Padma sri award
-
ఆపిల్ సాగును దేశవ్యాప్తం చేసి, పద్మశ్రీ అందుకున్న హారిమన్
ఆపిల్ పండ్ల తోటలను హారిమన్ శర్మ మంచు కొండల మీద నుంచి మైదాన ప్రాతాల్లోకి తీసుకొచ్చారు. హిమాచల్ ప్రదేశ్‌లోని గల్లసిన్ గ్రామంలో 1956లో ఆయన పుట్టారు. మూడేళ్ల వయసులో తల్లిని కోల్పోయిన ఆయన వ్యవసాయ పనులు చేస్తూ పెరిగారు. కష్టాల్లో పెరిగినప్పటికీ వ్యవసాయంలో కొత్త΄ోకడలను కనిపెట్టాలన్న తపన ఆయనలో ఉండేది. 1992లో విపరీతమైన మంచు వల్ల ఆ ప్రాంతంలో మామిడి చెట్లు నాశనమైనప్పుడు ఆపిల్ సాగు గురించి ఆలోచించారు. చల్లని కొండ ప్రాతాల్లో మాత్రమే ఆపిల్ చెట్లు పెరుగుతాయని మనకు తెలుసు. అయినా, తమ ్ర΄ాంతంలో వాటిని ఎందుకు పెంచకూడదన్న ఆలోచనతో హారిమన్ ప్రయోగాలు చేయటం ప్రాంభించారు.పట్టువిడవకుండా కృషి చేసి సముద్రతలం నుంచి 700 మీటర్ల ఎత్తులోని మైదాన ్ర΄ాంతాల్లో, వేసవిలో 40–45 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే వాతవరణంలో కూడా, ఆపిల్ పండ్లను సాగు చేయవచ్చని రుజువు చేశారు. 2007లో హెఆర్‌ఎంఎన్–99 అనే గ్రాఫ్టెడ్ ఆపిల్ వంగడాన్ని రూపొందించారు. అప్పటి ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ ధుమల్ దృష్టికి వెళ్లటంతో ప్రాచుర్యంలోకి వచ్చారు. ఈ రకం ఆపిల్ పండ్లను ఇప్పుడు దేశంలో తెలుగు రాష్ట్రాలు సహా 29 రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్, జర్మనీలోనూ సాగు చేస్తున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు అనుబంధంగా ఉన్న నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జాతీయ పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అందుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో రైతులకు శిక్షణ ఇవ్వటంతో పాటు లక్ష గ్రాఫ్టెడ్ ఆపిల్ మొక్కలను అందించిన ఘనత ఆయనది. -
Padma awards 2025: పారిశ్రామిక పద్మాలు
ముంబై: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు (Padma awards 2025) ప్రకటించింది. వీరిలో వాణిజ్యం, పరిశ్రమల విభాగం నుంచి 10 మంది ఉన్నారు. జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ సుజుకీ మోటార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, దివంగత ఒసాము సుజుకీని (మరణానంతరం) పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. తమిళనాడుకు చెందిన టెక్స్టైల్ పారిశ్రామికవేత్త నల్లి కుప్పుస్వామి చెట్టి, జైడస్ లైఫ్‌సైన్సెస్ చైర్మన్ పంకజ్ పటేల్ పద్మ భూషణ్ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఇక ఎస్బీఐ మాజీ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్యతోపాటు ఓంకార్ సింగ్ పాహ్వా (అవాన్ సైకిల్స్), పవన్ గోయెంకా (మహీంద్రా), ప్రశాంత్ ప్రకాశ్ (యాక్సెల్ పార్ట్ న ర్స్), ఆర్జీ చంద్రమోగన్ (హట్సన్ ఆగ్రో ప్రొడెక్ట్స్), సజ్జన్ భజంకా (సెంచురీ ప్లైబోర్డ్స్), సాలీ హోల్క ర్కు (రేష్వా సొసైటీ) పద్మశ్రీ అవార్డు వరించింది.ఒసాము సుజుకీ1930 జనవరి 30న జపాన్‌లోని గేరోలో జన్మించారు. సుజుకీ మోటార్ కార్పొరేషన్ 1981లో భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ పేరుతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. తర్వాతి కాలంలో మారుతీ సుజుకీ ఇండియాగా కంపెనీ అవతరించింది. దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన తొలి విదేశీ కంపెనీ కూడా ఇదే. భారత ప్రభుత్వం ఒసాము సేవలు గుర్తించి 2007లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2024 డిసెంబర్ 25న మరణించారు.నల్లి కుప్పుస్వామి చెట్టితమిళనాడుకు చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త. కాంచీపురంలో 1940 నవంబర్ 9న జన్మించారు. రామకృష్ణ మిషన్ స్కూల్ విద్యాభ్యాసం చేశారు. వాషింగ్టన్ వర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో పట్టా అందుకున్నారు. వారసత్వ వ్యాపారమైన నల్లీ సిల్క్ పగ్గాలను 1958లో చేపట్టారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి 2000లో కలైమమణి అవార్డు, భారత ప్రభుత్వం నుంచి 2003లో పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. పంకజ్ పటేల్1953లో జన్మించారు. తండ్రి స్థాపించిన క్యాడిలా హెల్త్‌కేర్‌లో (ప్రస్తుతం జైడస్ లైఫ్‌సైన్సెస్) 1976లో చేరారు. క్యాడిలా ఫ్యాక్టరీకి ఎనమిదేళ్ల వయసు నుంచే తండ్రితో కలిసి వెళ్లే వారు. కంపెనీ తయారీ షుగర్‌ఫ్రీ, ఎవర్‌యూత్ బ్రాండ్లు ప్రాచుర్యం పొందాయి. 70కిపైగా దేశా లకు కంపెనీ విస్తరించింది. భారత్‌లో అయిదవ అతిపెద్ద ఫార్మా సంస్థగా ఎదగడంలో కీలకపాత్ర పోషించారు. 2024 అక్టోబర్‌లో ఫోర్బ్స్‘భారత 100 మంది సంపన్నుల’ జాబితాలో 10.2 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో 24 ర్యాంకులో నిలిచారు.అరుంధతీ భట్టాచార్య సేల్స్‌ఫోర్స్ ఇండియా చైర్పర్సన్, సీఈవోగా ఉన్నా రు. 1977లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరారు. 2013లో ఎస్బీఐ చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్య తలు చేపట్టారు. 200 ఏళ్ల ఎస్బీఐ చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా వినుతికెక్కారు. బ్యాంకు మహిళా ఉద్యోగులకు ప్రసూతి లేదా పెద్దల సంరక్షణ కోసం రెండేళ్ల విశ్రాంతి సెలవు విధానాన్ని ప్రవేశపెట్టారు. భారత ఆర్థిక రంగంలో 40 ఏళ్లకుపైగా అనుభవం ఆమె సొంతం. ఫోర్బ్స్ ప్రకటించిన ‘ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల’ జాబితాలో చోటు సంపాదించారు. -
శ్రీజేష్‌కు పద్మ భూషణ్.. అశ్విన్‌కు పద్మశ్రీ
గణతంత్ర దినోత్సవ పురుష్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. క్రీడా విభాగంలో పలువురుకు పద్మ అవార్డులు వరించాయి.హాకీ మాజీ గోల్ కీపర్ శ్రీజేష్ను కేంద్రం పద్మభూషన్‌తో సత్కరించింది. అదేవిధంగా టీమిండియా స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యాడు. వీరితో పాటు గత ఏడాది ఆర్చరీలో పారాలింపిక్ స్వర్ణం సాధించిన హర్విందర్ సింగ్, మణి విజయన్(ఫుట్ బాల్-కేరళ), సత్యపాల్ సింగ్(కోచ్- ఉత్తరప్రదేశ్)లకు పద్మశ్రీ అవార్డుకు సెలక్టయ్యారు.చదవండి: IND vs ENG: వరుణ్ స్పిన్ మ్యాజిక్.. హ్యారీ బ్రూక్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో -
‘పద్మశ్రీ’పై హేమచంద్ ఎందుకు మనసు మార్చుకున్నారు?
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు హేమచంద్ మాంఝీ ‘పద్మశ్రీ’ని తిరిగి ఇవ్వడంపై మనసు మార్చుకున్నారు. మొదట్లో పద్మశ్రీని వాపసు చేస్తానని ప్రకటించిన ఆయన ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.మావోయిస్టుల బెదిరింపుల నేపధ్యంలో హేమచంద్ మాంఝీ మే 27న తన పద్మశ్రీ అవార్డును ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై పరిపాలన అధికారులు వెంటనే స్పందించారు. కంకేర్ ఎస్పీ ఆయనతో మాట్లాడి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంతలోనే ప్రభుత్వం హేమచంద్ మాంఝీకి వై కేటగిరీ భద్రతను కూడా కల్పించింది. ఈ విధమైన భద్రత లభించిన నేపధ్యంలో హేమ్‌చంద్ మాంఝీ తాను పద్మశ్రీని తిరిగి ఇవ్వబోనని ప్రకటించారు.హేమ్‌చంద్ మాంఝీ నారాయణపూర్ జిల్లాలోని ఛోటాదొంగర్‌లో నివసిస్తున్నారు. మే 26 అర్థరాత్రి వేళ మావోయిస్టులు ఆయనను చంపేస్తామని బెదిరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా మావోయిస్టులు హేమచంద్ మాంఝీని హతమార్చేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో హేమచంద్ కనిపించకపోవడంతో మావోయిస్టులు అతని మేనల్లుడిని హతమార్చారు. హేమచంద్ మాంఝీని మావోయిస్టులు అవినీతిపరుడని ఆరోపిస్తుంటారు. ఆయనను ఈ ప్రాంతంనుంచి తరిమి కొట్టాలని పలుమార్లు ప్రజలకు పిలుపునిచ్చారు.హేమచంద్ మాంఝీ అందిస్తున్న వైద్య సేవలను గుర్తించిన ప్రభుత్వం గత నెలలో ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంలో మాంఝీ మాట్లాడుతూ ‘15 ఏళ్లుగా తాను నారాయణ్‌పూర్‌లో ప్రజలకు చికిత్స అందిస్తున్నానని, నాటి రోజల్లో ఛత్తీస్‌గఢ్‌లో ఆసుపత్రి అంటూ ఏమీ లేదన్నారు. అప్పటి నుంచి తాను వన మూలికలు, ఔషధ మొక్కల సాయంతో ప్రజలకు చికిత్స అందిస్తున్ననని’ తెలిపారు. -
శశి సోనీ ఎవరు? పద్మశ్రీ ఎందుకు వరించింది?
‘నిరంతర శ్రమతోనే విజయం సాధ్యం’ అని అంటారు. శశి సోనీని చూస్తే ఇది నూటికి నూరు శాతం నిజం అనిపిస్తుంది. నేడు ఆమె రూ. 4 వేల కోట్లకు పైగా విలువైన కంపెనీకి యజమానిగా మారి, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. శశి సోనీ రూ. 10,000 ప్రారంభ మూలధనంతో ఒక కంపెనీని ప్రారంభించారని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. నాటి నుంచి నేటి వరకూ శశి సోనీ జీవిత ప్రయాణం అత్యంత ఆసక్తికరంగా సాగింది. 2024 పద్మ అవార్డు గ్రహీతల జాబితాలో శశి సోనీ పేరు కూడా ఉంది. భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో 1941, ఏప్రిల్ 4న శశి సోనీ జన్మించారు. ఆమెకు నాలుగేళ్ల వయసున్నప్పుడు ఆమె కుటుంబం ఢిల్లీకి తరలివచ్చింది. ఢిల్లీలోనే ఆమె విద్యాభ్యాసం సాగింది. శశి 1971లో తన 30 ఏళ్ల వయసులో తొలిసారిగా సొంత వ్యాపారం ప్రారంభించారు. రూ. 10,000 పెట్టుబడితో ఆమె ‘డీప్ ట్రాన్స్పోర్ట్’ను ప్రారంభించారు. దానిని 1975 వరకు నిర్వహించారు. ఆ తర్వాత 1975లో ముంబయిలోని ములుంద్ ప్రాంతంలో ‘దీప్ మందిర్ సినిమా’ పేరుతో మొదటి ఏసీ సినిమా థియేటర్‌ను ప్రారంభించారు. దీనిని శశి సోనీ 1980 వరకు నడిపించారు. దశాబ్ద కాలం పాటు శ్రమించిన శశి ఆ తర్వాత అమోఘ విజయాన్ని అందుకున్నారు. శశి సోనీ ‘ఆక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. మైసూర్లో నెలకొల్పిన ఈ గ్యాస్ తయారీ కర్మాగారంతో ఆమెకు మంచి ఆదాయం సమకూరింది. అనంతరం ఆమె సాంకేతిక రంగంలో కాలుమోపారు. శశి సోనీ 2005లో ఐజెడ్ఎంఓ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ ప్రస్తుతం అమెరికా, యూరప్, ఆసియాలో హైటెక్ ఆటోమోటివ్, ఈ-రిటైలింగ్ సేవలను అందిస్తోంది. ఈ కంపెనీకి చైర్‌పర్సన్‌గా శశి వ్యవహరిస్తున్నారు. ఐజెడ్ఎంఓ లిమిటెడ్.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ జాబితాలో చేరింది. ఈ కంపెనీ విలువ ప్రస్తుతం రూ.4,150 కోట్లకు చేరింది. శశి ‘దీప్ జనసేవా సమితి’ సభ్యురాలు. ఈ సంస్థ మహిళలకు ఉద్యోగాలు కల్పించడంలో సహాయం చేయడంతో పాటు, మహిళలకు పలు అంశాలపై అవగాహన కల్పించడం, పెన్షన్ పథకాలు ప్రారంభించడం, వికలాంగుల కోసం నిధుల సేకరణ తదితర సేవా కార్యక్రమాలను చేస్తుంటుంది. ఐజెడ్ఎంఓ లిమిటెడ్ కంపెనీకి పలు అనుబంధ కంపెనీలు కూడా ఉన్నాయి. పద్మశ్రీ అవార్డుకు ముందు శశి సోనీ వ్యాపార, సామాజిక సంక్షేమ రంగాల్లో పలు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. 1990లో ఆమె మహిళా గౌరవ్ అవార్డును అందుకున్నారు. ఆమె ఆల్ ఇండియన్ ఇండస్ట్రియల్ గ్యాస్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ మేనేజింగ్ కమిటీ సభ్యురాలిగా కూడా ఉన్నారు. అలాగే ఆమె డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్లో కూడా సభ్యురాలిగా కొనసాగుతున్నారు. -
ఐశ్వర్య రాయ్ బర్త్‌డే @ 50.. ఆమె పేరుతో ఫ్లవర్.. కోట్లల్లో సంపద
ఆమె అందాల రాశి, నీలి కళ్ల సుందరి, ప్రపంచ సుందరి ఇలా ఎన్నో ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ఉన్న ట్యాగ్‌లైన్స్.. నేడు ఆమె పుట్టినరోజు. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న కూడా వన్నె తరగని అందం ఆమె సొంతం. మిస్ వరల్డ్ కిరీటం కూడా ఆమె ధరించాకే దానికి విలువ పెరిగిందా అనేలా ఆమె సోయగం ఉంటుంది. అలా ఒక నటిగా, బచ్చన్ కుటుంబానికి కోడలిగా, మంచి భార్యగా, తల్లిగా ఎప్పుడూ బాధ్యతలు మర్చిపోలేదు. నేడు నవంబర్ 1న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఐశ్వర్యరాయ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం... ఐష్ స్వస్థలం కర్ణాటకలోని మంగుళూరు. ఆమె కాలేజీలో చదువుకునేప్పటి నుంచే మోడలింగ్ చేసేవారు. కొన్ని టీవీ ప్రకటనల్లోనూ నటించిన ఆమె, మిస్ ఇండియా పోటీల్లో రెండో స్థానాన్ని సంపాదించుకున్నారు. 1994లో మిస్ వరల్డ్ పోటీల్లో విజేత అయ్యి విశ్వసుందరిగా నిలిచారు. ఆ తరువాత ఆమె సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. 1997లో తమిళ సినిమా ఇరువర్ (ఇద్దరు)తో తెరంగేట్రం చేశారు ఐశ్వర్య. అదే సంవత్సరం హిందీలో ఔర్ ప్యార్ హో గయా సినిమాలో నటించారు. తమిళ్లో నటించిన జీన్స్ (1998) సినిమాతో మొదటి హిట్ అందుకున్నారు ఐశ్వర్య. సల్మాన్‌తో గొడవ.. అభిషేక్ బచ్చన్‌తో పెళ్లి అలా బాలీవుడ్లో కూడా ఆమెకు ఎదురు లేకుండా పోయింది. అక్కడ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఐశ్వర్య నటించింది. 1999 నుంచి నటుడు సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ చేస్తూ వచ్చిన ఐశ్వర్య ఎప్పుడూ వార్తల్లోనే ఉండేవారు. 2002లో వీరిద్దరూ విడిపోయారు. తన గురించి అసభ్యంగా మాట్లాడి తనను అవమానించినందుకే ఆయనతో విడిపోయానని వివరించారు ఆమె. ధూమ్2 సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్ బచ్చన్‌తో ఐశ్వర్య ప్రేమలో పడ్డారు. 14 జనవరి 2007న వారు నిశ్చితార్ధం చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత అభిషేక్ తండ్రి అమితాబ్ బచ్చన్ దానిని ధృవీకరించారు. 20 ఏప్రిల్ 2007న బంట్ సంప్రదాయం ప్రకారం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పుట్టుకతో హిందువైన ఐశ్వర్యకు సంప్రదాయాలు, ఆచారాలు, భక్తి ఎక్కువ. 16 నవంబరు 2011న వీరికి ఒక పాప జన్మించింది. ఆమెకు ఆరాధ్య అని పేరు పెట్టారు. 50వ పుట్టినరోజు ఈ సందర్భంలో, నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఈరోజు తన 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. స్క్రీన్ స్టార్ల అభిమానులుగా అందరూ ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సమయంలో మిస్ వరల్డ్‌గా కీర్తించబడుతున్న ఐశ్వర్యరాయ్ ఆస్తి సమాచారాన్ని ఒకసారి చూద్దాం. దాదాపు మూడు దశాబ్దాలుగా నటిగా వెలుగొందుతున్న ఐశ్వర్యరాయ్ బచ్చన్ నికర విలువ రూ. 776 కోట్లుగా అంచనా వేయబడింది. ఆమె భారతీయ సినిమాలో అత్యంత ధనిక నటీమణులలో ఒకరిగా గుర్తించపడ్డారు. ముంబైలోని రూ. 112 కోట్ల విలువైన బంగ్లాలో తన కుటుంబంతో ఆమె కలిసి నివసిస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఆమె ఒక సినిమాకు రూ. 10 కోట్ల నుంచి 12 కోట్లు తీసుకుంటుందని ప్రచారం ఉంది. ప్రకటనల కోసం అయితే సుమారు రూ. 6 కోట్ల రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు సమాచారం. ఐశ్వర్య రాయ్ జీవితంలో ఇవన్నీ ప్రత్యేకం ► డాక్టర్ కావాలని యాక్టర్ అయిన ఐశ్వర్య.. కాలేజీ రోజుల్లో ఆమె పెప్సీ యాడ్ చేసింది. దీంతో వచ్చిన గుర్తింపుతో మోడలింగ్ వైపు వెళ్లింది ► 1994లో ఐష్ 'మిస్ వరల్డ్' కిరీటాన్ని సొంతం చేసుకుంది. అదే ఏడాది సుస్మితా సేన్ 'మిస్ యూనివర్స్'గా నిలిచింది. ► ఐశ్వర్యకు భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. ఈమె నటించిన 'జోధా అక్బర్' చిత్రంలో ఆమె లుక్ ఆధారంగా బార్బీ బొమ్మలను తయారు చేశారు. ► నెదర్లాండ్స్‌లోని క్యూకెనోఫ్ గార్డెన్లో ఉన్న తులిప్ పువ్వుల్లోని ఒక ప్రత్యేక జాతికి ఐశ్వర్య రాయ్ పేరు పెట్టారు. ► సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం..ఆయనకు అభిమాని ఐశ్వర్య ► 2009లో భారత ప్రభుత్వం 'పద్మ శ్రీ' అవార్డుతో ఐశ్వర్యను సత్కరించింది ► 2012లో ఆమెకు బ్రిటన్ ప్రభుత్వం 'ఆడ్రె డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెట్రెస్' పురస్కారాన్ని అందించింది. ► 2003లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ సభ్యురాలిగా ఐష్ వ్యవహరించారు. ఈ ఘనత దక్కిన తొలి భారతీయు నటి ఆమెనే ► 2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌లకు వివాహమైంది. హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఒక్క రూపాయి తీసుకోకుండా.. వందల కొద్ది బ్రిడ్జ్‌లను నిర్మించాడు!
ఎన్నో మారు మూల ప్రాంతాలను నగరాలతో అనుసంధానమయ్యేలా చేశాడు. స్కూళ్లకు, ఆస్పత్రులకు వెళ్లేందుకు ఇబ్బంది ఉండే మారూమూల ప్రాంతాలకు అతను వారధిగా నిలిచాడు. వందలకొద్ది వంతెనలను అలవోకగా నిర్మించాడు. ఒక్క రూపాయి ఆశించకుండా, ఎలాంటి సాయం తీసుకోకుండా ఉచితంగా నిర్మించాడు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. ఆ సమాజా సేవ అతనికి ఎన్నో అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టాయి. అతడే బ్రిడ్జ్మ్యాన్గా పిలిచే గిరీష్ భరద్వాజ్ భరద్వాజ్ కర్ణాటకకు చెందిన ఇంజనీర్. నదులు, వాగుల వద్ద ఉండే మారుమూల గ్రామాలను నగరాలతో కనెక్టవిటీ అయ్యేందుకు ఎంతగానో కృషి చేశాడు. ఆయా గ్రామాల్లో ఉండే విద్యార్థులు, ప్రజలు సీటీకి వెళ్లాలంటే వాగులు, వంకలు దాటేల్సింది. నిత్యం వారికది సాహస క్రీడగా మారింది. దీన్ని చూసి చలించిపోయిన భరద్వాజ్ ఆయా ప్రాంతాల్లో బ్రిడ్జ్‌లు నిర్మిస్తే వారి సమస్య తీరుతుందని భావించి ప్రభుత్వాన్ని ఆశ్రయించగా.. సాయం చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆయనే స్వయంగా నిర్మించేందుకు పూనుకోవాలనే ధృఢ నిశ్చయానికి వచ్చాడు. అందుకోసం తక్కువ ఖర్చుతో నిర్మించి బ్రిడ్జిల కోసం అన్వేషించాడు. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం స్టీల్ కేబుల్స్ ఎంచుకుని వేలాడే బ్రిడ్జ్‌లను నిర్మించాలనే ఓ నిర్ణయానికి వచ్చాడు. అలా మొత్తం వివిధ ప్రాంతాల్లో సుమారు 128 బ్రిడ్జ్‌లు అలవోకగా నిర్మించాడు. మొదటగా కావేరి నదిపై కుశాల్నగర్ సమీపంలోని నిసర్గధామ ద్వీపాన్ని కర్ణాటక ప్రధాన భూభాగన్ని కలిపేలా 55 మీటర్ల బ్రిడ్జ్‌తో అతని ప్రయాణం ప్రారంభమైంది. అలా అతను తక్కువ ఖర్చుతో బ్రిడ్జ్‌లు నిర్మించిన వ్యక్తిగా ఘనత సాధించడమే గాక ఇలా ఎన్నో మారుమూల ప్రాంతాలను నగరాలతో కనెక్ట్ అయ్యేలా చేసి 'బ్రిడ్జ్‌మ్యాన్ ఆప్ ఇండియాగా పేరుగాంచాడు. ఆయన చేసిన కృషికిగానూ భారత ప్రభుత్వం పద్శశ్రీతో సత్కరించింది. భరద్వాజ్ ఓ కార్యక్రమంలో మట్లాడుతూ..నేను చాలా విస్తృతంగా పనిచేశాను. దురదృష్టమేమిటంటే ప్రతిభావంతులైన చాలా మంది గుర్తించబడటం లేదు. 1980 దశకంలో మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. జీవితంలో క్రూరంగా మారిన ఏ వ్యక్తినైనా ప్రేమ, ఆప్యాయతతో తిరిగి సమాజంలోని జనజీవన స్రవంతిలోకి తీసుకురావచ్చు. అందుకు కావల్సిందల్లా మానవత్వం, ప్రేమ ఉంటే చాలని చెప్పారు. ఇక ఆయన జీవితం ఆధారంగా కన్నడ నిర్మాత సంతోష్ కోడెంకేరి ది బ్రిడ్జ్‌మ్యాన్ అనే బయోపిక్‌ను రూపొందిస్తున్నారు. దీనిని కన్నడలో నిర్మించి హిందీలో కూడా విడుదల చేయనుండటం గమనార్హం. (చదవండి: 20 కుటుంబాలు ఇళ్ళు హామీ పెట్టి.. బ్యాంకు రుణం తెచ్చి కట్టిన గుడి !) -
‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. మొత్తం 106 మందికి
సాక్షి, న్యూఢిల్లీ: 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. 2023 సంవత్సరానికి ఆరుగురికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ దక్కింది. 9 మందికి పద్మభూషణ్, 91 మంది పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఈసారి ఎవరికీ ప్రకటించలేదు. ఇటీవల మరణించిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ దివంగత నేత ములాయంసింగ్ యాదవ్‌తో పాటు ప్రముఖ తబల వాయిద్య కళాకారుడు జాకీర్ హుస్సేన్, మాజీ విదేశాంగ మంత్రి, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ పద్మ విభూషణ్ గ్రహీతల్లో ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామితో పాటు ప్రఖ్యాత పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లా, సుధామూర్తి, గాయకురాలు వాణీ జయరాం తదితరులు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన వారిలో ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 10 మందికి పద్మశ్రీ పురస్కారం లభించింది. వీరిలో ఏపీ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సామాజిక సేవకుడు సంకురాత్రి చంద్రశేఖర్ సహా ఏడుగురు, తెలంగాణ నుంచి సాహితీవేత్త బి.రామకృష్ణారెడ్డితో పాటు మొత్తం ముగ్గురున్నారు. అలాగే ఆధ్యాత్మిక రంగంలో కమలేశ్ డి.పటేల్‌కు కూడా తెలంగాణ కోటాలో పద్మభూషణ్ దక్కడం విశేషం. మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా దూదేకుల ఖాదర్ వలీకి కర్నాటక కోటాలో పద్మశ్రీ లభించింది. పద్మ అవార్డుల విజేతల్లో 19 మంది మహిళలు, ఇద్దరు విదేశీ/ఎన్ఆర్ఐ కేటగిరీకి చెందినవారున్నారు. పద్మ పురస్కారాల విజేతలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. తమ తమ రంగాల్లో వారు చేసిన కృషి సాటిలేనిదంటూ ప్రశంసించారు. ప్మద అవార్డుల గ్రహీతలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రపతి భవన్లో ఏటా మార్చి లేదా ఏప్రిల్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్ ములాయంసింగ్ యాదవ్ (మరణానంతరం), జాకీర్ హుస్సేన్, ఎస్ఎం కృష్ణ, ఆర్కిటెక్ట్ బాలకృష్ణ దోషీ (మరణానంతరం), ఓఆర్ఎస్ సృష్టికర్త దిలీప్ మహాలనబిస్ (మరణానంతరం), ఇండో–అమెరికన్ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ వర్ధన్ పద్మభూషణ్ చినజీయర్ స్వామి (ఆధ్యాత్మిక రంగం), కుమారమంగళం బిర్లా (వాణిజ్యం, పరిశ్రమలు), వాణీ జయరాం (కళ), సుధామూర్తి (సామాజిక సేవ), కమలేష్ డి.పటేల్ (ఆధ్యాత్మిక రంగం), ఎస్ఎల్ భైరప్ప (కళ), దీపక్‌ధర్ (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), సుమన్ కల్యాణ్‌పుర్ (కళ), కపిల్ కపూర్ (సాహిత్యం–విద్య) పద్మశ్రీ ఏపీ నుంచి: సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (కళ), సంకురాత్రి చంద్రశేఖర్ (సామాజిక సేవ), గణేశ్ నాగప్పకృష్ణరాజనగర (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), సీవీ రాజు (కళ), అబ్బారెడ్డి నాగేశ్వరరావు (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), కోట సచ్చిదానంద శాస్త్రి (కళ), ప్రకాశ్ చంద్రసూద్ (సాహిత్యం–విద్య). తెలంగాణ నుంచి: మోదడుగు విజయ్ గుప్తా (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), హనుమంతరావు పసుపులేటి (వైద్యం), బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం–విద్య). పద్మశ్రీ దక్కిన ప్రముఖుల్లో మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఖాదర్ వలీతో పాటు స్టాక్ మార్కెట్ మాంత్రికుడు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా (మరణానంతరం), సినీ నటి రవీనా టాండన్ తదితరులున్నారు. -
ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు
కేంద్ర ప్రభుత్వం జనవరి 25న ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాలలో అవార్డు గ్రహీతగా నిలిచిన సకిన రామచంద్రయ్య తెలంగాణ ఆదివాసీ జానపద కళాకారుడు. ఆసియాలోనే అతిపెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారక్కల పోరాట వీర గాథలను, కోయల ఇలవేల్పుల కథలను డోలి సహాయంతో పొల్లు పోకుండా చెప్పడంలో నేర్పరి. సకిన రామచంద్రయ్యది కోయదొరల వంశం. కోయజాతిలో సంప్రదాయ వేడుకలను జరిపించడంలో డోలీలు ప్రధాన భూమిక పోషిస్తారు. డోలి ఉపతెగకు చెందిన రామచంద్రయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం కూనవరం గ్రామంలో ముసలయ్య, గంగమ్మలకు 1960లో జన్మించాడు. ఈ పద్మశ్రీ గుర్తింపు ఆయన పేదరి కాన్ని ఆదుకోలేకపోయినా మరుగున పడుతున్న డోలికళకు పునరుజ్జీవం తేగలుగుతుంది. గిరిజనుల ఇలవేల్పుల చరిత్రని ఉయ్యాల పాటలు పాడుతూ చెప్పడంలో దిట్ట రామచంద్రయ్య. చదువు కోలేకపోతేనేం... ఆదివాసీల మూలాలు, సంప్రదా యాలని గడగడ చెప్పేస్తాడు. వనదేవతల కథల్ని అక్షరం పొల్లు పోకుండా చెప్తాడు. ఆదివాసుల జాతరల్లో, పండుగల్లో రామచంద్రయ్య పాట ఉండాల్సిందే. (క్లిక్: మన తెలుగు పద్మాలు వీరే...) డోలీ అంటే – రెండు అడుగుల వెడల్పు, మరి కొద్ది ఎక్కువ పొడవుతో వుండే చర్మవాద్యం. ఈ వాద్యాన్ని ఎక్కువగా కోయల ప్రత్యేక పూజలో డోలీ కోయలు వాయిస్తారు. వీరు కోయ ప్రజల కొలుపులు, జాతరలు చేస్తారు. అంతేకాదు చావు, పుట్టుకలకి కర్మ కాండలు నిర్వహిస్తారు. పెళ్లిళ్లు చేస్తారు. ఆ సమయంలో ఈ డోలు తప్పనిసరి. అంటే ఇది ఒక రకంగా అధికారిక కోయవాద్యం. పేరుకి డోలు అంటారు. కాని ఇది కోయ సంస్కృతికి మూలాధారం. డోలీలు ఈ డోలు వాయిస్తూ దాచి వుంచిన ‘పడిగె’ని తీసి వివిధ జాతర సందర్భాలలో పగిడిద్దరాజు, ఎరమరాజు, బాపనమ్మ, గడికామరాజు, గాదిరాజు, గోవిందరాజు, ఉయ్యాల బాలుడు, దూల రాజు, ఒర్రె మారయ్య, కొమ్ములమ్మ, గుంజేడు ముసలమ్మ వంటి కోయ తెగ వీరులు/ వివిధ గోత్రాల వారి కథలు చెబుతారు. ఈ వాద్యకారులు కోయ చరిత్రని, సంస్కృతిని కాపాడే చరిత్రకారులు. (చదవండి: నిబద్ధ కెమెరా సైనికుడు.. సెల్యూట్ మై ఫ్రెండ్!) తన ముగ్గురు కూతుళ్ళకు డోలీ కథల వారసత్వం రాకపోవడంతో ఇన్నాళ్ళు సంప్రదాయంగా కాస్తో కూస్తో జీవనోపాధి కల్పించిన ఈ కళ కనుమరుగు కాకూడదని తనయుడు బాబురావుకు నేర్పించే ప్రయత్నంలో ఉన్నాడు రామచంద్రయ్య. ప్రభుత్వం ఈ సంప్రదాయ డోలి కళకు ప్రాచుర్యం కల్పిస్తూ ఈ నిరుపేద గిరిజన కుటుంబాన్ని కూడా అన్నివిధాల ఆదుకోవాలని కోయగిరిజనులు కోరుతున్నారు. (చదవండి: తెలుగు కవితా దండోరా ఎండ్లూరి) – గుమ్మడి లక్ష్మినారాయణ ఆదివాసీ రచయితల వేదిక -
అది ఒక మహాఫల ప్రదానం
తీయని ఫలాల్ని దర్శిస్తాం, చవిచూస్తాం. కానీ ఫలాలుగా మారడానికి ముందు చెట్ల కళ్లు కాయలుగా కాస్తాయి. అంతకు ముందు పిందెల అందాలు చూస్తాం. నేల బిలాలు, జలాలు రసపుష్టి కలిగించ డంలో ఎంతో కృషి ఉంది. ఎంతో భూమిక ఉంది. ఇంతకు ముందే గౌరవ సమ్మాన ఫలాల్ని దర్శించి, రుచి చూసిన గరికిపాటి నరసింహారావును ఇప్పుడు భారత ప్రభుత్వం వారి ‘పద్మశ్రీ’ వరించడం ఆయన నిరంతర సాహిత్య కృషికి ఒక మహాఫల ప్రదానం. గరికిపాటిలో– నిరంతర విద్యార్థి, బోధకుడు, పరిశోధకుడు, మహాసహస్రావధాని, అసాధారణ ధారణా ధురీణుడు ఉన్నారు. ‘భాష్పగుచ్ఛం, మా అమ్మ, శతావధాన భాగ్యం, అవధాన శతకం’ వంటి కావ్యాల కర్త. కవితా ప్రయోగ శీలి, ఆధ్యాత్మిక ప్రసంగ ప్రవచనకర్త. ఇందరు బహుముఖ ప్రతిభా రూపాలుగా ఉండటం చాలా తక్కువమందిలో ఉంటుంది. ఆయన ప్రాచీన ఛందో రూపాలైన పద్యాలను ఆధునిక అంశాలతో చెప్పినా, ఉపన్యాసాలలో రొడ్డ కొట్టుడు మూఢ భావాలను చెండాడుతూ సంస్కార భావాలు వెదజల్లినా అందుకు గణనీయ నేపథ్యాలున్నాయి. ఇవి వీరేశలింగం నడయాడిన రాజమహేంద్ర వరంలో ఏర్పడ్డాయి. ఆయన రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ పరిశోధన చేశారు. ఆచార్య జయధీర్ తిరుమలరావు ఆధ్వర్యంలో ‘మౌఖిక సాహిత్యం’పై పరిశోధన చేసి రెండు స్వర్ణ పతకాలు పొందారు. ఆ పరిశోధన గ్రంథానికి ‘మౌఖిక సాహిత్యంపై మౌలిక పరిశోధన’ శీర్షికతో అపూర్వ పరిశోధనాంశాలతో ఒక పీఠిక సంతరించారు తిరుమల రావు. నరసింహారావు ఈ గ్రంథం తెలుగులో ఈ విష యమై మొదటి గ్రంథం అని ప్రామాణికతతో చెప్పా రంటే పరిశోధనా పాటవం తెలుస్తుంది. తిరు మల రావుగారితో చర్చలు, ఆయన ఆధునిక శాస్త్రీయ భావాలు గరికిపాటిపై ప్రభావాన్ని చూపాయి. నరసింహారావు రాసిన భౌతిక మానసిక పర్యా వరణ మహాకావ్యం ‘సాగరఘోష’. ఈ కావ్యానికి ‘తరంగం అంతరంగం’ శీర్షికతో బేతవోలు రామబ్రహ్మం పీఠిక రాశారు. అందులో రాజశేఖరుని ఉటం కిస్తూన్న సందర్భంలో ‘అవధానాలతో ఆగిపోకుండా, అవే మహాకావ్యాలని ఆత్మవంచన చేసుకోకుండా గరికి పాటి ఈ కావ్యరచన చేశారు’ అని మెచ్చుకున్నారు. గరికిపాటి పద్య రచనా శక్తికి ‘సాగరఘోష’ ప్రతి బింబం. ‘ఇది విశ్వకార్యం. భూమి చరిత్రే ఈ కావ్య ఇతివృత్తం’ అన్నారు. ఒక తరంగ బాలిక ఒక కవి వద్ద సేద తీరుతుంది. కవి కవిత్వంతో లాలిస్తాడు. ఆ కెరటం మేలుకుని అది తిరిగి వచ్చిన సముద్ర తీరాల విశేషాలను చెబుతుంది. మానవుని జీవిత కథ అంతా స్థూలంగా చెబుతుంది. అదే ‘సాగర ఘోష’.గరికిపాటి కవితాశక్తి, భావుకత, సరళ పద్య నిర్మాణ పటుత్వం, ప్రాపంచిక జ్ఞానాంశాలూ ఈ కావ్యంలో ప్రస్ఫుటమవుతాయి.‘సాగర ఘోష’ పర్యావరణ కావ్యం. ఓ పద్యంలో ఓల్గా, టైగ్రిస్, థేమ్స్ మొదలైన నదులు... తమ తీరాలపై పెరిగే కాలుష్యాలను తొలగించేవారే లేరా అని బాధపడుతాయట. ప్రవాహాలకే తమ మౌన వ్యధలు వినిపిస్తాయంటారాయన. ఓ చిన్న పద్యంలో మనం సముద్రం ‘ఉప్పు’ తిని దానికే ముప్పు చేరుస్తామంటారు. వన్యప్రాణి రక్షణ చేయాలని చెబుతూ లేళ్లు, దుప్పులు, కుందేళ్లు, కృష్ణ జింకలు వంటి అరుదైన జంతువులు మన మింగుళ్లకు బలి అయిపోతున్నాయని ఆవేదన చెందుతారు.అగ్గిపెట్టెలో ఆరు గజాల చీర పెట్టే నేర్పు ఉన్న నేత పనులవారి చేతులు తెగకోసిన ఆంగ్లేయుల్ని గరికిపాటి అధములైన ఆంగ్ల వీరులు అని ఎద్దేవా చేస్తారు. మార్పుకోసం, మంచి కోసం, మనిషి కోసం ‘సాగర ఘోష’ రాశానన్నారు గరికిపాటి. ఈ మానవ మార్గం విస్తరిస్తూనే ఉండాలి. గరికిపాటిలోని గుప్త జానపదుడు రచనల ద్వారా దర్శనమిస్తూనే ఉండాలి. - సన్నిధానం నరసింహశర్మ వ్యాసకర్త మాజీ గ్రంథాలయ పాలకులు, శ్రీగౌతమీ గ్రంథాలయం, రాజమండ్రి మొబైల్ : 92920 55531 -
దేవేంద్ర ఝఝరియాకు పద్మభూషణ్.. నీరజ్ చోప్రాకు పద్మశ్రీ
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది.128 మందిలో నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 107 మందికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటించగా.. క్రీడారంగంలో 9 మంది పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. వీరిలో పారాఒలింపిక్ అథ్లెట్ దేవేంద్ర జజేరియా భారతదేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాను పద్మశ్రీ వరిచింది. మిగతావారిలో సుమిత్ అంటిల్(పారాఅథ్లెట్), ప్రమోద్ భగత్(షూటింగ్), శంకర్‌నారాయణ్ మీనన్, ఫసల్అలీ దార్, వందన కటారియా(హాకీ), అవనీ లేఖరా(షూటింగ్), బ్రహ్మానంద్ సంక్వాల్కర్లను కూడా పద్మశ్రీ వరించింది. దేవేంద్ర ఝఝరియా: దేవేంద్ర ఝఝారియా ..2004 పారాలింపిక్స్‌లో స్వర్ణం...2021లో రజతం... ఈ రెండింటి మధ్య 2016లో మరో ఒలింపిక్ స్వర్ణం... ఇది అతని గెలుపు ప్రస్థానం. ఒక్క మాటలో చెప్పాలంటే పారాలింపిక్స్‌లో భారత్‌కు పర్యాయదంగా ఝఝారియా నిలిచాడు. 2004లో అతను స్వర్ణం సాధించిన రోజు దేశంలో ఎంత మందికి తెలుసు? ఇప్పుడు ఎన్ని కోట్ల మంది పారాలింపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు? ఈ పురోగతిలో అతను పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. సొంత డబ్బులు పెట్టుకొనని ఒలింపిక్స్‌కు: సొంత డబ్బులు పెట్టుకొని ఝఝారియా 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌కు వెళ్లాల్సి వచ్చింది.అందుకోసం అతని తండ్రి అప్పు కూడా చేశాడు. ఒక గొడ్డలి, ఒక సైకిల్ ట్యూబ్ అతని ప్రాక్టీస్ కిట్ అంటే నమ్మగలరా! భుజాలను బలంగా మార్చేందుకు గొడ్డలిని ఉపయోగించడం, చేతిలో బలం పెరిగేందుకు సైకిల్ ట్యూబ్‌ను వాడటం... ఇలాంటి స్థితిలో స్వర్ణం సాధించిన రోజుల నుంచి టోక్యోలో మూడో పతకం సాధించే వరకు దేవేంద్ర భారత పారా క్రీడలకు ప్రతినిధిగా వ్యవహరించగలిగాడంటే ఆ విజయాల వెనక ఎంతో శ్రమ, పట్టుదల ఉన్నాయి. ఎనిమిదేళ్ల వయసులో చెట్టు ఎక్కుతుంటే కరెంట్ షాక్ తగిలి ఝఝారియా తన ఎడమ చేతిని కోల్పోయాడు. అయితే పెరిగి పెద్దవుతున్న సమయంలో అతని చేతిని చూసి చుట్టుపక్కల పిల్లలు ‘కమ్జోర్’ అంటూ ఆట పట్టించడం మొదలు పెట్టారు. తాను బలహీనుడిని కాదని చూపించాలనే కసితో బల్లెం పట్టిన అతను మూడు ఒలింపిక్ పతకాలు అందుకునే వరకు ఎదగడం అసాధారణం. 2008, 2012 పారాలింపిక్స్‌లో దేవేంద్ర పాల్గొనే ఎఫ్–46 కేటగిరీ లేకపోవడంతో అతనికి మరో రెండు పతకాలు దూరమయ్యాయని కచ్చితంగా చెప్పవచ్చు. నీరజ్ చోప్రా: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి భారత్ త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో భాగంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. తద్వారా 100 ఏళ్ల తర్వాత భారత్ తరఫున అథ్లెటిక్స్ ఫీల్డ్ అండ్ ట్రాక్ విభాగంలో పతకాన్ని అందించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా పానిపట్ జిల్లాలోని కందారా గ్రామంలో 1997, డిసెంబర్ 24న జన్మించాడు. చంఢీఘర్‌లోని డీఏవీ కాలేజ్‌లో చదువుకున్న నీరజ్ చిన్న వయసులోనే ఇండియన్ ఆర్మీకి సెలక్ట్ అయ్యాడు. ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్ సుబేదార్‌గా పనిచేస్తోన్నాడు. 2018 ఏషియన్ గేమ్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో 88.06 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించిన నీరజ్ స్వర్ణం గెలవడం ద్వారా ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఇప్పటికీ 88.06 మీటర్ల ప్రదర్శన అతని అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఆ తర్వాత 2018లోనే జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా 86.47 మీటర్లు విసిరి మరోసారి స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. -
Jogati Manjamma Story: చచ్చిపోదామని విషం తాగాను
-
వారినలా విసిరివేయకండి: చచ్చిపోదామని విషం తాగాను
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న జానపద నృత్యకారిణి మంజమ్మ జోగతి. పద్మశ్రీ పొందిన తొలి ట్రాన్స్‌విమెన్. కేవలం జోగప్పలకు పరిమితమైన జోగతి నృత్యాన్ని మరింత విస్తరించాలనేది ఆమె కల. ఈ నేపథ్యంలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగానే ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా ఇండియా టుడేకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు మంజమ్మ. పదిహేనేళ్లు ఉన్నప్పుడు ట్రాన్స్‌జెండర్‌గా కుటుంబానికి దూరమయ్యారు. ఇంటినుంచి బైటపడి బతుకుదెరువు కోసం వీధుల్లో భిక్షాటన చేయడమే కాదు, ఆమె పలుమార్లు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఒకానొక దశలో విషం తాగి చచ్చిపోవాలకుని ఆత్మహత్యాయత్నం చేశారు. కానీ ప్రాణాలతో బయటపడ్డారు. అయినా 20 మంది తోబుట్టువులతో సహా ఆమె కుటుంబ సభ్యులెవరూ తనను పలకరించేందుకు ఆసుపత్రికి రాలేదని ఆమె వాపోయారు. ఈ అవార్డు ద్వారా, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ హక్కులను గుర్తించి వారికి విద్య, ఉద్యోగాలు అందించేలా ప్రభుత్వాలు పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యం చేయకుండా, మూలకు విసిరి వేయకుండా తనలాంటి ట్రాన్స్‌జెండర్ పిల్లలను ఆదరించాలని ఆమె ఉద్వేగ భరితంగా చెప్పుకొచ్చారు. మంజమ్మ అసలు పేరు మంజునాథ్ శెట్టి. 1964 ఏప్రిల్ 18న బళ్లారి, కల్లుకాంబ గ్రామంలో హనుమంతయ్య, జయలక్ష్మి దంపతులకు జన్మించిన మంజునాథ్ అలియాస్ మాత మంజమ్మ జోగతి జీవిత విశేషాలపై ఆసక్తికర వీడియో మీకోసం.. -
చీర కొంగుతో రాష్ట్రపతిని ఆశీర్వదించింది
-
పునీత్‌కు పద్మ శ్రీ ఇవ్వాల్సిందే !!
బెంగళూరు: ఇటీవల మరణించిన కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం 'పద్మశ్రీ' అవార్డు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయండి అంటూ కర్ణాటక ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రలు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువస్తున్నారు. (చదవండి: ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!) కన్నడ సూపర్‌స్టార్ ఇటీవల అక్టోబర్ 29న 46 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ మాట్లాడుతూ" పునీత్ రాజ్‌కుమార్ జీవించి ఉన్నప్పుడే ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఉండాల్సిందని, అయితే దురదృష్టవశాత్తు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవడంతో మరణానంతరం ఇవ్వాల్సిందే. నేను అతని అభిమానినే. పునీత్‌కి నటుడిగానే కాకుండా, సమాజానికి అందించిన సేవల కోసమైన ఇవ్వాల్సిందే. పైగా అతనికి ఆ అర్హత ఉంది. అని అన్నారు. అంతేకాదు పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్ మాట్లాడుతూ.. 'పునీత్ రాజ్‌కుమార్ మానవాళికి సేవ చేయాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి, నేను సామాజిక సేవలో ఉన్నప్పుడు పల్స్ పోలియో వంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మాతో కలిశాడు. ఆయనకు పద్మశ్రీని ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేయాలి " అని అన్నారు. అయితే ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రతిపక్ష కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య.. పునీత్‌కు మరణానంతరం పద్మశ్రీ ప్రదానం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ట్విట్టర్లో కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ... “పద్మ అవార్డులకు ఎప్పుడు, ఏ రంగాల వ్యక్తులను సిఫారసు చేయాలనే దానిపై కొన్ని నియమాలు ఉన్నాయి. ఇది ఒక విధంగా పునీత్ రాజ్‌కుమార్‌కు ఏకగ్రీవ సిఫార్సు అవుతుందేమో. ఏదిఏమైన ప్రభుత్వ పరంగా అన్నీ విషయాలు పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. (చదవండి: విచిత్రమైన వంటకం...అదే ఏం పకోడి రా బాబు!) -
వ్యవసాయం పద్మశ్రీ తెస్తుందని ఊహించలేదు
కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం దక్షిణాదిలోనే మొట్ట మొదటిదన్న విషయం తెలిసిందే. దీనికున్న మరో విశిష్టత గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉంది. అదేమిటంటే.. ఈ విద్యాసంస్థ ఏభయ్యేళ్ల క్రితం నుంచే ‘రైతులకు సేంద్రియ వ్యవసాయా’న్ని నేర్పిస్తూ ఉంది! అందుకు ప్రత్యక్ష నిదర్శనం 104 ఏళ్ల పాపమ్మాళ్!! రసాయనిక రైతుగా 30 ఏళ్ల వ్యవసాయానుభవం తర్వాత.. 50 ఏళ్ల క్రితం.. కోయంబత్తూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ‘సేంద్రియ వ్యవసాయం’ నేర్చుకున్నారు. అనుదినం తానే నడుము వంచి పొలం పనులు చేసుకుంటున్న ఈ ‘మహా రైతమ్మ’ను పద్మశ్రీ పురస్కారం వరించింది.ఆమెను ‘సాక్షి’ పలుకరించింది.. తోట పనిలో పాపమ్మాళ్ మీరు వ్యవసాయంలోకి మీరెలా వచ్చారు? పొట్ట కూటి కోసం ఎంతకష్టమైనా పడకతప్పదు. 1914లో పుట్టాను. చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోయారు. వారు నడిపే టీ బంకు మూతపడటంతో చెల్లితో కలిసి నానమ్మ దగ్గరకు చేరుకున్నాను. నానమ్మది కూడా ఫలసరుకుల దుకాణం పెట్టుకుని జీవితాన్ని నెట్టుకొచ్చే పేద కుటుంబం కావడంతో.. ఆమెకు సహకరిస్తూ రెండో క్లాసులోనే చదువు మానేశాను. 20 ఏళ్లకే పెళ్లయింది. పదేళ్ల క్రితం భర్త చనిపోయాడు. పిల్లలు లేకపోవడంతో సోదరి పిల్లలనే నా పిల్లలుగా చేరదీశాను. పొదుపు చేసిన సొమ్ముతో పది ఎకరాలు కొని సాగులోకి దిగాను. తదనంతరం కుటుంబ అవసరాల కోసం 7.5 ఎకరాలు అమ్మివేశాను. 2.5 ఎకరాల పొలంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. ప్రస్తుతం అరటి పంట పెట్టా. సేంద్రియ సాగు ఎప్పటి నుంచి..? తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహా బృందంలో సభ్యురాలిగా ఉన్నాను. ఆ సమావేశాలకు హాజరైనపుడు సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకున్నాను. ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేసే రసాయన ఎరువులు, పురుగుమందులతో ఇన్నాళ్లూ సేద్యం చేశానా? అని బాధపడ్డాను. సేంద్రియ వ్యవసాయంలోకి మారి 50 ఏళ్లు గడిచింది. దేశవాళీ విత్తనాలు సేకరించేదాన్ని. జొన్న వంటి చిరుధాన్యాలు, కూరగాయలు, కందులు పండించే దాన్ని. ఇపుడు అరటి సాగు చేస్తున్నా. సేంద్రియ వ్యవసాయంలో మీ ప్రత్యేకత ఏమిటి? ఆవు పేడ, మూత్రం, గడ్డి, బెల్లం మిశ్రమాలను వాడతాను. ఆవు పేడ, లవంగాలు, ఉప్పును ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి పొలంలోని భూమిలో పాతి పెడతాను. 15 రోజులకు ఒకసారి మూత తీసి ఆ మిశ్రమాన్ని కలియబెడతాను. 2 నెలల తరువాత బయటకు తీసి మొక్కల పాదుల్లో చల్లుతాను. వేపాకును ఎండ బెట్టి పొడి చేసి, వెల్లుల్లి పొడి, నీటితో కలిపి ద్రావణం తయారు చేసుకొని పంటలపై చల్లితే పురుగు పట్టదు. సేంద్రియ రైతుగా మీ అనుభూతి ఎలా ఉంది? ఆరోగ్యకరమైన సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తేవడంలో ఎంతో ఆనందం ఉంది. సేంద్రియ వ్యవసాయం అనేది ఒక రకంగా సమాజ సేవ. రసాయనాలతో ఆహార పంటల సాగును పూర్తిగా మాన్పించాలి. సేంద్రియ సాగులోని బాగు గురించి భావితరాలకు అవగాహన కల్పించాలి. పద్మశ్రీ అవార్డుకు ఎంపికవ్వటం ఎలా అనిపిస్తోంది? పొట్ట గడవటం కోసం నా మానాన నేను చేసుకుంటున్న సేంద్రియ వ్యవసాయం పద్మశ్రీ అవార్డుకు తెచ్చి పెడుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. అసలు పద్మశ్రీ అవార్డు అనేది ఒకటి ఉందని కూడా నాకు తెలియదు. కేంద్ర ప్రభుత్వం నాకు పద్మశ్రీ ప్రకటించగానే మారుమూల గ్రామంలో ఉంటున్న నా వద్దకు ప్రజలు, బంధువులు, ముఖ్యంగా విలేకరులు తండోపతండాలుగా రావడం ప్రారంభించారు. ఈ హడావిడితోనే పద్మశ్రీ అవార్డు గొప్పతనం గురించి తెలిసింది. ఈ గుర్తింపు, గౌరవం నాకు కాదు సేంద్రియ వ్యవసాయానికే అని భావిస్తున్నాను. మీ ఆరోగ్య రహస్యం ఏమిటి? తెల్లవారుజామునే లేచి ఇప్పటికీ వేప పుల్లతోనే పళ్లు తోముతాను. కాలకృత్యాలు ముగించుకుని (టీ, కాఫీ తాగను) ఒక చెంబు నిండా గోరువెచ్చని నీళ్లు, రాగి గంజి తాగుతాను. ఎప్పుడైనా చికెన్ సూప్ సేవిస్తాను. అరటి ఆకులోనే భోజనం చేస్తాను. ఆకుకూరలు, ఆకుపచ్చని కూరగాయలతోనే నా భోజనం. మటన్ బిర్యానీ అంటే ఇష్టం. ఎప్పుడైనా కొద్దిగా తింటాను. ఉదయం 5.30–6 గంటల కల్లా చేలో ఉంటాను. కూలీలను పెట్టుకుంటే వారికి 10 గంటలకు కాఫీ లేదా కొబ్బరి బొండాం, సాయంత్రం మళ్లీ ఏదో ఒకటి తినడానికి ఇవ్వాలి. ఆ ఖర్చు భరించే స్థోమత నాకు లేదు. అందుకే నాటి నుంచి నేటి వరకు నేనే పొలం పని చేస్తాను. సోదరి, మనుమలు, మనుమరాళ్లు అప్పుడప్పుడూ పనిలో సాయం చేస్తారు. సాయంత్రం చీకటì పడే వరకు పొలం దగ్గరే ఉంటాను. దాదాపు 80 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా.. ఎప్పుడూ అలసి పోలేదు. నాకు 104 ఏళ్లు వచ్చాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. నిరంతరం పొలం పనులు చేయటం, ఆహారపు అలవాట్లే నా ఆరోగ్య రహస్యం అనుకుంటాను. – కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై -
ఇందిరా గాంధీ కాళ్లకు గజ్జెలు కట్టా..
నెమలి పురివిప్పి నాట్యమాడితే అడవి పరవశిస్తుంది.. కానీ, ఆ కళాకారుడు గుస్సాడీ నృత్యం చేస్తే అడవే పాదం కలుపుతుంది.. ఆయన గాగ్ర కాళ్లగజ్జెలు కట్టి ఆడితే చెట్టూ, పుట్టా, కొండ, కోన ప్రతిధ్వనిస్తుంది.. ఆయన నృత్యప్రకంపనలు క్రమేణా అడవిని దాటి దేశ రాజధానిని తాకాయి. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా గాగ్ర గజ్జెలతో గుస్సాడీలో కాలు కదిపారు. ఆయన కళాప్రదర్శనకు 2002లో అప్పటి రాష్ట్రపతి కలాం కూడా సలాం చేశారు. కళలోనే కళాకారుల జీవితం నిమగ్నమై ఉంటుందని నిరూపించిన కనకరాజుకు దేశంలోనే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ వరించింది. ఈ పురస్కారం పొందిన మొదటి తెలంగాణ ఆదివాసీ కళాకారుడిగా గుస్సాడీ కనకరాజు నిలిచారు. ఈ సందర్భంగా ఎనభై ఏళ్లు దాటిన పద్మశ్రీ కనకరాజు ప్రత్యేకంగా ‘సాక్షి’తో తన మనోగతాన్ని పంచుకున్నారు. ఆయన ఆలోచనలు, అనుభవాలు తన మాటల్లోనే... -సాక్షి, హైదరాబాద్ దండారి నృత్యమే స్ఫూర్తి... ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి మా సొంత ఊరు. మేం అడవితల్లి బిడ్డలం. నా చిన్నతనంలో దండారి నృత్యం చూసి స్ఫూర్తిపొందాను. నాకంటూ ఏ గురువూ లేడు. నేను చేసే గుస్సాడీ నృత్యం దండారిలోంచి వచ్చిందే. కళలో లీనమైన నన్ను చాలామంది గుస్సాడీగానే పిలిచేవారు. వారసత్వసంపద నుంచి నేర్చుకున్న కళ నాకు సంతృప్తినే కాకుండా మా ఆదివాసీలందరికీ గుర్తింపునిచ్చింది. కలాం ముందు ప్రదర్శనలు ఇచ్చా.. పద్మశ్రీ లాంటి అవార్డు తెలంగాణలోని మారుమూల గ్రామాల్లో ఉండే ఆదివాసీ కళాకారులకు వస్తుందని నేను ఊహించలేదు. 1955 నుంచి ఇప్పటివరకు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. 1982లో దేశ రాజధానిలో నిర్వహించిన పరేడ్‌లో అప్పటి ప్రధాని ఇందిర కాళ్లకు మా సంప్రదాయ గాగ్ర గజ్జెలు కట్టాను. ఆమె కూడా మాతోపాటు పాదం కలిపారు. 2002లో రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ముందు గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించాను. ఇప్పటివరకు దాదాపు 300 మంది కళాకారులకు గుస్సాడీ నృత్యాన్ని నేర్పాను. ఈ తరం వారికి నేర్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడితే సహకారమందించడానికి నేను సిద్ధం. (చదవండి: మన గుస్సాడీ రాజుకు పద్మశ్రీ) వ్యవసాయమే బతుకుదెరువు.. మాది గోండు సూర్యవంశం. గుస్సాడీ నృత్యం నా ఊపిరి. కానీ, ఇది మా బతుకుదెరువు కాదు. వ్యవసాయమే ఆధారం. ఎనిమిది మంది కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. వ్యవసాయంతోనే కుటుంబాన్ని పోషించాను. ఆదివాసీల సంక్షేమం కోసం ప్రభుత్వాలు మరింత దృష్టి సారిస్తాయని ఆశిస్తున్నాను. ఇందిరా గాంధీతో కనకరాజు (వృత్తంలో) వైభవోత్సవమైన సంప్రదాయాలు మా సంస్కృతే మా పండుగ. దసరా, దీపావళి మధ్యలో నిర్వహించే భోగిలో గుస్సాడీ నృత్యం ప్రారంభమవుతుంది. గుస్సాడీలో ప్రత్యేక వేషధారణ ఉంటుంది. చేతిలో దండారి, తలపై మల్జాలిన టోíపీ, (మలి అంటే నెమలి, జాలి అంటే ఈకలు అని అర్థం) గాగ్ర కాలిగజ్జెలు, మెడలో నైపాల్క్ హారం, జోరి, గంగారం సోట, జంతువుల చర్మంతో చేసిన వస్త్రాలు, డప్పులు ఉంటాయి. మల్జాలిన టోíపీ పెట్టుకున్న వ్యక్తి ఆదివాసీల దైవం మస్మసూర్‌తో సమానం అని మా ప్రగాఢ నమ్మకం. -
ఇంటికి రా... నీ పని చెప్తా...
జనవరి 23 శనివారం. ఢిల్లీలో డాక్టర్ కె.కె.అగర్వాల్ టీకా తీసుకున్నారు. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఢిల్లీలో ప్రముఖ కార్డియాలజిస్ట్. మెడికల్ అసోసియేషన్స్– ఆసియా అధ్యక్షుడు. టీవీ కార్యక్రమాల ద్వారా ఆరోగ్య చైతన్యాన్ని కలిగిస్తుంటారు. తాను కోవిడ్ టీకా తీసుకుంటున్న సమయంలో ఆయన ఫేస్బుక్ లైవ్ పెట్టారు. టీకాతో భయం లేదని చెబుతున్నారు. ఇంతలో భార్య ఫోన్ మోగింది. ‘ఏంటి... నువ్వు టీకా తీసుకున్నావా?’ అని అడిగారామె. లైవ్ వెళుతోంది. ‘అవును’ అన్నాడీయన. ‘ఇంటికిరా నీ సంగతి చెప్తా’ అందామె. ఇంకేముంది.. ఈ వీడియో వైరల్ అయిపోయింది. కాని ఈ మొత్తం వ్యవహారం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ‘నువ్వు లైవ్‌లో ఉన్నప్పుడు నీ భార్య ఫోనెత్తకు’ అని ఇప్పుడు దేశమంతా సందేశం అందుతోంది. దాంతోపాటు డాక్టర్ కె.కె.అగర్వాల్ వీడియో కూడా. ఇదంతా జరిగి ఒక నాలుగైదు రోజులవుతోంది. అసలేం జరిగిందంటే డాక్టర్ కె.కె.అగర్వాల్ ఢిల్లీలో పేరు మోసిన కార్డియాలజిస్ట్. టీవీ పర్సనాలిటీ. పద్మశ్రీ కూడా వచ్చిందాయనకు. కరోనా వచ్చినప్పటి నుంచి ఆయన కరోనా అవగాహన వీడియోలు, జూమ్ సమావేశాలు నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగా మొన్నటి శనివారం తాను కోవిడ్ వాక్సిన్ తీసుకుంటూ ఫేస్బుక్లో లైవ్ పెట్టాడు. ‘ఇదిగోండి.. నా వయసు 63. నేను బ్లడ్ థిన్నర్లు వాడతాను. అయినా సరే నేను వాక్సిన్ తీసుకున్నాను. నాకేం కాలేదు. కాబట్టి మీరూ వేయించుకోండి’ అని ఆయన ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. భార్య నుంచి. ఆయన లైవ్‌లో ఉండి ఫోన్ ఎత్తాడు. భార్య: ఏంటి... నువ్వు వాక్సిన్ వేయించుకున్నావా? అగర్వాల్: అవును. అక్కడ ఏం జరుగుతోందో చూడ్డానికి వెళ్లాను. ఖాళీ ఉంది వేయించుకోండి అంటే వేయించుకున్నాను. భార్య: నన్నెందుకు తీసుకెళ్లలేదు. అగర్వాల్: నీకు సోమవారం వేస్తారు. భార్య: వాక్సిన్ వేయించుకున్నది గాక ఇంకా ఏంటేంటో చెప్తావా... ఇంటికిరా నీ పని చెప్తా... దాంతో అగర్వాల్ గారి ముఖం వాడిపోయింది. ఈ వీడియో కాస్తా వైరల్ అయిపోయింది. భార్యకు ఎంతటివాడైనా భయపడాల్సిందేనని నెటిజన్లు వ్యాఖ్యానించారు. అయితే నిన్న (బుధవారం) డాక్టర్ గారు తన ఫేస్బుక్ వాల్ మీద వీడియో రిలీజ్ చేశారు. ‘నా భార్య కోప్పడటం సబబే. నా ఆరోగ్యం గురించి వర్రీ అయ్యింది. టీకా గురించి అందరికీ సందేహాలు ఉన్నాయి కదా. తను పక్కన ఉన్నప్పుడు వేయించుకోవాల్సింది అని ఆమె ఉద్దేశ్యం. నేనేమో ఆమెకు చెప్పకుండా ఈ పని చేశాను. దీనిని పెద్దగా చర్చ పెట్టాల్సిన పని లేదు’ అన్నాడాయన. అయితే ఈ వెర్షన్‌ను సగంమంది నెటిజన్లు నమ్ముతుంటే అగర్వాల్ ఒక్కడే వెళ్లి అలా టీకా వేయించుకోవడం గురించి ఆమెకు నిజంగా కోపం వచ్చిందని మిగిలిన సగం అన్నారు. ‘అయినా భర్తను అదిలించి అదరగొట్టే శక్తి భార్యకు కాక ఇంకెవరికి ఉంటుంది’ అని మరికొందరు అన్నారు. అగర్వాల్ భార్య పేరు వీణాఅగర్వాల్. ప్రస్తుతం కెకె అగర్వాల్‌తో పాటు ఆమె కూడా అందరికీ తెలిశారని మాత్రం చెప్పక తప్పదు. -
గుస్సాడీ కనకరాజును అభినందించిన మంత్రి
సాక్షి, ఆదిలాబాద్ : కొమరం భీమ్ జిల్లా అదివాసీ కళాకారునికి అరుదైన గౌరవం లభించింది. సంప్రదాయాలు పాటిస్తూ, ఆచారాలు పరిరక్షిస్తున్న ఆదివాసీ కళకారుడు కనకరాజు.. సంప్రదాయ గుస్సాడీ న్రుత్యం చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. అలాంటి గుస్సాడీ కళకారుడు కనకరాజును కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు వరించింది. పద్మశ్రీ అవార్డు దక్కిన వారిలో తెలంగాణ నుంచి ఎంపికైన వారిలోకనకరాజు ఏకైక వ్యక్తి కావడం విశేషం. గిరిజన గుస్సాడీ కళకారునిగా అరుదైన పద్మశ్రీ అవార్డు కనకరాజుకు లభించడంతో అదివాసీల ఆనందానికి అవదులు లేకుండా పోయింది. అదివాసీ కళకారునికి కేంద్ర పురస్కారం దక్కించుకున్న కనకరాజును అందరూ అభినందిస్తున్నారు. చదవండి: పద్మ పురస్కారాలు: ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్ అద్బుతమైన కళా నైపుణ్యంతో ఈ అవార్డును సాదించిన కనకరాజును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేకంగా అభినందించారు. ఇదిలా ఉండగా ఓకళాకారునిగా కేంద్రం పురస్కారం లబించడంపై కనకరాజు సంతోషం వ్యక్తం చేశారు. కలలో కూడ ఈ అవార్డు దక్కతుందని ఊహించలేందని భావోద్వేగానికి లోనయ్యారు. అవార్డు తనకు దక్కినప్పటికీ గిరిజనుల కళకు సర్కార్ ఇచ్చిన గౌరవంగా బావిస్తున్నానని కనకరాజు పేర్కొన్నారు. అయితే కళకారుని అద్బుతమైన నైపుణ్యం ఉన్నా.. అర్థికంగా అంతంత మాత్రమే బతుకున్నారని, అర్థికంగా సర్కారు అదుకోవాలని కనకరాజు కోరారు. అయితే గుస్సాడీ కళ వందల ఎళ్ల కాలం నుండి వస్తున్నా కళ. ప్రతి ఏటా దీపావళి సందర్భంగా దండారి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అదివాసీల దైవం ఎథ్మసూర్‌ను ప్రార్థిస్తూ గుస్సాడీ నృత్యం చేస్తారు గిరిజనులు. గుస్సాడీ నృత్యం చేసే వాళ్లు నెత్తిన నెమలి పించం, భుజాన జింక చర్మాన్ని దరించి, చేతిలో దండారి పట్టుకొని గిరిజన సంప్రదాయ వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తారు. గిరిజన సంప్రదాయ వాయిద్యాలకు అనుగుణంగా గుస్సాడీ చేసే నాట్యం చూపరుల గుండెలను హత్తుకునేలా ఉంటుంది. ఇలాంటి అద్బుతమైన కళను కనరాజు పరిరక్షరిస్తున్నారు. అందులో బాగంగా గుస్సాడీలో గిరిజనులకు శిక్షణ ఇస్తున్నారు. ఈవిదంగా కొన్ని వందల మందికి శిక్షణ ఇచ్చారు. అందుకే కనకరాజును గుస్సాడీ గురువుగా పిలుస్తుంటారు. ఒకవైపు గుస్సాడీ కళను పరిరక్షిస్తూనే మరోకవైపు కనకరాజు శిక్షణ ఇస్తున్నారు. అద్బుతమైన నైపుణ్యంతో అనేక ప్రాంతాలలో గుస్సాడీ కళ ప్రదర్శనలు ఇచ్చారు. మాజీ ప్రదాన మంత్రి ఇందిరాగాంధీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ముందు ఢిల్లీలో ప్రదర్శనలు ఇచ్చారు..ఇలా ఏందరో మహనుబావులను గుస్సాడీ కళ నైపుణ్యంతో అకట్టుకున్నారు. వివిర రంగాల వ్యక్తుల నుండి ప్రశంసలు, మన్ననలు కనకరాజుకు లబించాయి. -
భూమి, ఆర్థిక సాయం అందించాలి: గుస్సాడీ రాజు
సాక్షి, కొమురం భీమ్(ఆసిఫాబాద్): గుస్సాడీ కళలో పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని కుమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన 60 ఏళ్ల కనక రాజు ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పద్మ పురస్కారాల జాబితాలో రాష్ట్రం నుంచి ఒక్కరికే పద్మశ్రీ వరించింది. ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో ప్రావీణ్యం పొందిన రాజును వరించడం విశేషం. ఆయన్ని స్థానికులు గుస్సాడీ రాజుగా పిలుస్తారు. చదవండి: మన గుస్సాడీ రాజుకు పద్మశ్రీ పద్మశ్రీ అవార్డు వరించిన కనక రాజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..‘ పద్మశ్రీ అవార్డు లభించడం సంతోషంగా ఉంది. గుస్సాడీ కళలో తనకు పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఈ అవార్డు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఇది అదివాసీలకు లభించిన గౌరవంగా భావిస్తున్నా. గుస్సాడీ కళను వందల మందికి నేర్పించాను. ప్రముఖులు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ముందు ఢిల్లీలో ప్రదర్శనలు ఇచ్చాను. పేద కళాకారున్ని సర్కార్ అదుకోవాలి. సర్కార్ భూమి, అర్థిక సహాయం అందించాలని కోరుతున్నాను’ అని ఆయన తెలిపారు. గత 40 ఏళ్లుగా గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్న రాజు.. ఎంతోమంది యువతకు ఇప్పటికీ ఆ నృత్యాన్ని నేర్పిస్తున్న సంగతి తెలిసిందే. -
మన గుస్సాడీ రాజుకు పద్మశ్రీ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పద్మ పురస్కారాల జాబితాలో రాష్ట్రం నుంచి ఒక్కరికే పద్మశ్రీ వరించింది. కుమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన 60 ఏళ్ల కనక రాజుకు ఈ ఘనత దక్కింది. ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో ప్రావీణ్యం పొందిన రాజును గుస్సాడీ రాజుగా పిలుస్తారు. 1981లో అప్పటి ప్రధాని ఇందిర ముందు, అనంతరం దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమక్షంలోనూ, ఢిల్లీ ఎర్రకోటలో గణతంత్ర వేడుకల్లో రాజు గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించారు. గత 40 ఏళ్లుగా గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్న రాజు.. ఎంతోమంది యువతకు ఇప్పటికీ ఆ నృత్యాన్ని నేర్పిస్తున్నారు. అవార్డు రావడం సంతోషంగా ఉంది నాకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల ఆనందంగా ఉంది. ఇందిరాగాంధీ ముందు ప్రదర్శన ఇచ్చాను. బహుమతిగా గుస్సాడీ టోపీ కూడా ఇచ్చాను. హన్ను మాస్టారు స్పూర్తితో ముందుకు సాగుతున్నా. – కనక రాజు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. -
ఆ అవార్డుకు కరణ్ అనర్హుడు: కంగనా
సాక్షి, ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌పై మరోసారి నిప్పులు చెరిగారు. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకు కరణ్ జోహారే కారణమని గతంతో ఆరోపించిన విషయం తెలిసిందే. సుశాంత్ సినీ కెరీర్‌ను నాశనం చేశాడని, తద్వారా అతడి ఆత్మహత్యకు పరోక్షంగా కారణమయ్యాడని ఆమె మండిపడ్డారు. కాబట్టి ఆయన పద్మ శ్రీ పురస్కారానికి అనర్హుడని.. ఆ అవార్డును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కంగనా సోషల్ మీడియా వేదికగా కోరారు. (చదవండి: ‘రణబీర్ ఓ రేపిస్ట్, దీపిక ఒక సైకో’) దీనిపై కంగనా ట్వీట్ చేస్తూ.. ‘కరణ్ జోహార్ పద్మశ్రీ అవార్టును తిరిగి తీసుకోవాలని నేను భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. అతను నన్ను బహిరంగంగా ఓ అంతర్జాతీయ వేదికపై పరిశ్రమను వదిలి వెళ్ళమని బెదిరించాడు. అంతేగాక యంగ్ హీరో సుశాంత్ కెరీర్‌ను దెబ్బతీసేందుకు కుట్ర పన్నాడు. ఉరి చిత్రం వివాదం సమయంలో పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు మన భారత సైన్యాన్ని అవమానించే విధంగా యాంటినేషనల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు’ అని కంగనా తన ట్వీట్లో రాసుకొచ్చారు. (చదవండి: ఆమిర్‌ఖాన్ తీరుపై కంగనా ఆగ్రహం) -
అలా అయితే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా : కంగన
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత సినీ పరిశ్రమలో నెపోటిజంపై గొంతెత్తిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి సంచలనం సృష్టించారు. ఈ విషయంలో తన వాదనలను నిరూపించుకోలేకపోతే తన పద్మశ్రీని పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించారు. ఒక హిందీ టీవీ చానల్‌తో మాట్లాడుతూ కంగనా ఈ విషయాన్ని వెల్లడించారు. సుశాంత్ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు తాను మనాలీ ఉండగా ఫోన్ చేశారనీ, అయితే తన స్టేట్మెంట్ను తీసుకోవడానికి ఎవరినైనా పంపించాలని కోరినా ఎవరూ రాలేదని వివరించారు అయితే ఈ విషయంలో తాను ఏం మాట్లాడినా బహిరంగంగానే మాట్లాడనని, తాను పారిపోయే మనషిని కాదని స్పష్టం చేశారు. తన విమర్శలను నిరూపించుకోలేకపోతే, పద్మశ్రీ అవార్డును ఉంచుకునే అర్హత తనకుండదని ఆమె పేర్కొన్నారు. (సుశాంత్‌ది ఆత్మహత్యా? హత్యా: కంగన ఫైర్) జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య యావత్ సినీలోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అలాగే పరిశ్రమలో నెపోటిజంపై అనేక విమర్శలు చెలరేగాయి. ప్రధానంగా మహేష్ భట్, కరన్‌జోహార్ లాంటి నిర్మాతలపై కంగనా ఘాటు విమర్శలు గుప్పించారు. అలాగే సుశాంత్‌ది ఆత్మహత్యా లేక పథకం ప్రకారం జరిగిన హత్యా అంటూ బాలీవుడ్ పరిశ్రమ తీరుపై కంగనా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. (‘సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలి’) -
పద్మశ్రీకి ఏక్తా అర్హురాలు
ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్ర కుమార్తె, నిర్మాత ఏక్తా కపూర్‌కి ఇటీవల పద్మశ్రీ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఆమెకు అభినందనలు తెలియజేశారు దర్శక–నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. ‘‘ఈ అవార్డుకి ఏక్తా అర్హురాలు. చిన్న వయసులో పద్మశ్రీ పురస్కారం అందుకోవడానికి ఆమె పట్టుదల, క్రమశిక్షణే కారణం’’ అన్నారు కేతిరెడ్డి. ఆయన తీస్తున్న ‘శశి లలిత’ (జయలలిత బయోపిక్) చిత్రానికి ఆశీస్సుల కోసం షిరిడీ సందర్శించారు కేతిరెడ్డి. -
పద్మ అవార్డులు.. కాంగ్రెస్‌పై ప్రముఖ సింగర్ ఫైర్
న్యూఢిల్లీ : ప్రముఖ గాయకుడు, మ్యూజిషియన్ అద్నాన్ సమీకి పద్మశీ అవార్డు ఇవ్వడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. పాకిస్తాన్లో పుట్టి పెరిగిన అద్నాన్కు ప్రతిష్టాత్మక అవార్డు ఇవ్వడాన్ని కాంగ్రెస్ ప్రతినిధి జైవీర్ షర్గిల్ తప్పుబట్టారు. కార్గిల్ యుద్ధంలో పోరాడిన మహ్మద్ సన్నావుల్లాను ఎన్నార్సీ అనంతరం విదేశీయుడిగా ప్రకటించిన కేంద్రం.. పాక్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ కుమారుడికి పద్మశ్రీ అవార్డును ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం చంచాగిరి మ్యాజిక్ వల్లే అద్నాన్కు పద్మశ్రీ వచ్చిందని వ్యాఖ్యానించారు. కాగా తనపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు అద్నాన్ ఘాటుగా స్పందించారు. ‘హేయ్ కిడ్.. మీ బుద్దిని క్లియరెన్స్ సేల్ నుంచి తెచ్చుకున్నారా.. లేక సెకండ్ హ్యాండ్ షాప్ నుంచి కొనుకున్నారా. తల్లిదండ్రుల చర్యలకు పిల్లలు ఎలా బాధ్యులవుతారు. మీరు ఒక న్యాయవాది. లా స్కూల్లో మీరు ఇదే నేర్చుకున్నారా’’ అంటూ ట్వీటర్ వేదికగా మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ నేతల వాదనకు భిన్నంగా ఆ పార్టీ సీనియర్‌నేత దిగ్విజయ్ సింగ్ మాత్రం అద్నాన్కు అభినందనలు తెలిపారు. దేశంలో అత్యున్నత పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 141 మందికి పద్మ అవార్డులు ప్రకటించగా అందులో అద్నాన్ సమీ ఒకరు. ఈ ఏడాదికి గాను మొత్తం 141 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేయగా.. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్ వరించగా, 16 మందికి పద్మ భూషణ్, 118 మందికి పద్మ శ్రీ అవార్డు వరించాయి. Hey kid, did you get ur brain from a ‘Clearance Sale’ or from a second hand novelty store? Did they teach u in Berkley that a son is to be held accountable or penalised for the acts of his parents? And ur a lawyer?😳 Is that what u learned in law school? Good luck with that!😂 https://t.co/s1mgusEdDr — Adnan Sami (@AdnanSamiLive) January 26, 2020 -
కళావెన్నెల
విశ్వాన్ని గెలవాలంటే కళాతపస్వి కావాలి. కళను గెలవాలంటే సాహితీవెన్నెల కావాలి. సరస్వతీ పుత్రులు పద్మాలలో కూర్చుంటేనే కదా.. ఆ పద్మాలు కిరీటాలు అవుతాయి. పాటలు పామరులకు అందాయి. కథలు ప్రేక్షకులకు అందాయి. పద్మాలు ‘కళావెన్నెల’కు అందాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రికి ‘పద్మశ్రీ’ ప్రకటించిన నేపథ్యంలో కళాతపస్వి కె. విశ్వనాథ్ తన స్వగృహంలో సిరివెన్నెలను సత్కరించారు. ఇద్దరూ కలసి ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుందని ‘సాక్షి’ అడిగితే గురుశిష్యులిద్దరూ బోలెడన్ని విశేషాలు పంచుకున్నారు. సాక్షి: ఒకరు దర్శక దిగ్గజం.. ఒకరు గొప్ప ‘కలం’కారుడు. ‘సిరివెన్నెల’తో ప్రారంభమైన మీ ఇరువురి ఈ ప్రయాణంలో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలని ఉంది. ముందుగా ‘పద్మశ్రీ’ గురించి మీ అనుభూతి.. విశ్వనాథ్: నాకు పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు అనుకుంటా.. ఆదుర్తి సుబ్బారావు (దర్శక–నిర్మాత)గారు మా ఇంటికి వచ్చి ‘విశ్వానికి దిష్టి తగలకుండా ఆరు నందులు ఉన్నాయి. ఆ నందులే పోట్లాడతాయిలే’ అన్నారు. సిరివెన్నెల: ఆ సమయంలో ప్రతీ ఏడాది బెస్ట్ పిక్చర్, బంగారు నంది.. అన్నీ నాన్నగారి (విశ్వనాథ్)కి వచ్చాయి. ఇప్పుడు నాకు పద్మశ్రీ వచ్చిందనగానే ముందు గురువు (విశ్వనాథ్)గారిని కలవాలనిపించింది. విశ్వనాథ్: నాకు ‘పద్మశ్రీ’ (1992) అవార్డు వచ్చినప్పుడు ఆ విషయం సాయంకాలమే తెలిసింది. హోమ్ మినిస్ట్రీ నుంచి కాల్ వచ్చింది. చెబితే నమ్మవు. నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయాను. భోజనాల వేళ దాక ఇంట్లో ఎవ్వరితోనూ పంచుకోలేదు. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అంతగా లేదు. సిరివెన్నెల: ఆ రోజు మా తండ్రిగారి తిథి. మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నాను. ఓ విచిత్రమైన భావన కలిగింది. అది చాలా బలమైన భావన. ఇవాళ జనవరి 25, పద్మశ్రీ అనౌన్స్ చేస్తారు. ఆ విషయాన్ని సాయి (కుమారుడు యోగేశ్వర శర్మ) నాకు వచ్చి చెబుతాడని అనిపించింది. ఇంతలో ఓ ఫోన్ వచ్చింది.. నేను లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత మరోటి. సాయి పరిగెత్తుకొచ్చి ఫోన్ తీశాడు. వీడేంటి ఇంత కంగారు పడుతున్నాడు. పద్మశ్రీ వచ్చిందా ఏంటి? అనుకున్నాను. అది నిజమైంది. నాకా విషయాన్ని సాయి చెప్పగానే, ‘మీ నాన్నగారికి చెప్పు అని మా నాన్నగారు’ తనని పంపించారా అనిపించింది. నా జీవితంలో మొదటిసారి ఓ అవార్డుకి సంబంధించి వచ్చిన టెలిగ్రామ్ గుర్తుకు వచ్చింది. ‘ఏ నోబడీ బికేమ్ ఏ స్టేట్ గెస్ట్ వితిన్ నో టైమ్’ అని అప్పుడు నేను అనుకున్నాను. పద్మశ్రీ గురించి చెప్పి, ‘తాతకు ఏం వచ్చింది’ అని నా మనవరాలిని అడిగితే.. తన్నమానం (సన్మానం), తాతకు పద్దమశ్రీ వచ్చింది అంది (నవ్వులు). మేం తన్నమానం ఎందుకొచ్చింది? అంటే తాతకు ఇంగ్లిష్ రాదు కాబట్టి అంది. తన్నమానం అంటే ఏం చేస్తారు? అని మేం అడిగితే.. చేతికి కర్ర ఇచ్చి, టోపీ పెట్టి దుప్పటి కప్పుతారు అని చెప్పింది. భలే ముచ్చటగా అనిపించింది. రచయితలు ఆత్రేయ, ఆరుద్రగార్లకే పద్మశ్రీ రాలేదు? సిరివెన్నెల: ఎవరో అడిగితే చెప్పాను.. వాళ్ల ప్రసాదంలా ఈ పురస్కారాన్ని స్వీకరిస్తాను అని. తెలుగులో లిరిక్ అనే విషయాన్ని ఎందుకో గుర్తించలేదు. విచిత్రమేంటంటే నాన్నగారూ.. ‘మీ కంటే ముందు నారాయణ రెడ్డిగారికి వచ్చింది’ కదా అని నాతో కొందరు అన్నారు. ఆయనకు ‘పద్మభూషణ్ కూడా’ ఉంది. కానీ ఆయనకు ఆ అవార్డ్ వచ్చింది ‘లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్’ విభాగంలో. తమిళంలో వైరముత్తు, బాలీవుడ్లో జావేద్ అక్తర్లకూ అదే విభాగంలో ఇచ్చారు. లిరిక్ అనే విభాగంలో రాలేదు. గతేడాది లిరిక్ అనే విభాగంలో కర్ణాటక సినీ రచయిత దొడ్డ రంగె గౌడకి వచ్చింది. ఈ ఏడాది నాకు వచ్చింది. హాలీవుడ్ వాళ్లు సాంగ్ రైటర్, లిరిసిస్ట్ అని డివైడ్ చేశారు. సాంగ్ రైటర్ అంటే ట్యూన్‌కి మాటలు ఇచ్చేవాడు. లిరిక్ అంటే సాంగ్ విత్ పొయెటిక్ లైన్స్ అని. పొయెటిక్ కంటెంట్ నాన్నగారి సినిమాల్లోనే రావడం మనం గమనించవచ్చు. ఆయన సినిమాతో∙కాకుండా ఇంకో చోట నేను పరిచయమయ్యుంటే ఇండస్ట్రీలో నేనుండేవాడినే కాదేమో. ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు సిరివెన్నెలగారు ‘పద్మశ్రీ’ ప్రకటించగానే మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను నాన్నగారూ అంటే.. ‘ఇప్పుడైనా ఏముందిలే. ప్రతి క్షణమూ మన క్షణమే’ అన్నారు. సీతారామశాస్త్రి అనే ఈ మాణిక్యాన్ని ఏ క్షణాన గుర్తించారు? విశ్వనాథ్: ఒకసారి శాస్త్రి (సిరివెన్నెల) రావడం రావడమే చిన్న స్క్రిప్ట్‌తో వచ్చాడు. అందులో పాటలు కూడా రాశాడు. ఆ పాటల్లో మంచి భావుకత ఉంది అనిపించింది. అది అలా మనసులో గుర్తుండిపోయింది. సంవత్సరం తర్వాత నాకో కొత్త లిరిసిస్ట్ కావాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు చేబోలు సీతారామశాస్త్రి అనే వ్యక్తి గుర్తొచ్చాడు. అయితే తనకు ఎలా కబురు పంపానో నాకు గుర్తులేదు. సిరివెన్నెల: ఆకెళ్ల సాయినాథ్ ద్వారా పంపారు. విశ్వనాథ్: ‘సిరివెన్నెల’ సినిమాకి పిలిపించి రాయించాం. సింగిల్ కార్డ్. ఆ రోజుల్లో అన్ని పాటలూ కొత్త రచయితతో రాయించడం అంటే పెద్ద సాహసమే. ఎందుకంటే ఒక్కో పాట ఒక్కో రచయిత రాస్తున్న సమయం అది. జానపదం అయితే కొసరాజు. మనసు పాట అయితే ఆత్రేయ, క్లబ్ పాట అయితే ఆరుద్ర. మూడు నాలుగు పేర్లు టైటిల్ కార్డ్‌లో పడటం సాధారణం. పౌరాణికాలు అయినప్పుడు సముద్రాల గారు వాళ్లు మాత్రమే సింగిల్ కార్డ్ రాసేవారు. మల్లాది రామకృష్ణ శాస్త్రిగారికి కూడా ఇంకో పేరు జతపడేది. మరేం ధైర్యమో? వంట రుచిగా ఉంటుందో, అన్ని రకాలు వండగలడో కూడా తెలియదు. మనోధైర్యంతో రాయించాను. సిరివెన్నెల: కన్విక్షన్ ఉన్నవాళ్లకు బాగా ఫీడ్ ఇస్తే.. ఎవ్వరికైనా కొత్తగా రాస్తారు. ‘నాకు అర్థం అయినా కాకపోయినా మీరు విజృంభించి రాయండి. మీకిది జైలు కాదు’ అని నాన్నగారు అన్నారు. విశ్వనాథ్: కేవీ మహదేవన్ (సంగీత దర్శకుడు) ముందు పాట రాయించుకుని, ఆ తర్వాత ట్యూన్ కట్టేవారు. ‘సిరివెన్నెల’కి ఆ విధంగానే శాస్త్రిని నానా హింసలు పెట్టి రాయించుకున్నాను. వీళ్లు (ఆకెళ్ల సాయినాథ్, సిరివెన్నెల) నాతో పాటే నందీ హిల్స్‌లో ఉండేవాళ్లు. ఇద్దరూ పగలంతా తిరిగేవారు. ఇంకేం చేసేవారో నాకు తెలియదు కానీ సాయంత్రానికి తిరిగొచ్చేవాళ్లు (నవ్వుతూ). నా షూటింగ్ పూర్తి చేసుకొని ఖాకీ డ్రెస్ తీసేసి కొంచెం రిలాక్స్ అయ్యాక కలిసేవాళ్లం. ఆ రోజు అలా కొండ చివరకు వెళ్లాం. అప్పుడు శాస్త్రి ఓ రెండు వాక్యాలు గమ్మత్తుగా ఉన్నాయి అన్నాడు. ఎవరైనా అలా అంటే వాటిని వినేదాకా నేను తట్టుకోలేను. నాకదో వీక్నెస్. ఏమొచ్చిందయ్యా అన్నాను. ‘ఆది భిక్షువుని ఏమి కోరేది. బూడిదిచ్చేవాడిని ఏమడిగేది’ అన్నాడు శాస్త్రి. అయ్య బాబోయ్.. అనిపించింది. సిరివెన్నెల: ఐదు చరణాలు రాశాను. అంతా గుర్తుంది. మరి ఈ వాక్యాలు పెట్టే సందర్భం కుదురుతుందా? అంటే ‘కథ మన చేతుల్లో ఉంటే, మనం చెప్పినట్టు నడుస్తుంది’ అన్నారు గురువుగారు. విశ్వనాథ్: మా స్నేహం ఎంతలా పెరిగిపోయిందంటే శాస్త్రీ.. నువ్వు రాసినా, రాయకపోయినా ఓసారి వచ్చి కథ విని వెళ్లు. నీతో రాయిస్తానో లేదో నాకు తెలియదని కబురు పంపేవాడిని. అంత కుటుంబ సభ్యుడు అయిపోయాడు. మా ఇంటి వ్యక్తిలా అన్నమాట. మీరు పాట సందర్భం అనుకున్నప్పుడే పల్లవి రాసుకుంటారట. నిజమా? విశ్వనాథ్: నేను కథ రాసేటప్పుడే అబద్ధపు సాహిత్యం (డమ్మీ లైన్స్) పక్కన పెట్టుకుంటాను. ఊరికే నా ఐడియా ఇదీ అని చెబుతాను. ఇలా ఉండాలి అని శాసించను. రాస్తున్న కవి మనసుకు హత్తుకుని, ఛందోబద్ధంగా ఉంటే అది తీసుకుంటారు. తీసుకోవాలని నేను పట్టుబట్టింది లేదు. విశ్వనాథ్‌గారి పల్లవులు యథాతథంగా వాడిన సందర్భాలు ఏమైనా? సిరివెన్నెల: ‘శ్రుతిలయలు’ సినిమాలోని ‘తెలవారదేమో స్వామి.. నీ తలపుల మునకలో..’ పల్లవి ఆయనిచ్చినదే. ‘సిరివెన్నెల’ తీసేటప్పుడు ఇలాంటి సబ్జెక్ట్‌ని ఎందుకు ఎంచుకున్నామా? అని, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ఓ సందర్భంలో విశ్వనాథ్‌గారు అన్నారు. మరి.. ఆ సినిమాకి పాటలు రాసేటప్పుడు మీకేమైనా? విశ్వనాథ్: శాస్త్రికి బదులుగా నేను చెబుతా. అలాంటి సందర్భాలు తనకు అనేకం పెట్టాను. శాస్త్రిది యంగ్ బ్లడ్ కదా అని (నవ్వుతూ). ‘కష్టపెడుతున్నారు వీళ్లు’ అని ఏ సందర్భంలోనూ తను అనుకోలేదు. పెద్ద అదృష్టం ఏంటంటే మాకు నిర్మాతలు అడ్డు చెప్పలేదు. ఉదయం అని రాస్తే ‘సార్ అర్థం అవ్వదేమో... పొద్దునే, లేచినవేళ’ అని రాయండి అని చెప్పలేదు. సిరివెన్నెల: కవిత్వం రాయడం అనేది కేవలం విశ్వనాథ్‌గారి సినిమాల్లోనే సృష్టించబడింది. అందులో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రతి పాట కవిత్వం కానక్కర్లేదు. కవిత్వం అంటే చెప్పినదే కాకుండా చెప్పని భావం కూడా బోలెడంత కనబడాలి. ఆయన నాకు పది చాలెంజ్‌లు విసిరితే వాటిని నేను పన్నెండు చేసుకోవడానికి ఇష్టపడతాను. విశ్వనాథ్: త్యాగరాజు, అన్నమయ్య కీర్తనలు వింటాం. ఆస్వాదిస్తాం. వాటికి ఇదే సందర్భం అనలేం కదా. మా పాట సినిమాలో సందర్భానికి సరిపోవడం ఒక్కటే కాదు... ఎవరు విన్నా కూడా ఎలా అయినా ఆపాదించుకునేలా ఉండాలి. అలాంటి పాటలను పెట్టాం. సిరివెన్నెల: ఎక్కడైతే మాట ఆగిపోతుందో అక్కడ పాట మొదలవుతుంది. విశ్వనాథ్‌గారి సినిమాల్లో సంస్కారం ఉన్న పాత్రలే ఉంటాయి. ఆ మినిమమ్ సంస్కారం ఉన్న మనుషులకు రావాల్సిన సమస్యలే వస్తాయి. రిక్షావాడికి ఓ సంస్కారం ఉంటుంది. కసాయివాడికి ఓ సంస్కారం. ‘జీవన జ్యోతి’లో ఓ సన్నివేశంలో ఓ తాగుబోతు వాణిశ్రీని రేప్ చేస్తాడు అని ప్రేక్షకులు ఊహిస్తారు. కానీ వచ్చి దుప్పటి కప్పి వెళ్లిపోతాడు. అది వాడి సంస్కారం. విశ్వనాథ్: దర్శకుడిగా నేను స్క్రీన్ ప్లే రాసుకునేటప్పుడు ఓ పాటొస్తుంది సుమా అని ప్రేక్షకుడిని భయపెట్టను. ప్రియుడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చేసింది. ఇన్ని పూలు పెట్టుకుంది. పాట రాబోతోంది... అలా ఉండదు. నిజంగానే జరిగిన విషయాన్ని పాట రూపంలో ఎలా అలంకారం చేస్తాం అన్నది ముఖ్యం. మరీ ఎక్కువ అలంకారం చేసినా బప్పీలహరి పాటలా ఉంటుంది. అది ఉండకూడదు. హ్యాండ్ ఇన్ గ్లౌ అంటారే అలాగ. సిరివెన్నెల: ఓవర్ డ్రమటైజేషన్ అనేది విశ్వనాథ్‌గారి సినిమాల్లో ఉండదు. సన్నివేశం తీసే ముందు డైలాగ్ పేపర్ని చూస్తూ, నేనైతే ఇంట్లో ఇలా మాట్లాడతానా? అని అనుకుంటారు ఆయన. అలా లేకపోతే దాన్ని పక్కన పెట్టేస్తారు. తొలి సినిమానే విశ్వనాథ్‌గారితో చేయడంవల్ల మీ పాటల్లో కవితాత్మక ధోరణి కనిపిస్తుందా? సిరివెన్నెల: కవిగా నా స్వభావమే అది. ఏ సీన్‌కి అయినా నేను చాలా త్వరగా రియాక్ట్ అయి రాస్తుంటాను. సంఘటన, వ్యక్తులు, ప్రదేశాలకు రాయమంటే నేను రాసేవాణ్ణి కాదు. అవన్నీ కాదు.. ఏదైనా కాన్సెప్ట్ ఉంటే చెప్పండి రాస్తాననేవాణ్ణి. ఫలానా ఆయన్ని పొగిడి రాయమన్నా కూడా తత్వాన్ని పొగుడుతాను. విశ్వనాథ్: మామూలుగా అయితే దీన్ని పొగరుబోతుతనం అనుకుంటారు కానీ వ్యక్తిత్వం అనుకోరు. ఆ రెంటినీ డివైడ్ చేసే లైన్ చాలా కష్టమైంది. ‘వ్యక్తిని పొగడను’ అని సిరివెన్నెలగారు కనబర్చిన వ్యక్తిత్వం గురించి కానీ, ఆయన తాను అనుకున్నదే రాస్తారని కానీ మీకేమైనా కంప్లైంట్స్ వచ్చాయా? విశ్వనాథ్: ఒక ఇరవై ఏళ్ల స్నేహంలో అలాంటి కంప్లైట్స్‌ని నిజమని నమ్మితే అది మూర్ఖత్వం అవుతుంది. ఎవరైనా నా దగ్గరకు వచ్చి ‘ఆయన నాకు చాన్స్ ఇవ్వడమేంటి? నాకు టాలెంట్ ఉంది కాబట్టే ఇచ్చారు’ అని సిరివెన్నెల అంటున్నాడు అని అన్నప్పుడు, దాన్ని నమ్మేసి ఇంట్లోవాళ్లందరితో వాగేసి, శాస్త్రి రేపొస్తే కడిగేస్తాను అనుకుంటే కరెక్ట్ కాదు. అలా చెప్పినవాడిని కొట్టాలి (నవ్వుతూ). ఇలా సరదాగా సంభాషణ సాగుతున్న సమయంలో విశ్వనాథ్‌గారి సతీమణి (జయలక్ష్మి) వచ్చారు. మెల్లిగా నడుస్తూ వచ్చిన జయలక్ష్మిగారు సిరివెన్నెలగారి కుర్చీ పక్కన కూర్చుంటే.. విశ్వనాథ్‌గారి పక్కన కూర్చోమని అడిగిన ‘సాక్షి’తో నడవలేనేమో అన్నప్పుడు ‘ఇంతకాలం నన్ను నడిపించావు కదా’ అని విశ్వనాథ్‌గారు చమత్కరించడంతో అక్కడే ఉన్న ఆయన తనయుడు, కోడలు.. అందరూ హాయిగా నవ్వేశారు. భర్త పక్కన కూర్చున్నాక ‘‘నా బిడ్డ (సిరివెన్నెలను ఉద్దేశించి)ను నేనే మెచ్చుకుంటున్నానేమో కానీ ఎంతో లవ్లీగా అనిపిస్తోంది. నాలుగు రోజుల నుంచి (పద్మశ్రీ వచ్చిన రోజు నుంచి) మా ఆనందం చెప్పలేనిది. మా కన్నబిడ్డకు వచ్చినట్లుగానే అనుకుంటున్నాం’’ అన్నారు జయలక్ష్మి. సిరివెన్నెల: ఈ సందర్భంలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే.. నాన్నగారు తీసిన ప్రతీ సినిమా కూడా వేదమే. వేదానికి కొన్ని వందల అర్థాలు ఉన్నాయి. సింపుల్ మీనింగ్ ఏంటంటే మనకు ఏది తెలియాలో అది వేదం. మీ మధ్య వాదించుకోవడాలు ఉండేవా? సిరివెన్నెల: ఆయనకు నచ్చకపోవడం ఉండదు. విశ్వనాథ్: 75 ఏళ్లు కాపురం చేశాం. మా ఆవిడను అడగండి. ఆవిడ ఏం సమాధానం చెబుతుందో. శాస్త్రి, నా మధ్య సఖ్యత కూడా అంతే. నారాయణరెడ్డిగారు ఓ సందర్భంలో మేమిద్దరం ‘జంట కవులం’ అన్నారు. సిరివెన్నెల: ‘స్వర్ణకమలం’ సినిమాకు నంది వచ్చినప్పుడు నాన్నగారి దగ్గరకు వెళ్లాను. ‘మూడు నందులు వరుసగా అందుకున్నాను. అయినా కానీ సంతృప్తిగా లేను’ అన్నాను. ఎందుకు? అని అడిగారు. మీ సినిమాల్లో ఏ క్రాఫ్ట్ వాళ్లకు అవార్డు వచ్చినా అందులో మీ పాత్ర ఉంటుంది. మీకు కాకుండా వేరే వాళ్లకు రాసి, నంది తెచ్చుకుంటే అప్పుడు నందికి అర్హుడిని అన్నాను. ఆ తర్వాత వేరేవాళ్ల సినిమాలకు కూడా చాలా వచ్చాయి. మనం జపనీస్ దర్శకుడు అకీరా కురొసావా గురించి చెప్పుకుంటుంటాం. ఆయన్ను తక్కువ చేయడం కాదు కానీ విశ్వనాథ్‌గారు తెలుగుకు పరిమితమైపోవడం వల్ల ఆయన గురించి అకీరా కురొసావా గురించి చెప్పుకున్నట్లు చెప్పుకోవడంలేదు. విశ్వనాథ్: మన తెలుగు వాళ్లకు ఉన్నదే అది. సిరివెన్నెల: కేన్వాస్ అదే. దాని మీద బూతు బొమ్మ గీసుకోవచ్చు. మామూలు బొమ్మ గీయొచ్చు, ఎక్కాలు రాయొచ్చు. విశ్వనాథ్‌గారు చేసింది చూడటం వల్ల ఆయన్ని పొగడటం అవదు. మీ (ప్రేక్షకులు) జీవితాన్ని మీరు విస్తృతపరచుకోవడం అవుతుంది. అది ఒక ఉనికి. అతిశయోక్తిగా విశ్వనాథ్‌గారిని దేవుడు భూమి మీదకు పంపారు అనడం లేదు. మనకు ఆకలి, డబ్బు సంపాదన ఇలా చాలా ఉంటాయి. ఇవి కాకుండా మన లోపల ఓ ఆర్తి ఉంటుంది. దాని కోసం ఆయన సినిమాలు చూడండి. మన మీద మనకు గౌరవం పెరుగుతుంది. మనం రోజూ చేస్తున్న ఘనతలు ఏమున్నాయి? తినడం, ఉద్యోగం చేయడం. ఇది తప్ప ఇంకేం ఉంది. ఆయన ‘శంకరాభరణం’ చూస్తే.. అంతకు ముందు మంచి సినిమాలు లేవని కాదు. ఆయన మనకు చాలా ఎక్కువ గౌరవం ఇచ్చారు. ప్రేక్షకులు వాళ్ల అర్హతను ఆయన సినిమాను విజయవంతం చేసి మాత్రమే నిరూపించుకోగలరు. నిరూపించుకున్నారు కూడా. ‘సిరివెన్నెల’ మీ ఇంటి పేరుగా మారిపోవడం గురించి? సిరివెన్నెల: ఆ సినిమా వల్ల నాకీ పేరు రాలేదు. ఆ సినిమా టైటిల్ కార్డ్స్‌లోనే ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అని వేశారు. మన శాస్త్రంలో ఆరు రకాల తండ్రులు ఉంటారు అంటుంటాం. విద్య నేర్పినవాడు, నామకరణం చేసినవాడు, జన్మనిచ్చినవాడు.. ఇలా. మా నాన్నగారు జన్మనిస్తే, నాకు సినీ నామకరణం చేసి, కవి జన్మని ఇచ్చిన తండ్రి విశ్వనాథ్‌గారు. ఆ పేరు పెట్టేప్పుడు మీ అమ్మానాన్న చక్కగా సీతారామశాస్త్రి అని పెట్టారుగా.. మళ్లీ పేర్లెందుకు? స్క్రీన్ కోసమే కావాల్సి వస్తే ‘సిరివెన్నెల’ అని సినిమా పేరే ఉందిగా. దాన్ని ముందు జత చేసుకో అన్నారాయన. సిరివెన్నెలలానే నీ కెరీర్ కూడా ఉంటుంది అన్నారు. వశిష్ట మహర్షి రాముడికి పేరు పెట్టినట్టుగా నాకు పేరు పెట్టారు. విశ్వనాథ్‌గారిని ‘నాన్నగారు’ అని ఎప్పటి నుంచి పిలుస్తున్నారు? సిరివెన్నెల: నాకు ముందు నుంచి పిలవాలని ఉండేది. కానీ బెరుకుగా కూడా ఉండేది. ఐదారేళ్ల క్రితం నుంచి పిలుస్తున్నాను. విశ్వనాథ్: శాస్త్రి నన్ను ఏనాడూ పేరు పెట్టి పిలిచింది లేదు. సిరివెన్నెల: మా అబ్బాయిని కూడా సాయి (అసలు పేరు యోగేశ్వర శర్మ. సిరివెన్నెల తండ్రి పేరు) అంటాను. నాన్న పేరుతో పిలవలేను. ఈయన్ను కూడా అంతే. ఈతరంలో మీకు విశ్వనాథ్గారిలాంటి దర్శకుడు దొరికారా? సిరివెన్నెల: లేరు. ఒకటి విశ్వనాథ్‌గారు కథను చెప్పే విధానం. రెండు.. రచయితని నీ మనసు ఎలా పలుకుతుందో అలా రాయి అనే దర్శకుడు ఆయన. మొట్టమొదటి సినిమాలో మొట్టమొదటి పాట రాస్తున్నప్పుడే నీకు ఏం తోస్తే అది రాయి. నాకు అర్థం కాకపోయినా ఫర్వాలేదు అన్నారు. హిమాలయాలంత మనిషి తన స్థాయిని ఆపాదించుకుని నాకు అర్థం కానిది ఏదీ లేదు అనొచ్చు. నాకు అర్థం కాకపోయినా ఫర్వాలేదు అన్నారు. ‘నాకే అర్థం కాలేదు. జనాలకు ఎలా అర్థం అవుతుంది’ అని కొందరు దర్శకులు అంటారు. జనాలు అని ఎవరైనా సంబోధిస్తే నాకు కోపం వస్తుంది. మనం ఎవరి ముందు కూర్చుని మాట్లాడుకుంటున్నాం అంటే ఒక యుగం ముందర. ఒక శకం ముందర కూర్చొని. ఏనాడూ ఆయన ఆడియన్స్‌ను తక్కువ చేసి మాట్లాడలేదు. మనం కాదా జనం.. జనంలో నుంచి మనం రాలేదా? జనాన్ని తక్కువ చేస్తే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టే అని ఆయన అనుకుంటారు. మీరు సినిమాల్లోకి వచ్చే నాటికే విశ్వనాథ్‌గారు గొప్ప పేరున్న వ్యక్తి. మరి.. ఆయనతో జర్నీ మొదట్లో భయంగా అనిపించేదా? విశ్వనాథ్: నేను సమాధానం చెబుతా. మా గురువుగారు ఆదుర్తిగారు చాలా గొప్ప విషయాలు చెప్పారు. ‘మొదట్లో వచ్చేవాళ్లకు భయం, భక్తీ ఉంటాయి. మనం చనువు చేసి, జాగ్రత్తగా భయం పోగొడితే... అప్పుడు వాళ్లు భయం లేకుండా ఇలా ఇలా ఉంటే బావుంటుంది అని చెప్పగలుగుతారు. ఒకవేళ మనం భయం పోగొట్టకపోతే ఏమీ చేయకుండా బొమ్మల్లా మనల్ని ఫాలో అయిపోతుంటారు’ అని చెప్పారు. అందుకే నేను భయం పోగొట్టేవాణ్ణి. నిజానికి ఎదుటి వ్యక్తి స్థాయిని బట్టి మన ఫీలింగ్స్ ఉంటాయి. నేను అమితాబ్ బచ్చన్ దగ్గరకు వెళ్తే నిలబడతాను. ఆయన స్టేచర్‌కు నేను గౌరవం ఇస్తాను. మా ఊళ్లో నేను గొప్పవాణ్ణి అంటే ఏం లాభం? ఈ లక్షణాలు చివరిదాకా ఉండాలి. ఇవే మా సినిమాల్లో పెడతాం. భయం పోయినా గౌరవం పోకూడదు. సిరివెన్నెల: ఇప్పుడు వేల్యూ సిస్టమ్ అనేది లేదు. అవన్నీ పోయాయి. ‘కొత్త దర్శకులను తండ్రీ కొడుకులిద్దరూ స్నేహితులైతే కలసి కూర్చుని తాగాలా? ఆ సన్నివేశం లేకపోతే నష్టమా?’ అని అడుగుతుంటాను. విశ్వనాథ్: అవన్నీ మీకెందుకు? మీ పాట మీరు రాయండి. (నవ్వుతూ). సిరివెన్నెల: నన్ను అలా అనే సాహసం ఎవ్వరూ చేయలేదు. ఎందుకంటే నేను ఏ స్కూల్ నుంచి వచ్చానో వాళ్లకు తెలుసు (నవ్వులు). ఎంతటి ప్రతిభావంతులకైనా ప్రశంసలు ఆనందాన్నిస్తాయి. మీ సినిమాలను మెచ్చుకున్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? విశ్వనాథ్: మనం చేసినదాన్ని ఒకరు మెచ్చుకుని అందులో ఉన్న మెరుపును చెప్పినప్పుడు ‘అమ్మయ్య.. ఇంత ఇదిగా గుర్తించారు’ అని ఆనందం వస్తుంది. అది వీక్నెస్ అనండి ఇంకేదైనా అనండి. ఎంత బావుందో సినిమా అని అనిపించుకోబుద్ధి అవుతుంది (కళ్లల్లో ఆనందంతో). సిరివెన్నెల: ఇక్కడ మమ్మల్ని పొగడక్కర్లేదు. సినిమాలో ఉన్న విషయం అర్థం చేసుకుని ఆనందించడం ముఖ్యం. సినిమా బావుండటం వేరు. ప్రయోజనం వేరు. రెండూ వేరే వేరే విషయాలు. చాలా బావున్నది మనకు దేనికీ పనికి రాకపోవచ్చు. నాన్నగారు తీసిన సినిమాలు చూడటం ఎవరికి వాళ్లు సంస్కారం పెంచుకోవడానికి రుజువు. ఇవాళ పనిగట్టుకుని శాస్త్రి వచ్చి ఆయన్ను పొగడక్కర్లేదు. విశ్వనాథ్: బాక్సాఫీస్ ఈజ్ నాట్ ది క్రైటీరియా. కొన్ని సినిమాలకు ఎందుకని డబ్బు రాలేదో అర్థం కాదు. కొన్నింటికి ‘దాంట్లో ఏమీ లేదు. ఊరికే డబ్బు వచ్చేస్తుంది’ అంటుంటారు. సిరివెన్నెల: కళా తపస్వి అన్నది బిరుదు కాదు. మేం నాన్నగారిని వదిలి వెళ్లేటప్పుడు రాత్రి పది అయ్యేది. కానీ మరుసటి రోజు కొత్త కథ ఉండేది. అంటే ఆ రాత్రంతా ఏం చేస్తున్నట్టు? పొద్దునే ఇది తీస్తారు అని వెళ్తాం. కానీ అక్కడ వేరేది ఉంటుంది. నాకూ అదే అలవాటైంది అనుకుంటా. రాత్రంతా ఒక వెర్షన్ రాసి మరో వెర్షన్ రాసి... ఇలా రాత్రిళ్లు రాస్తుంటాను. విశ్వనాథ్: శాస్త్రి రాత్రిపూట రాస్తాడంటే ఆ నిశ్శబ్దమే తనకు సహాయం చేస్తుంది. నాక్కూడా తెల్లవారుజాము నాలుగు గంటలకు కొత్త కొత్త భావాలు వస్తుంటాయి. వాటినే ఉదయం షూటింగ్ ప్రారంభించాక ఇలా చేయండి అని చెబుతుంటాను. మరి శాస్త్రి అందరి దగ్గర అలా చేస్తాడో లేక మా దగ్గరే అలా చేస్తాడో తెలియదు. వచ్చేటప్పుడు తెల్ల కాగితాలు తెచ్చుకుంటాడు. రీమ్ అంటామే. నాలుగు లైన్స్ ఏవో రాస్తాడు. పక్కన పెడతాడు. పడేయడు. మళ్లీ కాసేపు బయటకు వెళ్లిపోతాడు. అలా ఎప్పుడో రాసినవి ఇప్పటికీ తన దగ్గర ఉంటాయి. సిరివెన్నెల: అవును.. ఇప్పటికీ ‘సిరివెన్నెల’ సినిమాకు రాసిన కాగితాలు ఉన్నాయి. చివరి ప్రశ్న... వేటూరిగారు, ఆరుద్రగారు.. ఇలాంటి గొప్ప రచయితలతో పాటలు రాయించుకున్నారు. ఆ తర్వాత సిరివెన్నెలగారితో రాయించుకున్నారు. ఆయనకు రీప్లేస్‌మెంట్‌గా..? విశ్వనాథ్: అవసరం లేదు. ఆయన పైకి ఎదుగుతున్న స్టేజ్‌లో నేను కిందున్నాను. పదేళ్లుగా ఏ సినిమా చేయడం లేదు నేను. ఒకవేళ చేస్తే రాయను అనడు. కాబట్టి ఇప్పుడప్పుడే వెతుక్కోనవసరం లేదు. సిరివెన్నెల: నేనే ఆయనతో ఓసారి అన్నాను. మీ సినిమాల్లో నేను రాయకుండా వీలే లేదు. ఇప్పుడు నాన్నగారు సినిమా తీసి, ఏ కారణం చేతనైనా ఆయన సినిమాల్లో పాట రాయకపోతే నేను ఇండస్ట్రీలో ఉండనన్నది నా పంతం. – డి.జి.భవాని -
‘సిరివెన్నెల’ను కలిసిన చిరు
తరలిరాదా తనే వసంతం తనదరికి రాని వనాల కోసం.. అన్నట్టు బిరుదులు, అవార్డుల వెంట సిరివెన్నెల సీతారామశాస్త్రి పరుగెత్తడు.. ఆయన వెనకే అవన్నీ పరుగెత్తుతాయి. మధురమైన పాటలనే కాదు, ఆలోచనలు రేకెత్తె గీతాలను కూడా సృష్టించగలరు. అన్ని రకాల పాటలు ఆయన కలంలోంచి పుట్టాయి. ఎన్నో రాగాలకు పదాలతో ప్రాణాలు పోశారు. ‘సిరివెన్నెల’తో ప్రయాణం మొదలవ్వగా.. నేటి వరకు ఆయన తన పాటలతో అందరినీ అలరిస్తున్నారు.. ఆలోచింపజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆయనకు ‘పద్మశ్రీ’ అవార్డుని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన్ను సినీ ప్రముఖులు కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సిరివెన్నెలను కలిసి అభినందనలు తెలియజేశారు. వీరిద్దరి కలయికలో ఎన్నో మంచి గీతాలు వచ్చాయి. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని పలు వేదికలపై సిరివెన్నెల ప్రస్థావించిన సంగతి తెలిసిందే. మా అధ్యక్షుడు శివాజీ రాజా, మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌లాంటి ప్రముఖులు సిరివెన్నెలను కలిసి తమ అభినందనలు తెలిపారు. -
సిరివెన్నెలకు పద్మశ్రీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు వ్యక్తులకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో ఇద్దరు ఆంధప్రదేశ్‌కు, ఇద్దరు తెలంగాణకు చెందినవారున్నారు. ఏపీ నుంచి ప్రముఖ చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, వ్యవసాయ రంగం నుంచి ఎడ్లపల్లి వేంకటేశ్వరరావు, తెలంగాణ నుంచి సిరివెన్నెలతోపాటు భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ ఆటగాడు సునీల్ ఛెత్రిలను పద్మ శ్రీ వరించింది. 2019వ సంవత్సరానికి పౌర పురస్కారాలను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన ప్రముఖులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. కళలు, సాహిత్యం, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, పరిశ్రమలు, ఆరోగ్యం–వైద్యం, వర్తకం, క్రీడలు, సామాజిక సేవ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి ఆయా రంగాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖలను కేంద్రం పద్మ అవార్డులతో సత్కరించనుంది. మొత్తం 112 మందికి ఈ పురస్కారాలు ప్రకటించింది. వీరిలో నలుగురికి పద్మ విభూషణ్, 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మ శ్రీ పురస్కారాలు దక్కాయి. జానపద గాయకురాలు తీజన్ బాయి, జిబౌటీకి చెందిన ఇస్మాయిల్ ఒమర్ గులేహ్, ఎల్ అండ్ టీ చైర్మన్ ఏఎం నాయక్, మహారాష్ట్రకు చెందిన బల్వంత్ పురందరేలను పద్మ విభూషణ్ విజేతలుగా కేంద్రం ఎంపిక చేసింది. అవార్డులు దక్కించుకున్న వారిలో 21 మంది మహిళలు, 11 మంది విదేశీయులు, ముగ్గురు దివంగతులు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్చి, ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేయనున్నారు. సినీ నటుడు మోహన్ లాల్(కేరళ)కు పద్మ భూషణ్, నటుడు, డాన్స్ మాస్టర్ ప్రభుదేవా(కర్ణాటక)కు నృత్యంలో పద్మ శ్రీ లభించింది. నర్తకి నటరాజ్, ఖాదర్ ఖాన్ కరియా ముండా, మోహన్‌లాల్ రైతు నేస్తం వెంకటేశ్వరరావుకు పద్మశ్రీ వట్టిచెరుకూరు(ప్రత్తిపాడు): ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావుకు పద్మశ్రీ లభించింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన వెంకటేశ్వరరావు 1994 నుంచి హైదరాబాద్‌లో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నారు. 2001 నుంచి 2004 వరకు రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల కారణంగా ఎంతోమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం చూసి కలత చెందిన వెంకటేశ్వరరావు రైతు రాజులా బతకటానికి తన వంతు ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 2005లో రైతునేస్తం మాసపత్రికను ప్రారంభించారు. మొదటి సంచికను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమ అయిన పాడి పరిశ్రమను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 2012లో ప«శునేస్తం మాస పత్రికను, ప్రకృతి వ్యవసాయ విధానాలపై విస్తృత ప్రచారం కల్పించే లక్ష్యంతో 2014లో ప్రకృతి నేస్తం మాస పత్రికను ప్రారంభించారు. తన ఆలోచనలను పుస్తక రూపంలో అందిస్తూ వచ్చిన వెంకటేశ్వరరావు రైతునేస్తం ఫౌండేషన్ ఏర్పాటుచేసి, రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొర్నెపాడు గ్రామంలో రైతునేస్తం ఫౌండేషన్ ద్వారా రైతు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ఇప్పటివరకు 140 వారాలకు పైగా తరగతులను నిర్వహించి 4000 మంది పైచిలుకు రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి సూచనల ప్రకారం.. చిరుధాన్యాల సాగుపై రైతునేస్తం తరఫున పుస్తకాలు ప్రచురించారు. వెంకటేశ్వరరావుకు పద్మశ్రీ పురస్కారం లభించడంతో ఆయన స్వగ్రామం కొర్నెపాడులో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ తనకిచ్చిన ఈ అవార్డును రైతుకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. సాక్షి ‘సాగుబడి’ తన కార్యక్రమాలకు మద్దతుగా నిలిచిందని ధన్యవాదాలు తెలిపారు. నలుగురికి ‘కీర్తి చక్ర’ దేశ రెండో అత్యున్నత శౌర్య పురస్కారం ‘కీర్తిచక్ర’ను నలుగురు జవాన్లు పొందారు. వీరిలో జాట్ రెజిమెంట్‌కు చెందిన మేజర్ తుషార్ గౌబా, 22వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సోవర్ విజయ్ కుమార్(మరణానంతరం)తోపాటు 2017లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన జవాన్లు ప్రదీప్‌కుమార్ పండా, రాజేంద్ర కుమార్ నైన్ ఉన్నారు. అసిస్టెంట్ కమాండెంట్ జైల్ సింగ్‌తోపాటు 9 మంది సైనికాధికారులకు శౌర్యచక్రను రక్షణ శాఖ ప్రకటించింది. ‘పరమ్ విశిష్ట సేవా పతకం’ ఆర్మీ చీఫ్ జనరల్ రావత్ సహా 19 మంది సైనికాధికారులకు లభించింది. ఎమర్జెన్సీపై గొంతెత్తిన నయ్యర్ ప్రముఖ జర్నలిస్ట్, మానవహక్కుల కార్యకర్త, దౌత్యవేత్త కుల్దీప్ నయ్యర్ అవిభక్త భారత్‌లోని సియాల్ కోట్(ప్రస్తుతం పాకిస్తాన్)లో 1923, ఆగస్టు 14న జన్మించారు. కెరీర్ తొలినాళ్లలో ఉర్దూ పత్రిక అంజామ్ లో రచయితగా పనిచేశారు. ఆ తర్వాత అదే పత్రికలో రిపోర్టర్‌గా చేరారు. దేశవిభజన అనంతరం కుటుంబంతో కలిసి భారత్‌కు వచ్చేశారు. ఆయన ‘ది స్టేట్స్‌మన్’ పత్రిక ఢిల్లీ ఎడిషన్‌కు ఎడిటర్‌గా పనిచేశారు. మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి, కేంద్ర మాజీ హోంమంత్రి గోవింద్ బల్లప్పంత్కు ప్రెస్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా సేవలందించారు. 1975లో ఎమర్జెన్సీ సందర్భంగా పత్రికలపై సెన్సార్షిప్ను వ్యతిరేకించడంతో ఇందిర ప్రభుత్వం ఆయన్ను తీహార్ జైలులో పెట్టింది. కేంద్ర ప్రభుత్వం 1990లో ఆయన్ను లండన్‌లో భారత హైకమిషనర్‌గా నియమించింది. కుల్దీప్ నయ్యర్ 1997లో రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు. జర్నలిజంలో ఆయన చేసిన సేవలకు గానూ 2015లో రామ్‌నాథ్ గోయెంకా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. బియాండ్ ది లైన్స్, ఇండియా ఆఫ్టర్ నెహ్రూ, స్కూప్, ఎమర్జెన్సీ కీ ఇన్సైడ్ స్టోరీ, వాల్ ఎట్ వాఘా తదితర పుస్తకాలు రాశారు. న్యుమోనియాతో బాధపడుతూ ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేరిన నయ్యర్ 2018, ఆగస్టు 23న 95 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. పాండవని కళలో ప్రసిద్ధురాలు తీజన్ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తీజన్ బాయి (62) ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన జానపద గాయకురాలు. ఆమెకు 1987లోనే పద్మశ్రీ, 2003లో పద్మభూషణ్ పురస్కారాలు దక్కాయి. మహాభారతం నుంచి పాండవుల వీరగాథలను ఆమె ఏకకాలంలో సంగీత వాద్యాలను ఉపయోగిస్తూ, జానపద గేయాలు పాడుతూ వివరిస్తారు. దీనినే పాండవని కళ అంటారు. చిన్నతనంలో ఎన్నో కష్టాలను అనుభవించి, ఎంతో కృషి చేసి ఈ స్థాయికి చేరారు. భిలాయ్ పట్టణానికి సమీపంలోని గణియారి గ్రామంలో గిరిజన తెగకు చెందిన చంక్లాల్ పార్ధి, సుఖవతి దంపతుల ఐదుగురు పిల్లల్లో తొలి సంతానంగా తీజన్ బాయి జన్మించారు. 12 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు అప్పటికే ఇద్దరు పెళ్లాలున్న వ్యక్తికి తీజన్ బాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాతా ఆమె భర్త మరో పెళ్లి చేసుకోవడంతో ఇక ఆమె అత్తారింటిని వదిలి వచ్చేశారు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నా, అదీ ఎంతో కాలం నిలువలేదు. ఛత్తీస్‌గఢ్‌లో లెక్కలేనన్ని గ్రామాల్లో ప్రదర్శనలిచ్చిన ఆమె, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, నాటి యూఎస్ఎస్ఆర్, సైప్రస్, ట్యునీషియా, టర్కీ, మాల్టా తదితర అనేక దేశాల్లోనూ పర్యటించి ఎంతో మందిని తన అభిమానులుగా మార్చుకున్నారు. ఎంత ఎదిగినా ఆమె ఎంతో వినమ్రతతో అణుకువగా ఉంటారు. ఎదురులేని నేత ఒమర్ గులెహ్ ఆఫ్రికా దేశమైన జిబౌటీని గత 20 ఏళ్ల నుంచి అప్రతిహతంగా పాలిస్తున్న ఇస్మాయిల్ ఒమర్ గులెహ్(72) ఇథియోపియాలో 1947, నవంబర్ 27న జన్మించారు. హైస్కూలు చదువు పూర్తయ్యాక జిబౌటీకి వలసవెళ్లారు. ఫ్రెంచ్ పాలనలో ఉన్న జిబౌటీలో 1968లో ప్రభుత్వఉద్యోగిగా చేరారు. రెండేళ్లలోనే పోలీస్ ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ‘జిబౌటీ టుడే’ వార్తాపత్రికను ప్రారంభించారు. 1977లో స్వాతంత్య్రం పొందాక జిబౌటీ తొలి అధ్యక్షుడు, తన బంధువైన హసన్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఏకంగా 22 ఏళ్లు పనిచేశారు. అయితే 1999 ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న హసన్ తన వారసుడిగా గులెహ్ పేరును ప్రతిపాదించారు. చైనా ఇప్పటికే జిబౌటీలో నౌకా స్థావరాన్ని ఏర్పాటుచేసిన నేపథ్యంలో భారత్ గులెహ్కు పద్మవిభూషణ్‌ను ప్రకటించడం గమనార్హం. మరాఠా నాటక రచయితకు పద్మవిభూషణ్ నాటక–కథా రచయిత, చరిత్రకారుడు బల్వంత్ మోరేశ్వర్ పురందరే(96) మహారాష్ట్రలోని పుణెలో 1922, జూలై 29న జన్మించారు. ఆయన రచనల్లో 17వ శతాబ్దపు మరాఠా రాజు ఛత్రపతి శివాజీ జీవితం, పాలన ఆధారంగా రాసినవే ఎక్కువగా ఉన్నాయి. శివాజీ పాలనపై పురందరే రాసిన ‘జనతా రాజా’ అనే నాటకం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విమర్శకుల ప్రశంసలు పొందింది. చరిత్రపై అమితాసక్తి చూపే పురందరే.. రాజా శివ ఛత్రపతి, కేసరి వంటి పుస్తకాలను రాశారు. కళారంగంలో ఆయన అందించిన సేవలకు గానూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2007–08 సంవత్సరానికి కాళిదాస్ సమ్మాన్ అవార్డును ప్రకటించింది. అలాగే 2015లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రపు అత్యున్నత పౌర పురస్కారమైన మహారాష్ట్ర భూషణ్ అవార్డును అందించింది. -
స్టెప్పుకి మెప్పు
డ్యాన్స్‌లో సరికొత్త ట్రెండ్‌ని తీసుకొచ్చి దక్షిణాది, ఉత్తరాది తారలతో ఉర్రూతలూగించే స్టెప్పులేయించిన ‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’ అనిపించుకున్నారు ప్రభుదేవా. తండ్రి సుందరం మాస్టారుని ఆదర్శంగా తీసుకుని, ఆయన దగ్గరే సహాయకుడిగా చేసి, ఆ తర్వాత నృత్యదర్శకుడిగా మారారు ప్రభుదేవా. 13 ఏళ్ల వయసులో తొలిసారి ‘మౌనరాగం’(1986) చిత్రంలో ఫ్లూట్ వాయించే కుర్రాడిగా ఓ పాటలో కనిపించిన ప్రభుదేవా ఆ తర్వాత ‘అగ్ని నక్షత్రం’ అనే సినిమాలో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‌గా చేశాడు. ‘ఇదయం’ (1991) (తెలుగులో ‘హృదయం’)లో చేసిన స్పెషల్ సాంగ్ ‘ఏప్రిల్ మేయిలే..’ అప్పటి కుర్రకారుని ఉర్రూతలూగించింది. ఇక ‘జెంటిల్‌మేన్’లో ‘చికుబుకు చికుబుకు రైలే...’ సాంగ్‌లో ప్రభుదేవా వేసిన స్టెప్స్ సూపర్ అననివాళ్లు లేరు. ఇతర హీరోల చిత్రాల్లో ప్రత్యేక పాటలు చేయడంతో పాటు పలువురు అగ్రహీరోల చిత్రాలకు నృత్యదర్శకుడిగానూ చేశారు ప్రభుదేవా. 16 ఏళ్ల వయసులో తొలిసారి నృత్యదర్శకుడిగా కమల్‌హాసన్ ‘వెట్రి విళా’కి చేసిన ప్రభుదేవా ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీగా అయ్యాడు. రజనీ ‘దళపతి’లోని ‘చిలకమ్మా చిటికెయ్యంట...’, చిరంజీవి నటించిన ‘రౌడీ అల్లుడు’, ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’... వంటి చిత్రాలతో పాటు రీ–ఎంట్రీ మూవీ ‘ఖైదీ నం. 150’ వరకూ ప్రభుదేవా పలు చిత్రాలకు కొరియోగ్రఫీ చేశారు. నాగార్జునతో ‘విక్రమ్, కెప్టెన్ నాగార్జున’ వంటి చిత్రాలకు, బాలకృష్ణ, వెంకటేశ్ .. ఇలా అగ్రహీరోలందరితో కొత్త స్టెప్పులు వేయించారు. ఒకవైపు నృత్యదర్శకుడిగా కొనసాగుతూ నటుడిగా మారారు ప్రభుదేవా. దర్శకుడు పవిత్రన్ ‘ఇందు’ చిత్రంలో ప్రభుదేవా తొలిసారి లీడ్ రోల్ చేశారు. శంకర్ ‘ప్రేమికుడు’ హీరోగా ప్రభుదేవాకు పెద్ద బ్రేక్. ఆ సినిమాలో ‘ముక్కాలా ముక్కాబులా..’, ‘ఊర్వశీ ఊర్వశీ.. టేకిట్ ఈజీ పాలసీ..’ పాటలకు ప్రభుదేవా వేసిన స్టెప్స్‌ని నేటి తరం కూడా ఫాలో అవుతోంది. ‘మెరుపు కలలు’, ‘సంతోషం’..వంటి చిత్రాలతో పాటు డ్యాన్స్ బేస్డ్ మూవీస్ ‘స్టైల్’, ‘ఎబిసిడి’ వంటి చిత్రాలు కూడా చేశారు. డైరెక్షన్ మారింది తండ్రి దగ్గర సహాయకుడిగా చేసి, నృత్యదర్శకుడిగా స్టెప్ వేసి, నటుడిగా మరో అడుగు వేసి, ఆ తర్వాత డైరెక్టర్‌గానూ తన కెరీర్ డైరెక్షన్ మార్చారు ప్రభుదేవా. సిథ్ధార్థ్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన తొలి చిత్ర ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సూపర్ హిట్. ప్రభాస్‌తో ‘పౌర్ణమి’ని తెరకెక్కించారు. చిరంజీవి ‘శంకర్‌దాదా జిందాబాద్’కి కూడా దర్శకత్వం వహించారు. తెలుగు ‘పోకిరి’కి రీమేక్‌గా తమిళంలో ‘పోకిరి’, హిందీలో ‘వాంటెడ్’గా ప్రభుదేవా దర్శకత్వం వహించిన చిత్రాలు దర్శకుడిగా అతని ప్రతిభను నిరూపించాయి. ఆ తర్వాత పలు తమిళ, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు ప్రభుదేవా. నిర్మాతగా తమిళంలో దేవి, బోగన్తో పాటు మరో మూడు చిత్రాలను రూపొందించారు. మైసూర్లో 1973 ఏప్రిల్ 3న ముగూర్ సుందర్, మహదేవమ్మ సుందర్‌లకు జన్మించిన ప్రభుదేవా పెరిగింది చెన్నైలో. ధర్మరాజ్, ఉడుపి లక్ష్మీనారాయణన్ మాస్టార్ల దగ్గర క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుని టీనేజ్లోనే సినిమాల్లోకొచ్చారు. దాదాపు 30 ఏళ్ల కెరీర్‌ని సొంతం చేసుకున్న ప్రభుదేవా సినీ రంగంలో నృత్యదర్శకుడిగా చేసిన సేవలకు గాను ‘పద్మశ్రీ’ వరించింది. -
పాట పరవశించింది
శుక్రవారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. తెలుగులో ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రికు ‘పద్మశ్రీ’ అవార్డు ప్రకటించారు. నృత్యదర్శకుడు ప్రభుదేవా, బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి, గాయకులు శంకర్ మహదేవన్‌లకు పద్మశ్రీలను ప్రకటించారు. అలాగే మలయాళ నటుడు మోహన్ లాల్‌కు ‘పద్మభూషణ్’ ప్రకటించారు. ‘అవును.. ఆలస్యం అయింది. అవార్డు అనేది విలువను గుర్తించేది, గౌరవించేది మాత్రమే కానీ విలువను నిరూపించేది కాదు’ అని ప్రముఖ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ఓ సందర్భంలో అన్నారు. ఇండస్ట్రీకి వచ్చిన 35 ఏళ్లకు పద్మశ్రీ అందుకున్న ఆయన ఇండస్ట్రీకు రాకముందే తన పేరు ముందు పద్మను కలుపుకున్నారు. సిరివెన్నెల భార్య పేరు పద్మ. ఆ మధ్య ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసినప్పుడు పద్మ అవార్డు రాకపోవడం గురించి ప్రస్తావిస్తే ... ‘నా పేరులోనే పద్మ ఉంది’ అని చమత్కరించారు సిరివెన్నెల. సిరి శక్తి సమస్యను ఎదుర్కోమంటూ పాట ద్వారా ప్రేరేపించగలిగే శక్తి సిరివెన్నెల. మాట సైతం తన వెన్నెల ప్రసరించమని విన్నవించుకునే విన్నపం సిరివెన్నెల. ఆత్రేయ, వేటూరి తర్వాత తెలుగు పాట అంతలా పొంగిపోయేలా చేసింది సిరివెన్నెల. కాకినాడ ఆంధ్రా యూనివర్శిటీలో బికామ్ పూర్తి చేసిన íసీతారామశాస్త్రి 1984లో సినిమా సాహిత్యం వైపు అడుగులేశారు. మొట్టమొదట రాసింది జననీ జన్మభూమి(1984) సినిమాకే అయినా ఆ తర్వాత రాసిన ‘సిరివెన్నెల’ సినిమా పాటలు ఆయనకు ఇండస్ట్రీలో స్థానం ఇచ్చాయి. చెంబోలు సీతారామశాస్త్రి నుంచి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా మార్చింది ఆ చిత్రం. ‘సిరివెన్నెల’ తర్వాత శాస్త్రి వెనక్కు చూసుకునే పనిలేకుండా పోయింది. ఆ సినిమాలో రాసిన ప్రతీ పాట ఓ ఆణిముత్యం. అంత అర్థవంతంగా ఉండబట్టే ఆ ఏడాది బంగారు నంది శాస్త్రి ఇంటికి పరుగుతీసింది. తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకున్న రికార్డు నెలకొల్పారాయన. ఆ తర్వాత అద్భుతమైన పాటలు రాస్తూ ఇండస్ట్రీలో తన మాటను పాటలా విస్తరిస్తూ సుస్థిరం చేసుకున్నారు. ‘స్వయంకృషి, స్వర్ణకమలం, శ్రుతిలయలు, రుద్రవీణ, గాయం, సింధూరం, ప్రేమ కథ, నిన్నే పెళ్లాడతా, చక్రం, బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సినిమాలకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారాయన. ‘సింధూరం’లో అర్ధ శతాబ్దపు అజ్ఞానమే స్వాతం త్య్రం అనుకుందామా? అని ప్రశ్నను సంధిస్తే దానికి సమాధానం నంది అవార్డు అయింది. ‘దేవుడు కరుణిస్తాడనీ వరములు కురిపిస్తాడని..’ ప్రేమ పాట రాయడం రాష్ట్ర ప్రభుత్వం నంది కురిపించడం జరిగిపోయింది. ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది’ అని ‘చక్రం’ సినిమాలో రాశారాయన. ‘ఆయువనేది ఉండేవరకూ ఇంకేదో లేదని అనకూ’ అనే జీవిత సారాన్ని చాలా తేలికైన పదాలతో కమర్షియల్ సినిమాలో చెప్పగల శక్తి, సామర్థం ఉన్నది సిరివెన్నెలకే. ‘సాహిత్యం అనేది అర్థం అయ్యేలానే రాయక్కర్లేదు. అర్థం చేసుకోవాలనే కుతూహలం రేకెత్తించేలా కూడా రాయొచ్చు. అలాంటి రచయిత సిరివెన్నెలగారు’ అంటారు దర్శకుడు త్రివిక్రమ్. 3 వేలకు పైగా పాటలు, 11 రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు. 3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు. 1986, 87, 88 సంవత్సరాలలో వరుసగా నంది అవార్డులను అందుకొని హ్యాట్రిక్ సృష్టించారు. ప్రస్తు తం ఉన్న అగ్ర పాటల రచయితలు కూడా సిరివెన్నెలను ‘గురువు’గా భావిస్తారన్న సంగతి తెలిసిందే. కళ, కళ యొక్క ముఖ్య ఉద్దేశం రేపటి మీద ఆశ కలిగించడం. సిరివెన్నెల పాటల్లో అది కనిపిస్తుంది. అదే కనిపిస్తుంది. చాలా సులువుగానే లోతుగా రాయడం ఆయన సొంతం. ఎన్ని అవార్డులు వరించినా ప్రేక్షకుడి పెదవి మీద కూనిరాగమే పెద్ద అవార్డు అంటారు సిరివెన్నెల. ఇప్పుడాయన పేరులో రెండు ‘పద్మ’లున్నాయి. సతీమణి ‘పద్మ’... కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మశ్రీ’. పాట ఆనందపడిన వేళ ఇది. పాట పరవశించిపోయిన వేళ ఇది. -
'చాలా ఆనందంగా ఉంది'
న్యూఢిల్లీ: తన ఇనేళ్ల సినీ ప్రస్థానం సంతృప్తికరంగా ఉందని ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదగా కోటా శ్రీనివాసరావు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. అనంతరం కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం తనను గుర్తించి గౌరవించడం చాలా ఆనందంగా ఉందన్నారు. మా ఎన్నికల్లో వివాదాలు చోటు చేసుకోవడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. రాష్ట్రపతి భవన్లో ఈ రోజు జరిగిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో కోటా శ్రీనివాసరావుతో పాటు ప్రముఖ కేన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు, మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలిరాజ్ పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. -
ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి
ఫారెస్ట్ ఆఫీసర్స్ జీకే - కరెంట్ అఫైర్స్ ఎన్. విజయేందర్ రెడ్డి జనరల్ అవేర్నెస్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ 1. 2014 ఏప్రిల్‌లో ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారానికి ఎంపికైన భారతీయ అమెరికన్ కవి ఎవరు? విజయ్ శేషాద్రి 2. ‘ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ద మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్’ అనే సంచలనాత్మక పుస్తకాన్ని రాసిందెవరు? సంజయ్ బారు 3. 2014 ఏప్రిల్‌లో బ్రిటన్‌లోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన నైట్ గ్రాండ్ క్రాన్ (జీబీఈ) అవార్డు లభించిన భారతీయుడు? టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్‌టాటా 4. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి మహిళ? ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్ రోహిణి 5. 1937లో పులిట్జర్ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడెవరు? గోవింద్ బిహారీలాల్ 6. 2014 ఫిబ్రవరిలో భారత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ వ్యవసాయ ప్రదర్శన ‘కృషి వసంత్’ను ఎక్కడ ప్రారంభించారు? మహారాష్ర్టలోని నాగ్‌పూర్‌లో 7. 1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన తొలి తెలుగు వ్యక్తి? జస్టిస్ కోకా సుబ్బారావు 8. 2014 సంవత్సరానికి గానూ బాలల నోబెల్ పురస్కారం ఎవరికి లభించింది? మలాలా యూసఫ్ జాయ్ (పాకిస్థాన్), జాన్ ఉడ్ (అమెరికా), ఇందిరా రానామగర్ (నేపాల్) 9. 2014 ఫిబ్రవరిలో సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సమావేశంలో ఐసీసీ బోర్డ చైర్మన్‌గా ఎవరిని నియమించారు? ఎన్. శ్రీనివాసన్ (జూలైలో బాధ్యతలు స్వీకరిస్తారు) 10. 2014 ఫిబ్రవరిలో చెన్నైలో జరిగిన ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న భారతీయ క్రీడాకారుడు? యుకి బాంబ్రి 11. 2014 ఫిబ్రవరిలో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎవరు ఎన్నికయ్యారు? ఎన్. రామచంద్రన్ 12. 2014 ఫిబ్రవరిలో సోచిలో నిర్వహించిన వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ముగ్గురు భారత క్రీడాకారులు? శివకేశవన్, నదీమ్ ఇక్బాల్, హిమాంశు ఠాకూర్ 13. సైబర్ భద్రత సమస్యల పరిష్కారానికి ఐక్య రాజ్యసమితి ప్రత్యేక సలహాదారుగా ఇటీవల నియమితుడైన భారతీయుడు? వివేక్ లాల్ 14. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరించిన కుటుంబం? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దివంగత జస్టిస్ జె.ఎస్. వర్మ కుటుంబం 15. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఇప్పటివరకూ ఎంతమంది పనిచేశారు? ముగ్గురు (బిల్‌గేట్స్, స్టీవ్ బామర్, సత్య నాదెళ్ల) 16. 2014 ఫిబ్రవరిలో అమెరికాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ విజిటర్స లీడర్షిప్ ప్రోగ్రాం (ఐవీఎల్పీ)కు ఎంపికైన భారతీయ మహిళ? ఒడిశాకు చెందిన మహిళా సర్పంచ్ ఆరతీదేవి 17. పెయింట్ల తయారీ సంస్థ బెర్జర్ పెయింట్స్ ఇటీవల ఒక ప్లాంటును ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ నెలకొల్పింది? అనంతపురం జిల్లా హిందూపురంలో 18. 2013 సంవత్సరంలో ప్రపంచంలో అత్యధిక వాహనాలు అమ్మిన రెండో కంపెనీగా అవతరించిన వోక్స్వ్యాగన్ ఏ దేశానికి చెందింది? జర్మనీ 19. సవరించిన గణాంకాల ప్రకారం 2012-2013 ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు ఎంత? 4.5 శాతం (క్రితం అంచనా 5శాతం) 20. ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌ల్లో అర్ధ సెంచరీలు చేసిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్? కేన్ విలియమ్సన్ 21. భారత్‌లో తొలి మోనోరైలును 2014 ఫిబ్రవరి 1న ఏ నగరంలో ప్రారంభించారు? ముంబై 22. 2014 ఫిబ్రవరిలో 28వ సూరజ్‌కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్స్ మేళాను ఏ రాష్ర్టంలో నిర్వహించారు? హర్యానా 23. 2014 ఫిబ్రవరి ఒకటో తేదీన మేఘాలయా రాష్ట్రానికి చెందిన తొలి పద్మశ్రీ అవార్డు గ్రహీత మరణించారు. ఆమె పేరు? సిల్వరైన్ స్వేర్ (ఆమె వయసు 103 ఏళ్లు) 24. ఇటీవల విస్ఫోటం చెందిన సినబంగ్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఇండోనేషియా 25. 1961లో ఆస్కార్ ఉత్తమ నటుడి అవార్డు పొందిన మాక్సిమిలియన్ షెల్ ఇటీవల మరణించారు. ఆయన ఏ దేశస్థుడు? ఆస్ట్రియా 26. 2014 ఫిబ్రవరిలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ ‘యూఎన్-ఇండో పిన్’ పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేసింది? శాసన మండలి చైర్మన్ ఎ. చక్రపాణి 27. 2014 ఫిబ్రవరిలో అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలిచారు? ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి పి.వి.సింధు 28. {పస్తుత రంజీ ట్రోఫీ చాంపియన్ కర్ణాటక కెప్టెన్ ఎవరు? వినయ్ కుమార్ 29. 2013-14 సంవత్సరానికి డీఆర్డీవో - రీసెర్చ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) డెరైక్టర్ జి. సతీష్‌రెడ్డికి లభించిన అవార్డు? హోమీ జె. బాబా స్మారక అవార్డు 30. {పపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఫిబ్రవరి 4 31. ఫిబ్రవరి 4, 2014 నాటికి పదేళ్లు పూర్తి చేసుకున్న ఫేస్‌బుక్‌ను ఏర్పాటు చేసిన వ్యక్తి? అమెరికాకు చెందిన మార్క జుకర్బర్గ 32. 2014 ఫిబ్రవరిలో కెనడాలోని విన్నీపెగ్లో డబ్ల్యూఎస్‌ఏ ప్రపంచ టూర్ వింటర్ క్లబ్ ఓపెన్ స్క్వాష్ టోర్నీలో టైటిల్ సాధించిన భారత క్రీడాకారిణి? జోష్న చిన్నప్ప 33. 2014 ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించిన జర్మనీ అధ్యక్షుడు? జొయాచిమ్ గ్వాక్ 34. రాష్ట్రంలో న్యూక్లియర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న కొవ్వాడ ఏ జిల్లాలో ఉంది? శ్రీకాకుళం 35. భారతరత్న అవార్డును అందుకున్న ముగ్గురు శాస్త్రవేత్తలు? సి.వి.రామన్, అబ్దుల్ కలామ్, సీఎన్ఆర్. రావు 36. బిల్‌గేట్స్ స్థానంలో మైక్రోసాఫ్ట్ కంపెనీకి చైర్మన్‌గా ఎంపికైంది? జాన్ థాంప్సన్ 37. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు ఉద్దేశించిన ఏడో వేతన సవరణ సంఘానికి చైర్మన్? సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్ 38. ‘వ్యాస్ సమ్మాన్’ పురస్కారాన్ని 1991లో ఏర్పాటు చేసింది? కె.కె. బిర్లా ఫౌండేషన్ 39. రాష్ట్రంలో భారీ ఓడరేవును ఏర్పాటు చేయనున్న దుగరాజపట్నం ఏ జిల్లాలో ఉంది? నెల్లూరు 40. 2014 ఫిబ్రవరిలో ఆటో ఎక్స్పోను ఎక్కడ నిర్వహించారు? గ్రేటర్ నోయిడా 41. 1917 నవంబరు 19న జన్మించిన భారతదేశ మాజీ ప్రధాన మంత్రి ఎవరు? ఇందిరాగాంధీ 42. యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు తొలి అధ్యక్షుడు? జార్జి వాషింగ్టన్ (1789-1797) 43. 1815లో వాటర్లూ యుద్ధంలో ఓడిపోయిన ప్రముఖుడు? నెపోలియన్ బొనాపార్టె(ఫ్రాన్స) 44. టెలిస్కోప్‌ను ఎవరు కనుగొన్నారు? గెలీలియో 45. ‘ఇండికా’ పుస్తకాన్ని రచించింది? మెగస్తనీస్ 46. జలియన్ వాలాబాగ్ ఊచకోతకు నిరసనగా నైట్‌హుడ్ అవార్డును తిరస్కరించినవారు? రవీంద్రనాథ్ ఠాగూర్ 47. ‘ఆముక్త మాల్యద’ ఎవరి రచన? శ్రీకృష్ణదేవరాయలు 48. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పార్టీ? పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ 49. మహాత్మాగాంధీకి రాజకీయ గురువు ఎవరు? గోపాల్ కృష్ణ గోఖలే 50. థామస్‌కప్ ఏ క్రీడకు సంబంధించింది? బ్యాడ్మింటన్ 51. 2013-14 ఆర్థిక సంవత్సరానికి ఎంత వృద్ధిరేటు ఉంటుందని కేంద్రీయ గణాంక కార్యాలయం (సీఎస్‌వో) అంచనా వేసింది? 4.9 శాతం 52. {పపంచంలో అత్యంత శక్తిమంతమైన 50 మంది మహిళా వ్యాపారవేత్తల జాబితాను ఫార్చ్యూన్ పత్రిక 2014 ఫిబ్రవరిలో విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మహిళ? జనరల్ మోటార్స సీఈవో మేరీ బర్రా 53. ఫార్చ్యూన్ పత్రిక రూపొందించిన ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో స్థానం లభించిన భారతీయులెవరు? పెప్సీకో సీఈవో ఇంద్రానూయి (మూడోస్థానం), ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందాకొచ్చర్ (18వ స్థానం) 54. సెబీ చైర్మన్‌గా మరో రెండేళ్లపాటు ఎవరు కొనసాగనున్నారు? యు.కె.సిన్హా 55. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తొలి మహిళా అదనపు డెరైక్టర్‌గా నియమితులైనవారు? అర్చనా రామసుందరం 56. 2014 ఫిబ్రవరిలో ఒకే టెస్ట్‌లో రెండు ఇన్నింగ్సల్లో ట్రిపుల్ సెంచరీ, సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్? శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర 57. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏవో) ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? కెనడాలోని మాంట్రియల్ 58. 2014 ఫిబ్రవరిలో కోఫి అన్నన్ భారతదేశంలో పర్యటించారు. ఆయన? ఐక్యరాజ్యసమితి ఏడో సెక్రటరీ జనరల్ (1997 - 2006) 59. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆస్ట్రియా రాజధాని వియన్నాలో 60. తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? ఎపికల్చర్ 61. దక్షిణ కొరియా కరెన్సీని ఏమంటారు? వొన్ 62. 1952 నుంచి 1956 వరకు లోక్‌సభ తొలి డిప్యూటీ స్పీకర్‌గా ఎవరు పనిచేశారు? మాడభూషి అనంతశయన అయ్యంగార్ 63. రీగా ఏ దేశానికి రాజధాని? లాత్వియా 64. ఏ దేశ పార్లమెంట్ దిగువ సభను సెజమ్ అని పిలుస్తారు? పోలెండ్ 65. ఎంపైర్ సిటీ, ద సిటీ ఆఫ్ స్కైస్క్రాపర్స అనేవి ఏ నగరానికి పేర్లు? న్యూయార్క 66. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తెలుగు వ్యక్తి? జస్టిస్ నూతలపాటి వెంకట రమణ 67. కన్హా జాతీయ పార్క ఏ రాష్ర్టంలో ఉంది? మధ్యప్రదేశ్ 68. 1986లో గుర్తించిన భారతదేశంలోని తొలి బయోస్ఫియర్ రిజర్వ? నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ. ఇది తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో నెలకొని ఉంది 69. 1994లో విశ్వ సుందరిగా ఎంపికైన తొలి భారతీయ మహిళ? సుస్మితా సేన్ 70. కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగింది? ఢిల్లీ (7 స్థానాలు) -
మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు!
పద్మశ్రీ అవార్డును దుర్వినియోగం చేశారని నమోదైన కేసులో సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. తన ప్రమేయం లేకుండానే దేనికైనారెఢీ చిత్రంలో నిర్మాత పద్మశ్రీని వాడుకున్నాడని మోహన్ బాబు ఇచ్చిన వివరణను కోర్టు తోసిపుచ్చింది. పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని హైకోర్టు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వదిలివేసింది. ఈ వ్యవహారాన్ని నాలుగు వారాల్లోగా రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లాలని కేంద్ర హోంశాఖను కోర్టు ఆదేశించింది. పద్మశ్రీ అవార్డును దుర్వినియోగ పరిచారంటూ మోహన్ బాబుపై బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించి హైకోర్టు తుది తీర్పును వెల్లడించింది.