ముంబై: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు (Padma awards 2025) ప్రకటించింది. వీరిలో వాణిజ్యం, పరిశ్రమల విభాగం నుంచి 10 మంది ఉన్నారు. జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ సుజుకీ మోటార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, దివంగత ఒసాము సుజుకీని (మరణానంతరం) పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది.
తమిళనాడుకు చెందిన టెక్స్‌టైల్ పారిశ్రామికవేత్త నల్లి కుప్పుస్వామి చెట్టి, జైడస్ లైఫ్‌సైన్సెస్ చైర్మన్ పంకజ్ పటేల్ పద్మ భూషణ్ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఇక ఎస్‌బీఐ మాజీ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్యతోపాటు ఓంకార్ సింగ్ పాహ్వా (అవాన్ సైకిల్స్), పవన్ గోయెంకా (మహీంద్రా), ప్రశాంత్ ప్రకాశ్ (యాక్సెల్ పార్ట్ న ర్స్), ఆర్జీ చంద్రమోగన్ (హట్సన్ ఆగ్రో ప్రొడెక్ట్స్), సజ్జన్ భజంకా (సెంచురీ ప్లైబోర్డ్స్), సాలీ హోల్క ర్‌కు (రేష్వా సొసైటీ) పద్మశ్రీ అవార్డు వరించింది.
ఒసాము సుజుకీ
1930 జనవరి 30న జపాన్‌లోని గేరోలో జన్మించారు. సుజుకీ మోటార్ కార్పొరేషన్ 1981లో భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ పేరుతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. తర్వాతి కాలంలో మారుతీ సుజుకీ ఇండియాగా కంపెనీ అవతరించింది. దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి విదేశీ కంపెనీ కూడా ఇదే. భారత ప్రభుత్వం ఒసాము సేవలు గుర్తించి 2007లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2024 డిసెంబర్ 25న మరణించారు.
నల్లి కుప్పుస్వామి చెట్టి
తమిళనాడుకు చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త. కాంచీపురంలో 1940 నవంబర్ 9న జన్మించారు. రామకృష్ణ మిషన్ స్కూల్ విద్యాభ్యాసం చేశారు. వాషింగ్టన్ వర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పట్టా అందుకున్నారు. వారసత్వ వ్యాపారమైన నల్లీ సిల్క్ పగ్గాలను 1958లో చేపట్టారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి 2000లో కలైమమణి అవార్డు, భారత ప్రభుత్వం నుంచి 2003లో పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు.
పంకజ్ పటేల్
1953లో జన్మించారు. తండ్రి స్థాపించిన క్యాడిలా హెల్త్‌కేర్‌లో (ప్రస్తుతం జైడస్ లైఫ్‌సైన్సెస్) 1976లో చేరారు. క్యాడిలా ఫ్యాక్టరీకి ఎనమిదేళ్ల వయసు నుంచే తండ్రితో కలిసి వెళ్లే వారు. కంపెనీ తయారీ షుగర్‌ఫ్రీ, ఎవర్‌యూత్ బ్రాండ్లు ప్రాచుర్యం పొందాయి. 70కిపైగా దేశా లకు కంపెనీ విస్తరించింది. భారత్‌లో అయిదవ అతిపెద్ద ఫార్మా సంస్థగా ఎదగడంలో కీలకపాత్ర పోషించారు. 2024 అక్టోబర్‌లో ఫోర్బ్స్‘భారత 100 మంది సంపన్నుల’ జాబితాలో 10.2 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో 24 ర్యాంకులో నిలిచారు.
అరుంధతీ భట్టాచార్య
సేల్స్‌ఫోర్స్ ఇండియా చైర్‌పర్సన్, సీఈవోగా ఉన్నా రు. 1977లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరారు. 2013లో ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్య తలు చేపట్టారు. 200 ఏళ్ల ఎస్‌బీఐ చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా వినుతికెక్కారు. బ్యాంకు మహిళా ఉద్యోగులకు ప్రసూతి లేదా పెద్దల సంరక్షణ కోసం రెండేళ్ల విశ్రాంతి సెలవు విధానాన్ని ప్రవేశపెట్టారు. భారత ఆర్థిక రంగంలో 40 ఏళ్లకుపైగా అనుభవం ఆమె సొంతం. ఫోర్బ్స్ ప్రకటించిన ‘ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల’ జాబితాలో చోటు సంపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment