వెంకయ్యనాయుడు, చిరంజీవి ‘విభూషణులు’.. సీఎం జగన్‌, సీఎం రేవంత్‌ హర్షం | Padma Vibhushan Awards For Chiranjeevi And Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

వెంకయ్యనాయుడు, చిరంజీవి ‘విభూషణులు’.. సీఎం జగన్‌, సీఎం రేవంత్‌ హర్షం

Published Fri, Jan 26 2024 4:27 AM | Last Updated on Fri, Jan 26 2024 9:30 AM

Padma Vibhushan Awards For Chiranjeevi And Venkaiah Naidu - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి నెట్‌వర్క్‌:  తెలుగు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారాలు వరించాయి. ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌కు ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికిగాను మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించారు. వీటిలో ఐదు పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, మిగతా 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి.

ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రమణ్యం, సామాజికవేత్త, సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు బిందేశ్వర్‌ పాఠక్, అలనాటి బాలీవుడ్‌ నటి వైజయంతిమాల బాలిని కూడా పద్మ విభూషణ్‌ వరించింది. పద్మభూషణ్‌ ప్రకటించిన వారిలో  సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ, సినీనటుడు విజయ్‌కాంత్, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి, నేపథ్య గాయని ఉషా ఉతుప్, ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు ప్యారేలాల్‌ శర్మ తదితరులున్నారు. వీరిలో ఫాతిమా, పాఠక్, విజయ్‌కాంత్‌ సహా 9 మందికి మరణానంతరం పురస్కారాలు దక్కాయి. 


తెలంగాణ, ఏపీల నుంచి ఆరుగురికి.. 
తెలంగాణ నుంచి ఐదుగురికి, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒకరికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో తెలంగాణ నుంచి బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, కూరెళ్ల విఠలాచార్య, కెతావత్‌ సోమ్‌లాల్, ఎ.వేలు ఆనందచారి, ఏపీ నుంచి హరికథా కళాకారిణి డి.ఉమా మహేశ్వరి ఉన్నారు. పద్మశ్రీ గ్రహీతల్లో 34 మందికి ‘అన్‌సంగ్‌ హీరోస్‌’ పేరిట పురస్కారం దక్కింది. క్రీడారంగం నుంచి టెన్నిస్‌ డబుల్స్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న, స్క్వాష్‌ ప్లేయర్‌ జోష్నా చినప్ప, హాకీ క్రీడాకారుడు హర్బిందర్‌ సింగ్‌ సహా ఏడుగురికి పద్మశ్రీ లభించింది. పురస్కార గ్రహీతల్లో మొత్తం 30 మంది మహిళలున్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను నాలుగేళ్ల విరామం అనంతరం బిహార్‌ దివంగత ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు మంగళవారం ప్రకటించడం తెలిసిందే. 

పద్మ అవార్డుల వివరాలివీ.. 
పద్మ విభూషణ్‌ (ఐదుగురికి): 
వైజయంతిమాల బాలి (కళారంగం–తమిళనాడు), కొణిదెల చిరంజీవి (కళారంగం–ఆంధ్రప్రదేశ్‌), ఎం.వెంకయ్యనాయుడు (ప్రజావ్యవహారాలు–ఆంధ్రప్రదేశ్‌), బిందేశ్వర్‌ పాఠక్‌ (సామాజిక సేవ–బిహార్‌), పద్మా సుబ్రమణ్యం (కళారంగం–తమిళనాడు). 


పద్మభూషణ్‌ (17 మందికి): 
ఫాతిమా బీవీ (మరణానంతరం–ప్రజా వ్యవహారాలు–కేరళ), హోర్మూస్‌ జీ ఎన్‌.కామా (సాహిత్యం, విద్య, జర్నలిజం–మహారాష్ట్ర), మిథున్‌ చక్రవర్తి (కళారంగం–పశ్చిమబెంగాల్‌), సీతారాం జిందాల్‌ (వర్తకం–పరిశ్రమలు–కర్నాటక), యంగ్‌ లియు (వర్తకం–పరిశ్రమలు–తైవాన్‌), అశ్విన్‌ బాలచంద్‌ మెహతా (వైద్యం–మహారాష్ట్ర), సత్యబ్రత ముఖర్జీ (మరణానంతరం–ప్రజా వ్యవహారాలు–పశి్చమ బెంగాల్‌), రాంనాయక్‌ (ప్రజా వ్యవహారాలు–మహారాష్ట్ర), తేజస్‌ మధుసూదన్‌ పటేల్‌ (వైద్యం–గుజరాత్‌), ఓలంచెరి రాజగోపాల్‌ (ప్రజా వ్యవహారాలు–కేరళ), దత్తాత్రేయ్‌ అంబాదాస్‌ మయలూ అలియాస్‌ రాజ్‌ దత్‌ (కళారంగం–మహారాష్ట్ర), తోగ్డన్‌ రింపోచే (ఆధ్యాత్మికత–లద్దాఖ్‌), ప్యారేలాల్‌ శర్మ (కళారంగం–మహారాష్ట్ర), చంద్రేశ్వర్‌ ప్రసాద్‌ ఠాకూర్‌ (వైద్యం–బిహార్‌), ఉషా ఉతుప్‌ (కళారంగం–మహారాష్ట్ర), విజయ్‌కాంత్‌ (మరణానంతరం–కళారంగం–తమిళనాడు), కుందన్‌ వ్యాస్‌ (సాహిత్యం, విద్య, జర్నలిజం–మహారాష్ట్ర) 
– పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన 110 మందిలో గోండా చిత్రకార దంపతులు శాంతిదేవీ పాశ్వాన్, శివన్‌ పాశ్వాన్‌ తదితరులున్నారు. 
 
బాధ్యతను పెంచింది 
‘‘దేశం అమృత కాలం దిశగా అభివృద్ధి పథంలో సాగుతున్న తరుణంలో ప్రకటించిన పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నా. ఇది నా బాధ్యతను మరింతగా పెంచింది. రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికీ పురస్కారాన్ని అంకితం చేస్తున్నా’’ 
– ఎం.వెంకయ్యనాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి 
 
సంస్కృతిని, కళలను చాటి చెప్పారు: రేవంత్‌రెడ్డి 
తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో నైపుణ్యం, కృషితో వారు ఉన్నత అవార్డులకు ఎంపికయ్యారని.. సంస్కృతిని, కళలను దేశమంతటికీ చాటిచెప్పారని ప్రశంసించారు. 
 
తెలుగువారికి పద్మాలు గర్వకారణం: ఏపీ సీఎం జగన్‌ 
తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైనవారిని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవిలకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్‌ పురస్కారాలను ప్రకటించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ‘పద్మ’ అవార్డులను దక్కించుకున్న వారిని అభినందించారు, వారు మనకు గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. 
 
తెలుగు వెలుగులకు శనార్తులు: బండి సంజయ్‌ 
పద్మవిభూషణ్‌ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్‌ చిరంజీవికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ శుభాకాంక్షలు తెలిపారు. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వెలుగులకు తెలంగాణ శనార్తులు చెబుతోందని పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement