్ట్ న ర్స్), ఆర్జీ చంద్రమోగన్ (హట్సన్ ఆగ్రో ప్రొడెక్ట్స్), సజ్జన్ భజంకా (సెంచురీ ప్లైబోర్డ్స్), సాలీ హోల్క ర్కు (రేష్వా సొసైటీ) పద్మశ్రీ అవార్డు వరించింది.ఒసాము సుజుకీ1930 జనవరి 30న జపాన్‌లోని గేరోలో జన్మించారు. సుజుకీ మోటార్ కార్పొరేషన్ 1981లో భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ పేరుతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. తర్వాతి కాలంలో మారుతీ సుజుకీ ఇండియాగా కంపెనీ అవతరించింది. దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి విదేశీ కంపెనీ కూడా ఇదే. భారత ప్రభుత్వం ఒసాము సేవలు గుర్తించి 2007లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2024 డిసెంబర్ 25న మరణించారు.నల్లి కుప్పుస్వామి చెట్టితమిళనాడుకు చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త. కాంచీపురంలో 1940 నవంబర్ 9న జన్మించారు. రామకృష్ణ మిషన్ స్కూల్ విద్యాభ్యాసం చేశారు. వాషింగ్టన్ వర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో పట్టా అందుకున్నారు. వారసత్వ వ్యాపారమైన నల్లీ సిల్క్ పగ్గాలను 1958లో చేపట్టారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి 2000లో కలైమమణి అవార్డు, భారత ప్రభుత్వం నుంచి 2003లో పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. పంకజ్ పటేల్1953లో జన్మించారు. తండ్రి స్థాపించిన క్యాడిలా హెల్త్‌కేర్‌లో (ప్రస్తుతం జైడస్ లైఫ్‌సైన్సెస్) 1976లో చేరారు. క్యాడిలా ఫ్యాక్టరీకి ఎనమిదేళ్ల వయసు నుంచే తండ్రితో కలిసి వెళ్లే వారు. కంపెనీ తయారీ షుగర్‌ఫ్రీ, ఎవర్‌యూత్ బ్రాండ్లు ప్రాచుర్యం పొందాయి. 70కిపైగా దేశా లకు కంపెనీ విస్తరించింది. భారత్‌లో అయిదవ అతిపెద్ద ఫార్మా సంస్థగా ఎదగడంలో కీలకపాత్ర పోషించారు. 2024 అక్టోబర్‌లో ఫోర్బ్స్‘భారత 100 మంది సంపన్నుల’ జాబితాలో 10.2 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో 24 ర్యాంకులో నిలిచారు.అరుంధతీ భట్టాచార్య సేల్స్‌ఫోర్స్ ఇండియా చైర్పర్సన్, సీఈవోగా ఉన్నా రు. 1977లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరారు. 2013లో ఎస్బీఐ చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్య తలు చేపట్టారు. 200 ఏళ్ల ఎస్బీఐ చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా వినుతికెక్కారు. బ్యాంకు మహిళా ఉద్యోగులకు ప్రసూతి లేదా పెద్దల సంరక్షణ కోసం రెండేళ్ల విశ్రాంతి సెలవు విధానాన్ని ప్రవేశపెట్టారు. భారత ఆర్థిక రంగంలో 40 ఏళ్లకుపైగా అనుభవం ఆమె సొంతం. ఫోర్బ్స్ ప్రకటించిన ‘ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల’ జాబితాలో చోటు సంపాదించారు. -
డా. నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డిని దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ వరించింది. దేశ వైద్య రంగానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను తెలంగాణ నుంచి ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఏపీ నుంచి కళల విభాగంలో పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.అలాగే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగతోపాటు కవి, పండితుడు, ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ, కె.ఎల్. కృష్ణ, మిరియాల అప్పారావు (మరణానంతరం), వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖిలను పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 2025 ఏడాదికిగాను శనివారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 139 పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం అందులో ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. పురస్కారాల్లో 23 మంది గ్రహీతలు మహిళలు, 10 మంది విదేశీయులు/ఎన్ఆర్ఐలు ఉండగా 13 మందికి మరణానంతరం అవార్డులను ప్రకటించారు. పద్మ అవార్డుల్లో తెలంగాణకు రెండు, ఆంధ్రప్రదేశ్‌కు ఐదు అవార్డులు లభించాయి.జాబితాలో మట్టిలో మాణిక్యాలు దేశ సామాజిక, సాంస్కృతిక పురోగతికి తమ సేవల ద్వారా తోడ్పడుతున్నప్పటికీ పెద్దగా గుర్తింపునకు నోచుకోకుండా మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోయిన 30 మందిని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలతో గౌరవించింది. వారిలో గోవా స్వాతంత్య్ర పోరాట యోధుడైన వందేళ్ల లిబియో లోబో సర్దేశాయ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళా డోలు కళాకారిణి గోకుల్ చంద్ర దే (57) తదితరులు ఉన్నారు. దేశం గర్విస్తోంది: మోదీ పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ రంగాల్లో అసమాన విజయాలు సాధించిన వ్యక్తులను గౌరవించేందుకు దేశం గర్విస్తోందన్నారు. ఆయా రంగాలకు వారు అందిస్తున్న సేవలు, పనిపట్ల చూపుతున్న నిబద్ధత స్ఫూర్తిదాయకమన్నారు.తెలంగాణకు అవమానం: సీఎంసాక్షి, హైదరాబాద్: పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అవమానం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్ (పద్మవిభూషణ్), చుక్కా రామయ్య (పద్మభూషణ్), అందెశ్రీ (పద్మభూషణ్), గోరటి వెంకన్న (పద్మశ్రీ), జయధీర్ తిరుమలరావు (పద్మశ్రీ) వంటి ప్రముఖులను కేంద్రం పరిగణనలోకి తీసుకోకవడం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించడమేనని విమర్శించారు. మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి చర్చించారు. అదే సమయంలో తెలంగాణ, ఏపీ నుంచి ఎంపికైన ప్రముఖలకు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. పద్మ పురస్కారాల్లో అన్యాయంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం.అత్యుత్తమ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోని అత్యుత్తమ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ల్లో డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి (68) ఒకరు. కర్నూల్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ చదివిన ఆయన 18 మార్చి 1956న విశాఖపట్నంలో జన్మించారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ పేరిట ఆయన నెలకొల్పిన వైద్య సంస్థ దేశవ్యాప్తంగా అత్యుత్తమ వైద్య సంస్థగా పేరు గడించింది. గ్యాస్ట్రో ఎంటరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ప్రఖ్యాత వైద్య సంస్థ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో, ప్రొఫెసర్‌గా గుంటూరు మెడికల్ కాలేజీలో విద్యార్థులకు వైద్యవిజ్ఞానాన్ని బోధించారు. తన కెరీర్లో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు. 2002లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. వినమ్రంగా స్వీకరిస్తున్నా: నాగేశ్వరరెడ్డి ‘పద్మవిభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నాను. ఇది నాకొక్కడికే దక్కినది కాదు... ప్రతిరోజూ నాలో నూతన స్ఫూర్తిని నింపే మా పేషెంట్స్, ఏఐజీ టీమ్, మా వైద్య సిబ్బందికి దక్కిన గౌరవం. తమ వ్యథాభరితమైన, అత్యంత క్లిష్టమైన క్షణాల్లో సైతం మమ్మల్ని పూర్తిగా విశ్వసించి, మాలో పట్టుదలను, సేవానిరతిని రగిలించే మా పేషెంట్స్‌కు అత్యుత్తమ వైద్యసేవలందించడంలో మేమెప్పుడూ ముందుంటాం. భారతీయుడిగా, ఈ తెలుగుగడ్డ మీద పుట్టిన వాడిగా ప్రజలందరికీ ఆరోగ్య సేవలందించడానికి పునరంకితమవుతున్నాను. నా దేశాన్ని ఆరోగ్యకరంగా, మరింతగా బలోపేతం చేయడానికి అనునిత్యం శ్రమిస్తాను’ అని నాగేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సహస్రావధానానికి సిసలైన బిరుదు మాడుగుల నాగఫణి శర్మ.. ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, ద్వి సహస్రావధాని. 1959, జూన్ 8న అనంతపురం జిల్లా, తాడిపత్రి తాలూకా, పుట్లూరు మండలంలోని కడవకొల్లు గ్రామంలో జన్మించారు. మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, ఢిల్లీ ర్రాష్టీయ సంస్కృత సంస్థాన్ నుంచి ‘శిక్షాశాస్త్రి’ పట్టా పొందారు. తిరుపతి ర్రాష్టీయ విద్యా పీఠం నుంచి పీహెచ్డీ పట్టా పొందిన మాడుగుల.. 1985- 90 మధ్య కాలంలో కడప రామకృష్ణ జూనియర్ కళాశాలలో సంస్కృతోపన్యాసకుడిగా, 1990ృ92 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్తు అదనపు కార్యదర్శిగా పనిచేశారు. హైదరాబాద్ బర్కత్‌పురలో చాలాకాలంగా సరస్వతీ పీఠాన్ని నిర్వహిస్తున్నారు. అవధాన విద్యలో ఆరితేరిన నాగఫణి శర్మ మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్‌పేయి, పీవీ నరసింహారావు, మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ వంటి వారి సమక్షంలో ఆశువుగా... అలవోకగా అవధానాలు నిర్వహించి వారి ప్రశంసలు సైతం పొందారు. తన విద్యతో నాగఫణిశర్మ అవధాన సహస్రఫణి, బృహత్ ద్వి సహస్రావధాని, శతావధాని సమ్రాట్, శతావధాన చూడామణి, కళాసాహిత్య కల్పద్రుమ వంటి అనేక బిరుదులు పొందారు. ఇటీవలే ఆయన విశ్వభారతం అనే సంస్కృత మహాకావ్యాన్ని రచించారు. ప్రొఫెసర్.. రచయిత సయ్యద్ ఐనుల్ హసన్ రాయదుర్గం: ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్.. విద్యాపరంగా ప్రొఫెసర్, సాహిత్యపరంగా రచయిత. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 15 ఫిబ్రవరి 1957లో జన్మించారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని పర్షియన్ అండ్ సెంట్రల్ ఏషియన్ స్టడీస్ స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ కల్చర్ స్టడీస్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. కాటన్ కాలేజ్ స్టేట్ యూనివర్సిటీలోనూ విధులను నిర్వహించారు. ఆయన 23 జూలై 2021లో మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మను) వైస్‌చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ఇండోృఇరాన్ రిలేషన్స్, లిటరేటర్, కల్చర్ స్టడీస్, ఇండోలోజీ గ్లోబలైజేషన్, ఎడ్యుకేషన్ అంశాలపై ఆయన ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఆయనకు సతీమణి అర్షియాహసన్, పిల్లలు కమ్రాన్‌బద్ర్, అర్మాన్ హసన్ ఉన్నారు. ఉద్యమ ప్రస్థానం నుంచి... సాక్షి, హైదరాబాద్: మందకృష్ణ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం న్యూశాయంపేట గ్రామంలో 1965, జులై 7న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు మంద చిన్న కొమురయ్య, కొమురమ్మ. మాదిగ దండోరా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్)ని స్థాపించారు. ఎస్సీ వర్గీకరణ, ఎస్సీలోని కులాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో 1994 జులై 7న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామం నుంచి ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారు. మాదిగలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే అంశాన్ని ప్రచారం చేసి మాదిగలు, ఉపకులాల ప్రజలను చైతన్యపర్చారు. ఎస్సీ, ఎస్టీల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు చేయొచ్చని, ఈమేరకు వర్గీకరణ చేపట్టాలని, ఈ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు గత ఆగస్టులో ఇచ్చిన తీర్పు ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి భారీ ఊరట అందించినట్లైంది.ఆర్థికవేత్తల రూపశిల్పి సాక్షి, అమరావతి: ప్రొఫెసర్ కొసరాజు లీలా కృష్ణ.. కేఎల్‌గా, కేఎల్‌కేగా సుప్రసిద్ధులు. ఆర్థిక శాస్త్రం ఆచార్యులైన ఆయన అనేకమంది విద్యార్థులను ఆర్థికవేత్తలుగా తీర్చిదిద్ది దేశానికి అందించారు. షికాగో యూనివర్సిటీలో చదివిన ఆయన.. ప్రస్తుతం మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇండియా కేఎల్ఈఎంఎస్ ప్రొడక్టివిటీ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా అప్లైడ్ ఎకనామిక్స్, ఇండ్రస్టియల్ ఎకనామిక్స్, ప్రాంతీయ అసమానతలు, ఆర్థిక ఉత్పాదకత, సైద్ధాంతిక వాణిజ్యం తదితర సబ్జెక్టులు విద్యార్థులకు బోధించడమే కాకుండా, ఆ విభాగాల్లో విస్తృత పరిశోధనలూ చేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సుదీర్ఘకాలం ఆర్థిక శ్రాస్తాన్ని బోధించారు. ఇండియన్ ఎకనామిక్ సొసైటీకి 1996ృ97లో అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1997లో ఆయన రచించిన ఎకనోమెట్రిక్ అప్లికేషన్స్ ఇన్ ఇండియా గ్రంథాన్ని ఆర్థిక శాస్త్రంలో ప్రధాన విభాగాల్లో అధ్యయనానికి దిక్సూచిలా ఆర్థికవేత్తలు భావిస్తారు.బుర్రకథ టైగర్ మిరియాల తాడేపల్లిగూడెం: పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన మిరియాల అప్పారావు బుర్రకథలో ప్రఖ్యాతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన ఆయన 1949 సెప్టెంబరు 9న మిరియాల వెంకట్రామయ్య, తిరుపతమ్మల రెండో సంతానంగా జన్మించారు. చక్కని రాగాలాపనతో పద్యాలు, పాటలు పాడటంతో రాగాల అప్పారావుగా పేరుగాంచారు. 1969లో బుర్రకథ రంగంలో అడుగు పెట్టారు. తొలి ఏడాదిలోనే తన చాతుర్యంతో అందరినీ అబ్బురపరిచి నడకుదురులో సువర్ణ ఘంఠా కంకణం పొందారు. 1974లో రేడియోలో పలు కార్యక్రమాలు చేశారు. 1993లో దూరదర్శన్‌లో బుర్రకథలు చెప్పారు. బుర్రకథ చెప్పడంలో నాజర్‌ను స్ఫురణకు తెచ్చే అప్పారావు గాన కోకిల, బుర్రకథ టైగర్ వంటి బిరుదులు సాధించారు. చింతామణి నాటకంలో బిళ్వమంగళుడు, శ్రీకృష్ణ తులాభారంలో శ్రీకృష్ణుడు వంటి పాత్రలను పోషించారు. ఈ ఏడాది జనవరి 15న ఆయన తుది శ్వాస విడిచారు.సంస్కృత పండితుడుసాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వాదిరాజ్ పంచముఖి ప్రఖ్యాత సంస్కృత పండితుడు, ఆర్థికవేత్త. 1936 సెప్టెంబర్ 17న కర్ణాటకలోని «బాగల్కోట్లో జన్మించారు. కర్ణాటక, బాంబే విశ్వవిద్యాలయాలతో పాటు, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో విద్యనభ్యసించారు. ఆర్థిక రంగంలో విశేష కృషి చేసి అనేక పరిశోధన వ్యాసాలు రాశారు. అవి అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. సంస్కృతంలో అనేక పుస్తకాలు, కవితలు రచించారు. తిరుపతిలోని ర్రాష్టీయ సంస్కృత విద్యా పీఠ్ చాన్స్‌లర్‌గా రెండు పర్యాయాలు సేవలందించారు. టీటీడీ బోర్డ్ మెంబర్‌గా పనిచేశారు. సంస్కృతంలో రాష్ట్రపతి ప్రసంశ పత్రంలో పాటు అనేక అవార్డులను అందుకున్నారు. -
ఒసాము సుజుకికి పద్మవిభూషణ్
దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమాలలో భారత రాష్ట్రపతి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.భారత ఆటోమొబైల్ పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చేసిన జపనీస్ వ్యాపారవేత్త 'ఒసాము సుజుకీ' (Osamu Suzuki)కి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ విభూషణ్ (Padma Vibhushan) పురస్కారాన్ని ప్రకటించింది. చిన్న-కార్ల స్పెషలిస్ట్ సుజుకి మోటార్‌ను అంతర్జాతీయ బ్రాండ్‌గా అభివృద్ధి చేసిన ఒసాము సుజుకికి మరణానంతరం ఈ అవార్డ్ ప్రకటించడం గమనార్హం. అసాధారణమైన, విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. అలాగే ఎస్బీఐ మాజీ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్యకు (Arundhati Bhattacharya) పద్మశ్రీ అవార్డ్ లభించింది.ఒసాము సుజుకీ గత డిసెంబర్లో 94 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. భారత్‌లో ఆటోమొబైల్ కంపెనీ ఏర్పాటుకు ఏ ఒక్క విదేశీ సంస్థ ముందుకురాని రోజుల్లో.. ఆర్థిక వ్యవస్థను గ్లోబలైజేషన్‌కు ద్వారాలు తెరవక ముందే, లైసెన్స్ రాజ్ కాలంలో ఒసాము సుజుకీ తీసుకున్న నిర్ణయం దేశ పారిశ్రామిక రంగంలో చిరస్థాయిలో నిలిచిపోతుంది.జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ 1981లో భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో (జాయింట్ వెంచర్) మారుతి ఉద్యోగ్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించింది ఆయనే. 2007లో కేంద్ర ప్రభుత్వం తన పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో కంపెనీ పేరు మారుతి సుజుకీగా మారింది.ఆ తర్వాత మెజారిటీ వాటాతో సుజుకీ మోటార్ కార్పొరేషన్ ఏకైక ప్రమోటర్‌గా అవతరించింది. తుదిశ్వాస విడిచే వరకు మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఒసాము సేవలు అందించారు. మాలిగ్నెంట్ లింఫోమా (కేన్సర్‌లో ఒక రకం) కారణంగా ఈ నెల 25న ఒసాము సుజుకీ మరణించినట్టు సుజుకీ మోటార్ కార్పొరేషన్ శుక్రవారం ప్రకటించింది. ‘‘ఆయన దూరదృష్టి, భవిష్యత్‌పై సానుకూల దృక్పథం, రిస్క్ తీసుకునే తత్వం, భారత్ పట్ల ప్రగాఢమైన ప్రేమ అనేవి లేకుంటే, భారత ఆటోమొబైల్ పరిశ్రమ నేడు ఇంత శక్తివంతంగా మారి ఉండేది కాదు’’అని మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) చైర్మన్ ఆర్సీ భార్గవ వ్యాఖ్యానించారు.నేడు భారత్‌లో లక్షలాది మంది మెరుగైన జీవనం వెనుక ఆయన కృషి ఉందన్నారు. ఆటోమొబైల్ రంగం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు ఒసాము అందించిన విశేష సేవలను గుర్తించిన కేంద్ర సర్కారు.. 2007లో పద్మభూషణ్ అవార్డుతో ఆయన్ను సత్కరించింది. 1958లో సుజుకీలో చేరిక..1930 జనవరి 30న జన్మించిన ఒసాము సుజుకి, చువో యూనివర్సిటీ, ఫాకుల్టీ ఆఫ్ లా నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. 1958లో సుజుకీ మోటార్ కంపెనీలోనే చేరారు. 1963లో డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1967లో మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు. 1978లో ప్రెసిడెంట్; సీఈవోగా, 2000 జూన్‌లో సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు చైర్మన్, సీఈవోగా నియమితులయ్యారు. ‘‘మారుతి సుజుకీ రూపంలో ఆయన అందించిన అసాధారణ సేవలు భారత ఆటోమొబైల్ ముఖచిత్రాన్ని విప్లవాత్మకంగా మార్చడమే కాదు, భారత్–జపాన్ మధ్య బంధాన్ని బలోపేతం చేశాయి. -
అందుకే నేను రాజకీయాల నుంచి బయటకొచ్చాను: చిరంజీవి
పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం ఆత్మీయ సన్మానం సభ నేడు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులను దక్కించుకున్న వారందరినీ సత్కరించి గౌరవించింది. అందులో భాగంగా నేడు మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ సభలో చిరంజీవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'పద్మభూషణ్ వచ్చినప్పుడు ఉన్నంత సంతోషం పద్మవిభూషణ్ వచ్చినందుకు లేదు. కానీ ఆ తర్వాత ఎంతో మంది ప్రతిరోజు నన్ను ఆశీర్వదిస్తుంటే నాకు సంతోషం కలిగింది. పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా సన్మానం చేయడం ఇదే ప్రథమం. గద్దర్ పేరుతో నంది అవార్డులు ఇవ్వడం శుభ శూచకం. నేడు తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరాయి. పద్మశ్రీ అవార్డులు ప్రకటించాక చాలాసేపటికి పద్మవిభూషన్ ప్రకటించడం వెనుక ప్రధాని మోదీ వ్యూహం ఉంది. ముందుగా పద్మశ్రీ అవార్డులు బడుగు బలహీన వర్గాల పేర్లను ఇవ్వాలని చెప్పిన ఆలోచన మోదీదే.. దీనిని ఎవరైనా అభినందించాల్సిందే. నరేంద్ర మోదీ పట్ల నాకు అత్యంత గౌరం వుంది. కళను గుర్తించి అవార్డులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వాగ్ధాటికి నేను పెద్ద అభిమానిని. ఆయన మాటలు ఎందరినో ప్రభావితం చేస్తాయి. రాజకీయాల్లో ఆయన ఎంతో హుందాతనం చూపారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. పాలిటిక్స్‌లో వ్యక్తిగత విమర్శలు తగవు... ప్రస్తుత రాజకీయాలు వ్యక్తిగత విమర్శలతో నడుస్తున్నాయి. వ్యక్తిగత విమర్శల వల్లే నేను రాజకీయాల నుంచి బయటకు రావాల్సి వచ్చింది. దుర్భాషలు, వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్లను తిప్పికొట్టే విధంగా ఉంటేనే రాజకీయాల్లో కొనసాగవచ్చేనే పరిస్థితి నేడు ఉంది.' అని చిరంజీవి అన్నారు. -
మెగాస్టార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నటుడు అలీ..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ప్రముఖ నటుడు, కమెడియన్ అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల గణతంత్ర వేడుకల సందర్భంగా పద్మ విభూషణ్ పొందిన చిరుకు ఆయన అభినందనలు తెలిపారు. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ చరిత్రలో అక్కినేని తర్వాత ఈ అవార్డ్ అందుకున్న నటుడిగి మెగాస్టార్ ఘనత సాధించారు. అంతే కాకుండా టాలీవుడ్ డైరెక్టర్స్ బాబీ, గోపించద్ మలినేని, నిర్మాతలు నవీన్ యేర్నేని, వై రవిశంకర్ కూడా మెగాస్టార్‌ను అభినందించారు. కాగా.. మెగాస్టార్ ప్రస్తుతం బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్నీ అప్డేట్స్ రానున్నాయి. Blockbuster directors @dirbobby, @megopichand, Producers #NaveenYerneni, @mythriravi & comedian #Ali met and conveyed their best regards to #PadmaVibhushanChiranjeevi garu for being bestowed with the prestigious #PadmaVibhushan award ✨@Kchirutweets @MythriOfficial… pic.twitter.com/0z8YD9DG5U — Telugu FilmNagar (@telugufilmnagar) January 30, 2024 -
మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు
-
మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ వీడియో
-
చిరంజీవి, వెంకయ్య నాయుడులకు పద్మ విభూషణ్ పురస్కారాలు
-
వెంకయ్యనాయుడు, చిరంజీవి ‘విభూషణులు’.. సీఎం జగన్, సీఎం రేవంత్ హర్షం
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి నెట్వర్క్: తెలుగు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారాలు వరించాయి. ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌కు ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికిగాను మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించారు. వీటిలో ఐదు పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, మిగతా 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రమణ్యం, సామాజికవేత్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, అలనాటి బాలీవుడ్ నటి వైజయంతిమాల బాలిని కూడా పద్మ విభూషణ్ వరించింది. పద్మభూషణ్ ప్రకటించిన వారిలో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ, సినీనటుడు విజయ్‌కాంత్, ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, నేపథ్య గాయని ఉషా ఉతుప్, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్యారేలాల్ శర్మ తదితరులున్నారు. వీరిలో ఫాతిమా, పాఠక్, విజయ్‌కాంత్ సహా 9 మందికి మరణానంతరం పురస్కారాలు దక్కాయి. తెలంగాణ, ఏపీల నుంచి ఆరుగురికి.. తెలంగాణ నుంచి ఐదుగురికి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో తెలంగాణ నుంచి బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, కూరెళ్ల విఠలాచార్య, కెతావత్ సోమ్లాల్, ఎ.వేలు ఆనందచారి, ఏపీ నుంచి హరికథా కళాకారిణి డి.ఉమా మహేశ్వరి ఉన్నారు. పద్మశ్రీ గ్రహీతల్లో 34 మందికి ‘అన్సంగ్ హీరోస్’ పేరిట పురస్కారం దక్కింది. క్రీడారంగం నుంచి టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చినప్ప, హాకీ క్రీడాకారుడు హర్బిందర్ సింగ్ సహా ఏడుగురికి పద్మశ్రీ లభించింది. పురస్కార గ్రహీతల్లో మొత్తం 30 మంది మహిళలున్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను నాలుగేళ్ల విరామం అనంతరం బిహార్ దివంగత ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు మంగళవారం ప్రకటించడం తెలిసిందే. పద్మ అవార్డుల వివరాలివీ.. పద్మ విభూషణ్ (ఐదుగురికి): వైజయంతిమాల బాలి (కళారంగం–తమిళనాడు), కొణిదెల చిరంజీవి (కళారంగం–ఆంధ్రప్రదేశ్), ఎం.వెంకయ్యనాయుడు (ప్రజావ్యవహారాలు–ఆంధ్రప్రదేశ్), బిందేశ్వర్ పాఠక్ (సామాజిక సేవ–బిహార్), పద్మా సుబ్రమణ్యం (కళారంగం–తమిళనాడు). పద్మభూషణ్ (17 మందికి): ఫాతిమా బీవీ (మరణానంతరం–ప్రజా వ్యవహారాలు–కేరళ), హోర్మూస్ జీ ఎన్.కామా (సాహిత్యం, విద్య, జర్నలిజం–మహారాష్ట్ర), మిథున్ చక్రవర్తి (కళారంగం–పశ్చిమబెంగాల్), సీతారాం జిందాల్ (వర్తకం–పరిశ్రమలు–కర్నాటక), యంగ్ లియు (వర్తకం–పరిశ్రమలు–తైవాన్), అశ్విన్ బాలచంద్ మెహతా (వైద్యం–మహారాష్ట్ర), సత్యబ్రత ముఖర్జీ (మరణానంతరం–ప్రజా వ్యవహారాలు–పశి్చమ బెంగాల్), రాంనాయక్ (ప్రజా వ్యవహారాలు–మహారాష్ట్ర), తేజస్ మధుసూదన్ పటేల్ (వైద్యం–గుజరాత్), ఓలంచెరి రాజగోపాల్ (ప్రజా వ్యవహారాలు–కేరళ), దత్తాత్రేయ్ అంబాదాస్ మయలూ అలియాస్ రాజ్ దత్ (కళారంగం–మహారాష్ట్ర), తోగ్డన్ రింపోచే (ఆధ్యాత్మికత–లద్దాఖ్), ప్యారేలాల్ శర్మ (కళారంగం–మహారాష్ట్ర), చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ (వైద్యం–బిహార్), ఉషా ఉతుప్ (కళారంగం–మహారాష్ట్ర), విజయ్‌కాంత్ (మరణానంతరం–కళారంగం–తమిళనాడు), కుందన్ వ్యాస్ (సాహిత్యం, విద్య, జర్నలిజం–మహారాష్ట్ర) – పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన 110 మందిలో గోండా చిత్రకార దంపతులు శాంతిదేవీ పాశ్వాన్, శివన్ పాశ్వాన్ తదితరులున్నారు. బాధ్యతను పెంచింది ‘‘దేశం అమృత కాలం దిశగా అభివృద్ధి పథంలో సాగుతున్న తరుణంలో ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నా. ఇది నా బాధ్యతను మరింతగా పెంచింది. రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికీ పురస్కారాన్ని అంకితం చేస్తున్నా’’ – ఎం.వెంకయ్యనాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి సంస్కృతిని, కళలను చాటి చెప్పారు: రేవంత్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో నైపుణ్యం, కృషితో వారు ఉన్నత అవార్డులకు ఎంపికయ్యారని.. సంస్కృతిని, కళలను దేశమంతటికీ చాటిచెప్పారని ప్రశంసించారు. తెలుగువారికి పద్మాలు గర్వకారణం: ఏపీ సీఎం జగన్ తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైనవారిని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవిలకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రకటించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ‘పద్మ’ అవార్డులను దక్కించుకున్న వారిని అభినందించారు, వారు మనకు గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. తెలుగు వెలుగులకు శనార్తులు: బండి సంజయ్ పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వెలుగులకు తెలంగాణ శనార్తులు చెబుతోందని పేర్కొన్నారు. -
మెగాస్టార్.. ఇకపై పద్మ విభూషణ్ చిరంజీవి
టాలీవుడ్ మెగాస్టార్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అవార్డుల్లో మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది. ఇప్పటికే అవార్డుల రారాజుగా నిలిచిన మెగాస్టార్‌కు మరో అత్యున్నతమైన ఘనతను సొంతం చేసుకున్నారు. సినీ ప్రియులు, అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్న చిరును పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు సొంతం చేసుకున్నారు. నటుడిగా 1978లో కెరీర్ ప్రారంభించిన ఆయన అలుపెరగకుండా సినిమాలు చేశారు. అందులో భాగంగానే ఆయన ఎన్నో అవార్డులను కూడా సాధించారు. మెగాస్టార్‌కు పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఆయనకు దక్కిన అవార్డులపై ఓ లుక్కేద్దాం. సినీ రంగానికి మెగాస్టార్ చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది. ఇక 1987లో స్వయం కృషి సినిమా, 1992లో ఆపద్బాంధవుడు, 2002లో ఇంద్ర సినిమాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకున్నారు. అలాగే శుభలేఖ (1982), విజేత (1985), ఆపద్బాంధవుడు (1992), ముఠామేస్త్రి (1993), స్నేహంకోసం (1999), ఇంద్ర (2002), శంకర్ దాదా ఎంబీబీఎస్ (2004) చిత్రాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 2006లో సౌత్ ఫర్ హానరరీ లెజెండరీ యాక్టింగ్ కెరీర్ పేరిట చిరంజీవి స్పెషల్ అవార్డును ఫిలింఫేర్ అవార్డుల్లో భాగంగా అందుకున్నారు. అంతే కాకుండా 2010లో ఆయనకు ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు దక్కింది. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2006లో చిరంజీవికి ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. అంతేకాకుండా 1987లో దక్షిణ భారతదేశం నుంచి ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం విశేషం. -
ప్రముఖ చరిత్రకారుడు, రచయిత, బాబాసాహెబ్ పురందరే మృతి
-
మాటలకందని బాధను అనుభవిస్తున్నాను: మోదీ
న్యూఢిల్లీ: ప్రముఖ చరిత్రకారుడు, రచయిత, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత బాబాసాహెబ్ పురందరే(99) సోమవారం ఉదయం మరణించారు. పురందరే మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పురందరే మరణం తనకు మాటలకు అందని బాధను కలిగించిందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మోదీ తన అధికారిక ట్విటర్లో ‘‘మాటలకందని బాధను అనుభవిస్తున్నాను. శివషాహీర్ బాబాసాహెబ్ పురందరే మరణం చరిత్ర,సాంస్కృతిక ప్రపంచంలో అతి పెద్ద శూన్యతను మిగిల్చింది. రానున్న తరాలు ఛత్రపతి శివాజీ మహారాజ్‌తో మరింత కనెక్ట్ అయ్యేలా చేసేందుకు గాను పురందరే చేసిన కృషికి కృతజ్ఞతలు. ఆయన ఇతర రచనలు కూడా గుర్తుండిపోతాయి’’ అని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. (చదవండి: పద్మ విభూషణ్ వెనక్కి ఇస్తున్న: మాజీ సీఎం) I am pained beyond words. The demise of Shivshahir Babasaheb Purandare leaves a major void in the world of history and culture. It is thanks to him that the coming generations will get further connected to Chhatrapati Shivaji Maharaj. His other works will also be remembered. pic.twitter.com/Ehu4NapPSL — Narendra Modi (@narendramodi) November 15, 2021 అంతేకాక ‘‘పురందరే చాలా చమత్కారంగా మాట్లాడే వ్యక్తి మాత్రమే కాక భారతదేశ చరిత్ర గురించి ఆయనకు అపార జ్ఞానం ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగిన ఘనత నాకు లభించింది. కొన్ని నెలల క్రితం, ఆయన శతాబ్ది సంవత్సరపు కార్యక్రమంలో ప్రసంగించాను’’ అని మోదీ మరో ట్వీట్లో తెలిపారు. (చదవండి: 4 గంటల పర్యటన.. రూ.23 కోట్లకు పైగా ఖర్చు) Shivshahir Babasaheb Purandare was witty, wise and had rich knowledge of Indian history. I had the honour of interacting with him very closely over the years. A few months back, had addressed his centenary year programme. https://t.co/EC01NsO1jc — Narendra Modi (@narendramodi) November 15, 2021 బాబాసాహెబ్‌గా ప్రసిద్ధి చెందిన బల్వంత్ మోరేశ్వర్ పురందరే సోమవారం ఉదయం 5 గంటలకు పూణే (మహారాష్ట్ర)లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చేరారు. బాబాసాహెబ్ పురందరేను కేంద్ర ప్రభుత్వం 2019లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో.. 2015లో రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర భూషణ్ అవార్డుతో సత్కరించింది. పురందరే ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై వివిధ పుస్తకాలను కూడా రాశారు. చరిత్ర పరిశోధనలకు తన జీవితాన్ని అంకితం చేశారు. (చదవండి: నిజమా! అంతా బాగుందా?) బాబాసాహెబ్ "జాంత రాజా" అనే నాటకాన్ని కూడా వ్రాసి దర్శకత్వం వహించారు, దీనిని 200 మంది కళాకారులు ప్రదర్శించారు. ఐదు భాషలలో అనువదించారు. మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా పురందరే మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో బాసాహెబ్ పురందరేకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. చదవండి: దీటైన హామీ! కానీ విధానమే ప్రశ్నార్థకం! -
మరణాంతరం ‘గాన గంధర్వుడి’కి పద్మ విభూషణ్, అవార్డు తీసుకున్న ఎస్పీ చరణ్
దివంగత గాయకుడు, గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు మరణాంతరం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్టపతి భవన్లో ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గాను బాలుకు ఈ అవార్డు దక్కగా.. ఆయన తనయుడు ఎస్పీ చరణ్ అవార్డు అందుకున్నారు. చదవండి: Padma Awards 2021: పద్మ అవార్డుల ప్రదానోత్సవం కాగా 2020లో మొత్తంలో 119మందిని పద్మాలు వరించాయి. 119 మందిలో 29 మంది మహిళలు ఉండగా... 16 మందికి చనిపోయిన అనంతరం అవార్డును ప్రకటించారు. స్టార్ షట్లర్ పీవీ సింధుకు పద్మ భూషణ్, బాలీవుడ్ నటికి కంగనా రనౌత్‌కు పద్మశ్రీ, నిర్మాత ఏక్తా కపూర్, సింగర్ అద్నాన్ సమీకి పద్మశ్రీ, నిర్మాత కరణ్ జోహార్‌కు పద్మ శ్రీ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు. మరణానంతరం గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌కు అవార్డులను ప్రకటించారు. Delhi: Playback singer SP Balasubrahmanyam awarded the Padma Vibhushan award posthumously. His son receives the award. #PadmaAwards2021 pic.twitter.com/HlSQGYmpxv — ANI (@ANI) November 9, 2021 -
దాసరి నారాయణరావుకి పద్మవిభూషణ్ ఇవ్వాలి
చెన్నై: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుడుగా మూడు దశాబ్దాలు వెలుగొందిన స్వర్గీయ దాసరి నారాయణరావుకి నివాళిగా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సభ జరిగింది. దాసరి నారాయణరావు గారికి కేంద్రం 2022 కి పద్మవిభూషణ్‌ను ప్రకటించాలని అందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేంద్రానికి ఒక లేఖ ద్వారా సిఫార్సు చేయాలని కేతిరెడ్డి పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అభ్యర్థిస్తూ ఒక వినతిపత్రాన్ని పంపారు. దానికి ముందు జరిగిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈసి సమావేశంలో తీసుకొన్న నిర్ణీయాన్ని వారు రెండు ప్రభుత్వాలకు తెలిపారు.తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ లేఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవలే సినిమా టిక్కెట్ ధరలను పెంచుకొనే అవకాశాన్ని జీవో ద్వారా రద్దు చేయడాన్ని అభినందించారు. -
పద్మ విభూషణ్ వెనక్కి ఇస్తున్న: మాజీ సీఎం
చండీఘర్: కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో నిరసనలు చేస్తున్నా విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకను పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతుండగా. తాజాగా పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాలీదల్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ కూడా రైతులకు మద్దతు ప్రకటించారు. అంతేకాదు తనకు భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా వెనక్కి ఇస్తున్నట్లు గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. బాదల్ తన లేఖలో.. రైతుల పట్ల కేంద్రం తీసుకున్న చర్య పట్ల తను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ రైతుల వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొన్నారు. ఇప్పుడు కేంద్రం కారణంగా అలాంటి రైతులు బాధ పడుతుంటే.. ప్రభుత్వం ఇచ్చిన పద్మ విభూషన్ పురస్కారం వల్ల వచ్చిన గౌరవం తనకు అవసరం లేదని బాదల్ రాసుకోచ్చారు. కాగా 2015లో భారత ప్రభుత్వం బాదల్‌ను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ అకాలీదళ్ ఇప్పటికే ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత ఎనిమిది రోజులుగా ఢిల్లీ సరిహద్దులో ఉద్యమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనేటి కేంద్ర మంత్రుల భేటీలో రైతులు కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాల వల్ల ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయో వివరించారు. అందులో వారు చట్టం లోపాలపై దృష్టి సారించారు. దాని గురించి ఎందుకు భయపడుతున్నారో తెలిపారు. సమావేశం రెండవ భాగంలో ప్రభుత్వ సంస్కరణపై దృష్టి సారించనున్నారు. ఇక్కడ వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్, అతని క్యాబినెట్ సహోద్యోగి పియూష్ గోయల్, జూనియర్ మంత్రి సోమ్ ప్రకాష్ రైతులతో సమావేశం కానున్నారు. -
నేలమ్మ
ఆమె ఒక విత్తన గని. భారతదేశ ధాన్య సంపదను పరిరక్షించిన దేశభక్తురాలు. నేలను నమ్మిన భూమాత. మట్టిని గౌరవించిన దేశమాత. సస్యాన్ని కాపాడిన ప్రకృతి తల్లి. అందుకే... ఆమెను గౌరవించడం ద్వారా మనందరి గౌరవాన్ని పెంచింది మన భారతదేశం. మార్చి 16వ తేదీన రాష్ట్రపతి భవన్ పద్మ పురస్కారాలకు వేదికైంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలను అందచేస్తున్నారు. మహామహులు అందుకునే పురస్కారాల్లో ఈ ఏడాది పద్మాలు ఎవరో చూడాలని టీవీల ముందు కూర్చుంది ఇండియా. ఒక్కొక్కరి పేరు చదువుతున్నారు. రాష్ట్రపతి భవన్ ప్రొటోకాల్ గౌరవాలందుకుంటూ అవార్డు గ్రహీతలు రాష్ట్రపతి ముందుకు వస్తున్నారు. ‘కమలా పూజారి, వ్యవసాయరంగం’ అని వినిపించింది. ఒక బక్క పలుచటి మహిళ, డెబ్బై ఏళ్లు నిండిన మహిళ, ఒడిషా రాష్ట్రానికి చెందిన భూమియా ఆదివాసీ మహిళ... రెడ్ కార్పెట్ మీద నడుచుకుంటూ వస్తోంది. ఒడిషా ముతక చేనేత చీరను మడమల పైకి కట్టుకుంది. పాదాలకు స్లిప్పర్స్. భుజాల మీద శాలువా ఉంది. శాలువా ఆమెకు అలవాటున్న వస్త్రధారణలా లేదు. జారిపోతున్న శాలువాను సర్దుకుంటూ రాష్ట్రపతి ఎదురుగా మెరిసే కళ్లతో నిలబడిందామె. దేహం బలహీనంగా ఉంది, ఆమె కళ్లలో ధైర్యం బలంగా ఉంది. పద్మశ్రీ పురస్కారాన్ని మనసారా స్వీకరించడానికి సిద్ధంగా ఉందామె. భావి తరాలకు అన్నానికి భరోసా కల్పించిన ఆ తల్లికి పద్మశ్రీ పురస్కారాన్ని తన చేతుల మీదుగా ప్రదానం చేస్తున్నందుకు రాష్ట్రపతి కూడా సంతోషిస్తున్నారు. విత్తనానికి భవిష్యత్తు కమలా పూజారిది ఒడిషా రాష్ట్రం, కోరాపుట్ జిల్లా, పత్రాపుట్ గ్రామం. ఆమె ఏమీ చదువుకోలేదు. స్కూలు అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియని బాల్యం ఆమెది. ఆమెకు మాత్రమే కాదు ఆ గ్రామంలో అందరిదీ ఒకటే జీవనశైలి. రోజుకింత వండుకోవడం, పొలానికి వెళ్లి సేద్యం చేసుకోవడమే ఆమెకి తెలిసింది. అది కాకుండా ఆమెకి తెలిసిన మరో సంగతి.. మన నేల మనకిచ్చిన వంగడాలను కాపాడుకోవాలని మాత్రమే. అందుకే పండించిన ప్రతి పంట నుంచి కొంత తీసి విత్తనాలను భద్రంగా దాచేది. అలా ఇప్పటి వరకు వందకు పైగా విత్తనాల రకాలున్నాయి ఆమె దగ్గర. అవి మన నేలలో ఉద్భవించిన మొలకలు కాబట్టి ఇక్కడి వాతావరణాన్ని తట్టుకుంటాయి. తెగుళ్ల నుంచి వాటిని అవే కాపాడుకుంటాయి. రసాయన పురుగు మందులు చల్లాల్సిన అవసరమే ఉండదు. ‘మా విత్తనాలు కొనండి, అధిక దిగుబడిని సాధించండి’ అని ఊదరగొట్టే విత్తనాల కంపెనీల ఆటలేవీ సాగవు ఆమె దగ్గర. తెగుళ్ల నివారణకు మా క్రిమి సంహారక మందులనే వాడండి అనే ప్రకటనలకూ మార్కెట్ లేదక్కడ. దేశీయతను పరిరక్షించడం ద్వారా బహుళ జాతి కంపెనీలకు ఎంట్రీ లేకుండా చేయగలగడమే ఆమె సాధించిన విజయం. జన్యుమార్పిడి పంటలు, డీ జనరేషన్ విత్తనాలు రాజ్యమేలుతూ, ఎరువుల కంపెనీలు, పెస్టిసైడ్ కంపెనీలు రైతుని నిలువునా దోచేస్తున్న ఈ రోజుల్లో... భారత భవిష్యత్తు తరానికి ఆరోగ్యకరమైన విత్తనాలను దాచి పెట్టింది కమలా పూజారి. అందుకే దేశం ఆమెకు పద్మశ్రీ ప్రదానం చేసి ప్రణమిల్లింది. స్వామినాథన్ వదిలిన బాణం దాదాపు పాతికేళ్ల కిందట... ఒడిషాలోని జేపూర్ పట్టణంలో ఉన్న ఎమ్.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించింది. ఆ సదస్సుకు హాజరైన రైతు మహిళల్లో కమలాపూజారి కూడా ఉన్నారు. ఆమె శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలను తదేకంగా గ్రహించడంతోపాటు ఆచరణలోనూ పెట్టింది. పంటను గింజ కట్టడం ఆమె ఎప్పటి నుంచో చేస్తున్న పనే. అయితే ఆ సదస్సులో ఆమె కొత్తగా రసాయన ఎరువుల అవసరం లేని పంటలనే పండించాలని తెలుసుకున్నారు. మంచి విత్తనాన్ని దాచడం అనేది తాను ఎప్పటి నుంచో ఆచరిస్తున్నదే. కొత్తగా చేయాల్సింది ప్రతి విత్తనాన్నీ దాచి ఉంచడం, సేంద్రియ వ్యవసాయం చేయమని పదిమందికి తెలియ చెప్పడం. వాడ వాడలా జనాన్ని సమీకరించి దేశీయ విత్తనాలను కాపాడాల్సిన అవసరాన్ని తెలియ చెప్పడంతోపాటు రసాయన ఎరువులను బహిష్కరించడానికి కూడా పిలుపునిచ్చారు కమల. పత్రాపూట్లో తన ఊళ్లో ఇంటింటికీ తిరిగి చెప్పారు. పరిసర గ్రామాలకు కూడా వెళ్లి సేంద్రియ చైతన్యం తెచ్చారు. కోరాపూట్ పక్కనే ఉన్న నబరంగపూర్ జిల్లాలోని అనేక గ్రామాలు ఆమె బాట పట్టాయి. గ్రామస్థులను సమీకృతం చేసి, స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో విత్తనాల బ్యాంక్ (సీడ్ బ్యాంక్) నెలకొల్పారు కమల. రసాయన ఎరువుల పంజా తమ ఆదివాసీ ప్రాంతాల మీద పడనివ్వకుండా ఆపిన ధీర ఆమె. బీజంలో జీవం ఉంటుంది. గింజలో ఉన్న పునరుత్పత్తి చేసే గుణాన్ని కాపాడుకోవాలి. డీ జర్మినేషన్ గింజల వెంట పరుగెత్తకుండా జర్మినేషన్ సీడ్‌ను రక్షించుకోవాలనేది స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశం, అవార్డుల పంట సేంద్రియ పంటతోపాటు కమలాపూజారికి అవార్డుల పంట కూడా వరించింది. స్వామినాథన్ ఫౌండేషన్ 2002లో సౌత్ ఆఫ్రికా, జోహాన్నెస్ బర్గ్‌లో సేంద్రియ వ్యవసాయం మీద నిర్వహించిన సదస్సుకు ఆమెకు ఆహ్వానం వచ్చింది. ఆమె తన అనుభవాలను ఆ సదస్సులో ప్రపంచ దేశాల ప్రతినిధులతో పంచుకున్నారు. విశేషమైన ప్రశంసలందాయామెకి. ‘ఈక్వేటర్ ఇనిషియేటివ్ అవార్డు’తో గౌరవించిందా సదస్సు. ఆ తర్వాత ఏడాది మన కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో జరిగిన వ్యవసాయ సదస్సులో కమలా పూజారిని ‘కృషి విశారద’ బిరుదును ప్రదానం చేసింది. ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో ఉన్న ‘ఒడిషా యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ’ 2004లో కమలాపూజారిని ‘ఉత్తమ మహిళా రైతు’ పురస్కారంతో గౌరవించింది. కమలా పూజారి గౌరవార్థం ఆ యూనివర్శిటీలో గాళ్స్ హాస్టల్‌కు ఆమె పేరు పెట్టింది. అంతే కాదు... ఆ హాస్టల్ ప్రారంభోత్సవం కూడా ఆమె చేతుల మీదుగా చేయించింది ప్రభుత్వం. అలాగే జేపూర్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు ఉచితంగా ఆహారం పెట్టే ‘రాత్రి ఆహార్ కేంద్ర’ ప్రారంభోత్సవం కూడా ఆమె చేతుల మీదుగానే జరిగింది. గౌరవాలున్నాయి.. గూడే లేదు ఒడిషాలో ప్రభుత్వం రైతు సదస్సు నిర్వహిస్తే, ఆ సదస్సులో పాల్గొనవలసిందిగా కమలా పూజారికి ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది. సన్మానమూ ఉంటుంది. మహిళాదినోత్సవం రోజున కూడా పురస్కరించుకోవడానికి స్థానిక అధికారులకు మొదటగా గుర్తు వచ్చే వ్యక్తి కమలా పూజారి. అయితే ఆమెకు నిలవ నీడ కల్పిద్దామనే ఆలోచన మాత్రం ఏ అధికారికీ రాలేదు. ప్రభుత్వం నుంచి పక్కా ఇల్లు అందుకోవడానికి అవసరమైన ప్రధాన అర్హత పేదరికం. ఆమెను చూస్తే పేదరికంలో మగ్గుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విఆర్వో ధృవీకరించాల్సిన అవసరం కూడా లేదు. పేదరికం ఆమె ఒంటి మీద తాండవిస్తోంది. ఇందిరా ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వమని ఎన్నోసార్లు అప్లికేషన్లు ఇచ్చారామె. ఇవ్వగా ఇవ్వగా ఆఖరుకి ఆమెకి గవర్నమెంట్ కట్టించి ఇచ్చిన ఇంటికి కరెంటు లేదు, కనీసం కిటికీ కూడా లేదు. ఏ మాత్రం ఆవాసయోగ్యంగా లేని ఇంట్లో ఉంటోందామె. గవర్నర్ ఆహ్వానం గత ఏడాది ఒడిషా ప్రభుత్వం కమలాపూజారిని స్టేట్ ప్లానింగ్ బోర్డు మెంబరుగా నియమించింది. ఈ బోర్డులో ఒక ఆదివాసీ మహిళకు స్థానం లభించడం మొదటిసారి. ప్లానింగ్ బోర్డు మెంబరు హోదాలో వచ్చిందా, ఆదర్శ రైతు మహిళగా ఆహ్వానం వచ్చిందో ఆమెకు తెలియదు... కానీ, స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి గత ఏడాది ఆమెకు ఆహ్వానం వచ్చింది. అది నిజానికి అత్యంత గౌరవపూర్వకమైన ఆహ్వానం. విశిష్ఠ వ్యక్తులకు మాత్రమే అందే ఆహ్వానం. అయితే తన ఊరి నుంచి రాజధానికి వెళ్లడానికి ఖర్చులకు డబ్బు లేకపోవడంతో హాజరుకాలేకపోయారు కమల. అప్పుడు కూడా ప్లానింగ్ బోర్డు ఆమె ఆర్థిక స్థితిగతుల గురించి పరిశీలన చేయనేలేదు. పత్రాపుట్ వాసులైతే ‘ఆమెను ప్లానింగ్ బోర్డులో నియమించడం అంటే ఆమెను గౌరవించడం కాదు, ఆమె పేదరికాన్ని పరిహసించడమే’ అని ప్రభుత్వ తీరును నిరసించారు. ఆమె మాత్రం ‘ప్లానింగ్ బోర్డు మీటింగ్ ఎప్పుడు జరిగినా వెళ్లి మా ఊరికి తాగు నీటి సౌకర్యం కోసం మాట్లాడతాను’ అని చెప్పారు తప్ప తనకోసం ఏదైనా అడుగుతానని అనలేదు. పరమానందం కమలా పూజారిలో గొప్పదనం ఏమిటంటే... ఆమె పేదరికం గురించి ఊరంతా ఆవేదన చెందుతున్నప్పటికీ ఆమె మాత్రం తన పేదరికాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. దేశం తనను ఇంత పెద్ద పురస్కారానికి ఎంపిక చేసినందుకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేశారామె. ఊరి వాళ్లు మాత్రం... ‘‘అత్యంత పేదరికాన్ని అనుభవిస్తోంది. అత్యంత ఉన్నతమైన వేదికల మీద పురస్కారాలను అందుకుంటోంది. పురస్కారం అందుకుని వచ్చిన మరుసటి రోజు నుంచి తిరిగి పొలం పనులకు పోతుంది ఎప్పటిలా’’... అని ఆమెను సగౌరవంగా తలుచుకున్నారు. ఆమె సేవలను ప్రభుత్వం సగర్వంగా చాటుకుంటోంది. అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించుకుంటోంది. అంతటి విలువైన సేవలందించిన కమలాపూజారికి పద్మశ్రీ ప్రదానం చేయడం వల్ల పెరిగింది ఆమె గౌరవం కాదు... దేశ గౌరవమే. – వాకా మంజులారెడ్డి రీసెర్చ్ బ్యాంక్ భవిష్యత్తు వ్యవసాయరంగానికి మార్గదర్శనం చేస్తున్న మహిళ కమలా పూజారి. సుస్థిరమైన, నిరంతరాయమైన అభివృద్ధి కోసం ఆమె చేసిన సేవ వ్యవసాయ రంగానికే మార్గదర్శనం. మనదేశీయ పంటల నిధిని భావితరాల కోసం భద్రపరిచిన ముందు చూపున్న తల్లి కమలా పూజారి అని దేశం ఆమెను ప్రశంసలతో ముంచెత్తింది. వరిలో రకాలు, పసుపు, నువ్వులు, నల్ల జీలకర్ర, రకరకాల చిరుధాన్యాలు, మహాకంత, ఫూలా వంటి ఆరతడి పంటల విత్తనాలు, నీటి పంటలు గింజలు ఆమె సేకరణలో ఉన్నాయి. ఆమె సేకరించిన సీడ్ బ్యాంకులో అంతరించిపోతున్న అనేక రకాల ధాన్యం గింజలున్నాయి. ఆ గింజలను మొలక కట్టి, నారు పోసి ఆ మొక్కలు, పంటల దిగుబడి మీద పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. మనుమడి ఆవేదన కమలా పూజారికి చాలా కాలం కిందటే భర్త పోయాడు, ఇద్దరు కొడుకులు, కోడళ్లు, మనుమలతో జీవిస్తోంది. ఆమెకు ఒక్కో పురస్కారం రావడం, మీడియా ప్రతినిధులు వచ్చి కామెంట్ తీసుకోవడం ఆ ఇంటికి పరిపాటి అయిపోయింది. ప్లానింగ్ బోర్డు మెంబరు అయినప్పుడు ‘ఈ పదవి కంటే ఆమెకు గట్టి ఇల్లు ఇవ్వవచ్చు కదా’ అని వాపోయాడు 12వ తరగతి చదువుతున్న ఆమె మనుమడు సుదామ్ పూజారి. పోయినేడాది వరకు కూడా నాలుగు మట్టి గోడలు, తాటాకు పైకప్పు ఆమె ఇల్లు. ‘‘మా నానమ్మను పెద్ద పెద్ద బిల్డింగులను ప్రారంభించడానికి పిలుస్తారు. ఆమెకు చిన్న ఇల్లు కూడా ఇవ్వాలనుకోవడం లేదు ప్రభుత్వం. ఆమె ఇందిరా ఆవాస యోజన కింద పక్కా ఇంటి కోసం ఎన్నోసార్లు అధికారులకు అప్లికేషన్లు ఇచ్చింది. అయినా ఇల్లు శాంక్షన్ కాలేదు. ఎండాకాలంలో నేల మీద నీళ్లు చల్లుకుని పడుకుంటోంది’’ అని గత ఏడాది మీడియా ముందు ఆవేదన చెందాడతడు. ప్రభుత్వం ఆమెకు కిటికీ కూడా లేని గూడునైనా ఇచ్చింది మనుమడి మాట మీడియాలో వచ్చిన తరవాతనే. -
ఇళయరాజాకు పద్మవిభూషణ్
-
ఇళయరాజాకు పద్మవిభూషణ్
ఇతడి పోస్టర్స్ పెట్టుకునేవారు, పాటలు రాసుకునేవారు, పిల్లలకు ఇతని పేరు పెట్టుకునేవారు, ఇతణ్ణి ఒక్కసారి కలిసి ప్రాణం విడవాలనుకునేవారు చాలామంది ఉన్నారు. ఎందుకు? 1977. మామ మంచి ఊపు మీద ఉన్నాడు. హార్మోనియం అందుకుని నోటి నిండా తాంబూలంతో పాట చేశాడు. అది ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ అయ్యింది. కోటి రూపాయల పాట. హిట్. చక్రవర్తి కూడా తక్కువ దూకుడు మీద లేడు. మద్రాసు విజయ గార్డెన్స్‌లో చేతి మీద చేతి చరుపు వేసి ఒక ట్యూన్ చేశాడు. అది ‘గుడివాడ వెళ్లాను’ అయ్యింది. అదీ మోత మోగిన పాటే. ఆ సమయంలోనే తమిళం నుంచి ఒక సంగీతకారుడు తెలుగులో ఒక లాలిపాట వలే మెల్లగా దోగాడుతూ వచ్చాడు. సుశీలతో, ఏసుదాసుతో పాట చేశాడు. చిన్ని చిన్ని కన్నయ్య... కన్నులలో నీవయ్యా నిన్ను చూసి మురిసేను... నేను మేను మరిచేను... తెర మీద కాగితాలు చించి ఎగరేసే హీరోల పాటల మధ్య ఈ పాటను తెలివైనవాళ్లు గమనించారు. పాటలను గ్రహించేవారు పరిశీలించారు. మెలోడీని ఇష్టపడేవారు ఈ పేరును తమ డైరీల్లో రాసుకున్నారు. ఇళయరాజా! కాని ఈ తమిళుడికి వెంటనే ఇక్కడ ప్రవేశం లభించలేదు. ఇంకో తమిళ రీమేక్ నుంచే అతణ్ణి తెలుగువారు వినాల్సి వచ్చింది. 1978. ‘వయసు పిలిచింది’. ‘ఇలాగే ఇలాగే సరాగ మాడితే’... అందులో శ్రీప్రియ చెప్పినట్టుగానే ఇది ‘లవ్లీ సాంగ్’. కాని మనుషుల దృష్టి మాత్రం ఇందులోని రాత్రి పాట మీద పడింది. కోరిక పాట మీద. తాపం పాట మీద. నిప్పును రగిల్చే పాట మీద. ‘మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరలా నిలిచిందిలే’. ఇప్పుడు నేల క్లాసు శ్రోత కూడా ఆ సంగీత దర్శకుని పేరు తన చేతి మీద బాల్‌పాయింట్ రీఫిల్‌తో రాసుకున్నాడు. ఇళయరాజా! అప్పటికి తెలుగు ప్రేక్షకులందరూ కంటి మీద చేతులు మూసుకొని ఈ దర్శకుని పాట వొడ్డు మీద నిలుచుని ఉన్నారు. పాదాలకు ఇసుక తగులుతోంది. కాలువ కావచ్చు. డొంక కావచ్చు. వంక కావచ్చు. ఊట కావచ్చు. దొరువు కావచ్చు. చెరువు కావచ్చు. 1981. ‘సీతాకోక చిలుక’ వచ్చింది. ‘మిన్నెటి సూరీడు వచ్చెను మా పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మా’.... ‘మాటే మంత్రము మనసే బంధము’... ‘సాగర సంగమమే ప్రణయ సాగర సంగమమే’... అప్పటికి అర్థమైంది. కళ్లు తెరిచారు. ఎదురుగా సముద్రం. పోటెత్తే సముద్రం. పోటు మీద ఉన్న సముద్రం. పల్లవి వెంట చరణాలుగా విరిగి పడుతున్న సముద్రం. ఈసారి మర్చిపోకుండా ఆ సంగీత దర్శకుడి పేరును అందరూ ఛాతీల మీద రాసుకున్నారు. ఇళయరాజా! తెలుగు సినిమా సంగీతానికి ఒక లలిత సంగీత స్వభావం ఉంది. ఆ మాటకొస్తే తమిళ సినీ సంగీతానికి కూడా ఒక సంప్రదాయ లలిత సంగీత స్వభావం ఉంది. ఈ సంగీత దర్శకుడు అది మార్చాడు. ఎలా మార్చాడు? పుట్టి పెరిగిన మారుమూల తమిళపల్లె పణై్ణపురంలో విన్న జానపద గీతాన్ని, సంగీతం నేర్చుకోవడానికి మద్రాసులో అభ్యసించిన పాశ్చాత్య గీతాన్ని కలిపి ఒక ఫ్యూజన్‌తో మార్చాడు. కీబోర్డుతో వేణువు కలిసింది. రిథమ్ బాక్స్‌తో వీణ పలికింది. గిటార్‌తో నాదస్వరం జత కట్టింది. సన్నాయి, ట్రంపెట్ ఒక జోడి. ఇలా కలిపినవాడు ఇంతకుముందు లేడు. అది వీడే. జనం పదే పదే ఆ పేరు తలిచి మురిసిపోయారు. ఇళయరాజా! తెలుగులో టేస్ట్ ఉన్న డైరెక్టర్లకు ఇళయరాజా పట్టాడు. బాపుగారు ‘మంత్రిగారి వియ్యంకుడు’ అన్నారు. ఇతను ‘ఏమనినే చెలి పాడుదును’ అని ఒక పొగమంచు స్పర్శలాంటి యుగళగీతం ఇచ్చాడు. వంశీ ‘సితార’ అన్నాడు. ఇతను ‘జిలిబిలి పలుకులు చిలిపిగ పలికే’ ఒక మైనాను పలికించాడు. కాని ఇతడిని కమర్షియల్ సినిమాకు దగ్గర చేసింది మాత్రం కె.ఎస్.రామారావు, చిరంజీవి, ఏ. కోదండరామిరెడ్డి త్రయం. మొదటి సినిమా ‘అభిలాష’. ‘సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది’... ‘బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే’... రాధిక మెరుపు... చిరంజీవి ఒడుపు... ఇళయరాజా నలుపు... నలుపు నారా యణమూర్తే గదా. ఒక వైపు వీళ్ల కాంబినేషన్లోని ‘ఛాలెంజ్’, ‘రాక్షసుడు’, ‘మరణ మృదంగం’ వంటి సినిమాలు వస్తుంటే మరోవైపు వంశీ కాంబినేషన్లో ‘ఆలాపన’ , ‘ప్రేమించు పెళ్లాడు’, ‘లేడిస్ టైలర్’, ‘మహర్షి’, ‘అన్వేషణ’ లాంటి సినిమాలు ఇతని పాటల్ని తెలుగు నేల మీద ఎనిమిది మూలలకీ చేర్చాయి. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు– హిట్. ఈ చైత్రవీణ ఝమ్ఝమ్మని– హిట్. ఇతను ఫాస్ట్‌గా ట్యూన్ ఇస్తాడు. అయితే ఏంటోయ్? ఫాస్ట్‌గా రాసే పాటగాడు మన దగ్గర ఉన్నాడుగా. వేటూరి. వీళ్ల కాంబినేషన్ ‘ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది’. కె.విశ్వనాథ్ మూడు ముఖ్యమైన హిట్స్‌కు ఇళయరాజా ఆలంబనగా నిలిచాడు. ‘సాగర సంగమం’, ‘స్వాతి ముత్యం’, ‘స్వర్ణకమలం’. కె.రాఘవేంద్రరావు హిట్ కోసం డెస్పరేట్గా ఉన్నప్పుడు హిట్స్ ఇచ్చాడు. ‘ఆఖరి పోరాటం’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. వెంకటేశ్‌కు ‘బొబ్బిలిరాజా’తో స్టార్డమ్, ‘చంటి’తో క్లాస్ ఇమేజ్ సెటిల్ కావడానికి ఇతడి పాటలే కారణం. బాలకృష్ణ క్లాసిక్ ‘ఆదిత్య 369’లో చేసిన ‘జాణవులే నెరజాణవులే’ కలర్లో బ్లాక్ అండ్ వైట్ రోజులకు తీసుకెళ్లగలిగింది. ఇతను తెలుగు సినిమాల వల్ల మాత్రమే కాదు. గొప్ప గొప్ప తమిళ సినిమాల వల్ల కూడా తెలుగుకు వినిపిస్తూనే ఉన్నాడు. మణిరత్నం, కె.బాలచందర్, ప్రియదర్శన్, ఫాజిల్, సింగీతం శ్రీనివాసరావు... వీళ్లు తమిళంలో చేసిన సినిమాలకు తెలుగు డబ్బింగ్ పాటలను కూడా ప్రేక్షకులు సోనీ 90 కేసెట్లలో దాచుకున్నారు. సంగీతానికి ఉన్మాద స్థాయిలో అభిమానులు ఏర్పడటం పాశ్చాత్య దేశాలలో చూశాం. హిందీలో ఈ ఉన్మాద స్థాయి నౌషాద్, శంకర్–జైకిషన్వంటి వారు చూశారు. దక్షిణాదిన అంతటి ఉన్మాద అభిమానుల బ్యాంక్‌ను మూటగట్టుకున్నది ఇతడే. ఇతడి పోస్టర్స్ పెట్టుకునేవారు, పాటలు రాసుకునేవారు, పిల్లలకు ఇతని పేరు పెట్టుకునేవారు, ఇతణ్ణి ఒక్కసారి కలిసి ప్రాణం విడవాలనుకునేవారు చాలామంది ఉన్నారు. ఎందుకు? ఇతని పాట తాకుతుంది. హృదయంతో తాకుతుంది. ఆత్మతో తాకుతుంది. పాట మధ్యలో ఒక వేణువు శకలం... పాట పల్లవిలో ఒక వయొలిన్ రన్... పాట అంచున ఒక తబలా ముక్తాయింపు... ఇవి ఏవో వారిని తాకి అలా స్థిరపడిపోతాయి. ఇతని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వినడానికి సినిమాలకు వెళ్లినవాళ్లు ఉన్నారు. ఇతని పాటలు వింటూ కారుల్లో వేల కిలోమీటర్లు ప్రయాణించగలిగే పిచ్చివాళ్లు నేటికీ ఉన్నారు. తెల్లటి లాల్చీ తెల్లటి పంచె కట్టుకున్న ఈ మనిషి తనలోని ఉన్నదంతా ఆ దేవుడినంతా ఆ తీపిని అంతా ఆ శోకం అంతా ఆ ఉల్లాసం అంతా కోస్తే వచ్చే ఆ దోరజామ సువాసన అంతా దాచుకోకుండా తల్లి తన సంతానానికి పంచినట్టు శ్రోతలను బిడ్డలనుకుని పంచిపెట్టాడు. ఆ హృదయం కోసమే వారు దాసోహమయ్యారు. కాలం మారవచ్చు. అక్కడ ఏ.ఆర్.రెహమాన్, ఇక్కడ కీరవాణి వంటి వారు అతడి స్థానాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేసి ఉండవచ్చు. కొత్తకుర్రాళ్లు వచ్చి కొత్త హార్మోనియం మెట్లను పరుస్తుండవచ్చు. కాని– సముద్రం పాటు మీద ఉన్నప్పుడు పడవను ఎందరు దాటించ గలిగినా అది సముద్రం. ‘జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక’... లేస్తుంటుంది. ‘ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా’... లేస్తూనే ఉంటుంది. ప్రభూ... నీకు పద్మవిభూషణ్ అట. ప్రభాత సమయాన నీ చెలియలికట్టపై ఈ పువ్వును ఉంచినప్పుడు నువ్వు దరహాసంతో ఏ కొత్తపాటలోకో నిమగ్నమయ్యి అదే అసలు ప్రాప్తంగా ధన్యుడివవుతావు కదూ. – ఖదీర్ -
పద్మవిభూషణ్‌పై స్పందించిన మ్యూజిక్ మ్యాస్ట్రో
సాక్షి, చెన్నై: కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2018కి చెందిన పద్మ అవార్డులను గురువారం ప్రకటించింది. అనేక రంగాల్లో సేవలందించిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 2018 ఏడాదికి 85 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. పద్మశ్రీ 73 మందికి, పద్మభూషణ్ 9మందికి, ముగ్గురికి పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి. ఈ అవార్డుల ప్రధానోత్సవం రిపబ్లిక్ డే నాడు జరుగుతాయి. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాల కోసం 2018 సంవత్సరంలో మొత్తం 15,700 మంది ప్రముఖులు దరఖాస్తు చేసుకన్న విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు కేంద్ర ప్రభుత్వం సంగీతం, కళలు విభాగంలో పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది. తనకు పద్మవిభూషణ్ అవార్డు రావడం పై మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా స్పందించారు. పద్మవిభూషణ్ రావడం చాలా ఆనందంగా ఉందని ఇళయరాజా అన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక నాకు వచ్చిన ఈ అవార్డును దక్షిణాది చిత్రసీమకు అంకితమని ఇళయరాజా అన్నారు. పద్మ అవార్డుల జబితాలో రాష్ట్రాల వాటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులో అధికంగా మహారాష్ట్ర(11అవార్డులు) వారికి దక్కాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం ఒక పద్మ అవార్డు మాత్రమే వరించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిదాంబి శ్రీకాంత్‌కు క్రీడల విభాగం(బ్యాడ్మింటన్)లో పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్ర - 11 కర్ణాటక - 9 తమిళనాడు - 6 పశ్చిమ బెంగాల్ - 5 కేరల - 4 మధ్యప్రదేశ్ - 4 ఒడిషా - 4 గుజరాత్ - 3 ఆంధ్రప్రదేశ్ -1 తెలంగాణ -0 -
నో పాలిటిక్స్, రజనీ మంచి వ్యక్తి..
సాక్షి, చెన్నై: దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు పద్మ విభూషణ్ అవార్డు ప్రదానంలో ఎలాంటి రాజకీయం లేదని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. ఆయన మంచి మనిషి అని కితాబు ఇచ్చారు. కోయంబత్తూరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోదీ, రజినీకాంత్ మధ్య సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. దీన్ని ఆసరాగా తీసుకుని దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు కమలనాథులు తీవ్ర కుస్తీలు చేస్తూ వస్తున్నారు. అయితే తలైవా ఎక్కడా చిక్కకుండా తన మార్గంలో తాను సాగుతూ ఉన్నారు. ఈ సమయంలో రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని ఆయనకు పద్మవిభూషణ్‌ను కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డు రజనీకాంత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు సాగుతున్న గాలంలో భాగం అన్నట్టుగా తమిళ మీడియాల్లో కథనాలు బయల్దేరాయి. అయితే ఈ కథనాలను ఖండిస్తూ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ తీవ్రంగా స్పందించారు. కోయంబత్తూరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు గురువారం జవదేకర్ వచ్చారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆయన్ను మీడియా చుట్టుముట్టింది. ఇటీవల తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చి మరణించిన వ్యవహారంపై ప్రశ్నల్ని గుప్పించారు. ఇందుకు స్పందిస్తూ పరిశోధనలు సాగుతున్నాయని, ఆ మేరకు తదుపరి చర్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు. రజనీకాంత్‌కు పద్మ విభూషణ్ ప్రస్తావన తీసుకు రాగా, ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు అని స్పష్టం చేశారు. రాజకీయ ఉద్దేశంతోనూ ఈ అవార్డు ఆయనకు ఇవ్వలేదు అని, ఆయనకు ఇవ్వడం ద్వారా ఆ అవార్డుకు మరింత గౌరవాన్ని కల్గించామన్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దు అని సూచించారు. రజనీకాంత్ గొప్ప నటుడే కాదు అని, మంచి మనిషి కూడా అని కితాబు ఇచ్చారు. ఏ తరం వాళ్లకైనా సరే ఆయన అంటే ఎంతో ఇష్టం అని, ఆయన స్టైల్ రాబోయే తరం వారికి కూడా నచ్చుతుందని వ్యాఖ్యానించారు. అందుకే ఆ అవార్డు ఆయనకు సొంతమైందన్నారు. మోదీ పర్యటన ఏర్పాట్ల పరిశీలన: ప్రధాని నరేంద్ర మోదీ కోయంబత్తూరు ఏర్పాట్లను జవదేకర్ పరిశీలించారు. ఈఎస్ఐ ఆసుపత్రి ఆవరణలో సాగుతున్న ఏర్పాట్లను పరిశీలించి, అధికారులతో సమాలోచించారు. ఒడిస్సియా మైదానంలో జరగనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను సైతం పరిశీలించారు. ఆయనతో పాటుగా కేంద్ర సహాయ మంత్రి పొన్‌రాధాకృష్ణన్ కూడా ఈ పరిశీలనలో ఉన్నారు. పది లక్షల మంది జన సమీకరణ లక్ష్యంగా ఈ బహిరంగ సభ ఉంటుందని, అందుకు తగ్గ ఏర్పాట్లు వేగవంతం చేశామని పొన్ రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఒక్క కోయంబత్తూరు నుంచి మాత్రం లక్ష మంది ఈ సభకు రానున్నారని, ఈ సభ రాష్ట్ర రాజకీయ మార్పులకు వేదిక కానున్నదన్నారు. రెండో తేదీ ఇక్కడకు రానున్న మోదీని పలువురు మిత్రులు కలవడం ఖాయమని, ఇందులో అనేక పార్టీల నాయకులు సైతం ఉన్నారని వ్యాఖ్యానించారు. -
వీళ్లకు పద్మాలివ్వండి
- కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు..హోంశాఖకు చేరిన జాబితా - భారతరత్నకు ఎన్టీఆర్‌ను ప్రతిపాదించని బాబు సర్కార్ సాక్షి, న్యూఢిల్లీ: ఈనాడు పత్రికాధిపతి సీహెచ్.రామోజీరావుకు పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. అయితే భారతరత్న పురస్కారం విషయంలో ఎన్టీఆర్‌కు మళ్లీ మొండి చేయి చూపింది. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తరచూ చెప్పే సీఎం చంద్రబాబు అవకాశం ఉన్నా ఆ అవార్డుకు ఆయన పేరును కేంద్రానికి సిఫార్సు చేయలేదు. రాష్ట్రం నుంచి 30 మంది పేర్లతో పద్మ అవార్డుల జాబితా వచ్చిందని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన జాబితాలో ఎన్టీఆర్ పేరు లేదని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు ధ్రువీకరించారు. పద్మ విభూషణ్ అవార్డుకు రామోజీరావుతో పాటు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్.నాగేశ్వర రెడ్డి పేరును కూడా రాష్ర్ట ప్రభుత్వం సిఫార్సు చేసిందని కేంద్ర హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. పద్మ విభూషణ్‌కు ఇద్దరి పేర్లను, పద్మ భూషణ్‌కు ఐదుగురి పేర్లను, పద్మ శ్రీ అవార్డులకు 23 మంది పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. కేంద్ర హోంశాఖ వర్గాల వివరాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు సిఫార్సు చేసిన పేర్లు ఈ విధంగా ఉన్నాయి. పద్మవిభూషణ్‌కు..: సీ.హెచ్. రామోజీరావు (జర్నలిస్టు), డాక్టర్ నాగేశ్వర రెడ్డి (గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్). పద్మ భూషణ్‌కు: డాక్టర్ అనంద శంకర్ జయంత్ (కూచిపూడి నృత్యం), డాక్టర్ బాల వి.బాలచందర్ (విద్య), చాగంటి కోటేశ్వరరావు( సాహిత్య, సంస్కృతి), డాక్టర్ ఎం.గోపిచంద్ (సామాజిక సేవ), ఎం. మురళీ మోహన్ (ఎంపీ, ఆర్ట్ అండ్ సామాజిక సేవ). పద్మ శ్రీకి: డి.హారిక (చెస్), కె. శ్రీకాంత్ (బ్యాడ్మింటన్), ఎం. వెంకటేశ్వర యాజులు (సాహిత్య-విద్య), ముదిగొండ శివప్రసాద్ (సాహిత్యం), ఎ. ప్రకాశరావు (సాహిత్యం), అంబిక (కూచిపూడి నృత్యం), వందేమాతరం శ్రీనివాస్ (గాయకుడు), జి. రమణయ్య (చేనేత), పూజ కపూర్ (మ్యూజిక్), డాక్టర్ జయప్రద రామమూర్తి (ఫ్లూట్), జి.రాజేంద్రప్రసాద్ (సినిమా), కీర్తి శేషులు వేటూరి సుందరరామ్మూర్తి (రచయిత), పసుమర్తి రత్తయ్య శర్మ (కూచిపూడి నృత్యం), యార్లగడ్డ నాయుడమ్మ (వైద్యం), డాక్టర్ విశ్వరూపరెడ్డి (ఈఎన్టి సర్జన్), డాక్టర్ ముక్కామల అప్పర (ఎన్ఆర్ఐ-రేడియాలజీ), డాక్టర్ సజ్జా లోకేశ్వరరావు (కార్డియాలజీ), డాక్టర్ టి. దశరథరామిరెడ్డి (ఆర్థోపెడిక్), డాక్టర్ సీ.హెచ్. మోహన్ వంశీ (అంకాలజీ), డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు (అంకాలజీ), డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలె (సి.టి. సర్జన్), అక్షయ క్షేత్రం (సామాజిక సేవ), వి. శ్రీదేవి (హార్టికల్చర్)ల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది.